31, ఆగస్టు 2009, సోమవారం

దేశం గుండెలో రోజా ముల్లు


సినిమాల్లో ఏ నటులకైనా బ్రేక్‌ రావాలంటే పెద్ద బ్యానర్‌ దొరకాల్సిందే.. చిన్న చిన్న బ్యానర్లలో, లోబడ్జెట్‌ సినిమాల్లో ఎన్నింటిలో నటించినా ఫలితం అంతంత మాత్రమే.. ఆ సినిమాలు ఎంత సక్సెస్‌ అయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు... కానీ, అదే నటీనటులు పెద్ద బ్యానర్లలో ఒకటి రెండు సినిమాల్లో చాన్‌‌స దక్కించుకున్నా, మినిమమ్‌ బ్రేక్‌ గ్యారంటీ ఉంటుంది. సినీనటి ఉరఫ్‌ రాజకీయ నేత రోజాకు ఇది అనుభవ పూర్వకమైన వ్యవహారమే... ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆమె అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు.. ఇప్పుడు తెలుగుదేశం బ్యానర్‌ వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో... హాట్‌ హాట్‌ ఇమేజితో దూసుకుపోతున్న వైఎస్‌ బ్యానర్‌ వైపు మళ్లారు.. ప్రోత్సాహం ఉన్నచోటికే కళాకారులు వెళ్తారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమెకు ప్రోత్సాహం కరవైంది. వైఎస్‌ హస్తవాసి సక్సెస్‌ అయింది. దేశం గుండెల్లో రోజా ముల్లు గుచ్చుకుంది.
నెల రోజుల క్రితం వరకు ఆమె చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ... ఇప్పుడు బాబు గారు ఆ చెల్లెమ్మను పట్టించుకోని అన్నయ్య.. అందుకే మరో అన్నయ్యను వెతుక్కుంటూ రోజా వెళ్లిపోయారు.. రాజకీయంగా తనకు పుట్టుకనిచ్చి, ఎదుగుదలకు చేయూతనిచ్చిన తెలుగుదేశం పార్టీకి షాక్‌ ఇచ్చి రాజావారి కోటకు తరలిపోయారు..

