16, జనవరి 2012, సోమవారం

లెక్కల కాకులు

అధికారంలో ఉన్న కాకి లెక్క 6 లక్షలు
ప్రతిపక్ష కాకి లెక్క సున్నా....
పిల్లకాకి లెక్క వేళ్లమీదే...
రాజకీయ కాకులు కావ్‌ మంటున్నాయి...
చిక్కుల లెక్కలతో అరుచుకుంటున్నాయి..
కాకి రాజ్యంలో రాబందుల పెట్టుబడులు..
పిల్లకాకులందరికీ ఉద్యోగాల ఆశలు..
ఇంద్రజాల మహేంద్రజాల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు
రాబందులకు కాకుల తాయిలాలు..
కాకులకు రాబందుల ముడుపులు..
దొందు దొందే..
పిల్లకాకికేం తెలుసు పెద్ద కాకుల దెబ్బ?
ప్రచారంతో మెస్మరైజింగ్‌
పబ్లిసిటీ మేనేజింగ్‌...
రాబందులు పెట్టే పెట్టుబడులు ఎన్ని?
ఇచ్చే కొలువులు ఇంకెన్ని?
అధికార, విపక్ష కాకులకు మాత్రం తెలుసు
అంతా మిథ్యేనని.. అంతా మాయేనని..
చెప్పేది కొండంత.. వచ్చేది గోరంత...
ఆ గోటి ముక్క కోసమైనా
పిల్ల కాకులు ఆశగా ఎదురుచూస్తుంటాయి
రాబందు ముక్కున ఉన్న బొక్క లో
ఏ కొంచెమైనా  కింద పడుతుందేమోనని...
ఆశలు ఆశలుగానే ఉండిపోతున్నాయి..
అడియాసలుగా మారిపోతున్నాయి..
నిరాశగా నీరుగారుతున్నాయి..
కాకుల లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి..
ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి.
పిల్లకాకుల ఆశలు మాత్రం
నీరింకిపోయిన కళ్లల్లో జీరగా కనిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు: