11, ఆగస్టు 2009, మంగళవారం

సునామీ మళ్లీ పడగ విప్పుతోందా?


సునామీ మళ్లీ పడగ విప్పుతోందా? వాతావరణంలో అనూహ్యమైన మార్పులు మళ్లీ సునామీ రాకను సూచిస్తున్నాయా? తూర్పు తీరంలోని పలు ప్రాంతాలు భూ ప్రకంపనలతో అల్లాడిపోతున్నాయి. ప్రశాంతంగా ఉన్న సముద్రంపై అలలు సాధారణస్థాయిని మించి ఎగిసిపడటం ముంచుకొస్తున్న ముప్పుకు సంకేత మంటున్నారు నిపుణులు... ప్రజలకు వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్న సునామీపై విశ్లేషణ,.....
సునామీ పెనుభూతం దేశాన్ని మరోసారి కము్మకుంటూ వస్తోంది. వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులు సముద్ర గర్భంలో భూప్రకంనలకు కారణమవుతోంది. ఈ తెల్లవారుజామున ఆసియాలోని పలు సముద్రతీర ప్రాంతాలను ఒక్కసారిగా భూమి వణికించింది. ఈ పరిణామం దేనికి సంకేతం? మరో మహా ప్రళయం సముద్ర తీరాన్ని ముంచెత్తనుందా?

మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్ర గర్భం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోస్తాంధ్రతీరంలో విశాఖ పట్నం నుంచి గోదావరి జిల్లాలతో మీదుగా నెల్లూరు వరకు అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున మంచి నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాళ్ల కింద భూమి కదలటంతో పిల్లాపాపల్ని వెంటేసుకుని బయటకు పరుగులు తీసారు.. పది నిమిషాల పాటు ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి.. ఇంతలోనే వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేయటం వెన్నుపూసల్లో చలి పుట్టించింది.

సాధారణంగా భూమి కంపించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది... కానీ, సముద్ర తీరం కావటం, సముద్రం అల్లకల్లోలం కావటంతో ఆందోళన తీవ్రమైంది. దీనికి తోడు ఆసియాలోని పలు ప్రాంతాలు ఇండోనేషియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లలో సైతం తీవ్రస్థాయిలో భూకంపం వచ్చిందన్న వార్తలు మరింత ఆందోళనకు కారణమైంది.
కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సునామీ గురించి ఏమీ తెలియదు.. సాధారణంగా వేటకు బయలు దేరిన జాలరులు సముద్రం ఉగ్రరూపం చూసి భయంతో వెనక్కి మళ్లారు. అప్పటికీ ఒక జాలరి గల్లంతయ్యారు. సముద్రంపైనే ఆధారపడి జీవించే వారికి ఈ పూట అన్నం కరవయ్యే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నానికి సముద్రుడు కొంత శాంతించినట్లు కనిపించినా, అధికారులు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నా, తీర ప్రాంత ప్రజల్లో గుబులు తగ్గలేదు. వెన్నులో వణుకు చల్లారలేదు....
2
సునామీ అంటే ఎందుకింత భయం? ప్రకృతి విపత్తులు ప్రజలకు కొత్తేం కాదు.. భూకంపాలు, తుపానులు గతంలో అంతా చూసినవే.. సముద్రంలో ఉప్పెనల విపత్కరాన్ని కూడా అనుభవించిన వారే.. కానీ, సునామీ అంటే మాత్రం వీటన్నింటికంటే భయం కలుగుతుంది. ఎందుకు? అది మహా ప్రళయం కాబట్టి.. కనీవినీ ఎరుగని విలయం సృష్టిస్తుంది కాబట్టి....

2004లో డిసెంబర్‌ 26... తెల్లతెల్లవారుతున్న సమయం... ఉషోదయ వేళ ఉప్పెన ముంచుకొచ్చింది. భారత్‌కు ఎంతో దూరంలో ఉన్న ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన సునామీ, భారత్‌ అంచులను తాకి ప్రళయమే సృష్టించింది. సముద్రగర్భంలో భూమి కంపించిన తీవ్రతకు సాగర జలాలు తీరప్రాంతాన్ని నిలువునా ముంచేశాయి.
ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే దాదాపు మూడు లక్షల మంది విగత జీవులయ్యారు.. ఇవి కేవలం అధికారిక లెక్కలే... వేలాది శవాలు గుర్తింపునకు నోచుకోక సముద్రంలో కలిసిపోయాయి. అనధికార అంచనాల ప్రకారం ఈ సునామీ పది లక్షల మందిని మింగేసింది.

అప్పటి వరకు మనకు సునామీ గురించి పెద్దగా తెలియదు.. పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతాలకే సునామీ అనుభవం ఉంది. అందుకే కరేబియన్‌ దీవుల్లో హొనలులు ప్రాంతంలో సునామీ హెచ్చరికల కేంద్రం అన్నది ఒకటుందని వినటమే కానీ, కన్నది లేదు. జపాన్‌ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ సునామీ వచ్చేది. కానీ, హిందూ మహాసముద్రానికి, బంగాళాఖాతానికి సునామీ అనుభవం ఎంతమాత్రం లేదు. ఇంతకు ముందు ఎలాగూ జరగలేదు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవాలన్న ఆలోచనా ఎవరికీ రాలేదు.. ఇంతకీ సునామీ అంటే ఏమిటి? ఇది ఎలా సంభవిస్తుంది?

ప్రాథమికంగా సునామీ అంటే సముద్ర భూకంపం. సముద్రం అట్టడుగున ఉన్న భూమి తీవ్రంగా కంపించి చీలిపోయినప్పుడు సునామీ ఏర్పడుతుంది. అంటే సాగర గర్భంలోని భూమి పొరలు చీలిపోయినప్పుడు ఆ చీలిక తీవ్రతకు సాగర జలాల అలల పోటు లెక్కలేనన్ని రెట్లు అధికమవుతుంది. భూప్రకంపనల చీలికను సముద్రపు అలలు మరింత విస్తృతం చేస్తూ అతి వేగంగా ప్రయాణిస్తాయి. అలల ప్రయాణం గంటకు 800 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది. వీటి ప్రభావం సముద్రపు ఉపరితలంపై అనూహ్యమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. తుపాను, ఉప్పెనలను మించిన ఉపద్రవం సంభవిస్తుంది. దాదాపు 400 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అలలు దరిదాపుల్లో ఉన్న తీరాన్నంతటినీ తమ గర్భంలో లిప్తపాటులో కలిపేసుకుంటాయి.2004 డిసెంబర్‌ 26 ఈ మహా ప్రళయానికి మచ్చుతునక...

గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 సునామీలు సంభవించాయి.
వీటిలో 1960లో వాల్దీవియా, 1964లో అలాస్కా, 2004లో హిందూ మహాసముద్రంలో జరిగిన సునామీలు అతి తీవ్రమైనవి.
మామూలుగా భూ ఉపరితలంపై సంభవించే భూకంపాలకంటే సముద్ర గర్భంలో ఏర్పడే భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకంపనల వల్ల సముద్రం ప్రకోపించటానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు మళ్లీ సంభవిస్తే.. దాని పర్యవసానాలు ఊహించటానికే భయమేస్తుంది. సునామీ రాకను కనిపెట్టేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు కానీ, దాన్ని నివారించటం మానవ సాధ్యం కాదనేది నిష్ఠుర సత్యం. కనీసం ముందుగానే గ్రహించగలిగితే కొంత నష్టనివారణైనా చేయవచ్చు. కానీ, అది సాధ్యమా?
3
సునామీ ప్రకృతి విపత్కరమేనా? లేక ఖగోళ శాస్త్రంతోనూ దీనికి సంబంధం ఉందా? రోదసిలో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు కూడా సునామీ వంటి విపత్తులకు కారణమవుతాయా? నెల రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు ఏర్పడినప్పుడు విపత్తు తప్పదంటున్నారు ఖగోళ పండితులు.. ఇది నిజమేనా? ప్రస్తుతం సునామీ వస్తున్నదన్న వార్తలకు ఈ మూడు గ్రహణాలతో సంబంధం ఏదైనా ఉందా?
అంతరిక్షంలో ఏ పరిణామం చోటు చేసుకున్నా, దాన్ని మనం ఓ అద్భుతంగా చూస్తాం... కానీ, ఆ అద్భుతానికీ, భూమిపై ప్రకృతిలో కలిగే పరిణామాలకు మధ్య ఉన్న సంబంధంపై అదే సమయంలో పరిశోధనా జరుగుతుంది. ఇక ప్రజల సెంటిమెంట్ల సంగతి ఏం చెప్పేది...

అలాంటి అద్భుత పరిణామమే ఇప్పుడు రోదసిలో చోటు చేసుకుంది. ముపై్ఫ రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు.. జూలై 7న చంద్రగ్రహణం, 22న సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 7న మరో చంద్రగ్రహణం సంభవించాయి. ప్రకృతిలో విపరీత పరిణామాలకు ఇలా స్వల్ప కాల వ్యవధిలో మూడు గ్రహణాలు రావటం కారణమవుతుందని జ్యోతిష్యులు, ఖగోళ పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ఇప్పుడు సునామీ గురించిన వార్తలు ఈ వాదనలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

క్రీస్తుపూర్వం 3067లో అంటే ఇప్పటికి సుమారు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం ఇలాగే నెలరోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు సంభవించాయట... కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరిగింది అప్పుడే.. మహానగరం ద్వారక సాగర గర్భంలో మునిగిపోయింది కూడా అప్పుడు సంభవించిన ప్రళయంలోనే... ఈ ప్రళయం ఇవాళ్టి సునామీ కావచ్చు. తరువాత 1910లోనూ నెల రోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కూడా అప్పుడే.
ఆ తరువాత 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఇలాంటి అంతరిక్ష అద్భుతం జరిగింది. హిరోషిమా, నాగసాకి నగరాల విధ్వంసంలో మహా మానవ హననం జరిగింది అప్పుడే...
ఇప్పుడు మళ్లీ మూడు గ్రహణాలు వచ్చాయి... సునామీ హెచ్చరికలూ వచ్చాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడేం జరగబోతోంది? ప్రకృతి విలయమా? విపత్తుకు విరామమా?



3 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

అవును. సునామీ వచ్చి మీ బ్లాగు మీద పడబోతోంది :)

అజ్ఞాత చెప్పారు...

>> క్రీస్తుపూర్వం 3067లో అంటే ఇప్పటికి సుమారు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం ఇలాగే నెలరోజుల వ్యవధిలో మూడు గ్రహణాలు సంభవించాయట... కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరిగింది అప్పుడే.. మహానగరం ద్వారక సాగర గర్భంలో మునిగిపోయింది కూడా అప్పుడు సంభవించిన ప్రళయంలోనే...

పిచ్చి పిచ్చి రాతలు రాసి ఇలా జనాన్ని భయపెట్టడమేనా జర్నలిజం అంటే? మహాభారత యుద్ధానికి ద్వారక మునిగిపోవడానికి చాలా యేళ్ళు తేడా ఉంది. ద్వారక మునిగిపోయింది ధర్మరాజు చాలా కాలం రాజ్యం చేసాక. తెలియకపోతే తెల్సుకోవడం మంచిది. ఆ మధ్య 9/11 ఎటాక్ జరిగినప్పుడు ఈనాడు వాషింగ్టన్ నుంచి జనం అందరూ పారిపోతున్నారహో అని రాసింది. మీరు అక్కడే కదా ఉద్యోగం మొదలెట్టింది?

పనికి రాని రాతలు రాయడం కన్నా ఇప్పుడున్న కరువు గురించో మరో దాని గురించో రాసి ప్రజలకి ఏది మంచిదో రాయడం నేర్చుకోండి. అది చాతకాకపోతే ఇంకా మంచి పని ఇంకోటి ఉంది. నోరు మూసుకుని కూర్చోవడం. ఆ మాత్రం కూడా తెలియకపోవడం శోచనీయం.

ఇంక సునామీ, గ్రహ కూటముల గురించి. ఏమీ కాదు. ఎప్పట్లాగానే పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు మీ లాంటి వాళ్ళు. ప్రపంచం అలా ముందుకి పోతూనే ఉంటుంది. ఉత్తినే ఖంగారు పడకండి.

Indian Minerva చెప్పారు...

మిగతావేమో కానీ ప్రపంచ యుధ్ధాలు మాత్రం మనుషుల అహంభావాల వల్ల వచ్చాయి. ఇంతోటిదానికి గ్రహణాలతో పనిలేదు. కాకతాళీయం అన్న పదం ఒకటి తెలుగులో వుంది. ఓ రెండు సార్లు అలా జరిగినంతమాత్రాన ఈ రెండు సంఘటనలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్పలేము కదా... మీరేమో ఏకంగా ఈ వైపరీత్యాలన్నిటికీ కారణాలు ఖగోళంలో వున్నాయని తేల్చేశారు.