రాష్ట్రంలో సమైక్య వాదం ఊపందుకొంది. ఎక్కడికక్కడ ఆందోళనలు.. ధర్నాలు.. నిరహారదీక్షలు. వీరందరికీ స్పూర్తి.. పొట్టి శ్రీరాములు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలంటూ.. 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి.. ఆత్మార్పణ చేశారు.. పొట్టిశ్రీరాములు. ఆంధ్రుల గుండెల్లో అమరజీవిగా మిగిలిపోయారు. ఇప్పుడు సాగుతున్న ఉద్యమానికి ప్రేరణ కూడా ఆయనే.. అసలు అప్పుడు అమరజీవి చేసిందేమిటి? ఆంధ్రరాష్ట్రం ఎలా ఏర్పడింది..
తెలుగు వారంతా ఒక్క రాష్ట్రంగా ఉన్నారంటే.. దానికి మూలకారణం పొట్టి శ్రీరాములే అని చెప్పాలి. భిన్నత్వంలో ఏకత్వంగా దేశాన్ని నిలపాలనుకున్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనలకు భిన్నంగా దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే.. దానికి కారణం పొట్టి శ్రీరాములే. స్వాతంత్రయం వచ్చే నాటికి.. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. తమిళం, మళయాళం, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో చాలా భాగం ఈ రాష్ట్రంలో కలగలిసి ఉండేవి. అయితే.. దీన్నుంచి తెలుగు వారిని విడదీయాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగింది. ఆ ఉద్యమం మొదలుపెట్టింది.. పొట్టి శ్రీరాములు. కేవలం ఆందోళనలు ధర్నాలు చేస్తే.. ఉపయోగముండదని భావించిన ఆయన.. నిరాహారదీక్ష చేపట్టారు. మద్రాస్‌లోని మైలాపూర్‌లో ఉన్న బులుసు సాంబమూర్తి ఇంట్లో.. 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్షకు దిగారు. మద్రాసు రాజధానిగా.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్నదే.. ఆయన ప్రధాన డిమాండ్..
original post from http://www.24gantalu.co.cc/2009/12/blog-post_1833.html
అయితే.. పొట్టి శ్రీరాములు దీక్షకు ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ మద్దతు లేదు. పైగా ఈ దీక్షను వ్యతిరేకించింది కూడా. అప్పటి ప్రభుత్వమూ.. ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజకీయ నేతల సపోర్ట్‌కూడా ఆయనకు దక్కలేదు. కాకపోతే.. ప్రజల్లో మాత్రం సానుకూల స్పందన వ్యక్తమయ్యింది. దీక్షా శిబిరాన్ని సందర్శించే వారి సంఖ్య క్రమంగా ఎక్కువయ్యింది. దీంతో రాజకీయ నాయకులూ.. శ్రీరాములు దీక్షకు మద్దతుగా ముందుకు కదలక తప్పలేదు. రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం మాత్రం దిగిరాలేదు. చివరకు.. 58 రోజుల పాటు.. నిరాహారదీక్ష కొనసాగించిన పొట్టి శ్రీరాములు.. డిసెంబర్ 15, 1952న అర్థరాత్రి సమయంలో ప్రాణం వదిలారు. ఈ వార్త తెలియడంతోనే.. మద్రాసు రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. తెలుగువారుండే ప్రాంతాల్లో ధర్నాలు జరిగాయి. ఎక్కడికక్కడ రైళ్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు. చివరకు.. డిసెంబర్ 19న ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిస్తున్నామంటూ.. ప్రధాని నెహ్రూ ప్రకటించారు.
డిమాండ్ నెరవేరిందా?
మరి పొట్టి శ్రీరాములు కోరుకున్నది నెరవేరిందా... ఆయన చివరి కోరిక తీరిందా... పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి సరైన న్యాయం జరిగిందా.... సమైక్య ఉద్యమంకోసం ఉధృతంగా పోరాటం జరుగతున్న ఈ సమయంలో తప్పకుండా ఆలోచించాల్సిన విషయాలు ఇవి. పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టింది.. ఒకే ఒక్క కారణం కోసం.. మద్రాసు రాజధానిగా.. ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని. దీన్ని ధృవీకరిస్తూ.. ఆయన తన సన్నిహితులకు ఎంతోమందికి లెటర్లు కూడా రాశారు. " మద్రాసు నగర భవిష్యత్తును నిర్ణయించడానికే నేను దీక్ష చేపడుతున్నాను... దీక్ష కొనసాగే సమయంలో ప్రజలే దీనిపై ఓ నిర్ణయానికి వస్తారు. " అంటూ.. స్వామి సీతారాంకు అక్టోబర్ 2, 1952న పొట్టి శ్రీరాములు రాసిన లేఖలోని సారాంశం. నిరహారదీక్ష చేయడానికి ముందు నుంచే.. ఆయన మద్రాసుపై చాలా కసరత్తు చేశారు. మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తల లేని మొండెం అంటూ ఆయన ఓ సారి వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించి రెండు మేని ఫెస్టోలను కూడా విడుదల చేశారు. దీక్ష మొదలుపెట్టేరోజైన.. అక్టోబర్ 19న విడుదల చేసిన చివరి మేనిఫెస్టోలో.. మద్రాసును ఆంధ్రా, తమిళ ప్రాంతాలు ఉమ్మడి రాజధానిగా వాడుకోవాలని ఆయన కోరారు. పైగా.. అదే రోజు.. మద్రాసులోని న్యాయవాది లక్ష్మీనారాయణకు రాసిన లెటర్లోనూ తాను దీక్ష చేపట్టడానికి గల కారణాలను వివరించారు. " నేను మద్రాసులోనే పుట్టాను. ఇక్కడే చదువుకున్నాను. ఎవరిపైనే ఒత్తిడి తీసుకురావాలని ఈ పనికి నేను పూనుకోవడం లేదు. నా లక్ష్యం నెరవేరేవరకూ నేను ప్రాణాలతో ఉంటానన్న నమ్మకం లేదు. ఈ అంశంతో ముడిపడి ఉన్నవారంతా.. దీనిపై విశాల ధృక్పథంతో చూస్తారనే నేను దీక్ష చేస్తున్నాను." దీన్ని బట్టి.. మద్రాసును రెండు రాష్ట్రాలు రాజధానిగా వాడుకోవడం కోసమే.. చివరి వరకూ పొట్టి శ్రీరాములు పోరాటం చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే.. మద్రాసులో నివసిస్తున్న తమిళులు, తెలుగు వారి మధ్య ఓ అవగాహనకు రావాలని ఆయన సూచించారు. కానీ.. ఆయన ఆత్మార్పణ చేసిన తర్వాత ఏర్పడిన రాష్ట్రంలో మద్రాసు లేదు. అంతేకాదు.. తెలుగువారు ఎక్కువగా ఉండే హోస్పేట, తిరువళ్లూరు వంటి ప్రాంతాలను కూడా.. తమిళులకు వదులుకోవాల్సి వచ్చింది.. మరి నిజంగా పొట్టి శ్రీరాములు కోరిక నెరవేరిందా.. ఆయన ఆత్మత్యాగానికి అసలైన అర్థం ఉందా...
పైగా... రాష్ట్రం ఏర్పడుతుందనగానే.. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అసలు తెలుగువారంతా ఒకటిగా ఉండడానికి.. సీమ నేతలు అంగీకరించనే లేదు. మద్రాస్ రాష్ట్రంలోనే ఉంటామంటూ.. నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో సీమ నేతలు ఒక్కటయ్యారు. వీరందరికీ మద్దతు సి.రాజగోపాల చారి. ఢిల్లీలోనూ తన పలుకుబడిని ఉపయోగించి.. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కాకుండా.. చాలాకాలం ఆపగలిగిన వ్యక్తి రాజాజీ. దీంతో.. తెలుగు రాష్ట్రం ఏర్పాటుపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆంధ్రా ప్రాంతంతో కలిసి ఉండాలంటే ప్రత్యేక రక్షణలు కావాలంటూ.. సీమ నేతలు డిమాండ్ చేశారు. దీంతో శ్రీభాగ్ ఒడంబడిక తెరపైకి వచ్చింది. మద్రాసు రాలేదు కాబట్టి.. కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆంధ్రరాష్ట్రానికి వచ్చింది. తిరుపతిని రాజధాని చేయాలని ఎన్.జి.రంగా, విజయవాడను క్యాపిటల్ చేయాలని అయ్యదేవర కాళేశ్వరరావు, వైజాగ్‌ను చేయాలని తెన్నేటి విశ్వనాథం.. ఇలా ఎవరికివారే పట్టు బట్టడంతో సమస్య మరింత జఠిలమయ్యింది. ఇక మధ్యే మార్గంగా.. కర్నూలును రాజధానిని చేశారు.. ఇందులోనూ ఎన్నో రాజకీయాలు.. మద్రాసు లేకుండా ఆంధ్రరాష్ట్రం ఏర్పడదని ఆర్భాటంగా ప్రకటించిన ఎంతోమంది నేతలు.. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తే.. మా కొద్దనీ ప్రకటించలేదు. ఎవరి రాజకీయాలు వారు చేసుకున్నారు. అమరజీవి ఆత్మ త్యాగాన్ని మర్చిపోయారు. చివరకు మద్రాసు లేని తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి.. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి ఫలితం దక్కిందని మనం భావించొచ్చా?
మద్రాసును తెలుగు వారికి ఇచ్చేది లేదని ఎప్పుడో కరాఖండీగా చెప్పింది భారత ప్రభుత్వం. మద్రాసు ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా లేదు. చివరకు.. ఉమ్మడి రాజధానిగా వాడుకోవడానికి కూడా వీలు లేదని తేల్చి చెప్పేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని తక్కువ చేయడం కాదు కానీ.. అప్పటి నుంచీ సమాధానం దొరకని ప్రశ్నలు మాత్రం కొన్ని మిగిలే ఉన్నాయి. మద్రాసును తెలుగువారికి ఇవ్వరని తెలిసినా.. పొట్టి శ్రీరాములు దీక్ష ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? ప్రాణం పోయే స్థితిలోనూ.. ఆయన చేత దీక్షను ఎందుకు విరమింప చేయలేదు?
ప్రత్యేక పోరాటానికి మూలం
తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఉద్యమం పొట్టి శ్రీరాములుతో మాత్రమే మొదలు కాలేదు.. స్వాతంత్ర్య పోరాట కాలంలోనే దీనికి బీజం పడింది. తెలుగువారిని ఏకతాటిపైకి తీసుకురావడం కోసం.. ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే.. ఆంధ్ర మహాసభ ఏర్పడింది. బ్రిటీష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోనూ, అలాగే.. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలోనూ ఆంధ్రమహాసభలు జరిగాయి. అయితే.. 1913లో బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహిళాసభ.. తెలుగువారికోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమం మొదలుపెట్టాలని తీర్మానించింది. ఈ పోరాటంలో ఎంతోమంది స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రాన్ని విడగొట్టాలని తీవ్ర ఆందోళనలు చేశారు. కానీ.. స్వాతంత్ర్యం ఇచ్చే వరకూ కూడా.. బ్రిటీష్ ప్రభుత్వం ఈ డిమాండ్‌కు ఏమాత్రం తలొగ్గలేదు. బ్రిటీష్ పాలన ముగిసి.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందడంతోనే.. మళ్లీ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ డిమాండ్ ఊపందుకొంది. ప్రభుత్వమూ సానుకూలంగానే స్పందించింది. వాస్తవం చెప్పాలంటే.. పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టడానికి నాలుగేళ్ల ముందే.. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు సర్వంసిద్ధమయ్యింది. 1948 జూన్‌లోనే.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి అప్పటి రాజ్యాంగ సభ.. ధార్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1948, డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్ట్‌ను అందించింది. అయితే.. భాషాప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. ప్రధాని ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేశారు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలు ఇందులో సభ్యులు. ఇదే JVP కమిటీ. మద్రాసు రాష్ట్రాన్ని విభజించి.. తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. రాజ్యాంగ సభ కూడా.. ఈ నిర్ణయాన్ని ఆమోదించి.. మద్రాసు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. మద్రాస్‌కు అప్పటి ముఖ్యమంత్రి పి.కుమారస్వామి రాజా ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యుల సంఘం.. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటయ్యింది. బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు ఇందులో సభ్యులు. వీరంతా కలిసి.. ఏప్రిల్ 1, 1950న ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మద్రాసు కొత్త రాష్ట్రంలో భాగం కాదని కూడా వీరు స్పష్టంగా చెప్పారు. అసలు గొడవ ఇక్కడే మొదలయ్యింది. మద్రాస్ కూడా కావాలని తెలుగువారు డిమాండ్ చేయడంతో.. రాష్ట్ర ఏర్పాటు పెండింగ్‌లో పడింది. దీన్ని సాకుగా చేసుకొని.. రాజగోపాలచారి, భక్తవత్సలం, కామరాజ్‌నాడార్‌లు ఢిల్లీలో చక్రం తిప్పారు. మద్రాసుతో ఎంతో అనుబంధం ఉన్న పొట్టి శ్రీరాములు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ దీక్ష చేసిన ఆయన.. మద్రాసు కోసమూ.. ఆమరణ నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.. అయితే.. నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో.. రాజకీయ నాయకులెవరూ పెద్దగా స్పందించలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికీ ప్రయత్నించలేదు. రాజగోపాలచారి వంటి తమిళ నేతలు.. మద్రాసు విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పనిచేస్తున్నా.. వారిని అడ్డుకోవడానికి పనిచేయలేదు. ప్రజల ఆందోళనల ద్వారా సమాచారం తెలుసున్న నెహ్రూ.. రాష్ట్రం ఇచ్చేయమన్నా.. మద్రాస్ నేతలు మాత్రం స్పందించలేదు. కనీసం.. పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడే ప్రయత్నమూ చేయలేదు. దాని ఫలితమే.. ఓ మహా పోరాట యోధుడిని ఆంధ్రరాష్ట్రం కోల్పోవల్సి వచ్చింది. చివరకు.. ఎప్పుడో ఇస్తామన్న రాష్ట్రాన్నే.. అదీ మద్రాసు లేకుండానే.. ఇచ్చారు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన ప్రాణాలు పోవడానికి కారణం ప్రభుత్వమా.. లేక మన నేతల అసమర్థతా... పైగా.. అప్పుడు రాష్ట్ర విభజన కోసం పోరాడిన పొట్టిశ్రీరాములు ఫోటోను ఇప్పుడు సమైక్య వాదులు ముందు పెట్టుకుని ఉద్యమం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప నేతే. పట్టుదలలో ఆయనకు మరొకరు సాటి లేరు. కాని ఆయన పోరాడింది వేరే దానికోసం.. ప్రాణాలు అర్పించింది వేరేదానికోసం. సమైక్య రాష్ట్రం కోసం మాత్రం కాదు.
3 కామెంట్‌లు:
ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది.
అసలు పొట్టి శ్రీరాములు " ఆంధ్ర ప్రదేశ్ " నే కాదు. " ఆంధ్ర రాష్ట్రం " కూడా సాధించాడని గొప్పగా చెప్పనక్కర లేదు. నిజానికి " ఆంధ్ర రాష్ట్రం " సాధించింది " స్వామి సీతారాం ". అదీ చచ్చి కాదు. బ్రతికి సాధించాడు ఈనాటి KCR లాగా.
పొట్టి శ్రీరాములు కంటే ఎంతో ముందే " స్వామి సీతారాం " ( ఈయన ఇంటి పేరు ... " గొల్లపూడి ". ఈయనను " గొల్లపూడి సీతారాం " అని కూడా అంటారు. ) 37 రోజుల పాటు " ఆంధ్ర రాష్ట్రం " కోసం నిరాహార దీక్ష చేసి, ఆనాటి ప్రధాని " నెహ్రూ " ను కదిలించాడు. నెహ్రూ ఆనాడే మద్రాసును చీల్చి, " ఆంధ్ర రాష్ట్రం " ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆయన దీక్షను విరమింప చేసాడు. అప్పుడు పొట్టి శ్రీరాములే మద్రాసు లేని రాష్ట్రం అక్కరలేదంటూ అడ్డు తగిలాడు. తరువాత కొన్నాళ్ళకు మద్రాసుతో కూడిన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసాడు. ఈ కాలంలో పలుమార్లు నెహ్రూ స్వామి సీతారాంకిచ్చిన మాటే చెప్పి మద్రాసు మాట విడిచి పెట్టమన్నాడు. బహుశా మాటిమాటికి నిరాహార దీక్షలతో విసిగిన నెహ్రూ ( పైగా ఆనాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి " రాజాజీ " మద్రాసు నివ్వడానికి ససేమిరా అనడం వల్ల ) ఆ పైన స్పందించలేదు. దాంతో పొట్టి శ్రీరాములు పరమపదించాడు. తరువాత నెహ్రూ స్వామి సీతారాంకు ముందే చెప్పినట్టుగానే మద్రాసు లేకుండా " ఆంధ్ర రాష్ట్రం " ఏర్పరిచాడు. ఆ విధంగా పొట్టి శ్రీరాములు కొత్తగా సాధించిందేమీ లేదు. ఆయన దీక్ష, త్యాగం నిరర్థకమయ్యాయనే చెప్పాలి. అయితే ఆయనను తక్కువ చేయాలని నా ఉద్దేశ్యం కాదు. ఒక సత్యాగ్రహిగా, గాంధేయ వాదిగా ఆయన నిత్య స్మరణీయుడే !
ఈ సమయంలో సరైన విశ్లేషణనిచ్చారు. ధన్యవాదాలు. అమరజీవి ప్రాణాలు పోవడానికి కారణం ఆనాటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ఇప్పుడు జరుగుతున్నది వ్యాపార ప్రయోజనాల ఉద్యమం. పిల్లలు అనవసరంగా బలిఅవుతున్నారు. ఏ రాష్ట్రమైనా సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. నాయకులకు పదవులు, ఆస్తులు మరింతగా దొరుకుతాయి. వ్యవస్థలో మార్పు రానంతకాలం ఈ పైపై మార్పులతో ఏమీ సాధ్యంకాదు.
బాగుంది ఐతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ని ఇవ్వకుండా తెలంగాణా ఇస్తే కెసిఆర్ ఒప్పుకోకుండా ఉంటే మల్లి ఇంకొకరు దీక్ష చేసి హైదరాబాద్ లేకుండా తెలంగాణా ఇవ్వలన్నమాట బాగుంది బాగుంది అలా కానిద్దాం ఇసారి కూడా !
ఈనాటి KCR లాగా >> అప్పుడుకూడా సైలన్లు అవీ ఉన్నాయా ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి