19, ఏప్రిల్ 2009, ఆదివారం

బాబోయ్‌ ఎండలు

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేడి తాకిడికి ప్రజలు అల్లాడి పోతున్నారు. హిమాలయాల్లో మినహా మరెక్కడా తలదాచుకోని పరిస్థితి తలెత్తింది. అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రీష్మతాపాన్ని తట్టుకోవటానికి ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి వస్తున్నది. భానుడి ప్రతాపానికి భారత దేశం తట్టుకోలేకపోతోంది. ఎక్కడ చూసినా వేడిగాలులు వీస్తుండటంతో రోడ్లపై జనసంచారమే లేకుండాపోయింది. పురూలియాలో అత్యధికంగా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాలుగు రోజులుగా ఇదే తీవ్రత కొనసాగుతోంది. ఇదే సమయంలో మంచి నీటి కొరత స్థానికులను ఇంకా ఇక్కట్ల పాల్జేస్తోంది. ఓ పక్క ఎన్నికల హడావుడి.. మరో పక్క సమ్మర్‌ ప్రజలు, నాయకులు నానా అగచాట్లు పడుతున్నారు... దేశ రాజధాని ఢిల్లీలో ఘోరంగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఆరేళ్ల రికార్డును బద్దలు కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే నలభై అయిదు డిగ్రీలకు ఇక్కడి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీనికి తోడు ఎనిమిది గంటల విద్యుత్తు కోత, మంచినీటి సమస్య ప్రజలను ఇంకా వేధిస్తోంది. పక్కనే ఉన్న రాజస్థాన్‌ నుంచి వేడిగాలులు బలంగా వీస్తుండటం వల్లనే ఢిల్లీ మండుతోందని వాతావరణ వేత్తలంటున్నారు. ఇక రాజస్థాన్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. పింక్‌సిటీ జైపూర్‌ మరీ ఎరబ్రారింది. బికనీర్‌, శ్రీగంగానగర్‌లలోనూ గ్రీష్మతాపం భరించలేనిదిగా తయారైంది. పాఠశాలలను మార్నింగ్‌షిఫ్‌‌టలలోనే నడపాలని అధికారులు ఆదేశించారు. సముద్ర తీరంలోని ఒరిస్సాలోనూ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోయింది. ఇక మన రాష్ట్రంలో అయితే వేడి గురించి చెప్పనే అక్కర్లేదు. మధ్యాహ్నం రెండు గంటలకు డ్యూటీకి వెళ్లాల్సిన ఉద్యోగులు సైతం ఉదయం పది గంటల లోపే ఆఫీసులకు చేరిపోతున్నారు. ఉదయం ఏడుగంటలకే వేడి గాలులు జనాన్ని అల్లాడిస్తున్నాయి. పదకొండు గంటల తరువాత జనం రోడ్లపై కనిపించటమే లేదు.. తెలంగాణ జిల్లాలు వడగాలులతో అల్లాడిపోతున్నాయి. అటు రాయలసీమ కూడా ఇందుకు మినహాయింపు కాదు.. సీమలోని నాలుగు జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా రెండోదశ ఎన్నికలు జరగాల్సి ఉంది.. సూర్యుని వేడికి ఎన్నికల ప్రచార వేడి కూడా తోడై మరింత గ్రీష్మతాపాన్ని కలిగిస్తున్నది.

కామెంట్‌లు లేవు: