24, అక్టోబర్ 2011, సోమవారం

ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి

  
రాజ్యం వీరభోజ్యం అన్నాడు భీష్మపితామహుడు మహాభారతంలో ధర్మరాజుకు రాజధర్మాన్ని బోధిస్తూ... ఎప్పుడో అయిదున్నర వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 3102లో చెప్పిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా మారాయి. అవును ఇప్పుడు వీరులు గెలుస్తున్నారు.. భీరువులు బీరాలు పలికి.. పలికి ఒక్కొక్కరే జారుకుంటున్నారు. గోగ్రహణం సమయంలో కౌరవ సైన్యాన్ని చూస్తేనే వణికిపోయిన ఉత్తర కుమారుడు అప్పటిదాకా కౌరవ నాయకులను చీల్చి చెండాడేస్తానంటూ కత్తిని ఆడవాళ్ల ముందు తిప్పేసి రణరంగానికి వచ్చేసరికి ఒక్కక్షణంలో పారిపోయాడు.. అలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నాయకత్వం నీడలో బతుకుతున్న ప్రజలకు ఎలాంటి డిమాండ్లు చేసే అర్హత లేదు.. వాళ్లు ఇలా బతుకులు తెల్లవార్చుకోవలసిందే.. ఎందుకంటే విరాటనగరం కీచకుడి కాలం నుంచీ నరకం అనుభవించింది..విలవిల్లాడింది.. అతను చెప్పింది వేదం.. చేసింది శాసనం.. చివరి రోజుల్లో అతను చేసిన అరాచకాలకు అంతే లేదు.. కౌరవ రాజు అండతో అతను మరింత రెచ్చిపోయాడు.. కానీ, ఉక్కుమనిషి భీమసేనుడి పుణ్యమా అని కీచకుడి దురాగతాలు అంతమయ్యాయి. ఆ తరువాత కౌరవ సైన్యం ఆధిపత్యాన్ని అంతం చేస్తానంటూ ఉత్తరకుమారుడు తెగ మాటలు మాట్లాడాడు.. కానీ, అసలు సమయానికి వచ్చేసరికి తుస్సుమన్నాడు.. అప్పుడు అర్జునుడు అతనికి అండగా నిలవటం వల్ల కౌరవులు తోకలు కత్తిరించుకుని వెనక్కి వెళ్లిపోయారు..
ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి.. వాళ్ల కష్టాలు కడతేర్చేందుకు.. కౌరవసైన్యాన్ని తునుమాడేందుకు సవ్యసాచి కావాలి.. ఇప్పుడు తెలంగాణా ఒక అనాధ.. ప్రజలకు అండగా నిలిచి వాళ్లకోసం ఏదైనా చేయగల నాథుడు లేక దిక్కులేని ఓ విరాటనగరం.. ఇక్కడ ఒకరు కాదు.. వందల మంది ఉత్తరకుమారులున్నారు.. వేల మంది ఖడ్గతిక్కనలు ఉన్నారు. నాడు ఖడ్గతిక్కన పసుపు రాసుకుని గాజులు తొడుక్కొమ్మంటే పౌరుషం వచ్చి యుద్ధరంగానికి తిరిగి వెళ్లిపోయాడు.. ఇప్పుడిక్కడ ఖడ్గతిక్కనలు గాజులు తొడుక్కోవటానికి ఎలాంటి సందేహపడరు.. పసుపు రాసుకోవటానికైనా, చీరలు కట్టుకోవటానికైనా వెనుకాడరు. నిజంగా ఈ ప్రజలు ఇవాళ అనాధలు.. అన్నదమ్ములమని చెప్పుతూనే.. అడ్డగోలుగా తమపైనా తమ సమస్యలపైనా, తమ వ్యక్తిత్వంపైనా, తమ జనజీవన విధానంపైనా ఫ్యాషనబుల్‌గా ఖండనమండనలు చేస్తుంటే, కళ్లు మిటకరిస్తుంటే.. మీరేం చేసినా అనుకున్నది సాధించలేరంటూ బల్లగుద్ది చెప్తుంటే... నాయకులు అని చెప్పుకునేవాళ్లు కొల్లలుగా బీరాలు పలుకుతుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణా నిస్సహాయంగా చేతులు చాచి తమకు చేయినందించి ముందుకు నడిపించే సవ్యసాచి కోసం నిద్రాహారాలు మాని వెతుకుతున్నది. తాము చేస్తున్న ఉద్యమాన్ని సమర్థంగా ఏకగళంతో నడిపించే విజయుడి కోసం ఆరాటపడుతున్నది..
రెండు సంవత్సరాలుగా తెలంగాణాలోని నాలుగు కోట్ల ప్రజలు వీధుల్లో నిలుచుని ఉన్నారు.. ఏదో జరుగుతుందని.. తమ పిల్లల నోటికాడి ముద్దను తన్నుకుని పోయిన గద్దల్ని తరిమికొట్టి మళ్లీ తమ కడుపు నింపుతారని భావించిన ప్రజానీకం- రాజకీయ నాయకత్వం తమ వాళ్లతోనే తమాషా చేయటాన్ని సహించలేకపోతున్నది.. ఉద్యమాన్ని ఎప్పుడు ఎగిసేలా చేస్తారో.. ఎప్పుడు సడలిస్తారో తెలియని అయోమయం.. ఎందుకు తీవ్రతరం అవుతుందో.. ఎందుకు చల్లబడుతుందో అర్థం కాని ఆందోళన.. ఎప్పుడు నిర్ణయం వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియని భయం.. ఆశలన్నీ నిరాశగా నీరుగారుతున్న సందర్భం.. ఏడువందల మంది అమాయకుల ప్రాణ త్యాగాలు వృథా పోతున్న ఆవేదన..
అసలు తెలంగాణాలో ఏం జరుగుతోంది.. సమ్మెనా.. ఉద్యమమా? ఆందోళనా? రాజకీయమా? ఎవరికీ ఏమీ తెలియదు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అనే వాళ్లు అంతలోనే చల్లబడుతారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు.. దుమ్మెత్తి పోసుకుంటారు.. ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారు.. ఒకరి మాట మరొకరు వినరు.. ఎవరికైనా కావలసింది ఆధిపత్యం.. ఎవరికైనా కావలసింది క్రెడిట్..
తెలంగాణకు ఒక దౌర్భాగ్యమైన దుస్థితి దాపురించింది. మొదటి నుంచీ దీనికి నాయకత్వం లేదు.. సమర్థుడని చెప్పుకోవటానికి ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణకు లభించకపోవటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఒకరిద్దరు ఉన్నారని అనుకున్నా.. వాళ్లు జాతీయ స్థాయికి వెళ్లి అక్కడే సెటిలై తెలంగాణకు తిలోదకాలిచ్చినవాళ్లే.. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చారని.. తమకు అన్ని విధాలా అండగా నిలబడతారని ఆశించినంతలోనే నిట్టనిలువునా ద్రోహం చేసి.. శత్రువుతో చేతులు కలిపి వెళ్లిన వారే.. దీనికి ఆదిపురుషుడు మర్రి చెన్నారెడ్డి అయితే.. ఆయనకు అంతేవాసులు ఇప్పటి నాయక గణం. ఎంతమంది నాయకులు.. ఓ కెసిఆర్.. ఓ జానా.. ఓ ఎర్రబెల్లి.. ఓ పొన్నం.. ఓ గద్దర్.. విమల.. సంధ్య.. సబిత, సునిత, గీత, కెకె.. కోమటిరెడ్డి.. లెక్కించుకుంటూ పోతే.. ఎన్ని వేళ్లున్నా సరిపోవు.. అన్నింటినీ మించి కోదండరామ్.. అందరికీ తెలంగాణ కావాలి.. ఎవరి ప్రయోజనాలూ కోల్పోవద్దు.. ఎవరి వ్యాపారాలు నష్టపోవద్దు.. ఎవరి రాజకీయ భవిష్యత్తు నష్టపోవద్దు.. తెలంగాణ రావాలి.. వద్దు.. ఎవరి అజెండా వారిది. ఎవరి జెండా వారిది.. ఒకరికొకరు.. ఒకరిపై ఒకరు కుట్రలు.. కుతంత్రాలు.. అడపా దడపా రోకోలు.. ధర్నాలు.. బంద్‌లు.. జైతెలంగాణ నినాదాలు..
దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు.. ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతకంటే తెలియదు.. ఎలా ముగింపునిస్తారో అర్థం కాదు.. తెలియని అయోమయం తెలంగాణాలోని ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అర్థం లేని ఆందోళన వేటాడుతోంది.. ఎంతో స్థిరచిత్తంతో ఉన్న సామాన్య తెలంగాణా పౌరులు సైతం ఒక దశలో తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితులు.. సందర్భాలు కొల్లలు.
తెలంగాణా జెండాను.. అజెండాను భుజానికి ఎత్తుకుని పదకొండేళ్ల నుంచి మోస్తున్న వీరుడి స్థిరచిత్తం ఏమిటో తెలంగాణా ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం.. 2001లో ఉద్యమ పార్టీగా మొదలైన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఏ దిశగా ఉద్యమాన్ని తీసుకుపోతోంది.. కెసిఆర్‌కు మినహా ఎవ్వరికీ తెలియదు.. తారకరాముడికీ, కవితమ్మకూ, మేనల్లుడికీ కూడా అంతుపట్టని ధృతరాష్ట్ర వ్యూహం కెసిఆర్‌ది. సడన్‌గా తెరపైకి వస్తారు.. డెడ్‌లైన్‌లు.. డెత్‌వారంట్లూ జారీ చేసేస్తారు.. ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేస్తారు.. ఏదో జరిగిపోతుందన్న భ్రమలు కలిపిస్తారు.. ఆర్‌యాపార్ అనేస్తారు.. ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఆమరణ దీక్షతో మొదలైంది.. రాజీనామాల పర్వంతో ఊపందుకుంది.. వచ్చింది వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోవటంతో తీవ్రమైన నిరసనగా పెల్లుబికింది.. రెండేళ్లు గడిచిపోయాయి.. ఏం సాధించామో తెలియదు..? ఎలా సాధిస్తామన్నది ఎంతకీ అంతుపట్టదు.. ఇంతకీ సాధించేది ఏమిటో అర్థం కాదు.. అసలు ఏదైనా సాధిస్తామా లేదా అన్నదీ జవాబులేని ప్రశ్నే..
ఇప్పుడు అన్నీ ప్రశ్నలే.. అన్నీ సందేహాలే..
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు..?
ఉస్మానియాలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమాన్ని హైజాక్ చేసింది ఎవరు? దాన్ని నామమాత్రంగా మార్చటానికి కారకులెవరు?
అర్థం లేని భ్రమలు కల్పించి.. దాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ఒక్కుదుటున చల్లార్చటానికి కారణం ఏమిటి?
మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చి ప్రజలందరూ సమాయత్తం అయిన తరువాత ఢిల్లీకి వెళ్లి మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రయత్నించింది ఎందుకోసం?
తప్పనిసరిగా నిర్వహించుకున్న మిలియన్ మార్చ్‌లో చివరినిమిషంలో పాల్గొని నామమాత్రంగా ముగింపుపలకటానికి కారణం ఏమిటి?
సహాయ నిరాకరణ ఎందుకోసం జరిగింది? ఏం సాధించారని ముగిసింది? దీని వల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు? ఎవరిని సంఘటితం చేయగలిగారు? లక్ష్యసాధన దిశలో సాధించిన ఫలితం ఏమిటి?
కేసుల ఎత్తివేతకోసం దీక్షల డ్రామా ఎవరిని మెప్పించేందుకు జరిగింది? ఆ తరువాతైనా ఎత్తివేయటం సాధ్యమైందా?
అంతిమ ఘట్టంలో చేపట్టాల్సిన అస్త్రాన్ని ముందే ప్రయోగించి విఫలం చేసేందుకు కారకులు ఎవరు?
లక్ష్యం సాధించేంత వరకు పట్టు వీడేది లేదంటూ ప్రతి వేదికపైనా పిడికిలి బిగించిన మహానేత ఆ పిడికిలిలోని ఒక్కో వేలిని ఎందుకు సడలించుకుంటూ వెళ్లిపోయాడు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమాధానం.. సకలజనుల సమ్మెను ప్రారంభించేనాడు ఈ బుద్ధేమైంది.. దీని వల్ల ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచన ఆనాడేమైంది?
నలభైరోజుల సకలజనుల సమ్మెతో సాధించింది ఏమిటి? దీనివల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు..నిన్ను నువ్వు హింసించుకోవటం వల్ల ఎవరికి నష్టం.. ఏడువందల మంది ఆత్మహత్య చేసుకుంటే జరిగిన నష్టం వాళ్ల కుటుంబాలకే తప్ప మిగతా రాష్ట్రానికి కాదు.. సకల జనుల సమ్మె వల్ల జరిగిందీ అదే.. మీరు వ్యక్తం చేస్తున్న నిరసన ఎవరిపైన? మీరు చేస్తున్న సమ్మె ఎవరిపైన? దాని వల్ల ఎవరిపై ఒత్తిడి పడింది? ప్రత్యర్థికి కష్టం కలిగినప్పుడు అతను ఒత్తిడిని ఫీలవుతాడు.. ఆ ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం ప్రయత్నిస్తాడు.. కానీ, ఇప్పుడు జరిగిన సకలజనుల సమ్మె తెలంగాణా నాయకత్వంతెలంగాణాపైనే ఒత్తిడి తెచ్చిపెట్టింది... తాను కొనితెచ్చుకున్న ఒత్తిడిని తానే తాళలేక ఒక్కో అడుగు వెనక్కి తీసుకుంది.. ఇది నాయకత్వ లక్షణమా?
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ఒక భాగం కాదని ముఖ్యమంత్రి సహా సమస్త పాలకగణం భావిస్తున్నది.. తెలంగాణా అన్న ప్రాంతం భారతదేశంలో ఒక భాగం కాదేమోనన్న భ్రమలో నిర్లిప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇక్కడి నిరసనలకు విలువ లేదు.. ఆందోళనలకు విలువ లేదు.. సమ్మెలకు విలువ లేదు.. సహాయ నిరాకరణలకు విలువ లేదు.. హింస జరగనంత వరకూ.. అహింసాయుతంగా ఎన్ని సమ్మెలు నడిచినా.. మాటలతూటాలు పేలినా, ఆర్థిక నష్టం వాటిల్లినా.. ఎవరికీ పట్టదు. హింస జరిగితే అణచివేయటానికి సైన్యం ఎలాగూ రెడీగా ఉంటుంది కదా.. మన సైన్యం ఉన్నదే సొంత ప్రజల మీద ప్రతాపం చూపేందుకు...
ఏ యుద్ధంలోనైనా శత్రువును అష్టదిగ్బంధనం చేసి పరాజితుని చేయటం ప్రత్యర్థి లక్షణం.. తెలంగాణా నాయకత్వం తనపైనే తాను అస్త్రాలు సంధించుకుంది.. తన ప్రజలపైనే బాణ వర్షం కురిపించింది. ఆత్మహింస చేసుకుంటున్న ప్రత్యర్థిని చూసి శత్రువు చిద్విలాసంగా ఫిడేలు వాయించుకుంటున్నాడు.. అడపాదడపా ఒకట్రెండు అస్త్రాలు సంధిస్తూ మాటలతూటాలు పేలుస్తూ ఆటాడుకుంటోంది..
తెలంగాణాను ఇప్పుడు నిస్సత్తువ ఆవరించింది.. తనకు పరిష్కారం వస్తుందన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోతున్నది. విద్యార్థులు అలసిపోయారు..లాయర్లు అలసిపోయారు.. కార్మికులు అలసిపోయారు.. ఉద్యోగులు అలసిపోయారు.. సామాన్య ప్రజలు అలసిపోయారు.. నాయకులు మాత్రం ఇంకా అలసిపోలేదు.. ఏసిరూముల్లో కూచుని ఇంకా వ్యూహరచనలు చేస్తూనే ఉన్నారు.. వారి వ్యూహాలకు వెర్రిబాగుల జనాలు తలలూపుతూనే ఉన్నారు.. ఊపకపోతే తెలంగాణా కాజ్ ఏమైపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే శత్రువు కాచుకుని రెడీగా ఉన్నాడు.. ఏమాత్రం అవకాశమిచ్చినా.. అదిగో తెలంగాణా లేదు.. ఏమీ లేదనటానికి.. సిద్ధంగా ఉన్నాడు.. అందుకే దాన్ని బతికించటం కోసం తెలంగాణా సామాన్యుడు నానా అవస్థ పడుతున్నాడు..
ఇక తెలంగాణ వస్తుందన్న ఆశ లేదు. ఈ ఉత్తరకుమారులు సాధించేది ఏమీ లేదు.. ఇవాళ వాళ్లు వీరులు.. వాళ్లే గెలుస్తున్నారు.. గెలుస్తారు.. అరిచిగీపెట్టినా తెలంగాణా రానివ్వరు.. పైవాళ్లు ఇస్తామన్నా.. ఇవ్వనివ్వరు.. ఇది వీరుడి జన్మలక్షణం.. వాళ్ల కూటనీతి ముందు మరో ఓటమిని చవిచూసేందుకు తెలంగాణా సిద్ధమవుతోంది.. ఎంతైనా లగడపాటి రాజగోపాల్ నిజమే చెప్పారు.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. తెలంగాణా చచ్చినా రాదని.. పాపం సీమాంధ్రులే.. సారీ.. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుకోని సమైక్యాంధ్ర మాత్రమే కావాలని కోరుకునే ఔత్సాహికులే పదిపదిహేను మంది గుంపులుగా ఏర్పడి సరదాగా ఆందోళనలు చేసుకుంటున్నారు..

12, అక్టోబర్ 2011, బుధవారం

లగడపాటి ఇప్పుడేమంటారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామంటేనే గుండె రెండుగా చీలిపోయినట్లుగా లగడపాటి రాజగోపాల్‌ తెగ బాధపడిపోయారు.. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిపోయిందని బాధపడిపోయారు.. ఇప్పుడు ప్రశాంత్‌భూషణ్‌ ఏకంగా కాశ్మీర్‌నే పాకిస్తాన్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తున్నారు.. ఈ మాట విని లగడపాటి గుండె తట్టుకుంటుందా? ఇప్పుడు కెసిఆర్‌కు పంపించినట్లుగా సీడీలు, పుస్తకాలు ప్రశాంత్‌భూషణ్‌కు కూడా పంపిస్తారా?