20, ఆగస్టు 2009, గురువారం

కాషాయంలో కల్లోలం

మనిషి రుచి మరిగిన పులి... అధికారం రుచి మరిగిన నాయకుడు వాటిని విడిచిపెట్టడం తట్టుకోలేరు. అవి లేకుండా జీవించలేరు.... దేశ రాజకీయాల్లో భారతీయ జనతాపార్టీ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. ఆరేళ్లు అధికారాన్ని అనుభవించిన కమలనాథులు, అధికారాన్ని కోల్పోయి అయిదేళు్ల కావస్తున్నా.... ఓటమి భారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. టాప్‌మోస్‌‌ట నాయకుల అంతర్గత కుము్మలాటల పుణ్యమా అని.. పార్టీని బలోపేతం చేయటం మాట దేవుడెరుగు... అసలు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

ఓ పక్క వెంటాడుతున్న జిన్నా భూతం... ఇంకోపక్క సీనియర్‌ నేతల మధ్య పొసగని పొత్తు... మరోపక్క మాతృసంస్థ సంఘ్‌పరివార్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడి... వెరసి బిజెపి నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిమ్లాలో చింతన్‌ బైఠక్‌లో కూర్చొని చర్చలు జరుపుతున్నారే తప్ప, అంతర్గతంగా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో పార్టీ అధిష్ఠానానికి తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కావటం లేదు. జిన్నాను పొగుడుకుంటూ ఓ పుస్తకాన్ని రచించిన సీనియర్‌ నేత జస్వంత్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించి వివాదానికి తాత్కాలికంగా తెరదింపారే కానీ, ఆ వివాదం కారణంగా పార్టీలో పుట్టిన ముసలం అంత తేలిగ్గా అంతమయ్యేట్లు కనిపించటం లేదు.

2004లో ఓటమిని భరించటమే కష్టమనుకుంటే వరుసగా రెండోసారి కూడా ఘోర పరాజయాన్ని చవిచూడటం.. తన నేతృత్వంలోని ఎన్‌డిఏ నిర్వీర్యం కావటం బిజెపికి మింగుడుపడటం లేదు. దీనికి తోడు రాజస్థాన్‌ సహా పలు రాషా్టల్ల్రో అధికారం కోల్పోవటం కూడా పార్టీ పరిస్థితికి దర్పణం పడుతోంది. ఈ విషయాన్ని బిజెపి నేతలే కాదు.. స్వయంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అధ్యక్షుడు మోహన్‌ భాగవత్‌ విస్పష్టంగా చెప్తున్నారు...

2004లో ఓడిపోయినప్పటి నుంచి ఏ దశలోనూ కోలుకోలేదు.. చాలా మంది నాయకులను కోల్పోయింది. ప్రమోద్‌మహాజన్‌, సాహిబ్‌సింగ్‌ వర్మ లాంటి వాళు్ల అకాల మృత్యువుపాలైతే.... ఉమాభారతి మొదలుగా ఒక్కో నేత బిజెపిని వీడిపోయారు. 2009లో పరిస్థితి ఇంకా దిగజారింది. యుపిఎ సర్కారుపై కొద్దో గొప్పో ఉన్న నెగెటివ్‌ ఓటు,,, ఆయా రాషా్టల్ల్రో బిజెపికి ఉన్న కొంత సానుకూల ఓటు వల్ల కొన్ని సీట్లు గెలిచారు తప్ప పార్టీ సొంతంగా సాధించింది ఏమీ లేదు. మొన్నటి ఎన్నికలకు ముందే అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ల మధ్య ఘర్షణ పతాక స్థాయిలో జరిగింది. ఇక పలితాల తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఎన్నికల్లో ఎన్‌డిఏ ఖచ్చితంగా గెలిచితీరుతుందని, తాను ప్రధాని కావటం ఖాయమని గట్టిగా నమ్మిన అద్వానీ విశ్వాసం వమ్మయిపోయింది. అయినా అంతా కలిసి వృద్ద నేతను ప్రతిపక్షనేతగా కూర్చోబెట్టారు. యశ్వంత్‌సిన్హా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.. ఉత్తరాఖండ్‌లో బిసి ఖండూరీ అసమ్మతి బాట పట్టారు. అటు రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె జిన్నాపై జస్వంత్‌ రాసిన పుస్తకాన్ని బహిరంగంగానే సమర్థించారు..దీంతో ఆమెను రాజీనామా చేయాలని రాజ్‌నాథ్‌ కోరారు కూడా...

