14, డిసెంబర్ 2009, సోమవారం

రాష్ట్రంలో రాజకీయం

తెలంగాణ ఉద్యమం - సమైక్యాంధ్ర నినాదం... రాష్ట్రంలో రాజకీయాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. ఇంతకాలం పార్టీల వారిగా ఉన్న రాజకీయ విభేదాలు ఒక్క రోజులో రెండు ప్రాంతాల మధ్య రాజకీయంగా మారిపోయింది. పార్టీలకు, అధిష్ఠానానికి అతీతంగా రాజకీయ ప్రాంతీయత ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ పరిణామం మేలు చేస్తుందా? ఈ పరిణామానికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? ప్రజలా? ప్రతినిధులా?

రాష్ట్ర రాజకీయం ఎటు వెళ్తోంది... ప్రజల మెదళ్లను అదే పనిగా తొలుస్తున్న ప్రశ్న ఇది. తెలంగాణ ఉద్యమం కొనసాగనంత వరకు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ అంగీకరిస్తుందన్న నమ్మకం ఉద్యమం చేస్తున్న వారికీ బహుశా లేదు.. కానీ, ఆందోళన తీవ్రత కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్‌ తెలంగాణ విషయంలో ఏదో మెలిక పెడుతుందని ఊహించారు. అందుకే అధిష్ఠానం ఏం చెప్తే దానికి అంగీకరిస్తామంటూ సిఎల్పీలో ఓ తీర్మానాన్నీ చేశారు. కానీ, జరిగింది అందుకు పూర్తి విరుద్ధం... తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. క్షణాల్లో సమైక్యాంధ్ర జ్వాలలు మిన్నంటాయి. అప్పటిదాకా అమ్మను దేవతగా పొగిడిన నోళు్ల ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నాయి. అప్పటిదాకా అమ్మను తెగ తిట్టిన నోళు్ల ఆమె ఫోటోలు పెట్టుకుని తమ హీరోయిన్‌ను చేసేసుకున్నాయి.
అనూహ్యంగా పెచ్చరిల్లిన సమైక్యాంధ్ర ఆందోళనలు తెలంగాణ వాదులకు, ఆ ప్రాంత నాయకత్వానికి అన్ని విధాలా మేలే చేశాయనటంలో సందేహం లేదు. చిదంబరం ప్రకటనకు ముందు వరకు ఎవరికి వారుగా మబ్బు పట్టినట్లున్న తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులకు తెలంగాణపై స్వేచ్ఛగా, బహిరంగంగా మాట్లాడే అవకాశం లభించింది.
అర్ధరాత్రి ప్రకటనతో సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు ఒక్కసారిగా రాజీనామాల బాట పట్టారు.. అంతకు ముందు వరకు అధిష్ఠానం ఏం చెప్తే అది వింటామన్న వాళు్ల ఒక్కసారిగా మాటమార్చటం, మౌనంగా ఉన్న తెలంగాణ లోని కాంగ్రెస్‌ నాయకులను విస్మయానికి గురిచేసింది. ఉలిక్కిపడేలా చేసింది. దీంతో వాళూ్ల ఒక్క తాటిపైకి వచ్చారు..
కెసిఆర్‌ దీక్ష, ఉస్మానియా ఆందోళన జరిగినప్పుడు కూడా తెలంగాణలో ప్రత్యేక రాషా్టన్రికి పెద్దగా సానుకూలంగా లేనివాళు్ల సైతం సమైక్యాంధ్ర నినాదంతో ఒక్కసారిగా మారిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు వెనక్కు వేసినా సహించే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సమైక్యాంధ్ర ఆందోళనలు తెలంగాణ వాదులకు, తెలంగాణ వాదానికి మరింత బలాన్నిచ్చింది. ఉద్యమం ఇంకా తీవ్రంగా చేసేందుకు మార్గాన్ని చూపించింది.

1 కామెంట్‌:

karthik చెప్పారు...

ప్రజలలో లేని పోని భావోద్వేగాలు రేకెత్తించి జన జీవన్నాన్ని అస్తవ్యస్తం చేయడం తప్ప ఈ ఉద్యమాల వల్ల ఉపయోగం ఏమైనా ఉందా??
తెలంగాణ కోసం చనిపోయిన శ్రీకాంత్ ని కానీ సమైఖ్యాంధ్ర కోసం చనిపోతున్న విద్యార్థులని గానీ ఈ ఉద్యమాలు మళ్ళీ పుట్టించగలవా??
అధికారం కోసం రాజకీయ నాయకులు, సెన్సేషన్ కోసం మీడియా ఆడుతున్న ఈ నాటకంలో చివరకు ఓడేది మాత్రం "సగటు తెలుగు బిడ్డ" ఒక్కడే...
ఒక్క రాష్ట్రమైనా మూడు రాష్ట్రాలైనా తాగుబోతు నాయకులతో, ఊసరవెల్లి అధినేతలతో, కబ్జాదారు మంత్రులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు.. అంత మాత్రం దానికి ఇంత మంది ఉసురు తీయడం మన సమాజం లోనే చెల్లింది.. ఓట్ల రాజాకీయం లో భావోద్వేగాల చట్రం నుంచీ ఎప్పుడు బయటకు వస్తామో ఏమో??