31, డిసెంబర్ 2009, గురువారం

ప్రచార సారథి...

రెండో ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో ప్రత్యర్థులను పక్కదారి పట్టించేందుకు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే ఎత్తుగడను జర్మన్‌ నియంత హిట్లర్‌ వేశాడు.. అది అలా ఇలా కాదు... మరో వందేళ్ల వరకూ గుర్తుండి పోయే రీతిలో సక్సెస్‌ అయింది. హిట్లర్‌ ఆ పనిని తన మంత్రివర్గంలో సమాచార మంత్రిగా పని చేస్తున్న గోబెల్‌‌సకు అప్పగించాడు.. తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడు.. ఒక అంశాన్ని పదే పదే చెప్పటం ద్వారా.. వూ్యహాత్మకంగా వెల్లడించటం ద్వారా దాన్ని నిజమని సర్వజనులూ నమ్మేలా చేయటం గోబెల్‌‌స పని.. దాన్ని ఆయన ఎలా నిర్వర్తించాడంటే.. గోబెల్‌‌స ప్రచారం అన్నది ఒక జాతీయంగా స్థిరపడిపోయింది.


ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోబెల్‌‌స మార్గంలోనే వెళు్తన్నట్లుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఊపందుకొని నెలరోజులు ఇప్పటికే దాటిపోయింది. ప్రజాపాలన పూర్తిగా స్తంభించిపోయింది. పాపం ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారో కానీ, రోశయ్యకు నూరు రోజుల్లో వెయ్యి కష్టాలను ఎదురుచూడాల్సి వచ్చింది. మిగతా సమస్యల మాటెలా ఉన్నా, తెలంగాణ ఉద్యమం మాత్రం రోశయ్యకు కొరకరాని కొయ్యగా మారిపోయింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఇరు ప్రాంతాల నాయకుల మధ్య నలిగిపోతున్నారు..
ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం సిఎం రోశయ్యకు అత్యంత అవసరం అయింది. సమస్యను రుజుమార్గంలో వెళ్లి పరిష్కరించటం ఎలాగూ తన వల్ల కాదు.. ఆ పని కేంద్ర ప్రభుత్వం ఎలాగూ భుజానికెత్తుకుంది. కాబట్టి... తన స్థాయిలో తాను చేయదగింది ఏముందని ఆయన వందిమాగధ బృందం మంచి కసరత్తే చేసింది. చివరకు గోబెల్‌‌స వారికి ఫ్లాష్‌లా తట్టాడు... ఇంకేం ప్రశాంతంగా సచివాలయంలో పెద్ద మనిషి కూర్చుని శాంత గంభీర స్వరంతో నాలుగు మాటలు మాట్లాడటమే కదా చేయాల్సింది అని డిసైడ్‌ అయిపోయారు..ఈ బాధ్యత మంత్రులకు అప్పగించలేరు.. ఎందుకంటే మంత్రులు రెండుగా చీలిపోయారు.. ఆయన మాట వినే పరిస్థితిలో లేరు.. తెలంగాణ మంత్రులు ఎలాగూ వీక్‌..పైగా గోడమీద పిల్లులు కాబట్టి వారికి కనీస గుర్తింపు ఎలాగూ ఉండదు కాబట్టి వారి అవసరం ఎలాగూ ఉండదు.. అందుకని తానే స్వయంగా రంగంలోకి దిగారు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల రాషా్టన్రికి, దాని అభివృద్ధికి తీరని అనర్థం వాటిల్లబోతోందని అందరికీ భూతద్దాలు పంచిపెట్టడం ప్రారంభించారు.. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సింది ఆ అద్దాల్లోంచేనన్నారు.. మామూలుగా చూస్తే అర్థం కాదన్నారు. తనకు తోడుగా రాష్ట్ర పోలీసు బాసునూ ఇతోధికంగా సాయం చేయమన్నారు.. ఇంకేం.. ఇద్దరు కలిసి గోబెల్‌‌సను తమపై ఆవహింప చేసుకున్నారు..
పోలీసు బాసు గిరీశ్‌కుమార్‌ ఈ ప్రచారానికి నాంది పలికారు.. డిసెంబర్‌ 30వ తేదీన తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్‌ పెను హింసాత్మకంగా మారబోతోందని, మానవబాంబులు వచ్చి బీభత్సాన్ని సృష్టిస్తారన్నంత భయోత్పాతాన్ని హైదరాబాద్‌లో గిరీశ్‌ కుమార్‌ సృష్టించారు.. రకరకాల బలగాలను రంగంలోకి దింపి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసించే ప్రాంతాల్లో కవాతులు నిర్వహించారు.. పోలీసు పదఘట్టనలతో ప్రజల్లో ముందుగా ఆందోళన కలిగింది.. సర్కారుకు కావలసింది అదే....తెలంగాణ వాదుల పై స్థానిక ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకత కలగాలన్నదే సర్కారు యోచన.. బంద్‌ ప్రశాంతంగా జరుగుతుందని జెఎసి అదే పనిగా ఊదరగొడుతున్నా పోలీసులకు ఇవేవీ పట్టలేదు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నా 5490 మందిపై అడ్డగోలుగా కేసులు పెట్టేశారు.. వాళ్లను ఆపేది ఎవరు? అడ్డుకునేదెవరు? తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం ఎలాగూ విఫలమైంది. విద్యార్థుల అజెండాపై సాగుతున్న ఉద్యమానికి సరైన మార్గనిర్దేశనం చేసేవారు లేరు.. ఎవరూ లేకుండానే ఉద్యమం ఇప్పటికి ఉధృతంగానే కొనసాగుతోంది. పోలీసు ప్రచారం సాగుతూనే ఉంది. బంద్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఆటపాటలతో, వినూత్నంగా నిరసన తెలుపుతూ ప్రశాంతంగా ముగిసింది. ఉద్రిక్తతల సృష్టి పోలీసులదేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంతృప్తికర ప్రకటన చెప్పకనే చెప్పింది.
ఇక రోశయ్య గారు.. తెలంగాణ ఉద్యమం వల్ల రాషా్టన్రికి రావలసిన పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయన్నారు.. హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్‌ నేమ్‌ అంతా వెళ్లిపోతోందని, ఇక రాషా్టన్రికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదంటూ పిక్చరిచ్చేశారు... అదే విలేఖరుల సమావేశంలో ఎన్ని పరిశ్రలు వెళ్లిపోయాయని ప్రశ్నిస్తే.. జవాబు లేదు.. ఏ పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతామని చెప్పారంటే సమాధానం లేదు...
ఇక మర్నాడు మరో వింత ప్రెస్‌కాన్ఫరెన్‌‌స జరిగింది. నలభై నిమిషాలు జరిగిన విలేఖరుల సమావేశం అజెండా కేవలం సినిమా పరిశ్రమ.. ప్రభుత్వం చాలా కష్టపడి సినీ పరిశ్రమను చెనై్న నుంచి తీసుకువస్తే అది తిరిగి చెనై్నకి తరలిపోతోందని, ఎవరూ చెనై్నకి వెళ్లవద్దంటూ విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు.. తెలంగాణాకు చెందిన ఆర్టిస్టులు ఎవరెవరు పరిశ్రమలో ఉన్నారో చిట్టా చదివి వినిపించారు.. అదేమిటి మీరు విడగొడుతున్నట్లు మాట్లాడుతున్నారని ఓ విలేఖరి అడిగితే, మీరెలా అర్థం చేసుకుంటే అలా చేసుకోండన్నారు.. ఎవరు తరలి వెళ్తామన్నారో ఆ విషయాన్ని మాత్రం రోశయ్య చెప్పలేదు.. తీరా తెల్లవారి సినీ పరిశ్రమ పెద్ద అయిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ భలే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. ఆయన అలా ఎందుకన్నారో అర్థం కాలేదన్నారు.. చెనై్నకి ఎవరూ తరలి వెళ్లరని అన్నారు.. రెండు రాషా్టల్రు ఏర్పడితే సినీపరిశ్రమకు చాలా లాభమని కూడా భరద్వాజ సెలవిచ్చారు. రెండు రాషా్టల్ల్రో ఇన్సెంటివ్‌లు దండుకుని సినీపరిశ్రమ బాగా లాభపడుతుందనీ అన్నారు.. పాపం రోశయ్య గారి గోబెల్‌‌స సక్సెస్‌ కాలేకపోయింది. ఇలాంటి ప్రచారాలు తెలంగాణ ఉద్యమం కొనసాగినన్నాళూ్ల జరుగుతూనే ఉంటాయి. ఇందులో సందేహం లేదు.. తెలంగాణ విడిపోవటాన్ని ఆంధ్రప్రాంత నేతలు అన్ని విధాలా అడ్డుకుంటారు.. చివరి నిమిషం వరకూ అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తారు.. ఎందుకంటే వారికి తెలుగువారంతా ఒకటిగా ఉండాలన్న ప్రేమ కాదు.. హైదరాబాద్‌పై ఆప్యాయత అంతకంటే లేదు.. మిగతా జిల్లాలు వారి కంటికే కనపడవు.. వారిని ప్రధానంగా వెంటాడుతోంది ఒకే ఒక్క ఆందోళన.. సాగర్‌ నీళు్ల.. పోలవరం నిర్మాణం... థర్మల్‌ పవర్‌... తెలంగాణ ఏర్పడితే ఈ వనరుల్లో తమకు కోతపడతాయని వాళు్ల భయపడుతున్నారు.. ఎందుకంటే ఇంతకాలం వీటిని నూటికి నూరు పాళు్ల వినియోగించుకున్న తమకు ఇప్పుడు వాటాల వారిగా వస్తే ఎలా అన్నదే సమస్య... రెడీమెడ్‌గా దొరికే వనరులను వాడుకోకుండా, తమ దగ్గరున్న వనరులను ఇప్పటి నుంచే వాడుకోవటం ఏమిటన్నది వారి ఆందోళన. అందుకే చివరి క్షణం వరకూ తెలంగాణా ఏర్పాటుకు మోకాలడ్డటం ఖచ్చితం... నీలం సంజీవరెడ్డి స్పష్టంగా చెప్పిన సంగతే ఇది.. వేరే ఎవరూ ప్రత్యేకించి దీనిపై అనేది ఏం లేదు.. అందుకే తెలంగాణ ప్రజలపై, వారి ఉద్యమంపై ఈ రకమైన చాటుమాటు దాడులు చాపకింద నీరులాగా జరుగుతున్నాయి.ఎవరు నాయకులు...?

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు? దిశానిర్దేశం చేస్తున్నది ఎవరు? ఇరవై రోజుల క్రితం వరకు లేని ఉద్యమ తీవ్రత ఇప్పుడు ఎందుకింతగా పెరిగింది. ఉద్యమానికి పల్లె పల్లెల్లో విశ్వసనీయత పెరగడానికి ఎవరు కారణమయ్యారు? వీటన్నింటికీ ఒకటే సమాధానం... తెలంగాణ విద్యార్థులు.. విద్యార్థి సంఘాల సమష్టి నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమం ఇది... రాజకీయ నాయకుల ప్రమేయం నామమాత్రంగా కొనసాగుతున్న ఆందోళనలు ఇవి..
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమ నిర్మాతలెవరు?
రాజకీయ నాయకత్వం విఫలం కావటం వల్లనే విద్యార్థులు ముందుకు వచ్చారా?
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమ విశ్వసనీయతను పెంచిందా?
ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి వాస్తవ నాయకత్వం ఎవరిది?

1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జనవరి 9న ఖమ్మంలో ఒక విద్యార్థి తెలంగాణ హక్కుల కోసం చేసిన నిరాహార దీక్షతో ప్రారంభమైంది. తరువాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు.. క్రమంగా విద్యార్థి ఆందోళనను నాటి రాజకీయ నాయకత్వం హైజాక్‌ చేసింది.. విద్యార్థులూ నాయకుల చేతుల్లో ఉద్యమాన్ని పెట్టారు.. ఫలితంగా నాటి ఉద్యమం ఘోరంగా వైఫల్యం చెందింది... అప్పుడు బలైన 360 ప్రాణాలు ఇంకా ఉసూరుమంటూనే ఉన్నాయి.

2001లో తెరాస అరంగేట్రం నుంచి తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ప్రజల్లో విశ్వసనీయతను పెంచలేకపోయాయి. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించటంలో కానీ, రాష్ట్ర సాధన కోసం రాజకీయ ప్రక్రియను ప్రారంభింపజేయటంలో కానీ, రాజకీయ నాయకత్వం సక్సెస్‌ కాలేకపోయింది. జై తెలంగాణ అని నేతలు నినదించటమే తప్ప సాధించింది శూన్యమే...

కానీ ఇప్పుడు ఉద్యమం కిందిస్థాయి వరకు, వ్యక్తుల స్థాయి వరకు విస్తరించింది. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో సైతం తెలంగాణ భావోద్వేగం విస్తరించింది. డిసెంబర్‌ 23న చిదంబరం మలి ప్రకటన చేసిన రోజు నుంచి తెలంగాణ అట్టుడికిపోయింది. ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేకుండా ఆందోళనలు జరిగాయి.. నిరసనలు పెరిగిపోయాయి...
ఇంత ఆందోళనలకు నాయకత్వం వహించింది పూర్తిగా విద్యార్థిలోకమే.. తెలంగాణపై విస్తృత చర్చలు మొదలు పెడతామని చిదంబరం ప్రకటన చేసిన క్షణంలోనే హైదరాబాద్‌ భగ్గుమంది... విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.. అప్పటికి ఇంకా రాజకీయ నాయకత్వం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది.
తెలంగాణపై డిసెంబర్‌ 23 నాటి చిదంబరం ప్రకటనను పాజిటివ్‌ దృక్పథంతో విశ్లేషించే ప్రయత్నాన్నీ కొంతమంది నేతలు చేసారు.. అబ్బే తెలంగాణ ఇవ్వనని అనలేదే అన్నారు..
కానీ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పెల్లుబికిన ఆగ్రహానికి రాజకీయ నాయకత్వం వెనుకంజ వేయక తప్పలేదు.. విద్యార్థులంతా ఏకమై తీవ్రమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో వారి బాటలోకి రాజకీయ నేతలు రాక తప్పలేదు.. అంతకు ముందు ఇదే తెలంగాణ అంశంపై పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న నాయకులు సైతం ఒకరి వెంట ఒకరుగా వచ్చి సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడాల్సి వచ్చింది... తెలుగుదేశం పార్టీ మొదట్లో కొంత అటూ ఇటూగా ఊగిసలాడినా.. నాగం జనార్ధనరెడ్డిపై దాడి తరువాత ఆ పార్టీ వైఖరిలోనూ మార్పు వచ్చింది.
ఇప్పుడు ఉద్యమం నడుస్తున్నదంతా విద్యార్థుల కనుసన్నలపైనే.. విద్యార్థులు నిర్ణయించిన అజెండా మేరకే రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది.. రాజకీయ పార్టీల మాదిరిగా విద్యార్థులకు అధిష్ఠానం అంటూ లేదు.. వారి సమష్టి నాయకత్వమే ఉద్యమాన్ని రాష్ట్రంలో అంతటా విస్తరించేలా చేస్తోంది... ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ ప్రకటన చేసినా విద్యార్థుల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే చేయాల్సి వస్తోంది.
వైఎస్‌ జీవించి ఉన్నంతకాలం పెదవి విప్పని వాళ్లంతా ఇప్పుడు ధైర్యంతో మాట్లాడుతున్నారంటే అందుకు కారణం విద్యార్థుల పూనికతో అన్ని వర్గాల నుంచి పెల్లుబికిన ఆగ్రహమే కారణం... ఇప్పుడు విద్యార్థులను, మేధావులను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు. కేంద్రం ఇప్పుడు తెలంగాణ రాషా్టన్రికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదించే పరిస్థితి విద్యార్థి లోకంలో నెలకొని లేదు.. రాజకీయ నాయకత్వం సైతం వీరిని కాదని ఎలాంటి రాజీకి వచ్చే అవకాశం లేదు..
రెండు రకాల ప్రకటనలు చేసి కేంద్రం సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించలేని పరిస్థితి కొని తెచ్చుకుంది. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని కేంద్రం ఎలా ఆలోచిస్తున్నదీ ఇప్పటికైతే తెలియదు.. ఢిల్లీ వెళ్లి తెలంగాణ మంత్రులు కొంత లాబీయింగ్‌ నడిపించారు.. అయినా ఆంధ్రప్రాంత నాయకుల లాబీయింగ్‌ ముందు వాళ్ల లాబీయింగ్‌ పెద్దగా ఫలించలేదు.. చివరకు జనవరి అయిదున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్న చిదంబరం ప్రకటనపై తెలంగాణ మంత్రులైతే ఉబ్బితబ్బిబై్బ రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారే కానీ, విద్యార్థులు మాత్రం పట్టు పిడవటం లేదు. మంత్రులు తమ వైఖరిని మార్చుకోకపోతే తెలంగాణలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు.. పార్లమెంటులో బిల్లు పెట్టేదాకా ఉద్యమం ఆగేది లేదని విస్పష్టంగా తేల్చి చెప్పారంటేనే విద్యార్థులు ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళు్తన్నారో అర్థం చేసుకోవచ్చు. అఖిలపక్షం కూడా ఇప్పుడు విద్యార్థుల బాణీనే పలుకుతోంది. దీని పర్యవసానంగానే చిదంబరం గురువారం తెలంగాణపై కేంద్ర వైఖరిని కుండబద్దలు కొట్టారు.. డిసెంబర్‌ తొమ్మిదో తేదీన తాను చేసిన ప్రకటనపై పూర్తిగా కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని పార్టీలే తలోరకంగా మాట్లాడటం వల్ల వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుని తెలంగాణ ప్రాసెస్‌పై ముందుకు కదులుతామని తేల్చి చెప్పారు... అఖిల పక్ష సమావేశానికి హాజరవుతున్న పార్టీల్లో టిఆర్‌ఎస్‌, సిపిఐ, బిజెపిలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. సిపిఎం ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నదే.. ఇక పిఆర్‌పి మొన్ననే తన వైఖరిని మార్చుకుంది. ఇక తెలంగాణపై తేల్చి చెప్పాల్సింద కాంగ్రెస్‌, టిడిపిలే.. కాంగ్రెస్‌కు అధిష్ఠానం ఎలాగో ఉంది. ఇక మిగిలింది తెలుగుదేశం... ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు గోడమీద పిల్లివాటంలా మాట్లాడుతున్నారు.. ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? గైర్హాజరవుతారా? హాజరైతే టిడిపి ప్రతినిధిగా ఎవరిని పంపిస్తారు.. రెండు ప్రాంతాల వారిని పంపించి అటూఇటూ కాని వాదనను వినిపించే అవకాశం లేదు. వెళ్తే తానే వెళ్లాలి.. మరి వెళ్తారా? వెళ్తే ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయాన్ని చెప్తారు..? గైర్హాజరైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుంది. మొత్తం మీద తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల ధోరణి ఏమిటన్నది ఈ సమావేశంతో తేలిపోతుంది. అఖిలపక్ష సమావేశం సారాంశం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వస్తుందా? లేదా అన్నదే ఇప్పుడు సందిగ్ధం.. ఎలాంటి ప్రకటన వచ్చినా అది ఖచ్చితంగా తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే విద్యార్థులు రాజీపడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సాధ్యం కాకపోవచ్చు.. నాయకులపై ఇంకా ఒత్తిడి పెరగటం ఖాయం. చిదంబరం సమావేశంతో సంబంధం లేకుండా జనవరి 3న విద్యార్థి గర్జన నిరాటంకంగా కొనసాగుతుందని కూడా విద్యార్థులు ప్రకటించారు.. ఇవన్నీ చూస్తుంటే అసోం లో అసోం స్టూడెంట్‌‌స యూనియన్‌ , జార్ఖండ్‌లో ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌‌స యూనియన్‌ లాగానే తెలంగాణ రాజకీయ యవనికపై తెలంగాణ విద్యార్థుల పాత్ర కీలకం కాబోతోందన్న సంకేతం స్పష్టంగానే కనిపిస్తోంది..

30, డిసెంబర్ 2009, బుధవారం

అమరవీరుల స్తూపం ఓ చరిత్ర


వర్చస్సుకోసం బలం కోసం, శక్తి కోసం ఈ మృత వీరుని హస్తం నుంచి ధనస్సును గ్రహిస్తున్నాను. మీరూ, మేమూ మనం విశ్వమంతా నిండిన వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము. ఈ మృత భూమి ఒడిలో అధిక వర్చస్సును ప్రసరింప జేసేందుకు ఈతణ్ణి చేరుస్తున్నాం. శీరిష కోమలి ఈ మహీషి ప్రతీకారం జరిగేదాక, విచ్ఛిత్తి నుంచి రక్షించనీ!...
పృథ్వీ..!. ఈతన్ని బలంగా నొక్కకు. ఊపిరీ పీల్చుకోని సులభంగా సుకుమారంగా ప్రవేశించని అవనీ తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగినట్లు ఒదిగించుకో.
యుద్ధభూమిలో వీరమరణం పొందిన సైనికుని సమాధి చేస్తున్న సందర్భంలో ఆతని అనుచరులు ఆ మృత శరీరం నుంచి పొందిన ప్రేరణకు అక్షర రూపాలు... ఋగ్వేదంలోని అంశాలు ఇవి..
అందుకే ఒక వీరుడి మరణం.. శత యోధుల జననం...అని అల్లూరి సీతారామరాజు అన్నాడు.. నలువైపుల నుంచి చుట్టుముట్టే ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కునే బలాన్ని, శక్తిని వీరమరణం నుంచి అతని సహచరులు పొందుతారు... చావుకు వెరవకుండా తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన మృతవీరులు ఉద్యమ చైతన్యానికి ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారు.. గన్‌పార్‌‌కలోని అమరవీరుల స్మారక స్తూపం.. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి నిత్య చైతన్యస్ఫూర్తిని ఇస్తోంది.


ఒక సైనికుడి వీరమరణం.. వెయ్యి మంది సైనికులకు ప్రేరణనిస్తుంది. ఒక ఉద్యమకారుడి త్యాగం అతని సహచరులకు ఉత్ప్రేరకం అవుతుంది. ఓ అమరవీరుల స్మృతి చిహ్నం జాతికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల నాడు నాలుగు వందల మంది చేసిన త్యాగం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇన్నేళ్ల తరువాత కూడా ఈ స్థూపం ఇంత చైతన్యశీలిగా ఎలా ఉంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
హైదరాబాద్‌ నడిబొడ్డులో ఉన్న అపురూపమైన నిర్మాణం ఇది.. పది అడుగుల ఎతె్తైన ఈ స్థూపం సాధారణ రోజుల్లో ఎవరికీ పట్టదు.. వాస్తవానికి ఎవరూ పట్టించుకోరు. దాని దగ్గరకు కూడా ఎవరూ వెళ్లరు.. చాలామందికైతే అది ఏమిటో కూడా తెలియదు.. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ముందు కొలువైన ఈ స్థూపం వందలాది అమరుల త్యాగనిరతికి, తుపాకి గుళ్లకు గురై తూట్లు పడ్డ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం.
ఇవాళ తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమానికి పునాది ఈ స్తూపంలోనే ఉంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ప్రారంభించిన నిరాహార దీక్ష రాషా్టన్న్రి పునాదుల్లో కదిలించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడున్న తొమ్మిది జిల్లాల్లో మంటలు రేపింది. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆందోళనలను సర్కారు కఠినంగా అణచివేసిన పర్యవసానం అక్షరాలా 360 మంది బలిదానం..
తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణకోసం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీల అమలు కోసం సాగిన ఉద్యమం అది... 1956లో ఆంధ్ర ప్రాంతంతో విలీనమై సరిగ్గా 13 సంవత్సరాలైనా కాకుండానే ప్రత్యేక వాదం బయలుదేరింది. అసంతృప్తి రేగింది. దాదాపు పదకొండు మాసాల పాటు ఉద్యమం నిరాటంకంగా కొనసాగింది. చివరకు రాజకీయ కూటనీతికి విద్యార్థులు అలసిపోయారు.. ఉద్యమం చల్లారింది. నేతలూ చల్లగా జారుకున్నారు.. ఉద్యమం జాడలే లేకుండా పోయాయి. తెలంగాణ ప్రజానీకానికి తమ వీరపుత్రులకు నిర్మించుకున్న ఈ ఒక్క అమర స్తూపమే స్మృతిగా మిగిలింది. ఆ స్మృతే ఇవాళ్టికీ విద్యార్థులను నీడలా వెంటాడుతోంది. వాళ్లలో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తోంది... మరోసారి ప్రత్యేక తెలంగాణకు నినదించాల్సిన అవసరాన్ని గుర్తుకు తెచ్చింది...
స్తూపంలోని విశేషాలు ఇలా ఉన్నాయి.
ఇది ప్రపంచంలో ఏ స్తూపానికి నకలు కాదు..
పది అడుగుల ఎతె్తైన ఏకశిల రాతితో జరిగిన నిర్మాణం ఇది.
ఇందులో ఉపయోగించిన రాళు్ల వివిధ జిల్లాల నుంచి తెచ్చినవి
ఎరర్రాయి జడ్చర్ల
నల్లరాయివరంగల్‌
తెల్లరాయిపంజగుట్ట
గ్రానైట్‌కరీంనగర్‌

నల్లరాయి శోకాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎరర్రాయి త్యాగనిరతికి గుర్తు
తెలుపు శాంతి చిహ్నం

ఈ స్తూపంపై తొమ్మిది బుల్లెట్‌ గుర్తులు ఉన్నాయి. ఇవి తొమ్మిది జిల్లాలకు తాకిన బుల్లెట్‌ గాయాలకు గుర్తులు
నాలుగు వైపుల 36 రంధ్రాలు ఉన్నాయి.
36*10 =360
నాటి ఉద్యమంలో 360 మంది బలయ్యారు.
ఈ స్తూపం పైన ఉన్న కాలమ్‌‌స ఎటు నుంచి చూసినా తొమ్మిదే కనిపిస్తాయి.
పైన ఉన్న తెల్లని పువ్వు మల్లెమొగ్గ.. ఇందులోనూ తొమ్మిది రేకలే ఉంటాయి.

తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో విద్యుత్తు ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు అమాయకులు చనిపోయారు.. వారి స్మృతి కోసం ఓ స్తూపం నిర్మించుకుంటామంటే ప్రభుత్వం కిమ్మనకుండా పర్మిషన్‌ ఇచ్చింది. స్థలం ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.. మరి గన్‌పార్‌‌క దగ్గర స్తూపం నిర్మించుకోవటానికే సర్కారు అనుమతి ఇవ్వలేదు.. తెలంగాణ కోసం ఎంత ఉద్యమించారో.. అంతకంటే ఎక్కువ ఈ స్తూపం ఏర్పాటు చేసుకోవటానికి తెలంగాణ వాదులు ఆందోళన చేయాల్సి వచ్చింది...
ఇందిర రాజకీయ చాతుర్యం, కాసు బ్రహ్మానందరెడ్డి చాణక్యం ముందు తెలంగాణ ఓడిపోయింది. ఉద్యమం చల్లారిపోయింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుంచుకోవటం కోసం తెలంగాణ వాదులు ఒక స్తూపాన్ని హైదరాబాద్‌లో నిర్మించాలని అనుకున్నారు.. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంది. ప్రత్యేక తెలంగాణ వాదానికి సంబంధించిన ఎలాంటి ఛాయలూ ఉండకూడదంది... రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అంజయ్య, మదన్‌మోహన్‌, మాణిక్‌రావు, హసన్‌లు స్తూప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నాడు డిమాండ్‌ కూడా చేశారు..కానీ, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
అప్పుడు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్తూప నిర్మాణానికి చొరవ తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి స్మృతి కోసం స్తూపాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. డిజైనర్లను ఆహ్వానించింది. రకరకాల డిజైన్లను పరిశీలించింది. చివరకు ఎక్కా యాదగిరి రావుకు ఈ అపూర్వ స్తూప నిర్మాణాన్ని చేపట్టే అవకాశం లభించింది.
నిర్మించిన స్తూపాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసుకోవటానికీ ప్రభుత్వానికి దయ కలగలేదు... అనుమతులు ఇవ్వలేదు.. కానీ తెలంగాణ వాదులు ఈ స్తూప నిర్మాణం అక్కడే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసుకున్నారు.. ఈ కార్యక్రమాన్ని సైతం భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున బలగాలను మోహరించింది. అష్టదిగ్బంధనం చేసింది. అయినా తెలంగాణ వాదులు ఆగలేదు.. అప్పుడు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ స్వయంగా కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు.. ఒకరొకరుగా గన్‌పార్‌‌కకు చేరుకుని అనుకున్న పని పూర్తిచేశారు.. పోలీసులు లాఠీచార్జి చేశారు.. కాల్పులు జరిపారు.. అయినా కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు..
ఎలాగోలా స్తూపాన్ని గన్‌పార్‌‌కలో ఏర్పాటు చేసుకున్నా, అది ఇవాళ్టికి కూడా ఆవిష్కరణకు నోచుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ సామాన్యులే ఆవిష్కరణ వంటివి ఏమీ లేకుండానే నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.. ఎందుకంటే తెలంగాణ నాయకులు అక్కడికి వస్తే అమరవీరుల ఉసురు తగిలి అధికారం పోతుందన్న భయం.. ఆంధ్ర నాయకులకు ఆ స్తూపంతో ఎలాగూ సంబంధం లేదు.. వారు దాని అస్తిత్వాన్నే గుర్తించరు.. ఎవరు వచ్చినా, రాకున్నా.. నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి అలుపెరగని పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది ఈ స్తూపం... అమరవీరుల స్తూపాన్ని నెలకొల్పుతున్న సమయంలో తెలంగాణ వాదులు అక్కడ చేసిన తీర్మానం ఇవాళ్టికీ ప్రేరణ ఇస్తుంది..
``ధర్మం కొరకు, కోటిన్నర తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల కొరకు,
దురహంకార పూరిత, స్వార్థ శక్తులకు వ్యతిరేకంగా 1969లో సాగిన చరిత్రాత్మక
మహోద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు..''

29, డిసెంబర్ 2009, మంగళవారం

1969- తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం

నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన తెలంగాణా ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం రాష్ట్ర చరిత్ర లో ఒక కీలక అధ్యాయం. పదకొండు మాసాల పాటు జరిగిన ఈ ఉద్యమంలో అమరులైన వారు ఎందఱో.. ఈ ఉద్యమం గురించిన వివరాలు, అమరులైన వారిలో కొందరి చిత్రాలు ఈ పోస్ట్ లో ఉంచడం జరిగింది..

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము


ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా , ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు.

సామాజిక నేపథ్యం
ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణా ప్రాంతంలో భూములు కొని, వ్యవసాయం చేసి అభివృద్ధి సాధించారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు భావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో కలిగింది. తెలంగాణా విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్ధుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.

రాజకీయ నేపథ్యం
1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన మర్రి చెన్నారెడ్డి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు,గనుల శాఖమంత్రిగా ఢిల్లీ వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది.


అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన వందేమాతరం రామచంద్రరావు వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది.

ఉద్యమ ప్రారంభం
తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో - తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.

అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి" గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు "తెలంగాణా పరిరక్షణల కమిటీ" ని ఏర్పాటు చేసారు.


జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.


ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.

తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి.
పెద్దమనుషుల ఒప్పందంలోని తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలి.
అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.


అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.

రెండవ దశ

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు
జనవరి 24 న సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు.
జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం, దోపిడిలు విస్తృతంగా జరిగాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు సమ్మెలు చెయ్యసాగారు. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను, ఆంధ్రాలోని కొన్ని పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. ఉద్యమం శాంతియుతంగా జరపాలని కోరుతూ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసాడు. అయినా హింస తగ్గలేదు. ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు.

కోర్టు కేసులు
1969,జనవరి 22 నాటి ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల అధికరణాలకు విరుద్ధమని కొందరు ఉద్యోగులు హై కోర్టులో దావా వేసారు.

అలాగే ఇదే ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా జనవరి 31న ఐదుగురు తెలంగాణా ప్రాత ఉద్యోగినులు మరో దావా వేసారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాతం వారని, ఈ ప్రభుత్వ ఉత్తర్వు వలన తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన.

1969,ఫిబ్రవరి 3: ఆ ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని హై కోర్టు తీర్పు నిచ్చింది.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో మరో దావా వెయ్యగా, కోర్టు తమ ఫిబ్రవరి 3 నాటి తీర్పు అమలు పై స్టే ఇచ్చి, విచారణకు డివిజను బెంచిని ఆదేశించింది. ఫిబ్రవరి 18 న సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీలను ఆపేసింది.

1969,ఫిబ్రవరి 20: హైకోర్టు మరో తీర్పు ఇస్తూ, ఇలా వ్యాఖ్యానించింది.

ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే.
అయితే, బయటి వారిని వెనక్కి పంపకుండా, వారికొరకు అదనపు ఉద్యోగాలను (సూపర్ న్యూమరీ) సృష్టించాలి.
అదనపు ఉద్యోగాల విషయమై తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చెయ్యగా, ముల్కీ నిబంధనల పై ఆంధ్ర ప్రాంతంలో నిరసనగా సమ్మెలు జరిగాయి.

1969,మార్చి 7: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది.

1969,మార్చి 29: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది:

ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపే ప్రభుత్వ ఉత్తర్వు రద్దు
తెలంగాణా ప్రజాసమితి
1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది.


ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి

మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1 - మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు.


1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు.


1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు. జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.


1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది.

ఉద్యమం వెనుకంజ
1969 సెప్టెంబర్ లో ఉద్యమం చల్లారడం మొదలైంది. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ "ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు" అని అన్నాడు. ఉద్యమ తిరోగమనానికి ఇది ఒక సూచిక. విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు.


విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.

అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.


1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.


ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్ వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణా ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.

తెలంగాణా ఉద్యమంలో కొన్ని ప్రత్యేకతలు కలిగిన విశేషాలు:
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కొరకు 65 సంవత్సరాల వృద్ధుడు నిరాహారదీక్ష చేసాడు. విశేషమేమిటంటే, ఆయన ఆంధ్ర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. పేరు కొర్రపాటి పట్టాభిరామయ్య.
ఆంధ్ర ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకులు గౌతు లచ్చన్న, ఎన్.జి.రంగా కూడా ప్రత్యేక తెలంగాణా వాదనను సమర్ధించారు.

అమరులైన వారి చిత్రాలు
28, డిసెంబర్ 2009, సోమవారం

30 రోజుల్లో మన రాష్ట్రం...

అక్షరాలా నెల రోజులు... ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాల పరంపర మొదలై అప్పుడే నెలరోజులైపోయింది. ఈ నెలరోజుల్లో ఎన్ని మార్పులు.. ఎన్ని పరిణామాలు.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది.. జైతెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిపోయింది. శివమెత్తిన ఆందోళనల్లో 40 మంది ప్రాణార్పణ చేశారు.. కేంద్రం ఆట విడుపు ధోరణి ఇప్పట్లో ప్రశాంత పరిస్థితులు కల్పించేదిగా లేదు.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే కనిపించని పరిస్థితి రాషా్టన్న్రి ఎక్కడికి తీసుకువెళు్తందో చెప్పలేని దశకు చేర్చింది.

ఒక వ్యక్తి నిరాహార దీక్ష సంకల్పం..తెలంగాణలో చిచ్చు రేపింది..
పది రోజుల దీక్షలు నలభై ప్రాణాల ఆత్మార్పణం జరిగింది....
తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం చేసిన ఓ ప్రకటన..ఆంధ్రలో ఆందోళనలకు దారి తీసింది..
తెలుగులంతా ఒక్కటే.. అంతా కలిసే ఉంటాం..సమైక్యమే కావాలంటూ ఆందోళనలు
మమ్మల్ని విడదీయవద్దంటూ నిరసనలు... మిన్నంటిన సమైక్యాంధ్ర ఉద్యమం..
రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది..రాజ్యాంగ సంక్షోభం తలెత్తేలా చేసింది..
కేంద్రం మెడలు వంచింది.. అధిష్ఠానం తలొగ్గింది..ఢిల్లీ మలి ప్రకటన చేసింది....
కర్ర విరగలేదు..పాము చావలేదు..
ఒక దగ్గర సద్దుమణిగిన ఉద్యమం మరోచోట మళ్లీ మొదలైంది.
తెలంగాణా వీరంగం వేసింది. విచ్చుకత్తులు విసిరింది.
తెలంగాణ మళ్లీ రణరంగం అయింది...

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా సుప్రీం కోర్టు ప్రకటించిన క్షణం నుంచి ప్రారంభమైన ఆందోళన రాషా్టన్న్రి ఇప్పట్లో విడిచిపెట్టేట్లు కనిపించటం లేదు...తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో దీక్షను సంకల్పించి అక్షరాలా నెలరోజులు పూర్తవుతోంది. ఈ ముపై్ఫ రోజుల్లో ఎన్నో పరిణామాలు రాషా్టన్న్రి కుదిపేశాయి. రాష్ట్రంగా విడిపోకుండానే రెండుగా చీలిపోయింది. రాజకీయాలు రెండుగా విచ్ఛిన్నమయ్యాయి. ప్రాంతాల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. వాదాలు, వివాదాలు, ధర్నాలు, రాస్తారోకోలు.. రైలు రోకోలు.. బంద్‌లు.. అసలు విద్యాసంవత్సరమే అనుమానంలో పడే ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి.
అసలేం జరిగింది? రంగధాంపల్లిలో దీక్ష గురించి నెల రోజుల ముందు నుంచే కెసిఆర్‌ కసరత్తు చేశారు.. మీడియా సమావేశాల్లో పలుమార్లు చెప్పారు.. ఏర్పాట్లూ చేసుకున్నారు..కానీ కెసిఆర్‌ను దీక్ష చేయనివ్వలేదు సర్కారు. 29న కెసిఆర్‌ దీక్ష ప్రారంభించటానికి వెళు్తన్నప్పుడే ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.. ఖమ్మం జైలుకు తరలించారు.. అక్కడి నుంచి ఆరోగ్యం బాగాలేని కెసిఆర్‌ ఆసుపత్రికి తరలించాక ఆయన దీక్ష విరమించినట్లు వీడియో ఫూటేజ్‌ వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ అగ్గిమీద గుగ్గిలమై పోయింది. ఆయన బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అంతే అప్పటి నుంచే ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియాలో విద్యార్థులపై పోలీసు లాఠీలు విరిగిపడ్డా ఉద్యమం సద్దుమణగలేదు సరికదా మరింత ఉధృతమైంది. దీంతో డిసెంబర్‌ 7న ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.. అన్ని పార్టీలూ తగుదునమ్మా అంటూ రాష్ర్ట సర్కారుదే తప్పని తేల్చేశాయి. సర్కారు అసెంబ్లీలో తీర్మానం పెడితే ఆమోదించటానికి తమకేం అభ్యంతరం అని నిలదీశాయి. ఈ లోపే పదోతేదీన శాంతి ర్యాలీకి విద్యార్థులు సన్నద్ధమయ్యారు.. పరిస్థితి చేయి దాటిపోతోందన్న సంకేతాలు కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని కల్పించింది. అంతా ఒప్పుకున్నారు కదా.. ఇక ఇబ్బందేముంటుందని అనుకున్నారేమో.. డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటనను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత ప్రభుత్వం తరపున వెలువరించేశారు..
***
అంతే అప్పటిదాకా తెలంగాణకు సై అన్న పార్టీల నాయకులంతా రివర్‌‌స అయ్యారు.. అమ్మమాటే వేదం అన్న వారంతా తూచ్‌ పొమ్మన్నారు.. సీమాంధ్ర శివాలెత్తింది..
లగడపాటి లడాయి ప్రకటించారు.. నిరాహారదీక్షలు.. ఆందోళనలతో అట్టుడికిపోయింది ఆంధ్రప్రాంతం. లగడపాటి నిరాహార దీక్షలు ఎలా చేయాలో చేసి చూపించారు.. మోడ్రన్‌ దీక్షలు ఎలా ఉంటున్నాయో చూపించటానికే తాను దీక్ష చేశానని నిమ్‌‌స నుంచి విడుదల అయిన తరువాత లగడపాటి స్వయంగా ప్రకటించారు.. ఢిల్లీకి వెళ్లతారా అని అడిగితే.. అక్కడ కార్యం చక్కబెట్టడానికి పెద్దలు రాయపాటి, కావూరిలు ఉన్నారని చెప్పారు.. నిజంగా ఆయన అన్నట్లుగానే రాయపాటి, కావూరిలతో పాటు సీమాంధ్ర ఎంపిలు ఢిల్లీలో దాదాపు పది రోజుల పాటు ఉండి పలుమార్లు కాంగ్రెస్‌ లోని నిర్ణాయక నాయకత్వంతో పలుమార్లు లాబీయింగ్‌ చేశారు.. సోనియమ్మ నిర్ణయం మార్చుకునేంత వరకు విడిచిపెట్టలేదు..పదకొండు రోజుల వ్యవధిలో కేంద్రం తన నిర్ణయం మార్చుకోక తప్పలేదు..కరవ్రిరక్కుండా, పాము చావకుండా చిదంబరం ప్రకటన చేశారు..
ఆ ప్రకటన పరిస్థితులను చక్కబెట్టకపోగా, తెలంగాణాను మళ్లీ రగిల్చింది... ఆగిపోతుందనుకున్న అగ్గి ప్రజ్వరిల్లింది. ఈసారి తిరగబడ్డ తెలంగాణ శివసత్తులు ఊగినట్లు ఊగుతోంది. నేతల ప్రమేయం లేకుండా ఊరూవాడా జనాలు వీధుల్లోకి వచ్చారు. ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. ఆందోళనలు చేస్తున్నారు.. అరెస్టులు అవుతున్నారు.. ఒక్కమాటలో చెప్పాలంటే 9వ తేదీకి ముందు లేని ఉద్వేగాలు ఈసారి పెరిగిపోయాయి. ఆంధ్రప్రాంతంలో కొనసాగిన సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణలో భావోద్వేగాన్ని మరింత రెచ్చగొట్టాయి. పర్యవసానం ప్రజల బాటలో నేతల పయనం...నేతలు సమావేశాల్లో ఉంటే, జనం వీధుల్లో రెచ్చిపోయారు.. తెలంగాణాకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట మాట్లాడినా సహించే పరిస్థితిలో ప్రజలు లేరు.. అందుకే నాయకులంతా ఒక ఛత్రం కిందకు రాక తప్పలేదు. కేంద్రం ఇప్పుడేం చేస్తుంది? రోమ్‌ తగులబడుతుంటే నీరో ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నట్లు కేంద్రం వ్యవహరిస్తుందా? ఎలాంటి కమిటీలను అంగీకరించేది లేదని తెలంగాణ వాదులు ఖచ్చితంగా చెప్తున్నారు... సందిగ్ధానికి తావు లేకుండా, అస్పష్టతకు అవకాశం లేకుండా తెలంగాణ ఇచ్చే విషయంలో విస్పష్టంగా ప్రకటన చేయడం ఇప్పుడు కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. రాష్ట్రంలో ఇప్పటికే 30వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు ముఖ్యమంత్రి రోశయ్య చెప్తున్నారు.. సమస్యకు పరిష్కారం వెంటనే ప్రకటించకపోతే రాష్ట్రం ఇంకా సంక్షోభంలోకి పడిపోతుంది..

ఈ నెల రోజుల్లో ఎప్పుడు ఏం జరిగింది...?

అక్టోబర్‌ 9
హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంటూ సుప్రీం కోర్టు ప్రకటన..
టిఆర్‌ఎస్‌ ఆందోళన ప్రారంభం...

అక్టోబర్‌ 24
సిద్దిపేటలో తెలంగాణ ఎన్‌జీవోల సంఘం బహిరంగ సభ...
నవంబర్‌లో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కెసిఆర్‌ ప్రకటన

అక్టోబర్‌ 28
ఫ్రీజోన్‌ తీర్పుకు వ్యతిరేకంగా ఇందిరాపార్‌‌క దగ్గర టిఆర్‌ఎస్‌ ధర్నా

నవంబర్‌ 6..
సిద్దిపేట రంగధాంపల్లిలో నవంబర్‌ 29 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కెసిఆర్‌ ప్రకటన...

నవంబర్‌ 29
సిద్ధిపేట సమీపంలో రంగధాంపల్లిలో టిఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ ఆమరణ దీక్షకు పయనం...
దారిలోనే అరెస్టు.. ఖమ్మం జైలుకు తరలింపు...
ఉస్మానియాలో ఉద్రిక్తతలు..
ఎల్‌బి నగర్‌లో శ్రీకాంత్‌ ఆత్మాహుతి..

నవంబర్‌ 30
జైలు నుంచి ఆసుపత్రికి కెసిఆర్‌ తరలింపు..
ఆసుపత్రిలో జ్యూస్‌ తీసుకున్న కెసిఆర్‌...
ఉస్మానియాలో విద్యార్థుల భారీ ర్యాలీలాఠీచార్జి

డిసెంబర్‌ 1
కెసిఆర్‌పై తెలంగాణ ఉద్యమకారుల నిరసన..
నిరాహార దీక్ష మానినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు..దీక్షను కొనసాగిస్తున్నట్లుగా కెసిఆర్‌ ప్రకటన..

డిసెంబర్‌ 2
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో విద్యార్థుల ఆందోళన...
తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు..

డిసెంబర్‌ 3
హెచ్‌ఆర్‌సి ఆదేశంతో కెసిఆర్‌ను నిమ్‌‌సకు తరలింపు
అక్కడే దీక్ష కొనసాగింపు..
సెలైన్ల ద్వారా టోటల్‌ పేరెంటల్‌ న్యూట్రిషన్‌
పోషక పదార్థాలను అందించిన డాక్టర్లు

డిసెంబర్‌ 5
48 గంటల తెలంగాణ బంద్‌కు టిఆర్‌ఎస్‌ పిలుపు

డిసెంబర్‌ 6,7
తెలంగాణ బంద్‌
పోలీసుల దిగ్బంధంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ

డిసెంబర్‌ 7
అఖిలపక్ష సమావేశం నిర్వహించిన రోశయ్య
తెలంగాణ తీర్మానం పెడితే సమర్థిస్తామని అన్ని పార్టీల హామీ

డిసెంబర్‌ 8
హాస్టళ్లను ఖాళీ చేయించిన పోలీసులు... స్టే ఇచ్చిన హైకోర్టు

డిసెంబర్‌ 9
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు...
కాంగ్రెస్‌ కోర్‌కమిటీ పలుమార్లు భేటీ
రాత్రి 11.30కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు హోం మంత్రి చిదంబరం ప్రకటన.. అసెంబ్లీ తీర్మానానికి ఆదేశం..
కెసిఆర్‌ దీక్ష విరమణ

డిసెంబర్‌ 10
విజయ యాత్రగా మారిన చలో అసెంబ్లీ శాంతి ర్యాలీ
ఆంధ్ర ప్రాంత ఎంపిలు, ఎమ్మెల్యేల రాజీనామాలు ప్రారంభం
సమైక్యాంధ్ర ఉద్యమానికి జెసి, లగడపాటిల నాయకత్వం

డిసెంబర్‌ 11
ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..ఆంధ్రప్రాంతంలో ఇతర ప్రాంతాల యూనివర్సిటీల్లో ఆందోళనలు...

డిసెంబర్‌ 12
ఢిల్లీలో ఆంధ్ర ప్రాంత ప్రతినిధుల లాబీయింగ్‌...
అన్ని పార్టీల నాయకులూ సమైక్య నినాదాలు... దీక్షలు...
కెసిఆర్‌ డిశ్చార్జి

డిసెంబర్‌ 13
సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం
ఆందోళనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో సీమాంధ్ర అతలాకుతలం
హైదరాబాద్‌లో లగడపాటి రాజగోపాల్‌ హల్‌చల్‌.. విజయవాడకులగడపాటిని తిరిగి పంపించిన పోలీసులు

డిసెంబర్‌ 15
విజయవాడలో దీక్ష ప్రారంభించిన లగడపాటి

డిసెంబర్‌ 17
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యరాగం
ఎమ్మెల్యే పదవికి రాజీనామా
తెలంగాణలో పిఆర్‌పి చీలిక

డిసెంబర 19
మళ్లీ తెరముందుకు కెసిఆర్‌..
టిఆర్‌ఎస్‌లో పిఆర్‌పి నేతల చేరిక
తెలంగాణ ఆగదని తెగేసి చెప్పిన కెసిఆర్‌
విజయవాడ ఆసుపత్రికి లగడపాటి తరలింపు

డిసెంబర్‌ 20
సినిమా ఫక్కీలో ఆసుపత్రి నుంచి పారిపోయిన లగడపాటి
విజయవాడలో హైడ్రామా

డిసెంబర్‌ 21
నిమ్‌‌సలో తేలిన లగడపాటి...
పరుగులు పెడ్తూ బెడ్‌పైకి జెంప్‌ చేసి సొమ్మసిల్లిన లగడపాటి
టిఆర్‌ఎస్‌ నిరసనలు..

డిసెంబర్‌ 22
లగడపాటి డిశ్చార్జి.. దీక్ష విరమణ..
ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపిలతో వీరప్ప మొయిలీ భేటీ..
మోహన్‌బాబు సినిమా షూటింగ్‌పై టిఆర్‌ఎస్‌ దాడి

డిసెంబర్‌ 23
కేంద్ర హోం శాఖ ప్రకటన...
సంయమనం పాటించాలని విజ్ఞప్తి
తెలంగాణపై సంబంధిత అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చిదంబరం వెల్లడి..
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన ఆందోళనలు..
కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, తార్నాక వంటి ప్రాంతాల్లో
ఉద్యమకారుల విధ్వంసకాండ
కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇతర పార్టీలతో జెఎసి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభం. 48 గంటల బంద్‌కు జెఎసి పిలుపు

డిసెంబర్‌ 24
తెలంగాణ అంతటా భారీ బలగాల మోహరింపు
వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జీ
క్రిస్‌మస్‌ పురస్కరించుకుని బంద్‌ ఉపసంహరణ..
ఉస్మానియా క్యాంపస్‌లో టిడిపి నేత నాగం జనార్ధనరెడ్డిపై అర్వపల్లి నాగరాజు, అతని అనుచరుల దాడి..
రాజకీయ నాయకుల జెఏసి ఏర్పాటు..
దూరంగా ఉన్న టిడిపి

డిసెంబర్‌ 25
తెలంగాణ పది జిల్లాల్లో ఆగని విధ్వంసకాండ

డిసెంబర్‌ 26
ఉస్మానియాలో ఆమరణ దీక్షలు.. సంఘీభావం తెలిపే నాయకుల క్యూ...
రోశయ్య కేబినెట్‌ నుంచి తెలంగాణ మంత్రుల రాజీనామా

డిసెంబర్‌ 27
ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు.. ప్రణబ్‌తో భేటీ ప్రయత్నాలు..
జెఏసిలో చేరిన తెలుగుదేశం
ఉస్మానియా విద్యార్థుల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

డిసెంబర్‌ 28
జనవరి 3న విద్యార్థి గర్జనకు పిలుపునిచ్చిన ఉస్మానియా జెఏసి
ఈ నెల 30న తెలంగాణ సంపూర్ణ బంద్‌కు పిలుపు నిచ్చిన నేతలు
కాల వ్యవధి లేని కమిటీ ఏర్పాటు యోచనలో కేంద్రం
అలాంటి కమిటీలను అంగీకరించేది లేదన్న తెలంగాణ వాదులు
సంయమనం పాటించాలని కొత్త గవర్నర్‌ నరసింహన్‌ పిలుపు27, డిసెంబర్ 2009, ఆదివారం

“ కాలంతో పాటు ” పుస్తకం-ముందుమాట


“ కాలంతో పాటు ” అనే ఈపుస్తకంలో యువ రచయిత, చిరంజీవి కోవెల సంతోష్ కుమార్, అనేక విషయాలు చర్చించారు. భారతదేశ స్వాతంత్ర్యప్రాప్తి తరువాత ఈ దేశంలోని సమస్యలు అనేకం చర్చించారు. బ్రిటిష్ ప్రభుత్వం మనల్ను “వేరుచేసి పాలించారు” అనే పాత పాట నేపథ్యంలో మనం స్వతంత్రంగానే ఎన్నివిధాల చీలిపోగలిగామో చర్చించారు. సంస్థానాలు విలీనం చేసిన పటేల్ గారి కార్యక్రమాన్ని ఏ విధంగా మనం వమ్ము చేస్తున్నామో వివరించారు. భాష, ప్రాంతము, కులము ఇవన్నీ అభిమానవిషయాలు కావడము బదులు దురభిమాన విషయాలు కావడము మనల్ని అందర్నీ బాధపెడుతున్నది. మరొకమాటు ఇవన్నీ ఙ్ఞాపకం చేసుకొని ఆత్మావలోకనం చేసుకుంటే రాజకీయ స్వార్థపరులను కనీసం మాటలతో ఎదుర్కోవడము వీలవుతుంది. టెర్రరిజం, శాసనాలు వాటి వెనుకలేని చిత్తశుద్ధి, మన దేశపుటెల్లలు, కాశ్మీర్, నాగాలాండ్ మొదలైన వేర్పాటు తిరుగుబాట్లను చర్చించి, మీడియాపాత్ర చర్చించి, గవర్నర్ సంస్థలోని దౌర్బల్యాలను చూపించి, మహిళా ఉద్యమాలు పరిశీలించి, విలాసవస్తువుల ”కొనుగోలు విప్లవం” వేలెత్తి చూపి, నిజాంపాలనలోని అమానుష కాలాన్ని ఙ్ఞాపకం చేసి, వేయిస్తంభాల గుడి క్రింది పునాదుల సాంకేతిక విషయాలు చర్చించి, చిరస్మరణీయులైన సత్యవాది కాళోజిని మనకు చక్కగా గుర్తుచేసి, కమ్యూనిష్టుల దృక్పథాలు, రామసేతు విధ్వంసం తలపెట్టిన ప్రభుత్వ దృక్పథాన్ని మనముందుంచి, ఈ వ్యాసమాల చిరంజీవి సంతోష్ కుమార్ పూర్తి చేశారు. దీనిని మనం మనసారా ధరించి స్మరిస్తే మన అభిప్రాయాలు మనలో రూపుకట్టుకోగలవు. ఈ గ్రంథం ఎప్పుడూ పూర్తయేది కాదు. అన్ని వ్యవహారాలు కాలసర్పంగా ముందుకు సాగుతూ ఉంటాయి. బహుశః సంవత్సరానికోసారి ఇలాంటి గ్రంథాలని “ అప్ డేట్ “ చేయటమనే బాధ్యత ఇలాంటి రచయితలకు తప్పదు. ఆద్యంతాలులేని కాలంతో ప్రయాణం చేయడము అలాగే ఉంటుంది. మంచి ఆలోచనాపరుడు, భావుకుడు, దేశభక్తుడు అయిన చిరంజీవి సంతోష్ కుమార్ ను అభినందిస్తున్నాను.
డా. శివానంద మూర్తి
“ఆనందవనమ్”
భీమునిపట్నం (531163)
తేది. 24 మే 2009
ఈ పుస్తకం నా తొలి పుస్తకం. చదవండి. మీ అభిప్రాయాలను చెప్పండి.. ప్రతులు విసలంధ్ర, నవోదయ, దిశ లలో ఉన్నాయి. ఎ వి కే ఎఫ్ . ఓ ఆర్ జి సైట్ ద్వార కూడా pondavanchu ... for copies k.swathi, h.no. 1-5-326, road no. 9 new maruthi nagar, kothapet hyderabad-500035 cell no.. 9052116463.. thank you26, డిసెంబర్ 2009, శనివారం

ఓ పుస్తకం

రాష్ట్రం లో ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి.. వాస్తవాలు కనుమరుగై అబద్ధాలు ముందుకు వచ్చాయి.. గత యాభై ఏళ్లలో ఆంధ్ర ప్రాంతం అన్యాయానికి గురైనదా.. తెలంగాణా అన్యాయానికి గురైనదా, రాజధాని లో ఎంత అభివ్రిద్ది జరిగింది? తెలంగాణా లోని మిగత జిల్లాల్లో ఎంత అభివ్రిద్ది సాగింది.. ఆంధ్ర, రాయల సీమల్లో ఎంత అభివ్రిద్ది జరిగింది? ఎంత అన్యాయం జరిగింది? ఎంత న్యాయం జరిగింది? వీటన్నిటిని కూలంకషంగా వివరిస్తూ వచ్చిన ఓ పుస్తకం లింక్ ఇక్కడ ఇస్తున్న.. ఆసక్తి ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొవచు
book download

25, డిసెంబర్ 2009, శుక్రవారం

దోషులెవరు?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దాడి జరిగింది.. దాడికి బాధ్యులు విద్యార్థులేనా? తానే దాడి చేసానంటూ మీడియా ముందుకు వచ్చిన శ్రీకాంత్‌రాజా? ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిపై అమానుషుంగా దాడి జరిగి 24 గంటలైన తరువాత కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? నిందితుని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ప్రభుత్వ తాత్సారం వెనుక మతలబు మరేదైనా ఉందా? నాగం జనార్ధనరెడ్డిపై జరిగిన దాడిలో దోషులెవరు?
నాగంపై దాడికి బాధ్యులెవరు?
విద్యార్థులా? శ్రీకాంతరాజా?
ఎఫ్‌ఐఆర్‌లో శ్రీనాథ్‌రాజు పేరు ఎందుకు చోటు చేసుకోలేదు?
అసలు దోషులు ఎవరు?

ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగుదేశం ఎంఎల్‌ఎ నాగం జనార్ధనరెడ్డిపై దాడి జరిగినప్పటి నుంచీ రకరకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. ఒక సీనియర్‌ నాయకుడిపై జరిగిన దాడిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. కొందరు దుండగులు కోపావేషాలతో నాగం జనార్ధనరెడ్డిని కొట్టడాన్ని మీడియా ప్రస్ఫుటంగా ప్రసారం చేసింది. దాడి చేసిన వ్యక్తి క్షణాల్లోనే మీడియా గుర్తించింది.
నల్గొండ జిల్లా తిరుమలగిరి సమీపంలో మాచనపల్లికి చెందిన నాగరాజు అలియాస్‌ శ్రీకాంత్‌ రాజుగా నిందితుని గుర్తించింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
శ్రీకాంత్‌రాజు మాజీ నక్సలైటు ఇతనిపై రాబరీ, దోపిడీలు, హత్య వంటి దాదాపు 40 కేసులు నమోదయి ఉన్నాయి.
నాగం జనార్ధన రెడ్డిని తాను కొట్టినట్లు శ్రీకాంత్‌రాజు పూర్తిగా అంగీకరించాడు.. ఎలక్ట్రానిక్‌ మీడియాతో ఫోన్లలో మాట్లాడుతూ కెసిఆర్‌ను నిందించినందుకే నాగంను కొట్టినట్లు అంగీకరించాడు.. మరి ఇతని విషయంలో పోలీసులు ఎందుకు నిర్లిప్తంగా ఉందో అర్థం కాదు... పైగా నాగం జనార్ధన రెడ్డి గన్‌మన్‌ వి రామ్‌గోవర్ధన్‌ ఫిర్యాదు మేరకు ఓ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయింది. ఇందులో 147, 148, 355, 427, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎక్కడా శ్రీకాంత్‌ పేరు లేదు... కొందరు ఉస్మానియా విద్యార్థులు అన్నదే నిందితుల స్థానంలో ఉంది. మరి తాను కొట్టినట్లు ఒప్పుకున్న శ్రీకాంత్‌ వ్యవహారం వీడియో ఫూటీజ్‌తో సహా అందుబాటులో ఉన్నప్పుడు అతనిపై సర్కారు ఎందుకు చర్యకు పూనుకోవటం లేదు..?
విద్యార్థులు తాము కొట్టలేదన్నారు.. నిందితుడు శ్రీకాంత్‌ తాను కొట్టానని ఒప్పుకున్నాడు.. మరి ఎవరిపై కేసు పెట్టాలి? ఎవరిని విడిచిపెట్టాలి? సామాన్యుడికి సైతం అర్థమయ్యే ఈ అంశంలో పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వచ్చింది.. వారి వెనుక పనిచేసిన శక్తులేమిటి? విద్యార్థుల ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే సర్కారు ఈ విధమైన ఒత్తిడిని విద్యార్థులపై రుద్దుతోందా?
శ్రీకాంత్‌రాజు తల్లితెలంగాణ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు.. ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరుడని ప్రచారంలో ఉంది... అసలు బయటి వ్యక్తి అయిన శ్రీకాంత్‌రాజు క్యాంపస్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రేక్షకుడిగా చూడాల్సిన వ్యక్తి నాగం దగ్గరకు వెళ్లి ఎందుకు చేయి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? తాను ఒక్కడిగా వెళ్లానని శ్రీకాంత్‌రాజు అంటున్నాడు.. పది బైకులపై దుండగులు వచ్చారని ప్రత్యక్ష సాక్షు్యలంటున్నారు? ఎవరిది నిజం? నిజం ఏదైనా నాగంపై దాడి చేసింది విద్యార్థులు కాదన్నది నిష్ఠుర సత్యం. మరి పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని అనుకోవాలా? లోగుట్టు పెరుమాళ్లకెరుక.......

ప్రజల ఉద్యమం అంటే ఇది

ఇప్పుడు తెలంగాణ రగిలిపోతోంది. నిజమైన ప్రజల ఉద్యమం ఏమిటో ఇప్పుడు ప్రపంచం కళ్లారా చూస్తోంది... నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరిగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తు... డిసెంబర్‌ 23 నుంచి తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం ఒక ఎత్తు... ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు ప్రత్యక్ష ఆందోళనలోకి దిగలేదు..

కేంద్ర ప్రభుత్వం అలియాస్‌ సోనియా అర్థం లేని అనర్థ ప్రకటన తెలంగాణను నిప్పుల కుంపటిగా మార్చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో , హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో దిష్టిబొమ్మల చలిమంటలు చెలరేగాయి. హైదరాబాద్‌లో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్మాణంలోనే తెలంగాణ నేతలు తలమునకలైపోయారు.. కానీ, వీధుల్లో జనం వీరవిహారం చేశారు.. వాళ్ల ఆగ్రహావేశాలకు, ఆక్రోశానికి కనపడ్డ బస్సు కనపడినట్లు ధ్వంసం అయింది. రైలు బోగీలు తగులబడిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోతున్నాయి. కేవలం విద్యార్థుల వల్లనే ఉద్యమం ఇంత తీవ్రం కాలేదు... ఇది స్పష్టం.. నాయకులు అసలు డైరెక్‌‌ట ఫ్రేమ్‌లోకి ఎంటరే కాలేదు.. ఇదీ సుస్పష్టం... కాలనీల్లో,, గల్లీల్లో, వీధుల్లోకి వేల మంది జనం వచ్చారు.. ఒక చోట రాస్తారోకో చేశారు.. రాస్తారోకోల్లో రోడ్డుపైనే వండుకు తిన్నారు.. ఇంకోచోట ఆవేశంతో తలో రాయి తీసుకువచ్చి సరిహద్దు దారిని గోడ కట్టి మూసేశారు.. ఇంకోచోట రైళ్లను ఆపేశారు.. బోర్డులపై తెలంగాణ అని రాశారు.. ఆంధ్రప్రాంత వ్యాపార సంస్థలను లక్ష్యం చేసుకున్నారు...
చిదంబరం ప్రకటన తరువాత కొంత సాఫ్‌‌ట కార్నర్‌గా మాట్లాడిన కాంగ్రెస్‌ ఎంపిలు ఈ తీవ్రతను చూసి వెంటనే రూటు మార్చేశారు.. రాజీనామాలు క్షణం ఆలస్యం చేయకుండా చేసేశారు...తిరగబడ్డ జనాన్ని చూసి అన్ని పార్టీల నాయకులు, మంత్రులూ కూడా ఆందోళనలోకి దిగిరాక తప్పని పరిస్థితి ప్రస్తుతం తెలంగాణాలో నెలకొని ఉంది. ప్రజలు ఏం చెప్తే అదే బాటలో నడిచి తీరాల్సిన పరిస్థితిని నాయకులకు కల్పించటంలో జనం విజయం సాధించారు... ఏం చేయాలో తోచక ప్రభుత్వం అదనపు బలగాలను పిలిపించుకుంది... ఖచ్చితమైన అణచివేతకు రంగం సిద్ధం చేసుకుంది... క్యాంపస్‌లో విద్యార్థులను అణచివేయవచ్చు. కానీ వీధుల్లో సామాన్య ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారు.. 1969 లాగా కాల్పులు జరిపే అవకాశాలు లేకపోలేదు.. అలా చేస్తే ఉద్యమం ఆగిపోతుందా? జనం రెచ్చిపోతారా? ఏం జరుగుతుంది. ప్రశాంతంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఉంటున్న ప్రాంతాల్లో సమైక్యం పేరుతో చిచ్చు రేపారని ఎప్పుడో ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవం ఏమంటే వాళూ్ల తెలంగాణాకు సై అంటున్నారు.. జై కొడుతున్నారు.. అటు కోస్తాంధ్ర నుంచి ఎంపి హర్షకుమార్‌ సైతం తెలంగాణ ఇచ్చేయాలంటూ మాట్లాడుతున్నారు. ప్రజలంటే వీళు్ల... నిజమైన ప్రజాభిప్రాయం అంటే ఇది. భావోద్వేగం అంటే ఇది. 2009 సంవత్సరాంతంలో ప్రజల గుండె లోతుల్లోంచి పెల్లుబికిన ఉద్యమ జ్వాలకు ప్రతి తెలుగువాడు సాక్షీభూతంగా నిలుస్తున్నాడు.

24, డిసెంబర్ 2009, గురువారం

ఎలా జరిగింది...?

కాంగ్రెస్‌లో అధినేత్రి మాటే శాసనం... ఆమె మాటే వేదం... ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై వెనక్కి తగ్గడం సాధారణంగా జరిగే పని కాదు.. కానీ, సోనియా మడమ వెనక్కి తిరిగింది. కాదు తిప్పారు.. తెలంగాణపై భారత ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీనే వెనక్కి తీసుకునేలా చేయగలిగారు.. ఇది ఎలా సాధ్యపడింది..? దీని వెనుక ఏయే శక్తులు ఎలా పనిచేశాయి?

తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం ఎందుకు తిరగబడింది?
సోనియా నిర్ణయాన్ని సైతం శాసించిన శక్తులు ఏమిటి?
కాంగ్రెస్‌ అధినేత్రి నిర్ణయాన్నే
ప్రభావితం చేసిన పరిణామాలు ఏమిటి?
జవాబుల కోసం వెతుకుతున్న ప్రశ్నలివి.. కాంగ్రెస్‌ అధినేత్రి శాసనాన్నే తిరగరాయగల సమర్థులున్న నాయకత్వం ఆంధ్ర ప్రాంతంలో ఉందని మరోసారి నిరూపణ అయింది. ఈ నెల తొమ్మిదో తేదీన హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటాన్ని తెలంగాణ వాదులు గుడ్డిగా నమ్మారు.. యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా అలాంటి ప్రకటన చేయరని విశ్వసించారు...
ఆ నమ్మకంతోనే విజయోత్సవాలు జరుపుకున్నారు...ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సోనియా తన నిర్ణయంపై వెనక్కి తగ్గరనే అమాయకంగా భావించారు... అన్ని ఆందోళనలు విరమించి ఆంధ్రలో జరుగుతున్న పరిణమాలను చూస్తూ కూర్చున్నారు...
కానీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ప్రభావితం చేయటంలో సక్సెస్‌ అయ్యారు.. పదో తేదీ నుంచి కాంగ్రెస్‌లోని ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు వీధుల్లోకి వస్తే... ఆ ప్రాంతానికి చెందిన ఎంపిలు ఢిల్లీ నుంచి ఒక్కక్షణం కూడా కదలలేదు.. ఒక్క లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో హడావుడి చేయటం మినహా మిగతా అందరు ఎంపిలు ఢిల్లీలో ఉండి సామ, దాన, భేదోపాయాలన్నీ ప్రయోగించారు.. రాష్ట్రంలో ఎలాగో దండ ప్రయోగం జరుగుతోంది.. ఆంధ్రప్రాంతం ప్రతినిధులు పది రోజుల్లో ప్రతిరోజూ వీరప్పమొయిలీతో, ప్రణబ్‌ ముఖర్జీతో, ఇతర నాయకులతో, అడపాదడపా సోనియాగాంధీతో సమావేశమవుతూ వచ్చారు.. రకరకాలుగా ఒత్తిడిరాజకీయం చేశారు.. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావులు ఓ వంక... తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఇంకో పక్క నిరంతరంగా , బలంగా లాబీయింగ్‌ జరుపుతూ వచ్చారు... కేంద్ర నేతలతో సమావేశమైన ప్రతిసారీ ఏదో ఒక ప్రకటన చేయటం ద్వారా తమకు అనుకూలంగా నిర్ణయం తప్పదన్న సంకేతాల్ని ఇస్తూ వచ్చారు..

