30, మార్చి 2010, మంగళవారం

ముప్ఫయ్యేళ్లుగా అలజడి...


హైదరాబాద్‌ పాతనగరంలో మరోమారు అలజడి చోటు చేసుకుంది. జెండాల విషయంలో మొదలైన వివాదం అంతకంతకు విస్తరించింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గతంలోనూ నగరంలో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. దాదాపు ముప్ఫయ్యేళ్లుగా అడపాదడపా ఇదే దుస్థితి... నాటి నుంచి నేటిదాకా సంఘటనల క్రమమిది...
రమీజామీ కేసు సందర్భంగా తొలిసారి 1978లో మొదటిసారిగా పాతనగరంలో మత ఘర్షణలు చెలరేగాయి. దీంతో తొలిసారి నగరంలో కర్ఫ్యూ విధించారు.

1983
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మజ్లిస్‌, భాజపాల మధ్య సాగిన హోరాహోరీ పోటీ మత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ అల్లర్లలో నలుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.

1984
సెప్టెంబరులో గణేష్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుంది. దావనలంలా వ్యాపించిన అల్లర్లను అదుపు చేయటానికి తొలిసారి జంటనగరాల్లోని యాభై పోలీసుస్టేషన్లతో సహా శివారు పోలీస్‌స్టేషన్‌లలో కర్ఫ్యూ విధించారు. పదిరోజులపాటు కర్ఫ్యూ కొనసాగించారు. ఆ మారణకాండలో 12 మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు.
1990
పేరుమోసిన రౌడీషీటర్‌ సర్దార్‌ పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌లో హతం కావటంతో మొదలైన మతఘర్షణలు కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు సాక్షాత్తు అసెంబ్లీలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రకటించడం విశేషం. డిసెంబరు మొదటివారంలో శాలిబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షక్కర్‌గంజ్‌ పార్థివాడలో నిరుపేదల ఇళ్లపై ముష్కరమూకలు దాడి జరిపాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక మహిళ సజీవదహనమైంది. ఏడాది బాలిక ముఖంపై నరరూప రాక్షసులు పెట్టిన కత్తిగాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి. అప్పటి అల్లర్లలో నగరం మొత్తమ్మీద 150 మంది మరణించగా 500 మంది గాయపడ్డారు. అప్పట్లో అత్యధికంగా 20 రోజులపాటు మధ్యలో సడలిస్తూ సుదీర్ఘకాలం పాతబస్తీ కర్ఫ్యూ గుప్పిల్లో విలవిలలాడింది.

1992
నిమిజ్జనం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తత, అల్లర్లను అణిచివేయటానికి రెండు రోజులు కర్ఫ్యూ విధించారు.

1992
డిసెంబరు ఆరోతేదీన బ్రాబీ మసీదు విధ్వంసంతో చెలరేగిన మతఘర్షణలు ఐదుగురిని బలిగొన్నాయి. ఇరవై మందికిపైగా గాయపడ్డారు. మూడు రోజులపాటు పాతనగరంలో కర్ఫ్యూ విధించారు.

1995
ఆగస్టులో గణేష్‌ నిమిజ్జనం సందర్భంగా ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కత్తిపోట్లు, దుకాణాల లూటీలు జరిగాయి. ఈ సందర్భంగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.

1997
డిసెంబరులో బ్లాక్‌డే సందర్భంగా హింస చెలరేగి ఇద్దరు మరణించారు.
1998
జూన్‌లో ఓ మతాన్ని కించపరుస్తూ వెలువడిన కరపత్రాలు పాతనగరంలో విధ్వంసకాండకు దారి తీశాయి. ఆ అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, కోటి రూపాయిలకు పైగా ఆస్తినష్టం జరిగింది. ఈ సందర్భంలో రెండు రోజులు నిరవధికంగా, నాలుగురోజులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

2003
డిసెంబరులో కిషన్‌బాగ్‌ సిఖ్‌ఛావునిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు కత్తిపోట్లకు గురై మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.

2003
అదే ఏడాది డిసెంబరు ఆరో తేదీ బ్లాక్‌ డే సందర్భంగా అల్లరిమూకలు చెలరేగి పలుప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిపించారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో ఐదుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. దీంతో పాతనగరంలోని ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.

చి డెన్మార్క్‌లోని ఓ పత్రికలో మహ్మద్‌ ప్రవక్తను కించపరుస్తూ కార్టూన్‌ ప్రచురితం కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే సందర్భంలో పాతబస్తీలో ఓ వర్గం వారు దాడులకు తెగబడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

2008
చింతలబస్తీలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కత్తిపోట్లతో ఇద్దరికి గాయాలయ్యాయి.

2009
ఆగస్టులో చిన్న విషయమై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న స్వల్పఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాతనగరంలోని హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ వివాదంతో ఒకరికి గాయాలయ్యాయి.

2009
సెప్టెంబరులో ఆసిఫ్‌నగర్‌ జేబాబాగ్‌ ప్రాంతంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

2009
గ్రేటర్‌ ఎన్నికల తర్వాత మాదన్నపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

2010
శ్రీరామనవమి సందర్భంగా మొదలైన చిన్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇప్పటికే ఒకరు మృతిచెందగా, మరికొందరు కత్తిపోట్లతో ఆస్పత్రి పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. పాతబస్తీలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో కర్ఫ్యూ విధించారు.

టార్గెట్‌ పాతబస్తీ

ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో కల్లోలం రేపిందెవరు?
అల్లరి మూకల చేష్టలకు రాజకీయ రంగు పులుముతున్నారా?
శాంతిని మరచి రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయా?
అల్లరిమూకల చేష్టలను అరికట్టే సత్తా పోలీసులకు లేదా?
భాగ్యనగరం బాధలకు బాధ్యులెవరు?
తమ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేస్తున్నారా?
పాతబస్తీ అల్లర్లు... రాజకీయమేనా? ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్న సందేహానికి పార్టీలు ప్రాణం పోస్తున్నాయి. శాంతియుతంగా ఉన్న ఓల్డ్‌సిటీ ఉన్నట్టుండి భగ్గుమనటానికి కారణం ఏమిటి? ఓ పక్క అల్లరి మూకలు రెచ్చిపోతున్నా వాళ్లను అడ్డుకోవటంలో సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారు. రాజకీయ ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణాలన్న వాదనలకు ఆధారం లేకపోయినా, అల్లరిమూకల చేష్టలకు మాత్రం రాజకీయ రంగు పులుముతున్నారు.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపటం కోసమే కొందరు అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలూ షికార్లు ల్లో వాస్తవం ఎంత?

పదమూడేళ్ల విరామం తరువాత పాతబస్తీ ప్రశాంతత చెదిరిపోయింది. జెండాల కోసం చిన్నగా ప్రారంభమైన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది.. ఉన్నట్టుండి ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు ఎందుకు రేగాయో ఎవరికీ అర్థం కాలేదు..చిన్న గొడవను చిన్నగా ఉన్నప్పుడే అణచివేయగలిగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉపేక్షించారో అర్థం కాదు.. ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం... అదే నిజమైతే.. దీనికి భారీమూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది..
మతమైనా, రాజకీయమైనా... భాగ్యనగరంలో పాతబస్తీ ఫస్ట్‌ టార్గెట్‌... ఏ చిన్న సున్నితమైన సమస్య వచ్చినా.. పాతబస్తీ టెన్షన్‌ పడుతుంది. అయితే ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగే దశను పాతబస్తీ దాటిపోయిందనే ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాం.. ఎందుకంటే.. పాతబస్తీలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుని పదమూడేళ్లు దాటింది...ఇప్పుడు మళ్లీ అవే సన్నివేశాలు.. అవే ఘర్షణలు.. అవే అల్లరిమూకలు.. ఎందుకీ అల్లరి.. కేవలం జెండాల కోసం ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయన్న వాదన ఎంతవరకు వాస్తవం? దీని వెనుక మరే కారణమేదైనా ఉందా? ఇలాంటి అనుమానం రావటానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే జెండాల పేరుతో అల్లర్లు జరుగనున్నాయని కొంతకాలంలో పాతబస్తీలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మామూలు ప్రజలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం.. అయినా పోలీసులు మాత్రం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో అర్థం కాదు.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరించలేదా? లేక తెలిసినా నిర్లిప్తంగా వ్యవహరించారా?
పోలీసుల నిర్లిప్తవైఖరి అనుకోండి.. లేక మరే కారణమైనా కావచ్చు.. అల్లరి మూకల కార్యకలాపాలు రాజకీయం రంగు పులుముకున్నాయి.. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ అల్లర్లకు శ్రీకారం చుట్టాయని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న టాక్‌... అందులో మొదటి ఆరోపణ.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపేందుకు ఆయన ప్రత్యర్థులు ఈ చర్యకు పూనుకున్నారని... గతంలో జరిగిన ఘటనలు ఈ పుకార్లకు బలమిస్తున్నాయి. గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి నేదురుమల్లి జనార్థనరెడ్డిని సిఎం చేసిన సందర్భంలో ఇదే విధంగా అల్లర్లు జరిగాయి.. నెంబర్‌ ప్లేట్లు లేని కార్లు పాతబస్తీలో జబర్దస్తీగా తిరిగి గొడవలు సృష్టించాయి. ఆనాడు ప్రతి కాలనీలో యువకులు కర్రలు, ఆయుధాలు పట్టుకుని కాపలా కాసుకోవలసిన పరిస్థితి నెలకొంది.. ఇప్పుడూ మళ్లీ అదే పరిస్థితి తలెత్తనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
అల్లర్ల వెనుక రాజకీయానికి మరోకారణం తెలంగాణ ఉద్యమం కావచ్చన్నదీ మరో సందేహం... ఇటీవల రాష్ట్రంలో తలెత్తిన తెలంగాణ ఉద్యమ సందర్భంలో హైదరాబాద్‌లో ముస్లింలలోని ఒక వర్గం తెలంగాణాకు అనుకూలంగా గళమెత్తింది.. జెఏసిగా కూడా ఏర్పడింది.. హైదరాబాద్‌ ప్రధాన రాజకీయ పార్టీ అయిన ఎంఐఎం మాత్రం తన వైఖరి వెల్లడించలేదు.. ఈ నేపథ్యంలో ఒకటిగా ఉన్న ముస్లింలలో చీలిక రాకుండా ఉండేందుకు ఇలాంటివి జరుగుతున్నాయా అన్న వార్తలు నగరంలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.. ఇంకోవైపు బిజెపి అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రావటం, ఆ పార్టీని తిరిగి బలోపేతం చేయటం లక్ష్యంగా ముందుకు వెళ్తానన్న కొద్ది రోజుల్లోనే అల్లర్లు జరగటం సున్నితమైన ప్రాంతాల్లో తప్పుడు సంకేతాలను ఇస్తోందని కొందరు బాహాటంగానే అంటున్నారు..
శాంతియుతంగా ఉన్న పాతబస్తీని తమ రాజకీయ ప్రయోజనం కోసం కల్లోలం పాలు చేయటం ఎంతవరకు సమంజసం? రాజకీయ ప్రయోజనాలు ప్రధానమైనప్పుడల్లా పాతబస్తీలో రక్తమోడటం మామూలైపోయింది.. అల్లరి మూకలను నియంత్రించలేకపోవటంలో పోలీసుల వైఫల్యం కంటే వాళ్ల చేతులకు సంకెళ్లు వేయటమే ప్రధానంగా కనిపిస్తున్నది... పార్టీలు రాజకీయాలతో చెలగాటమాడుతున్నాయి.. అది ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. అల్లర్లకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్య తీసుకోగలిగిన నాడు.. పాతబస్తీ ప్రశాంతంగా ఉంటుంది..

29, మార్చి 2010, సోమవారం

వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది


తిరుమలకు వెళ్తున్నారా?
ఆపద మొక్కుల వాడికి నిలువు దోపిడీ సమర్పించుకుందామనుకుంటున్నారా?
పాపం శ్రీవారే నిలువు దోపిడీకి గురవుతుందే మీరు సమర్పించుకున్నది ఏమవుతుంది?
హుండీలో వేసిన సొమ్ము వేసినట్లుగా మాయమైపోతున్నది..
వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది.. తిన్నంత వారికి తిన్నంత.. చిక్కినంత వారికి చిక్కినంత అన్నట్లుగా తయారైంది టిటిడిలో వెంకన్న ఆదాయం.. ఇటు నుంచి హుండీలో భక్తులు వేస్తున్న ఆదాయం.. అటు నుంచి టిటిడి అధికారుల ఇళ్లల్లోకి దొడ్డిదారిన.. చక్కగా చేరుతోంది.. దేవుడి సొమ్ము దొంగల పాలు అన్నట్లుగా మారిపోయింది టిటిడి పరిస్థితి.. ఆపద మొక్కుల వాడికి ఎంతో భక్తితో కోట్లాది భక్తులు సమర్పించే విలువైన కానుకలు అడ్డదారిలో అనర్హుల ఇళ్లను బంగారంతో నింపుతున్నాయి...

