27, మార్చి 2012, మంగళవారం

వాళ్లు చెప్పరు..మేము ఇవ్వము..

ఏం చేయలేం.. మా చేతుల్లో ఏమీ లేదు.. ఎన్ని సార్లు చెప్పమంటారు? మళ్లీ మళ్లీ చెపుతున్నా.. మేం చేసేదేం లేదు.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ వైఖరులు చెప్పనంత వరకు, సంప్రతింపుల ప్రక్రియకు సహకరించనంత వరకు చేసేది ఏమీ లేదు. నథింగ్‌ హాస్‌ టుబి డన్‌ ఆన్‌ దిస్‌ ఇష్యూ.. ది ఇష్యూ  ఈజ్‌ ఇన్‌ ది కోర్ట్స్‌ ఆఫ్‌ మెనీ పార్టీస్‌ ఆఫ్‌ దట్‌ స్టేట్‌ ... ఒక్క మాటలో చెప్పాలంటే.. వాళ్లు చెప్పరు. .మేము చేయము.. డోన్ట్‌ ఆస్క్‌ మి టూ మెనీ టైమ్స్‌.
.......................................................
అర్ధరాత్రి ప్రకటనతో రాష్ట్రాన్ని పెనం నుంచి కుంపట్లోకి నెట్టేసిన మహానుభావుడి లేటెస్ట్‌ కామెంట్‌ ఇది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి బాధ్యత గల దేశ వ్యవహారాలు అలియాస్‌ హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న  చిదంబరం అప్రమేయ ప్రతిభాపాటవాలతో ప్రకటించిన పలుకులివి. .ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. గుంటూరు ఎంపి గారి లేటెస్టు కామెంట్‌కు కాస్త సాగతీత అంతే.. ఆయనేమో తెలంగాణా రాదు.. రాదు.. రాదు.. అంటూ బొబ్బిలిపులి డైలాగులతో అదరగొట్టేశారు.. అవే మాటలని కాస్త పాలిష్ట్‌గా ఎకనమిస్ట్‌ టర్న్‌ロ్డ హోం మినిష్టర్‌ గారి మితిమీరిపోయిన తెలివితేటల సారాంశం ఇది.
メメメ

 మేమూ చెప్పేదేమీ లేదు.. చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాం.. నిర్ణయమో.. గిర్ణయమో.. తీసుకోవలసింది కేంద్రమే.. కేంద్రమే సాగదీస్తోంది. అది ఎన్ని సార్లు అడిగినా మేం మాత్రం  మా వైఖరి చెప్పేదేమీ లేదు. నిర్ణయం తీసుకోమనండి.. మేం కాదన్నామా? నిర్ణయం తీసేసుకున్నాక, మాకు చెప్పలేదంటూ యుటర్న్‌ ఎలాగూ తీసుకుంటాం.. ముందే తొందరపడటం ఎందుకు చెప్పండి..? టూ ఐ థియరీ టూమచ్‌గా అమలు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు రిస్క్‌ తీసుకోవటం అవసరమా? ఒకటి రెండు డిపాజిట్లు పోయినంత మాత్రాన లాస్‌ ఏమీ లేదు. ఇవన్నీ జస్ట్‌ బై ఎలక్షన్స్‌ లోనే..  అసలు ఎన్నికలొచ్చినప్పుడు మహాకూటముల్లాంటివి మళ్లీ పుట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదు.. అయినా మీ వెర్రి కానీ, తెలంగాణాకు అనుకూలమని చెప్పకపోయినా, వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. డెసిషన్‌ అంటూ తీసుకోవాలంటే సోనియమ్మే తీసుకోవాలి.. ఇక మీదట ఈ విషయంపై నన్నేమైనా అడిగారో ఖబడ్దార్‌.. దటీజ్‌ చంద్రబాబునాయుడు.. 35 ఇయర్స్‌ ఇండస్ట్రీ...
メメメ

నాదేముందయ్యా.. నేనే నామినేటెడ్‌ గాణ్ణి.. నా సీటు స్క్రూలే ఢిల్లీలో ఉన్నాయి. ఇక తెలంగాణా సంగతి నాకేం తెలుసు? ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమంటారా? జస్ట్‌ అదొక గేమ్‌ లాంటిది.. పరాయి దేశాల్లో టీమిండియా క్రికెట్‌లో ఎంత ఘోరంగా ఓడిపోతుందో తెలియదా? తెలంగాణా కూడా అంతే.. ప్రస్తుతానికి తెలంగాణా 2014 వరకు కాంగ్రెస్‌కు పరాయి ప్రాంతమే.. అందుకే సొంత గడ్డపై ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తా. 2014 నాటికి మా అమ్మ నోటి నుంచి ముత్యాలు రాలకపోతాయా? అవి తెలంగాణాలో ఓట్లుగా మారకపోతాయా? అప్పటికి చూసుకుందాం లే.. నాకు ప్రాబ్లమ్‌ తెలంగాణా కాదు. అక్కడి కాంగ్రెస్‌ నాయకులే..  వాళ్లను మేనేజ్‌ చేయటం పెద్ద సమస్య కానే కాదు. తలా ఒక బొక్క పడేస్తే చాలు, విశ్వాసంగా పడి ఉంటాయి. కాబట్టి సమస్య పరిష్కారం కాకపోయినా నష్టం లేదు.. అసలు కానక్కర్లేదు. రెండేళ్ల తరువాత కదా ఎన్నికలు.. అప్పటికి ఏదో ఒక దారి దొరక్కపోదులే.. మా వాళ్లతోనే రాజీనామా చేయించి, మా వాళ్ల తోనే మమ్మల్ని తిట్టించుకుని, టిఆర్‌ఎస్‌లో చేర్పించి ఎంపిలుగా పోటీ చేయించి, గెలిపించుకుని.. ఎన్నికలయ్యాక భేషుగ్గా మళ్లీ పార్టీలోకి రెడ్‌కార్పెట్‌ పరచి మరీ తీసుకోమూ.. కాకుంటే రాష్ట్రంలో అధికారం పోతుంది.. ఎవడికి కావాలి.. పదేళ్లు చేశాం చాలదా...? కాస్త రిలాక్స్‌.. ఎలాగూ జగన్‌ గద్దలా తన్నుకుపోయే సీట్లూ... తెలంగాణా వాదంలో టిఆర్‌ఎస్‌వైపు కొట్టుకుపోయే సీట్లతో హంగ్‌ రావటం తథ్యం.. జగన్‌ మా వాడే కాబట్టి... బతిమాలో.. బెదిరించో తిప్పుకోవటం ఈజీ.. ఇక కెసిఆర్‌ అంటారా? తూచ్‌... ఆ పార్టీ నుంచి ఎంపిలుగా గెలిచేవాళ్లు మావాళ్లేగా.. నథింగ్‌టు వర్రీ.. మళ్లీ 40 ఎంపి సీట్లు మావే.. కాబట్టి సిఎం కుర్చీ ఉన్నా, లేకున్నా.. ఢిల్లీలో రాహుల్‌ బేటాను ప్రిన్స్‌ చేయటం మాత్రం గ్యారంటీ.. కాబట్టి.. ఎవరు చచ్చినా.. బతికినా.. క్యాంప్‌ ఆఫీస్‌లో ఫిడేల్‌ మాత్రం పాడవకుండా ఉంటే చాలు.. ఇవేవీ వినపడకుండా హాయిగా దాన్ని వాయించుకుంటూ ఉండవచ్చు. అసంతృప్తవాది డిఎల్‌ అన్నట్లు హైదరాబాద్‌ నుంచి వయా మద్రాసు, బెంగుళూరుల మీదుగా ఢిల్లీ వెళ్లి సూటుకేసులు మార్చి మంత్రి కూడా కాకుండానే సీల్డు కవరులో సిఎం సీటు తెచ్చుకున్న ది గ్రేట్‌ ఎన్‌కెఆర్‌ గారి అంతరంగమిది.. ఆయన అజరుద్దీన్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌.. క్రికెట్‌లో మ్యాచ్‌ఫిక్సింగ్‌ అజరుద్దీన్‌కు ఎంతగా తెలుసో.. రాజకీయాల్లో ఎన్‌కెఆర్‌కీ అంతగా తెలుసు...
...........................................................................
ఇంకా ఏం జరుగుతుందో.. ఏం జరుగబోతోందో విడమర్చి చెప్పాలా? 

26, మార్చి 2012, సోమవారం

దటీజ్‌ కేశవరావు..

ఆయన అంటే మీడియా నుంచి మేడమ్‌ దాకా అందరికీ హడల్‌.. కాంగ్రెస్‌లో ఆయన నిప్పు.. ముట్టుకోకుండానే మాటలతోనే కాల్చేసే పవర్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారా? ఎంతటి వాళెユ్లనా డంగై పోవలసిందే..  సింపుల్‌గా చెప్పాలంటే కెకె.. పూర్తిగా చెప్పాలంటే కె.కేశవరావు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు.. మరి నాలుగు రోజుల్లో మాజీ ఎంపి.                                   
ఆయన ఒక్క మాట.. వేయి మెదళ్లను తొలిచేస్తుంది.
ఆయన ఆవేశం.. ఉద్యమానికి ఇంతకంటే గొప్ప నాయకుడెవరా అనిపిస్తుంది.
ఆయన వాగ్ధాటి మేడమ్‌ సోనియాను సైతం ముప్పుతిప్పలు పెడుతుంది.
దటీజ్‌ కేశవరావు..
కాంగ్రెస్‌లో తెలంగాణా  గురించి గత రెండేళ్లలో గట్టిగా గొంతు విప్పి ఎవరైనా మాట్లాడారా అని అడిగితే ఎవరైనా ఫస్ట్‌గా చెప్పే ఒకే ఒక్క పేరు కెకె. ఆయన మామూలుగా మాట్లాడితేనే ఆ సెユ్టల్‌కి.. ఆ ఒకాబులరీకి ఎవరైనా ఇట్టే పడిపోవలసిందే. చెప్పింది చెప్పకుండా.. చెప్పాల్సింది విప్పకుండా.. తనదైన శైలిలో మాట్లాడటం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో కెకెకు మాత్రమే చెల్లింది.
తెలంగాణాలో మూడేళ్లుగా ఉద్యమం సాగిన రోజుల్లో బయటి సమావేశాల్లో కుప్పలు తెప్పలుగా ప్రసంగాలు చేసిన కెకె.. రాజ్యసభలో మాట్లాడింది పట్టుమని రెండు మూడు సార్లయినా లేదు.  మొన్నటి శీతాకాల సమావేశాల్లో ఒకసారి.. ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాల్లో మరోసారి.. ఈసారి మరీ ఆవేశంగా తెలంగాణా ఇవ్వకుంటే చంపేయమంటూ మాట్లాడటం ఆశ్చర్యం..

కెకెలో ఈ ఆవేశం మునుపెన్నడూ కనిపించలేదు. తన పార్టీ పైనే.. తన అధినేత్రిపైనే.. తన వారి నాయకత్వంపైనే ఇంత ఆక్రోశం.. ఆందోళన ఎన్నడూ వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఏకంగా తెలంగాణా ఇవ్వకుంటే చంపేసేయమంటూ తీవ్రంగా మాట్లాడిన కారణం ఏమిటి?
కెకె రాజ్యసభ సభ్యత్వం మరో నాలుగు రోజుల్లో ముగిసిపోతోంది. తిరిగి ఎంపిక చేయాలంటూ తెగ లాబీయింగ్‌ చేసినా ఆయన గోడును అధిష్ఠానం కానీ, అధినేత్రి కానీ కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు.. ముఖ్యమంత్రి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ ఆయన వంకయినా చూడలేదు. తెలంగాణా ఎంపిలంతా మూకుమ్మడిగా మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు.
ఇదే సమయంలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అధిష్ఠానాన్ని విమర్శించటానికి మంచి అస్త్రాన్ని అందించింది. దీనికి తోడు వరంగల్‌లో ఆత్మహత్యలు.. ఆయనలోని ఆక్రోశానికి ఆజ్యం పోసింది. ఇంకేం.. రాజ్యసభలో ఆయన రెచ్చిపోయారు.. తన పార్టీ వైఖరిని కడిగిపారేశారు.. తెలంగాణా ఇవ్వకపోతే చంపేయమంటూ ఆవేశంతో అన్నారు.. అందుకే .. ఆయన.. దటీజ్‌ కేశవరావు.

ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పారిపోవటమే..

rajamouli died on 26-3-2012 at warangal


bojyanaik died on 24-3-2012 at warangal
భావోద్వేగాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయి... మాటలు చెప్పేవాళ్లే తప్ప, ఎవరూ వాళ్లను ఆపేవాళ్లు లేరు..ఒకరి తరువాత ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారు.. శరీరాన్ని సజీవంగా తగులబెట్టుకుని మరీ కాలిపోతున్నారు..రెండేళ్లలో ఏడు వందల ఆత్మాహుతులు తమ కుటుంబాలకు ఆత్మక్షోభను మిగల్చటం తప్ప సాధించింది ఏమీ లేదు.. మరి ఎవరిని ప్రేరేపించటానికీ బలిదానాలు?  దీని వల్ల ఒరిగిందేమిటి? ఎందుకు చేసుకోవాలి ఆత్మహత్యలు..    
రోజుకొకరు.. పూట కొకరు..పాతికేళ్లు నిండకుండానే.. బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు.. కారణాలు ఏవైనా సరే.. కాస్తో కూస్తో.. ఆత్మాహుతుల పరంపర ఆగిపోయిందనుకుంటున్న తరుణంలో  మళ్లీ  ఉద్వేగమరణాలు వరుసపట్టాయి... పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా  సాధ్యమేనా?.. తమ రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదన్న మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు..  సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్‌ చేయలేకపోతున్నాయి.
రేపటి భవితకు పునాదులు వేసుకోవలసిన వయస్సు యువతరం ఇంతగా ఎమోషన్‌కు గురికావలసిన అవసరం ఏముంది..? ఎందుకింతగా జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటున్నారు. అసలు భవిష్యత్తే శూన్యంగా ఎందుకు కనిపిస్తోంది?విభజన జరుగుతుందో లేదో తెలియదు. ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి వచ్చిన సందర్భంలో ఆ ప్రాంత రాజకీయ నాయకులు సమర్థంగా వ్యవహరించనంతకాలం.. ముక్తకంఠంతో, తపనతో ముందుకు సాగనంతకాలం లక్ష్యసాధన కుదరని పని. ఒకవేళ రాష్ట్ర సాధన సాధ్యమైనా, విభజన వల్లనే అంతా అయిపోతుందనుకోవటం  కూడా పొరపాటే. అన్ని ఆశలూ నెరవేరుతాయనుకోవటం భ్రమ.. మన పాలకుల చిత్తశుద్ధిపై మన ఆశలు.. ఆశయాలూ నెరవేరటం ఆధారపడి ఉంటాయి. ఏదైనా పోరాడి సాధించాల్సిందే.  అలాంటప్పుడు ఉన్న జీవితాల్ని సజీవ సమాధి చేయటం సమంజసమేనా?
బలవంతంగా మరణించినంత మాత్రాన్నే ఆశయం నెరవేరుతుందనుకుంటే ఇంతకు ముందు జరిగిన బలిదానాలకు ఫలితం కనిపించాలి కదా.. రెండేళ్లుగా సాగిన ఆత్మాహుతులకు సాకారం కాని లక్ష్యం.. ఇప్పుడు మాత్రం  ఉసురు తీసుకుంటే వస్తుందనుకుంటే పొరపాటు కాదా? మరణించిన తరువాత ఒక వేళ లక్ష్యం నెరవేరినా అది చూసేందుకు ప్రాణం ఉండదు..

మీరు ఎంత నిరాశతో మీ జీవితాన్ని ముగిస్తున్నారో.. మీ తల్లిదండ్రులు అంతకంటే వెయ్యి రెట్లు మీపై ఆశలు పెట్టుకున్నారు.. మీ నిరాశ వారి ఆశలను చంపేస్తోంది.. మీ నిరాశ ఎప్పుడైనా ఆశగా మారవచ్చు.. ఆశయంగా రూపొందవచ్చు. మీరు కోరుకున్న రీతిలో నెరవేరనూ వచ్చు. కానీ, మీ బలిదానం మీ తల్లిదండ్రుల ఆశల్ని ఎప్పటికీ నెరవేర్చవు. వారి కలల్ని శాశ్వతంగా కల్లలు చేస్తాయి. 
ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది?  ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే..మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?

4, మార్చి 2012, ఆదివారం

గొల్ల రామవ్వ

A story written by Sri. pv narasimha rao, ex. prime minister of india in 1949


golla-ramavvaఢాం....ఢాం....ఢాం!.... బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. సర్వత్ర నిండుకున్న నిస్తబ్ధతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి. గాఢనివూదలో నిమగ్నమై యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లి పోయింది. ఆబాలగోపాలం గొల్లుమన్నారు... నిద్ర మబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధ పడలేదు... ఏదో ఆవేదన. ఏదో చికాకు . ఏదో బెగడు. కాని అంతా అగమ్యగోచరమే! ఊరి వారికందరికి ఒకే సమయాన ఏదో మహా భయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుళ్ళిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా రెండు నిమిషాల్లో...

ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపలి నుండి వేసుకున్న తలుపుల గొళ్ళాలు తీసి బయటికి తొంగి చూతామనుకున్న వారి చేతులు కూడా గొళ్ళాల మీదికి పోగానే ఎక్కడివక్కడ జలదరించి నిలిచిపోయినవి. చికాకు వల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచి పోయే పక్షులరవం, వాటి రెక్కల తటతట, ఊరిచుట్టు పెరండ్లలో నుండి కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్లకంపను విరుగవూదొక్కి ఊళ్లో తోచిన దిక్కల్లా పరుగెత్తే దున్నపోతుల గిట్టలరాపిడి-ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. అంతేకాని, ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్య జ్ఞానబోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు.... బొడ్డూడిన కూనపర్యంతం ఎవ్వరు నిద్ర కూడా పోలేదు... ఏవో గుసగుసలు... ఏవో సైగలు... ఏవో అసహాయ ధృక్కులు... ఏవో వినపడని మ్రొక్కులు.... తల్లులు తమ పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. పిల్లల దడుపు పోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొసట బొట్టు పెట్టారు. వీపు చరిచారు. కాని పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరకలేదు. బొట్టు పెట్టుకున్న చేతుల గాజులు గలగలమంటునే ఉన్నవి. ఉన్న చోటనే ఉన్న కాళ్ళ పాజేబులు కూడా కించిత్తు ఝంకరిస్తునే ఉన్నవి.

అదొక విచిత్ర ప్రళయం... అదొక క్షణిక మృత్యు తాండవం.
అదొక అస్థిరోత్పాతం.ఒక గంట గడిచింది. ఎప్పటివపూనే నలువైపుల అంధకారం అలుముకున్నది. చిమ్మట్లు ఏకక్షిశుతితో అరుస్తున్నవి. అంతా మామూలే! కాని నిద్ర మాత్రం ఊరి దరి చేరలేదు.
గొల్ల రామమ్మ తన గుడిశెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని ఉంది...

‘‘అవ్వా! గిప్పుడిదేం చప్పుడే?’’ అని మెల్లగా ప్రశ్నించిందా బాలిక.
‘‘నీ కెందుకే మొద్దుముండా. గదేంది. గదేంది - ఎప్పటికి అడుగుడే! ఏదో మునిగి పోయినట్లు! అన్ని నీకే కావాలె!.....’’
బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించ లేదు. కొన్ని నిముషాలకు ముసలవ్వ తనంత తనే మెల్లగా గొణగడం మొదలుపెట్టింది. ‘ఏమనుకున్నవే తల్లీఁ మా పాడు కాలమొచ్చిందే! మీరెట్ల బతుకుతారో ఏమో బిడ్డా! ఈ తురుకోల్ల తోటి చావొచ్చింది... మొన్ననే నలుగుర్ని తుపాకినేసి చంపింన్రు. ఇప్పుడు కూడా ఏదో గసోంటి అగాయిత్తమే చేసివూనేమో!.... ఏం పొగాలమో వీల్లకు!....’
మళ్ళీ నిశ్శబ్దం... రామమ్మ, మల్లమ్మ ఇద్దరు తమ తమ యోచనల్లో పడిపోయారు. నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే! డెభ్బైయేండ్లు దాటిన రామమ్మకు జాగరణే, కొత్తగా వయసు వచ్చిన మల్లమ్మకు జాగరణే..

హఠాత్తున కిటికీ నెవరో తట్టారు... కిటికీ అంటే దాని ప్రాణమెంత? - మంటి గోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ రెండు చిన్న తలుపులు. ఇదే ఆ గుడిసెకు కిటికీ.
ఆ చప్పుడుకు లోపలి వారిద్దరు ఉలికిపడ్డారు. కూర్చున్న చోటునుండి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. కిటికీ తలుపులు గాలికి కొట్టుకొన్నవో లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని...!
మళ్ళీ అదే చప్పుడు. ఈసారి అనుమానం లేదు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు. పిల్లి అసలే కాదు.
ఏం చేయాలి? ఎటూ తోచలేదు...

మళ్ళీ చప్పుడు. ఈసారి పెద్దగా వినపడింది. ఏదో స్థిరసంకల్పంతోనే తట్టినట్లు....
ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. అవ్వను గట్టిగా పట్టుకొని కంపించే గుసగుసలో ‘‘నాకు బయమైతాందే అవ్వా!’’ అనగలిగింది.
‘‘అట్లుండు! ఏందో చూత్తాం’’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. అలవాటు చొప్పున చీకటిలోనే కిటికీ వద్దకి చేరుకుంది. లోపల గొళ్ళెం తీస్తూ తీస్తూ ‘‘ఎవర్రా?’’ అంది.
ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే ఒక వ్యక్తి అతికష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు. అతని పాదాలు లోపలి నేలకు ఆనినవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు. ముసలవ్వ బీరిపోయి నిలుచుంది....
ఇంకో మూలన మల్లమ్వ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుకై ఎదిరి చూస్తున్నట్లు పడి ఉంది. చిమ్మన చీకట్లో ఏదీ కనబడడం లేదు. ముసలవ్వకు మాత్రం సందేహం లేదు. గతానుభవమే అంతా సూచించినది. పోలీసో, రజాకారు తురకవాడో ఇంట్లో దూరాడు... ఇంకేముంది? తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు... ఎవదిస్తారీ రాక్షసుల్ని. తాను గోల పెడితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా? ఉహుఁ! కలలోని మాట!.... వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? వాళ్ళ యింట్లో మాత్రం పడచుపిల్లలు లేరా? ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకు పోయినప్పుడెవరేం చేయగలిగారు? ఎవరడ్డం వచ్చారు?.... ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవ్వరౌతారు?...

ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది. ఇక జరుగబోయేది ఆమెకు స్పష్టంగా, అద్దంలోలాగ కనిపించసాగింది.
తాను చచ్చినా సరే తల్లిదంవూడులు లేని మల్లికైనా మానభంగం తప్పితే... తానా పిల్లను సాది సంబాలించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా.... ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవలె నిలిచిపోయింది. వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంత తానే స్తంభించిపోయింది.
ముసలవ్వకు, ఆ వ్యక్తికి మధ్య దాదాపు రెండు గజాల దూరముంది. యోచనామధ్యంలోనే ఆ వ్యక్తి ఆమెవైపు రెండడుగులు వేశాడు. చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు...
ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది... ఆ తరువాత పాపం మల్లి...!
అతి కష్టం మీద ఆమె మూతి మూయబడింది. ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది... మల్లమ్మ కోసం...

ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది.
ముసలవ్వ చెవిలో... ‘‘చప్పుడు చేయకు, నేను దొంగను కాను, రజాకార్ను కాను. పోలీసును కాను. మిమ్మల్నేమి అనను. లొల్లి మాత్రం చేయకండి...’’
‘అబ్బా! ఏమి టక్కరి! నమ్మించి గొంతుకోయడానికి చూస్తునట్టున్నాడు! తీయని మాటలతోనే సంతోషపెట్టి పాపం మల్లిని...!
అబ్బ! ఎంతకైనా తగువారీ రాక్షసులు! ఔను! ముందుగా తీయని మాటలు - అవి సాగకపోతే అన్యోపాయాలు. అదే కదా క్షికమం’...
ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్ళు దొరికించుకుంది... ఎంతో దీనంగా వేడుకుంది... ‘‘నీ బాంచెను! చెప్పులు మోత్తా, నా తలకాయైనా తీసుకో. పోర్ని మాత్తరం ముట్టకు. అది నీ చెల్లలనుకో... నీ కాల్లు మొక్కుత!’’

‘‘లేదవ్వా! నమ్మవేం చెప్పుతుంటే? నేను దుష్టుణ్ణి కాదు. నేనూ మీ అందరివంటి తెలుగోణ్ణే!’’
శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు. ముసలవ్వ ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు. తొశ్శతొశ్శగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామె. కాబట్టి ఈ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది.
కొన్ని నిమిషాలపాటైనా చావు, మానభంగం తప్పినవి! ముసలవ్వకదే ఇంద్రజాల మనిపించింది! మానవ హృదయంలో నిహితమైయుండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయూతనిచ్చింది. వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితడైనా, అతడు వచ్చిన పరిస్థితుపూంత అనుమానాస్పదమైనవైనా ముసలవ్వకు మాత్రం అతణ్ణి విశ్వసించాలనిపించింది. ఇది విశ్వాసం కాదు; విశ్వాస్వేచ్ఛ. విపద్దశలో గోచరించిన ఏకైక తరుణాధారం. దాన్నెలా జార విడుస్తుంది?

వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకొన్న ముసలవ్వ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు, ముఖం, తల తడుమసాగింది. ఒకే ఒక చడ్డీ ఉంది. చొక్కాలేదు. దేహమంతటా పల్లేరుకాయలు. చిగురంత, జిట్టరేగు ముండ్లు అంటుకొని ఎండిపోయిన రేగటిమన్ను, ఆ మంటిలో చిక్కుకొనియున్న తుంగపోచలు, గడ్డిపోచలు, వెంపలాకులు, తాటిపీచు వగైరా - ఇవన్నీ ముసలవ్వ చేతులకు కండ్లున్నవా అన్నట్లు గోచరించినవి. ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకుపోయినట్లు చర్మమే చెబుతున్నది. కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతి కంటింది. మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టుకట్టిన రక్తపు ఆనవాళ్ళు తగులుతున్నవి. శరీరమంతా జ్వరంతో రొట్టె పెంకవలె మసలి పోతున్నది... ముఖం మీద ముచ్చెమటలు క్రమ్మినవి. శ్వాస అతికష్టం మీద నడుస్తున్నట్లున్నది... మధ్య మధ్య ఆపినా ఆగని మూల్గులు బయట పడుతున్నవి. గుండె వేగం విపరీతమై పోతున్నది.
స్పర్శతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు.

ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనఃస్థితిలో కాయాకల్పమైంది. అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది. ఐదు నిముషాలకు పూర్వం మనుమరాలి శీలరక్షణ కోసం ఆగంతకుని కాళ్ళు పట్టుకుని ‘‘బాంచెను, కాళ్ళు మొక్కుత’’ అని వేడుకున్న ముసలవ్వ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిక్షిశిత స్వరంతో ‘‘ఇదేం గతిరా నీకు? గిట్లెందుకైనవు కొడుకా?’’ అని ప్రశ్నించింది.
‘‘ఏదో అవ్వా! అదొక కథ... కొంతసేపు నన్నిక్కడ దాచు. తరువాత నా దారిన నేను పోతాలే...’’ అని అతికష్టం మీద అన్నడాగంతకుడు.
‘‘ఆ! మా పోతౌ, మా పోతౌ... ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతౌ... మంచి బుద్ధిమంతుడౌ పా!... హు! పోతడట యాడికో!’’
ఆగంతకుడు మాటాడలేదు. ముసలవ్వ వెంటనే మనుమరాల్ని పిలిచింది. ‘‘మల్లీ! ఓ మల్లిముండా! దీపం ముట్టియ్యే జెప్పన. నిదురొచ్చినాదే పోరీ’’...
దీపం మాట వినగానే ఆగంతకుడు ఉలికిపడి అన్నాడు. ‘‘అబ్బో! వద్దవ్వా వద్దు... దీపం వెలిగించకు నీ పుణ్యం... పోలీసులు నా వెంట పడ్డారు. పట్టుకుంటారు...’’
‘‘ఇగ చాల్లే మాట్లాడకు! పోలీసులకన్న ముందల సావు దేవతే పట్టుకునేటట్టున్నది నిన్ను!’’ అని ముసలవ్వ గద్దించింది.

మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ ఒక మూలకొక గొంగడి పరిచింది. దీపపు వెలుతురులో ఆగంతకుణ్ణి కొంత తడవు పరీక్షించింది. బక్క పలుచని యువకుడు, పదునెనిమిదేండ్లకు మించని వయసు. నూనూగు మీసాలు - గంభీరతను సూచించే కండ్లు. సుకుమారమైనప్పటికీ చాపతీగ బెత్తం వలె వంగగల దేహం. సౌమ్య సౌజన్యాల నీనే ముఖమండలం...
ఆ యువకుణ్ణి చూచిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది.
‘‘రాజోలిగె ఉన్నవు కొడుకా! నీ కెందు కొచ్చెరా ఈ కట్టం? .... పండు పండు.... ఆ గొంగల్ల పండు. బీరి పోతావేందిరా? పండు. ఆఁ! గట్ల ఁ మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్ళెక్కియ్యే... అబ్బ! మంజగరున్నోలిగె కదుల్తది మబ్బు ముండ! ఈడ పోరని పానం పోతాందంటే దీనికి నిర్దమబ్బే వదల్లేదు... ఊఁ! కానీ జెప్పున, ఎక్కిచ్చినవా కడుముంత? ఆ ఁ ! ఇగరా... దీపం పోరని దగ్గరకు తే... దీపానికి ఇంటి తలుపుకు నడుమ నా గడంచె నిలబెట్టు. దానికి నా గొంగడి ముసుగెయ్యి.... ఏసినవా? ఆఁ గట్ల. గిప్పుడు కొద్దిగ వుశారయింది పొల్ల! మొగుడు నాలుగు మల్కల పెయ్యి మెదిగబెడితే ఇంకా కుదుర్తది చురుకు!... కొద్దిగ సందుంచి ఓ కంచుడు బోర్లియ్యి దీపంతె మీద. ఆ పోరని మీద ఎలుగు పడాలె. కడుమ దిక్కుల్ల చీకటే ఉండాలె. గట్ల కావాలె ఉపాయం... ఆఁ! గంతె! ఉన్నదే ఒనరు నీ దగ్గెర! మా చేత్తవులే సంసారం!... ఇక కూకో వాని పక్కన. ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ... అయొ! సిగ్గయి తాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానపతివి గదనే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గనుకుంట? ఊఁ! చెయ్యి చెప్పిన పని! పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాన్ని జూత్తె జాలి పుడుతలేదె నీకు దొమ్మరముండా?... ఆ! గట్ల! నొప్పిచ్చకు పాపం!...’’


మహా ప్రవాహం వలె సాగిపోతున్నది ముసలవ్వ గొణుగు ధోరణి. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు - ముసలవ్వ ఆజ్ఞలన్ని చకచకా అమలౌతున్నవి. యువకుడు నిజంగా అర్ధశుద్ధావస్థలో పడియున్నాడు. మల్లమ్మ జిట్టరేగుముండ్లు ఒక్కొక్కటి తీస్తున్నది. యువకునికేదో క్రొత్త లోకంలోకి వచ్చినట్లుంది.

ముసలవ్వ మళ్ళీ ప్రారంభించింది.
‘‘వచ్చినాయె ముండ్లన్ని? - మా కట్ట పడుతున్నావే పొల్లా! పున్నెముంటుంది నీకు. మల్ల పెతరమాసకు తుంటకొక్కంత బుడ్డోన్ని కంటవులే! సరె. ఇగబటు... నీల్లెచ్చబడ్డయి... ఈ పేగు నీల్లల్ల ముంచి వాని గాయాలన్ని కాపు. ఆ రౌతం మరకలు, మంటి ముద్దలు తుడిచి పోరెయ్యి తానం జేసినట్టు కావాలె - పాపం! ఎంత సుకాశిపెయ్యే పొల్లంది! ముట్టుకుంటే దూదోలిగె తలుగుతాంది! ఎసోంటోని కెసొంటి గతొచ్చిందే!’’

చూస్తూ చూస్తూ మల్లమ్మ పరిచర్యవల్ల యువకుని గాయాల బాధ తక్కువయింది. దేహమంతా శుభ్రమైంది. మెల్లమెల్లగా తేరుకున్నాడు.
ఇంతలో ముసలవ్వ తలెలో ఏదో తెచ్చింది. యువకుని తలాపున కూర్చొని అతని తల నిమురుతూ గొణగసాగింది.

‘‘ఇగ లే కొడుకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన... గింత కడుపుల పడేసుకో. ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరిబువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గట్కంటే ఏమనుకునౌ? పొయ్యే పానం మర్లుతది! చూడు మరి - కులం జెడిపోతవని భయపడుతున్నవా? నువ్వు బామనోడవైనా, జంగమోడవైనా, యేకులమోడవైనా సరే - మొదలు పానం దక్కిచ్చుకో. అంతకైతె నాలికెమీద బంగారి పుల్లతోటి సురుకుపెడితే పోయిన కులం మల్లత్తదట కాదు? - ఆఁ! ఇగ తాగి పాయ్యి గటగట!-’’

యువకుడు లేచి కూర్చున్నాడు. ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చిందతనికి. చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు ప్రీతితో గటగట త్రాగాడు - ముసలవ్వ మాట అక్షలారా సత్యమైంది. సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది.
ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది. యువకుని వైపు చూస్తూ, ముడుతలు పడ్డ ముఖంతో నవ్వుతుంటే ముడుతలన్ని అంతర్ధానమైనవా అనిపించింది. కొన్ని నిముషాల పాటలాగే ఉండిపోయారు ముగ్గురు...

యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగిపోయింది. వెంటనే ‘‘గిదేందిరో?’’ అంటూ ముసలవ్వ ఆ జేబులో చేయి వేసి ఒక ఉక్కు వస్తువ తీసింది.

‘‘అది రివాల్వరవ్వా! తోటాల తుపాకి..’’ అన్నాడు యువకుడు.
‘‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదామనుకున్నావా, యేంది?’’ అన్నది ముసలవ్వ.
‘‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్ళను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హత మార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే!’’
ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణణాతీతంగా మార్పు చెందినవి. మొదట కొద్దిగా భయం, ఆ తదుపరి తెగువ, ఆ తరువాత ఉత్సాహం, ఆ వెనక విజయోల్లాసం క్రమశః గోచరించినవి.
యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు. భావ పరివర్తన చూచినకొద్దీ అతని మానసం పరిపరి విధాల తర్కించుకుంటున్నది. ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాప రేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించి పోయింది. ఏమంటుందో ఈ వృద్ధురాలు? శతాబ్దాల దాస్యమనుభవించి దలితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది. ఎలాగైనా ఆ గుడిశె ఆశ్రమం నుండి తనకుద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది. ఇద్దరు పోలీసులను చంపిన హంతకుణ్ణి ఎవరుండనిస్తారు? ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్థుల పిరికితనం వల్ల పట్టు పడలేదు? యువకుని మనస్సు ఎన్నెన్నో వితర్కాలకు లోనౌతున్నది.

కొంత సేపు యోచించి హృదయం ధడుక్కుమన్నది.
‘‘ఇద్దర్నా?... కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు...!’’
యువకుడు చకితుడైనాడు. అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది. అతని తారుణ్యానురూప భావుకత్వం అతణ్ణి మైమరపించింది. శ్రీరామస్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలే తన దేహం కూడా ఉప్పొంగి పోయినట్లనిపించింది. రివాల్వరు కొరకై చేయి చాస్తూ ‘‘తక్కినవాళ్ళను కూడా చూచుకొస్తా తే అవ్వా!’’ అనేశాడు.
ముసలవ్వ రివాల్వరు లాక్కొని ప్రారంభించింది.

‘‘చాల్లే చేశిన కాడికి! బాద్దురుగాడవు పా! బాగ తిని ఉండబుద్దిగాక పోలీస్ తోటే వైరం పెట్టుకుంటడట ఉచ్చిలిపోరడు! ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’’
యువకుడన్నాడు ‘‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటియర్ను. నైజం రాజు తోటి కాంగ్రెస్ పోరాడుతున్నది. ప్రజలు పోరాడుతున్నారు.’’
యువకుడేదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది. కాని మధ్యలోనే ముసలవ్వ అందుకున్నది. ‘‘యాడున్నదిరా నీ కొట్లాట? ఈడనైతే పెద్ద పెద్దోల్లంత ఆ తురుక పోలీసోల్లనే ఇండ్లల్ల పండ బెట్టుకుంటాన్రు గాదు? ప్యాదోల్లు కొట్లాడితే ఏమైందిరా?’’
‘‘పేదవాళ్ళతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం...’’ అన్నాడు యువకుడు.
‘‘మరైతే నీది కాంగిరిజో గీంగరిజో అండ్ల ఈడుపడ్డోల్లు లేరార? గడ్డాలు, మీసాలు నరిశినోల్లంతయాడ విరగడైపోయింన్రు?’’

‘‘వాళ్ళందరు పట్నంలో ఉంటారు. రాజుతో మాట్లాడుతారు. ప్రజల తరఫున వాదిస్తారు. అధికారాలు ఇప్పిస్తారు. నాయకత్వం చేస్తారు.’’
ముసలవ్వ విసుగుతో అందుకుంది. ‘‘ఏహే! గదంత నాకు మనసున పట్టది. పెద్ద పెద్దోల్లేమొ ముచ్చట్లు పెట్టుకుంట కూకుంట రట! పసి పోరగాల్లనేమొ పోలీసోల్ల మీదికి పొమ్మంటరట! ఇగ యీ పొల్లగాల్లేమొ చేసుకున్న పొల్లల ముండ మోపుటానికి తుపాకులు బుజానేసుకుని బైలెల్లుతురట! ఎంత పాడుదిన మొచ్చింది. అన్నాలం పాడుబడ!’’
అలాగే కొంతసేపు గొణిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది. ‘‘అరేయ్! ఇగ కొద్దిగ కన్ను మలుపుకో. జాము నాత్తిరున్నదింక. ఇంత నిర్ద పట్టితే బతుకుతవు. వశేయ్ మల్లిపోరీ! మనిద్దరం తెల్లారేదాక కావాలుండాలే. నువ్వా కొనకు. నేని కొనకు. కూర్పాట్లు పడ్డవంటే యాదుంచుకో - ఒక్క చరుపుకు దయ్యం వదిలిపోవాలె మరీ - ఆఁ’’

పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. ఇండ్ల వెలుపల కట్టివేసి యున్న గేదెలు లోపలి దుడ్డెల కొరకు అరుస్తున్నవి. లోపలి నుండి దుడ్డెలు విలపిస్తున్నవి. పాల చేపుల ఆతురత ఒకవైపు. ఆకలి బాధ రెండవవైపు. కాని పాలు పిండబడడం లేదు. రోజు ఈ పాటికి ఎటువిన్నా జుంయి జుంయి మనే పయస్సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది. భయం వల్ల గ్రామంలోని జీవ లక్షణాలన్నీ ఒక్కుమ్మడి లుప్తవూపాయమై పోయినవి. మృత్యు సమయపు అంతిమ సంచలమైనా లేదు.
స్మశానవాటికలోని కాటి చిటచిటలైనా లేవు. ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లనిపించింది.
రామమ్మ, మల్లమ్మ ఇద్దరు కావలి కాస్తున్నారు. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు. చీమ చిటుక్కుమన్నా అదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు. కాని చీమ కూడ చిటుక్కుమనడం లేదు. గత రాత్రి భయంకర సంఘటనకు కారకుడైన ఆ యువకుడొక్కడే నిద్రిస్తున్నాడు. తక్కిన గ్రామమంతా శ్వాస బిగబట్టి నిరీక్షిస్తున్నది.
దేనికో? ఎవరికోరకో? ఎందుకో? ఇదంతా... అంతరికీ తెలుసు. పాతకథే!...

రామమ్మ యోచిస్తున్నది. ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరంపైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు. ఇక ఈసారో, ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులే చంపబడ్డారు. ఠానా భగ్నం చేయబడింది. ఊరినంతా దగ్దం చేసి ఊరివారందరిని కాల్చివేసినా ఆశ్చర్యం లేదు. అదొక పండుగే! ఏ ఒక్క ఇంట్లోనో పోలీసులు చొచ్చి హత్యలు, మానభంగాలు సాగించడం, ప్రక్క ఇంటివారు కిమ్మన లేకపోవడం. ఈ విధంగా ఒక్కొక్క యింటి లెక్కన తుదకందరి కదేగతి పట్టడం. ఇంతకన్న ఊరి వారందరు ఒకేసారి చంపి వేయబడటం మేలు కదా? పదిమందితో చచ్చినా మంచిదే, బ్రతికినా మంచిదే కుక్కచావు కన్న!
నిద్రిస్తున్న యువకునికి తల నిమురుతూ రామమ్మ గొణిగింది. ‘‘అబ్బ! ఏం పోరడు! ఇసోంటోప్లూంత మంది చావాల్నో ఇంక!’’
అకస్మాత్తుగా బజారులో మోటార్ ట్రక్కు చప్పుడైంది. ఎటు విన్నా బూటు కాళ్ళ తటతటలే వినరాసాగినవి. ఏవో అరుపులు, తురకభాషలో తిట్లు - దుర్భాషలు ప్రగల్భాలు. ఛటేల్ ఛటేల్‌మని మధ్య మధ్య కొరడా దెబ్బలు.

‘‘చస్తి! చస్తి! నీ బాంచెన్.... నా కెరుకలేదు. అయ్యొ! వావ్వొ! వాయ్యో!!’’ అన్న అరుపులు.
మిన్ను ముట్టే ఆక్రోశాలు. అంతకు మించిన క్రూర నినాదాలు. ఒండొంటితో పోటీ చేస్తున్నవి. మనుష్యులు ఉన్న వారున్నట్లు బజార్లలో ఈడ్వ బడుతున్నరు. రెండు గడియల క్రితం స్మశానవాటికను మరపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది...
మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆ గాఢ నిద్ర క్షణంలో మటుమాయమైపోయింది. రివాల్వరు ముసలవ్వ చేతి నుండి తీసుకొని తోటా పూక్కించాడు. బయట జరుగుతున్న అలజడి రెండు నిముషాల వరకు విన్నాడో లేదో - అతన్నో మహావేశం ఆవరించింది.
ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు. అది భయం కాదు. వ్యాకులత కాదు. దుఃఖము అసలే కాదు. అపూర్వమైన నిశ్చలత్వం, గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి. బయటి హాహాకారం చెవి సోకిన కొద్ది ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది.

రివాల్వరులో తోటాలు నింపుకుని యువకుడు దిగ్గున లేచాడు. తలుపు వద్దకి చకచకా నడిచాడు. గొళ్ళెం మీద చేయి పెట్టాడు. తీయబోయాడు కాని.. కాని వెంటనే అతిని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది. అది ఉక్కుచేయి కాదుగదా అన్నంత దృఢతరంగా తగిలిందని చేతికి. అతడు మహాశ్చర్యంతో వెనకకు తిరిగి చూశాడు. ‘ఆఁ’ అన్నాడు.
ముసలవ్వదే ఆ ఉక్కు చేయి!

‘‘యాడికి?’’ అని ప్రశ్నించింది ముసలవ్వ. యువకుని మాట తడబడ్డది. తుపాకి గుండ్ల మధ్య విహరించే ఈ వీర యువకుడు, రాక్షసులనైనా నిర్భయుడై ఎదిరించే ఆ శూర శిరోమణి, దేశ కల్యాణానికై ప్రళయాన్నైన ధిక్కరించే తరుణ సింహం, నేడొక్క డ్బ్భైయేండ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు.
అతని గుండె జల్లుమన్నది. కాని వెంటనే గొంతు సవరించుకొని అన్నాడు. ‘‘ఎక్కడికేమిటవ్వా అటో ఇటో తేలిపోవాలి. హింస జరుగుతుంటే చేసినవాణ్ణి నేను దాగుకోవాలా? దాగడం మాత్రమెంతసేపు? ఈ యిల్లు సోదా తప్పుతుందా? పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది - నన్ను పోనీ అవ్వా!’’
ముసలవ్వ మాట్లాడలేదు - యువకుని చేయి పట్టి వెనకకు లాగింది. మంత్రముగ్దుని వలె అతడామెను అనుసరించాడు.

బయట అలజడి అధికమైంది. బూటుకాళ్ళ చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది. ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క ఇంటి ముందటికి వెళ్ళారు. ఆ వెనక
‘‘రామ్‌ధన్ గడ్‌రీకీ గుడ్సీ యహీ హై’’ అన్న మాటలు వినిపించినవి.
మళ్ళీ ఒకసారి యువకుడు బయటి తలుపు వైపు పోబోయాడు. కాని ముసలవ్వ అతన్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు అతని చేతి నుండి లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది. మల్లమ్మను పిలిచి చెప్పింది.
‘‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలే? ఆ దుప్పటీన్ను కండువ తీస్కరా! యాడబెట్టినవోతే ఎల్లెం తెచ్చినవా? ఆఁ! పిల్లగా! ఆ దుప్పటి కట్టుకో కండువ నెత్తికి చుట్టుకో ఊఁ యేమాయే గింతసేపా? మల్లీ! నీ రెండు చేతుల దండకడ్యాలు వానికియ్యి... బక్కపల్చటోడు మా పట్టుతై... ఆఁ పట్టినయా? గంతే! ఒక్క కుర్మదారముంటే బాగుండు. ఇప్పుడేడ దొరుకుద్ది? ఊఁ లేకుంటే లేకపాయె. ఈ పోరని చడ్డి కూరాటి కుండ కింద దాచిపెట్టే పొల్లా! ఆఁ గొల్లేశ మేసినవా కొడుకా? అచ్చం ఎర్రగొల్లే నోలిగేనే ఉంటవు! ఎవడన్న మాట్లాడిత్తె గొల్లోనోలె మంచిగ మాట్లాడాలె...’’
‘‘ఆఁ’’ అన్నాడు యువకుడు.

దాగి తిరిగే కార్యకర్తలకు గొల్లవేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు. వేషం తయారయింది. ఇక ఏ త్రోవనో బయట పడడం మాత్రమే శేషించింది. ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు.
అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు సార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. ‘‘రామా ఓ రామీ! ఓ గొల్లరామీ! తల్పూకీ ఖోల్’’ అనే కర్కశ స్వరాలు వినిపించినవి. కొందరు బూట్లవాళ్ళు ఇంటి చుట్టు దగ్గర దగ్గరగా నిలుచుంటున్న అలికిడి వినవచ్చింది. ఇంకేముందీ? తప్పించుకునే వీలులేదు. ఈ గొల్ల వేషమంత వ్యర్థమైనట్లే. యువకుని చేయి రివాల్వరుకై వెదకసాగింది. కాని ముసల్వను అడిగే ధైర్యం రాలేదు.

ముసలవ్వ గుసగుస ప్రారంభించింది? ‘‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో. ఊఁ పండుకో.’’
యువకుని కెటూ తోచలేదు. ఇంతకూ తుదకు పట్టుపడటమే నొసట వ్రాసి యున్నట్లుంది. అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధ పడలేదు. విధి లేక పడుకున్నాడు.
మళ్ళీ తలుపుమీద దిబదిబ!
‘‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. తూ భిన్న హరాంజాదీ! మాట్లాడౌ! మాట్లాడౌ! నీకి తోడ్కల్ తీస్తం ఠైర్! ఫౌరన్ తీ తల్పు, లేకుంటే తోడాయిస్తం సూడు.’’
ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ ఒళ్ళు విరిచిన చప్పుడు చేస్తూ అర్ధ స్పష్టంగా ప్రారంభించింది.
‘‘ఎవ్వర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు? దొంగముండ కొడుకులున్నట్లున్నరు! మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యీపులు పెట్న బలుగుతయ్.’’
బయటి వాళ్ళు ‘‘మేం పోలీసోళ్లం’’ అని ఇంకా ఏమేమో చెప్పబోయారు. కాని ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు. బిగ్గర బిగ్గరగా అరుపులు, మధ్య మధ్యన రెండు మాటల గుసగుస.
‘‘కాలం పాడుగాను! ఎవ్వల కొంపలవాళ్లను పడుండనీయరు. నాత్తరనక పగలనక చంపుతాంటరు.’’
‘‘పొల్లా! పోరని మంచానికి నా గడెంచే అడ్డం పెట్టు.’’

‘‘నన్నేం దోసుకుంటర్రా? ముసలి ముండ దగ్గరేమున్నది? దొంగలైతే ఉన్నోన్ని దోచుకోండి, లేవలేం దాన్నెందుకు చంపుక తింటరు. అబ్బబ్బ! తలుపు పలగొ ఉన్నది. ఆగరాదుండి? కట్టెత్తె తప్పా గుర్రాన్ని? లేవలేని ముండను. చెంగుచెంగున గంతుపూయ్యాల్నా మీ తొందరకు.’’ ‘‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊఁ నడూ!...’’
‘‘ఇగ పగులగొట్టండ్రి! లేచి తలుపు తీసేదాక గూడా ఒపిక లేకపోతే పగులగ్గొట్టండ్రి. ఇంట్లజొచ్చి నా దగ్గరున్న రావన వరాలు తలిన్ని దోసుకోన్రి... దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గి లేదు. ఈ మల్లి ముండకు ఎన్నిసార్లు చెప్పిన మాపటాల్ల కుంపటి కప్పదు. ముదనట్టం ముండ! ఇగ నిన్న మొగడచ్చిండేమొ, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినుపించుకోదు. నడుమనే ఆగమైతాంది. మొగన్ని చూచి మురిసిపోతాంతి. వగలముండ!...’’
‘‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద! చూసెటోని కనుమానం రావద్దు.’’
‘‘ఇగ నా చాతాగాదురా తండ్రీ ఈ మల్లి ముండ లేవలేదు. ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఉహూఁ వీల్లు లేవరు నీకు దీపప్పంతె దొరకదు చీకట్ల! వీల్ల వైస్సు వక్కలుగాను, బజార్ల గంత లొల్లయితాంటె మా రాజుగ గుర్రుకొడుతాన్రు...ఈ అంగడప్పోరి నేంజేతు?... నా ముంగట్నే కొడుకు కోడలు రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. దెబ్బకొడ్తెనేమొ రద్ది. కొట్టకుంటే బుద్ధిరాదు. ఎక్కడి పీడ తెచ్చి పెడితివిరా నా పానానికి! యాడున్నవురో కొడుకా! నా కొడుకా! ముసలిముండకు చెరబెట్టి పోయినావు కొడుకా! నా కొడుకా! నేనేం జేతురో కొడుకో! నా కొడుకా’’!

ముసలవ్వ మహార్భాటంతో రాగం పెట్టి ఏడువసాగింది. బయటివాళ్ళు నానావిధాల మాట్లాడుతున్నరు. ‘‘పాపం పోనీ’’ అని ఒకరు. ‘‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్’’ అని మరొకరు. మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు.
లోపలి నుండి గొణుగు సాగుతూనే ఉంది. ‘‘అవ్వల్ల! అయ్యల్ల! ఆగున్రి తలుపు తీశేదాక అవ్వల్ల! అయ్యల్ల!’’
‘‘తోడ్ దేవొరే దర్వాజా’’ అని బయట ఆజ్ఞ ఇవ్వబడుతుండగనే ముసలవ్వ తలుపు గొళ్లెం తీసింది. ఇద్దరు పోలీసులు ఒక్కుమ్మడి తలుపు నెట్టి తలుపు తెరువబడడంతోనే అమాంతం ఒకరి మీద ఒకరు పడ్డారు.
వాళ్ళు పడడంతోనే ముసలమ్మ పెద్దకేక వేసింది. వాళ్ళు లేవడంతోనే వాళ్ళ క్రిందనే పడ్డట్టుపడి ఏడవసాగింది.
‘‘చంపతిర్రా! నీ దౌడలుబడ - ముసల్దాని పానం తీత్తిర్రా! ఇగ చూసుకోండి ఆ పడుచు పోరగాండ్లాడ మంచంల పడున్నరు. ఈడ నేనున్న, కుండలటున్నయి. గురుగులున్నయి. తలెముంతలున్నయి. పోరి మెడల గంటెపుత్తలున్నయి. పోరగానికి రెండు దండి కడియాలున్నయి. ఇగేం కావాల్నో తీసుకోండి, చంపాల్నంటే చంపుండి. నన్ను చంపండి. పొల్ల ముండమొయ్యక ముందు దాన్ని గూడ తుపాకి నెయ్యండి. ఇద్దర్నొక్కసారే చంపుండి. అప్పట్నుంచి నన్ను చంపుక తింటాన్రు. ఇగ జుర్రుకోండి ఏం జుర్రుకుంటరో!...’’

మల్లమ్మ మెల్లగా కండ్లు నులుముకుంటు మంచం దిగి వ్యాకుల దృష్టితో అటూ ఇటూ చూడసాగింది. యువకుడు కూడా ఆవులిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు.
పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది.
‘‘ఇంకేం చేత్తరో చెయ్యరాదుండి... తుపాకులున్నై గద... చంపరాదుండి నన్ను. ఇగ బతికినన్నోద్దులు బతుకుతనా?....’’
యువకుని వైపు చూపిస్తూ పోలీసు జమాదారు ప్రశ్నించాడు. ‘‘వాడు యెవడున్నడ్ చెప్పు! కాంగ్రెసోడాయేం?....’’

ముసలవ్వ నెత్తిన నోరు పెట్టుకొని అరవసాగింది.
‘‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నావా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది? ఆ మాటత్తోటి మానం దీసుడెందుకు? పానం తియ్యరాదుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నేనైతే గింత బేఇజ్జతి మాట యెవ్వల్లనోట్నుంచి యినలే. ముసల్తనానికి ఇయ్యాల మానం పోయింది. ఇగ యాన్నన్న ఉరిబెట్టుకుని చస్తేంది. ఇలాంటి బతుకు బతికిందానికన్న?.... వాడు మా మల్లడైతడా కాడా ఊరోల్లందర్ని తెలుసుకోన్రి. వెలగచ్చినంక బాగ పరిచ్చవట్టి చూస్కోండి. కాని గిసొంటి బే కంగాలు కూతపూందుకు. మేమసంటోల్లం కాదు బాంచెను! ఏదో మీ పాదాలకింద బతుకుతాన్నం. బైటోడు గొల్లరామి గుడిశెలకొచ్చి తప్పిచ్చుకుంటాడు? పానం పట్టుకచ్చి అప్పచెప్పవయ్య? గొల్లరామెసోంటిదో ఊరోల్లనడుగుండి!’’
అప్పటి తీవ్రతకు, ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో, ఏం చెయ్యాలో వారికి తోచలేదు.

‘‘పోన్రి బాంచెను! ఈడేం లేదు. నా మాట అబద్దమైతే తలకాయ కోశిత్త. నేనేడికి ఉరికిపోను. ఈడ్నే ఉంట. నా మాట డాకల చూడుండి. ఇగ తిప్పల బెట్టకుండి!’’
పోలీసు జమాదారు కొంతసేపు యోచించి లేస్తూ అన్నడు. ‘‘అచ్ఛా! నేన్ పంచనామా చేస్క్రోనీ వస్తా. నీ బయాన్ని తీస్కుంటా. వీన్కి హాజర్ చెయ్యాలె. లేకుంటే నీకీ షూట్ చేస్తా, తెల్సిందీ.’’
జమాదారు బయలుదేరాడు. ముసలవ్వ మంచం మీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరోవైపు మల్లమ్మ అదొక అపూర్వ సమ్మేళమనిపించింది యువకునికి.
‘‘అవ్వా! నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే’’ అన్నాడు యువకుడు భావలీనతలో కండ్లు మూసి.
దోడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావు?... నా పేరు గొల్లరామి! గంతే... ఇగ నువ్వెల్లు... మల్లిని అత్తోరింటికి తోలుకపోత, పొద్దెక్కుతాంది... ఊఁ యెల్లు...’’
ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘ్యుమైందని యువకుడది వరకే తెలుసుకున్నాడు.
(కాకతీయ పత్రిక; 15-10-1949)

