31, ఆగస్టు 2009, సోమవారం

దిక్కులేని దేవుడు పార్ట్ 3

ఎందుకిలా జరుగుతోంది. దేవుడిపై భక్తితో సమర్పించిన కానుకలను అడ్డగోలుగా భోంచేస్తున్న వారి భరతం పట్టేదెవరు? గుడినీ గుళ్లో లింగాన్ని మాయం చేసే వాళు్ల దేవాదాయ శాఖలో ఉన్నంత వరకు దేవుడికీ, ఆయన మాన్యానికీ, ఆయన ఆస్తులకు రక్షణ ఉండదు...... మనం దండం పెట్టేందుకు తూర్పు దికై్కనా ఉంది.. కానీ, అసలే సర్వాంతర్యామి.. ఆయన ఏ దిక్కుకు తిరిగి దండం పెట్టుకోవాలి?

తిరుమలలో ఓ అర్చకుడు తప్పుడు పని చేసాడని రాష్టమ్రంతటా గగ్గోలు పెడుతున్నారు... దోషులెవరైనా శిక్షిస్తామంటూ ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. మంచిదే... తిరుమలలో ఒక చిన్న చేపపై కొరఢా ఝళిపిస్తే దేవాదాయ వ్యవస్థ చక్కబడినట్లేనా? రాష్ట్రంలో ఉన్న మిగతా దేవాలయాల మాటేమిటి? రాష్ట్రంలో 37 వేల దేవాలయాలు ఉంటే, అందులో 5లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న ఆలయాలు... చాలా తక్కువ. దమ్మిడీ కూడా ఆదాయం రాని ఆలయాల సంఖ్యే ఎక్కువ... ఎన్టీరామారావు పుణ్యమా అని 1987లో చల్లా కొండయ్య కమిషన్‌ సిఫార్సుల మేరకు చేసిన 33/87 చట్టం వేలాది ఆలయాలను జీర్ణావస్థకు చేర్చింది. విచిత్రమేమంటే రాష్ట్రంలో ఏ ఒక్క దేవాలయానికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి వెళ్లదు. దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఆలయాల మధ్య రొటేట్‌ చేయటం మినహా సర్కారు చేసేదేమీ ఉండదు. పోనీ ఆ ఆదాయానై్ననా ఆలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించి అభివృద్ధి పరుస్తుందా అంటే అదీ లేదు... పైగా, తిరుమల వంటి పెద్ద ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని అవసరమైనప్పుడల్లా తీసుకుంటుంది. దీనికి తోడు పెత్తనానికేం తక్కువ ఉండదు. ఉద్యోగులను నియమించటం దగ్గర నుంచి హుండీ ఆదాయం దాకా అన్ని వ్యవహారాల్లో సర్కారు జోక్యం తప్పనిసరి... ఆలయానికి భూముల నుంచి, ఇతర వనరుల నుంచి ఆదాయం వస్తే... ఆ ఆదాయాన్ని కార్యనిర్వాహణాధికారికి జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అన్నీ ఇచ్చేశాక ఏదైనా మిగిలితే, తగిలితే అప్పుడు ధూప దీప నైవేద్యాలకు ఖర్చు చేస్తారు.. ఆ తరువాత ఇంకాస్త మిగిలితే అర్చకుడిపైన దయతలుస్తారు... ఈ లోపు ఎవరు కైంకర్యం చేయాల్సింది వారు చేసేస్తారు.. ఆలయంలో ఆదాయానికి, ఆస్తులకు ఎవరి బాధ్యత ఉండదు.. ఎవరి నిఘా ఉండదు.. ఎలాంటి చర్య కూడా ఉండదు.. 2005లో సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఎం.సత్యనారాయణరావు స్వయంగా తన శాఖలో జరుగుతున్న అవినీతి గురించి అసెంబ్లీలో బహిరంగంగా అంగీకరించిన తరువాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అర్చకుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, వారిని ఆదుకోవాలని, ఉద్యోగులుగా మిగతా వారితో సమానంగా స్కేళు్ల ఇవ్వాలని, కోరుతున్నా.. ఏదో ఘటన జరిగినప్పుడు.. ఇప్పుడు మంత్రి గాదె వెంకటరెడ్డి స్పందించినట్లే ఆదుకుంటామంటూ స్పందిస్తారు తప్ప నాలుగు రోజుల తరువాత మర్చిపోతారు.. పెద్ద గీతను చిన్న గీతగా చూపించేందుకు రమణ దీక్షితులనే చిన్న గీతను పెద్దది చేస్తున్నారు...ఈ రకమైన అక్రమాన్ని నిరోధించకపోతే... దేవాదాయ వ్యవస్థే నిర్వీర్యం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు..

కామెంట్‌లు లేవు: