16, జనవరి 2012, సోమవారం

లెక్కల కాకులు

అధికారంలో ఉన్న కాకి లెక్క 6 లక్షలు
ప్రతిపక్ష కాకి లెక్క సున్నా....
పిల్లకాకి లెక్క వేళ్లమీదే...
రాజకీయ కాకులు కావ్‌ మంటున్నాయి...
చిక్కుల లెక్కలతో అరుచుకుంటున్నాయి..
కాకి రాజ్యంలో రాబందుల పెట్టుబడులు..
పిల్లకాకులందరికీ ఉద్యోగాల ఆశలు..
ఇంద్రజాల మహేంద్రజాల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు
రాబందులకు కాకుల తాయిలాలు..
కాకులకు రాబందుల ముడుపులు..
దొందు దొందే..
పిల్లకాకికేం తెలుసు పెద్ద కాకుల దెబ్బ?
ప్రచారంతో మెస్మరైజింగ్‌
పబ్లిసిటీ మేనేజింగ్‌...
రాబందులు పెట్టే పెట్టుబడులు ఎన్ని?
ఇచ్చే కొలువులు ఇంకెన్ని?
అధికార, విపక్ష కాకులకు మాత్రం తెలుసు
అంతా మిథ్యేనని.. అంతా మాయేనని..
చెప్పేది కొండంత.. వచ్చేది గోరంత...
ఆ గోటి ముక్క కోసమైనా
పిల్ల కాకులు ఆశగా ఎదురుచూస్తుంటాయి
రాబందు ముక్కున ఉన్న బొక్క లో
ఏ కొంచెమైనా  కింద పడుతుందేమోనని...
ఆశలు ఆశలుగానే ఉండిపోతున్నాయి..
అడియాసలుగా మారిపోతున్నాయి..
నిరాశగా నీరుగారుతున్నాయి..
కాకుల లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి..
ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి.
పిల్లకాకుల ఆశలు మాత్రం
నీరింకిపోయిన కళ్లల్లో జీరగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రం వణికిపోతోంది

కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రం వణికిపోతోంది.. ఒక చోట కాదు..  అన్ని జిల్లాల్లో అతి భయంకరంగా చలి గడ్డకట్టిస్తోంది. ఉదయం ౯ గంటలైనా బయటకు రాని పరిస్థితి. పండుగ లేదు.. పబ్బం లేదు.. పగలు తగ్గిపోయింది.. రాత్రి పెరిగి పోయింది.. చలికాలం తగ్గిపోవలసిన సమయంలో  గత వందేళ్లలో ఎన్నడూ లేని వణుకు అల్లాడిస్తోంది..
                                  
మైనస్‌ 1 డిగ్రీ...

ఎప్పుడైనా విన్నారా? ఎక్కడో కాశ్మీరులోనో.. లేక ఉత్తర భారతంలోనో అలాంటి ఉష్ణోగ్రతల గురించి విని ఉంటారు.. కానీ మన రాష్త్రంలో.. ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది.. ఒరిస్సా సరిహద్దులోని లంబసింగిలో టెంపరేచర్‌ మైనస్‌లోకి పడిపోయింది.

ఆదిలాబాద్‌ జాల్లా మొత్తం గజగజలాడుతోంది.. గత నూరేళ్లలో ఎప్పుడూ లేని టెంపరేచర్‌ జిల్లాను పీడిస్తోంది.. ౪ డిగ్రీల టెంపరేచర్‌ నమోదు కావటం ఇక్కడ రికార్డు.

రాష్త్రంలో ఏ జిల్లాలో కూడా టెంపరేచర్‌ ౧౦ డిగ్రీలను మించి ఉండటం లేదు..
రామగుండం , మెదక్‌లలో ౭
హైదరాబాద్‌లో ౮
నిజామాబాద్‌, నల్గొండలలో 10
విశాఖ, రెంటచింతల, అనంతపురం, బాపట్లలో 12
మిగతా జిల్లాల్లో 12 నుంచి 14 డిగ్రీల టెంపరేచర్‌ నమోదయింది...

చలికి తట్టుకోలేక ఏజెన్సీ గ్రామాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లేవారు కదలటమే గగనమైపోయింది.
౯గంటల తరువాత కూడా బయటకు రావాలంటే భయపడిపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తూర్పు నుంచి వీస్తున్న ఈదురుగాలుల బాధ మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

11, జనవరి 2012, బుధవారం

రైతుకు బ్రాండ్‌ అంబాసిడర్లు

ఏసి కార్లలో తిరిగి తిరిగి అలసిపోయిన ఇద్దరు ఇప్పుడు ఎండావానాచలి ని లెక్క చేయకుండా కాళ్లకు బూట్లు కట్టుకుని మరీ నడుస్తున్నారు.. రోడ్డు దిగి పల్లెల్లో.. పొలాల్లో .. గట్లలో.. బురదలో... పాదయాత్రలు చేస్తున్నారు.. బొమ్మ నాగళ్లను భుజానికెత్తుకుని.. తలలకు పాగాలు చుట్టేసుకుని ఆవేశపడుతున్నారు.. ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.. ఆందోళన చెందుతున్నారు.. ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇద్దరిదీ ఒకే బాధ..  అందరికీ అన్నం పెడుతున్న రైతు చిక్కిపోయాడని.. తినటానికి బియ్యం గింజలు లేక నలిగిపోయాడని, అప్పులు తీర్చలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నాడని.. ఇప్పుడు ఆ ఇద్దరికీ అతను కావాలి.. అతని క్షేమం కావాలి.. అతని సుఖం కావాలి.. అతను పచ్చగా ఉండాలి.. అతని పొలం పచ్చగా పండాలి.. ఆ రైతుకు ఈ ఇద్దరూ బ్రాండ్‌ అంబాసిడర్లు..