ఢిల్లీలో ఇంతగా ఆంధ్ర లాబీయింగ్‌ జరుగుతున్నా, తెలంగాణ నేతలు మాత్రం సోనియా నిర్ణయాన్ని మార్చగలగటం ఆంధ్ర ప్రతినిధుల వల్ల కాదనే నమ్మారు.. అందుకే వాళు్ల ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.. అప్పుడప్పుడూ ప్రకటనలు చేయటం తప్ప, కెసిఆర్‌ కూడా వేచి చూసే ధోరణినే అవలంబిస్తూ వచ్చారు. అదే చివరకు తెలంగాణ వాదుల కొంపలార్చింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం మార్చుకున్నారు... కర్ర విరక్కుండా, పాము చావకుండా చిదంబరం మలి ప్రకటన చేశారు...
ఇప్పుడు చేతులు పూర్తిగా కాలిపోయాయి. అప్పుడు అంతా నాలుక్కరుచుకున్నారు.. ఆంధ్ర ప్రాంత నేతల బాటలో రాజీనామా అసా్తల్రను సంధించటం మొదలు పెట్టారు.. కానీ, విద్యార్థులు, ప్రజలు విరుచుకుపడ్డారు.. పర్యవసానంగా తెలంగాణ తగులబడిపోతోంది.. మొత్తం మీద రాజకీయ నేతలకు ఓ గేమ్‌షోగా తెలంగాణ మారింది. నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితురాలిగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చేష్టలుడిగిపోయింది. దీని వల్లే తెలంగాణ పాట మరోసారి పల్లవితోనే ఆగిపోయే పరిస్థితి నెలకొంది..

సమైక్యానిదే గెలుపు అభినందనలు ...

శుభం.. రాజ్యం వీరభోజ్యం అన్నమాట మరోసారి వాస్తవరూపం దాల్చింది.. వీరులు గెలుపు సాధించారు.. పరాజితులకు ఓటమి అన్నది తెలియకుండా జాగ్రత్తగా గెలిచారు.. సంబరాలు చేసుకుంటూనే అబ్బే ఎవరూ గెలవలేదు.. ఎవరూ ఓడిపోలేదు.. అంటూ నీతిచంద్రిక వల్లించారు.. ప్రపంచంలో ఇది సహజపరిణామం.. ఎవరు బలవంతులైతే.. వారి చేతిలోనే విజయం ఉంటుంది. బాధితుడు ఎంత ఉద్యమించినా.. ఎంత ఆవేదన చెందినా, ఎంత ఆక్రోశాన్ని వెళ్లగక్కినా బలవంతుడి ముందు అవేవీ ఆగవు.. నిలబడవు.. ఆ ఆవేదనల స్వరాలు బయటకు వినిపించనైనా వినిపించవు.. స్వరాన్ని గొంతు దాటక ముందే అణచివేస్తారు.. పీక పిసికేస్తారు... పాటను పల్లవించమన్నారు.. పల్లవిస్తున్న క్రమంలోనే పీకనొక్కేశారు..

ఒక వర్గ ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారికి హక్కులు లేకుండా, వాళ్లకు ప్రజలనే గుర్తింపు సైతం లేకుండా.. వాళ్లను మనుషులుగానే చూడకుండా... ఢిల్లీ స్పందించింది... 53 ఏళ్ల ఉద్యమానికి, 40 ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. ఒక్క ప్రాణానికి 40 ఊపిరుల వెల కట్టింది. తెలంగాణ ఇవ్వమని చెప్పకుండానే ఇవ్వటం లేదని తేల్చేసింది. ఐక్యత లేని నాయకత్వం... బలమైన లాబీయింగ్‌ ముందు ఒక్క నిమిషమైనా నిలబడలేకపోయింది. ఆ ప్రాంతాన్ని మేం అభివృద్ధి చేశామన్నారు.. మేం పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశాం కాబట్టి వారికి ఎలాంటి హక్కులు ఉండటానికి వీల్లేదన్నారు.. ఆ ప్రాంతం వాళ్ల అబ్బ సొత్తా అని నిలదీశారు.. తిట్టారు.. నిందించారు.. రాష్ట్రం ఇస్తే, వస్తే మావోయిస్టుల చేతుల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతుందన్నారు..అసలు రాషా్టన్న్రి ఎవరూ కోరుకోవటం లేదని బల్లగుద్ది వాదించారు... ఢిల్లీలో చెప్పాల్సిందంతా చెప్పారు. బెదిరించాల్సిందంతా బెదిరించారు..లాబీయింగ్‌ చేయాల్సిందంతా చేశారు.. మొత్తం మీద సాధించారు.. దాని వల్ల నష్టపోతున్నదెవరు?
ఇవాళ సమైక్యంగా తెలంగాణాతో బలవంతంగా అంటకాగడం వల్ల ఇంటిగ్రిటీ సాధ్యపడుతుందని ఎలా భావిస్తున్నారు? సమైక్యంగా ఉంటామని చెప్తున్న ఏ ఒక్కరిలో ఆ భావన లేదు.. తెలుగువాళ్లం అంతా ఒక్కటే అని చెప్పే ఏ ఒక్కరిలో అలాంటి అభిప్రాయం మచ్చుకైనా లేదు.. ఇది సాధ్యం కాదని వారికీ తెలుసు.. ఎందుకంటే సమైక్యత అంటూ ఇంతకాలం ఉద్యమించిన వాళు్ల తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సమైక్యం కావాలని కోరుకుంటున్నారని తెగ ఊదర గొట్టారు....మరి ఇవాళ ఉద్యమిస్తున్నదెవరు? వారి దృష్టిలో కెసిఆర్‌ అనే వేర్పాటు వాది ప్రేరేపించడానికి ముందే... ఆయన రాజీనామా ప్రకటనకు ముందే వీధుల్లోకి వచ్చిన ప్రజలను ప్రేరేపించింది ఎవరు? ఇవాళ ఐక్యతారాగాన్ని మోతెక్కించిన మోహన బాబులు, గోపాలరాజులు వారి దగ్గరకు వెళ్లగలరా? మాట్లాడగలరా? వీళ్లందరూ రౌడీలేనా? కిరాయి గూండాలా? ఎలాగూ బలవంతులు కాబట్టి వారిని అణచివేయటం పెద్ద పనే కాదు.. కాబట్టి ఈ ఉద్యమాలపై స్పందించి టైం వేస్‌‌ట చేసుకోవలసిన అవసరమూ లేదు.. ఇగ్నోర్‌ చేస్తే చాలు... అరిచి అరిచీ, చచ్చి చచ్చీ వాళ్లే సొమ్మసిల్లి పడిపోతారు...
వారికి కావలసింది ఐక్యత కాదు.. వారిని ఆధిపత్యం ముందుకు తోస్తోంది. వనరులు వారిని ప్రేరేపిస్తున్నాయి. ఆంగ్లేయుల పరిపాలన నుంచి పుణికిపుచ్చుకున్న దోపిడీ తత్వం వారిని బూటకపు సమైక్యతకు ఉసిగొల్పుతోంది...దీన్ని ఎదుర్కోవటం బతుకుపోరాటం చేస్తున్న తెలంగాణా వారికి సాధ్యమా? ఇవాళ రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు.. ఉద్యమించటానికి ముందే.. చిదంబరం ప్రకటన రావటానికి ముందే భారీ ఎత్తున బలగాలను మోహరించిన సర్కారు ఉద్యమాన్ని ఈ సారి తీవ్రంగా అణచివేయకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు? అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడకపోవచ్చు. ఇక రాష్టప్రతి పాలన అస్త్రం ఎలాగూ చేతిలో ఉంది... వీటన్నింటినీ ఎదుర్కొని ఉద్యమం ముందుకు పోతుందా? తెలంగాణ పార్టీలన్నీ ఏకమవుతాయా? ఆంధ్ర అడ్డంకులను అధిగమించి తమ రాషా్టన్న్రి తాము తిరిగి సాధించుకోగలుగుతారా? చూద్దాం... any way andhra sodarulaku abhinandalu

23, డిసెంబర్ 2009, బుధవారం

మళ్లీ తెరపై పెద్దమనుషుల ఒప్పందం...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపిలు తమకు అందుబాటులో ఉన్న అన్ని అసా్తల్రనూ బలంగా ప్రయోగిస్తున్నారు.. వీరప్పమొయిలీతో రెండుసార్లు సమావేశమైన వీళు్ల రాజీ ఫార్ములాను ఆయన ముందుంచారు.. అందులో కొన్ని ప్రతిపాదనలు.. తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వటం.. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి దాని ద్వారా అభివృద్ధిని పర్యవేక్షించటం...
ఇంతకంటే దారుణం.. దుర్మార్గం.. ఎక్కడా ఉండదు.. 1956లో తెలంగాణ ఆంధ్ర రాష్ర్టంలో విలీనం అయినప్పుడు ఏ పెద్దమనుషుల ఒప్పందం అయితే కుదిరిందో.. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలే ఇవన్నీ... ఢిల్లీలో సంతకాలు చేసిన పెద్దలు నీలం సంజీవరెడ్డి అక్కడి నుంచి విమానం హైదరాబాద్‌లో దిగీ దిగటంతోనే ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలు లాంటిది అదెందుకు అంటూ పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాసారు.. సంతకాల పచ్చి ఆరకుండానే ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడిన ఘానాపాటీలు వీళు్ల... ఇప్పుడు భూగర్భంలోంచి మళ్లీ తవ్వి ఈ ఒప్పందంలోని ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు... ఒక్కసారి ఆ ఒప్పందంలోని అంశాలేమిటో చదవండి... మేల్కొండి..

పెద్దమనుషుల ఒప్పందం
1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19 న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:

కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
-----------------
ఇప్పటి నాయకులు నీలం సంజీవరెడ్డిని, బెజవాడ గోపాలరెడ్డిని మించిపోయారు...లేకపోతే ఏ ఒప్పందం నుంచైతే అన్యాయం జరుగుతూ వస్తోందని తెలంగాణ వాళు్ల ఆరోపిస్తున్నారో అదే ఒప్పందాన్ని మళ్లీ రంగం మీదకు తెచ్చి మసిపూసి మారేడు కాయ చేయాలని చూడటాన్ని ఏమని నిర్వచించగలం? వీళ్ల సమైక్యతకు, తెలుగువారంతా ఒకటేనన్న నినాదాలకు ఉన్న ముసుగు వెనుక నిజం ఇది.

నేను నా దీక్ష

గౌరవనీయ ఎంపి లగడపాటి రాజగోపాల్‌జీ సినిమాటిక్‌ దీక్ష డ్రామా ప్రస్తుతానికి సుఖాంతం అయింది. దేశంలో నిరశన దీక్షలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన దీక్ష లగడపాటి రాజగోపాల్‌ది. అయిదు రోజుల పాటు దీక్ష చేసినా అసాధారణ ఆరోగ్యపటిమకు యావత్‌ ప్రపంచం నివ్వెర పోయింది. దీక్ష ప్రారంభించటానికి ముందు 81 కిలోగ్రాముల బరువున్న రాజగోపాల్‌ దీక్ష కారణంగా రోజుకు 1.25 కిలోగ్రాము తగ్గుతూ వచ్చినా

(దీక్ష అంటే నిరాహార దీక్షనా కాదా అన్నది ఆయన చెప్పలేదు.. ఇవాళ ప్రెస్‌ కాన్ఫరెన్‌‌సలో కూడా దీక్ష అనే చెప్పారు.. ఇంగ్లీషు వెర్షన్‌లో మాత్రమే ఫాస్‌‌ట అన్న పదాన్ని వాడారు.. ఎందుకంటే వారం క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో కూర్చున్నప్పుడు తింటే తింటాం.. లేకపోతే లేదు.. అని విస్పష్టంగా మైకుల ముందు చెప్పారు. కూడా.. దాన్ని అక్షరాలా పాటించారు...) ఆయన ఆరోగ్య పటిమ ఎంతమాత్రం తగ్గలేదు.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజగోపాల్‌ చెప్పిన వివరాలే ఇవి. ఒక మనిషి బరువు రోజూ కిలోంబావు తగ్గినా ఆరోగ్యంగా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర ధ్యానం, యోగ నేర్చుకోవలసిందే... షిర్టీ సాయిబాబా ప్రతిరోజూ ఖండయోగ సాధన చేసే వారట... శరీరంలోని అంగాలన్నీ ముక్కలు చేసి విసిరేసినట్లు పడేసి తిరిగి మళ్లీ అతికించుకునే వారని ఆయన గురుచరిత్రలో సంత్‌ హేమాడ్‌ పంత్‌ రాస్తారు... అలాగే లగడపాటి రాజగోపాల్‌ చేస్తున్న యోగా కూడా ఏదో అసాధారణమైన యోగమే. కేవలం ప్రాణాయామంతోనో.. కేవలం ధ్యానం తోనో ఇది సాధ్యమయ్యే పని కాదు.. అయిదు రోజుల్లో ఆరు కెజిల బరువు తగ్గినా ఇంత బాగా పిటి ఉష కంటే స్పీడ్‌గా పరిగెత్తి పరిగెత్తి ఊహించని రీతిలో జంప్‌ చేసి మరీ మంచం మీద పడుకోగానే మత్తుగా మూల్గడం ఓ గొప్ప అనుభూతి.. ఎంతో సాధన చేస్తే కానీ అలాంటి ఫీట్‌ సాధ్యం కాదేమో.. దీక్ష 19వ తేదీన్నే విరమించినట్లు రాజగోపాల్‌గారే స్వయంగా ప్రకటించారు.. ఎప్పుడైతే ఫ్లూయిడ్‌‌స ఎక్కించారో అప్పుడే దీక్ష విరమించినట్లు లెక్క అన్నారు.. దీక్ష విరమించినట్లు దీక్ష చేస్తున్న వ్యక్తే స్వయంగా భావిస్తున్నప్పుడు ఘనాహారం తీసుకోలేదా? కారణం ఏమిటి? ఐవి ఫ్లూయిడ్‌‌స ఎక్కించటంతోనే కోర్టు ఆదేశాలతోనే అనుకోండి.. దీక్ష భగ్నం అయినట్లు, ముగిసినట్లు లగడపాటి స్వయంగా చెప్తున్నారు.. మరి ఘనాహారం తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? అప్పుడే దీక్ష ముగిసినట్లు ఆయనే స్వయంగా భావిస్తే ఘనాహారం తీసుకోకపోవటం అన్నది ఒక నాటకమా? మరి చివరి నిమిషం దాకా ఆయన అనుచర వందిమాగధ గణం, ఆయన అనుచర నాయకుడు జెసి దివాకర్‌ రెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి చివరకు నిమ్‌‌సలో కూడా లగడపాటి దీక్ష చేస్తున్నారనే ఎందుకు చెప్తూ వచ్చారు.. 19న దీక్ష విరమించినట్లు విలేఖరులతో చెప్పిన లగడపాటి వాళ్లకు మాత్రం చెప్పలేదా? కోర్టు ఆదేశాలతో దీక్ష భగ్నం అయినట్లు భావిస్తే.. మరి మిగతా నేతలు మాత్రం దీక్ష కొనసాగిస్తున్నట్లు ఎందుకు చెప్పినట్లు? మంగళవారం మధ్యాహ్నం దీక్ష విరమించనున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు.. అసలు ఆయన దీక్ష ఎప్పుడు ముగిసింది? లగడపాటి తనంత తానుగా చెప్పినట్లు 19వ తేదీ ఉదయాన్నా? లేక లగడపాటి తనంత తానుగా ప్రెస్‌క్లబ్‌లో గ్లూకోజ్‌ నీళు్ల తాగినప్పుడా? ఏది నిజం?
19వేదీన దీక్ష విరమించినట్లు ఆయన అనుకున్నప్పుడు ఆయన ఆహారం తీసుకుని ఉండవచ్చు. అలాంటప్పుడు ఆయన ఆసుపత్రిలో వైద్యం తీసుకోవలసిన అవసరం ఏముంది? వైద్యమే అక్కరలేనప్పుడు నాటకీయ ఫక్కీలో నిమ్‌‌సకు పారిపోయి రావలసిన అవసరమే లేదు.. అందరి కళు్ల గప్పి మంచంపై ఎగిరి గంతేసి పడుకొని అనారోగ్యం నటించాల్సిన అగత్యమే లేదు.. మరి లగడపాటి ఎందుకీ చర్యకు పాల్పడ్డారు? ఏదో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను మేనేజ్‌ చేసి ఆయన హైదరాబాద్‌కు తప్పించుకుని వచ్చి ఉండవచ్చు. ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు మీది తెనాలే, మాది తెనాలే అన్న లెవల్లో కమిషనర్‌తో మాట్లాడి ఉండవచ్చు.. అందుకే ఆయన దర్జాగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి వెళ్లి పోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు.. విజయవాడ ఆసుపత్రి వద్ద పోలీసుల వ్యవహార శైలి లగడపాటి కదలికల గురించి వారికి తెలుసునన్న విషయం విస్పష్టంగా చెప్పకనే చెప్తున్నాయి. మీడియాలో ఆ విజువల్‌‌స వారి పాత్రను అనుమానాస్పదంగా చూపుతున్నాయి. అందుకే రోశయ్య సర్కారుకు వారిపై వేటు వేయకతప్పలేదు.. నిమ్‌‌సకు రావటం అన్నది కెసిఆర్‌ను ఒక విధంగా ఇమిటేట్‌ చేయటమే.. ఐవి ఫ్లూయిడ్‌‌స ఎక్కించుకోవటానికి నిమ్‌‌స దాకా రావాలా? మరో గమ్మత్తేమిటంటే తమ దగ్గర మెరుగైన సౌకర్యాలు లేవంటూ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఓ రిపోర్టును చూసి తనను డిశ్చార్జి చేశారని అనుకున్నారట ది గ్రేట్‌ లగడపాటి. అలా భావించేసి రాత్రికి రాత్రి క్వాలిస్‌ ఎక్కేసి.. ఆసుపత్రి గేట్లు బద్దలు కొట్టుకుంటూ సారీ ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయారట.. డిశ్చార్జి అయిన రోగులు బయటకు ఎలా వెళ్లాలో.. చాలా చక్కగా చేసి చూపించారు లగడపాటి.. ప్రజలకు ప్రజాప్రతినిధులకంటే ఆదర్శులు ఎవరుంటారు చెప్పండి.. తనను తాను డిశ్చార్జి చేసినట్లు భావించిన లగడపాటి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక నిమ్‌‌సకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పించాలని తీర్మానించుకున్న మహానుభావుడు మళ్లీ దీక్షా శిబిరానికి వెళ్లి ఎందుకు కూర్చోలేదు? తెలుగువారందరినీ ఒకటిగా ఉంచాలని ప్రాణార్పణకు సిద్ధపడ్డ వ్యక్తి వైద్యాన్ని కోరుకోవటం ఏమిటి? చివరకు నిమ్‌‌సకు ఆయన వస్తే ఆయనకు ఏం వైద్యం చేయాలో అక్కడి డాక్టర్లకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు.. ఓ సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి, ఒకటి రెండు పరీక్షలు చేసేసి బాబూ ఇక బాగున్నావ్‌ వెళ్లమన్నారు..దీనికోసం ఐసియు బెడ్డు... పోలీసు పహారా.. సామాన్య రోగుల నానా అవస్థలు.. టిఆర్‌ఎస్‌ ఆందోళనలు.. భేష్‌... ఒక నాయకుడి డ్రామాకు ఇంతకంటే సంరంభం ఏం కావాలి? లగడపాటి ఎందుకు నిమ్‌‌స వచ్చారో అదీ ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పకనే చెప్పారు.. తాను నిమ్‌‌స వచ్చింది హైదరాబాద్‌లో ఒక అస్థిర వాతావరణాన్ని సృష్టించటానికి.. తాను నిమ్‌‌సకు వస్తే.. టిఆర్‌ఎస్‌ ఎలాగూ ఆందోళన చేస్తుందని, తెలుసు.. విద్యార్థులూ తీవ్ర విధ్వంసానికి పాల్పడతారని ఆయన భావించి ఉండవచ్చు. ఎందుకంటే అంతకు ముందురోజే ఆయనకు, ఓయు విద్యార్థుల మధ్య ఎన్‌టివి లైవ్‌షోలో వాగ్వివాదం జరిగింది. విద్యార్థులు చెప్పులు చూపించేంతగా ఆవేశకావేశాలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ ప్లాన్‌ వేసుకున్నారు..తాను రావటం వల్ల విధ్వంసం జరిగితే.. తనకే రక్షణ లేనప్పుడు మిగతా ఆంధ్రులకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది.. ఇది ఒక విధంగా మరింత ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించేందుకు, తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, ఆయన మూర్ఖత్వానికి తగిన గుణపాఠం చెప్పారు విద్యార్థులు.. ఖాళీ నిరసనలతో సరిపుచ్చారు.. చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు లగడపాటి చర్యే ఆయనకు రివర్‌‌స అయింది. అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఇలాంటి పిచ్చి చేష్టలకు భద్రత కల్పించటం తనవల్ల కాదని పోలీసు కమిషనర్‌ కుండబద్దలు కొట్టారు.. ఢిల్లీ నుంచి అహ్మద్‌ పటేల్‌ మందలింపు లాంటి సూచన చేశారు. జెసి వచ్చి హెచ్చరించారు.. గంటలో సీన్‌ మారిపోయింది. నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు..ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తన చర్యలను సమర్థించుకోవటానికి నానా నానా తంటాలు పడి మరీ ఇబ్బంది పడి..జవాబులు చెప్పీ చెప్పక.. గాంధీనీ, ఫ్లూయిడ్‌‌సనీ, ప్రాచీన ఆధునిక దీక్షలనీ ప్రస్తావిస్తూ పాపం లగడపాటి విలేఖరుల సమావేశాన్ని ముగించారు..

లగడపాటిని ఇన్ని రోజుల పాటు దీక్షకు అనుమతించిన ప్రభుత్వం కెసిఆర్‌ను వేదిక దగ్గరకు పోకుండానే అరెస్టు చేసింది.. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించింది. 24 గంటలు కాకుండానే ఆయన జ్యూస్‌ తాగుతున్న విజువల్‌ మీడియాకు లీక్‌ చేసింది. ఆ వార్త వినగానే తెలంగాణాలో దావానలం పుట్టింది. కెసిఆర్‌ దీక్ష విరమిస్తే.. ఆసుపత్రి నుంచి బయటకు రానివ్వమని తీవ్రస్థాయిలో విద్యార్థులు ఆందోళన కారులు హెచ్చరించారు.. దిష్టిబొమ్మలు తగులబెట్టారు.. దీక్ష నుంచి ఒక్క క్షణం కూడా ఆదమరవకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తరువాత కెసిఆర్‌ నిజాయితీతో దీక్షను కొనసాగించారు. తాను నిమ్‌‌సకు వస్తానని ఆయన కోరలేదు. ఆయన కుటుంబ సభ్యులే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసి మరీ నిమ్‌‌సకు తరలించేలా చూసుకున్నారు.. టోటల్‌ పేరెంటల్‌ ఫ్లూయిడ్‌‌స ఇవ్వటం వల్ల మనిషి 30 సంవత్సరాలైనా దీక్షలో ఉండవచ్చని లగడపాటి చెప్పారు.. కానీ, కెసిఆర్‌ దీక్ష చేస్తున్న సమయంలో నిమ్‌‌స డైరెక్టర్‌ ప్రసాదరావు స్వయంగా మాట్లాడుతూ టిపిఎన్‌ ఇచ్చినంత మాత్రాన ఇబ్బంది ఉండదని భావించటం పొరపాటని, ఘనాహారం తీసుకోకపోవటం వల్ల రక్తంలో గట్‌‌స బ్యాక్టీరియా సమస్యాత్మకం అవుతుందని అది క్రమంగా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందన్నారు.. ఏ మీడియా చానల్లోనైనా ఈ వాయిస్‌ రికార్డుల్లో ఉంది వెరిఫై చేసుకోవచ్చు.... మరి లగడపాటి మోసపూరిత డ్రామాకు ఆంధ్ర కాదు కదా.. విజయవాడలో ఒక్క మనిషి కూడా ఆయన్ను నిలదీసే సాహసం చేయలేదు.. ఆ దము్మలు లేవు ఎవరికీ.. లగడపాటి చర్యను విద్యార్థులైనా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. ప్రజల్లోంచి.. తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తికి ఇంతకంటే తార్కాణం ఏముంది? ఇక అజ్ఞాతలు ఏమంటారో...

20, డిసెంబర్ 2009, ఆదివారం

విలీనం పట్ల బూర్గుల అభిప్రాయాన్ని చుడండి..

ఆంధ్ర రాష్ట్రం లో హైదరాబాద్ స్టేట్ విలీనం పట్ల అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అభిప్రాయాన్ని చుడండి.. చదవండి..
http://en.wikisource.org/wiki/Hyderabad_CM_Burgula_Views_about_mergerసమైక్యం అంటే విద్వేషమా?

తెలంగాణ ప్రజలపై గుడ్డి విద్వేషం పెచ్చుమీరిపోయింది. ఏది నిజం అని ప్రశ్నలు వేసినందుకే అడ్డంగా నిందలు వేస్తున్నారు.. .. గత పది రోజులుగా సమైక్యత గురించి వీధుల్లో ఉద్యమాలు చేస్తున్న వారు కానీ, ఇంటర్నెట్లలో వాదోపవాదాలు చేస్తున్న వారిలో కానీ.. ఏ ఒక్కరైనా తెలంగాణా వారితో ఇంటిగ్రిటీ కోసం ఎందుకు ప్రయత్నించటం లేదు? మాకు అన్యాయం జరుగుతుందని నెత్తీనోరూ పెట్టుకుని మొత్తుకుంటున్న వాళు్ల తెలంగాణ వాళు్ల.. మరి వారిని సముదాయించి.. మీకు మేం అండగా ఉంటాం.. అని సముదాయించి, అనునయించి వారితో మమేకం అయిన వాళు్ల ఎవరైనా ఉన్నారా? ఆప్యాయత వ్యక్తం చేసిన వాళు్ల ఉన్నారా?

ఇప్పటి సంగతి దేవుడెరుగు... అసలు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి ఏరోజైనా రెండు ప్రాంతాల మధ్య సమగ్రత కోసం ప్రయత్నించిన వాళు్ల ఉన్నారా? ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులతో, ఉస్మానియా గురించి కానీ, ఉస్మానియా విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి కానీ ఎంతవరకు తెలుసు? విజయనగరం విద్యార్థికి నిజామాబాద్‌ సంస్కృతి తెలుసా? నిజామాబాద్‌ విద్యార్థికి గోదావరి జిల్లా ప్రజల జనజీవితం గురించి కనీస అవగాహన ఉందా? ఆయా ప్రాంతాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఎవరైనా ఎందుకు ప్రయత్నించలేదు? ఆటపట్టింపు పేరుతో వెటకారం చేస్తుంటే ఎవరూ ఏమీ అనకుండా ఎలా ఉండగలిగారు? ఇలా అంటే అబ్బే మీరు జనరలైజ్‌ చేసి చెప్తున్నారంటారు..తప్ప వాస్తవాలేమిటని పరికించరు.. వివిధ తెలంగాణ జిల్లాల ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఆంధ్రప్రాంతంలో నాయకులు, ఉద్యమకారులు, బ్లాగర్లు పదే పదే చెప్తున్నారు సంతోషం.. కానీ, ఏ ఒక్క తెలంగాణ జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని ఎందుకు నిర్వహించటం లేదు? ఫలానా సందర్భంలో అన్యాయం జరిగింది అని వాళు్ల చెప్తున్నారు.. ఫలానా విధంగా మోసపోయామని వారంటున్నారు.. ఫలానా విధంగా వివక్ష చూపించారని వారు ఆరోపిస్తున్నారు.. వాళ్ల మాటల్లో, ఆరోపణల్లో, వాదనల్లో నిజానిజాలను విశ్లేషించి వాస్తవాలేమిటో? వాళ్లెందుకు విడిపోవాలనుకుంటున్నారో? అలా విడిపోకుండా ఏం చేస్తే బాగుంటుందో ? అది చేయాల్సిన బాధ్యత సమైక్యత కోరుకుంటున్న వారిపైన లేదా? అంతా కలిసి ఉండాలని అనుకోవటం రెండువైపులా జరగాలి కదా? ఒక వైపు మేము కలిసి ఉండమని కరాఖండిగా చెప్తుంటే.. వాళ్లకు ఏమీ తెలియదు, నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని సమైక్యవాదులు భావిస్తే, మరి వాళ్లను కన్విన్‌‌స చేయాల్సిన బాధ్యత సమైక్యత కోరుకుంటున్నవారిపైన లేదా? ఇప్పటివరకు కనీసం ఈ పది రోజుల్లో ఎంతమంది సమైక్యవాదులు తెలంగాణ ప్రాంతంలో తమ వాదాన్ని వినిపించి అక్కడి ప్రజలతో మమేకం అయ్యారు? ఇంటర్నెట్‌ల ద్వారా తమ వాదన వినిపిస్తున్న సమైక్యవాదులు తెలంగాణకు జరిగిందంటున్న అన్యాయం పట్ల ఎంత హేతుబద్ధంగా స్పందించారు? ఒక జీవోలో అన్యాయం జరిగిందని ఉదాహరణ చూపించగానే ` ఆ.. అయితే ఏంటట...' అని అంటాడొకాయన.. ఆయన సమైక్యవాది.. అంతా కలిసికట్టుగా ఉందామనే గొప్పవ్యక్తి వ్యక్తిత్వం ఇది. ఇంకో ఆయన విడిపోతే మరో పాకిస్తాన్‌ అయిపోతుంది.. పోతే పొండి అంటాడు.. సమైక్యత పట్ల ఈ మహానుభావుడికి ఉన్న గొప్ప అభిమానం ఇది. మరో అజ్ఞాత వ్యక్తి మీరు పురుగులపడి చస్తారంటాడు.. ఓహ్‌ తెలంగాణ ప్రజలంతా తమ సోదరులని భావించి వారితో కలిసిమెలిసి కలకాలం ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న పెద్దమనుషులు వీళు్ల..
తమకు జరిగిన అన్యాయం గురించి తమకు తెలిసిన కొన్ని నిజాలను చర్చకు తీసుకువచ్చినందుకే ఈ నిందలు.. తిట్లు.. శాపనార్థాలు..తమకు అన్యాయం జరిగిందన్న బలమైన అభిప్రాయం కలిగిఉన్నారు కాబట్టే తెలంగాణా వాళు్ల విడిపోతామంటున్నారు.. వాళ్ల అభిప్రాయం తప్పయితే అది తప్పని చెప్పాలి.. అదే సమయంలో ఒప్పేమిటో వివరించాలి..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
పోనీ కొందరే తెలంగాణాను కోరుకుంటున్నారు.. ఎక్కువమంది సమైక్యంలోనే ఉందామని భావించినట్లయితే, దాన్నయినా నిరూపించాలి.. ఇందుకు ఏ ఎన్నికలనో, వాటి ఫలితాలనో చూపించటం కాదు.. తెలంగాణ కోరుకుంటున్నారా? లేదా అన్నది తేలటానికి అదొక్కటే అజెండాగా ప్రత్యేక రెఫరెండం పెడ్తే తేలేది కాదా....తొమ్మిదేళ్ల నుంచి పాపం బక్కనేత కిందామీదా పడి అంతా మర్చిపోయిన తెలంగాణను చర్చలోకి తీసుకువచ్చాడు కదా? మరి ఇన్నేళ్లలో ఎప్పుడో ఒకసారి రెఫరెండం పెట్టి ఉంటే ప్రజల్లో ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలిసేది కాదా.. సార్వత్రిక ఎన్నికల్లోనో, సాధారణ ఎన్నికల్లోనో, స్థానిక ఎన్నికల్లోనో వచ్చే ఫలితాలు సాధరణీకరణగానే ఉంటాయి. అందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటే ప్రత్యేక రెఫరెండం ఏర్పాటు చేసే ఇబ్బంది సర్కారుకూ ఉండనవసరం లేదు.. అన్నదము్మల్లా కలిసిమెలిసి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకునే అన్నయ్యలకు ప్రభుత్వాన్ని ఒప్పించటం పెద్ద కష్టమేం కాదు.. మీరు అమాయకులు.. మిమ్మల్ని మీ నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని తాము చేస్తున్న ఆరోపణలను నిజమేనని చెప్పటానికి ఇంతకంటే ఏముండేది? గుడ్డిగా జనరల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మొండిగా వాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది.. ఇదేమీ నింద కాదు.. తిట్టు కాదు.. మొండితనానికి ఒక పర్యాయపదం మాత్రమే.. ఎంతో సమన్వయంతో, సంయమనంతో వ్యవహరించి ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడో చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
కనీసం పదకొండు రోజుల పాటు కెసిఆర్‌ నిరాహార దీక్ష జరిగింది...సమైక్యవాదుల అభిప్రాయం ప్రకారమే అయినా, సెలైన్‌ బాటిళు్ల ఎక్కించుకుని పదకొండు రోజులు లాగించారు.. కనీసం ఆ దీక్షే ఉస్మానియా విద్యార్థులకైనా, కెయు విద్యార్థులకైనా ఒక రకమైన ప్రేరణను ఇచ్చింది కదా.. వారి ఉద్యమం అయినా అన్ని రోజులు నడిచింది కదా.. ఈ పదకొండు రోజుల్లో ఒక్కసారైనా సమైక్యవాదులు ఎవరైనా అయ్యో మిమ్మల్ని కెసిఆర్‌ మోసం చేస్తున్నారు.. మనం అంతా కలిసిమెలిసి ఉందాం... అని ఉస్మానియాకో, కెయుకో వెళ్లి విద్యార్థులతో ఒక్కరైనా మాట్లాడారా?
ఎందుకంటే హృదయపూర్వకంగా అందరం అన్నదము్మల్లా కలిసి ఉందామని భావిస్తున్న వారి బాధ్యత అది..
అయ్యో వారు మనల్ని వీడిపోతామంటున్నారు.. వాళ్లను నిలువరించటం ఎలా అని ఆలోచించటం వారి కర్తవ్యం.. పోనీ విద్యార్థులు ప్రొవోక్‌ అయ్యారు అనుకుంటే.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా అక్కడి పది జిల్లాల్లో ప్రజలను చైతన్య వంతులను చేసే, అవగాహన కల్పించే ప్రయత్నాలు, చర్యలు ఎవరైనా ఎందుకు చేపట్టలేదు?
ఎందుకంటే హృదయపూర్వకంగా అందరం అన్నదము్మల్లా కలిసి ఉందామని భావిస్తున్న వారి బాధ్యత అది..
అప్పుడంటే సోనియమ్మ ఉన్నట్టుండి తెలంగాణ ప్రకటిస్తుందని ఊహించలేదు కాబట్టి లైట్‌గా తీసుకున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ, సడన్‌గా ఆమె చిదంబరం చేత ప్రకటింపచేసిందనుకుందాం.. ఆ తరువాతైనా అందరం ఒకటిగా ఉందామనుకుంటున్నాం... మేం విడిపోదలుచుకోలేదు.. కెసిఆర్‌ మిమ్మల్ని పక్కదారి పట్టించారు.. తెలంగాణ ప్రజలంతా మాతోనే కలిసి ఉన్నారు.. ఇదిగో రుజువు.. పది జిల్లాల్లో జనాలు ఇలా స్పందిస్తున్నారు.. వాళ్ల అభిప్రాయం ఇదని సోనియమ్మకు ఎందుకు చెప్పలేదు?
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది..
సమైక్యం అని కోరుకుంటున్న ప్రాంతాల్లో సమైక్యం, సమైక్యం అని ఉద్యమించటంలో అర్థం ఏముంది.. అక్కడి ప్రజలు ఎలాగో సమైక్యాన్నే కోరుకుంటున్నారు.. దీన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు.. ఎక్కడైతే విడిపోతామంటున్నారో.. అక్కడ సమైక్య ఉద్యమం చేయాలి..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
తెలుగువారంతా ఒకటే అని, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దంటున్న వాళ్లంతా ఇవాళ్టికీ సమైక్యాంధ్ర అనే అంటున్నారు కానీ, సమైక్యాంధ్రప్రదేశ్‌ అని మాత్రం అనటం లేదు.. ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అయిన విషయాన్ని మరిచిపోయారా? లేక 1953నాటి ఆంధ్ర రాషా్టన్న్రే సమైక్యంగా ఉంచాలన్నది వారి ఉద్దేశ్యమా? ఉద్యమాలు కూడా అక్కడే జరుగుతున్నాయి కదా? దీన్ని వివరించటం చాలా అవసరం.
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
సమైక్యాంధ్ర ఉద్యమాలు ప్రారంభమైన తరువాతే.. రాష్ట్ర రాజకీయం నిట్టనిలువునా చీలిపోయింది. రాజకీయ పార్టీలన్నీ రెండు ముక్కలయ్యాయి. ప్రాంతాల వారిగా రాజకీయం ముక్కలు చెక్కలైంది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. పార్టీల అధినేతలకు కూడా పరిష్కరించటానికి వీల్లేని పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ వాతావరణంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఒక్క క్షణమైనా సభాకార్యకలాపాలు నిర్వహించగలుగుతుందా? ఒకే పార్టీ నేతలు కలిసిమెలిసి ఉండగలరా? ఈ విధంగా రాష్ట్రం ఎంతవరకు సమైక్యంగా ఉండగలుగుతుంది.. సమైక్యత తిరిగి సాధించేందుకు మార్గం ఏమిటి? ఎందుకు అంతా కలిసి ఉండాలి? జవాబు చెప్పటం అవసరం..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.

