21, ఆగస్టు 2009, శుక్రవారం

క్లైమాక్స్ కు చేరుకున్నాక ఆకులు పట్టుకుంటున్నారా?


వేలాది ప్రజల అభిమానుల హర్షధ్వనాల నేపథ్యంలో సరిగ్గా 360 రోజుల క్రితం తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రారంభమైన ప్రజారాజ్యం ప్రస్థానం అప్పుడే ముగింపు దశకు చేరుకుందా? రాష్ట్ర రాజకీయ రంగస్థలంపై వేగంగా మారుతున్న పాత్రలు... మార్చుకుంటున్న వేషాలు.. ప్రజారాజ్యం పార్టీ కథను కంచికి చేర్చేట్లే కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం నడుస్తున్న తీరుపై మీడియా కథనాలను మెగాస్టార్‌ ఆవేశంతో, ఆగ్రహంతో ఖండిస్తే ఖండించవచ్చు... జెండా ఎవరు పీకుతారనీ అనవచ్చు..ఆయన ఖండించిన తరువాత కూడా ఊహాగానాలు ఆగలేదు.. ఏకంగా కాంగ్రెస్‌తో రాజీ కుదిరిందని, విలీనం కాకున్నా, కనీసం కాంగ్రెస్‌తో అవగాహనతో ముందుకు వెళ్తారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి....


ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీ తన వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందా? ఏడాది క్రితం లక్షలాది అభిమానుల సమక్షంలో ఆర్భాటంగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం తొలి వార్షికోత్సవం అంత ఉత్సాహంతో జరుపుకునే పరిస్థితిలో లేదు. ఎన్నికల దాకా ఏవేవో ఊహించుకున్న చిరంజీవికి ఎన్నికల తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇవాళ పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తలుపులు బార్లా తెరిచి ఉంచినా, పార్టీని వీడి వెళ్లేవారే తప్ప.. వచ్చేవారు లేని సంకట స్థితిలో ఉన్నారు. పూటకొకరుగా, రోజుకొకరుగా నెమ్మదిగా జారుకుంటున్నారు. చివరకు పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. పార్టీ అధినేతగా చిరంజీవి అంతా బాగుందనే చెప్పవచ్చు...ఎమ్మెల్యేలు సామూహికంగా ఖండించవచ్చు. కానీ, వాస్తవాలు మాత్రం పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్తున్నాయి.
నిప్పులేందే పొగరాదు.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రజారాజ్యం ప్రతి కదలిక అస్తవ్యస్తంగానే సాగుతోందన్నది నిష్ఠుర సత్యం. ఎన్నికలకు ముందు పరకాల ప్రభాకర్‌ వంటి వారు వెళ్లిపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. ఎన్నికలు ముగిసాక హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందనీ, చిరంజీవి కింగ్‌ మేకర్‌ అవుతారనీ ఆ పార్టీ వారు గట్టిగా నమ్మారు. కొందరు రాజకీయ విశ్లేషకులైతే.. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని బల్లగుద్ది మరీ వాదించారు. ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పూర్తిగా తేలిపోయింది. పార్టీ అధినేతే ఒక నియోజక వర్గంలో ఓడిపోయిన దుస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశించిన తరువాతైనా చిరంజీవి రాజకీయంగా మెతకగా వ్యవహరించటం కూడా తప్పుడు సంకేతాల్ని పంపించింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో షికారు చేశాయి. అయితే ఏనాడు కూడా చిరంజీవి కానీ, ఆయన ప్రతినిధులు కానీ, శాసన సభ్యులు కానీ ఈ వాదనలను, పుకార్లను ఖండించలేదు. కనీసం స్పందించనైనా లేదు.. దీనితో ఈ వాదనలకే బలం చేకూరింది.
ప్రజారాజ్యం పనిచేస్తున్న తీరు గురించి మీడియాలో ఇవాళ కొత్తగా వార్తలు రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కార్యాలయం ముఖమైనా చూడని ప్రధానకార్యదర్శి అల్లు అరవింద్‌తో ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడిన మాట వాస్తవం. రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన సమావేశంపై మీడియాలో వచ్చిన కథనాలపై ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. తన స్ట్రేచర్‌ను దిగజారుస్తున్నారని, తన ఇమేజిని, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తున్నారని ఆవేశపడుతున్నారు. మరి ఇంతకాలంగా వస్తున్న వార్తలపైనా, బయటకు వెళ్లిపోతున్న నాయకుల విషయంలోనూ, పార్టీని బలోపేతం చేసే దిశలోనూ ఆయన చేపట్టిన ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక చర్య ఏముంది? పార్టీ శాసన సభ్యులు అధినేతతో నేరుగా మాట్లాడవచ్చు కదా? అరవింద్‌తో పార్టీ భవిష్యత్తు గురించి తన ఎమ్మెల్యేలు చర్చిస్తుంటే అధినేత మాత్రం తీరిగ్గా రాష్ట్ర శాసన సభ్యుల కుటుంబాలకు కొడుకు సినిమా మగధీరను చూపిస్తూ కూర్చున్నారు...పార్టీ పట్ల చిరంజీవికి ఉన్న సీరియస్‌ నెస్‌ ఇదేనా?
2..
తన పార్టీని మరింత బలోపేతం చేస్తానని, రానున్న నాలుగేళ్లలో రాజకీయాల్లో అద్భుతం సృష్టిస్తానని చిరంజీవి చెప్తున్నారు. అలా జరిగితే సంతోషమే.. రాష్ట్రంలో మరో బలమైన రాజకీయ పక్షం ఉండటం ఆరోగ్య పరిణామమే.. కానీ, ప్రజారాజ్యం ప్రస్తుతం ఉన్న తీరు... నడుస్తున్న దారి సరైనదేనా? చిరంజీవి అనుకున్న గమ్యానికి అది వెళ్లడం సాధ్యమేనా?
ఎందుకంటే పార్టీపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించటానికే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తానుగా స్పందించటానికి పన్నెండు గంటలు పట్టింది. నిర్ణయం తీసుకోవటంలో ఆయన మహా నిదానస్తుడు.. పార్టీలోని నాయకులందరినీ ఒకరి వెంట ఒకరుగా మాట్లాడించిన తరువాత కానీ, చిరంజీవి పలుకలేదు. ఆయన ప్రతిస్పందన అంతా ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టార్గెట్‌ చేసుకుని సాగింది. రెండు పత్రికలు కలిసి తమ పార్టీని ఎలిమినేట్‌ చేసేందుకు పత్రికలు టార్గెట్‌ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా.. తమ ప్రస్థానాన్ని ఆపేది లేదన్నారు....ఇదే తీవ్రత నాడు కేశినేని నాని వెళ్లినప్పుడో, పరకాల ప్రభాకర్‌ పార్టీ కార్యాలయంలో కూర్చొని నిందించిన రోజునో... చిరంజీవి నుంచి వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.. పార్టీ కేడర్‌లో విశ్వాసం పెంచాలంటే నాయకత్వం ఎంత చురుగ్గా పనిచేయాలో చిరంజీవికి అర్థం అవాల్సిన అవసరం ఇవాళ్టికైనా గుర్తుకు వచ్చింది.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ అన్నది ఏర్పాటు అయితే, అది ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయటం మన దేశంలో రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల వలన ఎన్నుకోబడిన వ్యవస్థ మన ప్రజాస్వామ్యం కాబట్టి... ప్రజల ప్రమేయం లేకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజల్లో విశ్వాసం కల్పించకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. ప్రజారాజ్యం ఏర్పాటైన తొలినాడు దానికి ప్రధాన సిద్ధాంతం అన్నది ఏమీ లేదు. రాష్ట్రంలో కొన్ని సమస్యల ప్రస్తావనలతో గుదిగుచ్చిన ప్రసంగ పాఠాన్ని నాడు చిరంజీవి చదివారే తప్ప, ఆనాడు ఆయన పార్టీకి ఉన్న రాజకీయ విధానమేమిటన్నది స్పష్టంగా చెప్పలేదు. ఆ తరువాత సామాజిక న్యాయం అన్న నినాదం తెరమీదకు వచ్చింది. నినాదాన్ని అందిపుచ్చుకున్న తరువాతైనా దాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారా అంటే అదీ లేదు. సామాజిక న్యాయం విషయంలో వూ్యహాత్మకంగా వ్యవహరించకపోవటం వల్ల పార్టీపై కుల ముద్ర పడింది. కనీసం ఆ తరువాతైనా ఆ ముద్రను చెరుపుకోవటానికి అధినేత కానీ, అధిష్ఠానం కానీ ఎంతమాత్రం ప్రయత్నించలేదు. పైగా ఆ ముద్రను నిలుపుకునే విధంగా పార్టీ వ్యవహరించిందనే అపప్రథను మూటగట్టుకున్నారు.

