30, డిసెంబర్ 2009, బుధవారం

అమరవీరుల స్తూపం ఓ చరిత్ర


వర్చస్సుకోసం బలం కోసం, శక్తి కోసం ఈ మృత వీరుని హస్తం నుంచి ధనస్సును గ్రహిస్తున్నాను. మీరూ, మేమూ మనం విశ్వమంతా నిండిన వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము. ఈ మృత భూమి ఒడిలో అధిక వర్చస్సును ప్రసరింప జేసేందుకు ఈతణ్ణి చేరుస్తున్నాం. శీరిష కోమలి ఈ మహీషి ప్రతీకారం జరిగేదాక, విచ్ఛిత్తి నుంచి రక్షించనీ!...
పృథ్వీ..!. ఈతన్ని బలంగా నొక్కకు. ఊపిరీ పీల్చుకోని సులభంగా సుకుమారంగా ప్రవేశించని అవనీ తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగినట్లు ఒదిగించుకో.
యుద్ధభూమిలో వీరమరణం పొందిన సైనికుని సమాధి చేస్తున్న సందర్భంలో ఆతని అనుచరులు ఆ మృత శరీరం నుంచి పొందిన ప్రేరణకు అక్షర రూపాలు... ఋగ్వేదంలోని అంశాలు ఇవి..
అందుకే ఒక వీరుడి మరణం.. శత యోధుల జననం...అని అల్లూరి సీతారామరాజు అన్నాడు.. నలువైపుల నుంచి చుట్టుముట్టే ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కునే బలాన్ని, శక్తిని వీరమరణం నుంచి అతని సహచరులు పొందుతారు... చావుకు వెరవకుండా తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన మృతవీరులు ఉద్యమ చైతన్యానికి ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారు.. గన్‌పార్‌‌కలోని అమరవీరుల స్మారక స్తూపం.. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి నిత్య చైతన్యస్ఫూర్తిని ఇస్తోంది.


ఒక సైనికుడి వీరమరణం.. వెయ్యి మంది సైనికులకు ప్రేరణనిస్తుంది. ఒక ఉద్యమకారుడి త్యాగం అతని సహచరులకు ఉత్ప్రేరకం అవుతుంది. ఓ అమరవీరుల స్మృతి చిహ్నం జాతికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల నాడు నాలుగు వందల మంది చేసిన త్యాగం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇన్నేళ్ల తరువాత కూడా ఈ స్థూపం ఇంత చైతన్యశీలిగా ఎలా ఉంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
హైదరాబాద్‌ నడిబొడ్డులో ఉన్న అపురూపమైన నిర్మాణం ఇది.. పది అడుగుల ఎతె్తైన ఈ స్థూపం సాధారణ రోజుల్లో ఎవరికీ పట్టదు.. వాస్తవానికి ఎవరూ పట్టించుకోరు. దాని దగ్గరకు కూడా ఎవరూ వెళ్లరు.. చాలామందికైతే అది ఏమిటో కూడా తెలియదు.. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ముందు కొలువైన ఈ స్థూపం వందలాది అమరుల త్యాగనిరతికి, తుపాకి గుళ్లకు గురై తూట్లు పడ్డ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం.
ఇవాళ తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమానికి పునాది ఈ స్తూపంలోనే ఉంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ప్రారంభించిన నిరాహార దీక్ష రాషా్టన్న్రి పునాదుల్లో కదిలించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడున్న తొమ్మిది జిల్లాల్లో మంటలు రేపింది. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆందోళనలను సర్కారు కఠినంగా అణచివేసిన పర్యవసానం అక్షరాలా 360 మంది బలిదానం..
తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణకోసం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీల అమలు కోసం సాగిన ఉద్యమం అది... 1956లో ఆంధ్ర ప్రాంతంతో విలీనమై సరిగ్గా 13 సంవత్సరాలైనా కాకుండానే ప్రత్యేక వాదం బయలుదేరింది. అసంతృప్తి రేగింది. దాదాపు పదకొండు మాసాల పాటు ఉద్యమం నిరాటంకంగా కొనసాగింది. చివరకు రాజకీయ కూటనీతికి విద్యార్థులు అలసిపోయారు.. ఉద్యమం చల్లారింది. నేతలూ చల్లగా జారుకున్నారు.. ఉద్యమం జాడలే లేకుండా పోయాయి. తెలంగాణ ప్రజానీకానికి తమ వీరపుత్రులకు నిర్మించుకున్న ఈ ఒక్క అమర స్తూపమే స్మృతిగా మిగిలింది. ఆ స్మృతే ఇవాళ్టికీ విద్యార్థులను నీడలా వెంటాడుతోంది. వాళ్లలో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తోంది... మరోసారి ప్రత్యేక తెలంగాణకు నినదించాల్సిన అవసరాన్ని గుర్తుకు తెచ్చింది...
స్తూపంలోని విశేషాలు ఇలా ఉన్నాయి.
ఇది ప్రపంచంలో ఏ స్తూపానికి నకలు కాదు..
పది అడుగుల ఎతె్తైన ఏకశిల రాతితో జరిగిన నిర్మాణం ఇది.
ఇందులో ఉపయోగించిన రాళు్ల వివిధ జిల్లాల నుంచి తెచ్చినవి
ఎరర్రాయి జడ్చర్ల
నల్లరాయివరంగల్‌
తెల్లరాయిపంజగుట్ట
గ్రానైట్‌కరీంనగర్‌