డిసెంబర్‌ 15-సెప్టెంబర్‌ 17

అమరజీవి పొట్టిశ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు.. ఆయన నిజంగా ప్రాతఃస్మరణీయుడు.. ఇందులో సందేహం లేదు. కాకపోతే ఆయన ఆంధ్రరాష్ట్రం సాధించారు కానీ, ఆంధ్రప్రదేశ్‌ కాదు.. అయినా తెలంగాణతో సహా రాష్ట్రం అంతటా శ్రీరాములు గారిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా స్మరించుకుంటుంది. నివాళులు అర్పిస్తుంది.. దీనికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఉండకూడదు... కానీ, అదే సమయంలో హైదరాబాద్‌ భారత యూనియన్‌లో విలీనం అయిన సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు ఎందుకు నిర్వహించకూడదు..

వాస్తవంగా హైదరాబాద్‌స్టేట్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాలేదు కదా... ఆ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరపడానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అదేమీ విదేశాల్లో కలవలేదే... వేరే దేశంగా మారలేదే? ఫణిగారు పదే పదే అంటున్నట్లు పాకిస్తాన్‌ కాలేదే.. ఈ దేశంలో.. అంతా ఒకటే అనుకుంటున్న ఈ రాష్ట్రంలో భాగంగానే ఉన్నదే.... మరి విమోచన దినాన్ని జరపడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి? అంటే ప్రభుత్వం ఉద్దేశంలో హైదరాబాద్‌ స్టేట్‌ నిజాం పరిపాలన నుంచి ఆంధ్ర పాలనలోకి వెళ్లిందే కానీ, దానికి స్వాతంత్య్రం రాలేదనా? సర్కారుకు ఇది చాలా చిన్న విషయం... పరిష్కరించటం పెద్ద సమస్య కానే కాదు.. ఎందుకంటే సెప్టెంబర్‌ 17న అన్ని పార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలు అయితే ఎగురవేస్తాయి. రాజకీయ పార్టీలు ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు, ప్రభుత్వం నిర్వహించటంలో తప్పేమిటి? తెలంగాణ ప్రజలు కనీసం విమోచన దినోత్సవాన్ని కూడా అధికారికంగా జరుపుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్న అడిగితే పురుగుగా చూస్తారు..నాశనం చేయటానికే పుడతారంటారు.. పొట్టి శ్రీరాములు గారిని తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్‌ అంతా స్మరించుకున్నప్పుడు హైదరాబాద్‌ విమోచనం జరిగి తెలుగువాళ్లంతా ఏకం కావటానికి మార్గం ఏర్పడిన సందర్భాన్ని రాష్ట్రం ఎందుకు వైభవంగా తీసుకోకూడదు.. ఆంధ్రప్రాంతం వారికి ఇబ్బంది ఏమీ ఉండదే ఈ విషయంలో.. మరి ఎందుకు ఈ వివక్ష. సారీ సమస్య. సమైక్యంగా అంతా అన్నదము్మల్లా కలిసిమెలిసి ఉందామనుకునే వాళు్ల హైదరాబాద్‌ విమోచన దినోత్సవం గురించి సర్కారును ప్రశ్నించాల్సిన అవసరం లేదా? కలిసిమెలిసి ఉందామనుకునే సోదరుల ఆకాంక్షలనే పట్టించుకోలేని పరిస్థితిని ఏమని నిర్వచించాలి?

టార్గెట్‌ హైదరాబాద్‌....

హైదరాబాద్‌... ఇప్పుడు ఎక్కడ చూసినా అదే మాట.. ఏ నోట విన్నా ఇదే పాట..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చిదంబరం ఏ ముహూర్తంలో చేశారో కానీ, ఆ మర్నాటి నుంచే సమైక్య ఉద్యమాలు పెల్లుబికాయి. కానీ, ఈ ఉద్యమాలన్నీ ఒకే ఒక్క నగరం చుట్టూ తిరుగుతున్నాయి. అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌. ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమాల వెనుక టార్గెట్‌ హైదరాబాదేనా? హైదరాబాద్‌ను తెలంగాణ వాదులు వదిలేసుకుంటామంటే ఈ సమైక్య ఉద్యమాలన్నీ ఆగిపోతాయా? హైదరాబాద్‌పై ఎందుకింత ప్రేమ? దీని కోసం ఎన్ని పట్టుదలలు?
హైదరాబాద్‌కోసమేనా సమైక్యాంధ్ర?
తెలంగాణలోని మిగతా 9జిల్లాలు ఐక్య ఉద్యమ లక్ష్యం కాదా?
హైదరాబాద్‌పైనే ఎందుకింత ప్రేమ?
ఎవరి ప్రయోజనాల కోసం ఈ పట్టుదల?
అసలు హైదరాబాద్‌ వెనుక ఉన్న ప్రయోజనాలేమిటి?

తెలంగాణ ప్రత్యేక వాద ఉద్యమం రేగినప్పుడల్లా, సమైక్య రాష్ట్రం ఉండాలని పట్టుబట్టే ఉద్యమకారులంతా మొట్టమొదటగా లేవనెత్తే ప్రశ్న హైదరాబాద్‌ సంగతేమిటి? అని.. కోట్ల కొద్దీ రూపాయలు ఖర్చు చేసి ఈ స్థాయిలో నిర్మించిన మహానగరాన్ని మేమెలా వదిలిపెడతామని.. నిజమే.. ఈ ప్రశ్నలన్నీ సహేతుకమే.. ఈ దేశంలో కాశ్మీర్‌ మినహా మిగతా అన్ని రాషా్టల్ల్రో ప్రజలు స్వేచ్ఛగా సంచరించేందుకు, నివసించేందుకు, ఆదాయాలు సంపాదించుకునేందుకు, సంపత్తిని పెంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, ఖర్చు చేసేందుకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం మనందరికీ కల్పించిన మౌలిక హక్కు అది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావన వస్తున్న ప్రతిసారీ చాలా బలంగా, అత్యంత దృఢంగా, విస్పష్టంగా జరుగుతున్న ప్రచారం వాళ్లను వీళు్ల వెళ్లగొడతారని.. వెళ్ల గొట్టడానికి వీళ్లెవరు? వీళ్లకు ఉన్న అధికారం ఏమిటి? రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిన రాజ్‌థాక్రే అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలడం తప్ప చేయగలిగిందేమీ లేదు.. జాగో.. భాగో నినాదాలు ఇచ్చిన సదరు కెసిఆర్‌ అనే నేత కూడా ఈ విషయంలో లక్షాతొంభై వివరణలు ఇచ్చుకున్నారు.. అయినా సమైక్య ఉద్యమం బలంగా సాగేందుకు ఈ ప్రచారాలు తప్పటం లేదు.. ఉద్యమానికి ఏదో ఒక హేతువు కాబట్టి ఇలాంటి ప్రచారాలు అవసరమవుతాయి. దీనికి ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు.. ఎవరూ వెళ్లిపోరని వారికి తెలుసు.. ఎవరూ వెళ్లగొట్టలేరనీ వారికి తెలుసు.. ప్రజలకూ ఆ సంగతి తెలుసు.. అయినా ప్రచారం ఆగలేదు.. ఆగదు.. ఎందుకంటే ఉద్యమాన్ని బలహీన పరిచే ఎలాంటి చర్యనూ వాళు్ల చేపట్టరు.. ఉద్యమకారుల మౌలిక లక్షణం అది... ఈ ధోరణి ప్రత్యర్థులకు ఇబ్బంది కలిగించవచ్చు.. చికాకు పరచవచ్చు.. కానీ, ఉద్యమకారుల దృష్టికోణం నుంచి ఆలోచిస్తే అది సమంజసమైన చర్యే.
ఇక అసలు విషయానికి వద్దాం... రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ చాలా విస్తరించింది. ఇళు్ల, కాలనీలు, వ్యాపారాలు, పరిశ్రమలు అలియాస్‌ ఐటి ఇలా ఎంతో విస్తరిస్తూ పోయింది. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పెట్టుబడులూ వచ్చాయి. ఇందులో సందేహం లేదు.. ఈ పురోగతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. బిళ్ల బంట్రోతు కట్టిన పన్నుల నుంచి బిల్‌ గేట్‌‌స పెట్టిన పెట్టుబడి దాకా ప్రతి రూపాయి హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించింది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తేది.. ఇవాళ సమైక్య ఉద్యమవాదులు వాదిస్తున్న దానిలోనే ప్రశ్న దాగి ఉంది. హైదరాబాద్‌ను ఎక్కడో కోస్తాంధ్రలో ఉంటున్న తాము వచ్చి డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి చేశాం... ఇప్పుడు హైదరాబాద్‌ మాది మీరు వెళ్లిపొండంటే మేమెందుకు ఊరుకుంటాం? అని.. నిజమే.. వెళ్లిపొమ్మంటే ఊరుకోవటం పిరికితనం అవుతుంది. దర్జాగా మనం కొనుక్కున్న స్థలంలో మనం నివసించేందుకు, వ్యాపారం చేసుకునేందుకు అన్ని రకాల ఆర్థిక, హార్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం సార్వభౌమాధికారాన్ని ప్రతి భారతీయుడికి కల్పించింది. అందులో ఇసుమంతైనా సందేహం లేదు.. ఇక 1956 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన పెట్టుబడుల వల్లనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని... ఇదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాతే హైదరాబాద్‌కు ఈ వైభవం కలిగిందా? అంతకు ముందు హైదరాబాద్‌ నిజంగా రాళూ్ల రప్పలతోనే ఉండిందా? తరతరాల బూజు నిజాం రాజు హయాంలో హైదరాబాద్‌ ఎందుకూ కొరగాకుండా పోయిందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలా? ఒకవేళ హైదరాబాద్‌ నాటి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కాకపోయి ఉంటే..ఆంధ్రప్రాంతంలో హైదరాబాద్‌ కలిసి ఉండకపోతే, హైదరాబాద్‌ ఇలా ఉండేది కాదా? ఇక్కడ రాళూ్ల రప్పలూ మాత్రమే మిగిలేవా? ఏది నిజం?
==============
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడేసరికే హైదరాబాద్‌ స్టేట్‌ ఉంది. 1948లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పుణ్యమా అని పోలీస్‌ యాక్షన్‌తో నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌స్టేట్‌కు విముక్తి లభించింది. అప్పటికి ఆంధ్రరాష్ట్రం మద్రాస్‌ స్టేట్‌లో భాగంగానే ఉంది. తమిళుల నుంచి తెలుగువారు వేరుగా ఉండాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉన్నప్పటికీ, అది సాధ్యం కాలేదు.. 1952లో ఇడ్లీసాంబార్‌ గోబ్యాక్‌ ఉద్యమం హైదరాబాద్‌లో వచ్చింది. ఏడుగురు తెలంగాణ విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మరణించారు.. 1953లో పొట్టిశ్రీరాములు గారి అమరత్వంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అప్పుడు హైదరాబాద్‌ స్టేట్‌ ఆంధ్రలో విలీనం జరగలేదు. ఓ పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదనపై రాయలసీమ నేతలతోనే గొడవలు.. పైగా ఢిల్లీలో ప్రాబల్యం ఉన్న రాజగోపాలాచారి కారణంగా ముందుగా ఆంధ్రరాష్ట్రం వస్తే చాలు అనే అనుకున్నారు.. ఆంధ్రరాష్ట్రం సాధించారు. కానీ, రాజధానికి అవసరమైన అన్ని హంగులు ఉన్న నగరం మద్రాసును సాధించుకోలేకపోయారు.. ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడా అన్ని సౌకర్యాలు ఉన్న నగరం మరొకటి లేదు.. కర్నూలును రాజధాని చేసినా రాజధాని స్థాయి భారాన్ని అది మోయలేకపోయింది. అందుకే వారికి హైదరాబాద్‌ వంటి నగరం అవసరమైంది. ఎలాగూ భాషా ప్రయుక్త రాషా్టల్ర కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. రాషా్టల్రను పునర్విభజించేందుకు ఓ కమిషన్‌నూ వేశారు.. ఇదే సమయంలో హైదరాబాద్‌స్టేట్‌ను ఆంధ్రలో విలీనం చేయాలని అక్కడి నేతలు చేసిన కృషి మొత్తం మీద ఫలించింది. 1956లో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో విలీనం అయింది.
అయితే హైదరాబాద్‌ కోసం ఆంధ్ర రాష్ట్ర నేతలు ఎందుకంతగా పట్టుబట్టారు.. తెలుగువారు అంతా ఒకటిగా ఉండాలన్నదే అభిమతమా? లేక రాజధాని అవసరమా?
ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి ముందు హైదరాబాద్‌ ఎలా ఉందన్నది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ థాట్‌‌స ఆన్‌ లింగ్విస్టిక్‌ స్టేట్‌‌స అన్న తన పుస్తకంలో స్పష్టంగా తెలిపారు...
``దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అన్ని సౌకర్యాలూ హైదరాబాద్‌లో ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కంటే ఎక్కువ సౌకర్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన భవంతులు అతి చౌక ధరలకు లభిస్తాయి. అక్కడ భవంతులన్నీ చాలా అందంగా, ఢిల్లీలో కంటే ఎంతో అందంగా ఉన్నాయి. ఒక్క పార్లమెంటు భవనం కట్టుకుంటే సరిపోతుంది. సంవత్సరం పొడవునా నిరాటంకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించుకున్నా ఏమాత్రం ఇబ్బంది ఉండదు.. అలాంటప్పుడు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయటంలో అభ్యంతరం దేనికో నాకు అర్థం కావటం లేదు.. రాషా్టల్ర పునర్విభజన జరుగుతున్న ఈ తరుణంలోనే మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది..''
అంబేద్కర్‌ వంటి మేధావి ఈ మాట అన్నారంటే నాటి హైదరాబాద్‌ ఎంత ఉన్నతస్థాయిలో ఉందో ఆలోచించవచ్చు. అంతే కాదు.. అంబేద్కర్‌ రెండో రాజధాని అన్నారే కానీ, తెలంగాణ నుంచి దాన్ని విడగొట్టాలని ప్రస్తావన చేయలేదు.. హైదరాబాద్‌ అన్ని సౌకర్యాలతో, 1950ల నాటికే సుసంపన్నంగా ఉన్నది కాబట్టే శాశ్వతంగా రాజధాని సమస్య పోతుంది... దీనికి తోడు ఆనాడు హైదరాబాద్‌ స్టేట్‌ బడ్జెట్‌ దేశంలోనే ఏకైక మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉంది. ఈ ఆదాయ వనరుల వినియోగం సవ్యంగా సాగుతుందనే ఉద్దేశంతోనే ఆంధ్రరాష్ట్ర నేతలు హైదరాబాద్‌ స్టేట్‌ను అర్జెంటుగా విలీనం చేసేందుకు పట్టుబట్టారు. ఆనాడు మన నాయకులు హైదరాబాద్‌ గురించి ఏమన్నారు?
``హైదరాబాద్‌ వచ్చి మనతో కలిస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి. దీన్ని సాధించే మార్గాలను మనం వెంటనే అన్వేషించాల్సి ఉంటుంది''
1953జూన్‌
టంగుటూరి ప్రకాశం పంతులు
``మనకు రాజధానికి కావలసిన వనరులున్న నగరం ఒక్కటీ లేదు. గత రెండు సంవత్సరాలలో మనం చాలా సమస్యలను ఎదుర్కొన్నాం..ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం మనం ఇంకా ఆగితే చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.''
1956 ఫిబ్రవరి
నీలం సంజీవరెడ్డి
``విలీనం వల్ల ఆంధ్ర ప్రాంతానికి శాశ్వతంగా రాజధాని సమస్య పోతుంది. హైదరాబాద్‌ సికిందరాబాద్‌ జంట నగరాలు విశాలాంధ్రకు రాజధానిగా ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నాయి. ''
1955 మొదటి ఎస్సార్సీ

హైదరాబాద్‌ను రాజధానిగా చేసేందుకు కర్నూలును త్యాగం చేసారనటం ఎంతమాత్రం సరికాదు.. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రం నేతలు తమ తప్పనిసరి అవసరార్థమే తమతో విలీనం చేసుకున్నారు.. తెలుగువారంతా ఒకటిగా కావాలన్న భావన బయటకు చూపించే ఒక కారణం కావచ్చు.
హైదరాబాద్‌ స్టేట్‌ విలీనం కావటం వల్ల అన్ని సౌకర్యాలతో రెడీమెడ్‌ రాజధాని ఆంధ్ర రాషా్టన్రికి లాభించింది. 1956కు ముందే అన్ని సౌకర్యాలతో 400 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ స్టేట్‌ ప్రజల పన్నులతో అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్‌.. ఆ తరువాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ ఏర్పాటు కావటంతో సహజంగానే ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. విలీనం అయిన తరువాత ఏర్పడిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగార్థులు, వ్యాపారస్థులు వచ్చి ఇక్కడ స్థిరపడటం సహజం.. ఇది ఏ రాష్ట్ర రాజధానిలోనైనా జరిగే సహజ పరిణామమే. ఇందులో వింతేమీ ఉండదు.. మహారాష్టల్రో ముంబయి అంతర్గత భాగం ఎలాగో.. తెలంగాణలో హైదరాబాద్‌ అంతర్భాగమే.. దీన్ని ఏదో విధంగా వేరు చేసి చూడటం శాస్త్రీయంగా, సాంకేతికంగా సాధ్యం కాదు..హైదరాబాద్‌ తెలంగాణకు నాభిప్రాంతంలో ఉంది. హైదరాబాద్‌లో ప్రవేశించాలంటే ఏ వైపు నుంచి చూసినా కనీసం వంద కిలోమీటర్లయినా తెలంగాణ జిల్లాల్లో ప్రయాణించి కానీ సాధ్యం కాదు.. అంతే కాదు.. హైదరాబాద్‌ జనాభా మిశ్రమ సంస్కృతి కలిగింది. ఇక్కడ కేవలం తెలంగాణ వాళ్లో, ఆంధ్రప్రాంతం వాళ్లో మాత్రమే ఉన్నారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి లేదు. ఇక్కడ మరాఠాలు ఉన్నారు.. ఇరానీలు ఉన్నారు.. కాయస్థులు, కన్నడిగులు ఉన్నారు... ఒకరు కాదు.. ఇద్దరు కాదు... అనేక జాతుల సంగమక్షేత్రం హైదరాబాద్‌.. మరి ఇన్ని వైరుధ్యాలు ఉన్నా హైదరాబాద్‌ గురించే ఎందుకు పట్టుదల..? సమైక్యవాదులు చేస్తున్న ప్రతిమాటను నిశితంగా గమనిస్తే.. హైదరాబాద్‌ మినహా మరే జిల్లా గురించి వారు ప్రస్తావించటం లేదు. అంటే వారి ఉద్యమం దేనికోసం? ఈ ఉద్యమాలు హైదరాబాద్‌నే ఎందుకు టార్గెట్‌ చేసుకున్నాయి.? అంటే హైదరాబాద్‌ను తెలంగాణ నేతలు పొరపాటున కాదంటే ఈ ఉద్యమాలన్నీ చప్పున చల్లారతాయా?


19, డిసెంబర్ 2009, శనివారం

ఇదేమిటి?...ఇగ్నోర్‌ చేయవద్దు.. జవాబు ఇవ్వండి

డిసెంబర్‌ 9, 2009
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం తీవ్రమైంది...
హింసాత్మకంగా మారే సూచనలు కనిపించాయి...
కేంద్రం ఒక్కసారిగా కళు్ల తెరిచింది...
డిసెంబర్‌ 9, 2009 రాత్రి 11.30 గంటలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ
కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
డిసెంబర్‌ 10, 2009
సీమాంధ్రల్లో సమైక్య ఉద్యమాలు..
డిసెంబర్‌ 11, 2009
జీవో నెంబర్‌ 1845 విడుదల..

ఇదేమిటని ఆశ్చర్యపోకండి... రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల పదకొండో తేదీనాడు జారీ చేసిన ఒకానొక ఉత్తర్వు..........
ఓ పక్క తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతుంటే... వాటి వార్తల జోలికి పోకుండా... ఇప్పుడీ జీవోల గోలేమిటని ప్రశ్నించకండి... అదే విచిత్రం... ఈ ఉద్యమాలకూ ఈ జీవోలకు లింకు ఉంది.. ఉద్యమాలు తలెత్తడానికి మూలమే ఈ ఉత్తర్వుల్లో దాగి ఉంది...

ఓ పక్క ప్రాంతాల మధ్య విభేదాలు పెచ్చరిల్లి.. రాజకీయ వ్యవస్థ నిట్టనిలువునా చీలిపోయింది. ఈ సమస్యను పరిష్కరించటం ఎలాగో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో సర్కారు నుంచే వివాదాస్పద జీవో విడుదల కావటం విచిత్రం. అందులో నిధుల కేటాయింపు విషయంలో మూడు ప్రాంతాల మధ్య సమన్వయం, సమానత్వం, పారదర్శకత పాటించలేదు.. ఎందుకిలా జరిగింది?
డిసెంబర్‌ పదకొండున రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ జీవో నెంబర్‌ 1845 విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల గురించి నాబార్‌‌డ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 130 కోట్ల 26 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 109 రోడ్లు, తొమ్మిది వంతెన నిర్మాణానికి కేటాయింపులు జరిపింది. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. సర్కారు జరిపిన కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు పది కోట్లు... మిగతా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు 120 కోట్లు కేటాయించింది. తెలంగాణలోని ఆరు జిల్లాలు ప్రభుత్వానికి మ్యాపులో ఆ సమయంలో కనిపించనే లేదు..
జీవోలోని వివరాలు పరికిస్తే ఏమీ చెప్పకుండానే మనకు అర్థం అవుతుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి పనుల కోసం నాబార్‌‌డ మంజూరు చేసిన నిధులు 130 కోట్ల 46 లక్షల 14వేల రూపాయలు మంజూరు చేసింది.
జిల్లాల వారిగా చూస్తే,
కోస్తాంధ్రలో ....
తూర్పు గోదావరి జిల్లా = 12.92 కోట్లు
పశ్చిమగోదావరి జిల్లా = 12.14 కోట్లు
గుంటూరు = 8.80 కోట్లు
కృష్ణా = 6.57 కోట్లు
నెల్లూరు =5.23 కోట్లు
ప్రకాశం = 16.19 కోట్లు
మొత్తం = 61.85 కోట్లు
ఉత్తరాంధ్రలో ...
శ్రీకాకుళం = 16.66 కోట్లు
విశాఖపట్నం = 2.88కోట్లు
విజయనగరం =22.27కోట్లు
మొత్తం = 41.87
రాయలసీమలో...
అనంతపురం = 1.85 కోట్లు
చిత్తూరు = 7.40 కోట్లు
కర్నూలు = 5.32 కోట్లు
కడప = 1.00కోట్లు
మొత్తం = 15.57కోట్లు
తెలంగాణలో...
మెదక్‌ =5.40 కోట్లు
మహబూబ్‌నగర్‌ = 1.05కోట్లు
నల్గొండ = 1.22కోట్లు
ఆదిలాబాద్‌ = 1.64కోట్లు
మొత్తం = 9.31 కోట్లు

తెలంగాణ లోని మిగతా ఆరు జిల్లాలు.. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ఒక్క రూక కూడా విదిల్చలేదు.. హైదరాబాద్‌ రాజధాని కాబట్టి దాన్ని మినహాయించారనుకుందాం.. మరి మిగతా అయిదు జిల్లాల మాటేమిటి? కేటాయించిన నాలుగు జిల్లాలకైనా ఏ దామాషా ప్రకారం, ఏ ప్రాధాన్యం ప్రకారం కేటాయింపులు జరిపారు?

నాబార్‌‌డ మూడు రకాల పనుల కోసం నిధులు ఇచ్చింది. ఈ నిధులను అన్ని జిల్లాల్లో పనుల ప్రాధాన్యం ఆధారంగా కేటాయించాల్సిన సర్కారు దానికి తిలోదకాలు ఇచ్చింది...ఒక జిల్లాకు అధికంగా కేటాయింపులు జరిపిందంటే అక్కడ పనుల అవసరం అధికంగా ఉన్నట్లు భావించాలి.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేసే పని అదే... ప్రధానంగా గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రజల అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి అలాంటప్పుడు నాబార్‌‌డ నిధులను పంపిస్తే.. వాటిని ఏ విధంగా కేటాయించాలి? ఆయా జిల్లాల అవసరాల్ని బట్టి దామాషా ప్రకారం అన్నింటికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత లేదంటారా? తెలంగాణపై చిన్నచూపు చూస్తే చూసిరి.. కనీసం రెండు నెలల క్రితం వరదలతో అల్లల్లాడిపోయిన జిల్లాలు కర్నూలు, మహబూబ్‌నగర్‌లనైనా ప్రాధాన్య క్రమంలో ముందుంచాల్సిన బాధ్యత సర్కారుకు లేదా? ఈ జిల్లాలను వరదలు ముంచెత్తి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కానీ, ఆ జిల్లాలో రహదారులు బాగు చేయటం అత్యంత ప్రాధాన్యమైంది. కానీ, కర్నూలుకు కేటాయించింది అయిదు కోట్లు... మహబూబ్‌నగర్‌కు ముష్టి కోటి రూపాయలు.. అదే గోదావరి జిల్లాలు ఒక్కో జిల్లాకు పన్నెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు.. ఇక మంత్రి గారి జిల్లా విజయనగరానికి ఏకంగా 22 కోట్లు కేటాయించుకున్నారు.. సరే ఏ మంత్రయినా తన నియోజక వర్గానికి తన జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం ఇటీవలి కాలంలో సహజం... సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా చేసింది ఇదే.. మరి మిగతా జిల్లాల విషయంలో ఈ వివక్ష దేనికి ప్రాధాన్య క్రమంలో మినహాయింపులు ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ, ఆ మినహాయింపు, ఆ కేటాయింపుల లేమి తెలంగాణ జిల్లాలకు మాత్రమేనా? అవేం పాపం చేసుకున్నాయి...సమైక్యవాదులకు హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాలు కళ్లకు కనిపించనట్లే... సర్కారుకు కూడా కనిపించలేదా? రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఉంటే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం పదమూడు జిల్లాలకు ఎన్నో కొన్ని నిధుల కేటాయింపులు జరిగాయి. ఏ జిల్లానూ ఇక్కడ మినహాయించలేదు. ప్రతి జిల్లాకు కొద్దోగొప్పో నిధులను కేటాయించారు..మరి తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏం పాపం చేశాయి? ఈ ఆరు తెలంగాణ జిల్లాలకు నిధులు కేటాయించకూడదని అనుకున్నారా? లేక ఈ ఆరు తెలంగాణ జిల్లాల్లో రహదారులు వంతెనలు కళకళలాడుతున్నాయా? అన్ని జిల్లాలూ సరైన రవాణా మార్గాలు కలిగి అత్యున్నతమైన అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చిందా? అభివృద్ధి ఫలాలు అందరికీ సమాన స్థాయిలో అందాలన్నదే సమైక్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యమంటే అర్థం ఇదేనా?
మరో విశేషం ఈ జీవోలో ఉంది. కడప, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు 5కోట్ల రూపాయలకు పైగానే నిధులు కేటాయించారు.. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఆ నాలుగు జిల్లాలకు విదిలించింది కూడా అక్షరాలా తొమ్మిది కోట్ల 31 లక్షల 72వేల రూపాయలతో సరిపుచ్చారు.. నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు కేటాయించిన మొత్తం ఒక్క గుంటూరుకు కేటాయించిన మొత్తంతో దాదాపు సమానం..
అంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక్క జిల్లా పాటి చేయవా తెలంగాణలోని అన్ని జిల్లాలు? వీళు్ల పేర్కొంటున్న సమైక్యతకు అర్థం ఏమిటన్నది ఈ ఒక్క జీవో చెప్తోంది. నీటి వాటాల్లో మాకు అన్యాయం జరిగింది.. ఉద్యోగాల్లో మాకు అన్యాయం జరిగింది.. అభివృద్ధి నిధుల పంపకంలో మాకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ఉద్యమకారులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. అవన్నీ పచ్చి అబద్ధాలంటూ కొట్టిపారేశారు.. నాలుకలు చీరేస్తామన్నారు.. అన్యాయమే జరగలేదు పొమ్మన్నారు.. మరి ఈ జీవో ఏమిటి? దీని అర్థం ఏమిటి? వివక్షా? సమైక్యమా? సమదృష్టా? పారదర్శకతా? ఏమంటారు? నిఘంటువులు వెతికి చెప్పండి. తెలంగాణ వాదులు ఈ జీవోను ఎలా అర్థం చేసుకోవాలో అంతా కలిసి ఉందామని చెప్తున్న మహానుభావులారా, అజ్ఞాతంలో ఉన్న మహా మేధావులారా, సవివరంగా వివరించండి.. మా కళు్ల తెరిపించండి.. పెద్ద రాష్ట్రంగా ఉంటే, సమైక్యంగా ఉంటే, అన్ని ప్రాంతాలు ఏకంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు కదా.... నేను ఆవేశంగా అడగటం లేదు.. వినమ్రంగానే అడుగుతున్నా..నాకు భేషజాలు లేవు.. అడ్డంగా నిందించటం కాదు... జవాబు ఇవ్వకుండా తప్పించుకోవటం కాదు.. నిర్భయంగా జవాబు చెప్పండి... ఎలాగూ పేర్లు చెప్పరు.. అజ్ఞాతంలోనే ఉండి చెప్తారు.. పేరు చెప్పే సాహసాన్ని మీరు చేయలేరు.. అది మీ వల్ల కాదు.. అది ఎందుకో నాకు తెలియదు కానీ, 55 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి మూలం ఇదిగో మీ ముందున్న ఇలాంటి జీవోలే.. తెలంగాణ ప్రాంతంపై వివక్షకు నిలువెత్తు సంతకం ఈ జీవో... ఇది తప్పు కాదు.. అబద్ధం అంతకంటే కాదు.. తెలంగాణ వాదులు.. బ్లాగుల రచయితలు సృష్టించింది కాదు.. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా, అంటే ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న శ్రీ ఎంవిపిసి శాస్త్రి గారి స్వహస్తాలతో సంతకం చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ఇది.. శ్రీ బొత్ససత్యనారాయణ అమాత్యవర్యులు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ఇవి.. శ్రీ శాస్త్రి గారు గోదావరి జిల్లా వాసి అనో, శ్రీ బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా వాసి అనో నేను నిందించటం లేదు.. ఉన్నతాధికారులు, సీనియర్‌ నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి పట్ల ఐక్యభావంతో ఉన్నవారు విడుదల చేసిన ఈ ఉత్తర్వులను ఐక్యతను కోరుకుంటున్న ఆంధ్రప్రాంత ప్రజలు కానీ, విభజనను కోరుకుంటున్న తెలంగాణ వాసులు కానీ ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకా సమైక్యత కోరుకుంటున్న వారు ఈ జీవో చూసిన తరువాత తమ ఉద్యమాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? లగడపాటి వారు.. టివీ ప్రకటనల్లో తెలంగాణాకు ముందే గోడ కట్టిన వారి వందిమాగధ బృందం ఇప్పుడేమంటుంది? మీ ఐక్యభావనలో (అది నిజంగా ఉంటే) నిజాయితీ ఉంటే విస్పష్టమైన జవాబు ఇవ్వండి.. సహేతుకంగా మీ నిర్ణయాన్ని చెప్పండి... ఉద్యమాన్ని కొనసాగించేందుకు మీకున్న నైతిక హక్కు ఏమిటన్నది వివరించండి...