3, ఫిబ్రవరి 2013, ఆదివారం

తెలంగాణాను మరో కాశ్మీరంగా మార్చబోతున్నారా?

తెలంగాణాను మరో కాశ్మీరంగా మార్చబోతున్నారా? కాంగ్రెస్ వ్యూహం ఇదేనా? జరుగుతున్న పరిణామాలు వీటినే సూచిస్తున్నాయి. కాశ్మీర్ ను సంపూర్ణంగా పరిష్కరించకుండా నాడు నెహ్రూ వ్యవహరించిన తీరునే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సీమాంధ్ర పెట్టుబడి దారుల ప్రాబల్యాన్ని దాటి, వారు గీసిన గీటును దాటి కాంగ్రెస్ అధిష్ఠానం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయి. కావూరి లాంటి పెత్తందారుల సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూటనీతి ఒక పథకం ప్రకారం పరాకాష్టకు చేరుకుంది..
‘ అఖిల పక్ష సమావేశానికి ఎన్నడూ తెలంగాణ ఊసెత్తని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని ప్రతినిధిగా ఎంపిక చేయటం తొలి అడుగు. ఆ తరువాత సురేశ్ రెడ్డి తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడిన మాటల్నే కాంగ్రెస్ అభిప్రాయంగా తీసుకుంటామని హోం మంత్రి షిండే ప్రకటించారు. నెల రోజుల్లో తెలంగాణ తేల్చుతామని షిండే ప్రకటన కూడా వ్యూహంలో భాగమే. నెల రోజుల్లో సీమాంథ్రులతో పక్కా ప్రణాళిక ప్రకారం హడావిడి చేయించారు. దీనికి నాయకత్వం వహించింది కెవిపి రామచంద్రరావు. రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. ఆయన ఆత్మ ఈ కెవిపి. ప్రస్తుతం కాంగ్రెస్ లో రాక్షస మంత్రిగా వ్యవహరిస్తున్న వాడు ఇతను. ఇతని మార్గదర్శకత్వంలోనే ఎస్ఏ నడుస్తోంది.
ఈ నెల రోజుల వ్యవధిలోనే తమ ప్రణాళికను ఒక కొలిక్కి తెద్దామనుకున్నా అనుకున్న లక్ష్యాన్ని చేరువ కావటానికి మరింత సమయం అవసరమైంది. అందుకే మరోసారి చర్చల ప్రక్రియను రంగం మీదకు నాలుగో కృష్ణుడి టైప్ లో సీన్ మీదకు తెచ్చారు.
ఇక ఆ రోజు నుంచి చాలా చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. మొదట టి..ఎంపిలు రాజీనామా డ్రామా ఎప్పటిలాగే చేసేశారు. ఆ మర్నాడు పిసి చాకో తెలంగాణాకు కాంగ్రెస్ అనుకూలమని భ్రమించేలా చిత్రవిచిత్రమైన పదజాలంతో ఓ ప్రకటన చేశారు. అంతకు ముందే బిఎస్పి నాయకురాలు మాయావతి తెలంగాణా ఇవ్వాలని పనిగట్టుకుని ప్రెస్ సమావేశం పెట్టి మరీ చెప్పారు. కేవలం తెలంగాణ గురించి యుపిలో ఉన్న మాయావతి ఉన్నట్టుండి ఎందుకు ప్రకటించారు? అంతకు ముందే యుపి విభజనకు ఆమె అసెంబ్లీలో తీర్మానం చేసి ఉన్నారు.  ఆ తరువాత శరద్ పవార్ జై తెలంగాణా అన్నారు. ఎన్నడూ విదర్భకు అనుకూలంగా మాట్లాడని పవార్ ఇప్పుడు జై విదర్భ అన్నారు. అదే రోజు గూర్ఖాలాండ్ నేతలు తెలంగాణా ఇస్తే మేమూ రాష్ట్రం అడుగుతామన్నారు. మర్నాడు అజిత్ సింగ్ తెలంగాణాకు అనుకూలంగా మరోసారి స్పష్టంగా ప్రకటన చేశారు.
చాకో ప్రకటనను కాంగ్రెస్ వైఖరి అన్నట్టుగా వాయిలార్ రవి నర్మగర్భంగా అన్నారు. ఇవన్నీ చూసి అమాయక తెలంగాణా వాదులు సంబరపడిపోతున్నారు. తెలంగాణ ఇవ్వటానికి కాంగ్రెస్ డెసిషన్ తీసేసుకుందని భ్రమ పడుతున్నారు. ఒక్కటి గుర్తుంచుకోవాలి. చిన్నసంకేతం వస్తేనే సీమాంధ్ర వాదులు నలువైపుల నుంచి అతి భయంకరమైన దాడులు చేస్తారు. ఇప్పుడు మౌనంగా ఉన్నారంటేనే ఏదో జరుగుతోందని అనుమానించాలి. ఆ అనుమానానికి బీజమే రెండుమూడు రోజులుగా వస్తున్న ప్రకటనలు. ఈ ప్రకటనలు చేస్తున్న వారంతా  ఎప్పుడో కొద్దిగానో గొప్పగానో చిన్న రాష్ర్టాల గురించి డిమాండ్ ఉన్న ప్రాంతాల నేతలే. మిగతా వారు మాట్లాడటం లేదు. తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు మాయావతి యుపి గురించి, పవార్ విదర్భ గురించి ప్రస్తావించారు. మమత అధికారంలోకి వచ్చిన తరువాత ప్యాకేజీతో సరిపెట్టుకుని ఇక రాష్ట్రం డిమాండ్ చేయబోమని లిఖిత పూర్వకంగా స్పష్టం చేసిన గూర్ఖాలాండ్ వాళ్లు మళ్లీ రాష్ట్రం పల్లవి ఎత్తుకున్నారు. అజిత్ సింగ్ సరే సరి.
అంటే కావూరి మొదట్నుంచీ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసే దిశలో కాంగ్రెస్ స్వయంగా పావులు కదుపుతోందా? దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రాష్ట్రాల డిమాండ్ల తేనె తుట్టెను కాంగ్రెస్సే కదుపుతోందా అన్న అనుమానం బలపడుతోంది. వీరందరితో తానే డిమాండ్లు చేయించి తెలంగాణను పెనం నుంచి పొయ్యి లోకి పడేయబోతోందా? దేశమంతటా చిన్న రాష్ట్రాల డిమాండ్లు పెరిగితే వాటిని బూచిగా చూపించి రెండో ఎస్సార్సీని వేస్తామని చెప్పేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదా కాంగ్రెస్? ఇదే జరిగితే తెలంగాణా ఎన్నటికీ రాదు. తెలంగాణ వాదులు అమాయకంగా దీక్షలు చేసుకుంటూ కూర్చుంటే.. ప్రసంగాలు చేసుకుంటూ పోతే సీమాంధ్ర లాబీయింగ్ ముందు ఎందుకూ కొరగావు. ఓ పక్క తెలంగాణ వాళ్లు పిచ్చుకలని తెలిసినా సీమాంధ్రులు బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. మాయాబజార్ లో శకుని లింగమూర్తి అన్నట్లు తెలంగాణ వాళ్లది కొంచెం తెలివి అయితే సీమాంధ్రులది ఎక్కువ తెలివి. దాన్ని ఎదుర్కోవటం అంత తేలికైన పని కాదు. కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే తెలంగాణా రావణ కాష్టంగా మారటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ వైషమ్యాలతో సర్వనాశనం కావటాన్నీ చూడాల్సి రావచ్చు. తెలంగాణ వాదులు అప్రమత్తంగా లేకపోతే తోడేళ్ల దాడిని తట్టుకోవటం సాధ్యం కాదు.