10, మార్చి 2010, బుధవారం

రాయల తెలంగాణా


సీమాంధ్ర నేతల స్వరాల్లో మార్పు ధ్వనిస్తోంది.. ఒకరి తరువాత ఒకరుగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.. సమైక్యం అంటూనే.. తెలంగాణ విభజనకూ వ్యతిరేకం కాదన్న సంకేతాలు స్పష్టంగానే వినిపిస్తున్నారు... రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణాతో కలిసి ఉండటమే మంచిదన్న జెసి దివాకర్‌ రెడ్డి తాజా వ్యాఖ్య సమైక్యాంధ్ర వాదనలో కొత్త మలుపునకు నాంది పలికింది...
మొన్న బొత్స సత్యనారాయణ... నిన్న హర్షకుమార్‌.. ఇవాళ జెసి దివాకర్‌ రెడ్డి.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన ముగ్గురు నేతలు ఒకరి తరువాత ఒకరుగా విభజన స్వరాలు వినిపించారు..జెసి దివాకర్‌ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తన ఓటు ముందుగా సమైక్యాంధ్రప్రదేశ్‌కే అయినప్పటికీ, రాష్ట్ర విభజన అన్నది తప్పకపోతే రాయలసీమను తెలంగాణాతో కలిపి ఉంచాలంటూ కొత్త ప్రతిపాదన చేశారు..

రాయలసీమ మొదట్నుంచీ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉన్నదని ఆయన అన్నారు.. నిజాం నవాబు కప్పం కట్టలేక తమ ప్రాంతాన్ని బ్రిటిష్‌ వారికి దత్తత ఇచ్చారనీ జేసీ వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. సాంస్కృతికంగా, సంబంధ బాంధవ్యాల పరంగానూ రాయలసీమ తెలంగాణాతోనే అనుబంధంగా ఉండగలుగుతుందనీ మాట్లాడారు...
రాయలసీమకు తెలంగాణాకు ఉన్న అనుబంధాన్ని చెప్తూనే...ఎందుకు తాను ఈ ప్రతిపాదన చేస్తున్నదీ వెల్లడించారు.. సీమ ప్రాంతానికి జీవనాధారమైన నీళ్లు తెలంగాణాతో కలిసి ఉన్నప్పుడే లభిస్తాయని, లేకపోతే కష్టపడాల్సి వస్తుందని జెసి స్పష్టంగా చెప్పారు..జెసి మాటలతో మిగతా సీమ నేతలు ఏకీభవించినట్లు కనిపించకపోయినా, వ్యక్తిగత అభిప్రాయమంటూ జెసి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించనైనా లేదు..అయితే తాము మాత్రం సమైక్యానికే ఓటేస్తామని కుండబద్దలు కొట్టారు..
౨౦౦౯ డిసెంబర్‌ ౯న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన క్షణంలో దానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పల్లవిని మొదట వినిపించింది జెసి దివాకర్‌ రెడ్డి... తొలి రాజీనామా సమర్పించిందీ ఆయనే.. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాంది పలికిన జెసి వంటి బడా నాయకులు.. అధిష్ఠానం కదలికల ఆనుపానుల గురించి బాగా తెలిసిన నాయకులే స్వరం మార్చటంతో చిన్న నాయకులు పెదవి విప్పలేకపోతున్నారు...శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుంచీ వీళ్ల వైఖరుల్లో మార్పు కనిపిస్తోంది... అంటే అధిష్ఠానం అభిప్రాయం కూడా ఈ దిశగానే ఉందేమో అన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లోనే వ్యక్తమవుతుంది.. శ్రీకృష్ణ కమిటీ కూడా విభజనకు సానుకూలంగా వ్యవహరించనుందా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.. అయితే కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఒక పట్టాన అర్థం చేసుకోవటం ఎవరి తరం కాదు. ఏ విషయం పైనైనా కాంగ్రెస్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంతుపట్టదు..


3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

It appears to be deliberate attempt to influence the Commission.

They are probably warning center to put the splitting process in cold storage by demanding SRC2.

అజ్ఞాత చెప్పారు...

It clearly exposes the fears of Rayalaseema people. They are illegally tapping Krishna waters through various projects. If telangaanaa happens, they will be closed forever. They also know pretty well that the Kosta people would never extend a helping hand for their uplift and if chance comes, they would exploit the poverty of Rayalaseema to grab their lands as well.

అజ్ఞాత చెప్పారు...

" If you can't convince, confuse! " that is the game! Confuse all - SriKrishna, KCR - all, leave none! :))

Sankar