4, అక్టోబర్ 2013, శుక్రవారం

రాష్ట్ర విభజనకు సంబంధించి అత్యంత కీలకమైన 'నోట్'


22 పేజీల డాక్యుమెంట్!

నేపథ్యం, హేతుబద్ధత

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పర్చాలని చాలా కాలం నుంచి ఎప్పటికప్పుడు డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. 1969 నుంచి 1973 వరకూ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం హింసాత్మక ఉద్యమాలు జరిగాయి. 1973లో ఆరు సూత్రాల ఫార్ములాకు అనుగుణంగా జరిగిన ఒక రాజకీయ పరిష్కారం కొంత కాలం శాంతిని తీసుకొచ్చింది. అయితే, ఏదో ఒక రూపేణా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో సరైన సమయంలో సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తామని ప్రస్తావించారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం వేగం పుంజుకోసాగింది.

2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభం అవుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నిరసనలకు దారి తీసింది. శాంతిభద్రతల పరిస్థితి తలెత్తడంతో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడనంత వరకూ తెలంగాణ రాష్ట్రంపై చర్యలు తీసుకోబోం అని భారత ప్రభుత్వం 2009 డిసెంబర్ 23న ప్రకటించింది. దీంతో వెంటనే రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం పెచ్చరిల్లింది.

2010 జనవరి 6న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు శాంతిని పాటించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి పిలుపునిచ్చారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై సంప్రదింపులు జరిపేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పర్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరిపేందుకు న్యాయమూర్తి శ్రీకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పరిచారు. 2010 డిసెంబర్ 30న ఈ కమిటీ ఆరు మార్గాంతరాలను సూచిస్తూ తన నివేదికను సమర్పించింది.

2011 జనవరి 6న కేంద్ర హోం మంత్రి నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులంతా హాజరై తమ అభి ప్రాయాలను తెలిపారు. 2012 డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రి నిర్వహించిన మరో అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలూ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల ఆధారంగా వేగవంతంగా చర్యలు తీసుకుని రాష్ట్రంలో అస్థిరతను రాజకీయ సంక్షోభాన్ని తొలగించాలని అభ్యర్థించాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి బాగా దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశాయి. మూడేళ్లపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో విస్తృతంగా సంప్రదింపులు జరిగాయి. ప్రజా ప్రతినిధులతోను, పౌర బృందాలతో కూడా చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే పర్యవసానాల గురించి వారితో చర్చించారు. వీరందరూ రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల ఆందోళనల్ని కూడా పట్టించుకుని, వారికి తగిన భద్రతను కల్పించాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో పట్టించుకోవాల్సిన అంశాల్ని ఈ విధంగా క్రోఢీకరించటం జరిగింది.

అవేమిటంటే...
1) తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే నదీ జలాలు, విద్యుత్ ఉత్పత్తి - పంపిణీ, మూడు ప్రాంతాల ప్రజల భద్రత, రక్షణ చర్యలు, ప్రాథమిక హక్కులకు హామీకి సంబంధించిన అంశాలను నిర్దిష్ట కాలంలో పరిష్కరించేలా ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
2) తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించాలి. ఈ పదేళ్లలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచి సమర్థవంతంగా పనిచేసేందుకు వీలైన న్యాయపరమైన, పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాలి.
3) ఈ పదేళ్ల కాలంలోనే సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు సహకరించాలి.
4) పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని పూర్తి చేసేందుకు తగిన నిధుల్ని కేటాయించాలి.
5) ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవ సరాలను గుర్తించి, ఆ ప్రాంతాల అభివృద్ధికి తగిన నిధుల్ని కేటాయించాలి.
6) తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు, అన్ని ప్రాంతాలు, జిల్లాల మధ్య శాంతి, సుహృద్భావ సాధనకు వీలుగా ప్రభుత్వానికి సహాయ పడాలి.

హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా హైకోర్టు బెంచ్ లేదు. కనుక ప్రస్తుత హైకోర్టే రెండు రాష్ట్రాలకూ ఉన్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది. భారత ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రెండు రాష్ట్రాల పరిధుల్లో ప్రత్యేక హైకోర్టులు ఏర్పరిచేదాకా ఇదే ఏర్పాటు కొనసాగుతుంది.
ఖర్చుకు అధికారాలు: గత సంప్రదాయం ప్రకారమే ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌కు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చులను భరించేందుకు అధికారాలు ఇవ్వటం జరుగుతుంది. ఆరు నెలలకు మించకుండా ఈ ఖర్చును ఆయన అనుమతిస్తారు. దానిని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రాష్ట్ర ఖర్చును భరించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తాను నియామకమైన రోజు నుంచి ఆరు నెలల వరకూ ఖర్చులను అనుమతిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఖాతాల కాగ్ నివేదికలను రెండు రాష్ట్రాల గవర్నర్లకు అందజేస్తారు. వాటిని ఆయా శాసనసభల్లో ప్రవేశపెడతారు. కొత్త రాష్ట్ర గవర్నర్ అలవెన్సులు, అధికారాలను రాజ్యాంగంలోని 158వ అధికరణ మూడవ క్లాజు ప్రకారం పార్లమెంటు ఆమోదిస్తుంది. ఈ మేరకు ప్రవేశపెట్టే బిల్లు రెండు రాష్ట్రాల ఆదాయ, పంపిణీకి కూడా వీలు కల్పిస్తుంది.

ఆస్తులు, అప్పుల పంపిణీ
ఎ) రెండు రాష్ట్రాలకు చెందిన ఆస్తులు, అప్పులు, భూములు, సరుకులు, ఖజానా, బ్యాంకు నిల్వలు, పన్ను బకాయిలు, రుణాలు, అడ్వాన్సుల వసూలు హక్కులు, పెట్టుబడులు, కొన్ని నిధుల్లో రుణాలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులు, అప్పులు, ప్రజారుణం, అదనంగా వసూలు చేసిన పన్నుల తిరిగి చెల్లింపు, డిపాజిట్లు, పీఎఫ్, పింఛన్లు, కాంట్రాక్టులు, అవ కతవకలకు సంబంధించి పెనాల్టీలు, హామీదారుగా ఉండటం వల్ల తలెత్తే బాధ్యతలు, సస్పెండ్‌లో ఉన్న వస్తువులు, ఒడంబడిక ద్వారా స్వాధీనమైన ఆస్తులు, అప్పులు, కొన్ని సందర్భాల్లో కేటాయింపులు, సర్దుబాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారాలు, కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయాల్సిన వ్యయం మొదలైన వాటన్నింటినీ నిర్ణయించేందుకు గతంలో మాదిరి బిల్లులో నిబంధనల్ని పొందుపరుస్తారు. న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, సమానంగా, రెండు ప్రాంతాల్లో ఆస్తులు, అప్పులు లభించేలా ఆర్థిక సర్దుబాటు ఉంటుంది. ఈ విషయంలో తలెత్తే ఏ వివాదాన్ని అయినా రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో పరిష్కరించటం జరుగుతుంది. లేని పక్షంలో కాగ్ సలహాపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.

బి) గతంలో మాదిరే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొంత మొత్తాన్ని కేటాయించవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కొత్త రాజధాని ఏర్పర్చవలసి ఉంటుంది కనుక అందుకు భారీ పెట్టుబడులు అవ సరమవుతాయి కనుక బిల్లులో తగిన నిధులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేయవచ్చు. కొత్త రాష్ట్ర నిర్మాణానికి భారత ప్రభుత్వమే నిధుల్ని కేటాయిస్తుంది.

కార్పొరేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు
ప్రత్యామ్నాయ ఏర్పాటు జరిగేంత వరకూ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్ని చట్టపరమైన కార్పొరేషన్లు, సహకార బ్యాంకులు తమ పనిని కొనసాగించేందుకు బిల్లులో ఏర్పాట్లను పొందుపరుస్తారు. కంపెనీల చట్టానికి సంబంధించి ప్రభుత్వ కంపెనీలు తమ పనిని కొనసాగించేందుకు వీలుగా పంజాబ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 73వ క్లాజులో పేర్కొన్న నిబంధనల్ని వర్తింపచేస్తారు. ప్రస్తుత రాష్ట్ర కంపెనీలను విభజించేందుకు, పునర్ వ్యవస్థీకరించేందుకు భవిష్యత్తులో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం అవసరమవుతుంది.

సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు
ఎ) ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌కు సంబంధించి మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, తెలంగాణకు ప్రత్యేక కేడర్ల విభజన జరుగుతుంది. ప్రస్తుత సంఖ్యను కొత్త కేడర్లకు సభ్యుల కేటాయింపును అఖిల భారత సర్వీసెస్ చట్టం కింద చేస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి రెండు రాష్ట్రాలకూ అఖిల భారత సర్వీసుల అధికారుల నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే, విభజన అమల్లోకి రానంత వరకూ రెండు రాష్ట్రాలకూ ఆలిండియా కేడర్ సేవలు అందిస్తూనే ఉంటుంది. విభజన తర్వాత ప్రతి రాష్ట్రంలో ఎన్ని పోస్టులుండాలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయిస్తుంది.

బి) ఇతర సర్వీసులు - రాష్ట్ర సబార్డినేట్ సర్వీసులకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే విధమైన పద్ధతిని అవలంభిస్తారు. ఈ మేరకు బిల్లులో నిబంధనల్ని పొందుపరుస్తారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు అవసరమైన అధికారులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే నియమిస్తారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

సి) పబ్లిక్ సర్వీస్ కమిషన్ - భారత రాజ్యాంగంలో 315 అధికరణ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం జరుగుతుంది. దీని ప్రకారం అవసరమైతే రెండు రాష్ట్రాలకూ ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండొచ్చు. ఇందుకోసం రెండు శాసనసభలూ తీర్మానాలు ఆమోదిస్తే రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చేందుకు పార్లమెంటు సంయుక్తంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వరకూ ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సంయుక్త రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా కొనసాగించాలని ప్రతిపాదిస్తారు.

న్యాయపరమైన ఏర్పాట్లు
గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారం చట్టాల పరిధిని, చట్టాలను అన్వయించుకునే అధికారాన్ని, సంస్థలను నియమించే అధికారులను, కొన్ని కేసుల్లో ప్రాక్టీస్ చేసేందుకు న్యాయవాదుల హక్కును తదితర అంశాలను బిల్లులో రూపొందిస్తారు.

జలవనరుల పంపిణీ
పునర్ వ్యవస్థీకరణ బిల్లులో నదీ పరివాహక రాష్ట్రాల హక్కులను యథాతథంగా ఉంచుతారు. రెండు రాష్ట్రాల జల వినియోగ హక్కులను పరిరక్షించటమే కాక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒడంబడికల్ని కూడా రెండు రాష్ట్రాలూ గౌరవించేలా చూస్తారు. రెండు రాష్ట్రాలకూ చెందిన నీటి పారుదల సౌకర్యాల నియంత్రణ యాజమాన్యాన్ని కూడా బిల్లులో స్పష్టీకరిస్తారు. అంతర్ రాష్ట్ర నదీజలాలకు సంబంధించిన విషయంలో, న్యాయపూరితమైన పద్ధతిలో జలాల పంపిణీ విషయంలోను ఆదేశాలను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల జల నిర్వహణ బోర్డుల ఏర్పాటు, జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను ప్రకటించటం కూడా బిల్లులో చేరుస్తారు.

విద్యుత్ పంపిణీ
రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉత్పత్తి పంపిణీ, అందుకు సంబంధించిన ఆస్తుల పంపిణీ జరగాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే భారత ప్రభుత్వం దానిని నిర్ణయించే విషయం కూడా బిల్లులో పొందుపరుస్తారు.

ప్రత్యేక అంశాలు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యాంగంలో 371 డిని చేర్చారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జీఓఎం నిర్ణయం ఆధారంగా ఈ నిబంధనను సరైన విధంగా సవరించటం, లేదా వెనక్కు తీసుకుంటారు.

ఇవీ కీలకం
రాజ్యాంగ నిబంధనలను, గతంలో జరిగిన పరిణామాలు, ప్రస్తుత అవ సరాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చట్టం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించటం జరిగింది.

ఆ చట్టం ఇలా ఉంటుంది...
కొత్త రాష్ట్రం పేరు తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనేవారు. అది ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం. అందువల్ల కొత్త రాష్ట్రాన్ని తెలంగాణ అనే పేరిట పిలవాలి. మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో పరిగణించవచ్చు.

ఇవీ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రం, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాజధానులు: పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధానిని కూడా వేగంగా నిర్ణయించి, ఈ ప్రక్రియ సజావుగా సాగించాలి. రాష్ట్ర ఏర్పాటు జరిగిన పదేళ్లలోపే కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుంది.