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ అవినీతికి ఓ ట్రేడ్‌ మార్క్‌.. అదినకాడికి అందినంత దోచుకోవటమే దేవస్థానంలో పనిచేస్తున్న చాలామంది అధికారులు, బోర్డు సభ్యుల ఉద్యోగంగా, వృత్తిగా మారిపోయింది. వీరి దృష్టిలో దోచుకోవటానికి కాదేదీ అనర్హం.. అమ్ముకోవటానికి ఏది దొరికినా సిద్ధమే... అర్హత లేదు.. అనర్హత లేదు.. డబ్బులు కుమ్మరిస్తే ఎవరైనా విఐపియే.. సామాన్యుడు అన్న పదానికి టిటిడి అధికారుల నిఘంటువులో అర్థమే లేదు.. వెరసి ఇవాళ వెంకన్న డబ్బున్నోళ్ల దేవుడిగా మారుతున్నాడు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరుగుతున్న ఆరోపణలు ఇవాళ కొత్తగా వస్తున్నవేం కాదు..కానీ, ప్రస్తుత చైర్మన్‌ ఆదికేశవులు నాయుడి హయాంలో టిటిడి పై వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదు.. రాజకీయ ప్రయోజనం కోసం ఆదికేశవులు నాయుడిని తీసుకువచ్చి టిటిడికి చైర్మన్‌ చేయటం దగ్గర నుంచే వివాదం మొదలైంది.. కరడుగట్టిన సారా కాంట్రాక్టర్‌ను స్వామి వారి సేవలో వినియోగించటమే తప్పు.. ఆయన అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అక్కడ అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టిటిడి చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే శ్రీవారి పవిత్ర ఆనంద విమాన గోపురానికి అనంత స్వర్ణమయం చేస్తామంటూ ఓ భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు.. ఈ పథకం వల్ల తిరుమల సహజత్వం కొల్పోతుందనీ, అనేకానేక శాసనాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని, ప్రముఖులు, ఆగమ పండితులు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ఆయన చెవికెక్కలేదు.. ఆది కేశవులునాయుడికి దన్నుగా మరో లిక్కర్‌ మాస్టర్‌ కింగ్‌ఫిషర్‌ విజయ్‌ మాల్యా ఆరోకోట్ల రూపాయలు సదరు స్వర్ణమయ పథకానికి విరాళమిచ్చారు..
ఇటీవల ఆలయ నిర్వహణలో భాగంగా బోర్డు ఓ ప్లాస్మా టివిని కొన్నది.. దానికి విలువ ౩౩ లక్షల రూపాయలుగా లెక్క చూపించారు.. మార్కెట్‌లో అంత ఖరీదైన టెలివిజన్‌ ఏముందో, ౩౩లక్షల రూపాయల విలువ చేసే అంత గొప్ప టెలివిజన్‌ను మరి టిటిడి వాళ్లు ఎక్కడ కొన్నారో.. దాని గొప్పతనం ఏమిటో వారే చెప్పాలి..
టిటిడి అవినీతి ఆరోపణలకు అంతే లేదు..ప్రత్యేక ఒఎస్‌డి హోదాలో డాలర్‌ శేషాద్రిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వస్తే పట్టించుకున్న నాథుడు లేడు..అధికారికంగా రిటైర్‌ అయి ఆరేళ్లు దాటినా.. దాండిగతనం ద్వారా, విఐపిల దగ్గర తనకున్న పలుకుబడితో బొక్కసం తాళం చెవులు బొడ్లో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నా దిక్కు లేదు.. ఆయనగారి అవినీతి ఎన్ని సార్లు వెలుగులోకి వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు...
కొన్నాళ్ల క్రితం గోవిందరాజస్వామి దేవస్థానం పూజారి రమణదీక్షితులు స్వామి వారి నగలను ఏకంగా తాకట్టుపెట్టుకుంటే, ఆ బడుగుజీవిని జైలు పాలు చేసి చేతులు దులుపుకున్నారు కానీ, ఇలాంటి చర్యల వెనుక ఉన్న తిమింగళాలను ఎవరూ ఏమీ చేయలేకపోయారు.. అసలు ఆ కేసు అతీగతీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. బోర్డు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తెలియదు..
స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఒకానొక సందర్భంలో శ్రీవారికి అలంకరించిన కోట్ల రూపాయల విలువైన కెంపు పోయింది.. ఎలా పోయిందంటే అధికారులు చెప్పిన కారణం వింటే విస్మయం కలుగుతుంది.. శ్రీవారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు భక్తులు శ్రీవారి వైపు నగదు బిళ్లలు విసురుతారు.. అలా విసిరిన సందర్భంలో ఓ నగదు బిళ్ల తగిలి కెంపు కిందపడి ముక్కలు ముక్కలైపోయిందని, దాని ముక్కలు కూడా దొరకలేదని రికార్డు రాసి కేసు మూసేశారు.. ఇలాంటి వాళ్లను ఏమనాలి? ఏం చేయాలి? నగదు బిళ్ల విసిరితే స్వామి వారి ఆభరణాల్లో భాగమైన కెంపు ఎలా ఊడిపోతుందో పెరుమాళ్లకే తెలియాలి..
ఇక చైర్మన్‌కు, సభ్యుల మధ్య ఉన్న విభేదాల గురించి చెప్పనే అక్కర్లేదు.. బహిరంగంగానే ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకుంటారు.. ఎవరి వాటాలు వారికి దక్కలేదన్నంత స్థాయిలో విరుచుకుపడతారు.. ఒక్కమాటలో చెప్పాలంటే దాయాదుల్లా కొట్టుకుంటారు..
ఇప్పుడు ఈ టిటిడి అవినీతిపై దీనిపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది..సభ్యులు తీవ్రంగా ఆందోళనా వ్యక్తం చేశారు... మంత్రిగారూ జవాబిచ్చారు..అక్కడితో కథ తిరుపతికి చేరిపోయింది. ఇదే చర్చ మరో సందర్భంలో మళ్లీ జరుగుతుంది.. మళ్లీ మళ్లీ జరుగుతుంది.. కానీ, దేవుని సొమ్మును దిగమింగుతున్న తిమింగళాలను నిరోధించటం రాజకీయమే ప్రాణంగా బతికే శాసన వ్యవస్థకు సాధ్యమా?

25, మార్చి 2010, గురువారం

కార్పొరేట్లను మేపటానికే ఆరోగ్యశ్రీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశించిన వర్గాలకు నిజంగా మేలు చేస్తున్నదా? ప్రభుత్వాసుపత్రుల్లో అందించలేని వైద్యాన్ని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఆధునిక సౌకర్యాల ద్వారా అందించాలన్న లక్ష్యంతోనే సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించింది. కాగితాలపైనా, వాస్తవిక దృక్పథంతో చూస్తే ఈ పథకం ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ఉంది.. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే పథకం కార్పోరేట్‌ ఆసుపత్రులకు ప్రజల సొమ్మును అప్పనంగా పందేరం చేసే పథకంగా మారిపోయింది..

ఆరోగ్యశ్రీ పథకం కింద మొన్నటి బడ్జెట్‌లో 925 కోట్ల రూపాయలు కేటాయించారు.. ౨౦౦౭లో ఈ పథకం మొదలైంది... దాదాపు ౩౮౯ వ్యాధులకు సర్జరీ చేసేందుకు, ౧౪౪వ్యాధులకు చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. దీని కింద ఇప్పటి వరకు సుమారు ౩౫ వేల మందికి వివిధ ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు జరిగితే, అయిదున్నర లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు పూర్తయ్యాయి. మిగతా వాళ్లంతా ఇంకా వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉన్నారు.. ప్రభుత్వం గొప్పగా లెక్కలు చెప్తోంది. కానీ, వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉంది. కార్పోరేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వ సొమ్మును దొడ్డిదారిన పొందేందుకు ఇది కల్పవృక్షంగా ఉపయోగపడుతోంది.. చాలా కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి నామమాత్రంగానే చోటు కల్పిస్తున్నారు..
నిధులు మాత్రం బాగా దండుకుంటున్నారు..ఆరోగ్యశ్రీ అంటేనే ఆ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు శ్రద్ధ వహించటం లేదు.. వాళ్లను పురుగుల్లా చూస్తున్న ఆసుపత్రులూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసినా అవి ప్రభుత్వాసుపత్రులకంటే హీనంగా ఉంటాయి. ఇవే నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి తావులేకుండా ఖర్చు పెడితే.. ఆ ఆసుపత్రులు బాగుపడేవి.. సామాన్య రోగులకు మంచి వైద్యసదుపాయం అందేది... ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన ప్రధాన సేవల్లో కీలకమైన వైద్య రంగం పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరించటం క్షంతవ్యం కాదు.. సర్కారు ఎంత అవినీతిదైనా, ఎన్ని నిధులు తిన్నా.. కొంతలో కొంత నిజాయితీతో వ్యవహరిస్తే సామాన్యుడికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది.. ఈ ఏడాది ఇంకా వింతరోగాలెన్నో వ్యాపిస్తాయి అని అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుంది.


24, మార్చి 2010, బుధవారం

నైతిక విలువలకూ చట్టాలు చేయాలా?


పెళ్లికి ముందు సెక్స్‌ నేరం కాదు.. సహజీవనం వ్యక్తిగత ఇష్టానికి సంబంధించింది.. దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.. వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనటం కానీ, సహజీవనం సాగించటం కానీ, నేరంగా పేర్కొనే చట్టాలు ఏవీ లేవు. అలాంటి చర్యలను ఏ చట్టాలూ నిషేధించలేదు.. కాబట్టి వాటిని తప్పుపట్టలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. వివాహానికి ముందు శృంగారం, సహజీవనం అనేవి నైతికతకు సంబంధించిన అంశాలు.. వాటికి కూడా చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందా? నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా శాసనాలు చేయక తప్పదా? సమాజం కంటే వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమా? సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యానాలు ఒక కొత్త చర్చకు దారి తీశాయి.


అయిదేళ్ల క్రితం ౨౦౦౫లో సినీనటి ఖుష్బూ పెళ్లికి ముందు సెక్స్‌ తప్పేమీ కాదంటూ చేసిన వ్యాఖ్య దేశాన్నంతటినీ ఒక్క కుదుపు కుదిపింది. ఆమెను క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేయాలంటూ ఏకంగా ౨౨ కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కొట్టివేయాలని ఖుష్బూ మద్రాస్‌ హైకోర్టు ను ఆశ్రయించారు..కానీ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వేశారు.. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం చాలా తీవ్రమైన వ్యాఖ్యానాలనే చేసింది. పురాణాల్లో చెప్పినట్లు రాధా కృష్ణులే సహజీవనం చేసినప్పుడు, అది తప్పెలా అవుతుందని పేర్కొంది... సుప్రీం కోర్టు ధర్మాసనం ఈకేసును పూర్తిగా చట్టాల చట్రం నుంచి పరిశీలించింది. ఖుష్బూ వ్యాఖ్యల్ని నేరంగా పరిగణించటానికి చట్టంలోని ఏ సెక్షనూ లేకపోవటాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది..
రాజ్యాంగంలోని ౨౧వ అధికరణం ప్రకారం సహజీవనం కూడా జీవించే హక్కులో ఒక భాగంగా వస్తుంది కానీ, నేరంగా మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.. అందువల్లే సుప్రీం కోర్టు ఖుష్బూ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా పేర్కొంది.. ఇవి సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని కూడా స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలో ఇంతకాలంగా అనుసరిస్తున్న నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది... గ్లోబలైజేషన్‌ ప్రభావంతో పెళ్లికి ముందు సెక్స్‌ను, సహజీవనాన్ని అంగీకరిస్తే దాని పరిణామాలు సమాజంపై ఏ విధంగా చూపిస్తాయన్న ప్రశ్నా వ్యక్తమవుతోంది..


