తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు? దిశానిర్దేశం చేస్తున్నది ఎవరు? ఇరవై రోజుల క్రితం వరకు లేని ఉద్యమ తీవ్రత ఇప్పుడు ఎందుకింతగా పెరిగింది. ఉద్యమానికి పల్లె పల్లెల్లో విశ్వసనీయత పెరగడానికి ఎవరు కారణమయ్యారు? వీటన్నింటికీ ఒకటే సమాధానం... తెలంగాణ విద్యార్థులు.. విద్యార్థి సంఘాల సమష్టి నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమం ఇది... రాజకీయ నాయకుల ప్రమేయం నామమాత్రంగా కొనసాగుతున్న ఆందోళనలు ఇవి..
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమ నిర్మాతలెవరు?
రాజకీయ నాయకత్వం విఫలం కావటం వల్లనే విద్యార్థులు ముందుకు వచ్చారా?
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు తెలంగాణ ఉద్యమ విశ్వసనీయతను పెంచిందా?
ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి వాస్తవ నాయకత్వం ఎవరిది?
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జనవరి 9న ఖమ్మంలో ఒక విద్యార్థి తెలంగాణ హక్కుల కోసం చేసిన నిరాహార దీక్షతో ప్రారంభమైంది. తరువాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు.. క్రమంగా విద్యార్థి ఆందోళనను నాటి రాజకీయ నాయకత్వం హైజాక్ చేసింది.. విద్యార్థులూ నాయకుల చేతుల్లో ఉద్యమాన్ని పెట్టారు.. ఫలితంగా నాటి ఉద్యమం ఘోరంగా వైఫల్యం చెందింది... అప్పుడు బలైన 360 ప్రాణాలు ఇంకా ఉసూరుమంటూనే ఉన్నాయి.
2001లో తెరాస అరంగేట్రం నుంచి తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ప్రజల్లో విశ్వసనీయతను పెంచలేకపోయాయి. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించటంలో కానీ, రాష్ట్ర సాధన కోసం రాజకీయ ప్రక్రియను ప్రారంభింపజేయటంలో కానీ, రాజకీయ నాయకత్వం సక్సెస్ కాలేకపోయింది. జై తెలంగాణ అని నేతలు నినదించటమే తప్ప సాధించింది శూన్యమే...
కానీ ఇప్పుడు ఉద్యమం కిందిస్థాయి వరకు, వ్యక్తుల స్థాయి వరకు విస్తరించింది. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో సైతం తెలంగాణ భావోద్వేగం విస్తరించింది. డిసెంబర్ 23న చిదంబరం మలి ప్రకటన చేసిన రోజు నుంచి తెలంగాణ అట్టుడికిపోయింది. ఏ రాజకీయ నాయకుడి ప్రమేయం లేకుండా ఆందోళనలు జరిగాయి.. నిరసనలు పెరిగిపోయాయి...
ఇంత ఆందోళనలకు నాయకత్వం వహించింది పూర్తిగా విద్యార్థిలోకమే.. తెలంగాణపై విస్తృత చర్చలు మొదలు పెడతామని చిదంబరం ప్రకటన చేసిన క్షణంలోనే హైదరాబాద్ భగ్గుమంది... విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.. అప్పటికి ఇంకా రాజకీయ నాయకత్వం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది.
తెలంగాణపై డిసెంబర్ 23 నాటి చిదంబరం ప్రకటనను పాజిటివ్ దృక్పథంతో విశ్లేషించే ప్రయత్నాన్నీ కొంతమంది నేతలు చేసారు.. అబ్బే తెలంగాణ ఇవ్వనని అనలేదే అన్నారు..
కానీ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పెల్లుబికిన ఆగ్రహానికి రాజకీయ నాయకత్వం వెనుకంజ వేయక తప్పలేదు.. విద్యార్థులంతా ఏకమై తీవ్రమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో వారి బాటలోకి రాజకీయ నేతలు రాక తప్పలేదు.. అంతకు ముందు ఇదే తెలంగాణ అంశంపై పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న నాయకులు సైతం ఒకరి వెంట ఒకరుగా వచ్చి సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడాల్సి వచ్చింది... తెలుగుదేశం పార్టీ మొదట్లో కొంత అటూ ఇటూగా ఊగిసలాడినా.. నాగం జనార్ధనరెడ్డిపై దాడి తరువాత ఆ పార్టీ వైఖరిలోనూ మార్పు వచ్చింది.
ఇప్పుడు ఉద్యమం నడుస్తున్నదంతా విద్యార్థుల కనుసన్నలపైనే.. విద్యార్థులు నిర్ణయించిన అజెండా మేరకే రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది.. రాజకీయ పార్టీల మాదిరిగా విద్యార్థులకు అధిష్ఠానం అంటూ లేదు.. వారి సమష్టి నాయకత్వమే ఉద్యమాన్ని రాష్ట్రంలో అంతటా విస్తరించేలా చేస్తోంది... ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ ప్రకటన చేసినా విద్యార్థుల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే చేయాల్సి వస్తోంది.
వైఎస్ జీవించి ఉన్నంతకాలం పెదవి విప్పని వాళ్లంతా ఇప్పుడు ధైర్యంతో మాట్లాడుతున్నారంటే అందుకు కారణం విద్యార్థుల పూనికతో అన్ని వర్గాల నుంచి పెల్లుబికిన ఆగ్రహమే కారణం... ఇప్పుడు విద్యార్థులను, మేధావులను కాదని ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు. కేంద్రం ఇప్పుడు తెలంగాణ రాషా్టన్రికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదించే పరిస్థితి విద్యార్థి లోకంలో నెలకొని లేదు.. రాజకీయ నాయకత్వం సైతం వీరిని కాదని ఎలాంటి రాజీకి వచ్చే అవకాశం లేదు..
రెండు రకాల ప్రకటనలు చేసి కేంద్రం సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించలేని పరిస్థితి కొని తెచ్చుకుంది. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని కేంద్రం ఎలా ఆలోచిస్తున్నదీ ఇప్పటికైతే తెలియదు.. ఢిల్లీ వెళ్లి తెలంగాణ మంత్రులు కొంత లాబీయింగ్ నడిపించారు.. అయినా ఆంధ్రప్రాంత నాయకుల లాబీయింగ్ ముందు వాళ్ల లాబీయింగ్ పెద్దగా ఫలించలేదు.. చివరకు జనవరి అయిదున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. తెలంగాణ అంశంపై అభిప్రాయాలు సేకరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్న చిదంబరం ప్రకటనపై తెలంగాణ మంత్రులైతే ఉబ్బితబ్బిబై్బ రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారే కానీ, విద్యార్థులు మాత్రం పట్టు పిడవటం లేదు. మంత్రులు తమ వైఖరిని మార్చుకోకపోతే తెలంగాణలో అడుగుపెట్టనిచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు.. పార్లమెంటులో బిల్లు పెట్టేదాకా ఉద్యమం ఆగేది లేదని విస్పష్టంగా తేల్చి చెప్పారంటేనే విద్యార్థులు ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళు్తన్నారో అర్థం చేసుకోవచ్చు. అఖిలపక్షం కూడా ఇప్పుడు విద్యార్థుల బాణీనే పలుకుతోంది. దీని పర్యవసానంగానే చిదంబరం గురువారం తెలంగాణపై కేంద్ర వైఖరిని కుండబద్దలు కొట్టారు.. డిసెంబర్ తొమ్మిదో తేదీన తాను చేసిన ప్రకటనపై పూర్తిగా కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని పార్టీలే తలోరకంగా మాట్లాడటం వల్ల వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుని తెలంగాణ ప్రాసెస్‌పై ముందుకు కదులుతామని తేల్చి చెప్పారు... అఖిల పక్ష సమావేశానికి హాజరవుతున్న పార్టీల్లో టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపిలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. సిపిఎం ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నదే.. ఇక పిఆర్‌పి మొన్ననే తన వైఖరిని మార్చుకుంది. ఇక తెలంగాణపై తేల్చి చెప్పాల్సింద కాంగ్రెస్, టిడిపిలే.. కాంగ్రెస్‌కు అధిష్ఠానం ఎలాగో ఉంది. ఇక మిగిలింది తెలుగుదేశం... ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు గోడమీద పిల్లివాటంలా మాట్లాడుతున్నారు.. ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? గైర్హాజరవుతారా? హాజరైతే టిడిపి ప్రతినిధిగా ఎవరిని పంపిస్తారు.. రెండు ప్రాంతాల వారిని పంపించి అటూఇటూ కాని వాదనను వినిపించే అవకాశం లేదు. వెళ్తే తానే వెళ్లాలి.. మరి వెళ్తారా? వెళ్తే ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయాన్ని చెప్తారు..? గైర్హాజరైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుంది. మొత్తం మీద తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ధోరణి ఏమిటన్నది ఈ సమావేశంతో తేలిపోతుంది. అఖిలపక్ష సమావేశం సారాంశం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వస్తుందా? లేదా అన్నదే ఇప్పుడు సందిగ్ధం.. ఎలాంటి ప్రకటన వచ్చినా అది ఖచ్చితంగా తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే విద్యార్థులు రాజీపడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సాధ్యం కాకపోవచ్చు.. నాయకులపై ఇంకా ఒత్తిడి పెరగటం ఖాయం. చిదంబరం సమావేశంతో సంబంధం లేకుండా జనవరి 3న విద్యార్థి గర్జన నిరాటంకంగా కొనసాగుతుందని కూడా విద్యార్థులు ప్రకటించారు.. ఇవన్నీ చూస్తుంటే అసోం లో అసోం స్టూడెంట్‌స యూనియన్ , జార్ఖండ్‌లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్‌స యూనియన్ లాగానే తెలంగాణ రాజకీయ యవనికపై తెలంగాణ విద్యార్థుల పాత్ర కీలకం కాబోతోందన్న సంకేతం స్పష్టంగానే కనిపిస్తోంది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి