21, ఏప్రిల్ 2011, గురువారం

ఉక్కు దేవత నడయాడిన నేల

తెలంగాణాలో ఉక్కు పరిశ్రమ వెలుగుల గురించి జైకిషన్‌ రాసిన పుస్తకంపై ఆంధ్రజ్యోతి నవ్యలో వచ్చిన సమీక్షా వ్యాసం ఇది.. తెలంగాణా బ్లాక్‌స్మిత్‌ల నైపుణ్యం కళ్లకు కట్టినట్లుగా విశ్లేషించిన గ్రంథం ఇది. ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన పుస్తకమిది.

'శిథిలమైన చల్లారిన బట్టీ అడుగులో నుంచి తీసిన గడ్డకట్టిన చిట్టెపు కుప్పల్ని చూసినప్పుడు ఇక్కడి కమ్మరి పనివారి జీవనం గుర్తుకు వస్తుంది. అణగారిన వారి జీవితాలు అందులో ప్రతిబింబిస్తాయి' అంటారు డాక్టర్ ఎస్. జైకిషన్. ఆనాడు మధ్య ఆసియాలో తయారైన ఆయుధాలకు తెలంగాణ నుంచే ఇనుము, ఉక్కు లోహాలు ఎగుమతయ్యేవని జైకిషన్ చెబుతున్నారు. ఆయన పరిశోధించి వెలువరించిన 'తెలంగాణలో ఇనుము ఉక్కు పరిశ్రమ -ప్రాచీన చారిత్రక ఆనవాళ్లు' పుస్తకంలో తెలంగాణలో నాడు లభించిన లోహాలు, వాటితో ముడిపడిన ప్రజల జీవన విధానం సవివరంగా ఉంది. ఈ పుస్తకంలో కొన్ని భాగాలు..
ప్రాచీన మధ్యయుగాల్లో తెలంగాణలోని అనేక గ్రామాలలో ప్రజలు తమ కులవృత్తుల్ని చాలా గౌరవప్రదంగా కొనసాగించారు. విస్తృతమైన వృత్తిపనులవా అనేక వృత్తుల్ని సుదీర్ఘకాలం కొనసాగించారు. అయినా ఈ వృత్తుల గురించి చారిత్రకమైన లిఖిత ఆధారాలు ఎక్కువగా లభించలేదు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధమైన ఇనుము -ఉక్కు తయారి గురించి గాని, ఇక్కడ లభించే ముడి ఇనుము గురించి కాని ఎక్కడా తెలుపబడలేదు. ఈ ప్రాంతంలో ముడి ఇనుము నిల్వలు అపారంగా ఉండటమే కాక, అనేక ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి, చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందినప్పటికీ, ఏ చరిత్రకారుడు ఈ విషయాన్ని గమనించడం గానీ , పరిశోధించడం గానీ చేయలేదు.

తెలంగాణలో ఒకనాడు ప్రసిద్ధమైన చేనేత, రాగి, కంచు, కాగితం, తోలు, గాజు పరిశ్రమల ఉనికి గురించి కూడా పెద్దగా పరిశోధన జరగలేదు. కరీంనగర్ జిల్లాలోని వెండి ఫిలిగ్రి కళాకారుల అద్భుత కళానైపుణ్యం గురించి కూడా పరిశీలించలేదు. కొన్ని గ్రామాల్లో ప్రాచీన పరిశ్రమల ఆనవాల్లు నేటికీ నిలిచి ఉన్నాయి. చారిత్రకులు, పురావస్తుశాఖ వారు సరైన శ్రద్ధ తీసుకొనకపోవడం వల్ల ఈ ఆనవాల్లు కాలగ ర్భంలో కలిసిపోతున్నాయి. వరంగల్‌లోని తివాచి పరిశ్రమ, పెంబర్తి కంచు పరిశ్రమ, ఉప్పలూరు, గాజు రామారం గ్రామాల్లో ఉండిన గాజుల పరిశ్రమ, కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల కాగితపు పరిశ్రమ, ఇందూరు, నిర్మల్, ఇందల్ వాయి, ఉప్పల్‌వాయి, కోనాపురం, కోనసముద్రం, ఇబ్రహీం పట్నం, కొడిమ్యాల, వెల్గందులలో విస్తరించిన ఆయుధ పరిశ్రమలు లాంటివి ఎన్నో పరిశ్రమల ఆనవాల్లు కనుమరుగైపోయాయి.