సుప్రీం కోర్టు తన వ్యాఖ్యానంలో రాధాకృష్ణుల పేర్లను ప్రస్తావించింది.. నిజానికి రాధాకృష్ణుల చరిత్ర... ప్రధానేతిహాసాలైన భారత, భాగవతాల్లో ఎక్కడా కనిపించదు.. ఈ రెంటిలోనూ రాధ పాత్ర లేదు.. అయితే దేవీ భాగవతంలో కొంత, బ్రహ్మ వైవస్త పురాణంలో కొంత రాధ పాత్ర కనిపిస్తుంది.. ఆ తరువాత రాధ పాత్ర ప్రధానంగా జయదేవుని గీతగోవిందం ద్వారా, రాసలీల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
భాగవతంలో రాధ గురించిన చర్చ లేకపోయినా, రాసలీల మాత్రం స్పష్టంగా ఉంది. బయట ప్రచారంలో ఉన్నట్లు ౧౬వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీల జరిపిట్లు భాగవతంలో లేదు.. భాగవత దశమ స్కంధంలో రాసపంచాధ్యాయి పేరుతో అయిదు అధ్యాయాల్లో గోపికలతో కృష్ణుడు బృందావనంలో రాసలీలలాడినట్లు ఉంది... ఆ గోపికలు ఎందరు? అన్న మాట మాత్రం ప్రసావించలేదు..అదీ గాక మొదట్లో బెంగాల్‌ దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే రాధాదేవి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత క్రమంగా దేశమంతటికీ ఆమె గురించి తెలిసింది. రాధ పాత్రే ఓ మిధ్య అయినప్పుడు... ఆమెతో సహజీవనం అన్నది కూడా అదే కోవలోకి వస్తుంది కదా..? దేవీభాగవతం, బ్రహ్మవైవస్త పురాణంలో పేర్కొన్న రాధ అయినా, జయదేవుని రాధ అయినా మధుర భక్తి మార్గాన్ని అనుసరించినట్లు పేర్కొన్నారు. రాసలీల కూడా మధుర భక్తిలో ఒక భాగమే...మధుర భక్తి సంప్రదాయంలో శరీర సంపర్కం అనేది ప్రతీకాత్మకమేనని ఆ సంప్రదాయ వాదులు చెప్తారు..
జయదేవుని గీతగోవిందంలో పేర్కొన్న వర్ణనలు శరీర సంపర్కం గురించి చెప్పినా, గీతగోవిందాన్ని అనుసరిస్తూ వచ్చిన భక్తి చైతన్య మార్గం మొత్తం మధుర భక్తిని సహజీవనంగా భావించలేదు..ప్రస్తుత హేతువాదులు, కొందరు సంప్రదాయ వాదులు కూడా గీతగోవిందం ఆధారంగా రాధాకృష్ణులు సహజీవనం గడిపారని అంటారు..
౨.
అనైతిక కార్యకలాపాలన్నింటినీ నేరాలుగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది..న్యాయస్థానం రాజ్యాంగంలో చట్టాల పరిధిని అతిక్రమించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోజాలదు.. చట్టాలను అనుసరించే సుప్రీం కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది.. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలే అయినా, పరస్పర ఆధారితాలన్నది వాస్తవం.. ఒక్కోసారి న్యాయస్థానం ఏదైనా ఒక అంశానికి చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడితే, దాన్ని సర్కారుకు సూచించే అవకాశం ఉంది. అంతే కానీ, చట్టం చేయకుండా, ఏ రకమైన తీర్పునూ ఇవ్వటానికి అవకాశం లేదు.. సహజీవనం విషయంలోనూ, పెళ్లికి ముందు సెక్స్‌ విషయంలోనూ సుప్రీం కోర్టు ప్రధానంగా పేర్కొంది ఈ అంశాలనే.. పెళ్లికి ముందు సెక్స్‌ను కానీ, సహజీవనాన్ని కానీ నిషేధిస్తూ భారత ప్రభుత్వం చట్టం చేయలేదు. అందువల్లే సినీనటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవిగానే సుప్రీం కోర్టు కొట్టి పారేసింది. రాజ్యాంగంలోని ౨౧వ అధికరణంలోని ప్రాథమిక హక్కు అయిన వాక్‌స్వాతంత్య్రం ప్రకారం ఖుష్బూ వ్యాఖ్యలు నేరమేం కాదని, వాటిని సవాలు చేయటం ఆమె హక్కును కాలరాయటమే అన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది..
౩.
ఈ దేశానికి ఒక సంస్కృతి ఉందనీ, దానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని పాటిస్తూ వస్తుండటం వల్లనే ఇంతకాలంగా మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుందని భావిస్తున్నాం.. కొన్ని కట్టుబాట్ల మధ్యనే ఇవాళ్టికీ భారత సమాజం నడుస్తోంది... ఇవాళ గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని అమెరికా, యూరప్‌ల సంస్కృతిని కుప్పలుతెప్పలుగా దిగుబడి చేసుకుంటున్నాం.. ప్రపంచం ఓ కుగ్రామమైంది కాబట్టి సంస్కృతి, చట్టుబండలంటూ చాదస్తంగా ఉండటం సరి కాదని వాదించేవాళ్లు చాలామందే ఉన్నారు.. వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని, సుప్రీం కోర్టు కూడా వాస్తవిక దృక్పథంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసిందని వాదిస్తున్నారు కూడా.. వారి కోణంలో వారి వాదన సమంజసమైందే కావచ్చు. కానీ, అదే సమయంలో మరి కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది..
సహజీవనం వల్ల మన దేశానికి సంబంధించినంత వరకు సమాజం కంటే వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం లభిస్తుంది. సంకెళ్లు లేని ఈ స్వేచ్ఛ యువతను ఏ దారిన తీసుకువెళ్తుంది? విశృంఖల శృంగారాన్ని అనుమతించటం వల్ల ఎలాంటి విపరిణామాలు సంభవిస్తాయనేది కొన్నాళ్ల క్రితమే పాశ్చాత్య దేశాలు తెలుసుకున్నాయి.. భారత దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థను అడాప్ట్‌ చేసుకోవటానికి ఒక క్రమ పద్ధతిలో ముందుకు పోతున్నాయి. కానీ, భారత దేశం ఇందుకు రివర్స్‌లో వెళ్తోందా? ఔను.. పెడధోరణుల పట్ల పాశ్చాత్య దేశాలు విసుగు చెంది విసర్జిస్తున్న తరుణంలో వాటిని మనం అందిపుచ్చుకుంటున్నామన్నది నిష్ఠుర సత్యం. ఇందులో ఒకటి, అదీ అతి తీవ్రమైన పెడధోరణి సహజీవనం, ప్రీ మ్యారీడ్‌ సెక్స్‌..
ఇదేమంటే మీరు చాందసవాదులంటూ నిందిస్తారు.. మార్పును కోరుకోకుండా కూపస్థ మండూకాల్లా ఉంటారంటారు.. కానీ, సహజీవనాన్ని అంగీకరించే పరిస్థితిలో భారత సమాజం ఉందా?
౧. వాస్తవిక ధోరణి ప్రకారమే అన్నీ మారాలని, విలువలను పాటించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భావించినట్లయితే, ప్రస్తుతం అత్యంత వేగంగా రూపాంతరం చెందిన సమాజ జీవనం దృష్ట్యా సహజీవనం తప్పు కాదు...
౨. అలాంటి సహజీవనాన్నే భారత సమాజం అనుమతించినట్లయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి?
౩. ప్రపంచంలో అనేక దేశాల్లో సహజీవనం అన్నదీ, స్వలింగ సంపర్కం అన్నది చట్టబద్ధమైంది..
౪. భారత సమాజం కొన్ని మార్గదర్శకాల బాటలో పయనిస్తోంది.
౫. మన సమాజం అనేక వైరుధ్యాలను కలిగి ఉంది. కులాల వైరుధ్యం, మతాల వైరుధ్యం, భాషా వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఇలా అనేక రకాలుగా భారతదేశంలో భిన్నత్వం కనిపిస్తుంది.
౬. ఈ భిన్నత్వం లోపలి నుంచే ఏకత్వం అనేది అంతఃసూత్రంగా వెలువడింది. దీన్నే భారతీయత అన్నారు..ఇదే సంస్కృతి.. ఈ జాతి ఒక ఉన్నత నాగరికతతో సమస్త ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచేలా ఎదిగిందే భారతీయ సంస్కృతి..
౭. ఈ సంస్కృతిని ఇవాళ్టివారు చాదస్తం అనవచ్చు.. ఛాందసం అనవచ్చు... మరేదైనా వ్యాఖ్యానించవచ్చు. కానీ, ఈ విలువల వల్లనే, ఈ కట్టుబాట్ల వల్లనే మిగతా ప్రపంచం కంటే భారత్‌ ఆర్థికంగా వెనుకబడి ఉండవచ్చేమో కానీ, హార్థికంగా ఉన్నత స్థానంలో ఉందన్నది మాత్రం వాస్తవం..
౮. ఇవాళ మన దేశంలో సహజీవనాన్ని అంగీకరించామే అనుకుందాం.. దాని వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం?
౯. ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం లేదు.. సంపన్నత లేదు.. ఇప్పటికీ మన దేశంలో తక్కువ శాతం మంది మాత్రమే ఎగువ మధ్యతరగతి స్థాయికి ఎదిగిన వాళ్లు ఉన్నారు..
౧౦. సహజీవనాన్ని అంగీకరిస్తే.. మన దేశంలో స్త్రీ పురుషులు కొంతకాలం సహజీవనం చేస్తే.. వారి సంబంధాన్ని ఈ సమాజం ఏమని పిలవాలి? ఇప్పటికైతే దీనికి నిర్వచనం లేదు..
౧౧. సహజీవనం అనేది మహిళలకు హక్కుగా భావించవచ్చా?
౧౧. స్త్రీ పురుషులు ఇద్దరు కొంతకాలం సహజీవనం చేసి, తరువాత ఇద్దరి మధ్య అయిష్టం ఏర్పడి విడిపోతే.. ఆ స్త్రీ పరిస్థితి ఏమవుతుంది?
౧౨. మహిళలు ఎంతో ఎదిగిపోయారని పత్రికల్లో, మీడియాలో ఎంతగా బాకాలూదినా.. అలా ఎదిగిన వాళ్ల శాతం చాలా తక్కువ.. అలాంటప్పుడు సహజీవనం చేసి విడిపోయిన తరువాత మహిళ పరిస్థితి ఏమవుతుంది. భార్యగా విడాకులు పొందితే భరణం లభిస్తుంది.. కానీ, సహజీవనం వల్ల విడిపోయిన మహిళకు సామాజిక భద్రత ఎలా ఉంటుంది? ఎవరు ఇవ్వాలి? దీనికీ చట్టం చేయాలా?
౧౩. సహజీవనం చేస్తున్న కాలంలో పిల్లలు పుడితే.. ఆ తరువాత కొంతకాలానికి విడిపోవలసి వస్తే ఆ పిల్లలకు తండ్రి హోదాలో ఎవరుంటారు? ఇందుకూ చట్టం చేయాల్సిందేనా?
౧౪. సహజీవనాన్ని అంగీకరించాల్సి వస్తే.. సామాజిక భద్రత అన్నది చాలా కీలకాంశం అవుతుందన్నది కఠిన వాస్తవం.. దీనికి ప్రభుత్వం జవాబుదారీ వహిస్తుందా? సమాజమా?
౧౫. ఓ పక్క సేఫ్‌ సెక్స్‌ గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నాం..విశృంఖల శృంగారం కారణంగా ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తాయని ఆందోళన చెందుతున్నాం... సెక్స్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ వ్యవస్థను దాటి వెళ్లడం మంచిది కాదనీ సలహాలిస్తున్నాం.. సహజీవనం, పెళ్లికి ముందు సెక్స్‌ అన్న వాటిని ఒప్పుకోవటం సేఫ్‌ సెక్స్‌ అన్న ప్రచారానికి ఏ విధంగా దన్నుగా నిలుస్తుంది?

స్వలింగ సంసర్కం గురించి సుప్రీం కోర్టు గతంలోనే తప్పు కాదంటూ తీర్పు చెప్పింది.. ఇప్పుడు సహజీవనం గురించి, పెళ్లికి ముందు సెక్స్‌ గురించి సానుకూలంగా స్పందించింది.. వీటికి సంబంధించి రాజ్యాంగంలో, శాసనాల్లో ఎలాంటి విధి నిషేధాలు లేవు కాబట్టే న్యాయస్థానాలు వాటికి అనుకూలంగా స్పందించి ఉండవచ్చు.. ఈ రకమైన ధోరణి చూస్తే మన దేశంలో వేశ్యావృత్తిని క్రమంగా చట్టబద్ధం చేయనున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

23, మార్చి 2010, మంగళవారం

భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు


అదిగో భద్రాది... అంటూ.... లక్షలమంది భక్తులు... శ్రీరామనవమి వేడుకల్ని కనులారా వీక్షించేందుకు తరలివస్తారు. జన్మలో ఒక్కసారైనా... శ్రీ సీతారాముల కల్యాణాన్ని... వీక్షించాలని తాపత్రయపడతారు. అంతటి ప్రస్థమైన సీతారాముల కల్యాణం నాడే... పాలకులు... ఆ దేవదేవుడికి బాకీపడుతున్నారు... ఇది ప్రతి ఏటా జరుగుతున్న తంతు! శాసనాలనే కాదని.... కల్యాణరాముడికి టోకరా ఇస్తున్నారు.

శ్రీరాముడికే శఠగోపం పెడుతున్న పాలకులు
భద్రాద్రి రాముడికి సర్కారు బాకీ 5 లక్షలు
ఆనవాయితీని అటకెక్కిస్తున్న సీఎంలు
భద్రాచలం దేవస్థానం నెత్తిన సొంత ఖర్చులు
ప్రభుత్వం తెలిసే ఈ తప్పులు చేస్తోందా...?
భద్రాద్రి రాముడిపై ఎందుకీ చిన్నచూపు..?


"రామ..." అనే రమ్యమైన రెండక్షరాలు సర్వకాల సర్వావస్థలలో ... తమను రక్షిస్తాయని భక్తుల నమ్మకం. అయితే... ఈ నమ్మకాన్ని మన పాలకులు వమ్ము చేస్తున్నారు. సాక్షాత్తూ దేవదేవుడినే అవమానిస్తున్నారు.


భద్రాచలంలో ప్రతిసంవత్సరం జరిగే... సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం... పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. అలాగే... సమర్పిస్తున్నారు కూడా. అయితే... ఇది అధికారికంగా జరగట్లేదు.


వాస్తవానికి... ప్రభుత్వం సొంత ఖర్చుతో .... సీతారాముల కల్యాణానికి.... పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించాలి. కానీ... ఘనత వహించిన మన పాలకులు....పట్టువస్త్రాలు, తలంబ్రాల ఖర్చును... భద్రాచలం దేవస్థానం నెత్తినే రుద్దుతున్నారు.


ఎందుకిలా జరుగుతోంది...? ఎందుకు ప్రభుత్వం సొంత ఖర్చుతో... రాముడ్ని సేవించట్లేదు.. అంటే...
నిర్లక్ష్యమే కారణమని చెప్పొచ్చు. ప్రతిఏడాది...మనం... సీతారాముల కల్యాణం నాడు.... వినే మాట .... రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,
తలంబ్రాలను సమర్పించారు...అని! కానీ.... ఇన్నాళ్లూ...మనం విన్నది తప్పు. నిజానికి.... ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం తరపునే... చాలా ఏళ్లుగా.... పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది. ప్రభుత్వానికి దక్కాల్సిన పుణ్యం అంతా... దేవస్తానం హుండీలో జమవుతోంది.