నల్లరాయి శోకాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎరర్రాయి త్యాగనిరతికి గుర్తు
తెలుపు శాంతి చిహ్నం

ఈ స్తూపంపై తొమ్మిది బుల్లెట్‌ గుర్తులు ఉన్నాయి. ఇవి తొమ్మిది జిల్లాలకు తాకిన బుల్లెట్‌ గాయాలకు గుర్తులు
నాలుగు వైపుల 36 రంధ్రాలు ఉన్నాయి.
36*10 =360
నాటి ఉద్యమంలో 360 మంది బలయ్యారు.
ఈ స్తూపం పైన ఉన్న కాలమ్‌‌స ఎటు నుంచి చూసినా తొమ్మిదే కనిపిస్తాయి.
పైన ఉన్న తెల్లని పువ్వు మల్లెమొగ్గ.. ఇందులోనూ తొమ్మిది రేకలే ఉంటాయి.

తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో విద్యుత్తు ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు అమాయకులు చనిపోయారు.. వారి స్మృతి కోసం ఓ స్తూపం నిర్మించుకుంటామంటే ప్రభుత్వం కిమ్మనకుండా పర్మిషన్‌ ఇచ్చింది. స్థలం ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్కడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.. మరి గన్‌పార్‌‌క దగ్గర స్తూపం నిర్మించుకోవటానికే సర్కారు అనుమతి ఇవ్వలేదు.. తెలంగాణ కోసం ఎంత ఉద్యమించారో.. అంతకంటే ఎక్కువ ఈ స్తూపం ఏర్పాటు చేసుకోవటానికి తెలంగాణ వాదులు ఆందోళన చేయాల్సి వచ్చింది...
ఇందిర రాజకీయ చాతుర్యం, కాసు బ్రహ్మానందరెడ్డి చాణక్యం ముందు తెలంగాణ ఓడిపోయింది. ఉద్యమం చల్లారిపోయింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుంచుకోవటం కోసం తెలంగాణ వాదులు ఒక స్తూపాన్ని హైదరాబాద్‌లో నిర్మించాలని అనుకున్నారు.. కానీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంది. ప్రత్యేక తెలంగాణ వాదానికి సంబంధించిన ఎలాంటి ఛాయలూ ఉండకూడదంది... రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అంజయ్య, మదన్‌మోహన్‌, మాణిక్‌రావు, హసన్‌లు స్తూప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నాడు డిమాండ్‌ కూడా చేశారు..కానీ, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
అప్పుడు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్తూప నిర్మాణానికి చొరవ తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి స్మృతి కోసం స్తూపాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. డిజైనర్లను ఆహ్వానించింది. రకరకాల డిజైన్లను పరిశీలించింది. చివరకు ఎక్కా యాదగిరి రావుకు ఈ అపూర్వ స్తూప నిర్మాణాన్ని చేపట్టే అవకాశం లభించింది.
నిర్మించిన స్తూపాన్ని రాష్ట్ర అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసుకోవటానికీ ప్రభుత్వానికి దయ కలగలేదు... అనుమతులు ఇవ్వలేదు.. కానీ తెలంగాణ వాదులు ఈ స్తూప నిర్మాణం అక్కడే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసుకున్నారు.. ఈ కార్యక్రమాన్ని సైతం భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. భారీ ఎత్తున బలగాలను మోహరించింది. అష్టదిగ్బంధనం చేసింది. అయినా తెలంగాణ వాదులు ఆగలేదు.. అప్పుడు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ స్వయంగా కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు.. ఒకరొకరుగా గన్‌పార్‌‌కకు చేరుకుని అనుకున్న పని పూర్తిచేశారు.. పోలీసులు లాఠీచార్జి చేశారు.. కాల్పులు జరిపారు.. అయినా కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగారు..
ఎలాగోలా స్తూపాన్ని గన్‌పార్‌‌కలో ఏర్పాటు చేసుకున్నా, అది ఇవాళ్టికి కూడా ఆవిష్కరణకు నోచుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణ సామాన్యులే ఆవిష్కరణ వంటివి ఏమీ లేకుండానే నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.. ఎందుకంటే తెలంగాణ నాయకులు అక్కడికి వస్తే అమరవీరుల ఉసురు తగిలి అధికారం పోతుందన్న భయం.. ఆంధ్ర నాయకులకు ఆ స్తూపంతో ఎలాగూ సంబంధం లేదు.. వారు దాని అస్తిత్వాన్నే గుర్తించరు.. ఎవరు వచ్చినా, రాకున్నా.. నాలుగు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి అలుపెరగని పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది ఈ స్తూపం... అమరవీరుల స్తూపాన్ని నెలకొల్పుతున్న సమయంలో తెలంగాణ వాదులు అక్కడ చేసిన తీర్మానం ఇవాళ్టికీ ప్రేరణ ఇస్తుంది..
``ధర్మం కొరకు, కోటిన్నర తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల కొరకు,
దురహంకార పూరిత, స్వార్థ శక్తులకు వ్యతిరేకంగా 1969లో సాగిన చరిత్రాత్మక
మహోద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు..''

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

naati udyamamlo bali aina vaariki nyayam jariginda ? kaneesam aa prayatnamyna cheshara ? udyamamlo eppudoo bali ayyedi amaayakule...saamanyule..prathyeka raashtram vachaka aina veeriki nyayam jaruguthundani ashiddam..