1, ఏప్రిల్ 2009, బుధవారం

కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు-పి.వి.నరసింహరావు


ఇరవయ్యో శతాబ్దంలో భారత దేశం గొప్ప వ్యక్తులుగా పది మందిని ఎంపిక చేయదలిస్తే వారిలో పి.వి.నరసింహరావును ఒకరిగా పరిగణించడం తప్పనిసరి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పదవ ప్రధానమంత్రిగా ఎన్నికైన తొలి తెలుగువాడిగా చరిత్ర పుటల్లో ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. బహుముఖ ప్రజ్ఞావంతుడు, పండితుడు అయిన పివి నరసింహరావు లేని లోటు భారతీయ రాజకీయాలకు పూడ్చలేనిది. గడచిన శతాబ్దిలో తెలుగుజాతి ఆధునిక చరిత్రలో అనేక రంగాల్లో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతరా్జతీయ స్థాయిల్లో అరుదైన ప్రతిభను వెదజల్లి తెలుగువారందరూ సగర్వంగా మా వాడని సగర్వంగా చెప్పుకునే కీర్తిని మూటకట్టుకున్నవాడు. ఎన్నో ఒడిదుడుకులకు, ఆటుపోట్లకు, కష్టాలకు, నిందలకూ, నిషూ్ఠరాలకు, కీర్తినీ, అపకీర్తినీ తట్టుకుని ప్రధానమంత్రి బాధ్యతను అయిదేళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించగలిగిన రాజనీతిజ్ఞుడాయన. నెహ్రూ వంశం తరువాత ప్రధానిగా ఈ దేశ భవితను అయిదు సంవత్సరాలు శాసించిన మొట్టమొదటి నాయకుడు పివియే. రాజకీయ రంగంలో రాజనీతిలో సమకాలీన రంగంలో ఆయనకు సాటిరాగల వారు మరొకరు భారత నాయకత్వంలో కనిపించరు. ఎనిమిది దశాబ్దాల నిండైన జీవితాన్ని గడిపిన పివి, అందులో ఆరున్నర దశాబ్దాలు భారత రాజకీయ రంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారనడం అత్యుక్తి కాదు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా ఆయన చేపట్టిన పదవులన్నీ అయాచితంగా అందివచ్చినవే. ప్రయత్నించి సంపాదించుకున్న పదవి ఒక్కటైనా ఉండదు. సమకాలీన రాజకీయ రంగంలో ఇన్ని వైవిధ్యాలున్న పదవులను, బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన నాయకులు అరుదు. ఒక్కో రంగంలో ఆయనకంటే ప్రతిభావంతులు ఉండవచ్చు. కానీ, అన్ని రంగాల్లోనూ తనదైన రీతిలో రాణించిన వారిలో నిస్సందేహంగా పివి ప్రథముడు.
1991లో భారత దేశం రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో, దేశాన్ని ముందుకు నడిపించగల నాయకుడు ఇక రాజీవ్‌ గాంధీ మాత్రమేనని అనుకుంటున్న తరుణంలో ఆయన దారుణ హత్య జరిగిన నేపథ్యంలో పివి నరసింహరావు ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సి వచ్చింది. ఆయన నాయకత్వం వహించింది మైనార్టీ ప్రభుత్వానికి. కాంగ్రెస్‌కు నెహ్రూ కుటుంబం కాకుండా మరో వ్యక్తి ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టడం అదే ప్రథమం. ఆయన సామర్థ్యం పట్ల ఎవరికీ నమ్మకం లేని దశ. ఆయన బలహీనుడనీ, పరిపాలనకు అవసరమైన కరకుదనం లేనివాడని, ఎలాంటి గ్రూపులు, వరా్గలు, కుల బలం లేనివాడని, ఎంతోకాలం మైనారిటీ సరా్కరును కొనసాగించలేడని అనుకున్న వారి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించిన మేధావి పివి. ఆయన పదవీ కాలంలో దాదాపు మూడు సార్లు అవిశా్వస తీరా్మనాన్ని ఎదుర్కొన్నా ఆయన ప్రభుత్వం చెక్కుచెదరకపోవడం ఆయన చాణక్యనీతికి నిదర్శనం. దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత కూడా పివికే చెందుతుంది. ఆయన ప్రధాని కావడానికి పూర్వం మన దేశం ఇతర దేశాలకు అప్పుల బకాయిలు చెల్లించలేక 55 టన్నుల బంగారం నిలువలను కుదువపెట్టుకున్న దుస్థితిని ఒక్కసారి మననం చేసుకుంటే, పివి నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అవసరం ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు. అప్పటిదాకా ఆర్థిక నిపుణుడుగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ను ఏరి కోరి తీసుకువచ్చి, ఆర్థిక మంత్రిత్వ శాఖను కట్టబెట్టి, ఆర్థిక సంస్కరణలకు ఊపిరులూదిన వాడు తెలుగువాడు కావడం మనకు కీర్తి. తాను ప్రధానిగా ఉన్న కాలంలోనే బాబ్రీ కట్టడం విధ్వంసం, సెక్యూరిటీస్‌ స్కాం వంటివి చోటు చేసుకున్నా ఆయన తొణకలేదు. అధికారం నుంచి తప్పుకున్న తరువాత అవినీతి కేసుల కారణంగా సొంత పార్టీ తనను పట్టించుకోకుండా పక్కన పెట్టినా, బెణకలేదు. తనపై వచ్చిన అవినీతి కేసుల విచారణలో సామాన్య ముద్దాయిలా న్యాయస్థానాలకు సహకరించిన వాడు పివి. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని తేలి నిర్దోషిగా బయటపడేనాటికి, పివి రాజకీయ ఇన్నింగ్‌‌స కూడా ముగిసిపోయింది.
రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనది ప్రత్యేక స్థానం. నిజాం వ్యతిరేక ఉద్యమంలో అజ్ఞాత కార్యక్రమాల్లో పాల్గొన్నా, పోలీసు చర్య తరువాత జాతీయ కాంగ్రెస్‌లో ప్రధాన భూమిక నిర్వహించినా ఆయనకు ఆయనే సాటి. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల్లో ఆయనతో సరిపోల్చగలవారు వేళ్లపైన లెక్కించవచ్చు. 1971లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పివి నరసింహరావు చేపట్టిన భూసంస్కరణల వంటి ప్రగతిశీల చట్టాలు ఇప్పటికీ చెప్పుకోదగినవి. ఈ సంస్కరణలే ఆనాడు ఆయన్ను సిఎం పదవినుంచి తప్పుకునేట్లు చేసినా, వాటి అమలు విషయంలో రాజీ పడని వ్యక్తిత్వం ఆయనది. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల స్థాపన, నూతన విద్యావిధానానికి నాంది పలికినదీ పివీయేనన్నది నిర్వివాదం. ప్రధానమంత్రి పదవిని అయిదేళ్ల పాటు నిర్వహించి కూడా మిగతా ప్రధానుల్లాగా, తెలుగువారికి, తెలుగు ప్రాంతానికి పివి ఏం మేలు చేశారన్న విషయమై కొంత అసంతృప్తి ఉండవచ్చు. కానీ, స్థూలంగా పట్టు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు రప్పించిన ప్రధానిగా ఆయన చిరస్మరణీయుడు. దాదాపు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడి, రాయగల సమర్థుడాయన. మూడు తరాల తెలుగు జాతి జీవనాన్ని సమగ్రంగా రచించిన విశ్వనాథ వారి వేయిపడగలు నవలను సహస్రఫణ్‌గా హిందీలో అనువదించడం సాహిత్య రంగంలో పివి ప్రతిభకు గీటురాయి. ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియలపై ఆయనకున్న అవగాహన అపారమైనది. పత్రికలు నడిపినవాడు. కాల్పనిక ప్రక్రియలో ఆయన రాసిన ఇన్‌సైడర్‌ తొలిభాగం విడుదలై సమకాలీన రాజకీయాల్లో సంచలనం రేపింది. మలిభాగం అముద్రితంగానే ఉండిపోవడం దురదృష్టం. ఆయన్ను అభిమానించే వారికంటే, వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉన్నా, ఆయనకది పట్టింపునకు లేదు. తాను ఫలానా చేశానని పివి ఎన్నడూ ప్రచారం చేసుకోలేదు. స్వభావ రీత్యా మితభాషి కాబట్టే ప్రచారాన్నీ పరిమితం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజీ అన్నట్లు.. `కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు, సన్నిహితుడై కూడా దూరం వాడు, ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కానీ, తన ఎడం కాపాడుకుంటడు.. జాతరల్లోనూ ఒంటరి వాడే. ఎప్పుడూ తనలో తాను నిమగ్నుడు' పివి.

3 కామెంట్‌లు:

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

సాటి తెలుగువాడై కాదు కానీ, ఇంతటి రాజకీయ దురంధరునికి కాంగ్రెస్ చేసిన, చేస్తున్న అవమానం చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా తన భూములు కొన్ని ఇచ్చారని చెబుతారు ఈయన. చివరికి ఆ విమానాశ్రయానికి 'రాజీవ్' పేరు పెట్టారు దుర్మార్గులు.

అజ్ఞాత చెప్పారు...

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి
http://24gantalu.blogspot.com/
- సతీష్ దేవళ్ళ

Shashank చెప్పారు...

నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా.. నేను తినే ప్రతి ముద్ద లో కొంత భాగం పి.వీ వళ్ళనే అని... ఎన్నేళ్ళు పరిపాలించారు అని కాదు.. అందులో ఏమి సాధించారు అని చూస్తే.. ఐదేళ్ళళ్ళో పీవీ చేసింది చాలా ఎక్కువ. అటు తర్వత వచ్చిన ప్రభుత్వాలన్ని అతని అడుగుజాడల్లో నడిచినవే.. నడుస్తున్నవ్వే. యభైయేళ్ళ తర్వత చరిత్ర తిరిగిరాసినప్పుడు భారతావని లో "turning point" అంటే పీవీ పాలనే అని గుర్తిస్తారు.