2, మార్చి 2012, శుక్రవారం

అక్షరాయుధంతో అలుపెరుగని పోరు

            పౌర స్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు పత్రికల్ని ప్రచురించటం సాహసాల్లోకెల్లా సాహసం.. ఎడ్ల బళ్లు కూడా వెళ్లలేని ఊళ్లలో చాప్‌ఖానాలు (ప్రింటింగ్ ప్రెస్)ఆరంభించి పత్రికల్ని ప్రచురించటం తెలంగాణాలోనే సాధ్యమైంది. పక్కనే ఉన్న కోస్తాంధ్ర మేధావులు పలకరించకున్నా మొక్కవోని ధైర్యంతో తెలుగు తేజాన్ని అక్షర వేదికపై పత్రికా పాత్రలతో ప్రదర్శింపజేసిన మేధావులు ఆనాటి తెలంగాణా సంపాదకులు. ఎప్పుడో పాలమూరు నుంచి హితబోధినితో ఆరంభమైన తెలంగాణా పత్రికా ప్రస్థానం విశాలాంధ్ర అవతరణ వరకు తనదైన విశిష్ట వ్యక్తిత్వంతో విలక్షణ అస్తిత్వంతో వెలుగుదారుల్ని నిర్మిస్తూ పోయింది. మన పాత్రికేయులు మన ప్రతిభామూర్తులు. పెట్టుబడులు లేవు.. సొమ్ములు లేవు.. పైగా నిషేధాల సీమ. అంత నిర్బంధంలో పాత్రికేయ వృత్తిని ధర్మంగా, బాధ్యతగా స్వీకరించి ఒంటి చేత్తో నడిపించారు. ఇక్కడి పత్రికారంగం ఉద్యమాల్లో నెత్తురోడింది. ముష్కర రాజరికాన్ని నిర్నిరోధంగా ఎదురొడ్డి పోరాడింది.. మృత్యుకీలల్లో ఆహుతైనా సరే.. వెనుకడుగు వేయకుండా అధిక్షేపాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణా ప్రాంతంలో పత్రికల ప్రస్థానం ఒక పోరాటం.. ఒక ఉద్యమం.. జాతి అస్తిత్వం.. భాష అస్తిత్వం.. ఇక్కడి పత్రికల భాష మెతుకు భాష.. ఇక్కడి పత్రికల వాసన రైతు స్వేదన. ఇక్కడి పత్రికల రంగు ఏడువందల సంవత్సరాలుగా పాలకుల దాష్టీకంపై తెలంగాణా ప్రజలు నిరంతర పోరాటంతో చిందించిన రుధిరం.
....
1891 జూలై 5వ తేదీన హిందూ పత్రికలో ఒక వార్త వచ్చింది. అది నైజాం రాజ్యంలోని గుల్బర్గా నుంచి ఓ విలేఖరి రాసింది.. అందులో నైజాం రాజ్యంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ‘‘గవర్నర్ జనరల్ పాలనలో ఉన్నప్పటికీ, బ్రిటిష్ ఇండియాలో లేని’’ ప్రాంతం అని స్పష్టంగా అందులో రాశారు. అంటే హైదరాబాద్ సంస్థానం అప్పటికీ స్వతంత్రంగా ఉంది. ఇదే విలేఖరి ఓ బ్రిటిష్ అధికారిని కలిసి హైదరాబాదులో పత్రిక పెట్టుకోవటానికి అనుమతి కోరితే.. మీకు అనుమతి దొరుకుతుందని నేననుకోవటం లేదన్నాడట సదరు అధికారి.. ఎందుకు అలా అనుకుంటున్నారంటే.. అలాంటి పత్రిక ఒకటి ఇక్కడ ఉండాలని మేము భావించటం లేదు కాబట్టి అని జవాబిచ్చాడట. నైజాం రాజ్యంలో  ఒక పత్రిక రావాలంటే అధికారుల ఇష్టాష్టాల మీద ఆధారపడి ఉండేవన్నది ఈ వార్త చెప్తుంది. నిజాం నవాబును ఎవరు ఆశ్రయిస్తే.. అందలం ఎక్కేవాళ్లకు ప్రోత్సాహం.. విమర్శించేవారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేదాకా వదిలిపెట్టకపోవటం.. ఇదీ ఆనాటి వాతావరణం. ది హైదరాబాద్ రికార్డ్(1890), దెక్కన్ టైమ్స్(1891), దెక్కన్ స్టాండర్డ్(1891), దెక్కన్ పంచ్ (1890లో వచ్చిన ఉర్దూ వార్తాపత్రిక)లు 19వ శతాబ్ది చివరలో హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రికలు.  
పంధొమ్మిదో శతాబ్దపు తొలి దశకం వరకు హైదరాబాద్ రాజ్యంలో ఒక్క తెలుగుపత్రిక వెలువడిన దాఖలా లేదు.. కానీ, తొలి పత్రిక మాత్రం శేద్యచంద్రిక 1880లలోనే పాలమూరు నుంచి వెలువడింది. కానీ దాని దాఖలాయే దొరకలేదు.. ఉర్దూ మాతృభాష కాకపోయినా... మాట్లాడే వాళ్లు నూటికి ఇరవై మంది కూడా లేకపోయినా, హైదరాబాద్ సంస్థానంలో సుమారు ఇరవై దాకా ఉర్దూ పత్రికలు చెలామణిలో ఉండేవి.
ఈ మాట అనగానే, తెలంగాణా ప్రాంతంలో అసలు తెలుగే లేదని.. ఉర్దూ తప్ప ఇక్కడి ప్రజలకు తెలుగు రాదనే దుర్మార్గమైన ప్రచారం ఒకటి దుర్నీతితో జరుగుతూ వస్తోంది. దిక్కులేక తెలుగు చెప్పే మాష్టార్లను అరువు తెచ్చుకుని పాఠాలు చెప్పించుకున్నారనే నీతిబాహ్యమైన ప్రచారం జరుగుతోంది. తెలుగుకు అధికార ప్రోత్సాహం లేదు కానీ, ఆదరణ లేక కాదు. తెలంగాణేతర ప్రాంతంలో తెలుగు అధికార ప్రాపకంతో సంకరమైతే.. అచ్చతెనుగును తెలంగాణాలో ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఇక్కడి ప్రతిభ ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు.. ఇక్కడి క్రియాశీలత ఎప్పుడూ ఆడంబరాలను కోరుకోలేదు. ఇక్కడ వెలువడిన సృజన యావత్తూ పట్టెడు మెతుకులతో ప్రశాంతతను కోరుకున్నదే తప్ప కూటనీతితో ఒక జాతి అస్తిత్వాన్ని కూకటి వేళ్లతో కూలదోయాలని కోరుకోలేదు.. కుట్ర చేయలేదు.  దినపత్రికా, మాసపత్రికా అన్న తేడా లేదు. తెలంగాణాలో పత్రికలు ఎన్ని రూపాల్లో రావాల్లో అన్ని రూపాల్లోనూ వచ్చాయి. అన్ని రకాల ప్రయోగాలూ చేశాయి.. తరతమ భేదం లేకుండా, తెలంగాణా, తెలంగాణేతర ప్రాంతాల్లో అనన్యసామాన్యమైన గరిమ గలిగిన వాళ్లనెందరినో ఇక్కడ వెలసిన పత్రికలు తమ భుజాలమీద మోశాయి. అందరినీ ఒక్కటిగా, తెలుగువారిగా భావించి, తమ ప్రజానీకానికి వారి శేముషీప్రతిభను విస్తారంగా అందించాయి.
తెలంగాణాలో ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశకంలో మహబూబునగరానికి చెందిన శ్రీనివాసశర్మ, రామచంద్రరావు సోదరులు మొట్టమొదట ముద్రణాయంత్రాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు ఆత్మకూరు సంస్థానాధీశుడు మూడువేల రూపాయలు పెట్టుబడి పెడితే, ఆ మాత్రం యంత్రం కొనుగోలు సాధ్యమయింది. దాంతో 1912లో హితబోధిని మాసపత్రిక మొట్టమొదటి తెలంగాణా పత్రికగా వెలువడింది. 1917లో స్వామి వెంకట్రావు అనే సంపాదకుడు హైదరాబాద్ లోని గౌలిగూడ నుంచి ఆంధ్రమాత అనే పత్రిక నడిపారు కానీ, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 1920దశకం తెలంగాణ పత్రికా రంగానికి మైలురాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టి.. ఇక్కడి జనజీవనాన్ని, ఉద్యమాల్ని, సమస్యల్ని, సామాజిక నేపథ్యాన్ని అచ్చంగా ప్రతిబింబించిన పత్రికలు ఈ దశకంలోనే వెలువడ్డాయి. ఎందుకంటే నిజాం సంస్థానంలోని పరిస్థితులు, ఇక్కడి ఉద్యమాల పట్ల, సమస్యల పట్ల, ఆందోళనల పట్ల కోస్తాంధ్ర పత్రికలు నామమాత్రంగానే స్పందించాయి. అప్పటికే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణేతర ప్రాంతానికి సరైన దృక్పథం లేదు.. అందువల్లే కావచ్చు తెలంగాణ ప్రాంతంలోని వార్తల పట్ల, ఇక్కడి ప్రజా సమస్యల పట్ల మొదటి నుంచీ అండదండలు అవసరమైన స్థాయిలో లభించలేదు.
ఇందుకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పవచ్చు. ఆంధ్రమహాసభ మితవాదుల చివరి సమావేశాలు మెదక్ జిల్లా కందిలో జరిగాయి. జమలాపురం కేశవరావు ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగాన్ని ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు ప్రముఖంగా ప్రచురించాయి. ‘‘నిజాం రాష్ర్ఠ ఆంధ్ర మహాసభ అధ్యక్షుల ప్రసంగం కోస్తాంధ్ర నుంచి వెలువడే పత్రికల్లోనూ వెలుగు చూడటం అదే తొలిసారి’’ అని కోదాటి నారాయణ రావు రాశారు. మద్రాసు పత్రికల వ్యవహార శైలి తెలంగాణా పట్ల ఎలా ఉండేదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. వాళ్ల వైఖరి తెలుసు కాబట్టే కంది సభలపై తామే ఒక సంచికను ప్రచురించామని కోదాటి నారాయణ రావు తన ఆత్మకథల్లో రాసుకున్నారు... నిజాం కాలంలో ఎలాగూ ఆదరణ లేదు.. ఇవాళ తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనదని, తెలుగుజాతిని ఉద్ధరణను నెత్తికెత్తుకున్నవారికి అసలే లేదు.. స్వాతంత్రసమరయోధుడు మాడపాటి హనుమంతరావు మాటల్లో చెప్పాలంటే...
‘‘ ఆ కాలమున బ్రిటిషు ఆంధ్ర ప్రాంతము నుండి వెలువడుచుండిన తెలుగు పత్రికలు ఇచ్చటి ఆంధ్రోద్యమ వార్తలనప్పుడప్పుడు ప్రకటించుచుండెను. అయినను వాని వలన తగినంత అవసరమున నుండినంత సహాయము లభించలేదు. అది సహజమే. అవి దూరస్థలములుగా నుండుట యొక కారణము. బ్రిటిషిండియాలోని ఉద్యమముల బాహుళ్యము వలన ఇచ్చటి ఉద్యమముల ఎక్కువగా ప్రోత్సహించునవకాశము వారికి లేకయుండెను. ఆ కారణంము వలన నిజాం రాష్ట్రంలోని ఆంధ్రోద్యమము ఇచ్చటి తెనుగు పత్రికల యాశ్రయమునే నమ్ముకుని వానిపైననే ఆధారపడవలసినదయ్యెను. ఇట్టి స్థితిలో  మన రాష్ర్టములోని పత్రికలు చేసిన సేవ ఎంత యమూల్యముగా నుండెనో వేరుగా చెప్పవలసిన పని యుండదు. ’’
నిజమే.. నిజాం సంస్థానంలో పత్రికా స్వాతంత్య్రం నామమాత్రమే. తెలుగు పత్రిక స్థాపించాలనుకున్నా, స్థాపించుకున్న పత్రికలో ఏదైనా రాయాలనుకున్నా.. నిజాం మంత్రిమండలి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి... సర్కారుకు పూర్తిగా అనుకూలంగా ఉన్న పత్రికలను నిజాం సహజంగానే అక్కున చేర్చుకునేవాడు. కానీ, వాటి సంఖ్య వేళ్లపైన లెక్కపెట్టదగినవే. తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ మిత, అతివాద పంథాల్లో ప్రజల్లో జాతీయ వాద చైతన్యాన్ని మేల్కొల్పడంలో కృషి చేశాయి.
మాడపాటి హనుమంతరావు ముషీర్ ఏ దక్కన్ అనే పత్రికను నడిపించారు.. ఇది మితవాద పత్రిక.. కానీ, చరిత్రకారుడిగా నిలిచిన షోయబుల్లాఖాన్ నడిపించిన ఇమ్రోజ్ తన తరాన్ని మించిన స్వరాన్ని బలంగా వినిపించింది. అతివాదంతో రెచ్చిపోతున్న మత ఉన్మాదాన్ని నిర్ద్వంద్వంగా నిరసించింది.. ఇమ్రోజ్‌లో షోయబుల్లా ఉక్కుమాటలు.. ఖాసిం రజ్వీ రజాకార్ల మూకకు నిద్రలేకుండా చేసాయి. చివరకు షోయబ్‌ను హతమార్చేంత వరకూ రజాకార్లకు తిండి సయించలేదు..

హితబోధిని
తెలంగాణా నుంచి అన్ని లక్షణాలతో వెలువడిన పత్రిక హితబోధిని. 1913 జూన్ 13న మహబూబ్‌నగర్ నుంచి మొదటి సంచిక వెలువడింది. ఆనాటి దీని చిరునామా ఏమిటో తెలుసా? ‘సరోజినీ విలాస్ ప్రెస్ మహబూబ్ నగర్ నైజాం’ హైదరాబాద్ సంస్థానానికి నిజాంపేరుతో వచ్చిన ఫేమ్ నైజాం.. ఇవాళ్టికీ సినిమాలను ప్రాంతాల వారిగా పంపిణీ చేసేప్పుడు తెలంగాణా ప్రాంతాన్ని నైజాం అనే పిలుస్తారు. హైదరాబాద్‌కు పర్యాయపదంగా నైజాం అనేది వాడుకలో వచ్చింది.
హితబోధిని పత్రిక పెట్టుకోవటానికి దాని వ్యవస్థాపకులు బి.శ్రీనివాస శర్మ, బి.రామచంద్రరావు కనాకష్టం పడాల్సి వచ్చింది. వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలకు విజ్ఞప్తి చేస్తే.. చివరకు ఆత్మకూరు సంస్థానాధీశుడు శ్రీరామ భూపాల బహిరీ బలవంత్ బహద్దూర్ ముద్రణా యంత్రానికి ఆర్థిక సాయం చేశారు.
ఇవాళ్టి పత్రికల్లో అనుబంధంగా వస్తున్న పుల్ అవుట్‌లను హితబోధిని ఆనాడే ప్రయోగాత్మకంగా ప్రచురించింది. పుల్ అవుట్ మాదిరి కాకపోయినా, పత్రికలో నాలుగు విభాగాలను ప్రత్యేకంగా ప్రచురించారు. 1. వ్యవసాయం, 2. వైద్యం, 3. పరిశ్రామికము, 4. సంఘ సంస్కరణము.
సంవత్సరం పూర్తయిన తరువాత 12 సంచికల్లోంచి ఏ విభాగానికి ఆ విభాగాన్ని విడదీసి కలిపి కుట్టుకుంటే ఎప్పటికీ ఉపయోగపడే పుస్తకాలుగా తయారయ్యే విధంగా వీటిని ప్రచురించేవారు. ఇటీవలి కాలంలో హిందూ దినపత్రిక ఇదే పనిని చేసింది. తన పుల్‌అవుట్‌లలో వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలతో పుస్తకాలు ప్రచురించి మార్కెట్‌లోకి విడుదల చేసింది. దురదృష్టం ఏమంటే ఏడాది గడవకుండానే ఈ పత్రిక ఆర్థిక కష్టాల్లో కూరుకుని పోయి అంతర్థానం అయింది.
హితబోధిని తరువాత మనకు అందుబాటులోకి వచ్చిన పత్రిక నీలగిరి. 1921 నవంబర్ 12.. తెలుగు పంచాంగం ప్రకారమే చెప్పాలంటే, దుర్మతి నామసంవత్సరం, కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి హైదరాబాద్‌లోని ట్రూప్ బజార్‌లో హైకోర్టు వకీలు టేకుమాల రంగారావు నివాసంలో  11 మంది తెలుగు పెద్దలు సమావేశం అయి ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. దీన్నుంచే ఆంధ్ర జన సంఘం ఏర్పాటయింది. దీని లక్ష్యాలలో ఒకటి పత్రిక ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం.. ఈ టార్గెట్‌ను సాధించే దిశగా షబ్నవీసు వెంకట రామ నరసింహరావు నల్లగొంట నుంచి 1922 ఆగస్టు 24వ తేదీన నల్లగొండ పట్టణం నుంచి నీలగిరి పత్రికను ప్రారంభించారు. నల్లగొండకు సంస్కృత రూపం నీలగిరి. అందుకే ఆ పేరుతో పత్రిక వెలువడింది.  బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి లాంటి వాళ్లు ఈ పత్రికలో వ్యాసాలు రాసేవారు. పత్రిక పెట్టిన ఏడాది తరువాత జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాలు నల్లగొండలోని నీలగిరి పత్రిక కార్యాలయంలోనే జరిగాయి. ఆంధ్రోద్యమానికి మద్దతునిస్తూ ఈ పత్రికలో వ్యాసాలు వచ్చేవి. దాదాపు అయిదు సంవత్సరాల పాటు నీలగిరి పత్రిక కొనసాగింది. అంతో ఇంతో డబ్బున్నవాడు కాబట్టి ఆయన పత్రిక ప్రారంభించగలిగాడు. కానీ, అదే పత్రిక ఆయన ఆర్థిక స్థోమతను అంతా దిగమింగేసింది. చివరకు పత్రికను మూసివేసిన కొన్నాళ్లకే షబ్నవీసు మరణించారు.. అప్పటికి ఆయన వయస్సు కేవలం 34 సంవత్సరాలంటే నమ్మబుద్ధి కాదు. కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన దూపాటి వెంకటరమణాచార్యులను షబ్నవీసు కొంతవరకు ఆదుకున్నారు. ఆయన జీవించి ఉంటే మరో సురవరం అయ్యేవారనటంలో సందేహం లేదు.
నీలగిరి పత్రిక వెలువడిన సరిగ్గా మూడే మూడు రోజుల తరువాత అంటే 1922 ఆగస్టు 27న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి అనే ఓ చిన్న గ్రామం నుంచి తెనుగు అనే పత్రిక వెలువడింది. తెలంగాణా వారి ప్రతిభకు, వాళ్ల శేముషీ సంపన్నతకు తెనుగు పత్రిక వ్యవస్థాపకులు మణికిరీటాలు. ఈ పత్రికను స్థాపించి,నడిపించిన వాళ్లు ఒద్దిరాజు సోదరులు. ఈ సోదరులు ఇద్దరిలో ఒకాయన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు.  ఈయన హోమియో పతి వైద్యులు. తెనుగు పత్రికకు ఈయనే సంపాదకుడు. ఈయన తమ్ముడు ఒద్దిరాజు రాఘవ రంగారావు సహాయ సంపాదకుడు.  నీలగిరితో పాటు, తెనుగు పత్రిక సైతం దాదాపు అయిదు సంవత్సరాల పాటు నిజాం రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంపాదకులతో నడిచింది. ఇద్దరు సోదరులు.. పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత భాషలలో రచనలు చేయగల సమర్థులు...
వీరిద్దరూ ఇనుగుర్తిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.. ఆ రోజుల్లో తెలంగాణాలో ప్రింటింగ్ ప్రెస్‌లు వేళ్లపైన లెక్కించేంతగా ఉండేవి. ప్రింటింగ్ ప్రెస్ సామాగ్రేమో మద్రాసులో దొరికేది.. ఇందుకోసం అన్నదమ్ములిద్దరూ మద్రాసు వెళ్లి అక్కడ ఉప్పల వీరన్న శ్రేష్టి అన్న వ్యాపారి దగ్గరి నుంచి సామాగ్రి తెచ్చుకునే వారు..
మద్రాసులో దొరికే కొత్త వస్తువులేవైనా సరే.. రోజుల వ్యవధిలోనే ఇనుగుర్తికి వచ్చేవి. గ్రామ్‌ఫోన్‌లు, సైకిలు, థర్మాస్ ఫ్లాస్క్.. ఇలా ప్రతి వస్తువూ కొత్తగా మార్కెట్‌లోకి వస్తే చాలు.. ఇనుగుర్తిలో ప్రత్యక్షమయ్యేవి.. వరంగల్లు జిల్లాకు కొత్తవస్తువులను చాలా వరకు పరిచయం చేసింది ఒద్దిరాజు సోదరులే. శుభకార్యాల ఆహ్వాన పత్రికలను వాళ్ల ప్రెస్‌లోనే ప్రచురించేవారు.ఈ సోదరులు పత్రికనే కాదు.. ఎస్. రాయ్ ఫార్మసీ అనే మందుల కంపెనీని కూడా స్థాపించారు. మధుర, పిత్త అనే మందులను వీళ్లే తయారు చేసేవారు. మొదటిది మలబద్దకానికి, రెండోది జ్వర నివారణకు బాగా పనికి వచ్చేది. మానుకోటలో మొట్టమొదట ఆయిల్ ఇంజన్ తెచ్చి బిగించిన వాళ్లు ఒద్దిరాజువారే.
వీళ్లు వైదిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్లే.. షేక్‌స్పియర్ సాహిత్యం అంటే చెవి కోసుకునే వారు. గమ్మత్తేమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములూ వయోలిన్‌కు అద్భుతంగా వాయించేవారు. తమ్ముడు రంగారావు వీణావాదనలోనూ ప్రతిభావంతుడే.. అంతే కాదు.. ఇద్దరికీ ఫోటోగ్రఫీ బాగాతెలుసు.. ఈ పేరుతో వీళ్లు ఓ పుస్తకాన్నే రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ప్రతిభకు అంతే ఉండదు.. వాళ్లకు చేతివృత్తుల్లో కూడా మాంఛి నైపుణ్యం ఉంది. వాళ్లకు వడ్రంగం తెలుసు. తాపీపని.. అంటే ఇల్లు నిర్మించే పని కూడా తెలుసు.. చెప్పులు కుట్టుకోవటం కూడా తెలుసు. ఇనుగుర్తిలో తమ ఇంటి ముఖద్వారపు నగిషీ పనిని వారే చేసుకున్నారు. వాళ్ల ఇంటిని వాళ్లే కట్టుకున్నారట.. ఎంత గట్టిగా కట్టుకున్నారంటే, కమ్యూనిస్టుల పోరాట కాలంలో దుండగులు గునపాలతో ఎంత ప్రయత్నించినా గోడ పెచ్చులు ఊడలేదట. దానితో విసుగు చెంది, ఒద్దిరాజు సోదరులు జీవితమంతా కష్టపడి సేకరించిన పుస్తకాలను తగులబెట్టి వెళ్లారట.
తెనుగు పత్రిక సగం డెమీ సైజలో, అంటే దినపత్రిక పరిమాణంలో సగం ఉండేది. ఇది వారపత్రిక. ప్రతి ఆదివారం వచ్చేది. వివిధ విషయాలపై సంపాదకీయాలు ఒకపేజీలో రాసేవారు.. స్థానిక వార్తలకు ఆనాడే పెద్దపీట వేసిన పత్రిక తెనుగు.. మోస్ట్ లోకలైజ్‌డ్ న్యూస్‌పేపర్ తెనుగు. మరో ఆరునెలల్లో మూతపడుతుందనగా తెనుగు పత్రిక వరంగల్‌కు మారింది. కానీ, మనుగడ సాగించలేకపోయింది. స్థానిక వార్తలకు ఇవాళ అన్ని పత్రికలూ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెనుగు ఆనాడే చేసి చూపింది.

1925లో హనుమకొండ నుంచి ఆంధ్రాభ్యుదయము తొలి సంచిక వెలువడింది. మార్చి నెలలో వచ్చిన ఈ సంచిక ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. పత్రికను ఆరంభించటానికి 1922లో ప్రభుత్వం అనుమతి కోరితే అది రావటానికి  ఏడాదిన్నర పట్టింది. ఈ సంచికలు నాలుగు రావటమే గగనమైపోయింది. నిజానికి ఈ పత్రికను 1919లోనే తీసుకురావాలని అనుకున్నారు. కానీ, 1923 నాటికి కానీ ఇది సాధ్యం కాలేదు. 1928 వరకు నాలుగు సంచికలు మినహా మిగతావి తీసుకురాలేదు. కోకల సీతారామ శర్మ ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు.. తెలంగాణ ప్రాంతంలో గ్రాంధిక భాషావాదాన్ని సమర్థించిన పత్రిక ఆంధ్రాభ్యుదయము. గుర్రం జాషువా, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఉమర్ అలీషా, సముద్రాల రాఘవాచార్యుల రచనలు ఈ సంచికల్లో మనకు కనిపిస్తాయి.

రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ దగ్గరలో మఖ్తేవడ్డేపల్లి అనే గ్రామం ఉంది. ఇప్పుడంటే రంగారెడ్డి జిల్లా కానీ, ఇది ఒకప్పుడు హైదరాబాద్ జిల్లానే.. ఇక్కడ బెల్లముకొండ నరసింహాచార్యులు అనే దేశభక్తుడొకాయన దేశబంధు అనే పత్రికను వెలువరించే సాహసం చేశారు. 1926 జూలైలో తూపురాన్ పోస్టు పరిధిలో ఉన్న ఈ మఖ్తేవడ్డేపల్లి నుంచి ఈ పత్రిక వచ్చింది. మూలధనంతో కాకుండా మూల రుణంతో పత్రికను ఆయన ప్రారంభించారు. ఏదైనా మంచిపని చేద్దామని అనుకుంటే ఎవరూ సహకరించలేదని ఆయన తన తొలి సంపాదకీయంలో పేర్కొన్నారు. దేశబంధు టైటిల్ కింద ఆంధ్ర విజ్ఞాన ప్రబోధక మాస పత్రిక అని టాగ్ లైన్ కూడా రాసుకున్నారు.
పత్రికకు వ్యాసాలు పంపే విషయంలో రచయితలు పాటించాల్సిన నియమాల గురించి సూచనలు చేసిన తెలంగాణా పత్రిక దేశబంధు. ‘‘ మా పత్రికకు పంపబడే వ్యాసములు సజ్జన సమ్మతముగా, దేశ హితముగా నుండవలెను. పరస్పరాంతః కలహాస్పదములగు మతముల విషయములు ఇందులో చేర్చబడవు. పత్రికల యందితరులు వ్రాయు వ్యాసములకు సంపాదకుడుత్తరవాది కాదు’’. ప్రింటింగ్ ప్రెస్ కోసం సంపాదకుడు విరాళాలు సేకరించి మరీ నడిపించారు.