మధ్యయుగంలో తుపాకి మందు వాడుకలోకి వచ్చిన తర్వాత ఇనుము, రాగి, ఇత్తడి లోహాలకు విస్తృతమైన గిరాకి పెరిగింది. తుపాకి మందులో ఉపయోగించే రసాయనాలైన సౌరిక లవణం, గంధకం వంటివి చాలా పెద్ద మొత్తాల్లో నాటి అవసరాలకు సరిపడ ఉత్పత్తి చేయబడ్డాయి. వీటి వాడకం క్రీ.శ. ఆరు, ఏడు శతాబ్దాల తర్వాత తెలంగాణలో విస్తృతంగా జరిగింది. ఆయుర్వేదంలో రసప్రయోగ పద్ధతులను ముఖ్యంగా సౌరిక లవణం, గంధకం, పాదరసంలను లోహశుద్ధి ప్రక్రియలో వాడటం ప్రారంభించిన తర్వాత వాటి ఉత్పత్తి అధికం చేశారు. ఈ లోహ, ఖనిజ ఉత్పత్తి వ్యవస్థ అంతా నాటి ఆర్థిక, రాజకీÄ, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేసింది.

సాధారణ కొలిమిలో నైపుణ్యం లేని కమ్మరి పనివారు ఏ వస్తువునూ తయారు చేయలేరు. ఎందుకంటే 300 డిగ్రీల -400 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మాత్రమే ఇనుము పొడిగా రవ్వలుగా మారుతుంది. నైపుణ్యం గల పనివారు మ్రాతమే చాకచక్యంతో దీన్ని ఆ వేడిమీద సాగదీసి ఆయుధాల్ని రూపొందించి పదును పెట్టేవారు. వివిధ రకాల ఆయుధాల తయారీకి పనివారి అద్భుతమైన కళానైపుణ్యం కూడా జోడించబడింది. అలాంటి నైపుణ్యం కలిగిన కమ్మరి పనివాళ్లు నేటి తెలంగాణ గ్రామాల్లో కనుమరుగవుతున్నారు. ఇప్పుడున్న కమ్మరి పనివాళ్లు చాలామందికి ఉక్కు లోహ ం గురించి పెద్దగా తెలియదు. తెలిసిన కొద్దిమంది ఈ లోహాన్ని నైపుణ్యంతో ఎలా మలచాలో నేర్చుకోలేదు. నేడు వేలమంది ఉన్న కమ్మరి పనివాళ్లలో ఏ పదిమందికో మించి ఉక్కులోహంపై స్పష్టమైన అవగాహన లేదని గమనించవచ్చు.

తెలంగాణ గ్రామాల్లో ఇనుమును'కేరీ' లేదా 'కేటి' అని, ఉక్కుని 'ఫౌలద్' అని 'గట్టిముక్క' అని పిలుస్తారు. ఆచార్య బాలసుబ్రమణ్యంగారు 'ఉక్కు -హిందూవాణి -ఫౌలద్' పదాల గురించి ఓ వ్యాసంలో చర్చించారు. తెలుగు భాషలో స్థానిక ఉక్కుని దేశి ఉక్కు అని, పరిశ్రమలో ఉపయోగించే ఉక్కుని 'కేటి' అని పిలుస్తున్నారు. ఇనుము ఉక్కు పరిశోధన నిమిత్తం నేను తెలంగాణ ప్రాంతంలో 2500 గ్రామాలకు పైగా, విస్తృతంగా క్షేత్ర పర్యటన చేసి విస్తారమైన సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. ఇనుము తయారు చేసిన గ్రామాల్లో చిట్టెపు కుప్ప నుండి'సరాలు' పగిలిపోయిన కొలిమి ముక్కలు, మరియు చిన్న చిన్న ఇనుప ముద్దలను నేటికి గమనించవచ్చు. ఉక్కు తయారు అయిన గ్రామాల్లో ఉక్కు పావుల చెత్తకుప్పల నుండి విభిన్న ఆకారాలు గల చిన్న, పెద్ద మూసల ముక్కలు కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి.