విచిత్రమేమంటే, ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ప్రజలు తనను రాజకీయాల్లోకి రమ్మని పిలిస్తే వచ్చానని లక్షలాది ప్రజల ముందు ప్రకటించిన చిరంజీవి, పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల సమస్యల పట్ల ఎంతమేరకు స్పందించారంటే జవాబు ఉండదు.. సిరిసిల్ల చేనేత కార్మికులను ఒకసారి, పోలేపల్లి సెజ్‌ బాధితుల దగ్గరకు మరోసారి వెళ్లటం తప్ప.. మరే ప్రజా సమస్యపైనా స్పందించలేదు.. ప్రజల్లోకి వెళ్లలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనూ చైతన్యరథం లాంటి ఓ వాహనం ఎక్కి అందులోంచి దిగనైనా దిగకుండా రోడ్డుషోలు నిర్వహించటం తప్ప గ్రామాల్లోకి వెళ్లిన దాఖలా ఒక్కటంటే ఒక్కటి కనిపించదు...

కనీసం ఫలితాల తరువాతైనా అసెంబ్లీలో చాలా హంబుల్‌గా వ్యవహరించటం, అతి మర్యాదలతో, ఎక్కడలేని ఔదార్యంతో మాట్లాడటం తప్ప, వాస్తవ సమస్యలపైన ఆయన తీవ్రంగా స్పందించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఒకే ఒక్కసారి కందిపప్పు ధరపైన ప్రజారాజ్యం చేసిన ధర్నాలో ఆయన పాల్గొని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కాసేపు కూర్చొని వచ్చారు. తరువాత మొన్న కరీంనగర్‌లో కరవుపై ధర్నా చేశారు. సంవత్సర కాలంలో పిఆర్‌పి ప్రత్యక్ష ప్రజాందోళనల్లో పాల్గొన్న సందర్భాలు ఈ రెండు మాత్రమే..... ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఇదేనా?
ఒక స్పష్టమైన విజన్‌ లేకుండా, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచగలుగుతామని చిరంజీవి ఎలా అనుకుంటున్నారో అర్థం కాదు.. ప్రజల్లో మమేకం అయి, ప్రజల్లో విశ్వాసం కలిగించగలిగినప్పుడు పార్టీ భవిష్యత్తు గురించి ఎవరికైనా ఎందుకు అనుమానం వస్తుంది? నాయకులు మూకుమ్మడిగా ఎందుకు వలసలు వెళ్తారు?
3
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా, ప్రజారాజ్యం పార్టీ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవం... నాలుగు రోడ్ల కూడలిలో ఎటు వెళ్లాలో తెలియని పెద్ద అయోమయంలో పడిపోయింది. ఒక సినిమాటిక్‌గా ప్రారంభమైన ప్రజారాజ్యంలో కథను ముందుకు నడిపించాల్సిన బాధ్యత హీరోపైనే పడింది..
చిరంజీవి పార్టీ ఏర్పాటు చేయటమే సినిమాటిక్‌గా జరిగిపోయింది. ఒక సినిమాను ప్రారంభించే ముందు స్టోరీ డిస్కషన్‌‌స, ముహూర్తం.. ఆడియో రిలీజ్‌, సినిమా విడుదల, విజయోత్సవ ర్యాలీలు... వరుసగా జరిగినట్లే... ప్రజారాజ్యం కూడా ఓ మెగా సినిమా వ్యవహారంగానే తయారైంది. చిరంజీవి రాజకీయాల్లోకి రావటానికి ముందు అంతర్గత చర్చలు విస్తృతంగానే జరిగాయి. పార్టీ ఎలా ఉండాలి.. రూపు రేఖలు ఏమిటి? ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చాలా చర్చ జరిగింది. స్పార్‌‌క అని, వారధి అన్న పేరుతో మహామహులతో సంప్రతింపులు, చర్చల తరువాత స్టోరీ, స్క్రీన్‌ప్లే మిత్రా నాయకత్వంలో తయారైంది. తరువాత 2008 ఆగస్టు 17న చిరంజీవి నోట తొలి రాజకీయ పలుకులు జాలువారాయి. అది ప్రజారాజ్యానికి ఆడియో రిలీజ్‌....ఆగస్టు 26న అంగరంగవైభవంగా ప్రజారాజ్యం ఓ వన్‌మ్యాన్‌ షోగా విడుదలైంది. సినిమా విడుదల తరువాత విజయోత్సవ ర్యాలీలు జరిగినట్లే ప్రజారాజ్యం హీరోతో రోడ్‌షోలు నిర్వహించింది. తరువాత స్తబ్దంగా తయారైంది. ఫస్‌‌ట పార్‌‌ట అంతా బాగానే జరిగింది. కానీ, విశ్రాంతి తరువాతే... స్టోరీ అస్తవ్యస్తంగా మారిపోయింది. అంతకు ముందు వచ్చిన పాత్రలన్నీ ఒక్కటొక్కటిగా కనుమరుగయిపోతూ.. చివరకు ఒకేఒక్క పాత్ర మిగిలిపోయింది. మిగిలిన ఆ పాత్ర కథను ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి