17, డిసెంబర్ 2009, గురువారం

టార్గెట్‌ సీమాంధ్ర

రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం లక్ష్యం ఏమిటి? తెలంగాణతో కలిసిన ఐక్య ఆంధ్రప్రదేశ్‌ కోసమా? దీని వెనుక మరో మతలబు ఏమైనా ఉందా? రాజకీయ పార్టీల నాయకుల రాజీనామాలతో ప్రారంభమైన ఉద్యమం ప్రతిరోజూ ఒక్కో మలుపు తిరుగుతోంది.. అందరి నినాదం ఒకటే అయినా.. టార్గెట్‌ వేరా? రాజకీయ ఆధిపత్యం కోసం జరుగతున్న అస్తిత్వ పోరాటమా?

రాత్రికి రాత్రి చిదంబరం దొరగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన మరుక్షణం నుంచి తెలంగాణలో సంబరాలు.. సీమాంధ్ర ప్రాంతంలో కల్లోలాలు మొదలయ్యాయి. ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు.. విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనలు మిన్నంటాయి. ధర్నాలు, నిరాహార దీక్షలు మొదలయ్యాయి. నాయకుల ప్రకటనలు మరింత దూకుడుగా ముందుకు సాగాయి. పార్టీలకు అతీతంగా ప్రారంభమైన రాజీనామాలు, దీక్షల ఉద్యమం రోజులు గడిచేకొద్దీ ఆధిపత్యం దిశగా సాగింది. క్రమంగా ఒక్కో పార్టీ నుంచి ఒక్కో నాయకుడు సమైక్యాంధ్ర నినాదం తలకెత్తుకోవటం ప్రారంభించారు.. ఎవరికి వారు ఉద్యమం క్రెడిట్‌ దక్కించుకునేందుకు, భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నాలను ప్రారంభించారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. రాజకీయంగా పార్టీల పొజిషన్‌లో పెద్దగా సమస్య ఉండదు..ఓట్ల రాజకీయాల్లో సమీకరణాలు పెద్దగా మారేది ఉండదు.. ఇక మిగిలింది రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాలు.. ఈ ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి పొందటం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత అవసరం. అందుకే ఎవరికి వారు వారి వారి వూ్యహాల్లో మునిగి తేలుతున్నారు.. ఈ పోటీలో అందరికంటే ముందున్నది మాత్రం నిస్సందేహంగా లగడపాటి రాజగోపాల్‌.. సమైక్యాంధ్ర కావాలంటూ హైదరాబాద్‌లో హడావుడి చేసినా, విజయవాడకు తరలించిన తరువాత అక్కడ దీక్షకు కూర్చున్నా.. తెలంగాణ వాదులపై తీవ్రంగా విరుచుకుపడినా ఆయనకే చెల్లింది. తెలంగాణ, ఆంధ్ర చరిత్రకు కొత్త భాష్యం చెప్పి, సమైక్యాంధ్రను సమర్థించి తన స్పెషల్‌ సై్టల్‌లో లగడపాటి ముందుకు వెళు్తన్నారు.. తెలుగువాళ్లంతా ఒకటే అన్న ప్రకటనలను సైతం పెద్ద ఎత్తున రూపొందించి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయటంలోనూ ఆయన ముందున్నారు.. కాంగ్రెస్‌లో మరే సీమాంధ్ర నేత ఆయనకు పోటీగా నిలబడలేని పరిస్థితి నెలకొని ఉంది. రేపు రాష్ట్రం విభజన జరిగినా, జరగకపోయినా, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడుగా ఎదిగేందుకు లగడపాటికి మంచి అవకాశం లభించినట్లయింది. ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు కూడా...
ఇక తరువాతి స్థానం జగన్మోహన్‌ రెడ్డి... సమైక్యాంధ్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని కొంత ఆలస్యంగా గుర్తించారు.. అయితే ఆయన పార్లమెంటును ఒంటరిగా ఇందుకు వేదిక చేసుకున్నారు.. ఒక్క కాంగ్రెస్‌ ఎంపి తోడు లేకుండానే ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం ఎంపిలతో స్వరం కలపటం ఆయనకు కొంత ఇబ్బందే కలిగించింది.
రాయలసీమ నుంచి ముందు నుంచి గట్టిగా గొంతు వినిపిస్తున్నది జెసి దివాకర్‌ రెడ్డి.. ఆయన కేవలం రాజీనామా, ప్రకటనలకు తప్ప, ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగింది లేదు.. కాబట్టి లగడపాటితో పోటీ పడటం సాధ్యం కాదు...
ఈ పరిణామాలన్నీ తన చాపకిందకు నీళు్ల తెచ్చేలా ఉన్నాయన్న వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొందరగానే గ్రహించారు. తనపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని సమర్థంగానే తిప్పికొట్టారు.. ఓ పక్క తెలంగాణలో తెలుగుదేశం నేతలు తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తున్నా.. ఆయన మాత్రం నర్మగర్భంగా సమైక్యరాగాన్ని ఆలపిస్తూ ముందుకు వెళు్తన్నారు....
ఇక తాజాగా సీన్‌లోకి వచ్చింది చిరంజీవి.. పార్టీ పెట్టిన నాటి నుంచీ రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్న మెగాస్టార్‌ కనీసం సమైక్య వాదాన్ని ఎత్తుకుని అయినా ఉనికిని చాటుకుందామని చివరి ప్రయత్నం చేస్తున్నారు... నిన్నటిదాకా సామాజిక తెలంగాణ అంటూ వచ్చిన చిరంజీవి తెలంగాణలో పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ సమైక్య నినాదాన్ని అందుకున్నారు. కనీసం ఈ ఉద్యమాన్ని అయినా రాజకీయ లబ్ధికి సద్వినియోగపరుచుకోవటం ఆయనకు అత్యవసరమయింది. కానీ, ఆయన్ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఓ పక్క ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, రేపు తిరుపతిలో నిరాహార దీక్ష శిబిరంలో కూర్చొంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో ప్రణబ్‌, చిదంబరంలను కలిసిన సీమాంధ్ర ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. జెసి దివాకర్‌ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా మీడియాలో వెల్లడించారు.. దీంతో సమైక్య ఉద్యమం క్రమంగా చల్లబడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజలు నాయకుల మెడలు వంచి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తే తప్ప నాయకులు రాజీనామాలు ఉపసంహరించుకుంటే ఉద్యమం బలంగా కొనసాగటం కష్టం. అంటే దాదాపు చివరి నిమిషంలో చిరంజీవి కార్యరంగంలోకి దూకినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువైన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు మాత్రం తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండన్నట్లుగా కామ్‌గా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు..తన మౌనం వెనుక మహా విస్ఫోటనం దాగి ఉందంటూ తాజాగా ప్రకటన చేశారు.. కేంద్రం మాటతప్పి పక్కకు పోతే మహా ప్రళయమే వస్తుందని హెచ్చరించారు.. ఆంధ్ర ప్రాంత నాయకులు ఉభయ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం సరికాదన్నారు... తెలంగాణను ఇక ఆపటం ఇక ఎవరి తరం కాదన్నారు...

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆల్రేడీ తీర్పు ఇచ్చేసింది. ఇంక కేసీఆర్ అన్న మళ్ళీ దీక్షకు కూర్చోవాల్సిందే. :( :( :(

జై తెలంగాణ

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

pl visit.raki9-4u.blogspot.com

Nrahamthulla చెప్పారు...

జిల్లా కోర్టు దగ్గర హైడ్రామా
* ఎదురెదురుగా శిబిరాలు నిర్వహిస్తున్న న్యాయవాదులు
* రెండో రోజుకు చేరిన సమైక్య న్యాయవాదుల దీక్షలు
గుంటూరు లీగల్‌, డిసెంబరు 17 (న్యూస్‌టుడే): జిల్లా కోర్టు ఎదుట గురువారం మొత్తం హైడ్రామా నడిచింది. బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు సమైక్యాంధ్ర, జై ఆంధ్రాకు మద్దతుగా రెండు వర్గాలుగా విడిపోయారు. ఎదురెదురుగా శిబిరాలు ఏర్పాటుచేసి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమైక్యాంధ్ర కావాలంటూ గురువారం ఉదయం బార్‌ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రధానద్వారం పక్కన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆంధ్ర కావాలంటూ మరికొందరు న్యాయవాదులు జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ఎదుట రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఇరు శిబిరాల్లోని న్యాయవాదులు పోటాపోటీగా నినాదాలు చేయడం.. మరికొందరు రెండు శిబిరాల్లోని న్యాయవాదులను పరామర్శించి అటూఇటూ తిరుగుతూ హడావిడి సృష్టించారు. కొందరు న్యాయవాదులు శిబిరాల ముందు రహదారిపైనే కుర్చీలు వేసుకుని కూర్చోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన న్యాయవాదులే రోడ్డుకు అడ్డంగా శిబిరాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుంటే తామేమి చేయగలమంటూ అక్కడికొచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు వాపోయారు. అనంతరం కోర్టువైపు వాహనాలు రాకుండా క్రమబద్ధీకరించారు. న్యాయవాదులు ఇలా విడిపోయి రెండు శిబిరాలు ఏర్పాటు చేయడంపై సీనియర్‌ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రెండోరోజుకు చేరిన సమైక్యాంధ్ర దీక్షలు
సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం బార్‌ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు దూళ్ళ శ్రీనివాసరావు, బి.శామ్యూల్‌ ప్రభాకర్‌, కె.శ్రీనివాస రావు, ఎం.డేవిడ్‌ లూధర్‌, జె.బాలవరలక్ష్మి, ఎస్‌.కె.ముంతాజ్‌బేగంలతో పాటు సీనియర్‌ న్యాయవాది, పార్లమెంట్‌ సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తండ్రి పాపిరెడ్డి కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు గులకవరపు రవికుమార్‌, చుక్కపల్లి రమేష్‌ తదితరులు వారిని పరామర్శించారు. మోదుగుల పాపిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకుంటూ తెలుగుజాతి ఒక తాటిపై ఉండేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.

ఆంధ్ర రాష్ట్ర సమితి నిరసన దీక్ష
ఆంధ్ర రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేకాంధ్ర కావాలంటూ కొంత మంది న్యాయవాదులు నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్రం విడిపోవడానికి ఇదే సమయమని.. వాళ్ళు వద్దంటున్నా ఎన్నాళ్లు కలిసుంటామని తెలిపారు. న్యాయవాదులు నీలం రామ్మోహన రావు, జి.సి.ఎస్‌.మల్లికార్జునరావు, మున్నంగి సాంబిరెడ్డి, సంకూరి రాజారావు, రాయపూడి మాణిక్యరావులు నిరాహార దీక్ష చేశారు. ఈ శిబిరాన్ని సీనియర్‌ న్యాయవాది పాపినేని లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వై.కోటేశ్వరరావు, జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. eenadu 18.12.2009

Nrahamthulla చెప్పారు...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.