ఆరు మాసాలైంది.. ఆయన వెళ్లిన చోటికి ఈయన వెళ్తారు.. ఈయన వెళ్లిన చోటికి ఆయనా వెళ్తారు.. ఒకరిపై మరొకరికి పోటీ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే యత్నం.. ఇద్దరూ వెళ్తున్నది ఒకే రూటు.. అదే రైతు రూటు.. కాకపోతే, ఆ రూటులో ఎవరు ముందు వెళ్తారన్నదే పెద్ద సమస్య..  ఇదొక రేస్‌.. పవర్‌ రేస్‌..

ఒకరేమో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి, ఆరు సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఢక్కామొక్కీలు తిన్న చంద్రబాబు నాయుడు..
మరొకరేమో.. నిన్నటి తండ్రిచాటు బిడ్డ.. తండ్రి అకాలమరణంతో రాజకీయాల్లో అస్తిత్వం కోసం తాపత్రయ పడుతున్న  జగన్‌మోహన్‌ రెడ్డి..
రైతులు పడుతున్న సమస్యల కొసం ఇద్దరూ పోరుబాట పట్టారు.. ఒకరిని మించి ఒకరు రైతుల పక్షాన నిలుస్తున్నారు.. పాలకులను తిడుతున్నారు..తామే పవర్‌లో ఉంటే రైతు కంట కన్నీరే ఉండదని  హామీలు కురిపిస్తున్నారు..

రాష్ట్రంలో రైతుకు బోలెడు సమస్యలున్నాయి. నానా అగచాట్లు పడి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని నిరంకుశ వ్యవస్థలో రైతు ఉన్నాడు.. దుక్కి దున్నటం దగ్గర నుంచి నారు పోయటం, నీరు పోయటం.. కలుపు తీయటం, ఎరువు వేయటం, కుప్ప నూర్చటం, దిగుబడి సంపాదించటం, దాన్ని మార్కెట్‌ చేయటం.....
వీటిలో ఏ ఒక్క దశలో కూడా రైతు సంతృప్తి పడట్లేదు..పాలకులు పట్టించుకోరు..ఈ ఇద్దరు నేతలకు మాత్రం ఈ సమస్యలే నిచ్చెన మెట్లుగా ఉపయోగపడుతున్నాయి.
రైతు ఇవాళ హాట్‌కేక్‌గా మారిపోయాడు
మోస్ట్‌ కన్స్యూమబుల్‌ పొలిటికల్‌ ఐటమ్‌..
రైతుకు రాజకీయుల్లో స్పెషల్‌ డిమాండ్‌..రైతు
రాజకీయులను ఒడ్డుకు చేర్చే ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్‌.. రైతు
హి ఈజ్‌ ఏ స్పెషల్‌ బ్రాండ్‌.. 

ఇప్పుడు చంద్రబాబు.. జగన్‌మోహన్‌ రెడ్డి ఇద్దరూ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా మారిపోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు.. ఒకరు పోరు బాటలతో.. మరొకరు రోజుల కొద్దీ దీక్షలతో.. ఒకరిపై ఒకరు.. ఒకరితో ఒకరు.. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు..కిరణ్‌కుమార్‌ రెడ్డి సర్కారుపై అవిశ్వాసం తంతు నడపటానికి రైతు ఉపయోగపడ్డాడు..  రెండేళ్ల పాటు తెలంగాణా ప్రాంతానికి దూరమైన ఈ ఇద్దరూ అక్కడ తిరగటానికి రైతే మాంఛి ఉపకరణంగా పనికొచ్చాడు. మొన్న ఖమ్మం, కరీంనగర్‌..  నిన్న పాలకుర్తి... చంద్రబాబుకు రాచబాట పరిస్తే.. ఇప్పుడు ఆర్మూరు జగన్‌మోహన్‌రెడ్డికి దారి చూపించింది..

రాబోయే ఎన్నికల్లో పవర్‌ పాలిట్రిక్స్‌కు రైతే అసలు సిసలు మాస్క్‌.. సెక్రటేరియట్‌లోని సమతా బ్లాక్‌లోని అయిదో ఫ్లోర్‌లో సిఎం చైర్‌లో కూర్చోబెట్టడానికీ రైతే అవసరమవుతున్నాడు.. చంద్రబాబు.. జగనే కాదు.. రాజకీయ నాయకులందరికీ ఇప్పుడు ప్రచార వస్తువు రైతు.. 


గమ్మత్తేమిటంటే వీళ్లిక్కడ వేల మంది పోలీసులను వెంటేసుకుని తెగ తిరిగేస్తున్నారు.. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది, కరీంనగర్‌, అనంతపూర్‌లో టమాటా రైతు పండిన పంటను గేదెలపాలు చేశాడు.. గుంటూరులో మిర్చీ రైతు తన పంటను తానే తగులబెట్టుకుంటున్నాడు.. పాలమూరులో ఉల్లి రైతు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు.. బ్రాండ్‌ అంబాసిడర్లు మాత్రం... పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు... దీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. నాగళ్లు పట్టుకుంటూనే ఉన్నారు.. పాలకులేమో అరకులోయలో అందాలను ఆస్వాదిస్తున్నారు.. వీళ్లందరి గోలా పవర్‌ది.... రైతు గోడు మాత్రం రైతుదే...