30, ఏప్రిల్ 2009, గురువారం

బీసీ సీఎం అయ్యే సమయం వచ్చిందా?

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఈ ఎన్నికలతో వేగంగా మారుతోంది. ప్రజారాజ్యం ప్రారంభించిన సామాజిక న్యాయం అన్న నినాదం వేగంగా అన్ని పార్టీలకూ అంటుకుంది... ఆచరణలో ఏ విధంగా వ్యవహరించినా, అన్ని పార్టీలూ సామాజిక న్యాయాన్ని ఎన్నికలయ్యేంతవరకూ పాడుతూ వచ్చాయి....ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో ఇక అధికారం ఎవరిదన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. మొదటిసారిగా రాష్ర్టంలో ముక్కోణపుపోటీ జరగటంతో హంగ్‌ ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అధికార కేంద్ర స్థానమైన ముఖ్యమంత్రి పీఠంపై ఆధిపత్యం కోసం అన్ని పార్టీల్లో థింక్‌ట్యాంక్‌లు తెగ వూ్యహాలు రచించేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఈ గుబులు ఎక్కువైంది. పొత్తు అనివార్యమైతే పిఆర్‌పితో జతకట్టి అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. ఇందులోనుంచే బిసిని సిఎం చేయాలన్న కొత్త వాదన ప్రారంభమైంది. కెకె, విహెచ్‌, డిఎస్‌, పొన్నాల లక్ష్మయ్య వంటి వారి పేర్లూ లీకయ్యాయి... కాంగ్రెస్‌ నేతలు పిఆర్‌పితో మంతనాలూ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ముగ్గురు సీనియర్‌ నేతలు పిఆర్‌పి అధిష్ఠానంతో చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి..వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క బిసి నేత కూడా ముఖ్యమంత్రి పీఠం ఎక్కలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బిసి నేత అధికార పీఠానికి చేరువయ్యే సమయం ఆసన్నమైందా? రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ ఇది... అయితే ఆ `ముగ్గురూ' (వైఎస్‌, బాబు, చిరంజీవి) బిసిని ముఖ్యమంత్రి చేసి తాము పక్కకు తప్పుకోవటానికి ఒప్పుకుంటారా? కనీసం ఉప ముఖ్యమంత్రి పదవినైనా ఇవ్వటానికి పార్టీలు సుముఖంగా ఉన్నాయా?ఒక్కసారి గతంలో ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన కులాల వివరాలు చూద్దాం...
*రాష్ట్రంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కని బిసి...

బ్రాహ్మణులు 5సంవత్సరాలు

కమ్మ వారు 16సంవత్సరాలు

రెడ్డి 32 సంవత్సరాలు

వెలమ నాలుగు సంవత్సరాల 3 నెలలు

2 సంవత్సరాలు రాషా్టన్రికి అగ్రకులస్థులు కాకుండా ఇతర కులాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన సందర్భం... దామోదరం సంజీవయ్య (మాల)1-11-1960 నుంచి 1-03-1962 వరకు ఉన్నారు...
ప్రస్తుత ఎన్నికల్లో బిసిలు గెలిచే అవకాశాలు 50, 60 కంటే ఎక్కువ లేవు.. వీరంతా పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారా? రాజ్యాధికారం దిశగా పావులు కదుపుతారా అంటే అనుమానమే?
* రాష్ట్రంలో బిసిలు, ఇతర కులాల వాళు్ల పోటీలో ఉన్న స్థానాలు ఇలా ఉన్నాయి

ఒకస్థానంలో మూడు పార్టీల నుంచి బిసిలే రంగంలో ఉన్న స్థానాలు...18

ఒక స్థానంలో ఇద్దరు బిసిలు పోటీలో ఉన్నవి...50

ఒక్క బిసి రంగంలో ఉన్న స్థానాలు... 68

ఒకస్థానంలో మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న రెడ్డి కులస్థులు17

ఒకస్థానంలో ఇద్దరు రెడ్డి కులస్థులు పోటీలో ఉన్నవి47
ఒక చోట ఒకరే రెడ్డి పోటీ చేస్తున్న స్థానాలు55
ఒక స్థానంలో ముగ్గురు కమ్మ కులస్థులు పోటీ చేస్తున్నవి6
ఒక స్థానంలో ఇద్దరు కమ్మకులస్థులు పోటీలో ఉన్నవి7
ఒక స్థానంలో ఒకే ఒక కమ్మకులస్థులు పోటీలో ఉన్నవి 39
మే 16న ఫలితాలు తేలాక ప్రారంభమయ్యే హైడ్రామాయే ఎవరు సిఎం అన్నది తేల్చాలి...

22, ఏప్రిల్ 2009, బుధవారం

ప్రభాకరన్‌ క్షమాభిక్షకు శ్రీలంక నో

ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌కు క్షమాభిక్ష ప్రకటించే ప్రసక్తే లేదని శ్రీలంక స్పష్టం చేసింది. అయితే ప్రభాకరన్‌ను పట్టుకునే విషయంలో తాము అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్టీటీఈ చెరలో ఉన్న పౌరులను విడిపించేందుకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని  శ్రీలంక మిలిటరీ అధికార ప్రతినిధి ఉదయ నానక్కర తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వస్తున్న తమిళులకు తాము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఎల్‌టీటీఈ వద్ద బందీగా అనేక మంది పౌరులు ఉన్నారని వారిని సురక్షితంగా విడిపించేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని ఉదయ నానక్కర స్పష్టం చేశారు.

21, ఏప్రిల్ 2009, మంగళవారం

స్వచ్ఛమైన తేనెను తెలుసుకోవడం ఎలా?


** గాజు గ్లాసులో నీటిని నింపి ఒక చుక్క తేనెను అందులో వేయండి. అలా వేస్తే అది సరాసరి నేరుగా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే అది శుద్ధమైన తేనె. 
** ఒక చుక్క తేనెను ఏదైనా కొయ్య లేక ప్లేట్‌లో వేసి దానికి నిప్పు పెట్టండి. అది త్వరాగా మండుకుంటే శుద్ధమైన తేనె. కాస్త నిదానంగా మండుకుంటే అది నకిలీదిని తెలుసుకోవాలి. 
** శుద్ధమైన తేనె సువాసనతో కూడుకునివుంటుంది. చలికాలంలో గడ్డలాగా పేరుకుపోతుంది. ఎండాకాలంలో కరిగిపోతుంది. శుద్ధమైన తేనె ఏదైనా ప్లేట్‌లో వేస్తే పాములాగా జరజరా పాకుతుంది. 
శుద్ధమైన తేనెలో ఈగ కాళ్ళు చిగులుకోదు. దీనిని కళ్ళపై వుంచితే కాస్త మంటపుడుతుంది. కాసేపైనతర్వాత చల్లగావుంటుంది. 
ఎలా సేవించాలి.. 
శుద్ధమైన తేనెను వేడి చేసి వేడి పదార్థాలతో తీసుకోకూడదు. వేడిగానున్న పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని తలపెడుతుందని వైద్యనిపుణులు తెలిపారు. చల్లటి పాలు, చల్లని నీటితో కలిపి తీసుకోవచ్చు. అలాగే తేనె నెయ్యి కలిపి తీసుకోకూడదు. నెయ్యి 1/4 వవంతు ఉంటే దీనికి నాలుగురెట్లు నీరుండాలి. 
** సాధారణంగా తేనె అలాగే తీసుకుంటుంటారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఇంకా కలకండ, బెల్లం, చక్కెర, నూనె, నెయ్యి, చేపలు, గ్రుడ్డు, మాంసంతోబాటు వేడి చేసే మందులు, వేడి పదార్థాలు, వేడి నీటితో కలిపి తీసుకోకూడదు. 
చక్కెర కలపని పాలలో తేనె కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగి కాంతివంతంగా తయారవుతుంది. తేనెను పండ్లు, పండ్ల రసం, పాలు లేదా బాదం పప్పులతోబాటు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. 
** అల్లంనుంచి తీసిన రసంతోబాటు తేనెను కలిపి తీసుకుంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. 
** ఉల్లిపాయ రసంతోబాటు తేనె కలిపి తీసుకుంటే ఊపిరి తిత్తులు, గొంతులో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఇంకా ఎక్కిళ్ళు కూడా తొలగిపోతాయంటున్నారు వైద్యులు.

ఎల్టీటీఈపై ప్లేటు ఫిరాయించిన కరుణానిధి

ఎల్‌టీటీఈపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ప్లేటు ఫిరాయించారు. ఎల్‌టీటీఈ తీవ్రవాద సంస్థ కాదని తాను అనలేదని ఇవాళ వివరణ ఇచ్చారు. ఎల్‌టీటీఈ తన మిత్రుడని కాబట్టి అతను తీవ్రవాది కాదని నిన్న కరుణానిధి అన్న మాటలు తీవ్ర దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో కరుణానిధి ఇవాళ వివరణ ఇచ్చారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన ఎల్‌టీటీఈని తాను తీవ్రవాద సంస్థ కాదని ఎలా అంటానని ఎదురు ప్రశ్నించారు. శ్రీపెరుంబదూరు సంఘటనను ఎలా మర్చిపోతామని అన్నారు. తాను శ్రీలంక తమిళల పరిస్థితులపై మాత్రమే ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు. ఎల్‌టీటీఈ తీవ్రవాద సంస్థగా ప్రారంభం కాలేదని కాలక్రమేణా అది తీవ్రవాద సంస్థగా మారిందని కరుణానిధి అన్నారు.

భారీ ఏర్పాట్లు

రెండో విడత ఎన్నికల పర్యవేక్షణకు 24మంది సీనియర్‌ ఐఏఎస్‌లను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవి.సుబ్బారావు తెలిపారు. ఈ రోజు ఎలాంటి ఎన్నికల సందేశాలను పంపించరాదని తెలిపిన ఈసీ, పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు 34 కోట్ల 11లక్షలు దొరికినట్లు తెలిపారు. నగదు బదిలీ పథకంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఈ పథకంపై రేపు సాయంత్రం ఐదు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఐవి సుబ్బారావు ఆదేశించారు.

మలివిడత ప్రచారానికి తెర...

దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో కూడా 20 లోక్ సభ, 140 అసెంబ్లీ స్థానాలకు ఎల్లుండి జరిగే ఎన్నికలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు హోరాహోరీగా నేతలు ప్రచారం చేశారు. మరోవైపు.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బలగాలను మోహరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అదనపు భద్రతను పెంచారు. ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధులు వైఎస్, చంద్రబాబు, చిరంజీవి ఈ దఫా పోలింగ్‌లో ఉన్నారు. అనేక మంది మంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ పై లాలూ మరో బాంబు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి బాంబు పేల్చారు. నిన్నటి వరకు యూపీఏ ప్రధాని అభ్యర్ధి మన్మోహన్ సింగే అన్న ఆయన.. ఇవాళ మాట మార్చారు. ఎన్నికల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రధాని అభ్యర్ధిని నిర్ణయిస్తామన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఒక్కటే పార్టీ కాదని, చాలా పార్టీలున్నాయని అందరి అభిప్రాయాల ప్రకారమే ప్రధానిని ఎన్నుకుంటామని లాలూ అన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కొంత మంది కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు లాలూ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. లాలూ ఒక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేయలేడన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.

19, ఏప్రిల్ 2009, ఆదివారం

బాబోయ్‌ ఎండలు

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేడి తాకిడికి ప్రజలు అల్లాడి పోతున్నారు. హిమాలయాల్లో మినహా మరెక్కడా తలదాచుకోని పరిస్థితి తలెత్తింది. అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రీష్మతాపాన్ని తట్టుకోవటానికి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి వస్తున్నది. భానుడి ప్రతాపానికి భారత దేశం తట్టుకోలేకపోతోంది. ఎక్కడ చూసినా వేడిగాలులు వీస్తుండటంతో రోడ్లపై జనసంచారమే లేకుండాపోయింది. పురూలియాలో అత్యధికంగా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాలుగు రోజులుగా ఇదే తీవ్రత కొనసాగుతోంది. ఇదే సమయంలో మంచి నీటి కొరత స్థానికులను ఇంకా ఇక్కట్ల పాల్జేస్తోంది. ఓ పక్క ఎన్నికల హడావుడి.. మరో పక్క సమ్మర్‌ ప్రజలు, నాయకులు నానా అగచాట్లు పడుతున్నారు... దేశ రాజధాని ఢిల్లీలో ఘోరంగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఆరేళ్ల రికార్డును బద్దలు కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే నలభై అయిదు డిగ్రీలకు ఇక్కడి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీనికి తోడు ఎనిమిది గంటల విద్యుత్తు కోత, మంచినీటి సమస్య ప్రజలను ఇంకా వేధిస్తోంది. పక్కనే ఉన్న రాజస్థాన్‌ నుంచి వేడిగాలులు బలంగా వీస్తుండటం వల్లనే ఢిల్లీ మండుతోందని వాతావరణ వేత్తలంటున్నారు. ఇక రాజస్థాన్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. పింక్‌సిటీ జైపూర్‌ మరీ ఎరబ్రారింది. బికనీర్‌, శ్రీగంగానగర్‌లలోనూ గ్రీష్మతాపం భరించలేనిదిగా తయారైంది. పాఠశాలలను మార్నింగ్‌షిఫ్‌‌టలలోనే నడపాలని అధికారులు ఆదేశించారు. సముద్ర తీరంలోని ఒరిస్సాలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. ఇక మన రాష్ట్రంలో అయితే వేడి గురించి చెప్పనే అక్కర్లేదు. మధ్యాహ్నం రెండు గంటలకు డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు సైతం ఉదయం పది గంటల లోపే ఆఫీసులకు చేరిపోతున్నారు. ఉదయం ఏడుగంటలకే వేడి గాలులు జనాన్ని అల్లాడిస్తున్నాయి. పదకొండు గంటల తరువాత జనం రోడ్లపై కనిపించటమే లేదు.. తెలంగాణ జిల్లాలు వడగాలులతో అల్లాడిపోతున్నాయి. అటు రాయలసీమ కూడా ఇందుకు మినహాయింపు కాదు.. సీమలోని నాలుగు జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా రెండోదశ ఎన్నికలు జరగాల్సి ఉంది.. సూర్యుని వేడికి ఎన్నికల ప్రచార వేడి కూడా తోడై మరింత గ్రీష్మతాపాన్ని కలిగిస్తున్నది.

జీ 24 గంటలు

జీ న్యూస్‌ సరికొత్త ఇమేజిని సంతరించుకుంది. పదహారు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత 36చానళ్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న జీ నెట్‌వర్‌‌క తన న్యూస్‌ చానల్‌ను ఒక సరికొత్త రూపంలో, సరికొత్త ఆలోచనలతో వార్తలను వార్తలుగా ప్రజల ముందుంచడానికి అత్యాధునిక హంగులతో ముందుకు పోతోంది. జాతీయ స్థాయిలో హిందీ వార్తా ప్రసారాలతో పాటు ఒక్కో ప్రాంతీయ భాషలో ఒక్కో న్యూస్‌ చానల్‌ను ప్రారంభిస్తూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జీ 24 గంటలు తెలుగు న్యూస్‌ చానల్‌ దాదాపు నెల రోజుల క్రితం ప్రారంభమైంది. వక్రీకరణకు తావు లేకుండా, వార్తల్లోని సీరియస్‌నెస్‌ను, ప్రాధాన్యాన్ని ఎంతమాత్రం తగ్గించకుండా ఫోకస్‌ చేస్తుంది. వక్రీకరణలకు తావులేకుండా, వార్తల్లోని వాస్తవాలపై ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించటమే కొత్త నినాదంగా జీ 24గంటలు ముందుకు వెళు్తన్నది. జరా సోచియే..జీ న్యూస్‌ నినాదం అయితే.. నిజం నిప్పులాంటిది.. జీ 24 గంటలు నినాదం.. జరా సోచియే.. అవును ఒకసారి ఆలోచించండి.. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఆలోచన సమాజంలో వెలుగుల్ని నింపితే.. ఒక ఆలోచన చీకటి మార్గంలో పయనింపజేస్తుంది. ఆలోచనకు రూపం ఉండకపోవచ్చు.. కానీ, ఆ ఆలోచన అనేక రూపాలను కల్పన చేస్తుంది. నిర్మిస్తుంది. మార్గదర్శకమవుతుంది. మనుషుల్లో మార్పునకు నాంది పలుకుతుంది. ఈ లక్ష్యంతోనే జీన్యూస్‌ జరా సోచియే నినాదంతో „ముందుకు పోతోంది. జీ 24 గంటలు వార్తల్ని నిప్పుల్లా చూస్తోంది. అవును వార్తలు నిప్పుల్లాంటివే... వార్తల్లో వాస్తవాల్ని వక్రభాష్యానికి తావు లేకుండా ప్రజల ముందుంచటమే ఈ చానల్‌ లక్ష్యం.. ఒక నిప్పు కణిక వెలుగులను నింపుతుంది... అదే సమయంలో అలసత్వంగా ఉంటే బూడిదనూ మిగులుస్తుంది... ఒక నిప్పుకణిక బంగారానికి ఆభరణంగా మలిస్తే.. మరో నిప్పు కణిక ఇనుమునైనా వంచేస్తుంది. వార్తలు అలాంటివే.. వార్తల్ని వక్రీకరించకుండా ఉంటే అవి సమాజానికి మేలు చేస్తాయి.. అడ్డగోలు భాష్యం చెప్తే అవి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి... వక్రీకరణలకు ఆలవాలంగా మారిన మీడియా ప్రపంచంలో వార్తల్ని వార్తలుగా ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా జీ 24 గంటలు ముందడుగు వేస్తోంది.మీడియా ప్రసారం చేసే ప్రతి వార్త గురించి ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. ప్రేక్షకుల ఆలోచనను తక్కువ అంచనా వేయరాదు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండటం, వారికి మార్గదర్శకం కావటం మీడియా లక్ష్యం కావాలి. ప్రజలకోసం, ప్రజల పక్షంలో వార్తల ప్రసారాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఆసక్తికరంగా అందించేందుకు జీ 24 గంటలు ప్రయత్నిస్తోంది.

7, ఏప్రిల్ 2009, మంగళవారం

వీళ్లేనా యువనేతలు?

మన ప్రజాస్వామ్యం రాజరికానికి భిన్నం కాదు... కాళు్ల, కళు్ల సహకరించకపోయినా సరే మంత్రి పదవులను అనుభవించాలనే దుగ్ధ లేని నేతలు భారత దేశంలో కనిపించరు. దేశానికి యువతదే ప్రధాన శక్తి అంటూ వివేకానందుడు చెప్పాడని.. యువకులు రాజకీయాల్లో ముందుండాలని వేదికలపై ఉపన్యాసాలు దంచే లీడర్లకు మన దగ్గర కొదవే లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో పాత నీరు పోయి కొత్త నీరు ప్రవేశిస్తోందని భుజాలు చరుచుకుంటున్నాయి.. తొలి లోక్‌సభలో అభ్యర్థుల కనీస వయస్సు 42 సంవత్సరాలైతే.. 14వ లోక్‌సభలో సభ్యుల కనీస వయస్సు 26 సంవత్సరాలంటూ లెక్కలు గొప్పగా చెప్తారు.. కానీ వాస్తవం ఏమిటి? లోక్‌సభలో కొద్దో గొప్పో ప్రవేశిస్తున్న యువత అంతా వారసత్వంగా రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించిన వారే.. గాడ్‌ ఫాదర్‌లు లేకుండా స్వతహాగా రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల గుమ్మం తొక్కిన యువత శాతం ఎంత అని ప్రశ్నిస్తే... జవాబు సున్నాయే.... ``భారత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో పాత నీరు పోయి కొత్త నీరు ప్రవేశిస్తోంది. వేగంగా, చురుకుగా, సమర్థంగా వ్యవహరించే నాయకుల తరం అన్ని పార్టీల్లో ఎదుగుతోంది.'' ఇదంతా ఓ ట్రాష్‌...స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాల అనారోగ్యంతో, వృద్ధాప్యంతో, అంపశయ్యపై నుంచి కూడా రాజకీయాలు చేసే నాయకత్వం చేష్టలుడిగే దాకా యువతరానికి రాజకీయ అవకాశాలు రానే రానప్పుడు రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యేదెప్పుడు? దేశ పునర్నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాల్సిన యువతరం రాజకీయం అంటేనే అసహ్యం వేసే పరిస్థితి కలిగింది. ఎన్నికల వ్యవస్థ పైనే విశ్వాసం కోల్పోయిన వాతావరణంలో నేటి యువత ఉంది. డిగ్రీలు పూర్తయిన తరువాత కేవలం ప్రభుత్వోద్యోగాల కోసమో, విదేశాలకు వెళ్లడమో, లేక ఇతర రంగాలనే వృత్తిగా స్వీకరించే యువత, రాజకీయాలనూ ప్రొఫెషనల్‌గా తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? ఆసక్తి చూపుతున్నా కొద్దిమందికైనా పార్టీలు పూర్తిగా తలుపులు తెరవడం లేదు. యువతపై నమ్మకముందంటూనే వారికి టికెట్లు కేటాయించడంలో వెనకాడుతున్నాయి. యువ నాయకులు తమ వయస్సున్న ఓటర్లను విశేషంగా ఆకర్శిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీల్లో ప్రవేశించే సినిమా తారల కంటే కూడా అప్పుడే డిగ్రీలు పుచ్చుకుని కళాశాలల నుంచి బయటకు వచ్చిన యువతీ యువకుల ప్రవేశం వల్ల రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందన్నది నిర్వివాదం. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విస్తృతంగా విస్తరించిన ఈ సైబర్‌ ఏజ్‌లో యువరక్తం లేకుండా రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు వామపక్ష పార్టీలు సైతం మినహాయింపు కాదు. అయినా యువత ఎంతమాత్రం రాజకీయం వైపు తొంగి చూసే సాహసం చేయటం లేదు. పధ్నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా దేశంలోని పదిహేను శాతం యువత ఓటు హక్కును వినియోగించుకుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఇదే అత్యధికం అంటే ముక్కున వేలేసుకోవలసిందే. రాజకీయాల్లోకి యువతరం రావాలని ఎవరు ఎంతగా కోరకుంటున్నా వారికి పూర్తిగా దీనిపై విముఖత తొలగిపోలేదు. అదొక ఊబి అనే చాలామంది భావిస్తున్నారు. అనవసర వివాదాలు, విమర్శలు మినహా మరే ప్రయోజనం ఉండదనే వారి అభిప్రాయం... 1950 నాటికీ, ఇప్పటికీ లోక్‌సభల్లో ప్రవేశించిన యువ నేతల సంఖ్య రెట్టింపు కావచ్చు. అయితే ఇది ఎలా సాధ్యపడింది. కొత్తగా వచ్చిన యువకులంతా ఎవరు? వీళ్లంతా వారసులే కావటం నిప్పులాంటి నిజం. తమ సంతానమో, ఇతర బంధువర్గమో రాజకీయాల్లోకి వచ్చేసినంత మాత్రాన్నే... యువశక్తి అంతా రాజకీయాల్లోకి వచ్సేసినట్లు రంగు పులుముతున్నారు. షాన్‌వాజ్‌ హుస్సేన్‌, ఒమర్‌ అబ్దుల్లా, రాహుల్‌ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌, దుష్యంత్‌సింగ్‌, మానవేంద్ర సింగ్‌ అంతా 20 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సున్న నాయకులే అయినా అంతా రాజకీయ కుటుంబాల వారసత్వాన్ని ఆస్తి పంచుకున్నట్లుగా పంచుకున్నవారే. సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం అయిన తరువాత దేశ రాజకీయాలు ఓ క్రమంలో మారుతూ వస్తున్నాయి. అన్ని పార్టీలూ వూ్యహ ప్రతివూ్యహాలు చేయడంలో అన్ని పార్టీలూ కొత్త కొత్త నాయకులను రంగం మీదకు తీసుకువచ్చాయి. సీనియర్‌ నాయకులు తమ వారసులను రంగం మీదకు తీసుకువచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌గాంధీ, వరుణ్‌ గాంధీ, రాజస్థాన్‌లో మానవేంద్ర సింగ్‌, సచిన్‌ పైలట్‌, దుష్యంత్‌ సింగ్‌, తమిళనాడులో ఎంకెస్టాలిన్‌, దయానిధి మారన్‌, కేరళలో మురళీధరన్‌... ఇలా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో వంశ పారంపర్య వ్యవస్థ ప్రారంభమైంది. వయసుపైబడ్డ నాయకులు ప్రత్యక్షరాజకీయాల నుంచి తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని యంగ్‌ జనరేషన్‌ కోరుకుంటోంది. తమకు అవకాశమిస్తే దేశ భవిష్యత్‌ను మారుస్తామని వారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. పధ్నాలుగో లోక్‌సభలో ప్రజాప్రాతినిథ్యం వహించిన నాయకుల్లో 1960 తరువాత జన్మించిన వారు 75 మంది ఉన్నారు. లోక్‌సభ సభ్యుల్లో 28 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వారే. వీరిలో అతి పిన్న వయస్కుడుగా సచిన్‌పైలెట్‌ రికార్డు సృష్టించారు. 26ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభలో అడుగుపెట్టారు. సెప్టెంబర్‌ 7, 1977న జన్మించారు. 1987లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీపై బోఫోర్సు శతఘ్నల ముడుపుల ఆరోపణలు రావడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైన సంధిదశలో దేశ రాజకీయాల్లో అనేక కొత్త ముఖాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పదేళ్లలో జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఇలా కొత్తగా వచ్చిన వారిలో చాలా మంది ఎమర్జెన్సీ నాటి యంగ్‌టర్‌‌క్స కావటం గమనార్హం. వీరు రాజకీయంగా ఎదగడానికి దశాబ్దం పట్టింది. ఒక మారుమూల నియోజక వరా్గనికి ఎమ్మెల్యేగా ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాది పార్టీని స్థాపించి ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పాత్రధారిగా మారిపోయారు. ఒక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న మాయావతి హఠాత్తుగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రాంతీయ రాజకీయాలు తప్ప ఢిల్లీ ముఖం చూడని దేవెగౌడ రాత్రికి రాత్రి ప్రధానమంత్రి అయిపోయారు. రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో రాజకీయాలు చేస్తున్న నాయకులు కాస్తా ఒక్కసారిగా కేంద్ర మంత్రి పదవులు అలంకరించారు. ఇలాంటి వారిలో యంగ్‌టర్‌‌క్సను భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. ఈ పరిస్థితి కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం అయింది. కనీసం ఈ వారసులైనా సరే దేశ రాజకీయాల్లో కొత్త రక్తాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించటం తప్పనిసరి. వీళూ్ల స్వతంత్రంగా వృద్ధతరంపైనే ఆధారపడితే ఇక ఈ వ్యవస్థ బాగుపడటాన్ని ఊహించలేం... దేశంలోని సగం జనాభా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు మధ్యే ఉంటుందని స్పష్టం. వీరిని విస్మరించి ఏ పార్టీ కూడా ముందుకు పోలేదు. ఏళ్ల తరబడి ఒకే నాయకత్వాన్ని భరించే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ ప్రస్తుతం లేదు. మార్పుకు ఒప్పుకోకుంటే పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా తిరుగుబాటు వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే సమీప భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకూ యువతే మార్గదర్శకత్వం వహిస్తుందనడంలో సందేహం లేదు. 14వ లోక్‌సభలో మన ఎంపిల వయస్సు వయస్సు సభ్యులు 25-30 2 31-40 33 41-50 101 51-60 157 61-70 150 71-80 54 81-90 9

1, ఏప్రిల్ 2009, బుధవారం

కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు-పి.వి.నరసింహరావు


ఇరవయ్యో శతాబ్దంలో భారత దేశం గొప్ప వ్యక్తులుగా పది మందిని ఎంపిక చేయదలిస్తే వారిలో పి.వి.నరసింహరావును ఒకరిగా పరిగణించడం తప్పనిసరి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పదవ ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి తెలుగువాడిగా చరిత్ర పుటల్లో ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. బహుముఖ ప్రజ్ఞావంతుడు, పండితుడు అయిన పివి నరసింహరావు లేని లోటు భారతీయ రాజకీయాలకు పూడ్చలేనిది. గడచిన శతాబ్దిలో తెలుగుజాతి ఆధునిక చరిత్రలో అనేక రంగాల్లో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతరా్జతీయ స్థాయిల్లో అరుదైన ప్రతిభను వెదజల్లి తెలుగువారందరూ సగర్వంగా మా వాడని సగర్వంగా చెప్పుకునే కీర్తిని మూటకట్టుకున్నవాడు. ఎన్నో ఒడిదుడుకులకు, ఆటుపోట్లకు, కష్టాలకు, నిందలకూ, నిషూ్ఠరాలకు, కీర్తినీ, అపకీర్తినీ తట్టుకుని ప్రధానమంత్రి బాధ్యతను అయిదేళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించగలిగిన రాజనీతిజ్ఞుడాయన. నెహ్రూ వంశం తరువాత ప్రధానిగా ఈ దేశ భవితను అయిదు సంవత్సరాలు శాసించిన మొట్టమొదటి నాయకుడు పివియే. రాజకీయ రంగంలో రాజనీతిలో సమకాలీన రంగంలో ఆయనకు సాటిరాగల వారు మరొకరు భారత నాయకత్వంలో కనిపించరు. ఎనిమిది దశాబ్దాల నిండైన జీవితాన్ని గడిపిన పివి, అందులో ఆరున్నర దశాబ్దాలు భారత రాజకీయ రంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారనడం అత్యుక్తి కాదు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా ఆయన చేపట్టిన పదవులన్నీ అయాచితంగా అందివచ్చినవే. ప్రయత్నించి సంపాదించుకున్న పదవి ఒక్కటైనా ఉండదు. సమకాలీన రాజకీయ రంగంలో ఇన్ని వైవిధ్యాలున్న పదవులను, బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన నాయకులు అరుదు. ఒక్కో రంగంలో ఆయనకంటే ప్రతిభావంతులు ఉండవచ్చు. కానీ, అన్ని రంగాల్లోనూ తనదైన రీతిలో రాణించిన వారిలో నిస్సందేహంగా పివి ప్రథముడు.
1991లో భారత దేశం రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, దేశాన్ని ముందుకు నడిపించగల నాయకుడు ఇక రాజీవ్‌ గాంధీ మాత్రమేనని అనుకుంటున్న తరుణంలో ఆయన దారుణ హత్య జరిగిన నేపథ్యంలో పివి నరసింహరావు ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చింది. ఆయన నాయకత్వం వహించింది మైనార్టీ ప్రభుత్వానికి. కాంగ్రెస్‌కు నెహ్రూ కుటుంబం కాకుండా మరో వ్యక్తి ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టడం అదే ప్రథమం. ఆయన సామర్థ్యం పట్ల ఎవరికీ నమ్మకం లేని దశ. ఆయన బలహీనుడనీ, పరిపాలనకు అవసరమైన కరకుదనం లేనివాడని, ఎలాంటి గ్రూపులు, వరా్గలు, కుల బలం లేనివాడని, ఎంతోకాలం మైనారిటీ సరా్కరును కొనసాగించలేడని అనుకున్న వారి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించిన మేధావి పివి. ఆయన పదవీ కాలంలో దాదాపు మూడు సార్లు అవిశా్వస తీరా్మనాన్ని ఎదుర్కొన్నా ఆయన ప్రభుత్వం చెక్కుచెదరకపోవడం ఆయన చాణక్యనీతికి నిదర్శనం. దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత కూడా పివికే చెందుతుంది. ఆయన ప్రధాని కావడానికి పూర్వం మన దేశం ఇతర దేశాలకు అప్పుల బకాయిలు చెల్లించలేక 55 టన్నుల బంగారం నిలువలను కుదువపెట్టుకున్న దుస్థితిని ఒక్కసారి మననం చేసుకుంటే, పివి నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అవసరం ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు. అప్పటిదాకా ఆర్థిక నిపుణుడుగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ను ఏరి కోరి తీసుకువచ్చి, ఆర్థిక మంత్రిత్వ శాఖను కట్టబెట్టి, ఆర్థిక సంస్కరణలకు ఊపిరులూదిన వాడు తెలుగువాడు కావడం మనకు కీర్తి. తాను ప్రధానిగా ఉన్న కాలంలోనే బాబ్రీ కట్టడం విధ్వంసం, సెక్యూరిటీస్‌ స్కాం వంటివి చోటు చేసుకున్నా ఆయన తొణకలేదు. అధికారం నుంచి తప్పుకున్న తరువాత అవినీతి కేసుల కారణంగా సొంత పార్టీ తనను పట్టించుకోకుండా పక్కన పెట్టినా, బెణకలేదు. తనపై వచ్చిన అవినీతి కేసుల విచారణలో సామాన్య ముద్దాయిలా న్యాయస్థానాలకు సహకరించిన వాడు పివి. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని తేలి నిర్దోషిగా బయటపడేనాటికి, పివి రాజకీయ ఇన్నింగ్‌‌స కూడా ముగిసిపోయింది.
రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనది ప్రత్యేక స్థానం. నిజాం వ్యతిరేక ఉద్యమంలో అజ్ఞాత కార్యక్రమాల్లో పాల్గొన్నా, పోలీసు చర్య తరువాత జాతీయ కాంగ్రెస్‌లో ప్రధాన భూమిక నిర్వహించినా ఆయనకు ఆయనే సాటి. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల్లో ఆయనతో సరిపోల్చగలవారు వేళ్లపైన లెక్కించవచ్చు. 1971లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పివి నరసింహరావు చేపట్టిన భూసంస్కరణల వంటి ప్రగతిశీల చట్టాలు ఇప్పటికీ చెప్పుకోదగినవి. ఈ సంస్కరణలే ఆనాడు ఆయన్ను సిఎం పదవినుంచి తప్పుకునేట్లు చేసినా, వాటి అమలు విషయంలో రాజీ పడని వ్యక్తిత్వం ఆయనది. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల స్థాపన, నూతన విద్యావిధానానికి నాంది పలికినదీ పివీయేనన్నది నిర్వివాదం. ప్రధానమంత్రి పదవిని అయిదేళ్ల పాటు నిర్వహించి కూడా మిగతా ప్రధానుల్లాగా, తెలుగువారికి, తెలుగు ప్రాంతానికి పివి ఏం మేలు చేశారన్న విషయమై కొంత అసంతృప్తి ఉండవచ్చు. కానీ, స్థూలంగా పట్టు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు రప్పించిన ప్రధానిగా ఆయన చిరస్మరణీయుడు. దాదాపు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడి, రాయగల సమర్థుడాయన. మూడు తరాల తెలుగు జాతి జీవనాన్ని సమగ్రంగా రచించిన విశ్వనాథ వారి వేయిపడగలు నవలను సహస్రఫణ్‌గా హిందీలో అనువదించడం సాహిత్య రంగంలో పివి ప్రతిభకు గీటురాయి. ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియలపై ఆయనకున్న అవగాహన అపారమైనది. పత్రికలు నడిపినవాడు. కాల్పనిక ప్రక్రియలో ఆయన రాసిన ఇన్‌సైడర్‌ తొలిభాగం విడుదలై సమకాలీన రాజకీయాల్లో సంచలనం రేపింది. మలిభాగం అముద్రితంగానే ఉండిపోవడం దురదృష్టం. ఆయన్ను అభిమానించే వారికంటే, వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉన్నా, ఆయనకది పట్టింపునకు లేదు. తాను ఫలానా చేశానని పివి ఎన్నడూ ప్రచారం చేసుకోలేదు. స్వభావ రీత్యా మితభాషి కాబట్టే ప్రచారాన్నీ పరిమితం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజీ అన్నట్లు.. `కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు, సన్నిహితుడై కూడా దూరం వాడు, ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కానీ, తన ఎడం కాపాడుకుంటడు.. జాతరల్లోనూ ఒంటరి వాడే. ఎప్పుడూ తనలో తాను నిమగ్నుడు' పివి.