తెలంగాణ ఉద్యమ శిఖరం గోలకొండ

తెలంగాణకు ఇవాళ మనం సమైక్యమని భావిస్తున్న తెలుగునేల నాలుగు చెరగలా తనదైన అస్తిత్వాన్ని నిలిపి చూపించిన పత్రిక గోలకొండ. తెలంగాణాలో సుదీర్ఘకాలం కొనసాగిన అచ్చమైన తెలుగు పత్రిక. మంచి అడ్వకేట్‌గా పేరు సంపాదించుకున్న సురవరం ప్రతాపరెడ్డి గారి మనసు పత్రికారంగంవైపు మళ్లింది.. దాని పర్యవసానంగా 1926 మే పదవ తేదీన.. అంటే ఉర్దూ కేలెండర్ ప్రకారం తీర్ నెల మూడో తేదీ.. గోలకొండ పత్రిక తొలి సంచిక అచ్చయింది. దీని తొలి పెట్టుబడి 7వేల రూపాయలు. మొదట అడ్డంకులు ఎన్నో ఎదురుకావచ్చు. కానీ, పత్రిక ప్రారంభించిన సంకల్పం గొప్పది.. అందుకే గోలకొండ పత్రిక పాతిక సంవత్సరాల పాటు తన కలం నుంచి అక్షర తూణీరాలను అప్రతిహతంగా వదులుతూనే ఉంది.
నిజంగా నిజాం కాలం నాటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే గోలకొండ పత్రిక  అన్నేళ్ల పాటు ఎలా కొనసాగిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. కానీ, సురవరం వారు ఆనాటి స్థితిగతులను వాస్తవిక దృష్టితో  చూసి తెలంగాణా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక చిత్రాన్ని గోలకొండ పత్రిక ద్వారా ప్రపంచానికి చూపించారు.
‘‘ ఈ పత్రిక ఆంధ్రులకు (వారు బయటి వారు కానీ, రాష్ట్రీయులు కానీ) అసాధారణమగు సంబంధం కలది. సర్వకాలాలందు కానీ, అనుకూలం కానట్టి వాతావరణంలోనూ క్లిష్ట పరిస్థితులలోనూ ఈ పత్రిక నడపబడుతున్నది. అట్లున్నను మా పత్రికలలో అత్యగ్రస్థానం వహించిన మూడు నాలిగింటిలో దీనినొకదానినిగా చేసిన నిజాం రాష్ట్రాంధ్రుల సేవ ప్రశంసనీయం. సురవరం ప్రతాపరెడ్డిగారు వారి సహచరులును పత్రికను సజీవముగా నుంచుటయే గాక ఉత్తమమైన స్థాయిలో దీనిని బాగుగా నడుపుతూ తద్వారా ఆంధ్రుల శక్తి సామర్థ్యాలకు ప్రోద్బలం కలిగించినందులకు అన్ని విధాలా ఆంధ్రుల యొక్క గాఢమగు కృతజ్ఞతకు పాత్రులగుచున్నారు. ’’ కోదాటి నారాయణరావు స్వీయ చరిత్ర నారాయణీయంలో  వివరించారు. తెలంగాణాలో పత్రికారచనను అలవరచుకున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారని, అందువల్ల ఆ రంగాన్ని ఎంచుకుంటే అభివృద్ధిలోకి వస్తావంటూ కోదాటి వారిని మాడపాటి వారు ప్రోత్సహించారట. ఆయన ప్రోత్సాహంతోనే కోదాటి వారు గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు.
గోలకొండ మొదట అర్థవార పత్రిక.. ఆ తరువాత దినపత్రికగా మారింది. ఇది ఆనాడు ఆర్థిక స్థోమత లేక సరిగా రాలేకపోయింది. పత్రికను ఎలాగైనా బతికించేందుకు ఒకే పత్రికను, రేపటి పత్రిక, నిన్నటి పత్రిక, ఇవాళ్టి పత్రిక అని అమ్మే వారట.. జనం కూడా కొనటానికి వెనుకాడలేదు. పత్రిక క్రమం తప్పకుండా రావటం మొదలు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు తగ్గిపోయాయి. వేతనాలు తక్కువగా ఉన్నాయని కంపోజిటర్లు ఆందోళన చేస్తే, తమ వద్ద తొందరగా పని పూర్తి చేసుకుని వేరే పత్రికలో పనిచేసే అవకాశాన్ని సురవరం వారు వారికి కల్పించారు.
‘‘గోలకొండ సంపాదకీయాలు అద్భుతం నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ’’ అని దాశరథి తన యాత్రాస్మృతిలో రాశారు. నాటి తెలంగాణాను మనం కళ్లకు కట్టినట్లు చూడాలంటే గోలకొండ పత్రికను చూస్తే చాలు.
ఒక పత్రిక వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థకు ఎదిగింది గోలకొండ తోనే. గోలకొండ నిర్వహణకు ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పడింది. డైరెక్టర్ల బోర్డుకు రాజా రామేశ్వరరావు అధ్యక్షులైతే, మేనేజింగ్ డైరెక్టర్‌గా నూకల నరోత్తమరెడ్డి వ్యవహరించేవారు. తెలంగాణా పత్రికా ప్రస్థానంలో ఒక పత్రిక ఇండస్ట్రీగా ఎదగటం అదే తొలిసారి. ప్రతాపరెడ్డినీ, గోలకొండ పత్రికనూ విడదీసి చూడటం సాధ్యం కాదు. అనారోగ్యం కారణంగా ఆయన నిష్ర్కమణ తరువాత గోలకొండ బలహీనమవుతూ వచ్చింది. 1966 ఆగస్టు 22న గోలకొండ పత్రిక మూతబడింది. గోలకొండ నుంచి బయటకు వచ్చిన తరువాత సురవరం ప్రతాపరెడ్డి ప్రజావాణి పత్రికను ప్రచురించేందుకు ప్రయత్నించారు కానీ, అది నడవలేదు..

సికిందరాబాద్ నుంచి 1942 ప్రాంతంలో వెలువడిన మాసపత్రిక తరణి. జ్యోతిష్య శాస్త్రం వంటి ప్రాచీన శాస్త్ర విషయాలతో పాటు ఆధునిక సాహిత్య విషయాల వరకు వైవిధ్యం కలిగిన రచనలతో కొద్ది కాలం మాత్రమే వచ్చిన పత్రిక ఇది. సుబ్బరాయ సిద్ధాంతి అనే ఆయన దీనికి సంపాదకుడు. దేవులపల్లి రామానుజరావు శోభ 1947లో ప్రారంభించి కొంతకాలం నడిపి చేతులు కాల్చుకున్నారు. ఇది మాసపత్రికగా తెలంగాణా సాహిత్య శోభలను వెదజల్లింది. ఇదే వరంగల్ జిల్లా జనగామ తాలూకా గూడూరు గ్రామంలో బొబ్బాల ఇంద్రసేనారెడ్డి (ఈయన నటుడు, దర్శకుడు కూడా)గ్రామజ్యోతి పేరుతో గోడ పత్రికను నడిపించాడు. వారానికోసారి గోడపై వార్తలు రాసేవారు.. వారం తరువాత వాటిని చెరిపేసి కొత్త వార్తలు రాసేవారు. ప్రభుత్వం ఈ గోడ పత్రికపై వార్తలను కూడా సెన్సార్ చేసేది. వరంగల్ పత్రికా రంగంలో ప్రభుత్వానికి 50 రూపాయలు జరిమానా కట్టిన మొదటి పత్రిక ఈ గోడ పత్రికే.


తొలి దినపత్రిక తెలంగాణ
తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడిన తొలి తెలుగు దినపత్రిక తెలంగాణ. 1941-42 ప్రాంతంలో బుక్కపట్నం రామానుజాచార్యులు ఈ పత్రిక ప్రారంభించారు. బికె చారిగా ప్రసిద్ధి చెందిన ఈయన 1929లోనే హైదరాబాద్ బులెటిన్‌ను స్థాపించిన అనుభవం ఉంది. అంతే కాదు, తన మిత్రుడు కె. రాజగోపాల్‌తో కలిసి 1937లో దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. దక్కన్ క్రానికల్‌లో బుక్కపట్నం వారు చార్మినార్ గాసిప్ అని కాలమ్ రోజూ నడిచేది. బడాబడా నవాబు అంతఃపురాలలోని విషయాలు, పై అధికార వర్గం కార్యాలయాల రహస్యాలు ఇందులో వచ్చేవి. ఇందులో ఉన్నప్పుడే తెలంగాణ దినపత్రిక ప్రారంభమైంది కానీ, ఎక్కువ కాలం కొనసాగలేదు. గోలకొండ పత్రిక దినపత్రిక అయినప్పటికీ అది వారపత్రికగా కొంతకాలం రావటం వల్ల తొలి దినపత్రికగా తెలంగాణాను పేర్కొనవచ్చు. ఆరోజుల్లో తెలంగాణలో దక్కన్‌క్రానికల్ ఆంగ్ల దినపత్రిక అయితే, గోలకొండ తెలుగు దినపత్రిక అనేవారు. ఉర్దూలో మీజాన్ ఉండేది. వీటి మధ్యలో తెలంగాణా వచ్చింది. నాంపల్లి స్టేషన్ రోడ్డు నుంచి వెలువడ్డ ఈ పత్రిక సంవత్సర చందా ఎంతో తెలుసా? 22 రూపాయలు.

ఆంధ్ర సారస్వత మహా సభ ప్రచురించిన పత్రిక ఆంధ్రశ్రీ. ఇది సికిందరాబాద్ నుంచి 1944లో త్రైమాసిక పత్రికగా మొదలైంది. అంతకు ముందు 1941లో సికింద్రాబాద్ నుంచే తెలుగుతల్లి పత్రిక వెలువడింది. రాచమళ్ల సత్యవతీదేవి ఈ పత్రిక సంపాదకులు. అడవిబాపిరాజు, వెల్దుర్తి మాణిక్యరావు, వట్టికోట ఆళ్వారుస్వామి సహాయ సంపాదకులు. కింగ్స్‌వే లోని ఇమాంబావి వీధిలో ఈ పత్రిక కార్యాలయం ఉండేది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో ఈ పత్రిక ప్రచురణ జరిగింది. 1949జూన్‌లో హైదరాబాద్ నుంచి ఓ పక్ష పత్రిక కొంతకాలం నడిచింది. దీనిపేరు భాగ్యనగర్. అయోధ్య రామకవి దీనికి సంపాదకుడు. సహాయ సంపాదకుడుగా యం రాజేశ్వరరావు పేరు పత్రికలో కనిపిస్తుంది. ఇది సుల్తాన్ బజార్ ప్రాంతంనుంచి వెలువడేది. పోలీసు చర్య తరువాత రాజకీయ వాసనలు పుణికిపుచ్చుకుని వెలువడిన పత్రిక భాగ్యనగర్. ఈ పత్రిక పాత ప్రతులు హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయంలో కనిపిస్తాయి. మొత్తం ఆరు సంచికలు వెలువడిన తరువాత ఇది ఆగిపోయింది. 1940 అక్టోబర్‌లో హైదరాబాద్ సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఇది 1945లో హైదరాబాద్ ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికను ప్రారంభించినా ఆదిలోనే ఆగిపోయింది. అయితే 1955లో విద్యార్థుల వాణిని మాత్రమే వినిపించేందుకు హైదరాబాద్ నుంచి కె.ఎం నరసింహరావు విద్యార్థి వాణి పత్రికను తీసుకువచ్చారు. విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనాలా? పాల్గొంటే ఎలాంటి పాత్ర పోషించాలి వంటి వ్యాసాలను ఇందులో ప్రచురించేవారు.

మీజాన్
తెలంగాణాలో ఏకకాలంలో మూడు భాషల్లో వెలువడిన మొదటి పత్రిక మీజాన్. కలకత్తాకు చెందిన గులాం మహమ్మద్ ఈ పత్రికను స్థాపించాడు. ఏడవ నిజాముకు ఇతను నమ్మిన బంటు.. నవాబుకు పూర్తి మద్దతునిచ్చే పత్రికను నడిపించే ఉద్దేశ్యంతోనే మీజాన్ మొదలైంది. అడవి బాపిరాజు ఈ పత్రిక తెలుగు విభాగానికి సంపాదకుడుగా ఉండేవారు.. బాపిరాజు గురించి నాటి తెలంగాణా సాహితీవేత్తల్లో, నాయకుల్లో ఎలాంటి అపోహలు లేవు. అయితే మీజాన్ పత్రిక నిజాం అనుకూల పాలసీ కావటం వల్లనే చిక్కులు వచ్చాయి. మీజాన్‌లో చేరిన తరువాత నిజాం పరిపాలనలోని నిప్పులాంటి నిజాలు తెలిసి వచ్చాయి. తాను కలకత్తావాలా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నానని తెలుసుకున్నారు. పత్రిక ప్రారంభించిన 65 రోజులకే నవాబు వారి పుట్టినరోజు వేడుకలు వచ్చాయి. అందులో రెండు సంపాదకీయాలు వచ్చాయి. ఒకటి నిజాంకు అభినందనలు అన్న పేరుతో వస్తే.. రెండవది తప్పుడు ప్రచారం అన్న శీర్షికతో వచ్చింది. రెండో సంపాదకీయంలో అప్పటికే ఉర్దూలో ప్రసిద్ధి చెందిన రయ్యత్ పత్రిక సంపాదకుడు మందుముల నరసింగరావును దేశద్రోహిగా చిత్రిస్తూ రాశారు.. దీనిపై ప్రజాకవి కాళోజీనారాయణరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘ 65 రోజుల ఉనికి ఉన్న పత్రిక మీది. మీరు హైదరాబాద్ వచ్చి కూడా 65 రోజులే అయింది. నిజాం వంశీయుల కంటే ముందే నిజాం సంస్థానంలో ఉన్న మందుముల వారిని గురించి దేశద్రోహి అని ఎట్లా రాస్తార’’ని బాపిరాజును నేరుగా నిలదీశారు. దానికి బాపిరాజు ‘‘కాళోజీ నారాయణరావు గారూ.. ఏం చేయమంటరండీ నన్ను, నెలకు నూట యాభై రూపాయల జీతమిస్తమన్నారు. దాంతోటి నాకు రెండు పూటల తిండి దొరుకుతున్నది. వాండ్ల ప్రెస్‌లనే నా నవల లేవన్న ఉంటే అచ్చు వేసుకోమన్నారు’’ అన్నారట. 1940వ దశకంలో చోటు చేసుకున్న సంఘటన ఇది. కాళోజీ తన అంతేవాసి నాగిళ్ల రామశాస్త్రితో వివరించిన  ఈ ఘటనను ఆయన ఆ తరువాత అక్షరబద్ధం చేశారు. ఈ పత్రికలో విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి లాంటి వాళ్లు పని చేశారు.. ఆరోజుల్లో వీళ్లందరినీ కలిపి ద్వాదశ మార్తాండులని పిలిచేవారు. ఉగాది సందర్భంగా మీజాన్ పత్రిక తెలంగాణ ప్రముఖులకు బిరుదులు ప్రకటించేది.. ఇవి నవ్వుకునేట్లు ఉండేవి. కాకపోతే అంతా సరదాగా తీసుకునే వారు. అందులో మచ్చుకు ఒకటి.. దేవులపల్లి రామానుజరావుకు ఇచ్చిన బిరుదు. అది ‘‘ఏకశిలానగర శిలాఫలక కలకల శోభావిభావరి’’.
మీజాన్ క్రౌనుసైజు నాలుగు పేజీలుగా వచ్చింది. వార్తలకు తొలి, ఆఖరు పేజీలు. రెండో పేజీలో సంపాదకీయం, ధూపదీపాలు(బాపిరాజు రాసేవారు), నుడి నానుడి(తిరుమల రామచంద్ర రాసేవారు), నర్తనశాల(శ్రీనివాస చక్రవర్తి రాసేవారు.), కలంపోటు(బిసి కామరాజు రాసేవారు),  మిర్చిమసాలా (రాంభట్ల కృష్ణమూర్తి రాసేవారు), టైంబాంబులు (బొమ్మకంటి సుబ్బారావు రాసేవారు). మూడో పేజీలో బాపిరాజు నవల డైలీ సీరియల్ అచ్చయ్యేది. స్థూలంగా మీజాన్ పత్రిక కూర్పు ఇది.  దినపత్రికలో రోజూ నవలను ప్రచురించే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది మీజాన్.

1941లో హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆరుగురు ఉత్సాహవంతులైన యువకులు ప్రారంభించిన పత్రిక ఆంధ్రకేసరి. గుండవరపు హనుమంతరావు దీనికి సంపాదకుడు. 1941 ఫిబ్రవరిలో ఈ పత్రిక తొలి సంచిక వెలువడింది. ‘‘ నైజాము రాష్ట్రంలో 75లక్షల మంది ఆంధ్రులున్నారు. వారి ప్రత్యేక ఆర్థిక సాంఘిక సమస్యలకు తమకనుగుణ్యమగు పరిష్కరణా విధానములను ప్రజలకు తెలుపుటకై వార్తాపత్రికలు, సంచికలు వారికి స్వయముగానుండుట తప్పనిసరి’’ అన్నది ఈ పత్రిక లక్ష్యం. 1944లో మాసపత్రికగా ప్రారంభమైన పత్రిక కాకతీయ. పివి నరసింహరావు వరుసకు సోదరుడైన పాములపర్తి సదాశివరావు మరి కొందరు మిత్రులు కలిసి ఈ పత్రికను స్థాపించారు. అయితే ఇది ఏడాది పాటు కూడా నడవలేదు. కానీ, 1946లో ఇది సాంస్కృతిక, ప్రాంతీయ, రాజకీయ, సాహిత్య పత్రికగా తిరిగి ప్రారంభమై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది. దేశ ప్రధానమంత్రిగా కీర్తిగడించిన పివి నరసింహరావు ఈ పత్రికలో మూడు పేర్లతో వ్యాసాలు రాసేవారు. ఆయన హాస్యరచనలు కూడా చేశారు. దురదృష్టమేమిటంటే ఈ పత్రిక ప్రతులు ఇప్పుడు లభించవు.

రయ్యత్
వాక్స్వాతంత్య్రము లేదు.. బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ అంతకంటే లేదు.. ఆందోళనలకు, ధర్నాలకు, సహాయ నిరాకరణానికి ఎలాంటి అవకాశము కూడా లేదు. ఇలాంటి వాతావరణంలో పత్రికల ద్వారా ప్రజల్లో కొంతైనా చైతన్యం తేవచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఉర్దూలో రయ్యత్ పత్రిక మొదలైంది. తెలంగాణ పత్రికారంగంలో రాజధిక్కార స్వరాన్ని ప్రత్యక్షంగా, తీవ్రంగా వినిపించిన తొలి పత్రిక రయ్యత్. మందుముల నరసింగరావు దీని సంపాదకులు.. నిజాం ప్రభుత్వం దేశద్రోహిగా అభివర్ణించినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ముందుకు వెళ్లగలిగిన పాత్రికేయుడు మందుముల. తన పత్రిక ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అవసరమైన జాగృతిని కలిగించటంలో ఆయన విజయం సాధించారు. తెలంగాణాలో జరుగుతున్న నిజాం వ్యతిరేక యుద్ధాన్ని గురించి ఎక్కడో ఉన్న ఉత్తర భారతీయులకు సమాచారం అందిందంటే అది రయ్యత్ పత్రిక వల్లనే సాధ్యపడింది. ఆనాటి మితవాద యుగంలో దాని పరిమితులను దాటి అతివాద పోరాట పంథాను కలానికికెత్తుకున్న యోధా రయ్యత్ అని చెప్పటానికి సందేహం అక్కర్లేదు. ఆరోజుల్లో దేశ సమస్యలను గురించి ఆలోచించే ప్రతివారూ రయ్యత్ పత్రికను చదివేవాడు. ప్రభుత్వ విధానాలను విమర్శించటంలో ఎంతమాత్రం జంకకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచిన గౌరవం రయ్యత్ పత్రికకే  దక్కుతుంది. నూరు రూపాయల పెట్టుబడితో 1927లో రయ్యత్ మొదలైంది. మొదటి సంచికకు సరోజినీ నాయుడు శుభాఃశీస్సులు అందించారు. రెండో సంచికలో మహరాజా కిషన్ పర్షాద్ కవితలు అచ్చయ్యాయి. 1929నిజాం ప్రభుత్వం రయ్యత్‌ను నిలిపివేసింది. తిరిగి 1932లో మళ్లీ మొదలైంది. పింగళి వెంకట రామరెడ్డి 500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. గోలకొండ పత్రికకు ఇది సమకాలీన పత్రికే. ఇది వారపత్రిక నుంచి దినపత్రిక స్థాయికి ఎదిగాక, గోలకొండ మాదిరిగానే, రయ్యత్ లిమిటెడ్ కంపెనీగా ఎదిగింది. ఇరవై సంవత్సరాల పాటు ఉద్యమ క్షేత్రంలో ఉరకలెత్తిన పత్రిక ప్రభుత్వం నిషేధించటంతో మూతపడాల్సి వచ్చింది.

షోయబుల్లాఖాన్

తెలంగాణా పాత్రికేయ రంగానికి ప్రాతఃస్మరణీయుడు, తెలంగాణా జర్నలిస్టులకు పూజనీయుడు షోయబుల్లాఖాన్. నిజాం సంస్థానంలో రజాకార్ల దురంతాలను నిర్భయంగా ఎండగట్టి.. పెన్ పవర్‌ను చూపించిన సాహసి. ముష్కర మూకల దొంగదెబ్బకు బలైపోయిన అమరుడు. ఈయన రాజకీయ ప్రస్థానం రయ్యత్ పత్రికతోనే మొదలైంది. మందుముల నరసింగరావు దగ్గర పని చేస్తున్న నలుగురు సహాయ సంపాదకులు రాజీనామా చేసి వెళ్లిపోవటంతో ఇద్దరు సంపాదకులను వెతుక్కోవలసి వచ్చింది. ఆ అన్వేషణలో దొరికిన ఆణిముత్యం షోయబుల్లాఖాన్. పాతికేళ్ల వయసులోనే వృత్తిలోకి వచ్చి వేడి నెత్తురు శక్తి ఏమిటో చూపించిన వాడు. షోయబ్ పూర్వికులు ఉత్తర ప్రదేశ్ వాళ్లు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాడు. తాను రాయిస్టుననీ, అయినా పత్రికా విధానాలను పాటిస్తానని షోయబ్ హామీ ఇచ్చాడు. 75 రూపాయలతో మొదలైన షోయబ్ జీతం వందరూపాయలకు చేరుకుంది. అయితే రయ్యత్ పత్రిక అనుసరిస్తున్న మితవాద ధోరణి ఆయనకు నచ్చలేదు. నిజాం విధానాలను నిర్ద్వంద్వంగా విమర్శిస్తున్నా.. మితవాదంతో వ్యవహరించటం ఆయనకు సరిపడలేదు. ఓ పక్క హైదరాబాద్ రాష్ర్టం తగులబడిపోతోంది. రజాకార్లు రెచ్చిపోతున్నారు.. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా మట్టుబెడుతున్నారు. ప్రజలంతా కొందరు గుల్బర్గా వైపు, మరి కొందరు నాగపూర్ వైపు.. ఇంకొందరు విజయవాడ వైపు వలసలు పోవలసిన పరిస్థితి. అయినా రయ్యత్ విమర్శల్లో అతివాదం లేకపోవటంతో షోయబ్ ఆ పత్రికను విడిచిపెట్టాడు. బయటకు వచ్చి ఇమ్రోజ్ పత్రికను ప్రారంభించాడు. ఇది దినపత్రిక. ఆయన పత్రికను స్థాపించేనాటికే నిజాం రాజు రజాకార్ల చేతిలో బందీ అయ్యాడు.. రజాకార్ల నేత ఖాసిం రజ్వీ ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా మంజూర్ జంగ్, ముల్లా అబ్దుల్ బాసిత్, సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ జాఫరీ, బాఖరలీ మీర్జా, ఫరీద్ మీర్జా, హుసేన్ అబ్దుల్ ముసాదే అనే వాళ్లు ఓ పత్రికా ప్రకటన చేశారు. ఆ ప్రకటన యథాతథంగా ఇమ్రోజ్‌లో అచ్చయింది. దాని ఆధారంగా షోయబ్ సంపాదకీయాన్ని కూడా రాశాడు. ఇది రజాకార్లకు మింగుడు పడలేదు. 1948 ఆగస్టు 22న (ఇంకా అప్పటికి హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు.. పోలీసు యాక్షన్ మొదలు కాలేదు.. ఈ ఘటన జరిగిన 25 రోజుల తరువాత అంటే సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించింది. ) నగరం నడిబొడ్డున కాచిగూడ ప్రాంతంలో రజాకార్లు షోయబుల్లాఖాన్‌ను దారుణంగా హత్య చేశారు. మొదట షోయబ్ రెండు చేతులు నరికారు. ఆ తరువాత శరీరమంతా కత్తులతో పొడిచి పొడిచి కిరాతకంగా హతమార్చారు. అంతటితో ఆగక తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. ఆ కాలంలో అంత భయంకరమైన హత్య మరొకటి లేదు. ఈ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజాం స్వతంత్ర ప్రతిపత్తి సరికాదన్నందుకు రజాకార్లకు ఒక గొప్ప పాత్రికేయుడు బలైపోయాడు.

తెలుగువారి ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న పత్రిక  తెలంగాణాలో సుజాత. 1927లో మొదటి సంచిక వచ్చినా.. దానితోనే ఆగిపోయింది. ఆ తరువాత 50వ దశకంలో మళ్లీ ప్రారంభమై తెలంగాణాకు సాహిత్య సేవలందించింది. 1950లో గడియారం రామకృష్ణ శర్మ తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 15న తిరిగి ప్రారంభమైన ఈ సంచిక మూడేళ్ల పాటు నడిచి ఆగిపోయింది. సుజాత పత్రిక 48 పేజీలతో వచ్చేది. ఆ రోజుల్లో ఒక్కో సంచికకు నాలుగు వందల రూపాయల ఖర్చయ్యేది. దాన్ని భరించటమే కష్టమై మూసి వేయాల్సి వచ్చింది. తెలంగాణాలో సాహిత్య పత్రిక అంటే గుర్తుకు వచ్చేది సుజాతే.
వామపక్ష భావాలతో, స్పష్టమైన ఆధునిక దృక్పథంతో ‘‘సాహితీ మిత్రులు’’ వరంగల్లు నుంచి వెలువరించిన పత్రిక సృజన. 1966లో తొలి సంచిక కాళోజీ సంపాదకత్వంతో విడుదలైంది. నాలుగేళ్ల వరకూ ఆయనే సంపాదకుడుగా ఉన్నారు. ఆ తరువాత ఆ బాధ్యత, పేరు నవీన్ తీసుకున్నారు. పేరు ఎవరిదైనా పత్రికకు సంబంధించిన ప్రధాన బాధ్యతలన్నీ ప్రముఖ విప్లవకవి వరవరరావు నిర్వహించేవారు. మొదట త్రైమాసికంగా, ఆ తరువాత మాసపత్రికగా వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా సంపాదకత్వ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే 1973లో అరెస్టు కావటంతో ఆయన భార్య హేమలత ఆ భారాన్ని స్వీకరించారు. 1992 వరకూ ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉంది.
అచ్చమైన తెలుగు నగరి వరంగల్లు. ఒకప్పుడు కవులకు, ఖడ్గవీరులకూ ఇది ప్రసిద్ధి.. మేటి పోటరి జగజ్జెట్టీలను దేశవిదేశాలకు పంపించిన వీరభూమి. ఆధునిక యుగంలో కలం నడిపే మొనగాళ్లకూ ఇది కేంద్ర బిందువైంది. 1958లో ఎంఎస్ ఆచార్య జనధర్మ వారపత్రికను ప్రారంభించారు. ఆయనకు ఆ పత్రికే ఇంటిపేరుగా సార్థకమైంది. వరంగల్లుకు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెప్పించటం లాంటి అనేక అభివృద్ధి పనులను వరంగల్లుకు సాధించి పెట్టడంలో జనధర్మ కృషి ఉంది. ఆయన షష్టిపూర్తి సందర్భంలో  అభిమానులు పూల మాల వేయటానికి రెండు గంటలు క్యూలో నిలుచున్నారట. ఆయన కుమారుడు మాడభూషి శ్రీధర్ కూడా తొలికాలం జర్నలిస్టు. సంచలనాలకు పెట్టింది పేరు. జనధర్మ వారపత్రికను నడుపుతూనే సాహిత్య సంచికలు కూడా ప్రత్యేకంగా ప్రచురించేవారు. కోవెల సుప్రసన్నాచార్య దానికి సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. 1980 నాటికి వరంగల్ వాణి దినపత్రికను ఎంఎస్ ఆచార్య ప్రారంభించారు. 1994లో ఆయన మరణించేంత వరకూ ఆగకుండా నడిపించారు. ఆ తరువాత రుద్రాభట్ల కిషన్ పత్రికను కొనుక్కొని నడిపించారు. ఇప్పుడు శ్రీకృష్ణ దాని బాధ్యతలు తీసుకున్నారు.
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ పక్షాన హైదరాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక గీటురాయి. ఎస్.ఎం మాలిక్ దీని ప్రచురణ కర్త. వ్యక్తి సంస్కార, సంఘ నిర్మాణ నైతిక పథంగా గీటురాయిని మాలిక్ అభివర్ణిస్తారు.
కాకతీయ యూనివర్సిటీ 1976లో డాక్టర్ కె.వి. రామకోటిశాస్త్రి సంపాదకుడుగా, డాక్టర్ కె. సుప్రసన్నాచార్య అసోసియేట్ ఎడిటర్‌గా ప్రచురించిన వార్షిక పత్రిక విమర్శిని. ఇప్పటికీ ఏడాదికో సంచిక సాహిత్యసేవలందిస్తూ వెలువడుతోంది.
వరంగల్లు జిల్లా మహబూబాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక మానుకోట. సిబి లక్ష్మి ఈ పత్రికకు సంపాదకులు. గత శతాబ్దపు చివరలో ప్రారంభమైన ఈ పత్రిక ఇప్పటికీ కొనసాగుతోంది. 1956లో దేవులపల్లి సుదర్శనరావు సంపాదకులుగా కాంగ్రెస్ వారపత్రిక వరంగల్ చౌరస్తా దగ్గర ఉన్న ఆదర్శ ప్రింటర్స్ నుంచి వచ్చేది. తెలంగాణా జిల్లాల్లో చిన్న పత్రికల సంఖ్య లెక్కపెట్టలేం. ఒక్కో జిల్లాలో వందకు తక్కువ కాకుండా పత్రికలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా తెలంగాణా కోసం తెలంగాణా వాణిని వినిపిస్తూ వెలువడుతున్న పత్రిక నమస్తే తెలంగాణా. రాజకీయ పార్టీ టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించిన పత్రిక ఇప్పుడు తెలంగాణా జన భావనలను భుజాన మోస్తున్నది.
అన్ని యిజాలలోని నిజాలను నివురు తొలగించి ప్రజల ముందుంచిన సాహసం తెలంగాణా పత్రికారంగానిది. ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీపనం చేసి కార్యోన్ముఖులను చేసేందుకు సాధనగా పత్రికారంగాన్ని ఎంచుకుని అద్భుతాలు సృష్టించిన పోతుగడ్డ తెలంగాణా. కలం పాళీతో తెలంగాణ నేలను దున్ని సాహిత్య సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమ వనాలను పెంచి స్వేచ్ఛ కోసం పౌరుషాగ్ని పుప్పొడులను వెదజల్లింది తెలంగాణ పత్రికారంగం.