ఒకటి కాదు... రెండు కాదు... 20 ఏళ్లుగా...ప్రభుత్వం ఈ నిర్వాకం చేస్తోంది. ఎవరూ పట్టించుకోరన్న ధీమా ఏమో.... సీతాముల కల్యాణం ఆనావాయితీని .... మన పాలకులు... చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

ఒక్కసారి...చరిత్రలోకి వెళితే.... ప్రభుత్వం ఈ ఖర్చుల్ని ఎందుకు భరించాలో తెలుస్తుంది.

తానీషా హయంలో... తలంబ్రాలు, పట్టువస్త్రాల ఖర్చును ప్రభుత్వమే భరించాలని శాసనం చేశారు. రాష్ట్ర అవతరణ తర్వాత అప్పటి ప్రభుత్వం .. తానీషా శాసనాన్ని పునరుద్దరించింది. అందులో భాగంగా... తలంబ్రాలు, పట్టువస్త్రాల కొనుగోలు కోసం... 25 వేల రూపాలతో బడ్జెట్ కేటాయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాత ప్రభుత్వాలు... ఆ శాసనాన్ని...అటకెక్కించాయి. దీంతో... 20 ఏళ్లుగా... ఈ ఖర్చుల్ని భద్రాచలం దేవస్థానమే భరిస్తోంది.

ఇప్పటివరకు...రాష్ట్రప్రభుత్వం... భద్రాచల దేవస్తానానికి.... అక్షరాల అయిదు లక్షల రూపాయలు అప్పుంది. ఈ బాకీ తీర్చండిబాబోయ్...అంటూ... ఏ యేటి కా ఏడు... దేవస్తానం అధికారులు.... సర్కారుకు విన్నవించుకున్నా.... ఫలితం లేదు...! వచ్చే ఏడాది చూద్దాం లే...అంటూ.... పెండింగ్ మీద పెండింగ్ వేస్తోంది..ప్రభుత్వం.

ప్రతిసంవత్సరం... సీతారాముల కల్యాణం సమయానికి...దేవస్తానమే...తలంబ్రలు, పట్టువస్త్రాలు సిద్దం చేస్తోంది. వాటిని సమర్పించేందుకు వచ్చే... సీఎంలు... చాలా స్టైల్ గా, ఠీవీగా... ప్రభుత్వం తరపున.. అందజేస్తున్నామంటూ ఫోజులిచ్చేవారు.

కనీసం... ఈ శ్రీరామనవమికైనా... ప్రభుత్వం... సొంత ఖర్చుతో... సీతారాముల సేవ చేసుకుంటుందో లేదో చూడాలి.




22, మార్చి 2010, సోమవారం

నెత్తికెక్కిన కళ్లు!


ఢిల్లీ పాకిస్తాన్‌లో ఉందిట.. మీకు తెలుసా?
కోల్‌కతా ఏకంగా బంగాళాఖాతం మధ్యలో ఉండిపోయింది..
బుద్ధగయ బంగ్లాదేశ్‌ అవతల సముద్రంలో కలిసిపోయింది..
ఖజురహో కర్ణాటకలోకి..
గ్వాలియర్‌ గుజరాత్‌లోకి ..
ఆగ్రా రాజస్థాన్‌లోకి వచ్చి చేరిపోయాయి...

ఈ దేశంలో ఎవరైనా ఏమైనా చేయవచ్చు... తప్పు చేసినా.. ఒప్పు చేసినా ఎవర్నీ శిక్షించటం మన దేశంలో సాధ్యమయ్యే పని కాదు.. ఒకరు దేవతల బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు.. ఇంకొకరు అవే బొమ్మల్ని టాయిలెట్‌ ఉపకరణాలపై ముద్రిస్తారు.. ఇంకొకరు ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగురవేస్తానంటారు. ఈ దేశ సార్వభౌమత్వాన్ని సైతం నిందించినా పట్టించుకునే పరిస్థితి ఉండదు.. మూడు రంగుల జెండాను ఏ విధంగా ఎగురవేయాలో కూడా తెలియని ప్రబుద్ధులు సైతం ఉన్న దేశం మనది... ఇక దేశ మ్యాప్‌లను తప్పుగా చూపించటంలో వింతేముంది?


రైల్వేశాఖ ఓ ఆడ్‌ ఏజెన్సీకి రూట్‌మ్యాప్‌ ఒకటి గీయమన్నందుకు ఫలితం ఇది.. దేశంలో అత్యంత ఖరీదైన రైలు మహారాజా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే దారి మ్యాప్‌ను చిత్రించే బాధ్యతను తూర్పు రైల్వేస్‌ ఆధునిక్‌ -౭౬ అన్న యాడ్‌ ఏజెన్సీకి అప్పగించేశారు..

సదరు యాడ్‌ ఏజెన్సీ భారత మ్యాప్‌లో రూట్‌ గీయటంలో పూర్తి నిర్లక్ష్యం... ఏదో ఒకటి గీసిస్తే సరిపోతుంది.. బిల్లు చేతికి వచ్చేస్తే చాలు.. అన్నట్లుగానే వ్యవహరించారు.. మహారాజా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే ఎనిమిది ఊళ్ల పేర్లు రాసుకున్నారు.. వాటిని లింక్‌ చేస్తూ ఓ గీత గీశారు.. ఆ గీతను తీసుకువచ్చి భారతదేశం మ్యాప్‌ పైన పెట్టేసి ఇచ్చేశారు..

తాము గీసిన రూట్‌ భారత మ్యాప్‌లో సరిగ్గా సరిపోయిందా లేదా చూసుకున్న వాడు లేదు.. కనీసం తమకు అందిన తరువాత యాడ్‌ ఏజెన్సీ సరైన మ్యాప్‌ ఇచ్చిందా? లేదా? అని వైరిఫై చేసిన పాపాన అటు రైల్వే అధికారులూ పోలేదు. అచ్చంగా కళ్లు మూసుకుని ఇచ్చిన మ్యాప్‌ను ఇచ్చినట్లుగా ముద్రణకు పంపించేశారు..
తీరా వ్యవహారం రచ్చకెక్కాక యాడ్‌ ఏజెన్సీని బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు ఓ ఉత్తర్వులు ఇచ్చేశారు.. ఇంతటితోనే సరిపోయిందా? యాడ్‌ ఏజెన్సీ గీసిచ్చిన మ్యాప్‌ను ఆమోదించిన రైల్వే అధికారులు ఎవరు? మ్యాప్‌ను చూసే వాళ్లు ఓకే చేశారా? లేక గుడ్డిగా మమ అన్నారా? ఇందుకు బాధ్యులు ఎవరు? ఎవరిపై చర్యలు తీసుకోవాలి?

మ్యాప్‌లను అడ్డగోలుగా చూపించటం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేం కాదు.. ఇంతకాలం మన శత్రు దేశాలు.. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తప్పుడు మ్యాప్‌లు.. తప్పుడు సరిహద్దులను చూపిస్తూ మ్యాప్‌లను ప్రకటించాయి.. ఇప్పుడు దేశంలోనే ఓనమాలు కూడా రాని వాళ్లు ఇష్టం వచ్చినట్లు గీసేస్తున్నారు.. అంతే తేడా..

భారత మ్యాప్‌లపై వివాదం ఇప్పటిది కాదు.. పాకిస్తాన్‌, చైనాల పుణ్యమా అని మన దేశ మ్యాప్‌ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో రకంగా కనిపిస్తుంది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ మన దేశ మ్యాప్‌ను ఒకలాగా చూపిస్తుంది.. సిఎన్‌ఎన్‌ చానల్‌ ఇంకోరకంగా ప్రొజెక్ట్‌ చేస్తుంది.. ఇక ఆంగ్ల దొరల చానల్‌ బిబిసి మరో రకంగా దాన్ని చిత్రీకరిస్తుంది.. మొత్తం మీద కాశ్మీర్‌ ప్రాంతం ఎవరికి తోచిన రీతిలో వాళ్లు తమ మ్యాపుల్లో పెట్టేసుకుంటారు.. చైనా ఇంకో అడుగు ముందుకేసి అటు అరుణాచల్‌లో కొంత తమ భాగంలో చూపించుకుంటుంది.. కాశ్మీర్‌ విషయంలో ఎవరికి వారు ముక్కలు ముక్కలు చేసి చూపించటం భారత్‌ సర్కారు నిరసన వ్యక్తం చేయగానే సరిదిద్దుకోవటం పరిపాటిగా మారిపోయింది.
మొన్నటికి మొన్న జనవరి ౨౬న భారత గణతంత్ర వేడుకల రోజునే, కామన్‌వెల్త్‌ ఫెడరేషన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించేసింది. కాశ్మీర్‌తో పాటు గుజరాత్‌లోని కొంత భాగాన్నీ పాకిస్తాన్‌లో కలిపేస్తూ బొమ్మను చిత్రించింది...
కేం్రద ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన తరువాత కానీ ఆ మ్యాప్‌ను కామన్వెల్త్‌ తొలగించలేదు..
మరో గమ్మత్తేమిటంటే దేశ రాజకీయ వ్యవస్థకు నీతి పాఠాలు వల్లించిన ఓ తెలుగు సినిమాలో సైతం ఇదే తప్పు జరిగింది... అవినీతిని అంతం చేయటం కోసం హీరో లీడర్‌గా మారిన సినిమా.. ప్రతి ఒక్కరూ నిజాయితీతో వ్యవహరించాలని సందేశమిచ్చిన సినిమా.. దేశం గురించి అంత గొప్పగా చెప్పిన సినిమాలో.. అవినీతి రహిత సమాజానికి దారి చూపిన సినిమాలో ఈ దేశానికి సంబంధించిన మ్యాప్‌నే తప్పుగా చిత్రించటం వింత.
ఇవాళ జనం నోళ్లలో బాగా నానుతున్న, మెచ్చుకుంటున్న సినిమా లీడర్‌ లో ఓ భారత మ్యాప్‌ చూపిస్తారు.. మన శత్రుదేశం పాకిస్తాన్‌ అన్యాయంగా ఆక్రమించిన కాశ్మీర్‌ ప్రాంతాన్ని ఈ మ్యాప్‌ ద్వారా సినిమా వాళ్లు ఆ దేశానికి ధారాదత్తం చేసేశారు.. ఏ కాశ్మీర్‌ కోసం రెండు దేశాల మధ్య చిచ్చు రగులుతోందో.. ఏ భూభాగం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా రక్షణ బడ్జెట్‌లో ఖర్చు పెడుతున్నామో... ఆ భూభాగాన్ని దిగ్రేట్‌ లీడర్‌ సినిమా వాళ్లు అప్పనంగా పాకిస్తాన్‌ పరం చేసేశారు...
దేశం గురించి కుప్పలు తెప్పలుగా గొప్పలు చెప్పిన సినిమాలో అదే దేశానికి సంబంధించిన మ్యాప్‌ను వాడుతున్నప్పుడు వహించాల్సిన శ్రద్ధ కనీసంగానైనా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ పాటించలేదు.. ఏదో ఇంటర్నెట్‌లో వెతికి దొరికిన మ్యాప్‌ను గుడ్డిగా, ఆలోచించకుండా, నిర్లక్ష్యంగా సినిమాలో వాడేశారు..
నిర్మాతల కంటే ఆలోచన లేదనుకుందాం.. చూసుకోలేదనుకుందాం... కానీ, సినిమాను క్షుణ్ణంగా చూసి సర్టిఫికెట్‌ జారీ చేసి విడుదలకు అనుమతించిన సెన్సార్‌ బోర్డు వారిని ఏమనాలి? వాళ్ల పరిశీలన ఏమైపోయింది? సినిమాను చూసే సర్టిఫికేట్‌ జారీ చేశారా? లేక ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదా? దేశాన్ని, జాతీయ చిహ్నాలను, సార్వభౌమత్వాన్ని కించపరిచే ఎలాంటి సన్నివేశాలను అనుమతించరాదన్న నియమం వారికి కనీసం గుర్తుందా?
సర్కారుకయితే ఈ అంశం అసలు పట్టింపునకే ఉండదు.. ఈ దేశంలో ఉన్న అపరిమిత స్వేచ్ఛకు ఇది మరో ఉదాహరణ...

20, మార్చి 2010, శనివారం

భామాకలాపం

పబ్లిక్‌లైఫ్‌లో ప్రవేశించిన పెద్దమనిషి ఆయన... లక్షలాది ప్రజలు తమ ప్రతినిధిగా ఎన్నుకొని శాసనసభకు పంపించిన నాయకుడు ఆయన... అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేత, శృంగార రసంలో మునిగి తేలుతున్నాడు.. ప్రజల సేవ మాటేమో.. కానీ, భామాకలాపంలో పూర్తిగా మునిగిపోయాడు.. ఒక మహిళను పెళ్లి చేసుకుని.. మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు నటించాడు.. ఇదేమని అడిగితే... ఉండనే ఉంది ఒకే ఒక అస్త్రం మెడపట్టి గెంటేయటం... అదే జరిగింది... దటీజ్‌ అవర్‌ ఎమ్మెల్యే..ఆమె కూడా తక్కువ తినలేదు.. తన భర్తను విడిచిపెట్టింది.. పిల్లలు బాగా సెటిలయ్యారు...ఇప్పుడు ఎమ్మెల్యే చాటు భార్యగా పేరుపడాలని తెగ తాపత్రయపడుతోంది.. వాట్‌ ఏ లేడీ..

ఆయన గారు రామగుండం నుంచి స్వతంత్ర అధ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి ఎన్నికైన సోమారపు సత్యనారాయణ... ఆమె సత్యనారాయణను రెండో వివాహం చేసుకున్నారని చెప్తున్న విజయలక్ష్మి...ఈమె ఒకనాటి భర్త ఓ ప్రభుత్వ శాఖలో సీనియర్‌, సిన్సియర్‌ అధికారి..ఒకటిన్నర దశాబ్దం క్రితం ఇద్దరూ ఏఐటియుసిలో కార్యకర్తలుగా పనిచేసినప్పుడు కలుసుకున్నారు...సాన్నిహిత్యమూ పెరిగింది. ప్రేమగా మారింది.. అది హద్దులూ దాటిపోయింది.. పదమూడు సంవత్సరాలు.. అక్షరాలా పదమూడు సంవత్సరాలు వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు.. ఉంటున్నారు..
విచిత్రమేమంటే ఇద్దరికీ ఇంతకు ముందే వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి.. పిల్లలూ ఉన్నారు.. సెటిల్‌ కూడా అయ్యారు.. అయినా.. వీళ్ల ముద్దూ మురిపాలూ ఆగలేదు. కొన్నాళ్ల తరువాత సత్యనారాయణ తనను గుడిలో పెళ్లి చేసుకున్నట్లు విజయలక్ష్మి చెప్తున్నారు..ఆధారాలూ ఉన్నాయంటున్నారు.. కానీ, సోమారపు సత్యనారాయణ మాత్రం తాను అమాయకుణ్ణనే చెప్తున్నారు.. విజయలక్ష్మితో కేవలం స్నేహమే తప్ప మరేమీ లేదని బుకాయిస్తున్నారు. ఇంతకీ ఏది నిజం...
ఎమ్మెల్యే -విజయలక్ష్మిల మధ్య సంబంధం ఒక విచిత్రమైంది...ఒకప్పటి ఆమె భర్త ఓ ఉన్నతాధికారి... ఓరోజు వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం కళ్లారా చూసిన తరువాత ఆయన వదిలేశారు.. ఆ తరువాత వీరి సంబంధం మొన్నటి ఎన్నికల దాకా ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది.. ఆ తరువాతే మొదలైంది అసలు కథ... తాను నిక్కచ్చిగా సోమారపు సత్యనారాయణ భార్యేనన్నది విజయలక్ష్మి వాదన... ఆమె వాదన ప్రకారం .. ఓ అధికారి భార్యగా ఉన్న విజయలక్ష్మిని సోమారపు సత్యనారాయణ రేప్‌ చేసేందుకు ప్రయత్నించారు..ఆమె ఇంటికి అతిథిగా వెళ్లిన సత్యనారాయణ.. టీ తాగిన తరువాత కప్పు సింక్‌లో వేసేందుకు వెళ్లిన విజయలక్ష్మిని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు.. సత్యనారాయణను విజయలక్ష్మి ప్రతిఘటించటానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె భర్త ఆ ఘటనను చూసి విజయలక్ష్మిని విడిచి వెళ్లిపోయారు.. మొన్నటి నవంబర్‌లో విడాకులూ మంజూరు అయ్యాయి. విచిత్రమేమంటే ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తే, ప్రతిఘటించినట్లు చెప్తున్న విజయలక్ష్మి ఆ తరువాత అతనితో ఎలా రాజీపడింది? పదమూడేళ్లుగా ఆమె సోమారపుతోనే కలిసి ఉంటున్నారు.. అధికారికంగా వివాహం చేసుకోకపోయినా ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు.. గోవాకు షికార్లకు వెళ్లారు. ఎంజాయ్‌ చేశారు.. తనను రేప్‌ చేసే ప్రయత్నం చేసినప్పుడు భర్త చూసి విడిచిపెట్టాడు కాబట్టి సోమారపు తనను ఏలుకోవాలని ఈ మహాతల్లి చెప్తున్నది. ఆస్తి పాస్తులు అక్కర్లేదని, తనకు భార్య హోదా ఇస్తే చాలని ఆమె అంటోంది.. తనను ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్నారంటూ విజయలక్ష్మి అంటున్నారు..
కానీ, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఆమె దగ్గర లేవు.. అదే సమయంలో వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం లేదా అంటే దాన్నీ కాదనలేం... ఇద్దరూ ఏకవచనంతో పరస్పరం నిందించుకుంటున్నారు..తాను ఎమ్మెల్యేకు చేసిన సేవలకు సంబంధించి విజయలక్ష్మి ముందు జాగ్రత్తగా రహస్యంగా వీడియో తీసి కూడా పెట్టుకున్నారు.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆమె ముందుగానే ఊహించి ఉండవచ్చు.. ఫోటోలు కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు.. మొత్తం మీద ఎమ్మెల్యేతో పెళ్లి మాటెలా ఉన్నా.. చట్టబద్ధం కాని సంబంధం ఉన్న మాట వాస్తవమని తేలిపోయింది. కాకపోతే ఈ అనుబంధం ఎక్కడ చెడిపోయింది? ఎలా చెడిపోయింది?

కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతున్న కొద్దీ వీరి మద్య దూరం పెరుగుతూ వచ్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత విజయలక్ష్మిని వదిలించుకోవాలని సత్యనారాయణ ప్రయత్నించారు..
ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తూ వచ్చారు.. కానీ, ఆయన మాత్రం ఆమెను పట్టించుకోలేదు.. చివరకు ఆయన ఇంటికి వెళ్లి ప్రాధేయపడ్డా గట్టిగా పట్టుకుని తాను వదిలిపెట్టేది లేదని భీష్మించుకున్నా.. సోమారపు సత్యనారాయణ కనికరించలేదు. విజయలక్ష్మిని బలవంతంగా మెడపట్టి బయటకు గెంటేశారు.. ఇదేమని అడిగిన పాపానికి మీడియాపైనా ఆయనగారి అనుచరగణం ఆగ్రహం వ్యక్తం చేశారు..
మొదటి భార్య ఉన్నా ఆమె అనుమతి లేకుండా మరో మహిళతో సహజీవనం ఎలా చేశారని అడిగితే ఎమ్మెల్యేగారి దగ్గర సమాధానం లేదు..
బాధ్యత గల ఓ ఉన్నతాధికారి భార్యను బలవంతంగా తన దారిలోకి తెచ్చుకుని, ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఇప్పుడు మాత్రం తాను అమాయకుణ్ణి అన్నట్లుగా వ్యవహరించటం ఎమ్మెల్యేకే చెల్లింది..
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టే నలుగురు వేలెత్తి చూపకుండా తమ మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని చెరిపేసుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు..
కానీ విజయలక్ష్మి మూలంగా అది మరింత రచ్చ అయింది.
ఎమ్మెల్యేను అడ్డం పెట్టుకుని తాను ఎదిగేందుకు విజయలక్ష్మి ప్రయత్నించారు..
విజయలక్ష్మి తెలివిగా మహిళా సంఘాలను వెంటేసుకుని వెళ్లి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అక్కడే ఉంటానని భీష్మించుకున్నారు.. మీడియాకూ ఎక్కారు.. ఫోన్లు చేసిన వాళ్లంతా నిందిస్తే మీకేం తెలుసు పొమ్మని తిరస్కరించారు...
(అంతకు ముందు పిఆర్‌పి నాయకురాలు శోభారాణిని కూడా కలిసి సర్దుబాటు చేయమని అడిగినట్లు సమాచారం.. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఇస్తే సెటిల్మెంట్‌ చేయిస్తానని హామీ ఇచ్చినట్లూ సమాచారం.. కాకపోతే ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు..)
మొత్తం మీద ఎమ్మెల్యే గారి భామా కలాపం సినిమాటిక్‌గా మారిపోయింది...
దీనికి శుభంకార్డు ఎలాపలుకుతారో ఎమ్మెల్యేకే తెలియాలి..


19, మార్చి 2010, శుక్రవారం

ఉప ఎన్నికల వేడి

రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది.. టిఆర్‌ఎస్‌ తో పాటు మరో ఇద్దరు ఇతర పార్టీల సభ్యులు ఖాళీ చేసిన తెలంగాణా స్థానాల్లో ఉప ఎన్నికలు టిఆర్‌ఎస్‌ కోరుకుంటున్నట్లుగా ఏకాపక్ష ఎన్నిక జరిగే సూచనలు కనిపించటం లేదు.. టిఆర్‌ఎస్‌ను కార్నర్‌ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది..

ఉప ఎన్నికల రాజకీయాలు రంజుగా మారాయి... తెలంగాణా ఉద్యమంకోసం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని టిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నానికి గండి కొట్టిన కాంగ్రెస్‌... ఇప్పుడు దాని విజయావకాశాలను కూడా దెబ్బ తీయాలని పావులు కదుపుతోంది... ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కొన్నాళ్లక్రితం పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి వీరప్పమొయిలీ నిజం చేసేశారు... తాము ఖచ్చితంగా పోటీ చేసేస్తామని ఖండితంగా చెప్పేశారు.. దీంతో ఉప ఎన్నికల్లో పోటీ తప్పదని తేలిపోయింది.
శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను ప్రకటించిన మరునాడే తెలంగాణా జెఎసి సమావేశమై ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాల్సిందేనంటూ తీర్మానం చేసింది.. ఆ మేరకే టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు..వెంటనే ఆయన ఆమోదించేశారు కూడా.. వాళ్లతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దామోదర్‌ రెడ్డి, ముత్యం రెడ్డిలు రాజీనామా చేసినా అధిష్టానం వాళ్లను తమ దారికి తెచ్చుకుంది. వీరితో పాటు రాజీనామా చేసిన నిజామాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే లక్ష్మినారాయణ రాజీనామా కూడా ఆమోదం పొందింది... ఇక అంతకు ముందు రాజీనామా చేసిన వారిలో వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రాజీనామాను మాత్రమే స్పీకర్‌ ఆమోదించారు.. టిడిపి మాత్రం చాలా తెలివిగా కాంగ్రెస్‌పై నెపం మోపి తప్పుకుంది. దీంతో మొత్తం ౧౨ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణా కోసం రాజీనామా చేసిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ ముందుగా జెఎసి ప్రకటించింది. కానీ, వాస్తవ పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి పార్టీల వారిగా ఎవరికి వారు రాజకీయం రంజుగానే నడుపుతున్నారు.. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినా, పోటీ జరిగినా తెలంగాణ అంశం ప్రధానంగానే సాగుతాయన్నది నిర్వివాదం.. మరి ఈ ఎన్నికల్లో గెలుపును రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజాభిప్రాయంగా పరిగణిస్తాయా? లేదా అన్నది వేచి చూడాలి.


18, మార్చి 2010, గురువారం

ఫ్రీజోన్‌ వార్

మళ్లీ చిచ్చు మొదలైంది... ఆరు మాసాల క్రితం ఫ్రీజోన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మొదలైన ప్రాంతీయ ఘర్షణలు.. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు సర్కారు పిటిషన్‌ను కొట్టివేయటంతో మరోసారి చెలరేగనున్నాయా? సుప్రీంలో ఫ్రీజోన్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ అడ్మిషన్‌ దశలోనే కొట్టివేతకు గురికావటం రోశయ్య సర్కారును మరోసారి ఇరుకున పెట్టింది. టిఆర్‌ఎస్‌ మరోసారి రెచ్చిపోకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని ౧౪ఎఫ్‌ నిబంధనను తొలగించాలంటూ అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్నయితే సర్కారు ఆమోదించింది. కానీ, సీమాంధ్ర నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురుకానుంది... అధిష్ఠానం ఆమోదంతోనే రోశయ్య నిర్ణయం తీసుకున్నప్పటికీ, సీమాంధ్ర నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను ఎలా ఎదుర్కొంటారో చూడాలి..

ఆరు నెలల క్రితం అంటే అక్షరాలా అక్టోబర్‌ తొమ్మిదో తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు రాష్ట్రాన్ని ప్రాంతీయ వాదాల కొలిమిగా మార్చేసింది. పోలీసు ఉద్యోగాల నియామకానికి సంబంధించి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణాలో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కారణమైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌ను ఆరోజోన్‌ పరిధిలోకి తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మన్నించింది. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోవటానికి కెసిఆర్‌కు మంచి అస్త్రం లభించినట్లయింది...
ఈ ఒత్తిడిని తట్టుకోలేకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును మళ్లీ ఆశ్రయిస్తామంటూ ఆనాడు రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చింది.. ఆ మేరకే స్పెషల్‌ లీవ్‌పిటిషన్‌ను దాఖలు చేసారు.. కానీ, అడ్మిషన్‌ దశలోనే పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేయటం మళ్లీ వివాదానికి దారితీసింది..
సర్కారు వేసిన ఎస్‌ఎల్‌పిని సుప్రీం కోర్టు ఎందుకు స్వీకరించలేదు..? పిటిషన్‌ను తయారు చేయటంలో ప్రభుత్వం బలహీనంగా వ్యవహరించిందా? తన వాదనలను గట్టిగా వినిపించలేకపోయిందా? తెలంగాణాలోని ప్రతిపక్షాలు అన్నీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
ప్రభుత్వమూ దీటుగానే స్పందించింది..తెలుగుదేశం నేతల తీరుపై రోశయ్య తీవ్రంగానే మండిపడ్డారు.. చివరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ తీర్మానం చేస్తానని హామీ ఇచ్చాక కానీ, టిఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గలేదు..
లేకపోతే... తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ ఫ్రీజోన్‌ విషయాన్ని నానాయాగీ చేసేదనటంలో సందేహం లేదు..

తెలంగాణ జెఎసి ఇప్పటికే ఆందోళన ప్రారంభించింది. హైదరాబాద్‌ను ఆరోజోన్‌లో భాగంగా నిర్ధారిస్తూ రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనంటూ తెలంగాణా వాదులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కర్రవిరక్కుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూంది..విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఈ వివాదాన్ని ఆయుధంగా మార్చుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలు..మొత్తం మీద అసెంబ్లీ తీర్మానం పేరుతో ఆందోళన పెద్దగా కాకుండా రోశయ్య సర్కారు ఇప్పటికయితే ఊపిరి పీల్చుకోగలిగింది.. అయితే ఇది శాశ్వత పరిష్కారమా?

15, మార్చి 2010, సోమవారం

కొత్త సంవత్సర శుభాకాంక్షలు...


కొత్త చివురు.. కొత్త సవురు... కొత్త పరువ
మప్పటప్పటికిష్టమైనట్టి జగతి..
ప్రతి ఉదయవేళ నూత్న వర్ష ప్రశస్తి..
ప్రతి ప్రియాలాపమానంద పర్వరీతి..

తెలుగు వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు...



12, మార్చి 2010, శుక్రవారం

శాకమూరి అప్పారావు ఎన్‌కౌంటర్‌





ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన మవోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఏ దారిన వెళ్తోంది?
ఏం సాధించాలనుకుంటోంది...?
ఒకరి వెంట ఒకరుగా అంతమవుతున్న అగ్రనేతలు..
అనారోగ్యం కారణం చెప్పి లొంగిపోయిన కీలక నాయకులు..
సరిహద్దులు దాటి వెళ్లిపోయిన కేంద్రకమిటీ సభ్యులు..
రాష్ట్రంలో ఇక మిగిలిందెవరు?
మావోయిస్టుల ఉద్యమాన్ని నడిపిస్తున్నదెవరు?
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.. ఎంతోమంది మావోయిస్టుల హతం.. ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న ఎందరో నేతల మరణం.. ఎదురుదెబ్బలు ఎన్ని ఎదురయ్యాయి. ౨౦౦౪ ఎన్నికల తరువాత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టులను తుడిచిపెట్టేయటంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు.. కానీ, మావోయిస్టుల ఉనికి పూర్తిగా మాసిపోలేదని శాకమూరి ఎన్‌కౌంటర్‌ స్పష్టం చేసింది...

ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు లో శాకమూరి అప్పారావు ఎన్‌కౌంటర్‌ ఇంతకాలం స్తబ్దంగా ఉన్న ఎన్నో ప్రశ్నలను ఒక్కసారిగా లేవనెత్తింది.. నల్లమల అటవీప్రాంతంలో చివరి మావోయిస్టును సైతం అంతం చేశామని ఇంతకాలం రాష్ట్ర పోలీసులు పదే పదే చెప్తూ వచ్చారు.. కొన్నాళ్ల క్రితంఅయితే రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి దాదాపుగా లేనట్లే అన్నట్లుగా సాక్షాత్తూ పోలీసు బాస్‌ డిజిపి సెలవిచ్చారు. కానీ, మావోయిస్టుల అస్తిత్వం అంత తేలిగ్గా కనుమరుగయ్యేది కాదని శాకమూరి ఎన్‌కౌంటర్‌ తేల్చింది.. ౨౦౦౪ ఎన్నికల తరువాత అధికారం చేపట్టిన వైఎస్‌ నక్సలైట్లను చర్చలకోసం హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు.. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించి చర్చలకు రావటం ఆనాడు నక్సల్స్‌కు వ్యూహాత్మక తప్పిదంగానే పరిణమించింది..
చర్చలు విఫలం కావటంతో మావోలుగా రూపాంతరం చెందిన నక్సల్స్‌ను భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. చర్చల్లో పాల్గొన్న రియాజ్‌ అవి విఫలమైన కొన్నాళ్లకే హైదరాబాద్‌లోనే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.. జనశక్తి కార్యదర్శి అమర్‌ లొంగుబాట పట్టాడు.. రామకృష్ణ రాష్ట్రమే వదిలి వెళ్లినట్లు సమాచారం.. ఆయన తరువాత రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టిన మాధవ్‌ను నల్లమల అడవుల్లోనే పావురాల గుట్టవద్ద గ్రేహౌండ్‌ బలగాలు మట్టుబెట్టాయి. నల్లమలను జల్లెడపట్టి మావోయిస్టుల కదలికలకు పూర్తిగా చెక్‌ పెట్టేసింది.. ఆ తరువాత పటేల్‌ సుధాకర్‌ రెడ్డి ఎన్‌కౌంటర్‌ మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ. మిలిటరీ ప్లాటూన్ల ఏర్పాటులో, వ్యూహాత్మక ఎత్తుగడల రచనలో సమర్థుడైన వ్యక్తిని మావోయిస్టులు పటేల్‌ రూపంలో కోల్పోయారు.. ఇక సాంబశివుడు లాంటి ముఖ్యనాయకులు చివరి నిమిషంలో లొంగుబాట పట్టారు..
చాలాకాలంగా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. తమ వ్యవస్థను పునర్నిర్మించుకునే దిశలోనే మావోయిస్టులు ముందుకు వెళ్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు పూనుకోవటం లేదు.. మరో పక్క దేశవ్యాప్తంగా మావోయిస్టులను నిషేదించటం, లాల్‌గఢ్‌, అబూజ్‌మడ్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం సాగుతుండటంతో రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన నాయకులంతా ఆయా ప్రాంతాలకు తరలివెళ్లారు.. పోలీసుల దృష్టి కూడా అటువైపే ఉండటంతో రాష్ట్రంలో కార్యకలాపాలు ఊపందుకుని ఉండవచ్చు. దాని ఫలితమే ఇవాళ శాకమూరి హతం..ఈ చర్యతో రాష్ట్రంలో మరోసారి యుద్ధం మొదలైంది.. ఇది ఏ కొత్త చరిత్రను రాస్తుందో చూడాలి..

11, మార్చి 2010, గురువారం

మన జేబులో ఉన్న నోటు అసలుదా?

మీరు మార్కెట్‌లో ఏదైనా కొనటానికి వెళ్తున్నారా?
ఏదైనా వస్తువు కొని ౫౦౦నోటు ఇచ్చారు.. కానీ ఆ షాపు యజమాని తన ముందున్న జాబితాలో మీ నోటు సిరీస్‌ చెక్‌ చేసి మరీ తీసుకుంటాడు.. అందులో ఉన్న సిరీస్‌ నెంబర్‌ మీ నోటుపై ఉంటే అంతే సంగతులు... మీ నోటు దొంగనోటంటూ వాపస్‌ చేసేస్తాడు..
హైదరాబాద్‌... ఇప్పుడు దొంగనోట్ల చెలామణికి హబ్‌గా మారిందా? ఎక్కడ చూసినా దొంగనోటే.. మన జేబులో ఉన్న నోటు అసలుదా? నకిలీదా తెలుసుకోలేని పరిస్థితి...
జేబులోంచి నోటు తీస్తే.. దానిపై అనుమానాలు వ్యక్తమవుతుంటే.. జనం గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.. తమ దగ్గర ఉన్నది దొంగనోటని తేలితే ఆ గుండె గభాలున ఆగిపోయే పరిస్థితి ఇవాళ ఉత్పన్నమైంది..

మీరు మార్కెట్‌లో ఏదైనా కొనటానికి వెళ్తున్నారా?
ఏదైనా వస్తువు కొని ౫౦౦నోటు ఇచ్చారు.. కానీ ఆ షాపు యజమాని తన ముందున్న జాబితాలో మీ నోటు సిరీస్‌ చెక్‌ చేసి మరీ తీసుకుంటాడు.. అందులో ఉన్న సిరీస్‌ నెంబర్‌ మీ నోటుపై ఉంటే అంతే సంగతులు... మీ నోటు దొంగనోటంటూ వాపస్‌ చేసేస్తాడు..

వెయ్యి రూపాయలో, అయిదు వందల రూపాయలో ఒక్కసారిగా చెల్లదని తెలిస్తే... అప్పటికప్పుడు ఏం చేయాలి? సదరు దుకాణంలో అవమానం.. అనుమానపు చూపులు.. అన్నింటికీ మించి ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము.. నిష్కారణంగా చెల్లుబాటు కాకపోవటం... ప్రజల్ని తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి చేస్తోంది....
దాదాపు పదహారు సిరీస్‌లలో ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి.
వీటిని తీసుకోరాదంటూ రిజర్వు బ్యాంకే స్పష్టంగా ఆదేశాలిచ్చింది.

మార్కెట్‌లోకి ఎన్ని వేల కోట్ల విలువైన దొంగనోట్లు డంప్‌ అయ్యాయో ఆర్‌బిఐకే తెలియటం లేదంటే... ఇక సామాన్యుడి గతి ఏమిటి?


ఎక్కడ చూసినా దొంగనోట్లే... బ్యాంకుకు వెళ్లి విత్‌డ్రా చేస్తే అందులో ఓ నకిలీ నోటు.. పోస్ట్‌ఆఫీస్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటే అందులోనూ నకిలీ సిరీస్‌... చివరకు ఎటిఎంలకు వెళ్లి క్యాష్‌ తీసుకున్నా అందులోనూ నకిలీయే... మరి మామూలు ప్రజలు అసలు నోట్ల కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని నమ్మాలి?

మామూలు ప్రజానీకానికి నగదుకు సంబంధించి అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థ బ్యాంకు.. ఆ బ్యాంకుల్లోనే.... నగదు కౌంటర్ల నుంచి వచ్చే నోట్లలోనే నకిలీ నోట్లు ఉంటే...

ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌... ఏటిఎం.. అత్యవసరానికి బ్యాంకుకు వెళ్లకుండానే నగదు తీసుకునే సౌకర్యం ఉన్న వ్యవస్థ.. ఈ ఏటిఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకుంటే.. అందులోంచి వచ్చే నోట్లలోనే నకిలీ నోట్లు ఉంటే...

ఏటిఎంలో విత్‌డ్రా చేసుకున్న నోట్లు పట్టుకుని బ్యాంకుకు వెళ్తే వాళ్లు ప్రదర్శించే చికాకు.. వెకిలిప్రశ్నలు ఎందుకొచ్చాంరా భగవంతుడా అనిపించేలా చేస్తాయి. మనం ఏటిఎంలో విత్‌డ్రా చేసుకున్నా.. దానికి ఎలాంటి రుజువులు ఉండవు. ఎవరి జవాబుదారీ ఉండదు.. మనం తీసుకున్న నోట్ల సిరీస్‌కు సంబంధించి ఎలాంటి ఆధారమూ ఎటిఎం నుంచి మనకు లభించదు.. దీని ఫలితం విత్‌డ్రా చేసుకున్న వ్యక్తి నష్టపోవటం తప్ప మరోమార్గం లేదు..నెలంతా కష్టపడి ఉద్యోగం చేసి బ్యాంకులో పడ్డ జీతం రాళ్లను డ్రా చేసుకున్నప్పుడు అందులో దొంగనోట్లు వస్తే ఎక్కడికి వెళ్లాలి? ఎలా గడపాలి?
ఈ సమస్యలకు పరిష్కారం సామాన్యుడికి కనిపించటం లేదు.. తమ దగ్గరున్నది నకిలీయో, అసలుదో తెలుసుకోలేక నానా అవస్థలు పడుతున్నాడు.. దీనికి పరిష్కారం ఏముంది?

నగరంలో విచ్చలవిడిగా ప్రవేశించి భయం పుట్టిస్తున్న ఈ దొంగనోట్ల వ్యవహారానికి పరిష్కారం ఏమిటి? సామాన్యులు ఇలా నష్టపోవలసిందేనా? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?
పాకిస్తాన్‌ వంటి పలు ప్రాంతాల నుంచి దేశంలోకి ఏటా ప్రవేశిస్తున్న దొంగనోట్లలో ఎక్కువ శాతం హైదరాబాద్‌లోకే డంప్‌ అవుతున్నాయి.. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో ౬౬ శాతం దొంగనోట్ల కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయంటేనే జనం ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే నకిలీ నోట్ల చెలామణికి హైదరాబాద్‌ మాంచి అనువైన ప్రదేశంగా మారిపోయింది..

నగరంలో పట్టుబడుతున్న చాలామందికి నకిలీ కరెన్సీ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు ఎంతోమందిని పట్టుకుంటున్నారు.. జైళ్లకు పంపిస్తున్నారు.. అయినా దొంగనోట్ల చెలామణి మాత్రం ఆగడం లేదు..

ఏమైతేనేం.. మొత్తం మీద ఆర్‌బిఐ దీనిపై దృష్టి సారించింది.. నకిలీ కరెన్సీ వచ్చినప్పుడు సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఆర్‌బిఐ ఆదేశాలిచ్చింది.. అసలు నకిలీ నోట్లు ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తే.. సామాన్యుడికి ఇబ్బంది ఎలా ఉంటుంది?
నకిలీనోట్లకు సంబంధించి ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి ఆర్‌బిఐ ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. వీటిని రకరకాల ప్రసారమాధ్యమాల్లో ప్రసారం కూడా చేస్తున్నారు...మీ దగ్గర ఉన్న నోటు నకిలీదైతే వెంటనే పోలీసులకు కంపెユ్లంట్‌ చేయాలని ఆర్‌బిఐ సూచిస్తోంది.. కానీ ఇక్కడే తిరకాసు ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? కేసు నమోదు చేస్తారు.. మీ దగ్గర ఉన్న నోటును వాళ్లు తీసేసుకుంటారు.. మీకైతే అసలు నోటు వాళ్లయితే ఇవ్వరు.. కేసు విచారించి.. సమగ్రంగా దర్యాప్తు చేసి.. ఆతరువాత మీ ఫిర్యాదు సహేతుకమైందని తేలితే.. ఆర్‌బిఐ వారికి చెప్తే...వారు మీకు అసలు నోటు ఇస్తారన్నమాట...మన దేశంలో.. మన వ్యవస్థలో... మన సమాజంలో ఇవన్నీ జరిగేసరికి ఏళ్లూపూళ్లూ పడతాయి.. కాబట్టి... నకిలీ నోటు ఉందంటే.. తూరుపు తిరిగి దండం పెట్టుకోవలసిందే...


10, మార్చి 2010, బుధవారం

రాయల తెలంగాణా


సీమాంధ్ర నేతల స్వరాల్లో మార్పు ధ్వనిస్తోంది.. ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.. సమైక్యం అంటూనే.. తెలంగాణ విభజనకూ వ్యతిరేకం కాదన్న సంకేతాలు స్పష్టంగానే వినిపిస్తున్నారు... రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణాతో కలిసి ఉండటమే మంచిదన్న జెసి దివాకర్‌ రెడ్డి తాజా వ్యాఖ్య సమైక్యాంధ్ర వాదనలో కొత్త మలుపునకు నాంది పలికింది...
మొన్న బొత్స సత్యనారాయణ... నిన్న హర్షకుమార్‌.. ఇవాళ జెసి దివాకర్‌ రెడ్డి.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన ముగ్గురు నేతలు ఒకరి తరువాత ఒకరుగా విభజన స్వరాలు వినిపించారు..జెసి దివాకర్‌ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తన ఓటు ముందుగా సమైక్యాంధ్రప్రదేశ్‌కే అయినప్పటికీ, రాష్ట్ర విభజన అన్నది తప్పకపోతే రాయలసీమను తెలంగాణాతో కలిపి ఉంచాలంటూ కొత్త ప్రతిపాదన చేశారు..

రాయలసీమ మొదట్నుంచీ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉన్నదని ఆయన అన్నారు.. నిజాం నవాబు కప్పం కట్టలేక తమ ప్రాంతాన్ని బ్రిటిష్‌ వారికి దత్తత ఇచ్చారనీ జేసీ వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. సాంస్కృతికంగా, సంబంధ బాంధవ్యాల పరంగానూ రాయలసీమ తెలంగాణాతోనే అనుబంధంగా ఉండగలుగుతుందనీ మాట్లాడారు...
రాయలసీమకు తెలంగాణాకు ఉన్న అనుబంధాన్ని చెప్తూనే...ఎందుకు తాను ఈ ప్రతిపాదన చేస్తున్నదీ వెల్లడించారు.. సీమ ప్రాంతానికి జీవనాధారమైన నీళ్లు తెలంగాణాతో కలిసి ఉన్నప్పుడే లభిస్తాయని, లేకపోతే కష్టపడాల్సి వస్తుందని జెసి స్పష్టంగా చెప్పారు..జెసి మాటలతో మిగతా సీమ నేతలు ఏకీభవించినట్లు కనిపించకపోయినా, వ్యక్తిగత అభిప్రాయమంటూ జెసి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించనైనా లేదు..అయితే తాము మాత్రం సమైక్యానికే ఓటేస్తామని కుండబద్దలు కొట్టారు..
౨౦౦౯ డిసెంబర్‌ ౯న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన క్షణంలో దానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పల్లవిని మొదట వినిపించింది జెసి దివాకర్‌ రెడ్డి... తొలి రాజీనామా సమర్పించిందీ ఆయనే.. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాంది పలికిన జెసి వంటి బడా నాయకులు.. అధిష్ఠానం కదలికల ఆనుపానుల గురించి బాగా తెలిసిన నాయకులే స్వరం మార్చటంతో చిన్న నాయకులు పెదవి విప్పలేకపోతున్నారు...శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుంచీ వీళ్ల వైఖరుల్లో మార్పు కనిపిస్తోంది... అంటే అధిష్ఠానం అభిప్రాయం కూడా ఈ దిశగానే ఉందేమో అన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లోనే వ్యక్తమవుతుంది.. శ్రీకృష్ణ కమిటీ కూడా విభజనకు సానుకూలంగా వ్యవహరించనుందా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.. అయితే కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఒక పట్టాన అర్థం చేసుకోవటం ఎవరి తరం కాదు. ఏ విషయం పైనైనా కాంగ్రెస్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంతుపట్టదు..


9, మార్చి 2010, మంగళవారం

పాపం టైగర్‌...


జాతీయ జంతువుపై జనరాకాసుల పంజా...
అడవుల్లో యథేచ్చగా సాగుతున్న పులుల వేట..
లాభసాటి వ్యాపారంగా మారిన స్మగ్లింగ్‌..
వేగంగా కనుమరుగవుతున్న పులులు..
జవాబుదారీ లేని సర్కారు..
అడవుల్లో వేట... అదీ టైగర్‌ను వేటాడటం.. అబ్బో... ఒకప్పుడు రాజులకు, రాచరిక దర్పానికీ షాన్‌... పహచాన్‌.. అప్పుడు అడవులు ఎక్కువగా ఉండేవి.. జంతువులు ఎక్కువగా ఉండేవి.. జనావాసాల మీదకు క్రూర జంతువులు దాడులు చేయకుండా కాపాడేందుకు వేట జరిగేది.. ఇప్పుడూ వేట కొనసాగుతూనే ఉంది.. కానీ, ఇప్పుడదొక లాభసాటి వ్యాపారం.. దొంగతనం.. స్మగ్లింగ్‌... ఫలితం క్రమంగా కనుమరుగవుతున్న వన్యప్రాణి సంపద..
పులి.. వన్యప్రాణుల్లో అరుదైన జంతువు.. అందునా మన జాతీయ జంతువు.. ఇవాళ వేగంగా కనుమరుగవుతున్న జంతువూ అదే.. సర్కారు వారు ఏదైతే చేయకూడదని నిషేధిస్తారో,... ఆ పని చేయటంలోనే కొందరికి మజా.. హాబీ.. అదే బిజినెస్‌... అందులో పులి వేట ఒకటి.. ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జోరుగా సాగుతున్న స్మగ్లింగ్‌...

టైగర్‌ గర్జన ఇక వినిపించదా? మన జాతీయ జంతువును మనమే వేటాడుతుంటే.. చర్మాన్ని అందిన కాడికి అమ్ముకుంటుంటే ఆపేవారెవరు? అభయారణ్యాలనీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలనీ ఓ... బోర్డులయితే తెగ పెట్టేస్తారు.. టైగర్‌ జోన్‌లోకి వెళ్లవద్దని హెచ్చరికలూ చేస్తారు.. కానీ... అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కొనసాగుతున్న వేట చూస్తుంటే... చివరకు ఈ బోర్డులు తప్ప వన్యప్రాణులు మిగులుతాయా అన్న సందేహం కలుగుతోంది...
ఇది నిజం.. ఇవాళ ఖమ్మం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న తంతు ఇదే.. అత్యంత ప్రమాదకరంగా పులుల వేట జరుగుతోంది.. పెద్ద పులులు, చిరుతల సంహారం యథేచ్ఛగా కొనసాగుతోంది.. పకడ్బందీ ప్రణాళికతో.. పక్కా ఎత్తుగడతో ఉచ్చు వేసి మరీ పులులను హతమారుస్తున్నారు..
పులులు, చిరుతల సంచారమున్న అటవీ ప్రాంతంలో వీళ్లు ముందుగా ఉచ్చులు వేస్తారు.. వాటికి పులుల మెడలు బిగుసుకుని చచ్చిపోతాయి..

అలా సాధ్యం కాని పక్షంలో మరో దారుణమైన ప్రత్యామ్నాయాన్నీ ప్రయోగిస్తారు.. అడవుల్లో ప్రవహించే వాగులు, వంకలు, నీటి గుంటల్లో పురుగు మందులు కలిపేస్తారు.. దాహం తీర్చుకోవటానికి వచ్చిన పులులు ఆ నీటిని అమాయకంగా తాగి మృత్యువాతపడతాయి...
నిజానికి ఈ వేటగాళ్లు అమాయక గిరిజనులు... అసలైన వేటగాళ్లు వేరే ఉన్నారు.. వాళ్ల ఉచ్చులో ముందుగా వీళ్లు పడతారు.. వాళ్లు చెప్పిన పనల్లా చేసి పెడతారు...కొద్దో గొప్పో డబ్బులకు ఆశపడ్డ గిరిజనులు పులులను హతమారుస్తారు.. అసలైన స్మగ్లర్లు వీళ్ల దగ్గర నుంచి మూడు నాలుగు వేల రూపాయలు చెల్లించి పులి చర్మాన్ని తీసుకువెళ్తారు..


పులి చర్మం కేవలం మూడు వేల రూపాయలేనా? ఆశ్చర్యపోకండి.. పులుల చర్మాలు, గోళ్ల వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో జరిగేది... మిగతా వ్యాపారాల్లో మాదిరిగానే ఇందులోనూ సొమ్ములు దండుకునేది, దళారులు.. అసలు స్మగ్లర్లు... గిరిజనులు కేవలం వీరికి ఉపయోగపడే పావులు మాత్రమే...
పులుల వేట జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రతిసారీ అటవీ శాఖాధికారులు పెద్ద ఎత్తున నిఘా వేసి దొంగల్ని పట్టుకుంటారు.. ప్రతి సంవత్సరమూ ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి...
పులులను వేటగాళ్లు వేటాడినట్లే.. వాళ్లను అటవీ అధికారులు వేటాడి పట్టుకుంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది... కానీ వచ్చిన చిక్కల్లా వేరే ఉంది.. అటవీ అధికారులకు పట్టుబడే వాళ్లంతా సామాన్య గిరిజనులే... వాస్తవంగా పులులను వీళ్లే హతమార్చినా.. వీరి చేత ఈ పని చేయిస్తున్న అసలు వేటగాళ్లు వేరే ఉన్నారు.. వారు పట్టణ వాసాలను వీడి బయటకు రారు.. బయటపడరు..
అధికారులు మాత్రం గిరిజనులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసి పనయిందనిపించుకుంటారు..
అసలు స్మగ్లర్లపై మాత్రం ఎలాంటి కేసులూ నమోదు జరగవు.. వారి వంక కన్నెత్తి కూడా చూసేవాళ్లు కనపడరు..వీరంతా హైదరాబాద్‌ కేంద్రంగానే అంతర్జాతీయ వ్యాపారం వెలగబెడుతున్నారు.. మూడునాలుగు వేల రూపాయలకు గిరిజనుల నుంచి కొనుక్కున్న పులి చర్మాలను ఒక్కొక్కటిని ౭౫ వేల రూపాయల వరకు ఎగుమతి చేస్తారు..ఇక గోళ్ల ధర కూడా తక్కువేం పలకదు.. ౩వేల నుంచి ఒక్కోసారి పది వేల రూపాయల దాకా ఒక్కో గోరు పలుకుతుంది.. ఎముకలకు కూడా విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది...
వన్యప్రాణులను కాపాడుకోవటానికి చట్టాలు ఉన్నాయి.. జంతు సంరక్షణ సంస్థలూ ఉన్నాయి.. అయినా వేట నిరాటంకంగా కొనసాగుతోంది.. మరెందుకు ఈ చట్టాలు..? ఓ వైపు దేశంలో ఎన్ని పులులు ఉన్నాయనే గణాంకాలు తీస్తున్నారు.. ఇంకోపక్క పులుల వేట కొనసాగుతోంది.. వేటను నియంత్రించలేనప్పుడు గణాంకాలు చేసి మాత్రం ఏం ప్రయోజనం?
ఖమ్మం జిల్లాలో అటవీప్రాంతం ౮, ౪౦౦ చ.కిమీ..
కిన్నెర సాని అభయారణ్యం ౬౩౫ చ.కిమీ.
పాపికొండలు అభయారణ్యం ౧౧,౨౦౦ చ.కిమీ
(భద్రాచలం సౌత్‌ డివిజన్‌, (తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు కలుపుకుని)
పాపికొండలు అభయారణ్యంలోనే పులులు, చిరుతల సంచారం
వీటి చర్మాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌..
౨౦౦౦ నుంచి ౨౦౦౯ వరకు ౧౩ చిరుత చర్మాల స్వాధీనం..
౧౯౭౨లోనే అమల్లోకి వచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం
౨౦౦౫లో చట్టానికి సవరణ చేసిన సర్కారు...
అయినా పులి సంహారం..ఆగడం లేదు
మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచీ స్మగ్లర్లు ఖమ్మం అడవుల్లో చొరబడుతున్నారు.. వీళ్లందరికీ దేశ వ్యాప్తంగా పక్కా నెట్‌వర్కింగ్‌ ఉంది.. వీళ్లకుండా పలుకుబడి కూడా తక్కువేమీ కాదు. బ్యూరోక్రసీని, రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేయగల సమర్థులు కాబట్టే వీరి ఆటలు సాగిపోతున్నాయి. వీళ్లను పట్టుకోవటం మామూలు అధికారుల వల్ల అయ్యే పని కాదు..పాలకులు ఇందుకు పూనుకోవాలి.. పకడ్బందిగా వ్యవహరించాలి...అప్పుడే జాతీయ జంతువును కాపాడుకోవటం సాధ్యపడుతుంది..


స్కూలు అంటే ఓ దుకాణం..

స్కూలు అంటే ఓ దుకాణం.. ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ.. ఓ ఫైనాన్స్‌ సంస్థ... ఇదేమని ఆశ్చర్యపోకండి... మన దేశంలో చదువు అనేది అచ్చొచ్చే బిజినెస్‌గా ఎప్పుడో మారిపోయింది. స్కూళ్లు చదువును అమ్ముకునే అంగళ్లుగా రూపాంతరం చెంది చాలా కాలమే అయింది... విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు దండుకోవటం.. స్కూలును చూపించి బయట వడ్డీలకు అప్పులు చేయటం.. రొటేషన్లు.. సెటిల్మెంట్లు.. అన్నీ కలిస్తే దాని పేరు విద్యాలయం... అలియాస్‌ కెపిఎస్‌ స్కూల్‌...

పేరుకు మాత్రం అది పెద్ద స్కూలు.. కానీ అక్కడ యాజమాన్యం నడిపేది ఓ దుకాణం.. అదే చదువుల కొట్టు.. ఇక్కడ చదువు చెప్పరు.. అమ్ముతారు.. నాలుగు వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి అందినకాడికి దండుకోవటంలో వీళ్ల ఎక్స్పీరియన్స్‌ అబ్బో బోలెడంత... పిల్లల దగ్గర నుంచే కాదు... ఈ బడిని చూపించి బయట కూడా చేతికి తోచినంత అప్పులు చేసి చక్కా ఉడాయించారు సదరు స్కూలు యజమాని...

దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని మారుతీనగర్‌లో ఉన్న స్కూలు వైభవానికి ఆ స్కూలు బోర్డు ఉదాహరణ. నీతి సూత్రాలు.. వివేకానందుడు, మదర్‌ థెరెస్సాల ఆదర్శాలు తెగ వల్లెవేశారు... పాపం వాటన్నింటినీ నిజమేనని నమ్మిన పిల్లలు పొలోమని వచ్చి చేరిపోయారు...అక్షరాలా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయం.. ఈ నెలాఖరు నుంచి యాన్యువల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళో, రేపో హాల్‌టికెట్లు ఇస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.. ఇవాళ ఉదయం హటాత్తుగా పాఠశాలను మూసేస్తున్నట్లు ప్రకటించేసి బోర్డు తిప్పేశారు..
ఉన్నట్టుండి స్కూలు ఎందుకు మూసేశారో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కయ్యారు..
జవాబు ఇచ్చేవారు లేరు.. అయోమయం...పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో ఇలా జరగటం మింగుడు పడని పరిస్థితి...
గమ్మత్తేమిటంటే గత నాలుగు రోజులుగా వరుసగా సెలవులు వచ్చాయి. ఈ సెలవులను పాఠశాల యాజమాన్యం చక్కగా వినియోగించుకుంది. అన్నీ చక్కబెట్టుకుని ఎంచక్కా చెక్కేసింది.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటంలో ఈ స్కూలుకు సాటిరాగలది మరోటి లేనే లేదు.. సిబ్బందికి మాత్రం నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. పరిస్థితి చేయి దాటినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అధికారులు పట్టించుకోలేదు.. పదో తరగతి దాకా అనుమతి లేకుండా స్కూలు నడుపుతుంటే... ఫీజులు దండుకుంటుంటే.. విద్యార్థులను ప్రెユవేటుగా పరీక్షలను రాయిస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారో... లేక కావాలనే తేలిగ్గా తీసుకున్నారో... అర్థం కాని స్థితి....
వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తామంటూ అధికారులైతే చెప్తున్నారు కానీ, పరీక్షలు ముంచుకొచ్చిన ఈ తరుణంలో ఇది ఎంత వరకు సాధ్యమన్నది అర్థం కాదు.. పరీక్షల ముందు సహజంగానే మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు.. ఈ పరిణామంతో మరింత దిగాలు పడిపోయారు.. ఇలాంటి యాజమాన్యాలను ఏం చేయాలి? ప్రభుత్వమూ పట్టించుకోక, పార్టీలూ పట్టించుకోక..నడివీధిలో విద్యార్థులను నిలబెట్టారు..


ఆత్మహత్యల తెలంగాణా...

ఎవరు ఆపాలి...ఈ ఆత్మహత్యల పరంపరని... రాజకీయ నాయకులు చప్పబడిపోయారు.. తమ వ్యవహారాలను బహుబాగా చక్కబెట్టుకుంటున్నారు.. నిరాహార దీక్షల శిబిరాలు బోసిపోయాయి.. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది.. వెళ్లింది.. ఎవరైనా నివేదికలు ఇవ్వవచ్చంటూ ఓ మాటనేసి పాపం న్యాయమూర్తి వెళ్లిపోయారు.. కానీ, తెలంగాణాలో పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా వస్తుందా? రాదా? ఇక రాదేమో.. ఈ చేవచచ్చిన, చేతకాని రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదు.. ఈ మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు.. నిన్నటికి నిన్న వరంగల్‌ నగరంలో ప్రజాశక్తి పత్రిక విలేఖరి సునీల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని అంతిమ యాత్ర అక్కడ కొనసాగుతుండగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం మినీటెక్‌ హాస్టల్‌లో నల్గొండ జిల్లా కోదాడకు చెందిన సాయికుమార్‌ ఉరివేసుకున్నాడు.

. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్‌ చేయలేకపోతున్నాయి..ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది? అమరులవటం వల్ల తల్లిదండ్రులకు గర్భశోకం.. స్నేహితులకు విషాదం... తల్లి తెలంగాణాకు తీరని దుఃఖం.. దీన్ని గ్రహించాలి.. నేతలు చేస్తున్న ద్రోహానికి వాళ్లను నిలదీయాలి.. పోరాటం దిశగా వాళ్లను కదిలించండి... మరింత ఉధృతంగా పోరాటం చేయండి.. లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే... ఉన్నతంగా సాగుతున్న పోరాటంలో ఒక ఆత్మహత్య జరిగితే , . ఉద్యమించిన సైన్యంలో ఒక యోధుడు తగ్గినట్లేనని భావించాలి...తెలంగాణాకు నిజమైన రాజకీయ నాయకత్వం అనేది ఉండి ఉంటే తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యేదే కాదు.. ఈ సత్యాన్ని గ్రహించండి.. తెలంగాణాకు రాజకీయ నాయకత్వం అంటూ లేనే లేదు.. చెన్నారెడ్డి అయినా, కెసిఆర్‌ అయినా.. ఆ రాజకీయ నాయకత్వానికి ముసుగుల్లాంటి వారే.. ముసుగు తొలగిస్తే.. అంతా డొల్లే.. తెలంగాణా ప్రజను ముందుండి నడిపించే, మార్గదర్శనం చేసే నాయకత్వాన్ని ముందుగా పెంపొందించుకోవాలి.. సైన్యాధ్యక్షుడు లేకుండా సైన్యం తలోదిక్కున పయనిస్తే.. ఎదురయ్యేది ఇదిగో.. ఇలాంటి ఓటమే... దీన్ని అధిగమించటానికి ఏం చేయాలో.. ఎలా ముందుకు సాగాలో ఆలోచించుకోవాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం సరి కాదు.. మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?

ఒక అడ్డంకిని అధిగమించిన మహిళాబిల్లు...

అలజడులు.. అల్లర్లు.. ఆందోళనలు.. గల్లీ కొట్లాటలకు వేదికగా తలపించిన రాజ్యసభ.. సభాపతి అన్న మర్యాదను సైతం సభ్యులు ఉల్లంఘిస్తే.. ప్రజాస్వామ్యం విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది.. ఏడుగురు సభ్యులు.. ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్లే.. అయినా గద్దల్లా ప్రజాస్వామ్యాన్ని పొడుచుకుతినేందుకు ప్రయత్నించారు ఈ డర్టీ సెవెన్‌...భారత స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారి రాజ్యసభలో సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని కళంకం.. దాని పేరే పెద్దల సభ.. కానీ, సభ్యులు మాత్రం పెద్దల్లా ప్రవర్తించింది లేదు.. ఇలాంటి వాళ్లనా మన రాజకీయ పార్టీలు పెద్దల సభకు పంపేది... ఆ సభకు ఇంతకాలంగా ఉన్న మర్యాదలన్నింటినీ ఈ డర్టీ సెవెన్‌ మంటగలిపేశారు.

ఈ గొడవల మధ్యలోనే.. ఈ గందరగోళం కొనసాగుతుండగానే బిల్లుపై చర్చనూ మమ అనిపించారు.. ఓటింగూ జరిపించారు.. విచిత్రమేమంటే.. రాజ్యసభలో ౨౩౩ మంది సభ్యులు ఓటింగ్‌ సమయంలో హాజరు అయితే బిల్లుకు అనుకూలంగా ౧౮౬ ఓట్లే పడ్డాయి.. ఒకే ఒక్క ఓటు వ్యతిరేకంగా పడింది.. మిగతా ౪౬ మంది ఓట్లేయలేదు.. వాస్తవానికి సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న ఎస్‌పి, ఆర్‌జెడి ఇతర సభ్యులు ౩౪ మందే ఉన్నారు.. ఇద్దరు బిఎస్‌పి సభ్యులు ముందే బహిష్కరించారు.. మరి మిగతా పది మంది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు? వీరిలో అధికార పార్టీ, బిజెపికి చెందిన వాళ్లెవరైనా ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది...
ఏమైతేనేం.. మొత్తం మీద మహిళాబిల్లుపై రాజ్యసభ ముద్రపడింది.. ఇక లోక్‌సభ ఆమోదమే తరువాయి.. దీనికి ఎంత హంగామా జరుగుతుందో.. ఎన్ని గందరగోళం సృష్టిస్తారో చూడాలి....
మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రకారం........
లోక్‌సభలో, శాసన సభల్లో...౩౩.౩శాతం సీట్లను మహిళలకు కేటాయించటం జరుగుతుంది..
పార్లమెంటులో ఇప్పటికే ఎస్‌సి, ఎస్‌టిలకు ౨౨.౫ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి..

ఈ ఎస్‌సి ఎస్‌టి రిజర్వేషన్లలోనూ ౩౩.౩ శాతం మహిళలకు కేటాయించాలని బిల్లు నిర్దేశిస్తోంది.. అదే జరిగితే ఎస్‌సి ఎస్‌టిలకు ఉన్న ౨౨.౫ శాతంలో ౭.౫ శాతం మహిళలకు కేటాయించాల్సి వస్తుంది..
మొత్తం మీద లోక్‌సభలో మహిళల సంఖ్య ౧౮౧మందికి చేరనుంది...
మన రాష్ట్ర అసెంబ్లీలో మహిళల సంఖ్య ౯౮కి చేరుతుంది.
ప్రస్తుతం ౧౫వ లోక్‌సభలో ౫౯ మంది మహిళలు ఉన్నారు.. అంటే మహిళల సంఖ్య ౧౦.౮శాతం..
మన రాష్ట్రానికి సంబంధించి ౧౩వ శాసనసభలో ౩౪ మంది మహిళలు ఉన్నారు.. అంటే మన అసెంబ్లీలో మహిళల శాతం ౧౧.౫

డర్టీ సెవెన్‌...

డాక్టర్‌ ఇజాజ్‌ అలీ...
జెడి(యు) ద్వారా రాజ్యసభలో ప్రవేశించారు..
పేరుకు పెద్ద డాక్టర్‌... చదువులు గొప్ప.. చేష్టలు దిబ్బ..


షబీర్‌ అలీ...
లోక్‌ జనశక్తి పార్టీ నుంచి రాజ్యసభకు చేరుకున్న ఈయన
చదువుకున్నది తక్కువ...
సెటిల్మెంట్లు చేయటంలో.. పంచాయతీలు పరిష్కరించటంలో మేధావి..

కమల్‌ అఖ్తర్‌..
ఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఈయన గారి రాజకీయ ఆవాసం
ఎస్‌పి మార్క్‌ రాజకీయానికి ఈయన మచ్చుతునక..
సమాజసేవకుడి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నేత

ఆమీర్‌ అలం ఖాన్‌
ఈయనా సమాజ్‌వాదీ మాణిక్యమే...
ఈయన రైతు.. పలు పుస్తకాలు కూడా రాశారు..

వీర్‌పాల్‌సింగ్‌ యాదవ్‌
యుపి నుంచే ఎస్‌పి ద్వారా రాజ్యసభకు ఎంపిక..
బిఎ ఎల్‌ఎల్‌బి. చదివి చాలా పదవులు నిర్వహించారు

నందకిశోర్‌ యాదవ్‌..
యుపికే చెందిన ఈయన ములాయంకు సన్నిహిత సహచరుడు
రాజనీతి శాస్త్రంలో ఎంఎ చదువుకున్నాడరు..
లాయర్‌ వృత్తినీ వెలగబెడుతున్నారు..

సుభాష్‌ యాదవ్‌...
ఈయన అడ్రస్‌ కేరాఫ్‌ లాలూ...
లాలూ గారి ముద్దుల బావమరిది...
బావగారి అండతో బీహార్‌లో రాజ్యమేలుతున్న పెత్తందారీ..