కోనాపురం, కోనసముద్రం, ఇబ్రహీంపట్నంలలో ఉక్కుపావుల చెత్తకుప్పలపైనే ఇళ్లు నిర్మించారు. ఈ గ్రామాల నుంచి ప్రాచీన కాలంలో తయారు అయిన ఉక్కు ముద్దలను, వివిధ రకాల ఉక్కు పరికరాల్ని -ఉదాహరణకు కత్తులు, చాకులు, ఖడ్గాలు, గొడ్డళ్లు, వివిధ రకాల గీత పనివారి కత్తులు ఒకటేమిటి అనేక రకాల పదునైన ఆయుధాల్ని తయారు చేశారు.కమ్మరి పనివారి 'దాకల్లు' వివిధ పరిణామాల్లో ఉన్న ఫిరంగి గుండ్లు, ప్రాచీన కాలం నాటి ముద్ద ఇనుము ఈ గ్రామాల్లో నేటికీ లభ్యమవుతున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 600 పైబడిన గ్రామాల్లో ఇనుము కరిగించిన పారిశ్రామిక ఆనవాల్లు ఉన్నాయి. 120కి పైగా ఉక్కు పరిశ్రమ విస్తరించిన గ్రామాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అడవుల్లో ఉన్న చిట్టెపు కుప్పల సమూహాల దగ్గర ఇనుము కరిగించిన బట్టీల ఆనవాల్లు నేటికీ చెక్కుచెదరక నిలిచి ఉన్నాయి.

*** ప్రపంచంలో పదునైన కత్తులు తయారు చేసే డెమాస్కస్, సిరియా, సైఫ్, ఇసఫాన్, బందర్, సరోహి మొదలైన మధ్యఆసియా ప్రాంతాల్లో మనదేశంలో తయారైన ఉక్కుతో మాత్రమే కత్తులను తయారుచేశారు. ఈ ప్రాంతపు కత్తులకి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. దానంతటికీ లోహాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రాంతపు కమ్మరి పనివారిదే. ప్రపంచంలోని ప్రఖ్యాత యోధాగ్రేసరులందరూ వాడిన ఖడ్గాలకు ఇక్కడి లోహాన్నే వినియోగించారనేది నిజం.

*** వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు...' హైదరాబాద్ ప్రాంతంలో అతి ప్రాచీన కాలంనుండే ప్రఖ్యాతి గాంచిన ఇనుము తయారయ్యేదని, దాని నుండి తయారు చేసిన ఉక్కు డెమాస్కస్ కత్తుల తయారీకి మూలమైన ముడి లోహాన్ని పంజాబు ప్రాంతం గుండా పర్షియాకు ఎగుమతి చేయబడేదని' తెలిపాడు.( మార్కోపోలో కాలానికి హైదరాబాద్ నగరం లేదు. అనువాదకర్త బహుశా పొరపాటు పడినాడు. బహుశా అది ఓరుగల్లు అయి ఉంటుంది.) అక్బర్ ఆస్థాన పండితుడైన అబుల్ ఫజల్ రాసిన ' ఐన్ -ఇ- అక్బరీ' గ్రంథంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని నిర్మల్, ఇందూరులలో ముడి ఇనుము సమృద్ధిగా దొరుకుతుందని, అక్కడ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

థివోనాట్ అనే మధ్యయుగ యాత్రికుడు సూరత్ మీదుగా భూమార్గం గుండా మచిలీపట్నానికి సాగిన తన యాత్రావిశేషాల్లో 'ఇనుము ఉక్కు తయారీ కేంద్రాలు మరియు ఆయుధ పరిశ్రమలు ఇందూరు, నిర్మల్, ఇందల్‌వాయి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని, ఈ ప్రాంతం ఆయుధ పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ తయారు చేయబడిన ఆయుధాలు ప్రపంచం అంతటా అమ్మబడతాయి' అని తెలిపాడు.

1672లో విలియం హావర్డ్ అనే డచ్ యాత్రికుడు గోల్కొండ ప్రాంతంలో డచ్ ఈస్ట్ ఇండియా వారు స్థాపించిన ఇనుప పారిశ్రామిక కేంద్రాలను సందర్శించాడు. అక్కడ తయారయ్యే ఇనుప మొలలు, ఫిరంగి గుండ్ల గురించి వివరించాడు. ఈ పరిశ్రమలో స్థానిక కార్మికులే పనిచేస్తున్నట్టు కూడా తెలిపాడు. కాని, ఈ పరిశ్రమ లాభసాటి కాకపోవడం వలన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ పరిశ్రమలను మూసివేసినట్లు తెలుస్తుంది.

ఆర్యుల రాకతో ఇనుము వాడుక భారతదేశానికి వచ్చిందని, వారే తొలి లోహపు ఆయుధాల్ని వాడినట్లు చెప్పబడుతన్నప్పటికీ మధ్య దక్కన్‌లో ఈ పరిశ్రమ ఆనవాల్లు విస్తృతంగా కనిపిస్తాయి. బృహత్ శిలా సమాధులు లేదా పెద్దరాతి సమాధులు మరియు కైయిరన్లు తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల విస్తృతంగా ఉన్నాయి. ఈ సమాధులకు ఇనుము తయారీకి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఈ సమాధుల్లో లోహపు పనిముట్లు ఎన్నో లభిస్తాయి. ఈ సమాధులున్న గ్రామాలలోను, వాటికి సమీపంగాను ఎన్నో చిట్టెకుప్పలు ఉన్నాయి.

*** కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండల కేంద్రం అత్యంత వైభవోపేతమైన ఇనుము - ఉక్కు పారిశ్రామిక కేంద్రమని చెప్పవచ్చు. ఇక్కడి ఉక్కు పావుల ఎత్తైన దిబ్బపైనే రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు. వీటి ద్వారానే నీరు గ్రామం మొత్తానికి సరఫరా చేయబడుచున్నది. ఈ ట్యాంకుల పక్కనే మమ్మాయి దేవాలయం కూడా ఉంది. దేవాలయం పక్కనే విశ్వకర్మ కులాల సంఘ భవనం ఉంది.

ఈ సంఘానికి అధ్యక్షుడు మట్టెల పెద్ద గంగారాం. వయసు 85 సంవత్సరాలు. పంచాణం వారి అన్ని వృత్తుల్లోనూ ఈయనకు ప్రవేశం ఉంది. కమ్మరి పనే కాకుండా వడ్లపని, కంచరపని, కంసాలి పనులన్నీ చేయగలరు. ఈయన సోదరుడు ఈశ్వర్‌కు ఉక్కు పనిమీద అపారమైన అనుభం ఉంది. తమ తాత, తండ్రుల కాలంలో కొనసాగిన ఉక్కు పరిశ్రమ విషయాన్ని వీరు వివరించారు. ఈ గ్రామంలో ఉండే దొంతుల, కోమటి, వైశ్య కులంవారు ఇక్కడ ఇనుము ఉక్కు తయారు చేసే కమ్మరివారికి ముందుగా డబ్బు చెల్లించి ఉత్పత్తి అయిన సరుకును ముఖ్యమైన వ్యాపార పట్టణ కేంద్రాలకు చేరవేయవలసిన బాధ్యత కూడా అప్పజెప్పేవారని తెలిపారు. ప్రస్తుతం ఈ కుటుంబాల వారు ఊరు వదిలి సమీపంలోగల మెట్‌పల్లిలో నివాసముంటున్నారు.

ప్రాచీన మధ్యయుగాల్లో ఫరిఢవిల్లిన ఇనుము -ఉక్కు పరిశ్రమ ఆకస్మికంగా కనుమరుగైంది. ఇట్లా కనుమరుగవడానికి గల కారణాల్ని విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక రంగం విస్తరింపజేయటానికి ఈ పరిశ్రమ కేంద్రాల్ని కూడా ప్రభుత్వం గుర్తించవచ్చు. పురాతత్వ పారిశ్రామిక కేంద్రాల అధ్యయనం ద్వారా శాస్త్రసాంకేతిక విషయాలపట్ల అవగాహన పెంపొందిచవచ్చు.

ఉక్కు ఉత్పత్తి చేసే గ్రామాల్లో కమ్మరివారు 'మమ్మాయి దేవత'ను పూజించే ఆచారం ఉంది. ఈ మమ్మాయి దేవతకి ఈ ప్రాంతాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈమెను లోహ దేవతగా భావిస్తున్నారు. కమ్మరి పనివారి సంస్కృతిలో ఇనుము తయారీ గ్రామాల్లో మాత్రమే ఈ దేవతని పూజించే ప్రత్యేకమైన ఆలయాలు నిర్మించబడినాయి. అమ్మ -ఆయి ='అమ్మ' అంటే తల్లి, 'ఆయి' అంటే ప్రాకృతంలో ఇనుము, సంస్కృత భాషలో అయిస్. అందువల్ల ఈమె లోహదేవత. నేటికి కూడా కమ్మరి వారు ఆ దేవతని ప్రత్యేక సందర్భాల్లో పూజిస్తారు. అంతేకాక ఈ ప్రాంతంలోని ప్రతి కమ్మరివారి ఇంటా ఇప్పటికీ ఈ మమ్మాయి దేవత పూజలు అందు కుంటుంది.

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు


ఈ ఖర నామ సంవత్సరం అందరి జీవితాలలో సుఖ సంతోషాలు కల్గించి శుభప్రదం కావాలని కోరుకొంటున్నాను.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఈ బొమ్మ చూసి చెప్పండి

తెలుగువాళ్లంతా ఒకటే.. ఒకటే జాతి.. ఒకే భాష.. ఒకే సంస్కృతి.. అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం.. ఆత్మగౌరవం అంటూ మాట్లాడుకుంటున్నాం.. కానీ, ఇది ఒక జాతి కాదని.. రెండు జాతులనీ, మహాభారత కాలం నాటి నుంచీ విడివిడి రాజ్యాలని కూడా స్పష్టంగా తెలుస్తున్నది. కృష్ణానదికి దిగువ భాగాన ఆంధ్రక పేరుతో ట్రెユబల్‌  రాజ్యమున్నట్లుగా, కృష్ణానదికి ఎగువన, దండకారణ్యాన్ని ఆనుకుని గోదావరి తీరంలో తెలింగ రాజ్యమున్నట్లుగా తెలుస్తోంది. తెలింగకు పైభాగాన కళింగ రాజ్యం వేరే ఉంది. దక్షిణ భారతాన్ని గెలిచేందుకు పాండవ కనిష్ఠుడు సహదేవుడు కళింగానికి దక్షిణాన ఉన్న తలవానలనే ట్రైబ్‌లను గెలిచినట్లుగా మహాభారతంలో ప్రస్తావన ఉంది. తెలింగ రాజ్యంలోని ఉన్నవారే తలవానలని వాళ్ల భాష తెలుంగు అని చెప్పబడింది. కౌరవ సైన్యంలో తుషార, యవన, ఖాస, దర్వాభిసర, శక, కమత, రమత, ఆంధ్రక, పుళింద, ద్రవిడ, కంచి, కిరాట తదితర రాజ్యాలు భాగస్వామ్యం పంచుకున్నట్లుగా భారతంలోనే ప్రస్తావన ఉంది.