కొత్త రాష్ట్ర గవర్నర్: భారత రాజ్యాంగంలోని 153వ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే, ఒకే వ్యక్తి రెండు లేదా మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందువల్ల రెండు రాష్ట్రాలకూ ఒకే వ్యక్తిని గవర్నర్‌గా కొనసాగించే విషయం లేదా రెండు రాష్ట్రాలకూ వేర్వేరు గవర్నర్లను నియమించే విషయం పరిశీలించటం జరుగుతుంది.
పార్లమెంటులో ప్రాతినిధ్యం: విభజన తర్వాత ప్రాంతాల వారీగా ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీ సభ్యులు విడిపోతారు.

ఎ) రాజ్యసభ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు 18 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో కొత్త రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు తెలంగాణకు 7 సీట్లను కేటాయిస్తారు. మిగతా ఆంధ్రప్రదేశ్‌కు 11 సీట్లు ఉంటాయి.

బి) లోక్‌సభ: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 42 మంది సభ్యులు ఉన్నారు. విభజన తర్వాత తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు, మిగతా ఆంధ్రప్రదేశ్ నుంచి 25 సభ్యులు ఉంటారు.

రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం
శాసన మండలి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మొత్తం 90 మంది సభ్యులు ఉన్నారు. కొత్త రాష్ట్రానికి కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే శాసనమండలి ఉండాలా? లేదా? అన్నది కొత్తగా ఏర్పడే శాసనసభ నిర్ణయిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంత శాసనమండలిని పునర్‌వ్యవస్థీకరిస్తారు. అయితే, రెండు ప్రాంతాల శాసనమండళ్లలో లేదా ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎన్ని సీట్లు ఉంటాయనే విషయం వేర్వేరుగా నిర్ణయమవుతుంది.

శాసనసభలు: 333వ అధికరణ నిబంధనకు లోబడి ఒక శాసనసభలో 60 మందికంటే తక్కువగా, 500 మందికంటే ఎక్కువగా సభ్యులు ఉండరాదని రాజ్యాంగంలోని 170వ అధికరణ నిర్దేశించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నామినేటెడ్ సభ్యుడితో కలిపి 295 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 119 మంది తెలంగాణ ప్రాంతానికి, 175 మంది ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతానికి చెందుతారు. నామినేటెడ్ సభ్యుడిని తెలంగాణ ప్రాంతం నుంచి నామినేట్ అయినట్లుగా భావించొచ్చు.

సి) అసెంబ్లీల కాలపరిమితి: రాజ్యాంగంలోని 172 (1) అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని నిర్ణయిస్తారు. ఈ అధికరణ ప్రకారం అసెంబ్లీ తొలుత సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు అది కొనసాగుతుంది. ఈలోపు రద్దయితే తప్ప శాసనసభ కాలపరిమితి మారదు. ప్రస్తుత శాసనసభ 2014 జూన్ 2 వరకూ కొనసాగవలసి ఉంది.

డి) స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు: గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని బట్టి ఇప్పుడు ఉన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు కొనసాగుతారు. అయితే, రాజ్యాంగంలోని 178వ అధికరణ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవచ్చు.

ఈ) అసెంబ్లీ నిబంధనలు: కొత్త నిబంధనలు ఏర్పర్చేంత వరకూ, సవరణలను ప్రతిపాదించేంత వరకూ ప్రస్తుత అసెంబ్లీ నిబంధనలే రెండు శాసనసభలకు వర్తిస్తాయి.
ఎఫ్) రిజర్వేషన్లు: తెలంగాణలో ప్రస్తుతం ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు రిజర్వ్ అయ్యాయి. వీటిలో మూడు ఎస్‌సీలు, రెండు ఎస్‌టీలకు చెందినవి. ఇక 31 రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాల్లో 19 ఎస్సీలు, 12 ఎస్టీ నియోజకవర్గాలు. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతంలో కూడా లోక్‌సభలో ఐదు రిజర్వ్‌డ్ (నాలుగు ఎస్సీ, ఒకటి ఎస్టీ) స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో 29 ఎస్సీ, ఏడు ఎస్టీ స్థానాలు ఉన్నాయి. కొత్త పునర్విభజన జరగనంత వరకూ రెండు రాష్ట్రాల్లోనూ ఈ రిజర్వ్‌డ్ స్థానాలు మారవు.

