31, ఆగస్టు 2009, సోమవారం

దేశం గుండెలో రోజా ముల్లు


సినిమాల్లో ఏ నటులకైనా బ్రేక్‌ రావాలంటే పెద్ద బ్యానర్‌ దొరకాల్సిందే.. చిన్న చిన్న బ్యానర్లలో, లోబడ్జెట్‌ సినిమాల్లో ఎన్నింటిలో నటించినా ఫలితం అంతంత మాత్రమే.. ఆ సినిమాలు ఎంత సక్సెస్‌ అయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు... కానీ, అదే నటీనటులు పెద్ద బ్యానర్లలో ఒకటి రెండు సినిమాల్లో చాన్‌‌స దక్కించుకున్నా, మినిమమ్‌ బ్రేక్‌ గ్యారంటీ ఉంటుంది. సినీనటి ఉరఫ్‌ రాజకీయ నేత రోజాకు ఇది అనుభవ పూర్వకమైన వ్యవహారమే... ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆమె అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు.. ఇప్పుడు తెలుగుదేశం బ్యానర్‌ వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో... హాట్‌ హాట్‌ ఇమేజితో దూసుకుపోతున్న వైఎస్‌ బ్యానర్‌ వైపు మళ్లారు.. ప్రోత్సాహం ఉన్నచోటికే కళాకారులు వెళ్తారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమెకు ప్రోత్సాహం కరవైంది. వైఎస్‌ హస్తవాసి సక్సెస్‌ అయింది. దేశం గుండెల్లో రోజా ముల్లు గుచ్చుకుంది.
నెల రోజుల క్రితం వరకు ఆమె చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ... ఇప్పుడు బాబు గారు ఆ చెల్లెమ్మను పట్టించుకోని అన్నయ్య.. అందుకే మరో అన్నయ్యను వెతుక్కుంటూ రోజా వెళ్లిపోయారు.. రాజకీయంగా తనకు పుట్టుకనిచ్చి, ఎదుగుదలకు చేయూతనిచ్చిన తెలుగుదేశం పార్టీకి షాక్‌ ఇచ్చి రాజావారి కోటకు తరలిపోయారు..

రాజకీయాలంటేనే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. ఎన్నికల ముందు విడిపోయిన వారు ఎన్నికల తరువాత కలిసిపోతారు.. ఎన్నికల ముందు కలిసి పోయిన వారు ఆ తరువాత వెళ్లిపోతారు.. ఈ జంపింగ్‌‌స కొందరికి రాజకీయంగా అనూహ్య లాభాల్ని తెచ్చిపెడితే.. మరి కొందరి పాలిటి ఆత్మహత్యాసదృశమవుతుంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలనేవి ఉండవు మరి...
లేటెస్టుగా రోజా విషయానికి వస్తే... తెలుగుదేశం పార్టీలో ఫైర్‌బ్రాండ్‌.. సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా ఆమె కనిపించారో...రాజకీయాల్లో అంత దూకుడుగా దూసుకుపోయారు.. తెలుగుదేశం పార్టీలో ఎంత వేగంగా ఆమె ఎదిగారో.. అంతే వేగంగా కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిపోతున్నారు.. ఇందుకు అసలు కారణాలు ఏమైనా ఉండవచ్చు...... కానీ, పార్టీ అధినేత చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో తన గెలుపు విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యమేనన్నది రోజా ఇప్పుడు చెప్తున్న కారణం...
ఎంత ఆశ్చర్యం.. నెల రోజుల క్రితం తాను చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ అని స్వయంగా చెప్పుకున్న రోజాయేనా ఇలా మాట్లాడేది... గతంలో వైఎస్‌ను అడ్డగోలుగా తిట్టిన రోజాయేనా ఈమే.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి...
ఇప్పుడు ఆమె వినిపిస్తున్న రాజశేఖర చరిత్ర ఎంత వినసొంపుగా ఉందో ఆలకించండి...
రాఖీ పౌర్ణిమ నాటి రోజా కాదు.. ఈమె.. నాడు ఆమె చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ.. తెలుగుదేశం పార్టీకి అగ్గి బరాటా.... ఇప్పుడు చేయి మారింది. స్వరమూ మారింది... రోజా తీరూ మారింది... కాంగ్రెస్‌కు తిరుగులేని అస్త్రంగా వేషమూ మార్చుకుంటోంది. రాజకీయాల్లో ఏదీ నష్టం కాదు.. ఒకసారి ఒకరికి లాభం చేకూరిస్తే.. మరొకసారి మరొకరికి లబ్ధి కలిగిస్తుంది. మొన్న చంద్రబాబును పొగిడిన రోజాయే.. ఇప్పుడు వైఎస్‌లో మహాపురుషుణ్ణి దర్శించుకున్నారు.. గొప్ప వ్యక్తిని చూస్తున్నారు.. ఎన్నికల ముందు ప్రజల పాలిటి రాక్షసుడిగా కనిపించిన వైఎస్‌.. ఇప్పుడామె కళ్లకు దిగివచ్చిన దేవుడయ్యారు..మాట మారటం.. చేతమారటం భారత దేశ రాజకీయ రక్తంలో ప్రవహిస్తోంది. రోజా మాత్రం ఇందుకు మినహాయింపు ఎలా అవుతారు.. ?
2
ఒక్క రోజా తెలుగుదేశం పార్టీని వీడిపోయినంత మాత్రాన ఎందుకింత రాద్ధాంతం? గతంలో ఎంతమంది వెళ్లిపోలేదు.. ఎంతమంది వచ్చి చేరలేదు.. పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి వాడుగా పేరు తెచ్చుకున్న దేవేందర్‌గౌడ్‌ వెళ్లిపోతేనే పార్టీ చెదరలేదు.. కానీ, రోజా విషయంలో ఇంత ఆందోళన దేనికి? కారణం.. ముఖ్యమంత్రి వైఎస్‌... నాయకులు పార్టీలు మారటంపై సహజంగా అధినేతలు పెదవి విప్పరు.. కానీ, „రోజా విషయంలో నెల క్రితం వైఎస్‌ ఏదైతే చెప్పారో.. ఇప్పుడు అదే జరిగింది. తాను అనుకున్నది అనుకున్నట్టు వైఎస్‌ సాధించి తీరుతారన్నది రుజువు చేసుకున్నారు.. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటం కాదు.. ఏకంగా ప్రత్యర్థి వర్గమన్నదే లేకుండా చేసుకోవటం లక్ష్యంగా వైఎస్‌ నడత కనిపిస్తోంది.
రాజకీయ కూటనీతిలో వైఎస్‌కు సాటిరాగల వాళు్ల ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో లేరనే చెప్పాలి.. తన పార్టీలో తనకు ఎదురు లేకుండా చేసుకోవటమే కాదు... రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీకీ కునుకులేకుండా చేయటం వైఎస్‌కే చెల్లింది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తరువాత గెలిచిన పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల్లో కనీసం ఆరు నెలల పాటైనా స్తబ్దత నెలకొటుంది. సర్కారుపై విరుచుకుపడటానికి గొప్ప అస్త్రం దొరికిన తరువాత కానీ వీధుల్లోకి రావు.. కానీ, మన రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ప్రశాంతత లేదు. మొన్నటిదాకా తెలంగాణ రాష్టస్రమితి కుము్మలాటలతో కల్లోలమైపోయింది. ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకూ నిద్రలేదు. చాపకింద నీరులా వైఎస్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష ఏ స్థాయిలో రాజకీయ పార్టీలను కుదిపేస్తున్నదనటానికి ఇందుకు నిదర్శనం... టిఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల నుంచి ఫైర్‌బ్రాండ్‌ రోజా దాకా వైఎస్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారనే చెప్పాలి... నెల రోజుల క్రితం రోజా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న వార్తను మొదట లీక్‌ చేసింది సాక్షాత్తూ వైఎస్సే... తాను తలుపులు తెరుచుకుని ఉంటే ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరూ మిగలరని కూడా అన్నారు.. కానీ, ఆరోజు రోజా తాను తెలుగుదేశం పార్టీలో నిజాయితీగల కార్యకర్తలా గొప్పగా గొప్పలు చెప్పారు... వైఎస్‌ మాటల్ని నిర్ద్వంద్వంగా ఖండించారు..
నెలైనా కాకుండానే పరిస్థితి తిరగబడింది. రోజా మాట మారింది. వైఎస్‌ మాటే నెగ్గింది... ఈరోజు అసెంబ్లీలో ఇష్టాగోష్టిగా విలేఖరులతో మాట్లాడిన వైఎస్‌ ఆ మాటా అనేశారు.. తన మాటలో విశ్వసనీయత ఎంతో రోజా రాక చెప్పకనే చెప్పిందన్నారు...ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది.
ఫలితాలు వెల్లడైన నాటి నుంచే వైఎస్‌ వూ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ ఇక ఫినిష్‌ అన్నట్లుగా అసెంబ్లీ లాబీల్లో చేసిన కామెంట్‌, వైఎస్‌ ఎంత దూకుడుగా వ్యవహరించబోతున్నదీ అర్థం అవుతోంది. రోజా వ్యవహారమే టిడిపిలో వేడి పుట్టించిందనుకుంటే ఇవాళ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెళ్లి సిఎంను కలవటం పార్టీని మరింత కలవరపెట్టింది.
ఆపరేషన్‌ ఆకర్ష ఎంత ఊపందుకుందో ఒక్కరోజులో జరిగిన పరిణామాలే తార్కాణం. రోజా సిఎంను కలిసి 24 గంటలైనా కాకుండానే, పిఆర్‌పి నుంచి కాటసాని, శోభానాగిరెడ్డి సిఎంను కలిసారు.. మరోపక్క ఎంపి ఉండవల్లి, ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌లు చిరంజీవి దగ్గరకు వెళ్లి మంతనాలు జరిపారు..
ఒక్కమాటలో చెప్పాలంటే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన రోజునుంచే దీర్ఘకాలిక వూ్యహంతో వైఎస్‌ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారన్నది వాస్తవం... పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం నిరాటంకంగా చేస్తున్న అధికార ప్రస్థానాన్ని వైఎస్‌ ఆదర్శంగా తీసుకున్నట్లే కనిపిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2014 నాటికి తనకు బలమైన ప్రత్యర్థి లేకుండా చేయటం ఆయన ఆపరేషన్‌ ఆకర్షకు అసలు టార్గెట్‌గా అయి ఉండవచ్చు.

దిక్కులేని దేవుడు పార్ట్ 3

ఎందుకిలా జరుగుతోంది. దేవుడిపై భక్తితో సమర్పించిన కానుకలను అడ్డగోలుగా భోంచేస్తున్న వారి భరతం పట్టేదెవరు? గుడినీ గుళ్లో లింగాన్ని మాయం చేసే వాళు్ల దేవాదాయ శాఖలో ఉన్నంత వరకు దేవుడికీ, ఆయన మాన్యానికీ, ఆయన ఆస్తులకు రక్షణ ఉండదు...... మనం దండం పెట్టేందుకు తూర్పు దికై్కనా ఉంది.. కానీ, అసలే సర్వాంతర్యామి.. ఆయన ఏ దిక్కుకు తిరిగి దండం పెట్టుకోవాలి?

తిరుమలలో ఓ అర్చకుడు తప్పుడు పని చేసాడని రాష్టమ్రంతటా గగ్గోలు పెడుతున్నారు... దోషులెవరైనా శిక్షిస్తామంటూ ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. మంచిదే... తిరుమలలో ఒక చిన్న చేపపై కొరఢా ఝళిపిస్తే దేవాదాయ వ్యవస్థ చక్కబడినట్లేనా? రాష్ట్రంలో ఉన్న మిగతా దేవాలయాల మాటేమిటి? రాష్ట్రంలో 37 వేల దేవాలయాలు ఉంటే, అందులో 5లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాలు... చాలా తక్కువ. దమ్మిడీ కూడా ఆదాయం రాని ఆలయాల సంఖ్యే ఎక్కువ... ఎన్టీరామారావు పుణ్యమా అని 1987లో చల్లా కొండయ్య కమిషన్‌ సిఫార్సుల మేరకు చేసిన 33/87 చట్టం వేలాది ఆలయాలను జీర్ణావస్థకు చేర్చింది. విచిత్రమేమంటే రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయానికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి వెళ్లదు. దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఆలయాల మధ్య రొటేట్‌ చేయటం మినహా సర్కారు చేసేదేమీ ఉండదు. పోనీ ఆ ఆదాయానై్ననా ఆలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించి అభివృద్ధి పరుస్తుందా అంటే అదీ లేదు... పైగా, తిరుమల వంటి పెద్ద ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని అవసరమైనప్పుడల్లా తీసుకుంటుంది. దీనికి తోడు పెత్తనానికేం తక్కువ ఉండదు. ఉద్యోగులను నియమించటం దగ్గర నుంచి హుండీ ఆదాయం దాకా అన్ని వ్యవహారాల్లో సర్కారు జోక్యం తప్పనిసరి... ఆలయానికి భూముల నుంచి, ఇతర వనరుల నుంచి ఆదాయం వస్తే... ఆ ఆదాయాన్ని కార్యనిర్వాహణాధికారికి జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అన్నీ ఇచ్చేశాక ఏదైనా మిగిలితే, తగిలితే అప్పుడు ధూప దీప నైవేద్యాలకు ఖర్చు చేస్తారు.. ఆ తరువాత ఇంకాస్త మిగిలితే అర్చకుడిపైన దయతలుస్తారు... ఈ లోపు ఎవరు కైంకర్యం చేయాల్సింది వారు చేసేస్తారు.. ఆలయంలో ఆదాయానికి, ఆస్తులకు ఎవరి బాధ్యత ఉండదు.. ఎవరి నిఘా ఉండదు.. ఎలాంటి చర్య కూడా ఉండదు.. 2005లో సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఎం.సత్యనారాయణరావు స్వయంగా తన శాఖలో జరుగుతున్న అవినీతి గురించి అసెంబ్లీలో బహిరంగంగా అంగీకరించిన తరువాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అర్చకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, వారిని ఆదుకోవాలని, ఉద్యోగులుగా మిగతా వారితో సమానంగా స్కేళు్ల ఇవ్వాలని, కోరుతున్నా.. ఏదో ఘటన జరిగినప్పుడు.. ఇప్పుడు మంత్రి గాదె వెంకటరెడ్డి స్పందించినట్లే ఆదుకుంటామంటూ స్పందిస్తారు తప్ప నాలుగు రోజుల తరువాత మర్చిపోతారు.. పెద్ద గీతను చిన్న గీతగా చూపించేందుకు రమణ దీక్షితులనే చిన్న గీతను పెద్దది చేస్తున్నారు...ఈ రకమైన అక్రమాన్ని నిరోధించకపోతే... దేవాదాయ వ్యవస్థే నిర్వీర్యం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు..

29, ఆగస్టు 2009, శనివారం

దిక్కలేని దేవుడు పార్ట్-2


ఇంతకీ తిరుమల శ్రీవారికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? వాటి విలువ ఎంత? హైకోర్టు నగల వివరాలు అడిగి ఉండవచ్చు. కానీ, శ్రీవారి నగలకు విలువ కట్టే షరాబు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమేనా?
డాలర్‌ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత బెజవాడ గోవిందరెడ్డి అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అసలు శ్రీవారికి ఉన్న ఆస్తులు.. ఆయనకు బంగారం, వెండి ఇతర రూపాల్లో ఉన్న ఆభరణ, వస్తువుల విలువెంత అన్నది ఆయన ప్రశ్న... ఆభరణాలు అసలు ఎన్ని ఉన్నాయంటూ హై కోర్టు ఆదేశించిందే కానీ, అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న...

కోనేటి రాయడిని చూసేందుకు రెండు కళూ్ల చాలవు. ఆ విగ్రహ సౌందర్యం అద్భుతం. అలాంటి స్వామివారు సర్వాలంకార భూషితుడైతే... ఇక చెప్పేదేముంది. నూనె దీపాల వెలుతురులోనే స్వామివారి వైభవాన్ని రోజూ మనం దర్శించుకుంటున్నామంటే ఆ అలంకారాల గురించి ఏమని చెప్పేది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 11 టన్నుల ఆభరణాలు శ్రీవారి సొంతం.. ఒక్కో సేవకు ఒక్కో రకమైన ఆభరణం.. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి తొలి కిరీటాన్ని సమర్పించటంతో మొదలైన ఆభరణాల వెల్లువ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాయలవారు ఏడుసార్లు తిరుమలను దర్శించి శ్రీవారి ఖఖజానాను స్వర్ణమయం చేశాడు. వజ్ర కిరీటంతో పాటు నవరత్నఖచిత స్వర్ణ ఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నాలు పొదిగిన పిడిబాకు, నవరత్నాలతో కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం సమర్పించాడు. తరువాత తంజావూరు రాజులు, మహమ్మదీయ రాజులు, బ్రిటిష్‌ వాళు్ల, తరువాత సంపన్న భక్తులు, అజ్ఞాత భక్తులు ఇచ్చే కానుకలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పటి వరకు బహిరంగంగా తెలిసిన లెక్క ప్రకారం శ్రీవారికి ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రాల కిరీటంతో పాటు, గద్వాల మహారాణి కిరీటం ముఖై్మనవి. తరువాత సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పగడాలు, కాంచీగునము, ఉదర బంధము, దశావతార హారము, వడ్డాణము, చిన్న కంఠాభరణము, బంగారు పులిగోరు, సూర్య కఠారి, నాగాభరణాలు,, స్వర్ణ పద్మాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.... లెక్కకు అందనన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని లెక్కించటానికి ఎంత సమయం పట్టాలి? ఏ కిరీటంలో ఎన్ని వజ్రాలు పొదిగి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వాటి ఖరీదు ఎంత? అని లెక్కలు కట్టే వ్యవస్థ టిటిడికి ఇప్పటిదాకా లేదు. ఇంతకు ముందు తమిళనాడులోని ఓ సంస్థ శ్రీవారి నగల విలువ కట్టేదట. వెంకన్న నగల విషయంలో లెక్కలేకపోవటం వల్లే, తిమింగళాలు బొక్కసాన్ని మెక్కేస్తున్నాయి. ప్రాచీన ఆభరణాల్లో పొదిగిన వజ్రాలు మార్పిడికి గూడా గురైనట్లు వస్తున్న ఆరోపణలకు సమాధానం లేదు. ఇందుకు తార్కాణం టిటిడి దగ్గరే ఉంది. ఇవాళ ఓ చానల్లో ప్రసారమైన కథనంలో డాక్యుమెంట్‌ ఎవిడెన్‌‌సను కూడా ప్రదర్శించారు.. డాలర్‌ శేషాద్రి మీడియా ముందుకు వచ్చి దుఃఖపడ్డారు.. కానీ, నగల గురించి జరిగిన విచారణలో టిటిడి సమర్పించిన ఓ అఫిడవిట్‌లో కొన్ని ముత్యాలు, పచ్చలు, ఇతర విలువైన రాళు్ల కనిపించకుండా పోయినట్లు ఒప్పుకుంది. వింతల్లోకెల్లా వింతేమిటంటే.. పోయిన రాళు్ల, పచ్చలు, ముత్యాల విలువ ఒక్కోటి పది రూపాయలు.. ఇరవై రూపాయలకు మించి లేదట.. రాయల వారి కాలంలోనూ వాటికి ఇంత చీప్‌ రేట్లు ఉండవేమో... ఇంత చౌకైన రత్నాలు.. రత్నాలేనా? లేక రాళ్లా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ విధంగా లెక్కలు గట్టడం వాటిని స్వామివారికి సమర్పించిన భక్తులను అవమానించటం.. ఆ ఆభరణాలను విలువైనవిగా భావించి ధరిస్తున్న స్వామి వారిని దారుణంగా మోసం చేయటం...
ఇక శ్రీవారి ప్రియభక్తుడు హథీరాంజీకి తిరుపతిలో ఓ మఠం ఉంది. తిరుపతిలోని చాలా భూములు ఈ మఠానికి చెందినవే.. దాదాపు అరవై శాతం భూములు ఈ మఠానికి చెందినవే.. కానీ, మఠం మాత్రం సీదాసాదాగానే ఉంటుంది. భూములన్నీ, దొరలనబడే ప్రజాప్రతినిధుల కబ్జాలో ఉండిపోతాయి.. వాళు్ల దుకాణాలు కట్టుకుంటారు.. థియేటర్లు కట్టుకుంటారు.. ఎవరూ వారిని ప్రశ్నించరు? అంత సాహసమే చేయరు.. ఎందుకంటే ఈ ప్రతినిధులే శాసనసభలో చట్టాలు చేసి మనకు కట్టుబాట్లు విధిస్తారు.. అవి వారికి మాత్రం వర్తించవు... కోట్లాది రూపాయల విలువైన హథీరాం భూములు హాంఫట్‌ అయ్యాయి. దీనికి తోడు 20 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలూ గల్లంతయ్యాయి. వీటికి జవాబు ఇప్పటి వరకు ఎవరి నుంచీ రాలేదు.. టిటిడి చైర్మన్‌కు తిరుగే లేదు.. రెండువేల విఐపి దర్శనాలను పదహారు వేలు చేస్తారు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వమూ వేచి చూసే ధోరణిలో ఉంది. ఇంత జరిగాక కూడా అవకతవకలను అరికట్టడానికి పూనుకోకపోతే... భక్తుల భక్తి సమర్పణ భోక్తల పాలు కావటం ఆపటం ఎవరితరం కాదు...పాపం పండితే కానీ, దాన్ని రాల్చలేమంటారు.. మరి భగవంతుని సొము్మను మింగుతున్న వారి పాపం పండేదెప్పుడో?

26, ఆగస్టు 2009, బుధవారం

దిక్కులేని దేవుడు.....part - 1

మన రాష్ట్రంలో దేవుడికి ఆస్తులు ఎన్నో... అవస్థలు అన్ని... రాజుల సొము్మ రాళ్లపాలని ఎవరో స్పష్టంగానే అన్నారు కానీ, దేవుడి సొము్మ ఎవరిపాలవుతుందనేది సాక్షాత్తూ దేవుడికే తెలియదు... తిరుపతిలో ఓ అర్చకుడు ఏ అవసరార్థమో దేవుడి నగలను తాకట్టు పెట్టి ఉండవచ్చు గాక.. ఆ అర్చకుడు చేసింది తప్పే కావచ్చు. దాన్ని ఎవరూ సమర్థించరు.. కానీ, రాష్ట్ర బడ్జెట్‌ స్థాయిలో విలువ కలిగిన శ్రీవారి నగలకు తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర సర్కారు ఎంతవరకు రక్షణ నిస్తోంది... ఇవాళ అర్చకులను నిందించటం కాదు.. ఇంతకాలంగా అక్కడ చోటు చేసుకుంటున్న అవినీతికి, నగలు, డాలర్లు మాయమయ్యాయన్న ఆరోపణలకు ఎవరు జవాబుదారి?

వారం రోజుల క్రితం తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో అర్భకుడైన ప్రధానార్చకుడు స్వామి వారి నగలను ప్రైవేటు వడ్డీవ్యాపారి దగ్గర తాకట్టు పెట్టి అవసరార్థం అప్పు తీసుకున్నాడన్న వార్త సంచలనం సృష్టించింది. దేవుడి నగలను ఎవరికి తోచినట్లు వాళు్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే దేవస్థాన యాజమాన్యం... దాన్ని నియంత్రిస్తున్న సర్కారు నీరో చక్రవర్తిలా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నాయి.
అక్షరాలా యాభైవేల రూపాయల కోసం తిరుపతి కోదండరామస్వామి ఆలయ పూజారి చిన్న వెంకటరమణ దీక్షితులు ఖరీదైన రాముల వారి నగల్ని దాదాపు కిలోన్నర విలువ కలిగేవి కుదువ పెట్టేశాడు.. కుటుంబ అవసరం కోసం వడ్డీవ్యాపారి నుంచి అప్పు చేశాడు.. అప్పు తీర్చేసి నగల్ని యథాతథ స్థితిలో తిరిగి చేర్చాలనుకున్నాడు.. కానీ, ఈలోగానే ఉపద్రవం వచ్చిపడింది. తిరుమల శ్రీవారితో పాటు, టిటిడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఉన్న బంగారు, వెండి, ఇతర ఆభరణాల వివరాలన్నీ లెక్కలు గట్టి చెప్పాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించటంతో , తనిఖీ ప్రారంభించిన అధికారులకు బండారం బయటపడింది. ఇక హడావుడి అంతాఇంతా కాదు.. రమణదీక్షితులు దంపతులను అరెస్టు చేయడం, వడ్డీవ్యాపారిని అరెస్టు చేయటం, తాకట్టు పెట్టిన నగలను స్వాధీనం చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. నిందితులు నేరాన్ని ఒప్పుకోవటమూ జరిగిపోయింది.
నిందితులపైనైతే కేసు నమోదు చేశారు.. కానీ, ఇంతటితో వివాదం ముగిసినట్లేనా? తిరుమల శ్రీవారి నగల భద్రత సమస్య తీరినట్లేనా? వాస్తవం ఏమిటి? రమణ దీక్షితులు ఓ చిన్న చేప మాత్రమే. తిరుమలలో పెద్ద పెద్ద తిమింగళాలే ఉన్నాయి. సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామికి సైతం అంతుపట్టని పెద్దలు వాళు్ల... ఒంటి నిండా ఊర్ధ్వపుండ్రాలు ధరించి పట్టువసా్తల్రు ధరించి నిత్యం స్వామి పక్కనే ఉంటూ భజనలు చేస్తూ, పూజలు నిర్వహిస్తూనే భక్తులతో పాటు శ్రీవారికే శఠగోపం పెట్టే ప్రబుద్ధులు ఉన్నారు. ఆలయంలో అవినీతి గురించి చాలాకాలంగా, చాలా సందర్భాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. కానీ, దీన్ని అరికట్టే బాధ్యత వహించేదెవరు? దేవుని గోడు పట్టించుకునేదెవరు?
నాలుగేళ్ల క్రితం శ్రీవారి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే బంగారు డాలర్లు మాయమైపోయాయన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. మూడు వందల అయిదు డాలర్లు మాయమయిన కుంభకోణంలో దానికి ఇంచార్జిగా ఉన్న డాలర్‌ శేషాద్రిని సస్పెండ్‌ చేశారు.. మరో నలుగురు ఉద్యోగులనూ సస్పెండ్‌ చేశారు.. దీంతో ఆయనపై టిటిడి విచారణ జరిపిస్తుందని, అంతా చక్కదిద్దుతుందని అంతా భావించారు. కానీ, శేషాద్రి సస్పెన్షన్‌ అంతా ఓ డ్రామా అని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. నెలలు కూడా గడవక ముందే శేషాద్రిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.2006లో మళ్లీ అదే పోస్టులో నియమించటం వెనుక మతలబు ఏమిటి?
గమ్మత్తేమిటంటే శేషాద్రి ఉద్యోగిగా రిటైర్‌ అయి చాలా కాలమైపోయింది. టిటిడి యాజమాన్యం ప్రత్యేక తీర్మానంతో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా ఆయన్ను అందలం ఎక్కించింది. శ్రీవారి భాండాగారానికి సంబంధించిన రెండు తాళాలూ డాలర్‌ శేషాద్రి దగ్గరే ఉండటం అన్నింటికంటే మరో విచిత్రం. మామూలుగా ఏ చిన్న బ్యాంకులోనైనా స్ట్రాంగ్‌రూమ్‌ తాళాల్లో ఒకటి క్యాషియర్‌ దగ్గర, మరొకటి మేనేజర్‌ దగ్గర ఉంటాయి.. కానీ, తిరుమలలో డాలర్‌ శేషాద్రే శ్రీవారికి సర్వ రక్షకుడు... ఆయన చెప్పిందే వేదం... ఉన్న బంగారాన్ని కరిగించి భక్తులకు విక్రయించటానికి పూనుకోవటంలోనూ ఆయన పాత్ర ప్రశ్నార్థకమైంది. డాలర్‌ స్కాంకు అదే మూలం... అన్ని నిబంధనలకు అతీతంగా వెల కట్టలేని విలువైన నగల రక్షణ భారం ఒక్కరి చేతులో ఎలా పెట్టారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. ఇప్పటికిప్పుడు శేషాద్రి మీడియా ముందుకు వచ్చి కంటనీరు పెట్టుకుంటున్నారు. తాను ఏ పాపం ఎరుగనని అంటున్నారు. 2006 నుంచి తన దగ్గర రెండు తాళాలు లేవంటున్నారు. కానీ, డాలర్ల స్కాం బయటపడినప్పుడు జరిపిన విచారణ తరువాత అధికారులు సమర్పించిన నివేదిక విస్పష్టంగా ఆయన దగ్గరే రెండు తాళాలు ఉన్నాయని పేర్కొంది. ఆయన నిజాయితీపరుడే అయితే, నిబద్దతే కలిగి ఉంటే.. విలువలకు కట్టుబడి ఉండేవాడే అయితే రెండు తాళాలు ఎందుకు తన దగ్గరే ఉంచుకున్నారు? ఎంత సమర్థుడైనా సరే లాకర్‌ కీస్‌ ఒకే వ్యక్తి దగ్గర ఏ నిబంధన ప్రకారం ఉంచారు. అన్నింటికీ మించి ఒక పదవీ విరమణ చేసిన ఉద్యోగిని ఇంతకాలం కొనసాగించాల్సిన అవసరం ఏమి వచ్చింది? మరో సమర్థుడైన అధికారి టిటిడిలో లేనే లేరా? ఒకవేళ తీసుకున్నా, శ్రీవారి ఖజానా బాధ్యతను రిటైరైన ఉద్యోగి చేతుల్లో ఏ ప్రాతిపదికన పెట్టారు...? ఈ వ్యవహారాన్ని తేల్చకుండా అర్భకుడైన అర్చకుడి చిన్న తప్పును భూతద్దంలో చూపించి మిగతావన్నీ కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించటం క్షంతవ్యం కాదు..

21, ఆగస్టు 2009, శుక్రవారం

క్లైమాక్స్ కు చేరుకున్నాక ఆకులు పట్టుకుంటున్నారా?


వేలాది ప్రజల అభిమానుల హర్షధ్వనాల నేపథ్యంలో సరిగ్గా 360 రోజుల క్రితం తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రస్థానం అప్పుడే ముగింపు దశకు చేరుకుందా? రాష్ట్ర రాజకీయ రంగస్థలంపై వేగంగా మారుతున్న పాత్రలు... మార్చుకుంటున్న వేషాలు.. ప్రజారాజ్యం పార్టీ కథను కంచికి చేర్చేట్లే కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం నడుస్తున్న తీరుపై మీడియా కథనాలను మెగాస్టార్‌ ఆవేశంతో, ఆగ్రహంతో ఖండిస్తే ఖండించవచ్చు... జెండా ఎవరు పీకుతారనీ అనవచ్చు..ఆయన ఖండించిన తరువాత కూడా ఊహాగానాలు ఆగలేదు.. ఏకంగా కాంగ్రెస్‌తో రాజీ కుదిరిందని, విలీనం కాకున్నా, కనీసం కాంగ్రెస్‌తో అవగాహనతో ముందుకు వెళ్తారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి....


ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీ తన వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందా? ఏడాది క్రితం లక్షలాది అభిమానుల సమక్షంలో ఆర్భాటంగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం తొలి వార్షికోత్సవం అంత ఉత్సాహంతో జరుపుకునే పరిస్థితిలో లేదు. ఎన్నికల దాకా ఏవేవో ఊహించుకున్న చిరంజీవికి ఎన్నికల తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇవాళ పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తలుపులు బార్లా తెరిచి ఉంచినా, పార్టీని వీడి వెళ్లేవారే తప్ప.. వచ్చేవారు లేని సంకట స్థితిలో ఉన్నారు. పూటకొకరుగా, రోజుకొకరుగా నెమ్మదిగా జారుకుంటున్నారు. చివరకు పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. పార్టీ అధినేతగా చిరంజీవి అంతా బాగుందనే చెప్పవచ్చు...ఎమ్మెల్యేలు సామూహికంగా ఖండించవచ్చు. కానీ, వాస్తవాలు మాత్రం పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్తున్నాయి.
నిప్పులేందే పొగరాదు.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రజారాజ్యం ప్రతి కదలిక అస్తవ్యస్తంగానే సాగుతోందన్నది నిష్ఠుర సత్యం. ఎన్నికలకు ముందు పరకాల ప్రభాకర్‌ వంటి వారు వెళ్లిపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. ఎన్నికలు ముగిసాక హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందనీ, చిరంజీవి కింగ్‌ మేకర్‌ అవుతారనీ ఆ పార్టీ వారు గట్టిగా నమ్మారు. కొందరు రాజకీయ విశ్లేషకులైతే.. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని బల్లగుద్ది మరీ వాదించారు. ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పూర్తిగా తేలిపోయింది. పార్టీ అధినేతే ఒక నియోజక వర్గంలో ఓడిపోయిన దుస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశించిన తరువాతైనా చిరంజీవి రాజకీయంగా మెతకగా వ్యవహరించటం కూడా తప్పుడు సంకేతాల్ని పంపించింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో షికారు చేశాయి. అయితే ఏనాడు కూడా చిరంజీవి కానీ, ఆయన ప్రతినిధులు కానీ, శాసన సభ్యులు కానీ ఈ వాదనలను, పుకార్లను ఖండించలేదు. కనీసం స్పందించనైనా లేదు.. దీనితో ఈ వాదనలకే బలం చేకూరింది.
ప్రజారాజ్యం పనిచేస్తున్న తీరు గురించి మీడియాలో ఇవాళ కొత్తగా వార్తలు రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యాలయం ముఖమైనా చూడని ప్రధానకార్యదర్శి అల్లు అరవింద్‌తో ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడిన మాట వాస్తవం. రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన సమావేశంపై మీడియాలో వచ్చిన కథనాలపై ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. తన స్ట్రేచర్‌ను దిగజారుస్తున్నారని, తన ఇమేజిని, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తున్నారని ఆవేశపడుతున్నారు. మరి ఇంతకాలంగా వస్తున్న వార్తలపైనా, బయటకు వెళ్లిపోతున్న నాయకుల విషయంలోనూ, పార్టీని బలోపేతం చేసే దిశలోనూ ఆయన చేపట్టిన ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక చర్య ఏముంది? పార్టీ శాసన సభ్యులు అధినేతతో నేరుగా మాట్లాడవచ్చు కదా? అరవింద్‌తో పార్టీ భవిష్యత్తు గురించి తన ఎమ్మెల్యేలు చర్చిస్తుంటే అధినేత మాత్రం తీరిగ్గా రాష్ట్ర శాసన సభ్యుల కుటుంబాలకు కొడుకు సినిమా మగధీరను చూపిస్తూ కూర్చున్నారు...పార్టీ పట్ల చిరంజీవికి ఉన్న సీరియస్‌ నెస్‌ ఇదేనా?
2..
తన పార్టీని మరింత బలోపేతం చేస్తానని, రానున్న నాలుగేళ్లలో రాజకీయాల్లో అద్భుతం సృష్టిస్తానని చిరంజీవి చెప్తున్నారు. అలా జరిగితే సంతోషమే.. రాష్ట్రంలో మరో బలమైన రాజకీయ పక్షం ఉండటం ఆరోగ్య పరిణామమే.. కానీ, ప్రజారాజ్యం ప్రస్తుతం ఉన్న తీరు... నడుస్తున్న దారి సరైనదేనా? చిరంజీవి అనుకున్న గమ్యానికి అది వెళ్లడం సాధ్యమేనా?
ఎందుకంటే పార్టీపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించటానికే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తానుగా స్పందించటానికి పన్నెండు గంటలు పట్టింది. నిర్ణయం తీసుకోవటంలో ఆయన మహా నిదానస్తుడు.. పార్టీలోని నాయకులందరినీ ఒకరి వెంట ఒకరుగా మాట్లాడించిన తరువాత కానీ, చిరంజీవి పలుకలేదు. ఆయన ప్రతిస్పందన అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టార్గెట్‌ చేసుకుని సాగింది. రెండు పత్రికలు కలిసి తమ పార్టీని ఎలిమినేట్‌ చేసేందుకు పత్రికలు టార్గెట్‌ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా.. తమ ప్రస్థానాన్ని ఆపేది లేదన్నారు....ఇదే తీవ్రత నాడు కేశినేని నాని వెళ్లినప్పుడో, పరకాల ప్రభాకర్‌ పార్టీ కార్యాలయంలో కూర్చొని నిందించిన రోజునో... చిరంజీవి నుంచి వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.. పార్టీ కేడర్‌లో విశ్వాసం పెంచాలంటే నాయకత్వం ఎంత చురుగ్గా పనిచేయాలో చిరంజీవికి అర్థం అవాల్సిన అవసరం ఇవాళ్టికైనా గుర్తుకు వచ్చింది.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ అన్నది ఏర్పాటు అయితే, అది ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయటం మన దేశంలో రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల వలన ఎన్నుకోబడిన వ్యవస్థ మన ప్రజాస్వామ్యం కాబట్టి... ప్రజల ప్రమేయం లేకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజల్లో విశ్వాసం కల్పించకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. ప్రజారాజ్యం ఏర్పాటైన తొలినాడు దానికి ప్రధాన సిద్ధాంతం అన్నది ఏమీ లేదు. రాష్ట్రంలో కొన్ని సమస్యల ప్రస్తావనలతో గుదిగుచ్చిన ప్రసంగ పాఠాన్ని నాడు చిరంజీవి చదివారే తప్ప, ఆనాడు ఆయన పార్టీకి ఉన్న రాజకీయ విధానమేమిటన్నది స్పష్టంగా చెప్పలేదు. ఆ తరువాత సామాజిక న్యాయం అన్న నినాదం తెరమీదకు వచ్చింది. నినాదాన్ని అందిపుచ్చుకున్న తరువాతైనా దాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారా అంటే అదీ లేదు. సామాజిక న్యాయం విషయంలో వూ్యహాత్మకంగా వ్యవహరించకపోవటం వల్ల పార్టీపై కుల ముద్ర పడింది. కనీసం ఆ తరువాతైనా ఆ ముద్రను చెరుపుకోవటానికి అధినేత కానీ, అధిష్ఠానం కానీ ఎంతమాత్రం ప్రయత్నించలేదు. పైగా ఆ ముద్రను నిలుపుకునే విధంగా పార్టీ వ్యవహరించిందనే అపప్రథను మూటగట్టుకున్నారు.

విచిత్రమేమంటే, ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ప్రజలు తనను రాజకీయాల్లోకి రమ్మని పిలిస్తే వచ్చానని లక్షలాది ప్రజల ముందు ప్రకటించిన చిరంజీవి, పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల సమస్యల పట్ల ఎంతమేరకు స్పందించారంటే జవాబు ఉండదు.. సిరిసిల్ల చేనేత కార్మికులను ఒకసారి, పోలేపల్లి సెజ్‌ బాధితుల దగ్గరకు మరోసారి వెళ్లటం తప్ప.. మరే ప్రజా సమస్యపైనా స్పందించలేదు.. ప్రజల్లోకి వెళ్లలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనూ చైతన్యరథం లాంటి ఓ వాహనం ఎక్కి అందులోంచి దిగనైనా దిగకుండా రోడ్డుషోలు నిర్వహించటం తప్ప గ్రామాల్లోకి వెళ్లిన దాఖలా ఒక్కటంటే ఒక్కటి కనిపించదు...

కనీసం ఫలితాల తరువాతైనా అసెంబ్లీలో చాలా హంబుల్‌గా వ్యవహరించటం, అతి మర్యాదలతో, ఎక్కడలేని ఔదార్యంతో మాట్లాడటం తప్ప, వాస్తవ సమస్యలపైన ఆయన తీవ్రంగా స్పందించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఒకే ఒక్కసారి కందిపప్పు ధరపైన ప్రజారాజ్యం చేసిన ధర్నాలో ఆయన పాల్గొని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కాసేపు కూర్చొని వచ్చారు. తరువాత మొన్న కరీంనగర్‌లో కరవుపై ధర్నా చేశారు. సంవత్సర కాలంలో పిఆర్‌పి ప్రత్యక్ష ప్రజాందోళనల్లో పాల్గొన్న సందర్భాలు ఈ రెండు మాత్రమే..... ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఇదేనా?
ఒక స్పష్టమైన విజన్‌ లేకుండా, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచగలుగుతామని చిరంజీవి ఎలా అనుకుంటున్నారో అర్థం కాదు.. ప్రజల్లో మమేకం అయి, ప్రజల్లో విశ్వాసం కలిగించగలిగినప్పుడు పార్టీ భవిష్యత్తు గురించి ఎవరికైనా ఎందుకు అనుమానం వస్తుంది? నాయకులు మూకుమ్మడిగా ఎందుకు వలసలు వెళ్తారు?
3
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా, ప్రజారాజ్యం పార్టీ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం... నాలుగు రోడ్ల కూడలిలో ఎటు వెళ్లాలో తెలియని పెద్ద అయోమయంలో పడిపోయింది. ఒక సినిమాటిక్‌గా ప్రారంభమైన ప్రజారాజ్యంలో కథను ముందుకు నడిపించాల్సిన బాధ్యత హీరోపైనే పడింది..
చిరంజీవి పార్టీ ఏర్పాటు చేయటమే సినిమాటిక్‌గా జరిగిపోయింది. ఒక సినిమాను ప్రారంభించే ముందు స్టోరీ డిస్కషన్‌‌స, ముహూర్తం.. ఆడియో రిలీజ్‌, సినిమా విడుదల, విజయోత్సవ ర్యాలీలు... వరుసగా జరిగినట్లే... ప్రజారాజ్యం కూడా ఓ మెగా సినిమా వ్యవహారంగానే తయారైంది. చిరంజీవి రాజకీయాల్లోకి రావటానికి ముందు అంతర్గత చర్చలు విస్తృతంగానే జరిగాయి. పార్టీ ఎలా ఉండాలి.. రూపు రేఖలు ఏమిటి? ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చాలా చర్చ జరిగింది. స్పార్‌‌క అని, వారధి అన్న పేరుతో మహామహులతో సంప్రతింపులు, చర్చల తరువాత స్టోరీ, స్క్రీన్‌ప్లే మిత్రా నాయకత్వంలో తయారైంది. తరువాత 2008 ఆగస్టు 17న చిరంజీవి నోట తొలి రాజకీయ పలుకులు జాలువారాయి. అది ప్రజారాజ్యానికి ఆడియో రిలీజ్‌....ఆగస్టు 26న అంగరంగవైభవంగా ప్రజారాజ్యం ఓ వన్‌మ్యాన్‌ షోగా విడుదలైంది. సినిమా విడుదల తరువాత విజయోత్సవ ర్యాలీలు జరిగినట్లే ప్రజారాజ్యం హీరోతో రోడ్‌షోలు నిర్వహించింది. తరువాత స్తబ్దంగా తయారైంది. ఫస్‌‌ట పార్‌‌ట అంతా బాగానే జరిగింది. కానీ, విశ్రాంతి తరువాతే... స్టోరీ అస్తవ్యస్తంగా మారిపోయింది. అంతకు ముందు వచ్చిన పాత్రలన్నీ ఒక్కటొక్కటిగా కనుమరుగయిపోతూ.. చివరకు ఒకేఒక్క పాత్ర మిగిలిపోయింది. మిగిలిన ఆ పాత్ర కథను ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి...

20, ఆగస్టు 2009, గురువారం

కాషాయంలో కల్లోలం

మనిషి రుచి మరిగిన పులి... అధికారం రుచి మరిగిన నాయకుడు వాటిని విడిచిపెట్టడం తట్టుకోలేరు. అవి లేకుండా జీవించలేరు.... దేశ రాజకీయాల్లో భారతీయ జనతాపార్టీ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. ఆరేళ్లు అధికారాన్ని అనుభవించిన కమలనాథులు, అధికారాన్ని కోల్పోయి అయిదేళు్ల కావస్తున్నా.... ఓటమి భారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. టాప్‌మోస్‌‌ట నాయకుల అంతర్గత కుము్మలాటల పుణ్యమా అని.. పార్టీని బలోపేతం చేయటం మాట దేవుడెరుగు... అసలు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ఓ పక్క వెంటాడుతున్న జిన్నా భూతం... ఇంకోపక్క సీనియర్‌ నేతల మధ్య పొసగని పొత్తు... మరోపక్క మాతృసంస్థ సంఘ్‌పరివార్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడి... వెరసి బిజెపి నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిమ్లాలో చింతన్‌ బైఠక్‌లో కూర్చొని చర్చలు జరుపుతున్నారే తప్ప, అంతర్గతంగా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో పార్టీ అధిష్ఠానానికి తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావటం లేదు. జిన్నాను పొగుడుకుంటూ ఓ పుస్తకాన్ని రచించిన సీనియర్‌ నేత జస్వంత్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించి వివాదానికి తాత్కాలికంగా తెరదింపారే కానీ, ఆ వివాదం కారణంగా పార్టీలో పుట్టిన ముసలం అంత తేలిగ్గా అంతమయ్యేట్లు కనిపించటం లేదు.

2004లో ఓటమిని భరించటమే కష్టమనుకుంటే వరుసగా రెండోసారి కూడా ఘోర పరాజయాన్ని చవిచూడటం.. తన నేతృత్వంలోని ఎన్‌డిఏ నిర్వీర్యం కావటం బిజెపికి మింగుడుపడటం లేదు. దీనికి తోడు రాజస్థాన్‌ సహా పలు రాషా్టల్ల్రో అధికారం కోల్పోవటం కూడా పార్టీ పరిస్థితికి దర్పణం పడుతోంది. ఈ విషయాన్ని బిజెపి నేతలే కాదు.. స్వయంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అధ్యక్షుడు మోహన్‌ భాగవత్‌ విస్పష్టంగా చెప్తున్నారు...

2004లో ఓడిపోయినప్పటి నుంచి ఏ దశలోనూ కోలుకోలేదు.. చాలా మంది నాయకులను కోల్పోయింది. ప్రమోద్‌మహాజన్‌, సాహిబ్‌సింగ్‌ వర్మ లాంటి వాళు్ల అకాల మృత్యువుపాలైతే.... ఉమాభారతి మొదలుగా ఒక్కో నేత బిజెపిని వీడిపోయారు. 2009లో పరిస్థితి ఇంకా దిగజారింది. యుపిఎ సర్కారుపై కొద్దో గొప్పో ఉన్న నెగెటివ్‌ ఓటు,,, ఆయా రాషా్టల్ల్రో బిజెపికి ఉన్న కొంత సానుకూల ఓటు వల్ల కొన్ని సీట్లు గెలిచారు తప్ప పార్టీ సొంతంగా సాధించింది ఏమీ లేదు. మొన్నటి ఎన్నికలకు ముందే అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల మధ్య ఘర్షణ పతాక స్థాయిలో జరిగింది. ఇక పలితాల తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఎన్నికల్లో ఎన్‌డిఏ ఖచ్చితంగా గెలిచితీరుతుందని, తాను ప్రధాని కావటం ఖాయమని గట్టిగా నమ్మిన అద్వానీ విశ్వాసం వమ్మయిపోయింది. అయినా అంతా కలిసి వృద్ద నేతను ప్రతిపక్షనేతగా కూర్చోబెట్టారు. యశ్వంత్‌సిన్హా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.. ఉత్తరాఖండ్‌లో బిసి ఖండూరీ అసమ్మతి బాట పట్టారు. అటు రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె జిన్నాపై జస్వంత్‌ రాసిన పుస్తకాన్ని బహిరంగంగానే సమర్థించారు..దీంతో ఆమెను రాజీనామా చేయాలని రాజ్‌నాథ్‌ కోరారు కూడా...

ఒకరి వెంట ఒకరుగా వెళ్లిపోయేవారే తప్ప పార్టీకి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకువచ్చే బాధ్యతను ఎవరూ నెత్తిన పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు.. గతంలో పార్టీ పదవుల కోసం ఆసక్తి చూపిన వారు కూడా మనకెందుకులే అని దూరం జరిగే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఏ పదవైనా కొరివి లాంటిదే.. కొరివితో తలగోక్కోవటం ఎవరికి మాత్రం ఇష్టం...? ఇప్పుడు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎంత తలలు పట్టుకున్నా కమలనాథుల బురల్రకు ఇంకా తట్టటం లేదు.. 2004 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన నాటి నుంచి ఎన్నో చింతన్‌ బైఠక్‌లు జరిగాయి. వాడిగా వేడిగా చర్చలూ జరిగాయి. అయినా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. దీనికి తోడు మహమ్మద్‌ అలీ జిన్నా అప్పుడప్పుడూ వచ్చి ముల్లుతో గుచ్చి వెళు్తంటాడు...

జిన్నా భూతం

అటు బిజెపిని జిన్నా భూతం నీడలా వెంటాడుతూనే ఉంది. నాలుగున్నరేళ్ల క్రితం అద్వానీ జిన్నా సమాధి దగ్గరకు వెళ్లి శ్రద్ధతో నివాళులు అర్పించి వస్తే... ఇప్పుడు జస్వంత్‌సింగ్‌ ఏకంగా జిన్నాను తెగ పొగిడేస్తూ ఏకంగా పుస్తకాన్ని రాసేశారు.. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన మొదటి ప్రధానిని నిందిస్తూ... జిన్నాను పొగిడేస్తూ జస్వంత్‌ రాసిన పుస్తకం బిజెపిని రాజకీయ అగాధంలోకి నెట్టేసింది.

2005లో అద్వానీ సృష్టించిన కలకలం నుంచి బిజెపి పూర్తిగా తేరుకోనే లేదు.. ఇప్పుడు జిన్నాను పొగిడేందుకు మరో మహానుభావుడు బిజెపిలో పుట్టుకొచ్చేశారు. సీనియర్‌ నాయకుడు జస్వంత్‌సింగ్‌, జిన్నాపై జిన్నాఇండియా.. దేశ విభజనస్వాతంత్య్రం అన్న పేరుతో జన్నా పుస్తకం రాసుకున్నారు. ఆగస్టు 17న దాన్ని ఆవిష్కరించేసుకున్నారు కూడా.. దీనికి బిజెపి నేతలెవరూ హాజరు కాలేదు. పాకిస్తాన్‌ అనుకూల వాదులు, సోకాల్‌‌డ సెక్యులరిస్టులమనుకునే వాళ్లే ఈ ఆవిష్కరణ సభకు హాజరయ్యారు... దేశవిభజనకు జిన్నా కంటే కాంగ్రెస్‌ నేతలే ప్రధాన కారకులన్న అర్థంలో ఆయన నెహ్రూను, ఇతర నేతలను నిందించటం వంటివి సృష్టించిన వివాదం బిజెపిని పూర్తి డిఫెన్‌‌సలో పడేసింది.
దీన్ని కాంగ్రెస్‌ రాజకీయంగా అందిపుచ్చుకుని అగ్గిరాజేసింది. పుస్తక ప్రతులను తగులబెట్టి ఆందోళనలు చేసింది.

2005లో ఎల్‌కె అద్వానీ పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లి తగుదునమ్మా అంటూ మహమ్మద్‌ అలీ జిన్నా సమాధిని సందర్శించి అక్కడ మోకరిల్లి, జిన్నాను పరమ లౌకిక వాదిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం కేంద్ర రాజకీయాల్లో రేపిన వివాదం అంతా ఇంతా కాదు.. మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అద్వానీని తప్పించాల్సిందేనని భీష్మించింది. చివరకు పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టేదాకా వదలలేదు. అంతేకాకుండా మహమ్మద్‌ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడైన వ్యక్తి అని బిజెపి ప్రత్యేకంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. ఈ వివాదం సమయంలో పూర్తిగా దగ్గర ఉండి చూసిన వ్యక్తి జస్వంత్‌.. నాడు అద్వానీతో రాయబారాలు నడిపిన నేత జస్వంత్‌... అప్పుడు పార్టీ తీర్మానం చేసినప్పుడు కూడా ఆమోదించిన నాయకుడు జస్వంత్‌... జిన్నాపై అప్పుడు లేని అభిప్రాయం.. ఇప్పుడెలా వచ్చింది? ఎవరికీ అర్థం కాని విషయం.. ప్రత్యేకించి బిజెపి వారికి గుబులు పుట్టించిన వ్యవహారం... జస్వంత్‌ పార్టీ బహిష్కరణతో జిన్నా భూతం బిజెపిని వీడుతుందా? మరెవరినైనా పట్టుకుంటుందా?

వై జిన్నా?
ఇప్పుడు జిన్నా అవసరం బిజెపి నేతలకు ఎందుకు వచ్చింది? నాడు అద్వానీ, నేడు జస్వంత్‌ ఉన్నట్టుండి జిన్నా మంత్రాన్ని పఠించటం వెనుక రాజకీయ ప్రయోజనం ఏదైనా ఉందా? లేక వూ్యహాత్మక తప్పిదం చేస్తున్నారా?

దేశ విభజన జరిగి అరవై మూడేళు్ల అయిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా దేశ విభజనకు కారకుడైన మహమ్మద్‌ అలీ జిన్నా బిజెపి నేతలకు ఎందుకు గుర్తుకు వస్తున్నాడు... ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది. జిన్నాను సొంతం చేసుకోవటం వల్ల బిజెపికి కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమైనా ఉందా? ముస్లింలలో తమ పట్ల సానుకూల వైఖరిని పెంచుతుందని ఆలోచిస్తున్నదా? తనపై ఉన్న మతతత్వ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నదా?
కానీ, బిజెపి మాత్రం ఆ దిశగా ప్రయోజనం పొందిన దాఖలా లేదు. ఎందుకంటే 2005లో అద్వానీ పాకిస్తాన్‌లో జిన్నా సమాధికి మోకరిల్లినప్పుడే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. తన పార్టీలోని నేతలే అద్వానీని వేలెత్తి చూపించారు. మాతృసంస్థ తీవ్రంగా మందలించింది. పార్టీపట్ల వ్యతిరేకతను తొలగించుకోవటానికి అద్వానీని అధ్యక్షపదవి నుంచి తొలగించారు. ఇప్పుడు జస్వంత్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. జిన్నా విషయం ప్రస్తావనకు వచ్చిన రెండుసార్లూ బిజెపి రక్షణాత్మక పరిస్థితిలో పడిందంటే... జిన్నాను సొంతం చేసుకోవటం దాని వల్ల కావటం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రజల్లో వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవటం కోసం అద్వానీ, జస్వంత్‌లు ఇలా చేశారా? కానీ అలా కూడా జరగలేదు. జిన్నాను ప్రశంసించటం వల్ల ఇద్దరి పరువు ప్రతిష్ఠలు మసకబారాయే కానీ, ఇనుమడించలేదు. పైగా పాకిస్తాన్‌కు భారత్‌పై విరుచుకుపడటానికి మరింత అవకాశం ఇచ్చినట్లయింది. అక్కడి మీడియా నాటి వ్యాఖ్యలకు, నేటి రాతలకు తెగ ప్రాధాన్యం ఇచ్చి రాసేశాయి. ప్రసారం చేసాయి.
నిజానికి దేశ విభజనకు సంబంధించి మొదట్నుంచీ బిజెపి నెహ్రూను టార్గెట్‌ చేసుకుంది. విభజనకు జిన్నా ఎంత బాధ్యుడో.. అంతకంటే ఎక్కువ బాధ్యుడు నెహ్రూ అన్నది బిజెపి వారి అభిప్రాయం... ఈ విషయంలో ఎన్నో వాదోపవాదాలు ఇంతకు ముందే జరిగాయి. వాస్తవానికి 1930వ దశకం వరకు సెక్యులర్‌ వాదిగా ఉన్న జిన్నా ఎందుకంత సడన్‌గా మతోన్మాదిగా మారాడన్న విషయంపైనా వివాదం ఉంది. జిన్నా అలా మారటం వెనుక కాంగ్రెస్‌ బాధ్యత ఎంత ఉన్నదన్న అంశమూ వివాదాస్పదమే. అంతా జరిగింది. కానీ, 60 ఏళ్ల తరువాత ఇప్పుడు నాటి కంపను కదిలించటం అవసరమా? దీనివల్ల బిజెపి నేతలు సాధించిందేమిటి? మరింత నైతికంగా దెబ్బ తినటం తప్ప. పైగా ఇప్పటి వరకు నెహ్రూకే బిజెపి వ్యతిరేకత పరిమితమైతే... ఇప్పుడు జస్వంత్‌ సర్దార్‌ పటేల్‌ను సైతం ఈ ముళ్లకంపలోకి లాగారు... సీనియర్‌ నాయకుల ఈరకమైన వివాదాస్పద ధోరణి దేనికి సంకేతం?

19, ఆగస్టు 2009, బుధవారం

శాంభవి ది లిటిల్ బుద్ధ

కర్నూలు జిల్లా లో సూర్యనందికి ఉన్నట్టుండి ప్రాధాన్యం వచ్చేసింది. వారణాసికి చెందిన ఓ ఏడేళ్ల చిన్నారి శాంభవి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తోంది. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా ఆమెను తన వారసురాలిగా ప్రకటించబోతున్నట్లు శాంభవి సంబంధీకులు ప్రచారం చేసేస్తున్నారు. పూర్వ జన్మలో దలైలామాకు తాను స్నేహితురాలినని చెప్పుకుంటున్న శాంభవి ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. చిన్నారి పిల్ల చేష్టలు చేస్తూనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తోంది. ఉత్తరాది అమ్మాయని ఆమె సంబంధీకులు చెప్తున్నా... తెలుగు చక్కగానే మాట్లాడుతోంది. చిన్న పిల్ల కాలజ్ఞానాన్ని బోధిస్తున్నదని జిల్లా అంతటా తెగ ప్రచారం కావటంతో తండోపతండాలుగా జనసంచారమూ మొదలైంది... తెల్లని బట్టలు వేసుకుని చిన్నారి బుద్ధగా కొప్పును తీర్చిదిద్దుకున్న శాంభవి తనదైన సై్టల్లో ప్రసంగించటం ప్రారంభించింది...

శాంభవిని దైవ స్వరూపంగా అమాయక జనం నమ్మటానికి ఎంతోకాలం పట్టలేదు. ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు...దీంతో కేర్‌టేకర్‌ ఉషారాణి ఆమెను రహస్యంగా ఆమెను తతరలించింది. ఇదేమని అంటే దలైలామా ఆదేశానుసారమే అలా చేశానని చెప్తోంది. వారణాసిలో ఆమె పేరెంట్‌‌స దగ్గరకు తరలిస్తున్నట్లూ వివరిస్తోంది...
శాంభవి చెప్తున్న దానిలో మరో ముఖ్యమైంది ఏమంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్లీ పుడుతున్నారని. ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతోందని ఆమె చెప్తోంది. 2012లో వీరబ్రహ్మేంద్రస్వామి తిరిగి జన్మించి దుష్టశిక్షణ చేస్తారట...
విచిత్రమేమంటే.. శాంభవిని చూసేందుకు వచ్చిన వారిలో ఎక్కువమంది భక్తి కంటే ఆసక్తితోనే రావటం విశేషం... తీరా వచ్చాక ఆమెను అజ్ఞాతంలోకి తరలించటంతో ప్రజల్లో చిన్నారి చెప్తున్న మాటల్లో విశ్వసనీయత ఎంత అంటే అనుమానాస్పదంగా మారింది.

ఇంతకీ ఈ బాలిక ఎవరు? కేర్‌టేకర్‌ ఉషారాణితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? శాంభవి ఏ ప్రాంతం నుంచి వచ్చింది.? తల్లిదండ్రులు ఎవరు... అన్నీ జవాబు లేని ప్రశ్నలే....
అసలు శాంభవి... ఓ మిస్టరీ.. సూర్యనంది క్షేత్రంలో ఈమె ఎవరికీ తెలియదు.. ఆ అమ్మాయితో పాటు కేర్‌టేకర్‌గా ఉన్న ఒకే ఒక మహిళ ఉషారాణి... శాంభవి గురించి ఉషారాణికి, ఉషారాణి గురించి శాంభవికి తప్ప వారి గురించి మూడో వ్యక్తికి తెలియదు.. శాంభవికి రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అడపా దడపా సూర్యనంది క్షేత్రానికి రావటం, అక్కడ కొన్నిరోజులు ఉండటం, తరువాత ఎక్కడికో వెళ్లిపోవటం రెగ్యులర్‌గా జరుగుతోంది... పదిహేను రోజులకు పైగా శాంభవి సూర్యనందిలో బసచేయటం ఇదే మొదటిసారి. శాంభవికి తాను తల్లిని కాదని, తాను కేవలం కేర్‌టేకర్‌నన్నది ఉషారాణి మాట. మరి తల్లిదండ్రులెవరన్నది చెప్పమంటే అదంతా సీక్రేట్‌... చైనా ప్రభుత్వం నుంచి శాంభవికి ముప్పు ఉంది కాబట్టి, గుట్టుగా ఉంచాలని దలైలామా ఆదేశించారట...
మరి ఉత్తరాది అమ్మాయి తెలుగు ఎలా మాట్లాడగలుగుతోంది.. అదీ ఓ మిస్టరీయే... ఆమె మొదటిసారి మహానందికి వచ్చినప్పుడు ఆమెకు హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చంట. అక్కడి నుంచి సూర్యనంది క్షేత్రంలో ప్రవేశించగానే తెలుగు అనర్గళంగా మాట్లాడటం మొదలు పెట్టిందట.
బౌద్ధమతం స్వీకరించకుండానే ఆమె బౌద్ధం గురించి మాట్లాడుతోంది. టిబెటన్లకు వచ్చే రెండేళ్లలో స్వేచ్ఛ లభిస్తుందనీ చెప్తోంది. 71 ఏళ్ల క్రితం దలైలామా తనకు స్నేహితుడని, హిమాచల్‌ ప్రదేశ్‌లో తామిద్దరం కలిసి ఉన్నామని శాంభవి చెప్తోంది. తన కోసమే డిసెంబర్‌ 21న దలైలామా సూర్యనందికి వస్తున్నట్లు కూడా ఆమె వివరిస్తోంది. వీటిలో వాస్తవం ఎంత అంటే ప్రశ్నార్థకమే...
దలైలామా రాక గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు బౌద్ధమత ప్రచారకులు లేఖ రాసిన మాట వాస్తవం. సూర్యనంది క్షేత్రం ప్రశస్తి గురించి శాంభవి, ఆమె పెద్దలు, ఇతరులు చెప్పిన వివరాల ప్రకారం ఆ క్షేత్రాన్ని సందర్శించేందుకు లామా వస్తున్నట్లు దలైలామా శిష్యులు చెప్తున్నారు. అంతమాత్రం చేత దలైలామా ఆమెను తన వారసురాలిగా ప్రకటించేస్తారని గుడ్డిగా నమ్మేదెలా?
శాంభవి, ఆమె కేర్‌టేకర్‌ చెప్పుకుంటున్నట్లు దలైలామా ఆ అమ్మాయిని తన వారసురాలిగా ప్రకటిస్తారన్న మాటలు వినటానికి బాగానే ఉంటాయి. కానీ, తమ మత గురువును ఎన్నుకోవటం అంత తేలికైన విషయమేం కాదు.. దానికి ఎన్నో కసరత్తులు ఉంటాయి. అవన్నీ తెలిసే శాంభవి కేర్‌టేకర్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారా? లేక వేరే మతలబు వేరే ఉందా?
***
లామా అంటే బౌద్ధమతాచార్యుడని సాధారణ అర్థం. పాశ్చాత్యులైతే హిస్‌ హోలీనెస్‌.. అని అంటుంటారు.. తమ గురువులు పునర్జన్మ ద్వారా మళ్లీ పుడతారని బౌద్ధ మతస్థులు విశ్వసిస్తారు.. ఆ ప్రకారంగానే ఒక లామా నిర్యాణానంతరం మరో లామాకోసం అన్వేషిస్తారు.. పునర్జన్మను పూర్తిగా విశ్వసించేవారిలో బౌద్ధ మతస్థులు ముఖ్యులు..టిబెటన్ల విశ్వాసం ప్రకారం మళ్లీ జన్మించిన తమ ఆచార్యుణ్ణి కనుక్కునేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి రెండుమూడేళ్లకు తక్కువేం కాదు...
టిబెట్‌ స్థానిక రాజకీయ సంస్థలు, బౌద్ధారామాలు కలిసి ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటాయి. కొంతమంది ఎంపిక చేసిన బౌద్ధ మతగురువులు కలిసి లామా అన్వేషణలో పాలుపంచుకుంటారు. ఇప్పటివరకు పధ్నాలుగు మంది లామాలు వచ్చారు. ప్రస్తుతం ఉన్న దలైలామా 15వ మత గురువు. ఈ దలైలామా ఎన్నికకు మూడు సంవత్సరాలు పట్టింది. లామా ఫలానా దేశంలోనే పుట్టాలన్న నియమం ఏమీ లేదు. కానీ, ఒక్క మూడో మతగురువైన తుల్కు మంగోలియాలో పుట్టినప్పటికీ, మిగతా వారంతా టిబెటన్లే కావటం విశేషం. పైగా చైనా ఆధిపత్యంలో నడిచే ఏ దేశంలోనూ లామాలు పునర్జన్మించరన్న నమ్మకమూ టిబెటన్లకు ఉంది. టిబెటన్లను చైనా మోసం చేసి దురాక్రమించటం ఈ నమ్మకానికి ప్రధానకారణం..
ఇంత తతంగం ఒక లామాను ఎన్నుకునేందుకు జరుగుతుంటే... దాన్నంతటినీ కాదని శాంభవిని ఎంపిక చేస్తారని ఎవరైనా ఎలా ఊహిస్తారు.? నమ్మటానికి ఎంతమాత్రం హేతువు లేని పరిస్థితి ఇది. ఆమె బౌద్ధ మతస్థురాలు కాదు.. బౌద్ధమతం స్వీకరించలేదు. కానీ, టిబెటన్లంటే ఇష్టపడుతోంది. టిబెట్‌కు రానున్న రెండేళ్లలో స్వతంత్రం వస్తున్నదని చెప్తోంది. భారత్‌లోనే ఉంటానంటోంది. బౌద్ధిజాన్ని అనుసరిస్తానంటోంది. లామాకు వారసురాలవుతుందని ఆమె సంబంధీకులు చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్కదానికీ మరోదానితో పొంతన లేదు. అలాంటప్పుడు ఈ రకమైన ప్రచారానికి అర్థం లేదు.
ఇందులో మరేదైనా మతలబు ఉందేమోనని అనుమానించేవాళూ్ల లేకపోలేదు. ఎందుకంటే సూర్యనంది క్షేత్రం పూర్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ దేవాలయ భూములు అనేకం ఉన్నాయి. డిసెంబర్‌ 21న దలైలామా సూర్యనందికి వచ్చినప్పుడు బౌద్ధారామానికి శంఖుస్థాపన చేస్తారని చెప్తున్నారు. ఆ భూమి దేవాఆలయ భూమిగా చెప్పుకుంటన్నారు. శాంభవి గురించిన పూర్తి సమాచారం తెలిస్తే తప్ప వాస్తవాలు వెలుగుచూడవు.

16, ఆగస్టు 2009, ఆదివారం

బాద్షా బద్‌నామ్‌


బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ఖాన్‌కు అమెరికా విమానాశ్రయంలో అవమానం జరిగిందిట... దేశమంతటా ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వార్త... గతంలో జార్జి ఫెర్నాండెజ్‌... మొన్నటికి మొన్న అబ్దుల్‌కలాం... ఇవాళ షారూఖ్‌... ఇలా మినహాయింపులకు అతీతంగా ప్రపంచ పోలీసు దాష్టీకం భారత ప్రముఖుల పట్ల తరచూ జరుగుతున్న వ్యవహారమే.. రాష్టప్రతి స్థాయి వ్యక్తికే అవమానం తప్పనప్పుడు సినీ ప్రముఖుల గురించి మాట్లాడేదేముందని ఎప్పటిలాగే ఊరుకోవలసిందేనా? ఈ అవమానాలు భరించటం ఇంకెన్నాళు్ల?
జార్జి ఫెర్నాండెజ్‌, అబ్దుల్‌కలాం... ఇప్పుడు షారూఖ్‌... అగ్రరాజ్యం అమెరికా దురహంకారానికి బలైన సమిధలు.. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ఈ బాలీవుడ్‌ స్టార్‌ను రెండుగంటల పాటు విమానాశ్రయంలో కూర్చోపెడితే అడిగే దిక్కులేదు.. ఎందుకు ఆపారని అడిగితే.. పేరు చివర ఖాన్‌ అని ఉండటమేనట.... పెద్దన అత్తపెత్తనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

అమెరికాకు సేవ చేసి నాలుగు రాళు్ల సంపాదించుకుందామని అక్కడికి వెళ్లిన మనవాళు్ల... ఏదో స్వాతంత్య్రదినోత్సవం జరుపుకుందాం రమ్మని బాలీవుడ్‌ బాద్షాను పిలిపించారట... వాళు్ల పిలవగానే సంబరంగా సంబరాలు జరుపుదామని షారూక్‌ న్యూయార్‌‌క వెళ్లాడు.. న్యూయార్‌‌కలో నేవార్‌‌క అనే పేరుతో ఓ విమానాశ్రయం ఉంది. ఖాన్‌గారు వెళ్లిన విమానం అక్కడ ల్యాండ్‌ అయింది. పాపం బాద్షా తనకు గొప్ప స్వాగత సత్కారాలు లభిస్తాయని ఊహించుకుంటూ విమానం దిగారు.. దిగీ దిగగానే ఆయనకు ముందుగా దర్శనమిచ్చింది తనను పిలిచిన భారతీయులు కారు.. తనను అనుమానంతో బంధించేందుకు వచ్చిన అమెరికా పోలీసులు... విమానం దిగగానే షారూఖ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు... ఫోన్‌ లాగేసుకున్నారు.. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం ఖాన్‌ది.. తనను ఎందుకు నిర్బంధిస్తున్నారని అడిగితే... పోలీసులు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? నీ పేరు చివరలో ఖాన్‌ అన్న పదం ఉంది కాబట్టి... నువ్వు టెరర్రిస్టువన్న అనుమానంతో పట్టుకున్నాం..... నవ్వాలో.. ఏడవాలో తెలియని జవాబు ఇది... టెరర్రిస్టుల్లో చాలామంది పేర్ల చివరలో ఖాన్‌ అన్న మాట వస్తుందట... షారూక్‌ ఖాన్‌ పేరులోనూ ఆ పదం ఉంది కాబట్టి ఆయన్ను పట్టుకున్నారన్నది పోలీసుల వివరణ... తాను బాలీవుడ్‌ నటుణ్ణని... ఫలానా పని మీద మీ దేశానికి వచ్చానని నెత్తీనోరూ బాదుకున్నా, బాద్షా మాట వినేదెవరు? రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. చివరకు ఓ గంట పాటు ప్రాధేయపడ్డతరువాత ఫోన్‌చేసుకోవటానికి వారు కనికరించారు. ఆయన ఎంపి రాజీవ్‌ శుక్లాకు ఫోన్‌ చేసి తన గోడు వెళ్లబోసుకున్న తరువాత, శుక్లా పరిస్థితిని చక్కదిద్దడంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. షారూక్‌ బతుకుజీవుడా అని బయటపడ్డాడు...
ప్రపంచ బాస్‌ తన విమానాశ్రయాల్లో, ఎయిర్‌లైన్‌‌సల్లో మన వాళ్లను పరీక్షించకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, తనిఖీ చేస్తే ఆశ్చర్యమేముంది? 2001 సెప్టెంబర్‌ 11న ప్రపంచ వాణిజ్య భవన సముదాయంపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచీ అమెరికా పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. దేశంలో ఉంటున్న ముస్లింలకు ఇప్పటికే భద్రత కరవైంది. చీమ చిటుక్కుమన్నా భారత్‌ పాక్‌ పౌరులను అనుమానించే పరిస్థితి తలెత్తింది. దీని పర్యవసానమే.....భారత్‌ నుంచి వస్తున్న వారు ఎవరు, ఏమిటి అని చూడకుండా , విఐపిలను సైతం గుర్తించకుండా వారిపట్ల కించిత్‌ గౌరవం లేకుండా ప్రవర్తించటం పరిపాటిగా మారిపోయింది. 2002లో రక్షణ మంత్రిగా ఉన్న జార్జి ఫెర్నాండెజ్‌ అమెరికాకు అధికార పర్యటన పైనే వెళ్లారు.. సార్వభౌమాధికారం కలిగిన ఒక దేశ రక్షణ మంత్రి అధికారికంగా పర్యటనకు వస్తున్నప్పుడు అక్కడి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉంటుంది. పూర్తి సమాచారంతో దై్వపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు వచ్చిన భారత సీనియర్‌ నాయకుణ్ణి డల్లాస్‌ విమానాశ్రయంలో చేతులు పైకి లేపి విచక్షణ లేకుండా పరీక్షించి మరీ విడిచిపెట్టారు. 2003లో బ్రెజిల్‌కు వెళూ్త మధ్యలో ఆగినప్పుడు కూడా ఆయన్ను చెక్‌ చేశారు.. పాపం పెద్దమనిషి అవమానంగా భావించి చాలాకాలం పాటు ఈ విషయాల్ని బయటకు చెప్పలేదు. 2004లో అమెరికా విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి స్ట్రాబ్‌ టాల్‌బోట్‌ ఓ పుస్తకంలో రాసిన తరువాత కానీ బయటపడలేదు. అప్పటి వాజపేయి సర్కారు ఈ విషయంలో అమెరికాను పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయింది.
ఇక మొన్నటికి మొన్న మాజీ రాష్టప్రతి అబ్దుల్‌ కలాంకు మన దేశంలోనే, మన విమానాశ్రయంలోనే మన గడ్డపై పరాయి విమాన సంస్థ అమెరికా ఎయిర్‌లైన్‌‌స చెకింగ్‌ చేయ సాహసించటం క్షంతవ్యం కాదు.. ఈ ఏప్రిల్‌లోనే ఇది జరిగింది. కానీ మన్మోహన్‌ సర్కారుకు ఇది అవమానంగా తోచలేదు. అమెరికాలో పరీక్షించారంటే ఏదో అనుకోవచ్చు. కానీ మన గడ్డపై మన భారతరత్నాన్ని అనుమానించటాన్ని సింగ్‌ సర్కారు ఎలా భరించిందో, సహించిందో ఎంతమాత్రం అర్థం కాదు.. 2005 జనవరి 18న వైట్‌హౌస్‌లో సింగ్‌జీకి బుష్‌ సర్కారు ఎరత్రివాచీ పరచి స్వాగతించగానే, కౌగిలించుకోగానే... సింగ్‌ హృదయం మహా విశాలమైపోయింది. అప్పటి నుంచి దొరవారు చెప్పిందే వేదంగా మారిపోయింది. అణుఒప్పందంపై సంతకం పెట్టమనగానే పెట్టేశారు.. వైట్‌హౌస్‌ను విమర్శించేవారిపై విరుచుకుపడుతున్నారు. ఇక అమెరికా ఎవరికి అవమానం చేస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు.. షారూఖ్‌ఖాన్‌ అయితే ఏం.... అబ్దుల్‌ కలాం అయితేనేం... నిలదీసే సమర్థులు లేనప్పుడు ప్రపంచ పోలీసు తన దాష్టీకాన్ని చెలాయిస్తూనే ఉంటుంది.....

13, ఆగస్టు 2009, గురువారం

జీవని గురించి ...

************************************************************************
DO NOT WAIT FOR LEADERS; DO IT ALONE , PERSON TO PERSON
- MOTHER TERESA

***********************************************************
పాఠశాలలో ఇంటెర్వల్ సమయం...
నేను పేపర్ చూస్తున్నాను ...
" సార్ సార్ నీలిమ దగ్గర చూడండి యాభై రూపాయలు ఉన్నాయ్..." గోల చేస్తూ అన్నారు మిగతా పిల్లలు.
నేను తలెత్తి చూసాను.
ఆ అమ్మాయి నవ్వుతూ యాభై రూపాయలు చూపింది.
" పొద్దున్న వాళ్ల అమ్మా నాన్న చూడటానికి వచ్చారు. డబ్బులు , తినడానికి కజ్జికాయలు నిప్పట్లు ఇచ్చిపోయారు " మౌనిక చెప్పింది.
ఆ పిల్లలందరూ ప్రభుత్వ హాస్టల్లో ఉంటారు.
" సార్ నీలిమ వాళ్ల అమ్మా నాన్నలను చూసి కమల తన అమ్మ నాన్న వచ్చారని చెప్పింది " నవ్వుతు అంది రాజి.
" కమల ఎప్పుడు అంతే సార్ ఎవరి అమ్మా నాన్న వచ్చినా తన అమ్మా నాన్న వచ్చారని చెప్తుంది. హాస్టల్ ఆవరణలో ఎగురుతూ ఆనందిస్తుంది " తమాషాగానవ్వుతూ చెప్పింది మౌనిక.
నాకు అర్థం కాక " ఎందుకు ? " అని అడిగాను.
" కమలకు ఎవరు లేరు కదా సార్. రెండేళ్ళ కిందట హాస్టల్లో ఎవరో వదలి పెట్టిపోయారట " చెప్పింది రాజి.
నా మనసును పిండినట్లు అయింది. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు పూడుకుపోయింది...
కమల వైపు చూసాను. అమాయకంగా మొహం పెట్టింది. తన చర్యను నేను తప్పు పడతానేమో అన్న ఫీలింగ్ కన్పిస్తోంది.
నేను కమలను దగ్గరికి పిలిచాను. ధైర్యం ఇచ్చేలా వెన్ను తట్టాను.
" పిల్లలు ఇక ఎపుడూ అలా అనకండి. కమలకు మనం అందరం ఉన్నాం. అవునా ?" అన్నాను.
అందరూ తలూపారు.
********************************************************************************
ఆ విధంగా జీవని పురుడు పోసుకుంది.


జీవని ఒక స్వస్చంద సంస్థ. అనంతపురం ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది.
అనాధ పిల్లలను ( అనాధ అనే పదాన్ని ఇక నుంచి పిల్లలుగా వ్యవహరిద్దాం ) జన జీవన స్రవంతి లోకి తీసుకురావడం. వారికంటూ కొందరు ఈ ప్రపంచంలో ఉన్నారని వారికి చేయూతనివ్వడం, ఆత్మ స్థైర్యాన్ని కల్పించడం ప్రధాన ఉద్దేశ్యాలు.
పని చెసే విధానం... ఒక అమ్మాయిని / అబ్బాయిని ఎంపిక చేసుకున్నాక ఆరుగురు దాతలను సంప్రదిస్తాము. వారు నెలకు వంద రూపాయలు చొప్పున ఇస్తారు. దీన్ని పిల్లల కోసం ఖర్చుపెట్టడం జరుగుతుంది.
ఐతే ప్రతి దాతను సంస్థ ఒక చిన్న విన్నపాన్ని అంగీకరించ వలసిందిగా కోరుతుంది.
అది... ప్రతి దాత తానూ స్పాన్సర్ చేస్తున్న పాప / బాబును ఆరు నెలలకు ఒకసారి వారిని చూసి పలకరించి రావాలి. ఇది నిబంధన కాదు... పిల్లల తరఫున అభ్యర్థన మాత్రమె.
మిత్రులారా ఆ విధంగా ప్రతి నెల ఎవరో ఒకరు వారిని కలుస్తారు. మన దగ్గరి వారిని రెండు రోజులు చుడకపోతేనే ఏదోలా ఫీలయే మనం... ఒకసారి వారి పరిస్థితిని ఊహిస్తె హృదయం ద్రవించి పోతుంది. వారిని సమాజంలో భాగస్వాములను చేయడం సంస్థ ఉద్దేశ్యం.
వంద రూపాయల పథకం ఎందుకంటే... దాత మీద బాధ్యత పెట్టడానికి... ఇలాంటి పిల్లలను పలకరించాలని చాలా మందికి ఉంటుంది. ఐతే ఈ బాధ్యత కూడా వారి మీద ఉంటే తమ డబ్బులు ఎంత మాత్రం సద్వినియోగం అవుతున్నాయో చూద్దాం అనుకోవచ్చు... తమ ద్వారా లబ్ది పొందుతున్న పిల్లలను ఒక సారి చూద్దాం అనుకోవచ్చు... ఏది ఏమైనా ఆ పిల్లలలో మానవ సంబంధాలు పెంపొందించడం మన లక్ష్యం.

Join hands with...

JEEVANI
......FOR UNCARED.



12, ఆగస్టు 2009, బుధవారం

అజ్ఞాత తిమిర హరణార్థం

ఖగోళ శాస్త్రంతో సునామీకి సంబంధాలు ఉన్నాయని నేను ఎక్కడా తేల్చ లేదు.. ఖగోళ పండితులు అంటున్నారని మాత్రమే చెప్పాను..వాటివల్లే సునామీ వచ్చేస్తోందని కానీ, వచ్చిందని కానీ, దానికి భౌతిక, ఆధ్యాత్మిక కారణాలతో సంబంధాలు ఉన్నాయని కానీ ఎక్కడా నేను రాయలేదు.. వాతావరణ నిపుణులు ఆసియా లోని సునామీ బాధిత దేశాలన్నింటిలో చాలా స్పష్టంగా సునామీ హెచ్చరికలు చేసిన మాట వాస్తవం. అందుకు సాక్ష్యంగా సముద్రంలో అలలు అల్లకల్లోలం అవటమూ వాస్తవమే... ఈ నేపథ్యంలోనే సునామీ వచ్చే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో రాసిన వ్యాసం ఇది.

వాతావరణ నిపుణులు హెచ్చరిక చేసిన తరువాత దాని గురించి ప్రజలకు తెలియజేయటం ఏ జర్నలిస్టు అయినా చేసే ప్రాథమిక పని. ఆ తరువాత వాళు్ల హెచ్చరికలు ఉపసంహరించుకున్న తరువాత ఆ విషయాన్నీ తెలియజెప్పటం అతని విధి. ఈ నేపథ్యంలోనే సముద్ర తీర ప్రాంతాల్లోనే ప్రధానంగా భూమి కంపించటంతో అది సునామీయేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని మొదటే స్పష్టంగా చెప్పాను.. ఆ తరువాత సునామీ ఎలా సంభవిస్తుందీ, సాంకేతిక కారణాలను సవివరంగా విశ్లేషించా.. చివరలో ఈ ప్రాంతంలోని ఖగోళ పండితులు కానీ, జ్యోతిష్యులు కానీ చేస్తున్న వాదనలను, వారు చూపించిన ఉదాహరణలను ప్రస్తావించాను. అవి వారి అభిప్రాయాలు.... నావి కావు..
జర్నలిజం అంటే సొంత అభిప్రాయాలు కలగలిసి చెప్పటం కాదు.. ప్రజలను భయపెట్టడం కాదు.. ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించి వివిధ మార్గాల నుంచి, వర్గాల నుంచి జరుగుతున్న చర్చను, వాదనలను ప్రజల ముందు ఉంచటం వరకే జర్నలిస్టు పని. జర్నలిజం అంటే కేవలం ఒక సమాచార వారధి మాత్రమే. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి అనేకం ఉండవచ్చు. అవి వృత్తిలో ప్రతిఫలించవు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవటానికి వ్యాసాలు రాసుకుంటారు. తెలియని విషయాలేవైనా ఉంటే తెలుసుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అజ్ఞాత గారు రాసినట్లు ద్వారక విషయంలో అప్పుడే అన్న ఒక్క మాట అచ్చుతప్పుగా వచ్చింది. దానికి ఆయన అంతగా రెచ్చిపోవలసిన అవసరం లేదనుకుంటా... గ్రహణాల గురించి రాయగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయి పిచ్చి రాతలురాస్తున్నారని, రాసిన వాడు ఏమీ తెలియని మూర్ఖుడన్నట్లుగా, నోరుమూసుకుని కూర్చోమని నోటికి ఏ మాట వస్తే ఆ మాట, మనసుకు ఏ అక్షరం తోస్తే ఆ అక్షరాన్ని అడ్డగోలుగా అడ్డు ఆపు లేకుండా నిర్లజ్జగా తోచిన మాటలు రాయటం వల్ల ఒరిగేదేం లేదు..
ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం పిచ్చిరాత అంటే వాళ్ల అజ్ఞానానికి సానుభూతి వ్యక్తం చేయటం తప్ప ఏమీ చేయలేం..... 2012లో ప్రళయం వస్తుందని సోకాల్‌‌డ అమెరికన్‌ మహాపురుషులు (అజ్ఞాత లాంటి వారికి వారే దేవుళ్లలాగా కనిపిస్తారేమో.. నాకు తెలియదు... తెలుసుకోవటానికి ఇబ్బంది లేదు.. ) సినిమాలు తీసి, ఇంటర్నెట్లలో రాస్తే అది పిచ్చి కాదు.. జనాల్ని భయపెట్టినట్లు ఎంతమాత్రం కాదు... నోస్టర్‌ డామస్‌ చెప్పాడనో... బైబిల్‌లో రాసి ఉందనో చెప్తే ఓహో అంటారు... అది పిచ్చి ఎంతమాత్రం కాదు.. అదేమో విజ్ఞానం.. మొన్నటికి మొన్న 2008 సెప్టెంబర్‌ 10న జనీవాలో లార్‌‌జ హాడ్రన్‌ కొలై్లడర్‌లో ప్రోటాన్‌ బీమ్‌ను సర్కు్యలేట్‌ చేసినప్పుడు బ్లాక్‌ హోల్‌‌స పెద్దగా అయిపోయి ఇక ప్రపంచమే నాశనమై పోతుందని పాశ్చాత్యమీడియా నెత్తిమీద నోరు పెట్టుకుని అరిచినప్పుడు అవి ప్రపంచ ప్రజలను భయపెట్టినట్లు కాదు!.. వాళ్లవి పిచ్చిరాతలు ఎంతమాత్రం కావు.! . ప్రపంచం ఎండ్‌ అవుతోందని.. ఆ తరువాత ఏదో అయిపోతోందని తమకున్న పైత్యాన్నంతా కుమ్మరించి హై ఇన్ఫెక్టెడ్‌ మీడియా అయిన సినిమాలో చూపిస్తే చూడవచ్చు. ఆహా... ఓహో అని మీడియాలో చర్చ జరిగితే గుడ్లప్పగించి చూడవచ్చు.! ఇక్కడ గ్రహణాలు వస్తే ఏదో జరిగిపోతుందని ఇక్కడి జ్యోతిష్యులు విశ్వసిస్తున్నారయ్యా.. ఇందుకు వాళు్ల ఉదాహరణలుగా ఇవన్నీ చూపిస్తున్నారు.. అనీ అనగానే ప్రజలంతా బెంబేలెత్తిపోయి... తట్టాబుట్టా సర్దుకుని పారిపోతారు.. అలాంటి రాతలు వీరి దృష్టిలో ఎల్లో జర్నలిజం అవుతుంది!? నోస్టర్‌ డామస్‌ గొప్ప జ్యోతిష్యుడు... భారతీయ జ్యోతిష్యశాస్త్రం మాత్రం వీరి దృష్టిలో పెద్ద ఫేక్‌..!
రోదసిలో చోటు చేసుకునే ఏ పరిణామమైనా దాని ప్రభావం అనుకూలంగానో, ప్రతికూలంగానో భూమిపై కనిపిస్తుందని ప్రపంచ బాస్‌ నిర్వహిస్తున్న నాసాయే పలుమార్లు చెప్పింది. ఈ దేశంలో విలసిల్లిన శాసా్తల్రన్నీ చాలాకాలం నుంచీ ఈ విషయాలను కుండబద్దలు కొడ్తున్నాయి. ఈ గ్రహణాలు అనేవి కూడా రోదసిలో ఏర్పడేవే... వాటివల్ల ప్రభావం ఉంటుందా లేదా అన్నది తరువాత విషయం. కానీ, ఈ గ్రహణాల వల్ల ఏదో జరుగుతుందని ఇక్కడి జ్యోతిష్కులు చెప్తున్నారు. వారి మాటల్ని విశ్వసిస్తే విశ్వసించండి.. లేకపోతే లేదు.. విశ్వసించినా.. విశ్వసించకపోయినా... ప్రాకృతిక పరిణామాలను ఎవరూ నిలువరించలేరు.. మొట్టమొదలు రచయిత ఏం రాశాడు.. అతని ఉద్దేశం ఏమిటని చదవాలి. చాలా స్పష్టం.. గ్రహణాల వల్ల సునామీ వస్తున్నదనీ కూడా రాయలేదు. నేనేం రాశానో సరిగ్గా చదవకుండా ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేయటం వారి విజ్ఞతకు, విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి, ఆధునిక నాగరిక సమాజ ప్రతినిథిత్వానికి నిదర్శనం.. ఇక చివరగా ఒక చిన్న విన్నపం... అజ్ఞాత ఎవరో తెలియదు.. తెలియని విషయాలను తెలుసుకొమ్మని వారు సూచించారు. చాలా గొప్ప విషయాన్ని వారు నాకు తెలియజెప్పారు.. అంత గొప్ప సూత్రాన్ని సూచించిన సహృదయుల గురించి ముందుగా తెలుసుకోవటం అవసరమని ఈ అజ్ఞాని భావిస్తున్నాడు. ఆయనెవరో చెప్తే ధన్యుణ్ణి... వారు చేసిన విమర్శకు.. అది ఎలాంటిదైనా కృతజ్ఞుణ్ణి.. మినర్వాగారికి ధన్యవాదాలు.

11, ఆగస్టు 2009, మంగళవారం

సునామీ మళ్లీ పడగ విప్పుతోందా?


సునామీ మళ్లీ పడగ విప్పుతోందా? వాతావరణంలో అనూహ్యమైన మార్పులు మళ్లీ సునామీ రాకను సూచిస్తున్నాయా? తూర్పు తీరంలోని పలు ప్రాంతాలు భూ ప్రకంపనలతో అల్లాడిపోతున్నాయి. ప్రశాంతంగా ఉన్న సముద్రంపై అలలు సాధారణస్థాయిని మించి ఎగిసిపడటం ముంచుకొస్తున్న ముప్పుకు సంకేత మంటున్నారు నిపుణులు... ప్రజలకు వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్న సునామీపై విశ్లేషణ,.....
సునామీ పెనుభూతం దేశాన్ని మరోసారి కము్మకుంటూ వస్తోంది. వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులు సముద్ర గర్భంలో భూప్రకంనలకు కారణమవుతోంది. ఈ తెల్లవారుజామున ఆసియాలోని పలు సముద్రతీర ప్రాంతాలను ఒక్కసారిగా భూమి వణికించింది. ఈ పరిణామం దేనికి సంకేతం? మరో మహా ప్రళయం సముద్ర తీరాన్ని ముంచెత్తనుందా?

మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్ర గర్భం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోస్తాంధ్రతీరంలో విశాఖ పట్నం నుంచి గోదావరి జిల్లాలతో మీదుగా నెల్లూరు వరకు అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున మంచి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాళ్ల కింద భూమి కదలటంతో పిల్లాపాపల్ని వెంటేసుకుని బయటకు పరుగులు తీసారు.. పది నిమిషాల పాటు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి.. ఇంతలోనే వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేయటం వెన్నుపూసల్లో చలి పుట్టించింది.

సాధారణంగా భూమి కంపించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది... కానీ, సముద్ర తీరం కావటం, సముద్రం అల్లకల్లోలం కావటంతో ఆందోళన తీవ్రమైంది. దీనికి తోడు ఆసియాలోని పలు ప్రాంతాలు ఇండోనేషియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లలో సైతం తీవ్రస్థాయిలో భూకంపం వచ్చిందన్న వార్తలు మరింత ఆందోళనకు కారణమైంది.
కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సునామీ గురించి ఏమీ తెలియదు.. సాధారణంగా వేటకు బయలు దేరిన జాలరులు సముద్రం ఉగ్రరూపం చూసి భయంతో వెనక్కి మళ్లారు. అప్పటికీ ఒక జాలరి గల్లంతయ్యారు. సముద్రంపైనే ఆధారపడి జీవించే వారికి ఈ పూట అన్నం కరవయ్యే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నానికి సముద్రుడు కొంత శాంతించినట్లు కనిపించినా, అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నా, తీర ప్రాంత ప్రజల్లో గుబులు తగ్గలేదు. వెన్నులో వణుకు చల్లారలేదు....
2
సునామీ అంటే ఎందుకింత భయం? ప్రకృతి విపత్తులు ప్రజలకు కొత్తేం కాదు.. భూకంపాలు, తుపానులు గతంలో అంతా చూసినవే.. సముద్రంలో ఉప్పెనల విపత్కరాన్ని కూడా అనుభవించిన వారే.. కానీ, సునామీ అంటే మాత్రం వీటన్నింటికంటే భయం కలుగుతుంది. ఎందుకు? అది మహా ప్రళయం కాబట్టి.. కనీవినీ ఎరుగని విలయం సృష్టిస్తుంది కాబట్టి....

2004లో డిసెంబర్‌ 26... తెల్లతెల్లవారుతున్న సమయం... ఉషోదయ వేళ ఉప్పెన ముంచుకొచ్చింది. భారత్‌కు ఎంతో దూరంలో ఉన్న ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన సునామీ, భారత్‌ అంచులను తాకి ప్రళయమే సృష్టించింది. సముద్రగర్భంలో భూమి కంపించిన తీవ్రతకు సాగర జలాలు తీరప్రాంతాన్ని నిలువునా ముంచేశాయి.
ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే దాదాపు మూడు లక్షల మంది విగత జీవులయ్యారు.. ఇవి కేవలం అధికారిక లెక్కలే... వేలాది శవాలు గుర్తింపునకు నోచుకోక సముద్రంలో కలిసిపోయాయి. అనధికార అంచనాల ప్రకారం ఈ సునామీ పది లక్షల మందిని మింగేసింది.

అప్పటి వరకు మనకు సునామీ గురించి పెద్దగా తెలియదు.. పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతాలకే సునామీ అనుభవం ఉంది. అందుకే కరేబియన్‌ దీవుల్లో హొనలులు ప్రాంతంలో సునామీ హెచ్చరికల కేంద్రం అన్నది ఒకటుందని వినటమే కానీ, కన్నది లేదు. జపాన్‌ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ సునామీ వచ్చేది. కానీ, హిందూ మహాసముద్రానికి, బంగాళాఖాతానికి సునామీ అనుభవం ఎంతమాత్రం లేదు. ఇంతకు ముందు ఎలాగూ జరగలేదు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవాలన్న ఆలోచనా ఎవరికీ రాలేదు.. ఇంతకీ సునామీ అంటే ఏమిటి? ఇది ఎలా సంభవిస్తుంది?

ప్రాథమికంగా సునామీ అంటే సముద్ర భూకంపం. సముద్రం అట్టడుగున ఉన్న భూమి తీవ్రంగా కంపించి చీలిపోయినప్పుడు సునామీ ఏర్పడుతుంది. అంటే సాగర గర్భంలోని భూమి పొరలు చీలిపోయినప్పుడు ఆ చీలిక తీవ్రతకు సాగర జలాల అలల పోటు లెక్కలేనన్ని రెట్లు అధికమవుతుంది. భూప్రకంపనల చీలికను సముద్రపు అలలు మరింత విస్తృతం చేస్తూ అతి వేగంగా ప్రయాణిస్తాయి. అలల ప్రయాణం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది. వీటి ప్రభావం సముద్రపు ఉపరితలంపై అనూహ్యమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. తుపాను, ఉప్పెనలను మించిన ఉపద్రవం సంభవిస్తుంది. దాదాపు 400 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అలలు దరిదాపుల్లో ఉన్న తీరాన్నంతటినీ తమ గర్భంలో లిప్తపాటులో కలిపేసుకుంటాయి.2004 డిసెంబర్‌ 26 ఈ మహా ప్రళయానికి మచ్చుతునక...

గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 సునామీలు సంభవించాయి.
వీటిలో 1960లో వాల్దీవియా, 1964లో అలాస్కా, 2004లో హిందూ మహాసముద్రంలో జరిగిన సునామీలు అతి తీవ్రమైనవి.
మామూలుగా భూ ఉపరితలంపై సంభవించే భూకంపాలకంటే సముద్ర గర్భంలో ఏర్పడే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకంపనల వల్ల సముద్రం ప్రకోపించటానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు మళ్లీ సంభవిస్తే.. దాని పర్యవసానాలు ఊహించటానికే భయమేస్తుంది. సునామీ రాకను కనిపెట్టేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కానీ, దాన్ని నివారించటం మానవ సాధ్యం కాదనేది నిష్ఠుర సత్యం. కనీసం ముందుగానే గ్రహించగలిగితే కొంత నష్టనివారణైనా చేయవచ్చు. కానీ, అది సాధ్యమా?
3
సునామీ ప్రకృతి విపత్కరమేనా? లేక ఖగోళ శాస్త్రంతోనూ దీనికి సంబంధం ఉందా? రోదసిలో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు కూడా సునామీ వంటి విపత్తులకు కారణమవుతాయా? నెల రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు ఏర్పడినప్పుడు విపత్తు తప్పదంటున్నారు ఖగోళ పండితులు.. ఇది నిజమేనా? ప్రస్తుతం సునామీ వస్తున్నదన్న వార్తలకు ఈ మూడు గ్రహణాలతో సంబంధం ఏదైనా ఉందా?
అంతరిక్షంలో ఏ పరిణామం చోటు చేసుకున్నా, దాన్ని మనం ఓ అద్భుతంగా చూస్తాం... కానీ, ఆ అద్భుతానికీ, భూమిపై ప్రకృతిలో కలిగే పరిణామాలకు మధ్య ఉన్న సంబంధంపై అదే సమయంలో పరిశోధనా జరుగుతుంది. ఇక ప్రజల సెంటిమెంట్ల సంగతి ఏం చెప్పేది...

అలాంటి అద్భుత పరిణామమే ఇప్పుడు రోదసిలో చోటు చేసుకుంది. ముపై్ఫ రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు.. జూలై 7న చంద్రగ్రహణం, 22న సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 7న మరో చంద్రగ్రహణం సంభవించాయి. ప్రకృతిలో విపరీత పరిణామాలకు ఇలా స్వల్ప కాల వ్యవధిలో మూడు గ్రహణాలు రావటం కారణమవుతుందని జ్యోతిష్యులు, ఖగోళ పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ఇప్పుడు సునామీ గురించిన వార్తలు ఈ వాదనలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

క్రీస్తుపూర్వం 3067లో అంటే ఇప్పటికి సుమారు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం ఇలాగే నెలరోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు సంభవించాయట... కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరిగింది అప్పుడే.. మహానగరం ద్వారక సాగర గర్భంలో మునిగిపోయింది కూడా అప్పుడు సంభవించిన ప్రళయంలోనే... ఈ ప్రళయం ఇవాళ్టి సునామీ కావచ్చు. తరువాత 1910లోనూ నెల రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కూడా అప్పుడే.
ఆ తరువాత 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఇలాంటి అంతరిక్ష అద్భుతం జరిగింది. హిరోషిమా, నాగసాకి నగరాల విధ్వంసంలో మహా మానవ హననం జరిగింది అప్పుడే...
ఇప్పుడు మళ్లీ మూడు గ్రహణాలు వచ్చాయి... సునామీ హెచ్చరికలూ వచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడేం జరగబోతోంది? ప్రకృతి విలయమా? విపత్తుకు విరామమా?



వివాదాలు ఒక వైపు.. కలెక్షన్లు ఒక వైపు


పాపం చిరంజీవికి ఇప్పట్లో కష్టాలు తప్పేట్లు కనిపించటం లేదు.. అసలే రాజకీయ జీవితం ఒడిదుడుకులతో సాగుతుంటే... కుమారుడు రామ్‌ చరణ్‌ తేజ సినిమా కలెక్షన్ల వర్షంతో పాటు వివాదాల పరంపరనూ వెంటాడి తెచ్చుకుంది. మొదట వంగపండు రాసిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా పల్లవిని ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌పై అభ్యంతరకరంగా వాడుకోవటంతో ప్రారంభమైన వివాదాల పరంపర.. ఇంకా కొనసాగుతూనే ఉంది. వంగపండు చివరకు వీధుల్లోకి వచ్చారు. తన పల్లవని తొలగించేదాకా నిర్మాతలను విడిచిపెట్టేది లేదన్నారు. అల్లు అరవింద్‌ ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో నిర్మాతలు కొత్త పుకార్ని పుట్టించారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అన్న పాట రాసింది వంగపండే అయినప్పటికీ, ఆ లైను మాత్రం ఆయన రాసింది కాదని, అది జనపదం నుంచి జనం నాలుకల్లోంచి వచ్చిందని కాబట్టి ఆయన క్లెయిమ్‌ చేసుకోవటానికి వీల్లేదని...

జానపద పాటలు ఏవైనా జనం నోళ్ల నుంచి వచ్చినవేనని ఒకరు ప్రత్యేకంగా చెప్పేది కాదు... జనులు పాడుకునే పదాలే జానపదాలు.. జనం నోళ్లలో నానే మాటలు.. వారి మనోభావాలను ప్రతిబింబించేలా వారి పదజాలంతో, వారి పరిభాషలో సాగే రచనే జానపదం అవుతుంది.దీనికి శాస్త్రీయ పద్ధతిలో రాగం ఉండనవసరం లేదు.. తాళం ఉండనవసరం లేదు.. శ్రుతి అంతకంటే ఉండదు. పాట రాసింది ఆయనేనట.. ఆ లైను రాసింది ఆయన కాదట... ఇదొక వితండ వాదాన్ని తెలివిగా లేవనెత్తారు.. అల్లు అండ్‌ టీం.. చిరు వీరాభిమానులూ దీన్ని అందిపుచ్చుకున్నారు. జనం నాలుకపై నాలుగు దశాబ్దాలుగా నానుతున్న గొప్పగీతం, దాని బాణీని సినిమాలో వినియోగించుకున్న తీరును మాత్రమే వంగపండు ప్రశ్నిస్తున్నారు. ఆ బాణిని ఒక స్ఫూర్తి దాయకంగా ఉపయోగించుకుంటే ఆయన అభ్యంతరం చెప్పేవారు కారేమో... ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌పై ఆ పల్లవిని వాడుకోవటం నిస్సందేహంగా ఆక్షేపణీయమే. ఇక్కడ పదే పదే స్పష్టం చేయాల్సింది పాటను వాడుకున్న సందర్భాన్ని మాత్రమే వంగపండు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అంతా గమనించాల్సిన విషయం ఏమంటే ఒక వీర నక్సలైట్‌ అయిన వంగపండు మొన్నటి ఎన్నికల సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ నినాదమైన సామాజిక న్యాయాన్ని మనఃస్ఫూర్తిగా సమర్థించారు. ఆ పార్టీకి ఓటేయమని ఒకటి రెండు చోట్ల ప్రచారమూ చేశారు.
ఈ వివాదం ఓ వైపు ఇలా కొనసాగుతూ ఉండగానే, ఇద్దరు రచయితలు మా కథలను కాపీ కొట్టారని గందరగోళం సృష్టించారు. ఒకరు తాను రాసిన చండేరి నవలను యథాతథంగా తీశారంటే, మరొకరు ఎప్పుడో రిజిష్టర్‌ చేయించుకున్న తన కథను కాపీ కొట్టారన్నారు. అటు బందరులో లాయర్లు కేసు వేశారు.
ఇన్ని వివాదాల నడుమే సినిమా కోట్లాది రూపాయలను నిర్మాతలకు కురిపిస్తున్నది. పాపం చిరంజీవి అభిమానులు సినిమా కోసం ఎంతమాత్రం రక్షణ లేని థియేటర్లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సినిమా మోజులో పడి ఇప్పటికి ఏడుగురు ప్రేక్షకులు మృత్యువాత పడటం దురదృష్టం. థియేటర్లు సరైన సౌకర్యాలు కలిగి ఉండకపోవటం... విద్యుత్తు, ఫైర్‌ వంటి వాటి విషయంలో పకడ్బందీ నిర్మాణాలు చేపట్టకపోవటం ఇందరి ప్రాణాలను బలిపెట్టింది. భూగర్భంలోనో, గోడలోపలి నుంచో ఉండాల్సిన విద్యుత్తు కనెక్షన్‌లు తాత్కాలిక ప్రాతిపదికన నెలకొల్పటం వల్ల టిక్కెట్ల కోసం జరిగిన తోపులాట.. అటు వరంగల్‌ భవానీ టాకీస్‌, ఇటు విజయనగరం జిల్లా సాలూరులో లక్ష్మీ థియేటర్‌లలో ఏడుగురిని మృత్యు కుహరంలోకి నెట్టేసింది. 1998లో ఉపహార్‌ ఉదంతం నేర్పిన గుణపాఠాలను దేశంలో ఏ ఒక్క థియేటర్‌ యాజమాన్యం కూడా నేర్చుకోలేదు. చివరకు మల్టిప్లెక్‌‌స కూడా సేఫ్‌జోన్‌ కాదని స్పష్టంగా తేలిపోయింది. చనిపోయిన వారి కుటుంబాలకు లక్షరూపాయల పరిహారం, రామ్‌చరణ్‌తేజ పరామర్శలతో సరిపుచ్చుతారు.. కానీ, ఆ తరువాత... సినిమాలను నిర్మించిన నిర్మాతలు కోట్లు దండుకుని అత్యాధునిక కార్లలో తిరిగేది.. ఈ సామాన్యుల సొము్మలతోనే... ఈ పిచ్చిలో పడి అమాయకులే అన్యాయం అయిపోతున్నారు.. ఇలాంటి వివాదాలు, దుర్ఘటనల వల్ల నిర్మాతలకు మరిన్ని కాసులు వచ్చిపడుతున్నాయే తప్ప, పేదోడికి ఒరిగిందేమీ లేదు. కనీసం సినిమా హాళ్లయినా బాగుపడవు.
కొసమెరుపు...
తెలుగులోని పలు వార్తాచానళ్లలో ప్రైమ్‌ టైమ్‌(0709పిఎం)లో టాలీవుడ్‌ సినిమాల ప్రచార ప్రకటనలు ఉచితంగా వేయాలన్న నిర్మాతల డిమాండ్లను పలు చానళు్ల నిషేధించాయి. దీంతో వాటిని నిర్మాతల మండలి బ్యాన్‌ చేసింది. మగధీరకు మాత్రం వివాదాల పుణ్యమా అని మినహాయింపు లభించినట్లయింది. మొత్తం మీద నెగెటివ్‌ ప్రచారం ఎంత మేలు చేస్తుందో ఈ సినిమా నిరూపించింది.

6, ఆగస్టు 2009, గురువారం

మగధీర పాట వివాదాస్పదమైంది

మగధీర సినిమా లో ఒక పాట వివాదాస్పదమైంది. రాష్ట్రంలో నక్సల్ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల పాటు ఉపిరులూదిన పాటల్లో ఒకటైన ఏం పిల్లడో ఎల్దమొస్తవ అన్న గేయాన్ని మగధీర లో ఒక ఐటం సాంగ్ లో వాడుకున్నారు.. ప్రముఖ ప్రజాకవి వంగపండు కు మనస్తాపాన్ని కలిగించింది. విప్లవ గీతాలను సినిమాల్లో ఉపయోగించుకోవటం కొత్త కాదు.. కానీ ఏ రోజూ వాటి గౌరవాన్ని తగ్గించలేదు. అర్ధ రాత్రి స్వతంత్రం లో కాని.. ఠాగూర్ లో మహాప్రస్థానం వాడుకున్న వాటి స్ఫూర్తి దెబ్బ తినలేదు.. కానీ ఈ పాట పల్లవిని మాత్రం అశ్లీల పదాల మధ్య చొప్పించి అవహేళన చేసారని వంగపండు ఆవేదన చెందుతున్నారు.. నక్సల్ ఉద్యమం లో నిజాయతీగా ఉన్న కొద్ది మందిలో వంగపండు ఒకరు.. అలంటి వ్యక్తీ పాటను ఇలా వాడుకోవటం నిర్మాతలకు తగునా? అటు బందరు లో లాయర్లు ఈ సినిమాను నిషేధించాలని కేసు వేసారు.. సినిమాలో లాయర్లను కించ పరిచారని వారి అభియోగం...