22, ఫిబ్రవరి 2014, శనివారం

మైలురాళ్ల మొగసాల..!

courtesy-టీమీడియా ప్రతినిధి-వరంగల్
తెలంగాణ మహోజ్వల ఉద్యమ చరిత్రలో వరంగల్‌ది ప్రత్యేక ముద్ర. ఆది నుంచి ధిక్కారానికి దివిటి పట్టిన నేల. తెలంగాణ ఉద్యమంలో అణువణువూ అనిర్వచనీయమైన సన్నివేశమే. ప్రతీ మజిలీలో పోరుసంతకమే. ఉద్యమం ఆటుపోట్లకు ఎదురైన ప్రతీసారి ఓరుగల్లు తన ధిక్కార స్వభావాన్ని ప్రదర్శించింది. తెలంగాణ ఉద్యమాన్ని చుక్కానీయై నడిపించింది. తెలంగాణ అంటే వరంగల్. వరంగల్ అంటే తెలంగాణ ఈ మాటల్ని పదేపదే వల్లించిన వైతాళికుడు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. వేరు తెలంగాణ కాదు వీరతెలంగాణ అని నిరూపించిన గడ్డ వరంగల్. దాశరథి మొదలు కాళోజీ దాకా, రుద్రమ మొదలు సమ్మక్క దాకా, జయశంకర్ మొదలు విద్యార్థి కెరటం దాకా ఒకటా రెండా క్షణమొక యుద్ధంగా సమరశీల పోరాటాలు జరిపిన ఏకశిలా నగరం ఎగిరి దుంకిన జ్ఞాపకం. వరంగల్ డిక్లరేషన్ నుంచి టీఆర్‌ఎస్ మహాగర్జన దాకా సభల నిర్వహణకు పు ట్టిల్లుగా ఓరుగల్లు పోరుజెండాలెత్తింది. ఉద్యమ నెగళ్లు మం డించింది. ఉద్యమం కాటగలుస్తుందా అని బుద్ధిజీవులు గాబరా పడుతున్న సందర్భంలో పిడికిలై లేచి పిడుగుల వాన కురిపించింది. సమైక్యాంధ్ర కుట్ర కుత్తికలను శాంతికత్తులతో తెగ్గోసింది వరంగల్ నేల. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మైలురాళ్లుగా నిలిచిన కొన్ని సంఘటనల్ని మరికొన్ని ఉదంతాలను దశ్యమానం చేసే కథనమే ఇది.

చంద్రబాబుకు చుక్కలు చూపిన మాన్యుడు
2008లో తనకిక ఎదురేలేదని విర్రవీగుతూ తెలంగాణ ఉద్యమాన్ని కాటగలపాలని మీకోసంఅంటూ యాత్ర మొదలుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయపర్తిలో అతిసామాన్య రైతుకూలీ ఫణికర మల్లయ్య, పార్టీలోపల కానీ, బయట కానీ చంద్రబాబుకు ఎవరూ ఎదురుచెప్పని సందర్భంలో చంద్రబాబు ముక్కుమీద గుద్దినట్టు మా తెలంగాణ మాకు కావాలె. మీరే ఆపుతాండ్లట కదా..! అని నిలదీసి తెలంగాణ ఓరుగల్లు పౌరుశాన్ని చాటి మాన్యుడిగా నిలిచారు.

మహిమగళ్ల మానుకోట..
పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించి సమైక్య రాగం వినిపించిన వైఎస్ జగన్ ఓదార్పు పేరుతో మే 28, 2010న మానుకోటలో అడుగు పెట్టే ప్రయత్నం చేసిండు. మానుకోట కాదుకదా జగన్‌ను జిల్లాలోనే అడుగు పెట్టనివ్వలేదు. మానుకోట రైల్వేస్టేషన్ వద్దకు వేలాది మంది విద్యార్థులు,తెలంగాణవాదులు,టీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకొని సమైక్యవాద పార్టీకి మద్దతు పలికిన వారిపై రాళ్లతో తిరగబడ్డరు. మానుకోట పౌరుషాన్ని చాటిచెప్పారు.
జగన్ రాక సందర్భంగా ప్రజల్లో ధైర్యం నూరిపోయడం కోసం న్యాయవాదులు మానుకోట పురవీధుల్లో కవాతు చేశారు. సమైక్యవాదులకు చుక్కలు చూపించారు. రాళ్లతో దాడిచేసి బతుకుజీవుడాఅన్నట్లుగా సమైక్యవాదులను పరుగులు పెట్టించి తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని అందించారు.

రాయినిగూడెంలో సీఎంకు ముచ్చెమటలు..
తెలంగాణ ఉద్యమం ఉధతంగా సాగుతున్న తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఫిబ్రవరి, 2011న రచ్చబండ కార్యక్రమానికి ముందుకొచ్చారు. ములుగు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకున్నారు. అన్నిదారుల్లో పోలీసు బలగాలను దింపారు. సీఎం సభకు ఎవరినీ చెప్పులు వేసుకోకుండా అడ్డుకున్నారు. విద్యార్థులను, యువకులను రాకుండా జాగ్రత్త పడ్డారు. రాయినిగూడెం సభలో ముందుగా జర్నలిస్టులు జై తెలంగాణ నినాదాలతో నిరసన ప్రారంభించారు. సామాన్య మహిళల నడుమ వచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయం పోరుబిడ్డలు కష్ణలత, గుర్రం కవిత, గుగులోతు జ్యోతి, సావిత్రి ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరారు. ఓరుగల్లు పౌరుషాన్ని సీఎంకు రుచిచూపించారు. రాయినిగూడెంలో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించారు.

బాబు పాలకుర్తి రైతుయాత్రపై తిరుగుబాటు
రైతాంగ సమస్యలపై చంద్రబాబు చేపట్టిన రైతు యాత్రపై తిరుగుబాటు చేశారు. రైతులకు అండగ ఉంటామంటూ చంద్రదండుతో పాలకుర్తికి వచ్చిన చంద్రబాబు కాన్వాయిపై జనగామ వద్దనే తెలంగాణ వాదులు తిరుగుబాటు చేసి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే తెలంగాణవాదులను అరెస్టును చేయించి సాగించిన రైతు యాత్రపై పాలకుర్తి సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా తెలంగాణవాదులు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, టీఆర్‌ఎస్ యూత్ కార్యకర్తలు ఆయనపై చెప్పులు, బూట్లు విసిరి నిరసన తెలిపారు. చంద్రదండుపై తిరుగుబాటు చేసి పాలకుర్తి చాకలి ఐలమ్మ ధీరత్వాన్ని చాటుకున్నారు.
తొలి వెతుకులాట..
యాకూబ్‌రెడ్డి ఉదంతం, చంద్రదండు దండయాత్రకు ముందు అరెస్టుచేసిన తెలంగాణ వాదుల్ని విడిపించాలని, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ముందు అరెస్టు చేసిన తెలంగాణ విద్యార్థి యువకుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కోర్టును ఆశ్రయిస్తే (సెర్చ్‌పిటిషన్) ఆ తదనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్ర చరిత్రల్లో సంచలన ఘటనలు. ఒకదశలో పోలీసులపై కూడా కేసులు నమోదైన అరుదైన సంచలన సన్నివేశాలకు వరంగల్లే వేదికైంది.

పార్లమెంట్‌ను ముట్టడించిన న్యాయవాదులు...
తెలంగాణ ఉద్యమకేతనాన్ని ఢిల్లీ నడివీధుల్లో ఆవిష్కరించిన న్యాయవాదులు ఏకంగా పార్లమెంట్‌నే ముట్టడించి స్వరాష్ట్ర ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేశారు. 2010సంవత్సరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు డు బూజుగుండ్ల రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లిన న్యాయవాదులు జంతర్‌మంతర్ వద్ద సమావేశమై భద్రతాదళాల కల్లుగప్పి మెరుపువేగంతో 6కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్లమెంట్‌ను ముట్టడించి తొలిసారి పార్లమెంట్‌ను ము ట్టడించిన ఘనత దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు.

కదనరంగాన యూనిఫాం ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్నివర్గాల ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులూ చురుగ్గా పాల్గొన్నారు. సకలజనుల సమ్మె ఉధతంగా కొనసాగుతున్న సంయమనంలో వరంగల్ కేంద్రంగా ఎక్సైజ్‌శాఖ, ఫారెస్టు అధికారులు, సిబ్బంది సైతం కదనరంగాన దూకారు. జిల్లా కేంద్రంలో, డివిజన్, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ పోరులో భాగమై ముందుకుకదిలారు.

కేయూలో విద్యార్థి గర్జన..
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటన చేయడానికి వారం రోజుల ముందు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009 నవంబర్ 23న జరిగిన విద్యార్థి గర్జనకు కేసీఆర్ హాజరయ్యారు. విద్యార్థుల్లో ఉద్యమ స్ఫూర్తిని నిం పాడు. ఆతరువాత డిసెంబర్‌లో మంద కష్ణ నాయకత్వంలో చేపట్టిన కేయూ విద్యార్థి పొలికేక కొంత గందరగోళానికి దారి తీసింది. కానీ ఉద్యమంలో విద్యార్థులు ముందుంటారని కేయూ నిరూపించింది. ఆ సందర్భంలోనే కేయూ వేదికగా విద్యార్థి జాక్ పురుడుపోసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపింది.

తొలి న్యాయపోరాటం
1996 అంకురార్పన జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించిన చట్టబద్ధ సంస్థ వరంగల్ బార్ అసోసియేషన్. 2001 సంవత్సరంలో అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణాకర్‌రాజు అధ్యక్షతన జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని రాజకీయ పక్షాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.

తెలంగాణ మహాగర్జన
కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగొచ్చిన కేంద్రం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం తిరిగి తెలంగాణకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న మరో ప్రకటన చేసి అనంతరం శ్రీకష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రకటన చేసి సంవత్సరం గడిచినా ఏటూ తేల్చకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని 2010 డిసెంబర్ 9న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలు పడడంతో వారం రోజులపాటు వాయిదా వేసి డిసెంబర్ 16న కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ వేదికగా 25 లక్షలమందితో మహాగర్జనను నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం చల్లబడలేదని నిరూపించారు. ప్రపంచస్థాయిలోనే అతి పెద్ద జన సమూహాల జాబితాలో ఈ మహాగర్జన చేరింది.