రాజకీయాలంటేనే శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. ఎన్నికల ముందు విడిపోయిన వారు ఎన్నికల తరువాత కలిసిపోతారు.. ఎన్నికల ముందు కలిసి పోయిన వారు ఆ తరువాత వెళ్లిపోతారు.. ఈ జంపింగ్‌‌స కొందరికి రాజకీయంగా అనూహ్య లాభాల్ని తెచ్చిపెడితే.. మరి కొందరి పాలిటి ఆత్మహత్యాసదృశమవుతుంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలనేవి ఉండవు మరి...
లేటెస్టుగా రోజా విషయానికి వస్తే... తెలుగుదేశం పార్టీలో ఫైర్‌బ్రాండ్‌.. సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా ఆమె కనిపించారో...రాజకీయాల్లో అంత దూకుడుగా దూసుకుపోయారు.. తెలుగుదేశం పార్టీలో ఎంత వేగంగా ఆమె ఎదిగారో.. అంతే వేగంగా కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిపోతున్నారు.. ఇందుకు అసలు కారణాలు ఏమైనా ఉండవచ్చు...... కానీ, పార్టీ అధినేత చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో తన గెలుపు విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యమేనన్నది రోజా ఇప్పుడు చెప్తున్న కారణం...
ఎంత ఆశ్చర్యం.. నెల రోజుల క్రితం తాను చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ అని స్వయంగా చెప్పుకున్న రోజాయేనా ఇలా మాట్లాడేది... గతంలో వైఎస్‌ను అడ్డగోలుగా తిట్టిన రోజాయేనా ఈమే.. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి...
ఇప్పుడు ఆమె వినిపిస్తున్న రాజశేఖర చరిత్ర ఎంత వినసొంపుగా ఉందో ఆలకించండి...
రాఖీ పౌర్ణిమ నాటి రోజా కాదు.. ఈమె.. నాడు ఆమె చంద్రబాబుకు చంద్రగిరి చెల్లెమ్మ.. తెలుగుదేశం పార్టీకి అగ్గి బరాటా.... ఇప్పుడు చేయి మారింది. స్వరమూ మారింది... రోజా తీరూ మారింది... కాంగ్రెస్‌కు తిరుగులేని అస్త్రంగా వేషమూ మార్చుకుంటోంది. రాజకీయాల్లో ఏదీ నష్టం కాదు.. ఒకసారి ఒకరికి లాభం చేకూరిస్తే.. మరొకసారి మరొకరికి లబ్ధి కలిగిస్తుంది. మొన్న చంద్రబాబును పొగిడిన రోజాయే.. ఇప్పుడు వైఎస్‌లో మహాపురుషుణ్ణి దర్శించుకున్నారు.. గొప్ప వ్యక్తిని చూస్తున్నారు.. ఎన్నికల ముందు ప్రజల పాలిటి రాక్షసుడిగా కనిపించిన వైఎస్‌.. ఇప్పుడామె కళ్లకు దిగివచ్చిన దేవుడయ్యారు..మాట మారటం.. చేతమారటం భారత దేశ రాజకీయ రక్తంలో ప్రవహిస్తోంది. రోజా మాత్రం ఇందుకు మినహాయింపు ఎలా అవుతారు.. ?
2
ఒక్క రోజా తెలుగుదేశం పార్టీని వీడిపోయినంత మాత్రాన ఎందుకింత రాద్ధాంతం? గతంలో ఎంతమంది వెళ్లిపోలేదు.. ఎంతమంది వచ్చి చేరలేదు.. పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి వాడుగా పేరు తెచ్చుకున్న దేవేందర్‌గౌడ్‌ వెళ్లిపోతేనే పార్టీ చెదరలేదు.. కానీ, రోజా విషయంలో ఇంత ఆందోళన దేనికి? కారణం.. ముఖ్యమంత్రి వైఎస్‌... నాయకులు పార్టీలు మారటంపై సహజంగా అధినేతలు పెదవి విప్పరు.. కానీ, „రోజా విషయంలో నెల క్రితం వైఎస్‌ ఏదైతే చెప్పారో.. ఇప్పుడు అదే జరిగింది. తాను అనుకున్నది అనుకున్నట్టు వైఎస్‌ సాధించి తీరుతారన్నది రుజువు చేసుకున్నారు.. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటం కాదు.. ఏకంగా ప్రత్యర్థి వర్గమన్నదే లేకుండా చేసుకోవటం లక్ష్యంగా వైఎస్‌ నడత కనిపిస్తోంది.
రాజకీయ కూటనీతిలో వైఎస్‌కు సాటిరాగల వాళు్ల ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో లేరనే చెప్పాలి.. తన పార్టీలో తనకు ఎదురు లేకుండా చేసుకోవటమే కాదు... రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీకీ కునుకులేకుండా చేయటం వైఎస్‌కే చెల్లింది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తరువాత గెలిచిన పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల్లో కనీసం ఆరు నెలల పాటైనా స్తబ్దత నెలకొటుంది. సర్కారుపై విరుచుకుపడటానికి గొప్ప అస్త్రం దొరికిన తరువాత కానీ వీధుల్లోకి రావు.. కానీ, మన రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ప్రశాంతత లేదు. మొన్నటిదాకా తెలంగాణ రాష్టస్రమితి కుము్మలాటలతో కల్లోలమైపోయింది. ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకూ నిద్రలేదు. చాపకింద నీరులా వైఎస్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష ఏ స్థాయిలో రాజకీయ పార్టీలను కుదిపేస్తున్నదనటానికి ఇందుకు నిదర్శనం... టిఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల నుంచి ఫైర్‌బ్రాండ్‌ రోజా దాకా వైఎస్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారనే చెప్పాలి... నెల రోజుల క్రితం రోజా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న వార్తను మొదట లీక్‌ చేసింది సాక్షాత్తూ వైఎస్సే... తాను తలుపులు తెరుచుకుని ఉంటే ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరూ మిగలరని కూడా అన్నారు.. కానీ, ఆరోజు రోజా తాను తెలుగుదేశం పార్టీలో నిజాయితీగల కార్యకర్తలా గొప్పగా గొప్పలు చెప్పారు... వైఎస్‌ మాటల్ని నిర్ద్వంద్వంగా ఖండించారు..
నెలైనా కాకుండానే పరిస్థితి తిరగబడింది. రోజా మాట మారింది. వైఎస్‌ మాటే నెగ్గింది... ఈరోజు అసెంబ్లీలో ఇష్టాగోష్టిగా విలేఖరులతో మాట్లాడిన వైఎస్‌ ఆ మాటా అనేశారు.. తన మాటలో విశ్వసనీయత ఎంతో రోజా రాక చెప్పకనే చెప్పిందన్నారు...ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది.
ఫలితాలు వెల్లడైన నాటి నుంచే వైఎస్‌ వూ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ ఇక ఫినిష్‌ అన్నట్లుగా అసెంబ్లీ లాబీల్లో చేసిన కామెంట్‌, వైఎస్‌ ఎంత దూకుడుగా వ్యవహరించబోతున్నదీ అర్థం అవుతోంది. రోజా వ్యవహారమే టిడిపిలో వేడి పుట్టించిందనుకుంటే ఇవాళ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెళ్లి సిఎంను కలవటం పార్టీని మరింత కలవరపెట్టింది.
ఆపరేషన్‌ ఆకర్ష ఎంత ఊపందుకుందో ఒక్కరోజులో జరిగిన పరిణామాలే తార్కాణం. రోజా సిఎంను కలిసి 24 గంటలైనా కాకుండానే, పిఆర్‌పి నుంచి కాటసాని, శోభానాగిరెడ్డి సిఎంను కలిసారు.. మరోపక్క ఎంపి ఉండవల్లి, ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌లు చిరంజీవి దగ్గరకు వెళ్లి మంతనాలు జరిపారు..
ఒక్కమాటలో చెప్పాలంటే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన రోజునుంచే దీర్ఘకాలిక వూ్యహంతో వైఎస్‌ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారన్నది వాస్తవం... పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం నిరాటంకంగా చేస్తున్న అధికార ప్రస్థానాన్ని వైఎస్‌ ఆదర్శంగా తీసుకున్నట్లే కనిపిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2014 నాటికి తనకు బలమైన ప్రత్యర్థి లేకుండా చేయటం ఆయన ఆపరేషన్‌ ఆకర్షకు అసలు టార్గెట్‌గా అయి ఉండవచ్చు.

4 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

ఇప్పుడు "మద్యం మాంద్యం నేపధ్యంలో దాని అవశ్యకత" అనే విషయంలో రోజా T.V. ల్లో మాట్లాడుతుంటే చూడాలని వుంది. రాజశేఖరుడీవిధంగా ముందుకేళితే 2014 కి ఈయనే ఏకగ్రీవంగా C.M. ఐపోతారనిపిస్తుంది. శభాష్... రాజకీయ విలువల్ని ఇనుమడింపజేస్తున్నారు.

అటు చంద్ర బాబు గారు మాత్రం తక్కువతిన్నారా? దేవేందర్ గౌడ్ ని ఆయనమాత్రం లాక్కోలేదూ?

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

mmmmm bagundi........eendau lo work chestunnavani aa party ki support cheyaku......prp nundi devender velte aaparty asamardhatanaa,ippudemo roja tappuna......stupidity ...........

papers varake anukunna blogs koodana....

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Anil Dasari చెప్పారు...

తొమ్మిదేళ్ల పాటు బాబు హవా నడిచింది. ఇప్పుడు రెడ్డి రోజులు నడుస్తున్నాయి. ఓడలు బండ్లయ్యాయి. బండ్లు మళ్లీ ఓడలవుతాయి. ఆ మార్పు తప్పదు. మారనిది మాత్రం జనాల తలరాతలే. అయితే దానిక్కారణమెవరు? సదరు జనాలే. అన్నీ ఊరికే కావాలనుకునే మనస్తత్వం మారితేనే భవిత.