ఒకరి వెంట ఒకరుగా వెళ్లిపోయేవారే తప్ప పార్టీకి మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకువచ్చే బాధ్యతను ఎవరూ నెత్తిన పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు.. గతంలో పార్టీ పదవుల కోసం ఆసక్తి చూపిన వారు కూడా మనకెందుకులే అని దూరం జరిగే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఏ పదవైనా కొరివి లాంటిదే.. కొరివితో తలగోక్కోవటం ఎవరికి మాత్రం ఇష్టం...? ఇప్పుడు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎంత తలలు పట్టుకున్నా కమలనాథుల బురల్రకు ఇంకా తట్టటం లేదు.. 2004 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన నాటి నుంచి ఎన్నో చింతన్‌ బైఠక్‌లు జరిగాయి. వాడిగా వేడిగా చర్చలూ జరిగాయి. అయినా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. దీనికి తోడు మహమ్మద్‌ అలీ జిన్నా అప్పుడప్పుడూ వచ్చి ముల్లుతో గుచ్చి వెళు్తంటాడు...

జిన్నా భూతం

అటు బిజెపిని జిన్నా భూతం నీడలా వెంటాడుతూనే ఉంది. నాలుగున్నరేళ్ల క్రితం అద్వానీ జిన్నా సమాధి దగ్గరకు వెళ్లి శ్రద్ధతో నివాళులు అర్పించి వస్తే... ఇప్పుడు జస్వంత్‌సింగ్‌ ఏకంగా జిన్నాను తెగ పొగిడేస్తూ ఏకంగా పుస్తకాన్ని రాసేశారు.. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన మొదటి ప్రధానిని నిందిస్తూ... జిన్నాను పొగిడేస్తూ జస్వంత్‌ రాసిన పుస్తకం బిజెపిని రాజకీయ అగాధంలోకి నెట్టేసింది.

2005లో అద్వానీ సృష్టించిన కలకలం నుంచి బిజెపి పూర్తిగా తేరుకోనే లేదు.. ఇప్పుడు జిన్నాను పొగిడేందుకు మరో మహానుభావుడు బిజెపిలో పుట్టుకొచ్చేశారు. సీనియర్‌ నాయకుడు జస్వంత్‌సింగ్‌, జిన్నాపై జిన్నాఇండియా.. దేశ విభజనస్వాతంత్య్రం అన్న పేరుతో జన్నా పుస్తకం రాసుకున్నారు. ఆగస్టు 17న దాన్ని ఆవిష్కరించేసుకున్నారు కూడా.. దీనికి బిజెపి నేతలెవరూ హాజరు కాలేదు. పాకిస్తాన్‌ అనుకూల వాదులు, సోకాల్‌‌డ సెక్యులరిస్టులమనుకునే వాళ్లే ఈ ఆవిష్కరణ సభకు హాజరయ్యారు... దేశవిభజనకు జిన్నా కంటే కాంగ్రెస్‌ నేతలే ప్రధాన కారకులన్న అర్థంలో ఆయన నెహ్రూను, ఇతర నేతలను నిందించటం వంటివి సృష్టించిన వివాదం బిజెపిని పూర్తి డిఫెన్‌‌సలో పడేసింది.
దీన్ని కాంగ్రెస్‌ రాజకీయంగా అందిపుచ్చుకుని అగ్గిరాజేసింది. పుస్తక ప్రతులను తగులబెట్టి ఆందోళనలు చేసింది.

2005లో ఎల్‌కె అద్వానీ పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లి తగుదునమ్మా అంటూ మహమ్మద్‌ అలీ జిన్నా సమాధిని సందర్శించి అక్కడ మోకరిల్లి, జిన్నాను పరమ లౌకిక వాదిగా అభివర్ణించారు. ఈ వ్యవహారం కేంద్ర రాజకీయాల్లో రేపిన వివాదం అంతా ఇంతా కాదు.. మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ అద్వానీని తప్పించాల్సిందేనని భీష్మించింది. చివరకు పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టేదాకా వదలలేదు. అంతేకాకుండా మహమ్మద్‌ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడైన వ్యక్తి అని బిజెపి ప్రత్యేకంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. ఈ వివాదం సమయంలో పూర్తిగా దగ్గర ఉండి చూసిన వ్యక్తి జస్వంత్‌.. నాడు అద్వానీతో రాయబారాలు నడిపిన నేత జస్వంత్‌... అప్పుడు పార్టీ తీర్మానం చేసినప్పుడు కూడా ఆమోదించిన నాయకుడు జస్వంత్‌... జిన్నాపై అప్పుడు లేని అభిప్రాయం.. ఇప్పుడెలా వచ్చింది? ఎవరికీ అర్థం కాని విషయం.. ప్రత్యేకించి బిజెపి వారికి గుబులు పుట్టించిన వ్యవహారం... జస్వంత్‌ పార్టీ బహిష్కరణతో జిన్నా భూతం బిజెపిని వీడుతుందా? మరెవరినైనా పట్టుకుంటుందా?

