31, మార్చి 2009, మంగళవారం

మైనారిటీ ఓటరే దేవుడు!

ఎన్నికల రుతువు ప్రవేశించడంతోనే, తనతో పాటు ఓటు బ్యాంకు రాజకీయాలను, కుల మత సమీకరణాలను వెంటబెట్టుకువస్తుంది. జమాఖర్చుల గురించి చర్చ పెడుతుంది. ఈ  లెక్కల సమీకరణాలను బట్టే రాజకీయ పార్టీలు గెలుపోటముల లెక్కలు  వేసుకుంటాయి. పొత్తులు పెట్టుకుంటాయి. కుల, మత వర్గాలను దువ్వుతుంటాయి. అభ్యర్థులను ఎంచుకొంటాయి. వూ్యహరచన చేసుకుంటాయి. అయితే ఇంతకు ముందు 14 సార్లు జరిగిన ఎన్నికలకూ ఈసారికీ చాలా తేడా  ఉంది. గతంలో కూడా ఎన్ని లెక్కలు వేసుకున్నా పైకి మాత్రం హుందాగా నైతిక విలువల గురించి మాట్లాడే వారు. ప్రచారంలో సెక్యులరిజాన్ని ప్రస్తుతించేవారు. ఈ ఎన్నికల్లో మాత్రం అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా కులాలు, మతాల వారిగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రధానంగా అందరి దృష్టీ మెజార్టీ ఓటు బ్యాంకును వదిలి పెట్టి మైనారిటీ ఓట్లపైనే పడింది. మైనార్టీ ఓటరు దేవుళ్ల అనుగ్రహం కోసం అన్ని పార్టీలూ వెంపరా్లడుతున్నాయి.
దేశంలోని మొత్తం ఓటర్లలో పదిహేను శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. మరో అయిదు శాతం క్రైస్తవ ఓట్లు ఉంటాయి. దళితులు, ఇతర వెనుకబడిన వరా్గల ఓట్లు దాదాపు ముపై ్ఫ శాతం ఉన్నాయి. అన్ని పార్టీలూ, అధినాయకులూ సామూహికంగా  ఏ వర్గం నుంచి ఓట్లు పడతాయో అంచనా వేసుకుని ఆ వర్గ నాయకులతో మంతనాలు జరుపుతుంటారు. తాయిలాలు ప్రకటిస్తారు. ఈ విషయంలో  ఏ ఒక్క రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. కాంగ్రెస్‌, బిజెపి, లెఫ్‌‌ట, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా  మైనారిటీ అనుకూల వైఖరితోనే ప్రచారం చేసే పరిస్థితి. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీ పార్టీ కార్యవర్గ సమావేశాల్లో  బిజెపి పట్ల ముస్లింలు అనుకూలంగానే ఉన్నారన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామంటూనే ముస్లింల సహకారంతోనే అది పూర్తవుతుందని ఢంకా బజాయించారు. మందిర నిర్మాణం ముస్లింలతో  సామరస్య పూర్వక వాతావరణంలోనే జరుగుతుందని పదే పదే చెప్పటమూ మైనారిటీలను దువ్వటంలో భాగమే.. గత ఎన్నికల సందర్భంలో రథయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వచ్చినప్పుడు ఆయన ముస్లిం మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై మంచి చెడులు విచారించారు... ఇప్పుడు ప్రతి బిజెపి నేతా అదే పోకడలు పోతున్నారు.  జాతీయ స్థాయిలో సీనియర్‌ ముస్లిం నేతలు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, నజ్మా హెఫ్తుల్లా  వంటి నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం వూ్యహాత్మకం.  బిజెపి మైనారిటీ అనుకూల విధానంపై విశ్వహిందూ పరిషత్‌  వంటి అనుబంధ  హిందూ సంస్థలు సైతం అడ్డు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. బిజెపి అధికారంలోకి రావాలంటే రాజకీయాల్లో ఎత్తుగడలు తప్పవు మరి.
ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా ఏం తక్కువ తినలేదు. టిక్కెట్ల పంపిణీలో మైనార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే వ్యవహరించింది. జార్ఖండ్‌లో శిబుసొరేన్‌ను సమర్థించడం వెనుక అక్కడి గిరిజన ఓట్లు దక్కించుకోవడానికి ప్రయత్నించింది. ఉత్తరప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రంలో తాను గతంలో పోగొట్టుకున్న దళిత, ముస్లిం ఓట్లను తిరిగి దక్కించుకోవడానికి బిఎస్‌పి, ఎస్‌పితో పొత్తులకు ప్రయత్నించింది. అయితే తన ఓట్లు ఎక్కడ చేజారిపోతుందోనన్న భయం మాయావతిని కాంగ్రెస్‌కు దూరం చేసింది. సమాజ్‌వాది పార్టీ అందినట్లే అంది జారి పోయింది. ముందునుంచి వెనుక బడిన వరా్గల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ పక్షాన ఎలాగూ ఉంది. ప్రాంతీయ పార్టీల మూలంగా తన గుప్పిటినుంచి చేజారిపోయిన ఓట్లను తిరిగి దక్కించుకోవడం ప్రస్తుతం ఆ పార్టీ ముందున్న లక్ష్యం. 
రాష్ట్రాల్లో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయి. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే క్రైస్తవ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేసింది. కెఎ పాల్‌ వంటి మత ప్రవక్తలు రాజకీయాల్లోకి రావటం విపక్ష కూటమిని కొంత సంతృప్తి పరుస్తోంది. తమతో జత కట్టకపోయినా కాంగ్రెస్‌ ఓట్లు చీలవచ్చన్నది మహాకూటమి అభిప్రాయం.  అటు ముఖ్యమంత్రి వైఎస్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్తూనే ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత ఎన్నికల్లో తాము వాగ్దానం చేసినట్లుగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని వైఎస్‌, డిఎస్‌ భాష్యం చెప్తున్నారు... అక్కడే వారికి ఓ చిన్న క్లాజ్‌ దొరికింది... అదీ న్యాయస్థానం నిర్ణయం... పార్లమెంటులో రాజ్యాంగ సవరణ.. అవి రెండూ జరగవు.. వీళు్ల అమలు చేయరు.. వాగ్దానానికి మాత్రం కట్టుబడే ఉంటారు.. ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకుంటూ ఉంటారు. 
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సలైట్‌ భార్యకు గతంలో చంద్రబాబు టిక్కెట్‌ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో పార్టీలు పంచి పెట్టిన టిక్కెట్లన్నీ కుల సమీకరణాల ప్రాతిపదికపైనే .. ఎప్పుడైతే చిరంజీవి సామాజిక న్యాయం నినాదాన్ని రాజకీయ రంగంపైకి తీసుకువచ్చారో.. అప్పటి నుంచి అన్ని పార్టీలు కూడా ఆ నినాదాన్ని భుజాన మోయక తప్పటం లేదు. మునుపెన్నడూ లేని విధంగా అన్ని పార్టీలూ తాము కేటాయించిన టిక్కెట్లలో ఏ కులానికి ఎన్నెన్ని ఇచ్చామో విడమర్చి లెక్కలతో సహా చెప్పాల్సిన రాజకీయ అవసరం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. కేరళలో కమూ్యనిస్టు పార్టీలు పంచిచ్చిన సీట్లన్నీ కులాల ప్రాతిపదికనేనని స్పష్టం. గుజరాత్‌లో బిజెపి కాంగ్రెస్‌లు సాధు సంతులపై దృష్టి పెట్టాయి. రాజస్థాన్‌లో ప్రధానమైన జాట్ల ఓట్లను దృష్టిలో ఉంచుకునే రెండు పార్టీలూ టిక్కెట్లు పంచిపెట్టాయి. బిజెపి ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ ధర్మేంద్రనే రంగంలోకి దింపింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన ఓట్లు  చేజారిపోకుండా ఉండేందుకు అజిత్‌ జోగి వంటి వారి అవసరం కాంగ్రెస్‌కు ఎంతో ఉంది.  బీహార్‌లో దళితుల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు రాంవిలాస్‌ పాశా్వన్‌తో జతకట్టి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. మాయావతి, ములాయంసింగ్‌, లాలూ, సొరేన్‌ వంటి నాయకులు,  గోండ్వానా పీపుల్‌‌స పార్టీ వంటివవన్నీ  మైనార్టీల ఓట్లపైనే ఆధారపడి మనుగడ సాగించడం వాస్తవం. అందుకే చిన్నవైనా వీటి ప్రాపకం కోసం జాతీయ పార్టీలు తాపత్రయపడటం. దేశంలో మెజార్టీ ఓటర్ల గురించి ఎవరూ బాధపడటం లేదు. ఆ ఓట్లు ఎలాగూ పార్టీల వారిగా నిర్ణయమై ఉంటాయి కాబట్టి వాటి గురించి చింతించనవసరం లేదన్నది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా తమకు పడితే చాలు.. ఖచ్చితంగా అధికార పీఠం దక్కినట్లేనన్నది రాజకీయ పక్షాల అంచనా. ఇందువల్లే పార్టీల నోటి వెంట సెక్యులరిజం నినాదాలు. మైనార్టీలకు తాయిలాలు. బుజ్జగింపులు.. వగైరాలన్నీ.. మైనార్టీలు ఎప్పటికీ మైనార్టీలుగా ఉంటేనే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి, ఓట్లు చీల్చడానికి, మార్చడానికి అవకాశం. వెరసి అన్ని పార్టీలకూ ప్రస్తుతం మైనారిటీ ఓటరే దేవుడు. మరి ఆ దేవుడు కరుణిస్తాడంటారా?

రాముడు మళ్లీ రథమెక్కాడు


అయోధ్య రాముడు తన గుడి కోసం మరోసారి రథం ఎక్కాడు.. 1998 ఎన్నికల తరువాత  ఢిల్లీ  అశోక రోడ్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో  భద్రంగా అటకెక్కిన  మూడు సిద్ధాంతాలను అంతే భద్రంగా బిజెపి నేతలు అటక మీది నుంచి కిందకు దింపారు.. చక్కగా బూజు దులిపి మళ్లీ ఓటర్ల దగ్గరకు మోసుకొస్తున్నారు.. పాపం గూడు కోసం గుడి కోసం రాముడు కమలనాథులను మళ్లీ నమ్మక తప్పడం లేదు. ఈసారైనా రాముడికి గుడి దక్కుతుందా? మళ్లీ అటకెక్కుతాడా?
దేశ రాజకీయాల్లో బిజెపి ఓ విభిన్న పార్టీ.. తమది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకుంటారు. సిద్ధాంతం ఏమిటో ఎవరికీ అర్థం కాదు.. వ్యక్తి పూజ లేని పార్టీ అని చెప్తారు.. ఒకే ఒక్కడుగా అద్వానీ కనిపిస్తారు.... తాము  సెక్యులరిస్టులమంటారు.. ప్రత్యర్థులు కమూ్యనలిస్టులంటారు.. ఏ మూడు డిమాండ్లను నెత్తికెత్తుకొని 1998లో అధికార పీఠానికి చేరువయ్యారో.. అధికారం వాసన చూడగానే మూలాలను అటకెక్కించారు.. అయోధ్యలో  రామమందిర నిర్మాణం, 370 అధికరణం రద్దు , ఉమ్మడి పౌరస్మృతి.. మూడూ బిజెపి ప్రధాన డిమాండ్లు.. 1996నాటికే బిజెపి అధికారంలోకి వచ్చినా కొద్ది రోజులకే ఆ ప్రభుత్వం పతనం కావటంతో  సానుభూతి  కమలనాథులకు మరో అవకాశాన్ని కల్పించింది.  ఆ అవకాశం ఆరేళ్ల పాటు వారిని అధికారంలో ఉంచింది. ఈ ఆరేళు్ల కూడా అధికారాన్ని కాపాడుకోవటం పైనే తప్ప తన ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశలో చిన్న ప్రయత్నమైనా చేయలేదు. అదేమని అడిగినప్పుడల్లా, సంకీర్ణ ధర్మం అంటూ వచ్చారు. సొంతంగా మెజారిటీ వస్తే తప్ప మేం ఏమీ చేయలేమన్నారు... ఇప్పుడు మళ్లీ రామనామం జపిస్తున్నారు. అయోధ్యలో గుడి కట్టి తీరుతామంటున్నారు. ఇక్కడే చిన్న మెలిక కూడా పెడుతున్నారు. అదేమంటే హిందూముస్లింలు అందరినీ ఒప్పించి వారందరి  ఏకాభిప్రాయంతోనే  భవ్యమందిరాన్ని నిర్మిస్తామంటున్నారు......సెక్యులరిస్టులమని చెప్పుకోవటానికి బిజెపి ఈ రకమైన పాట్లు పడుతుండవచ్చు కానీ,  రాముడు మాత్రం ఎంత నవ్వులపాలవుతున్నాడో కదా!
ఈ దేశంలో ఏకాభిప్రాయ సాధన అంటే ఏమిటో ఎవరికైనా తెలియందేముంది? మహిళా రిజర్వేషన్ల బిల్లు కానీ, తెలంగాణ ఏర్పాటు కానీ ఏకాభిప్రాయం పేరుతో ఏమయ్యాయో తెలియంది కాదు.. ఇప్పుడు రాముడి గుడికీ ఏకాభిప్రాయమనే ట్యాగ్‌లైన్‌ తగిలించారు... ఇక గుడి సంగతి ఏమవుతుందో వేరే చెప్పాలా? 
2004లో అధికారం కోల్పోయాక పార్టీని తిరిగి బలోపేతం చేయటంలో  బిజెపి కేంద్ర నాయకత్వం ఘోరంగా విఫలమైంది. పార్టీ నాయకుల మధ్య కుము్మలాటలు, అంతర్గత సమస్యలు పార్టీని కుంగదీశాయి. ప్రమోద్‌మహాజన్‌, సాహిబ్‌సింగ్‌ వర్మ లాంటి కీలక నేతలు ఆకస్మికంగా మరణిస్తే, ఉమాభారతి, మదన్‌లాల్‌ ఖురానా వంటి వారు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. అద్వానీ పోకడలతో అటు సంఘ్‌ పరివారమూ బిజెపితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అటు యుపిఎ సర్కారు పనితీరును విమర్శించి ప్రజల్లోకి చొచ్చుకుపోవటంలోనూ పెద్దగా సక్సెస్‌ అయింది లేదు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి పెద్ద రాషా్టల్రు మూడే బిజెపి చేతుల్లో ఉన్నాయి. మిగతా ఎక్కడా పార్టీ బలం అంతంత మాత్రమే. బిజెపితో చెలిమికి సుముఖత చూపుతున్న ప్రాంతీయ పార్టీలు కూడా తక్కువ కావటం మరో సమస్య. ఈ నేపథ్యంలో ఎన్‌డిఏ ఎంతవరకు సఖ్యంగా ఉంటుందన్నది అనుమానమే. ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్న అద్వానీకి ఉన్న సమస్యలకు తోడు పార్టీలోని అగ్రనాయకుల మధ్య విభేదాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. దీనికి తోడు వరుణ్‌గాంధీ ఎపిసోడ్‌ పులిమీద పుట్రలా మారింది. 
అణు ఒప్పందం విషయంలో, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారని, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని యుపిఎ సర్కారును విమర్శిస్తూ అద్వానీ దూసుకుపోతున్నారు కానీ, పార్టీ కేడర్‌ను ప్రేరేపించి, ఉత్సాహపరచాల్సిన రెండో శ్రేణి నాయకత్వాన్ని ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్నది పచ్చి నిజం. జిన్నాను సెక్యులర్‌ అని పరివారానికి దూరమైన అద్వానీ, ఇప్పుడు ఎన్నికల్లో సహకరించమని ఏ విధంగానూ అడిగే పరిస్థితిలో లేరు.  విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ కూడా మునుపటి ఉత్సాహాన్ని ప్రదర్శించటం లేదు.  దేశం ఇన్ని రకాలుగా మారినా, ముతకగా మారిన పాత పాటను పాడితే ఎవరికి వినసొంపుగా ఉంటుంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారంలో విరివిగా వాడుకుంటున్నా, నెహ్రూగాంధీ కుటుంబంపై విమర్శలు, సోనియా విదేశీయత వంటి అంశాలు ఇప్పుడు కూడా ఎన్నికల అంశాలుగా చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? తాను గిరిగీసుకున్న గీత నుంచి బిజెపి థింక్‌ట్యాంక్‌ ఇంకా బయటకు రావటం లేదు. అన్ని హద్దుల్ని చెరిపేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోతే, కమలనాథుల అస్తిత్వం ప్రమాదంలో పడే పరిస్థితి పొంచి ఉంది.

30, మార్చి 2009, సోమవారం

హామీల వాన

కాంగ్రెస్‌ హామీల వాన
1. పాత పథకాల కొనసాగింపు                              2. రూ. 2 కిలో బియ్యం కోటా పెంపు
3. కులవృత్తులకు పావలా వడ్డీ                            4. సేద్యానికి 9 గంటల ఉచిత విద్యుత్తు
5. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య                    6. హాస్టళ్లకు రెసిడెన్షియల్‌ హోదా
7, ఎస్‌సి, ఎస్‌టి, బిసి స్కూళ్లకు నవోదయ స్థాయి   8. ప్రతి ఇంటికీ విద్యుత్తు కనెక్షన్‌
9. ప్రతి ఇంటికీ టాయిలెట్‌                                   10. పాత పథకాల కొనసాగింపు
11. సంచార పశువైద్య శాలలు                            12. 80 లక్షల ఇళ్ల నిర్మాణం
13. డ్వాక్రా మహిళలకు రుణాల పెంపు                14. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య  

టిడిపి వాగ్దానాల వెల్లువ
1 పేదవారికి కలర్‌ టెలివిజన్‌                              2. నిరుద్యోగులకు 1200 భృతి
3. నగదు బదిలీ పథకం                                    4. నాణ్యమైన విద్యుత్తు
5. చేనేతకు చేయూ6. నాణ్యమైన వైద్యం
7. సెజ్‌ భూములను రైతులకు తిరిగి అప్పగింత 8. కోస్టల్‌ కారిడార్‌ రద్దు
9. డ్వాక్రా మహిళలకు అండ                          10. రైతులకు ఉచిత విద్యుత్తు

పిఆర్‌పి హామీల మూటలు
1. వందకే వంటసరుకులు                            2. వందకే వంటగ్యాస్‌
3. బాలికలకు పిజి వరకు ఉచిత విద్య            4. చేతివృత్తులకు ఉచిత విద్యుత్తు
5. గ్రామాల్లో విద్యుత్తు రాయితీ                     6. ఉచిత విద్యుత్తు కొససాగింపు
7. ఇళ్ల నిర్మాణానికి లక్ష సాయం                  8. పేదలకు సాగుభూమి
9. ప్రజారైతు బంధు బీమా                           10. చేతివృత్తులకు పెద్ద పీట 

కెసిఆర్‌ తమాషా

అజ్ఞాతం ప్రదేశాలు.. అర్ధరాత్రి చర్చలు.. ఫోన్‌ల ద్వారానో.. మరో పరోక్ష పద్ధతిలో  మీడియాకు జాబితాల విడుదల... ఇదేదో నిషిద్ధ మావోయిస్టు పార్టీనో.. మరో టెరర్రిస్టు బృందమో చేస్తున్న పని అనుకుంటే పొరపాటే... 119 నియోజక వర్గాల్లో దాదాపు 30 శాతం ఓట్ల బలం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి  అధినేత కె. చంద్రశేఖర్‌ రావు తీరు ఇది. ఆయన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవరికీ తెలియదు.. అడపాదడపా చంద్రబాబు ఇంటికి మాత్రం వెళ్లి వస్తుంటారు.. అదీ మీడియా కంటపడకుండా... కార్యకర్తల కంటికి కనపడకుండా... వెరసి ఆయన కప్పుకున్న ముసుగు ప్రత్యేక తెలంగాణా.. ఆయన నైజం.. చిక్కడు.. దొరకడు
కెసిఆర్‌ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఎవరికీ అంతుపట్టని విషయం. ఆయన వెంట థింక్‌ ట్యాంక్‌గా పేరు తెచ్చుకున్న వారికి సైతం ఆయనేమిటన్నది అర్థం కాదు.. పేరుకే వారు థింక్‌ ట్యాంక్‌.. చేసేదంతా ఆయనే.. రబ్బర్‌ స్టాంపులు వీరు.. పార్టీ స్థాపించిన నాడు ఆయన ఎంత నిజాయితీగా కనిపించినా.. మొదట్నుంచీ ఒంటెత్తు పోకడలే... ఎన్నికలొస్తే చాలు.. పార్టీలో, కేడర్‌లో ఆయన సృష్టించే అయోమయం అంతా ఇంతా కాదు.. మహాకూటమితో సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమైనప్పటి నుంచి మీడియాకే కాదు... పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తకూ అందుబాటులోకి లేరు... ఎందుకింత భయం... ఎవరికి భయపడి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు... ఒక విచిత్రమైన సంకట స్థితిలోకి పార్టీలోని ప్రతి ఒక్కరినీ నెట్టేశారు..అందుకే ఆందోళనలు.. నిరసనలు.. ఆవేదనలు..
పోనీ ఆయన వూ్యహాత్మకంగా వ్యవహరించారనీ, దాని వల్ల పార్టీకి కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ రాజకీయంకా లాభం కలిగిందా అంటే అదీ లేదు... ఆయన చేస్తున్న తమాషా వల్ల టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ పలుచబడింది. 2004 ఎన్నికల దగ్గర నుంచి  ఆయన వ్యవహారశైలి ఇదే విధంగా ఉంది. అన్నీ తానే.. అన్నట్లుగా కెసిఆర్‌ వ్యవహరిస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఆయనకు వచ్చిన సీట్లు 45మాత్రమే. కానీ సంకీర్ణ ధర్మాన్ని  కాలదన్ని 54 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఆరోజు ఇదేమని ఆయన్ను కాంగ్రెస్‌ వారు అడిగే దము్మ చేయలేదు.. పోనీ అదనంగా, అనధికారికంగా పోటీ చేసిన సీట్లలో టిఆర్‌ఎస్‌ ఒక్కదాంట్లోనైనా గెలిచారా అంటే అదీ లేదు.. పొత్తు వల్ల సంక్రమించిన సీట్లలో  సైతం సగం కంటే ఎక్కువ సీట్లు గెలవలేకపోయారు.. గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలలో కూడా పది మంది తిరుగుబాటు చేశారు. అయిదుగురు ఎంపీల్లో నరేంద్రను అవినీతిపరుడన్న ముద్ర వేసి వెళ్లగొట్టారు. తిరగబడ్డ ఎమ్మెల్యేలలందరిపైనా ద్రోహులన్న ముద్ర వేసిన కెసిఆర్‌... కనీసం వారిపైన పోటీ చేసేందుకు ఆ స్థానాలను సైతం ఇప్పుడు తెచ్చుకోలేకపోయారు. ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వంలోని తెలంగాణా మంత్రులందరిపైనా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసి సీట్లు తెచ్చుకున్న కెసిఆర్‌ ఈసారి బాబుపై ఆమాత్రం ఒత్తిడి చేయలేకపోయారు. కనీసం తాను  ప్రకటించిన జాబితాపైనా కట్టుబడి ఉండలేకపోయారు...అడ్డగోలుగా టిక్కెట్లు ఇస్తున్నారంటే.. దానికి ఆయన ఇచ్చే జవాబూ విచిత్రంగానే ఉంటుంది...
టిఆర్‌ఎస్‌ ప్రతి వేదికపైనా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ధూంధాంనూ దూరం చేసుకున్నారు. అర్థం లేని లెక్కలు.. ఉపయోగపడని సమీకరణాలు.. పకడ్బందీ వూ్యహం లేని ప్రణాళికలు.. కూటనీతితో రాజనీతిని ఎంతోకాలం సక్సెస్‌గా నడిపించలేరని కెసిఆర్‌ విషయంలో మరోసారి రుజువైంది. టిఆర్‌ఎస్‌లో జరుగుతున్నదేమిటో ఆ పార్టీ ఆఫీస్‌ బేరర్లకు కూడా తెలియదు.. కెసిఆర్‌ కుటుంబ సభ్యులకు తప్ప... ఆ కుటుంబ సభ్యులు ముచ్చటగా ముగ్గురే... వారు కెసిఆర్‌.. ఆయన తనయుడు రామారావు... ఆయన మేనల్లుడు హరీష్‌రావు...
దటీజ్‌ టిఆర్‌ఎస్‌ తమాషా.....సారీ.. కెసిఆర్‌ తమాషా