27, డిసెంబర్ 2009, ఆదివారం

“ కాలంతో పాటు ” పుస్తకం-ముందుమాట


“ కాలంతో పాటు ” అనే ఈపుస్తకంలో యువ రచయిత, చిరంజీవి కోవెల సంతోష్ కుమార్, అనేక విషయాలు చర్చించారు. భారతదేశ స్వాతంత్ర్యప్రాప్తి తరువాత ఈ దేశంలోని సమస్యలు అనేకం చర్చించారు. బ్రిటిష్ ప్రభుత్వం మనల్ను “వేరుచేసి పాలించారు” అనే పాత పాట నేపథ్యంలో మనం స్వతంత్రంగానే ఎన్నివిధాల చీలిపోగలిగామో చర్చించారు. సంస్థానాలు విలీనం చేసిన పటేల్ గారి కార్యక్రమాన్ని ఏ విధంగా మనం వమ్ము చేస్తున్నామో వివరించారు. భాష, ప్రాంతము, కులము ఇవన్నీ అభిమానవిషయాలు కావడము బదులు దురభిమాన విషయాలు కావడము మనల్ని అందర్నీ బాధపెడుతున్నది. మరొకమాటు ఇవన్నీ ఙ్ఞాపకం చేసుకొని ఆత్మావలోకనం చేసుకుంటే రాజకీయ స్వార్థపరులను కనీసం మాటలతో ఎదుర్కోవడము వీలవుతుంది. టెర్రరిజం, శాసనాలు వాటి వెనుకలేని చిత్తశుద్ధి, మన దేశపుటెల్లలు, కాశ్మీర్, నాగాలాండ్ మొదలైన వేర్పాటు తిరుగుబాట్లను చర్చించి, మీడియాపాత్ర చర్చించి, గవర్నర్ సంస్థలోని దౌర్బల్యాలను చూపించి, మహిళా ఉద్యమాలు పరిశీలించి, విలాసవస్తువుల ”కొనుగోలు విప్లవం” వేలెత్తి చూపి, నిజాంపాలనలోని అమానుష కాలాన్ని ఙ్ఞాపకం చేసి, వేయిస్తంభాల గుడి క్రింది పునాదుల సాంకేతిక విషయాలు చర్చించి, చిరస్మరణీయులైన సత్యవాది కాళోజిని మనకు చక్కగా గుర్తుచేసి, కమ్యూనిష్టుల దృక్పథాలు, రామసేతు విధ్వంసం తలపెట్టిన ప్రభుత్వ దృక్పథాన్ని మనముందుంచి, ఈ వ్యాసమాల చిరంజీవి సంతోష్ కుమార్ పూర్తి చేశారు. దీనిని మనం మనసారా ధరించి స్మరిస్తే మన అభిప్రాయాలు మనలో రూపుకట్టుకోగలవు. ఈ గ్రంథం ఎప్పుడూ పూర్తయేది కాదు. అన్ని వ్యవహారాలు కాలసర్పంగా ముందుకు సాగుతూ ఉంటాయి. బహుశః సంవత్సరానికోసారి ఇలాంటి గ్రంథాలని “ అప్ డేట్ “ చేయటమనే బాధ్యత ఇలాంటి రచయితలకు తప్పదు. ఆద్యంతాలులేని కాలంతో ప్రయాణం చేయడము అలాగే ఉంటుంది. మంచి ఆలోచనాపరుడు, భావుకుడు, దేశభక్తుడు అయిన చిరంజీవి సంతోష్ కుమార్ ను అభినందిస్తున్నాను.
డా. శివానంద మూర్తి
“ఆనందవనమ్”
భీమునిపట్నం (531163)
తేది. 24 మే 2009
ఈ పుస్తకం నా తొలి పుస్తకం. చదవండి. మీ అభిప్రాయాలను చెప్పండి.. ప్రతులు విసలంధ్ర, నవోదయ, దిశ లలో ఉన్నాయి. ఎ వి కే ఎఫ్ . ఓ ఆర్ జి సైట్ ద్వార కూడా pondavanchu ... for copies k.swathi, h.no. 1-5-326, road no. 9 new maruthi nagar, kothapet hyderabad-500035 cell no.. 9052116463.. thank you



1 కామెంట్‌:

Ali చెప్పారు...

Dear Santoosh

Congrats and i wish you all the best

Ali