24, డిసెంబర్ 2009, గురువారం

ఎలా జరిగింది...?

కాంగ్రెస్‌లో అధినేత్రి మాటే శాసనం... ఆమె మాటే వేదం... ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై వెనక్కి తగ్గడం సాధారణంగా జరిగే పని కాదు.. కానీ, సోనియా మడమ వెనక్కి తిరిగింది. కాదు తిప్పారు.. తెలంగాణపై భారత ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీనే వెనక్కి తీసుకునేలా చేయగలిగారు.. ఇది ఎలా సాధ్యపడింది..? దీని వెనుక ఏయే శక్తులు ఎలా పనిచేశాయి?

తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం ఎందుకు తిరగబడింది?
సోనియా నిర్ణయాన్ని సైతం శాసించిన శక్తులు ఏమిటి?
కాంగ్రెస్‌ అధినేత్రి నిర్ణయాన్నే
ప్రభావితం చేసిన పరిణామాలు ఏమిటి?
జవాబుల కోసం వెతుకుతున్న ప్రశ్నలివి.. కాంగ్రెస్‌ అధినేత్రి శాసనాన్నే తిరగరాయగల సమర్థులున్న నాయకత్వం ఆంధ్ర ప్రాంతంలో ఉందని మరోసారి నిరూపణ అయింది. ఈ నెల తొమ్మిదో తేదీన హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటాన్ని తెలంగాణ వాదులు గుడ్డిగా నమ్మారు.. యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా అలాంటి ప్రకటన చేయరని విశ్వసించారు...
ఆ నమ్మకంతోనే విజయోత్సవాలు జరుపుకున్నారు...ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సోనియా తన నిర్ణయంపై వెనక్కి తగ్గరనే అమాయకంగా భావించారు... అన్ని ఆందోళనలు విరమించి ఆంధ్రలో జరుగుతున్న పరిణమాలను చూస్తూ కూర్చున్నారు...
కానీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ప్రభావితం చేయటంలో సక్సెస్‌ అయ్యారు.. పదో తేదీ నుంచి కాంగ్రెస్‌లోని ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు వీధుల్లోకి వస్తే... ఆ ప్రాంతానికి చెందిన ఎంపిలు ఢిల్లీ నుంచి ఒక్కక్షణం కూడా కదలలేదు.. ఒక్క లగడపాటి రాజగోపాల్‌ రాష్ట్రంలో హడావుడి చేయటం మినహా మిగతా అందరు ఎంపిలు ఢిల్లీలో ఉండి సామ, దాన, భేదోపాయాలన్నీ ప్రయోగించారు.. రాష్ట్రంలో ఎలాగో దండ ప్రయోగం జరుగుతోంది.. ఆంధ్రప్రాంతం ప్రతినిధులు పది రోజుల్లో ప్రతిరోజూ వీరప్పమొయిలీతో, ప్రణబ్‌ ముఖర్జీతో, ఇతర నాయకులతో, అడపాదడపా సోనియాగాంధీతో సమావేశమవుతూ వచ్చారు.. రకరకాలుగా ఒత్తిడిరాజకీయం చేశారు.. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావులు ఓ వంక... తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఇంకో పక్క నిరంతరంగా , బలంగా లాబీయింగ్‌ జరుపుతూ వచ్చారు... కేంద్ర నేతలతో సమావేశమైన ప్రతిసారీ ఏదో ఒక ప్రకటన చేయటం ద్వారా తమకు అనుకూలంగా నిర్ణయం తప్పదన్న సంకేతాల్ని ఇస్తూ వచ్చారు..

ఢిల్లీలో ఇంతగా ఆంధ్ర లాబీయింగ్‌ జరుగుతున్నా, తెలంగాణ నేతలు మాత్రం సోనియా నిర్ణయాన్ని మార్చగలగటం ఆంధ్ర ప్రతినిధుల వల్ల కాదనే నమ్మారు.. అందుకే వాళు్ల ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.. అప్పుడప్పుడూ ప్రకటనలు చేయటం తప్ప, కెసిఆర్‌ కూడా వేచి చూసే ధోరణినే అవలంబిస్తూ వచ్చారు. అదే చివరకు తెలంగాణ వాదుల కొంపలార్చింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం మార్చుకున్నారు... కర్ర విరక్కుండా, పాము చావకుండా చిదంబరం మలి ప్రకటన చేశారు...
ఇప్పుడు చేతులు పూర్తిగా కాలిపోయాయి. అప్పుడు అంతా నాలుక్కరుచుకున్నారు.. ఆంధ్ర ప్రాంత నేతల బాటలో రాజీనామా అసా్తల్రను సంధించటం మొదలు పెట్టారు.. కానీ, విద్యార్థులు, ప్రజలు విరుచుకుపడ్డారు.. పర్యవసానంగా తెలంగాణ తగులబడిపోతోంది.. మొత్తం మీద రాజకీయ నేతలకు ఓ గేమ్‌షోగా తెలంగాణ మారింది. నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితురాలిగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చేష్టలుడిగిపోయింది. దీని వల్లే తెలంగాణ పాట మరోసారి పల్లవితోనే ఆగిపోయే పరిస్థితి నెలకొంది..

6 కామెంట్‌లు:

Ramesh చెప్పారు...

correct explanation. ila chese kada telangaanaa development addukunnaaru.

lobbying venna tho pettina vidya.

సమతలం చెప్పారు...

ఆ లాబీయింగ్ విద్యే మనకు తెలయనిది. డిల్లిలోనే కాదు, హైద్రాబాద్, జిల్లా(తెలంగాణ), గ్రామ(తెలంగాణ) స్థాయిలలో కూడ చాలా లాబీయింగు చెస్తారు. మన రాజకీయనాయకులకు ఆంధ్రా అధికారులు దొరుకితే వాళ్లెనే అన్ని స్థానాలలో నియమించుకుంటరు. చనిపోయిన హోం మంత్రి మాధవరెడ్డి, మాజి హోం మంత్రి జానా రెడ్డి, ఇంకా చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్లను పెట్టుకుంటారు. అయితే ఈ నయకులకంటె, వీరిని నమ్మకున్న అనుచరులకంటె ఈ ఆంధ్రా అధికారులే అధిక లబ్ధిపొందుతారు.
610 జి.ఒ. పై ఏర్పాటు చేసిన శాసన సభ సబ్-కమిటి చైర్మెన్ ఉత్తం కుమార్ రెడ్డికి అయితే ఆ జి.ఒ.స్పూర్తి ఇసుమంత లేదు.
అసలు ఈ ఉద్యమం జరిగినంత కాలం ఈ నాయకులను ఆంధ్రాకు పంపి, వాళ్లకు ఒప్పచెప్పాలి ఏ విహార యాత్రలకో వెళ్లిరమ్మని. వీళ్లు మన పక్కన ఉంటె ఉద్యామానికి నష్టం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ప్రజలకే విడిచిపెట్టాలి.

మంచు చెప్పారు...

ఉద్యమాన్ని అంధ్రా నాయకులకి కాంట్రాక్ట్ ఇవ్వకూడదూ.. త్వరగా పనైపొతుంది...:-)

అజ్ఞాత చెప్పారు...

good analysis. Keep posting...

satya చెప్పారు...

బాబు, ఇప్పుడున్న కాంగ్రెస్ లో ఆంధ్ర ప్రాంత నాయకుల కన్నా తెలంగాణ నేతల లాబీయింగే ఎక్కువ. మీరు చెప్పే రాయపాటి, కావూరి లాంటి వాళ్ళకి కనీసం పరిస్థితి వివరించి చెప్పే భాషా పరిఙ్ఞానం కూడా లేదు. ఇంక ఆంధ్ర రాయలసీమల నించి 22 మంది MPలు ఉంటే మనకి కనిపించింది ఒక ముగ్గురు నలుగురు మాత్రమే. ప్రతీ దాన్ని ఇలా biased గా ఎందుకు చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర ప్రాంతం లో జరిగే ఉద్యమం గురించి కాకుండా కేవలం పది మంది MP లకు తలొగ్గేంత వెర్రిది లా కనిపిస్తుందా? ఎంత దారుణంగా మాట్లాడతారండి.

kovela santosh kumar చెప్పారు...

సత్యా గారు...
రాయపాటి, కావూరి ఇద్దరూ కూడా భాషా పరిజ్ఞానం లేని వారన్నారంటే ఆంధ్ర ప్రాంతంలో ఉండి కూడా మీకు కనీసం వారి గురించి తెలియదని అనుకోవాలి... ఈ ఇద్దరూ వ్యాపారంలో దీక్షా దక్షతలు కలిగిన వారు అన్నది బహిరంగ రహస్యం... 196869లలో వీరి వ్యాపార సంస్థల నుంచి పొగాకు రష్యాకు ఎగుమతి చేసిన సందర్భంలో వీరు పడిన కక్కుర్తికి రష్యా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది.. పొగాకు కట్టల్లో బరువు పెంచేందుకు ఇసుక, రాళు్ల పెట్టి పంపించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఒక హంతకుడి కంటే, ఒక మోసపూరిత వ్యాపారి మహా ప్రమాదకారి అని, ఇలాంటి వారిపై ఎలాంటి చర్య తీసుకున్నా తప్పులేదంటూ ఇందిరాగాంధీకి రష్యా ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఈ వ్యవహారంపై ఇందిర తీవ్రంగా స్పందించిన సందర్భంలో వీరు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.. కాంగ్రెస్‌ పార్టీకి ఫండింగ్‌ పేరుతో సూట్‌కేసులు పంపించటంలో వీరిని మించిన ఘనాపాఠీలు లేరన్నది జాతీయ రాజకీయాల్లో బహిరంగ రహస్యమే.. దీన్ని ప్రత్యేకంగా వేరే నిరూపించాల్సిన అవసరం ఏమీ లేదు.. నాడు ఇందిర కోటరీనే మసిపూసి మారేడు కాయ చేసి రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకున్న మేధావులు... మొన్న నిమ్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత లగడపాటిని ఢిల్లీకి ఎప్పుడు వెళు్తన్నారు అని అడిగినప్పుడు సైతం ఆయన నర్మగర్భంగా వాళ్ల పేర్లను ప్రస్తావించారు.. ఎవరైనా మీడియావాళు్ల తెలిసి ఉంటే వారి దగ్గరకు వెళ్తే టేపులు చూపిస్తారు.. చూడవచ్చు.. వినవచ్చు... 1956లో విడిగా హైదరాబాద్‌ స్టేట్‌ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రాంతం వాళు్ల కలుపుకున్న సందర్భంలోనూ బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు గారి లాబీయింగే ఢిల్లీలో పనిచేసింది. తొలి ఎస్సార్సీ విలీనానికి తొందరేం లేదని విస్పష్టంగా చెప్పినా, తెలంగాణ ప్రాంతంలో ప్రజలు విలీనాన్ని కోరుకోవటం లేదని బూర్గుల కేంద్రానికి రాసిన లేఖల్లో స్పష్టం చేసినా ఊరుగల ముందుగాల ఢిల్లీకి వెళ్లి కూర్చుని పని కానిచ్చుకున్నవాళు్ల ఆంధ్ర ప్రాంత నేతలు.. బలవంతుడి వాదన ముందు బలహీనుడి నీరుగారటం లోకంలో సహజ పరిణామం.. బలహీనుడు చేసే ఏ వాదాన్నయినా, మాట్లాడే ఏ మాటనైనా, పలికే ఏ పలుకునైనా తిరగరాసి తమకు అనుకూలంగా చెప్పుకోవటంలో బలవంతుడు ఎప్పుడూ సమర్థంగానే వ్యవహరిస్తాడు.. బలహీనుడు ఏది చేసినా అది బలవంతులకు తప్పుల్లాగే కనిపిస్తాయి. వారి వాదనలకు తిరుగుండదు.. నాడు బ్రిటిష్‌ వాళు్ల చేసింది అదే.. దీనికి మిమ్మల్ని నేనేమీ తప్పుపట్టడం లేదు.. అనూచానంగా వస్తున్న వాదాన్నే మీరూ వినిపించారు.. కనీసం సంయమనంతో కామెంట్‌ చేస్తున్నారు.. అందుకోసమైనా సంతోషం... కలిసి అన్నదము్మల్లా ఉండాలని అనుకునే వాళు్ల మొదటి నుంచి నిందారోపణలు చేయకుండా సోదర భావంతో అక్కున చేర్చుకుని తమతో సమానస్థాయిని కల్పించి ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కావు కదా.. ధన్యవాదాలు..