వై జిన్నా?
ఇప్పుడు జిన్నా అవసరం బిజెపి నేతలకు ఎందుకు వచ్చింది? నాడు అద్వానీ, నేడు జస్వంత్‌ ఉన్నట్టుండి జిన్నా మంత్రాన్ని పఠించటం వెనుక రాజకీయ ప్రయోజనం ఏదైనా ఉందా? లేక వూ్యహాత్మక తప్పిదం చేస్తున్నారా?

దేశ విభజన జరిగి అరవై మూడేళు్ల అయిన తరువాత ఇప్పుడు అకస్మాత్తుగా దేశ విభజనకు కారకుడైన మహమ్మద్‌ అలీ జిన్నా బిజెపి నేతలకు ఎందుకు గుర్తుకు వస్తున్నాడు... ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది. జిన్నాను సొంతం చేసుకోవటం వల్ల బిజెపికి కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమైనా ఉందా? ముస్లింలలో తమ పట్ల సానుకూల వైఖరిని పెంచుతుందని ఆలోచిస్తున్నదా? తనపై ఉన్న మతతత్వ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నదా?
కానీ, బిజెపి మాత్రం ఆ దిశగా ప్రయోజనం పొందిన దాఖలా లేదు. ఎందుకంటే 2005లో అద్వానీ పాకిస్తాన్‌లో జిన్నా సమాధికి మోకరిల్లినప్పుడే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. తన పార్టీలోని నేతలే అద్వానీని వేలెత్తి చూపించారు. మాతృసంస్థ తీవ్రంగా మందలించింది. పార్టీపట్ల వ్యతిరేకతను తొలగించుకోవటానికి అద్వానీని అధ్యక్షపదవి నుంచి తొలగించారు. ఇప్పుడు జస్వంత్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. జిన్నా విషయం ప్రస్తావనకు వచ్చిన రెండుసార్లూ బిజెపి రక్షణాత్మక పరిస్థితిలో పడిందంటే... జిన్నాను సొంతం చేసుకోవటం దాని వల్ల కావటం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రజల్లో వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవటం కోసం అద్వానీ, జస్వంత్‌లు ఇలా చేశారా? కానీ అలా కూడా జరగలేదు. జిన్నాను ప్రశంసించటం వల్ల ఇద్దరి పరువు ప్రతిష్ఠలు మసకబారాయే కానీ, ఇనుమడించలేదు. పైగా పాకిస్తాన్‌కు భారత్‌పై విరుచుకుపడటానికి మరింత అవకాశం ఇచ్చినట్లయింది. అక్కడి మీడియా నాటి వ్యాఖ్యలకు, నేటి రాతలకు తెగ ప్రాధాన్యం ఇచ్చి రాసేశాయి. ప్రసారం చేసాయి.
నిజానికి దేశ విభజనకు సంబంధించి మొదట్నుంచీ బిజెపి నెహ్రూను టార్గెట్‌ చేసుకుంది. విభజనకు జిన్నా ఎంత బాధ్యుడో.. అంతకంటే ఎక్కువ బాధ్యుడు నెహ్రూ అన్నది బిజెపి వారి అభిప్రాయం... ఈ విషయంలో ఎన్నో వాదోపవాదాలు ఇంతకు ముందే జరిగాయి. వాస్తవానికి 1930వ దశకం వరకు సెక్యులర్‌ వాదిగా ఉన్న జిన్నా ఎందుకంత సడన్‌గా మతోన్మాదిగా మారాడన్న విషయంపైనా వివాదం ఉంది. జిన్నా అలా మారటం వెనుక కాంగ్రెస్‌ బాధ్యత ఎంత ఉన్నదన్న అంశమూ వివాదాస్పదమే. అంతా జరిగింది. కానీ, 60 ఏళ్ల తరువాత ఇప్పుడు నాటి కంపను కదిలించటం అవసరమా? దీనివల్ల బిజెపి నేతలు సాధించిందేమిటి? మరింత నైతికంగా దెబ్బ తినటం తప్ప. పైగా ఇప్పటి వరకు నెహ్రూకే బిజెపి వ్యతిరేకత పరిమితమైతే... ఇప్పుడు జస్వంత్‌ సర్దార్‌ పటేల్‌ను సైతం ఈ ముళ్లకంపలోకి లాగారు... సీనియర్‌ నాయకుల ఈరకమైన వివాదాస్పద ధోరణి దేనికి సంకేతం?

కామెంట్‌లు లేవు: