25, మే 2011, బుధవారం

ఒక చిరునవ్వు చచ్చిపోయింది

(-ప్రియ మిత్రుడు, సహచరుడు దివాకర్ రెడ్డి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని స్మృతిలో)


ఉన్నట్టుండి అకస్మాత్తుగా అతను వెళ్లిపోయాడు..
చెట్టును వీడి గాలి,  కొండల వైపు.. ఆకాశం వైపు వెళ్లిపోయినట్టు
అతను కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ఎప్పటికీ ఇంకిపోదనుకున్న ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా జాడలేని లోకాలకు వెళ్లిపోయింది
73ఏళ్ల పాటు మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వు హఠాత్తుగా చచ్చిపోయింది

తొందరలు.. తొక్కిసలాటలు... మితిమీరిపోవటాలు
పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని
ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..
ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..
నీ దాకా వచ్చేసరికి చిన్న  పిచ్చి హేతువు చాలిందా ప్రాణం తీసుకోవటానికి

పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే
బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు
దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన
ఆవేదన నీకు మాత్రమే తెలుసు
అంచనాలు తలక్రిందులయినాయి

ఆ క్షణంలో ఏం జరిగింది
నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు
నువ్వు నిర్మించుకున్న కలల పరిధులను చేరుకోకముందే అచంచలంగా నిశ్చయించుకున్నావ్
మృత్యువు గుహలోకి నిన్ను నువ్వే తోసేసుకున్నావు
ఎందుకింత తొందర?

ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..
ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..
ఇంతమందిమి ఉన్నాం..
ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం
కళ్ల ముందే ఉదయాస్తమయాలు యథావిధిగా వెళ్లిపోతున్నాయి
నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది

ప్రియ మిత్రమా మమ్మల్ని సగం కత్తిరించేశావు
మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం
నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది
క్షణిక భావ  వలయాల్లో చిక్కుకుపోయి
జీవితాన్ని సరళ రేఖగా మలచుకోలేకపోయావు
ఎప్పటికప్పుడు ముడి మీద ముడి వేసుకుంటూ
కొంచెం కొంచెంగా బిగించుకుంటూ పోయావు

అందిందంతా  అఇష్టమైన చోట పంచుతూ
అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు
నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది
ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ
నువ్వు  నడిపిన జీవితం ఒక సమరం
ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.

14, మే 2011, శనివారం

రాబోయే ఎన్నికలకు ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌

కాంగ్రెస్ మళ్లీ ఫుల్లుగా చార్జింగ్‌లోకి వచ్చింది. రాష్ట్రంలో ఫలితాల మాటెలా ఉన్నా.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ  పార్టీగా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పెద్దగా లబ్ది పొందకపోయినా.. పరోక్షంగా మాత్రం కాంగ్రెస్‌కే  జాతీయ సమీకరణాల్లో మేలు జరిగే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.   
అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా కొత్త సమీకరణాలకు నాంది పలికాయి. బెంగాల్‌లో లెఫ్ట్ ఓటమి ప్రభావం సంకీర్ణ రాజకీయాల్లో కొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరించనున్నాయి. తొంభయ్యో దశకం చివరి నుంచి సంకీర్ణ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వామపక్షాలకు ఇప్పుడు ఉనికే లేకుండా పోయింది. వామపక్షాల నేతృత్వంలో గతంలో ఏర్పాటైన మూడో ఫ్రంట్‌లో భాగస్వాములైన పార్టీలన్నీ ఒక్కటొక్కటిగా అధికారం కోల్పోతూ వచ్చాయి. తెలుగుదేశం, జెడిఎస్, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, హెచ్‌ఎల్‌డి, అసోం గణపరిషత్ ఇలా ఒక్కొక్కటీ ప్రాభవాన్ని కోల్పోయినవే. అసలు ఫ్రంట్ ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించిన లెఫ్ట్ ఫ్రంట్ పరిస్థితీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలూ దేశంలో  బిజెపి వైపో.. కాంగ్రెస్ వైపో వెళ్లక తప్పని పరిస్థితి.. సమీప భవిష్యత్తులో మరో ఫ్రంట్ ఏర్పాటు ఇక కష్టమే.
బెంగాల్‌లో మమతా బెనర్జీ సొంతంగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పే అవకాశం కానీ, అవసరం కానీ ఆమెకు ఉండదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ సొంతంగా పోటీ చేసినా, ఫలితాల తరువాత యుపిఎకే మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది.
తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకెలు రెండూ అవకాశవాద పార్టీలే.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉంటే దానికి మద్దతిచ్చేసి మంత్రి పదవులు పుచ్చేసుకుంటాయి. డిఎంకెకు అధికారం పోవటంతో పాటు 2జి స్పెక్ట్రమ్ ఉచ్చు పూర్తిగా బిగుసుకుపోయింది. రాజా ఇప్పటికే జైల్లో ఉన్నారు. కణిమొజి జైలుకు వెళ్లబోతున్నారు. ఈ పరిస్థితుల్లో యుపిఎతో డిఎంకె దోస్తీ కొనసాగుతుందన్నది అనుమానమే. డిఎంకెకు లోక్‌సభలో 18 స్థానాలు ఉన్నాయి. డిఎంకె మద్దతు ఉపసంహరించినా అన్నాడిఎంకె ఆ లోటును తన తొమ్మిది సీట్లతో భర్తీ చేస్తుంది. మరో 22 సీట్లతో సమాజ్‌వాది పార్టీ యుపిఎకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు యుపిఏకు ఢోకా లేదు.
ఈ ఎన్నికల్లో  చెప్పుకోదగింది ఏమిటంటే అయిదు రాష్ట్రాల్లో కలిపి ఎనిమిది వందలకు పైగా స్థానాల్లో ఎన్నికలు జరిగితే, జాతీయ పార్టీగా భారతీయ జనతాపార్టీ గెలుచుకున్న సీట్లు కేవలం ఆరు. డబుల్ డిజిట్ కూడా దాటకపోవటం విశేషం. బెంగాల్‌లో 1, అసోంలో అయిదు మాత్రమే గెలుచుకుంది. దీని ఫ్యూచర్ ఏమిటన్నది రాబోయే మరి కొన్ని ఎన్నికలు నిరూపించాల్సిందే.
రానున్న మూడేళ్లలో 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఫలితాలు రాబోయే ఎన్నికలకు, ఫేస్ ఆఫ్ ఫ్యూచర్‌గా భావించవచ్చని నిపుణుల అభిప్రాయం. తమిళనాడులో సెంటిమెంట్‌తో పాటు అవినీతి, బంధుప్రీతిపై వ్యతిరేకత స్పష్టంగానే వ్యక్తమైంది. అసోంలో తరుణ్‌గొగోయ్ అభివృద్ధి మంత్రమే పనిచేసింది. బెంగాల్ చెప్పనే అక్కర్లేదు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు ఓ మహా సామ్రాజ్యాన్నే పెకిలించివేశాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. అన్ని రాష్ట్రాల్లో పాలక వర్గం ప్రజలకు ఎంతో కొంత అభివృద్ధిని కళ్లముందు చూపించటం తప్పనిసరి అని అర్థమవుతోంది. ప్రజల్లో చైతన్యాన్ని సరైన పద్ధతిలో అంంచనా వేసిన పార్టీకే పగ్గాలు లభిస్తాయని ఈ ఎన్నికలు స్పష్టంగా సంకేతాల్నిచ్చాయి.

కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి

ఎర్రకోట బద్దలైపోయింది. అరుణపతాకం చిన్నబోయింది. కమ్యూనిజానికి కేరాఫ్ అడ్రస్, పత్తా లేకుండా పోయింది. కరడుగట్టిన కొడవలిని రెండు గడ్డిపూలు కోసిపారేశాయి. మూడున్నర దశాబ్దాలు... దుర్భేద్యమైన ఓటుబ్యాంకు. పటిష్ఠమైన కేడర్ అంతా సోదిలోకి లేకుండా పోయింది. బెంగాల్‌లో తిరుగులేని అధికార ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన లెఫ్ట్ ప్రాభవం పూర్తిగా మసకబారిపోయింది.
కామ్రేడ్ జ్యోతిబసు ఒక్కో ఓటు ఇటుకను కూడగట్టి నిర్మించుకున్న మహా సామ్రాజ్యం.. అక్షరాలా 34 సంవత్సరాల పాటు పదిల పరచుకున్న  అధికారాన్ని బుద్దదేవ్ భట్టాచార్య ఎర్రజెండాలో పెట్టి మరీ మమతా దీదీకి అప్పగించేశారు. క్లీన్ స్వీప్... మూడింట రెండు వంతుల మెజారిటీ.. దారుణాతి దారుణంగా వామపక్ష కూటమి పరిస్థితి దిగజారిపోయింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇన్నాళ్లూ లెఫ్ట్‌ను అక్కున చేర్చుకున్న బెంగాలీలు ఒక్కసారిగా అధః పాతాళానికి తొక్కి పారేశారు.
ఇంతకాలంగా అంతా ఊహిస్తున్నదే.. సెఫాలజిస్టులు లెక్కలు వేసి తేల్చి చెప్పిందే... బెంగాల్‌లో అధికార మార్పిడి జరుగుతుందని.. కానీ, ఇప్పటికీ అందరిలోనూ నమ్మకం లేనితనం.. లెఫ్ట్‌ఫ్రంట్ బెంగాల్‌లో ఓటమి పాలవటమా? అసలు జీర్ణించుకోగల వార్తేనా? అర్థం కాని విషయం..

కమ్యూనిజం.. దేశంలో మరెక్కడా కనిపించనంత బలంగా ఉన్నది బెంగాల్‌లోనే.. ప్రతి ఊళ్లో.. ప్రతి ఇంట్లో.. ప్రతి చోటా కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతం బెంగాల్.. అలాంటి కరడు గట్టిన కమ్యూనిస్టు వ్యవస్థను ఒక్క మహిళ.. ఇంకా చెప్పాలంటే అబల.. ముందూ, వెనుకా ఎలాంటి అంగబలం, అర్థబలం, రాజకీయ బలం లేని మహిళ.. చిన్నపాటి ఇరుకు ఇంటిలో ఉంటూ.. సీదాసాదాగా జీవించే మహిళ కూకటి వేళ్లతో పెకిలించి వేయటం ఇప్పటికీ కలగానే కనిపిస్తుంది.
ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్నట్లు రాజకీయ వారసత్వం లేదు. మాయావతికి ఉన్నట్లు రాజకీయ గురువు లేరు. జయలలితకు ఉన్నట్లు అండదండలిచ్చిన కొలీగ్‌లు లేరు. సోనియా మాదిరిగా వంశపారంపర్యత లేదు. ఆమె ఒక్కరు. పది ఫైర్‌బ్రాండ్‌ల పెట్టుగా మారి పెట్టని కోటను పటాపంచలు చేసేశారు.
తిరుగుబాట్లు, కార్మిక ఉద్యమాల ద్వారా 1977లో భారీ మెజార్టీతో బెంగాల్‌ను చేజిక్కించుకున్న లెఫ్ట్, పటిష్ఠమైన కోటనే కట్టుకుంది. 1979లో  బెంగాల్‌లో 4వేల మంది ఊచకోత జరిగినప్పుడు కానీ, ఆ తరువాత  ఎమర్జెన్సీ లాంటి రకరకాల ఉద్యమాలు వచ్చినప్పుడు కానీ, దేశంలో రాజకీయ సమీకరణాలు పెద్ద ఎత్తున మార్పులు జరిగినప్పుడు కానీ లెఫ్ట్ కోట చెక్కు చెదరలేదు. కానీ, జ్యోతిబసు రిటైర్ కావటంతోనే  అంతటి కోటా బీటలు వారటం మొదలు పెట్టింది. ఆర్థిక సంస్కరణలు, నందిగ్రామ్‌లు, సింగూరులు లెఫ్ట్‌ఫ్రంట్ పునాదుల్ని అమాంతంగా తొలగించివేశాయి.
2009 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోనే బెంగాల్‌లో లెఫ్ట్ సర్కారు వెంటిలేటర్‌పై నడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా దీదీ సంపూర్ణంగా.. సజీవంగా సమాధి చేసేశారు.
ఇప్పుడు లెఫ్ట్ పరిస్థితి దేశంలోనే అగమ్యగోచరంగా మారింది. ఇన్నాళ్లూ బెంగాల్‌ను చూసుకుని మురిసిపోయిన లెఫ్ట్‌కు ఇప్పుడు చెప్పుకోవటానికీ, చూపించుకోవటానికీ ఏమీ లేకుండా పోయింది. ఇంతకాలం ఉన్నది మూడు రాష్ట్రాలు.. అందులో బెంగాలు.. కేరళ రెంటిలోనూ లెఫ్ట్ అవుటయిపోయింది. త్రిపుర చిన్న రాష్ట్రం. జాతీయ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒకటే.. ఇక జాతీయ రాజకీయాల్లో ఎర్రజెండా పరిస్థితి ఏమిటి?

2, మే 2011, సోమవారం

పండిన పాక్‌ పాపం...ఇవాళ ఒసామా...రేపు దావూద్‌..

పండిన పాక్‌ పాపం...
మరోసారి వెల్లడైన పాక్‌ నిజస్వరూపం...
ఒసామాను దాచిన పాకిస్తాన్‌...
ఒసామా అంశంలో పాక్‌ జవాబేంటి...?

పాకిస్తాన్‌ పాపం పండింది... ఉగ్రవాదానికి తాను పుట్టిల్లేననే విషయాన్ని ... ఒసామా బిన్‌పై నాటో దళాల దాడి మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది.  ముంబైలో మారణహోమం సృష్టించిన అజ్మల్‌ కసబ్‌ స్వస్థలం పాకిస్తానేనని ఆధారాలతో సహా చూపించినా... తమకు సంబంధం లేదంటూ పాక్‌ సర్కారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. దావూద్‌ ఇబ్రహీం సహా... భారత్‌కు కావాల్సిన మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టులు ఇరవై మంది దాకా ... పాక్‌లోని ముఖ్యపట్టణాల్లో దర్జాగా సెటిల్‌  అయ్యరని చెప్పినా.... పాక్‌ నిర్లజ్జగా వ్యవహరిస్తూ వచ్చింది.... అయితేనేం.... పాక్‌ బండారాన్ని బట్టబయలు చేసే రోజు రానే వచ్చింది... ఉగ్రవాద మూలాలన్నీ పాకిస్తాన్‌లోనే ఉన్నాయని... వాటికి అడుగడుగునా పాక్‌ అండదండలున్నాయన్న విషయం.. ఒసామా ఎన్‌కౌంటర్‌తో తేలిపోయింది.
- ఒసామా తమ దగ్గర ఉన్న విషయం పాకిస్తాన్‌కు తెలియకుంటే... దాడి విషయాన్ని అమెరికా పాక్‌కు ఎందుకు చెప్పలేదు...?
 పాకిస్తాన్‌ను మాటమాత్రం సంప్రదించకుండా... ఇస్లామాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అగ్రరాజ్యం స్వతంత్రంగా ఎందుకు దాడి చేసింది....?
అదే పాకిస్తాన్‌ మీద నమ్మకం ఉండి ఉంటే... పాక్‌ సైన్యం సహకారంతోనే ఈ పని చేసి ఉండేవాళ్లు కదా...?
- ఇంకా ముఖ్యమైన ప్రశ్న... నేవీ అధికారుల ఇళ్ల మధ్యే 18 అడుగుల ప్రహారీ ఉన్న ఓ స్పెషల్‌ హౌజ్‌ ఉంటే... ఆ ఇల్లెవరిదో వాళ్లు ఎందుకు కనిపెట్టలేదు...?
అంటే... చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు... ఉగ్రవాదుల స్వర్గధామమైన పాకిస్తాన్‌లోనే ....అదికూడా పాక్‌ పాలకుల నివాసాలకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో... అంతర్జాతీయ ఉగ్రవాద నేత రెండేళ్లుగా ఎంజాయ్‌ చేస్తున్నాడు... ఆ విషయాన్ని అమెరికా కనిపెడితే కానీ తెలియని స్థితిలో పాక్‌ ఉన్నదంటే నమ్మేదెవరు...? ఇవాళ ఒసామా...రేపు దావూద్‌... ఇంకోరోజు.. ఇంకో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌... ఏదైనా అమెరికాకు టైం రావాలి... ప్రపంచానికే పెద్దన్న కాబట్టి... అమెరికా ఆఫ్ఘన్‌ను నాశనం చేయగలదు... ఇరాక్‌ను సర్వనాశనం చేసి సద్దాంనూ చంపగలదు... ఇప్పుడు ఒసామాను ఎన్‌కౌంటర్‌ చేయగలదు... మరి మనమేం చేయాలి....? ఏం చేయగలం...? దావూద్‌ సహా... టెర్రరిస్టులంతా ఎక్కడున్నారో తెలిసినా... పాక్‌ పాలకులతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌లు చూడాలా...? ఆ దేశానికి ఈ దేశానికీ బస్సులు,రైళ్లు నడపాలా...? ముంబైలాంటి ఎటాక్స్‌ జరిగినప్పుడు.... ఆవేశపడి..ఆ తర్వాత సమ్‌ఝౌతా కోసం ట్రై చేస్తూనే ఉండాలా...? దురదృష్టమేంటంటే... ఆ విషయం కూడా మళ్లీ మనకు ఏ ఒబామానో చెప్పాల్సిందే...ఎందుకంటే మేరా భారత్‌ మహాన్‌.