ఆరు వారాల్లోనే జీవోఎం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : తెలంగాణపై నోట్‌ను ఆమోదించిన కేంద్ర కేబినెట్... మంత్రుల బృందం ఏర్పాటుపైనా స్పష్టత ఇచ్చింది. అంతేకాదు... ఆరు వారాల్లోపే మంత్రుల బృందం తన ప్రతిపాదనలు సమర్పించాలని స్పష్టం చేసింది. కేబినెట్ నోట్ చివరి అనుబంధంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మంత్రుల బృందం అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. మంత్రుల బృందంలో హోం శాఖ, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రోడ్డు రవాణా, హైవేల శాఖ, విద్యుత్ శాఖ, ఉద్యోగులు, సిబ్బంది శాఖ మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ కూడా ఉంటారు. జీఓఎం రాష్ట్ర విభజనకు సంబంధించి తలెత్తే అన్ని అంశాలనూ పరిష్కరిస్తుంది.

జీవోఎం విధి విధానాలు ఇవి...
1. కొత్త రాష్ట్రం తెలంగాణ, మిగిలిన ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్ని నిర్ణయించాలి. నియోజకవర్గాలు, న్యాయ సంస్థలు, చట్టపరమైన సంస్థలు, ఇతర పరిపాలనా యూనిట్లను కూడా నిర్ణయించాలి.
2. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలూ సమర్థవంతంగా పనిచేసేందుకు వీలైన న్యాయ పరమైన, పరిపాలనా పరమైన చర్యల్ని తీసుకోవాలి.
3. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త రాజధానిని ఈ పదేళ్లలో ఏర్పర్చేందుకు అవసరమైన న్యాయపరమైన, ఆర్థిక, పరిపాలనా చర్యల్ని పరిగణలోకి తీసుకుంటుంది.
4. రెండు రాష్ట్రాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల ప్రత్యేక అవ సరాలను పరిశీలించి చర్యల్ని సిఫారసు చేస్తుంది.
5. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని ప్రాంతాలూ, జిల్లాల్లో ప్రజలందరి శాంతి భద్రతలు, రక్షణ చర్యలకు సంబంధించిన అంశాలను పట్టించుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో శాంతి, సుహృద్భావం నెలకొనేలా చూస్తుంది. దీర్ఘకాలంలో తలెత్తే అంతర్గత భద్రతా పర్యవసానాలను కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది.
6. నదీ జలాలు, నీటి పారుదల వనరులు, బొగ్గు, నీరు, చమురు, గ్యాస్, మొదలైన సహజ వనరుల పంపిణీని పరిశీలిస్తుంది. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటుంది.
7. విద్యుత్ ఉత్పాదన, సరఫరా, పంపిణీ రెండు రాష్ట్రాల్లో సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది.
8. ఆస్తులు, పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, అప్పులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
9. రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసులు, సబార్డినేట్ సర్వీసులకు సంబంధించిన ఉద్యోగుల పంపిణీని నిర్ణయిస్తుంది.
10. విభజన తర్వాత రాజ్యాంగంలోని 371డి అధికరణ కింద జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
11. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే ఏ ఇతర అంశాన్ని అయినా పరిశీలించి తగిన సిఫార్సులు చేసే అధికారం జీఓఎంకు ఉంది.
12. ఆరు వారాల్లోనే జీఓఎం తన సిఫార్సులను చేస్తుంది.

నోట్ తర్వాత...
"రాజ్యాంగంలోని మూడవ అధికరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అనుమతి అవసరం. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే చిరకాల డిమాండ్ నెరవేరుతుంది. కేంద్ర కేబినెట్ అనుమతి లభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు తగిన చట్టాన్ని రూపొందించాల్సిందిగా న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతారు. దీన్ని కేబినెట్ తిరిగి ఆమోదించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఆ ప్రాంత ప్రజల సమాన అభివృద్ధి లక్ష్యం నెరవేరుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో చేపట్టిన అన్ని అభివృద్ధి చర్యలకు సంబంధించి జవాబుదారీ విధానం మెరుగుపడుతుంది'' అని కేబినెట్ నోట్ అనుబంధంలో తెలిపారు. రెండో అనుబంధంలో జస్టిస్ బీఎన్ కృష్ణ కమిటీ చేసిన ఆరు సిఫార్సులను పేర్కొన్నారు. ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంది. ప్రజా ప్రతినిధులు, తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచికలు, వ్యవసాయం, ఇతర అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు.