19, ఆగస్టు 2009, బుధవారం

శాంభవి ది లిటిల్ బుద్ధ

కర్నూలు జిల్లా లో సూర్యనందికి ఉన్నట్టుండి ప్రాధాన్యం వచ్చేసింది. వారణాసికి చెందిన ఓ ఏడేళ్ల చిన్నారి శాంభవి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తోంది. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా ఆమెను తన వారసురాలిగా ప్రకటించబోతున్నట్లు శాంభవి సంబంధీకులు ప్రచారం చేసేస్తున్నారు. పూర్వ జన్మలో దలైలామాకు తాను స్నేహితురాలినని చెప్పుకుంటున్న శాంభవి ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. చిన్నారి పిల్ల చేష్టలు చేస్తూనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తోంది. ఉత్తరాది అమ్మాయని ఆమె సంబంధీకులు చెప్తున్నా... తెలుగు చక్కగానే మాట్లాడుతోంది. చిన్న పిల్ల కాలజ్ఞానాన్ని బోధిస్తున్నదని జిల్లా అంతటా తెగ ప్రచారం కావటంతో తండోపతండాలుగా జనసంచారమూ మొదలైంది... తెల్లని బట్టలు వేసుకుని చిన్నారి బుద్ధగా కొప్పును తీర్చిదిద్దుకున్న శాంభవి తనదైన సై్టల్లో ప్రసంగించటం ప్రారంభించింది...

శాంభవిని దైవ స్వరూపంగా అమాయక జనం నమ్మటానికి ఎంతోకాలం పట్టలేదు. ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు...దీంతో కేర్‌టేకర్‌ ఉషారాణి ఆమెను రహస్యంగా ఆమెను తతరలించింది. ఇదేమని అంటే దలైలామా ఆదేశానుసారమే అలా చేశానని చెప్తోంది. వారణాసిలో ఆమె పేరెంట్‌‌స దగ్గరకు తరలిస్తున్నట్లూ వివరిస్తోంది...
శాంభవి చెప్తున్న దానిలో మరో ముఖ్యమైంది ఏమంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మళ్లీ పుడుతున్నారని. ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతోందని ఆమె చెప్తోంది. 2012లో వీరబ్రహ్మేంద్రస్వామి తిరిగి జన్మించి దుష్టశిక్షణ చేస్తారట...
విచిత్రమేమంటే.. శాంభవిని చూసేందుకు వచ్చిన వారిలో ఎక్కువమంది భక్తి కంటే ఆసక్తితోనే రావటం విశేషం... తీరా వచ్చాక ఆమెను అజ్ఞాతంలోకి తరలించటంతో ప్రజల్లో చిన్నారి చెప్తున్న మాటల్లో విశ్వసనీయత ఎంత అంటే అనుమానాస్పదంగా మారింది.

ఇంతకీ ఈ బాలిక ఎవరు? కేర్‌టేకర్‌ ఉషారాణితో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? శాంభవి ఏ ప్రాంతం నుంచి వచ్చింది.? తల్లిదండ్రులు ఎవరు... అన్నీ జవాబు లేని ప్రశ్నలే....
అసలు శాంభవి... ఓ మిస్టరీ.. సూర్యనంది క్షేత్రంలో ఈమె ఎవరికీ తెలియదు.. ఆ అమ్మాయితో పాటు కేర్‌టేకర్‌గా ఉన్న ఒకే ఒక మహిళ ఉషారాణి... శాంభవి గురించి ఉషారాణికి, ఉషారాణి గురించి శాంభవికి తప్ప వారి గురించి మూడో వ్యక్తికి తెలియదు.. శాంభవికి రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అడపా దడపా సూర్యనంది క్షేత్రానికి రావటం, అక్కడ కొన్నిరోజులు ఉండటం, తరువాత ఎక్కడికో వెళ్లిపోవటం రెగ్యులర్‌గా జరుగుతోంది... పదిహేను రోజులకు పైగా శాంభవి సూర్యనందిలో బసచేయటం ఇదే మొదటిసారి. శాంభవికి తాను తల్లిని కాదని, తాను కేవలం కేర్‌టేకర్‌నన్నది ఉషారాణి మాట. మరి తల్లిదండ్రులెవరన్నది చెప్పమంటే అదంతా సీక్రేట్‌... చైనా ప్రభుత్వం నుంచి శాంభవికి ముప్పు ఉంది కాబట్టి, గుట్టుగా ఉంచాలని దలైలామా ఆదేశించారట...
మరి ఉత్తరాది అమ్మాయి తెలుగు ఎలా మాట్లాడగలుగుతోంది.. అదీ ఓ మిస్టరీయే... ఆమె మొదటిసారి మహానందికి వచ్చినప్పుడు ఆమెకు హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చంట. అక్కడి నుంచి సూర్యనంది క్షేత్రంలో ప్రవేశించగానే తెలుగు అనర్గళంగా మాట్లాడటం మొదలు పెట్టిందట.
బౌద్ధమతం స్వీకరించకుండానే ఆమె బౌద్ధం గురించి మాట్లాడుతోంది. టిబెటన్లకు వచ్చే రెండేళ్లలో స్వేచ్ఛ లభిస్తుందనీ చెప్తోంది. 71 ఏళ్ల క్రితం దలైలామా తనకు స్నేహితుడని, హిమాచల్‌ ప్రదేశ్‌లో తామిద్దరం కలిసి ఉన్నామని శాంభవి చెప్తోంది. తన కోసమే డిసెంబర్‌ 21న దలైలామా సూర్యనందికి వస్తున్నట్లు కూడా ఆమె వివరిస్తోంది. వీటిలో వాస్తవం ఎంత అంటే ప్రశ్నార్థకమే...
దలైలామా రాక గురించి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు బౌద్ధమత ప్రచారకులు లేఖ రాసిన మాట వాస్తవం. సూర్యనంది క్షేత్రం ప్రశస్తి గురించి శాంభవి, ఆమె పెద్దలు, ఇతరులు చెప్పిన వివరాల ప్రకారం ఆ క్షేత్రాన్ని సందర్శించేందుకు లామా వస్తున్నట్లు దలైలామా శిష్యులు చెప్తున్నారు. అంతమాత్రం చేత దలైలామా ఆమెను తన వారసురాలిగా ప్రకటించేస్తారని గుడ్డిగా నమ్మేదెలా?
శాంభవి, ఆమె కేర్‌టేకర్‌ చెప్పుకుంటున్నట్లు దలైలామా ఆ అమ్మాయిని తన వారసురాలిగా ప్రకటిస్తారన్న మాటలు వినటానికి బాగానే ఉంటాయి. కానీ, తమ మత గురువును ఎన్నుకోవటం అంత తేలికైన విషయమేం కాదు.. దానికి ఎన్నో కసరత్తులు ఉంటాయి. అవన్నీ తెలిసే శాంభవి కేర్‌టేకర్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారా? లేక వేరే మతలబు వేరే ఉందా?
***
లామా అంటే బౌద్ధమతాచార్యుడని సాధారణ అర్థం. పాశ్చాత్యులైతే హిస్‌ హోలీనెస్‌.. అని అంటుంటారు.. తమ గురువులు పునర్జన్మ ద్వారా మళ్లీ పుడతారని బౌద్ధ మతస్థులు విశ్వసిస్తారు.. ఆ ప్రకారంగానే ఒక లామా నిర్యాణానంతరం మరో లామాకోసం అన్వేషిస్తారు.. పునర్జన్మను పూర్తిగా విశ్వసించేవారిలో బౌద్ధ మతస్థులు ముఖ్యులు..టిబెటన్ల విశ్వాసం ప్రకారం మళ్లీ జన్మించిన తమ ఆచార్యుణ్ణి కనుక్కునేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి రెండుమూడేళ్లకు తక్కువేం కాదు...
టిబెట్‌ స్థానిక రాజకీయ సంస్థలు, బౌద్ధారామాలు కలిసి ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటాయి. కొంతమంది ఎంపిక చేసిన బౌద్ధ మతగురువులు కలిసి లామా అన్వేషణలో పాలుపంచుకుంటారు. ఇప్పటివరకు పధ్నాలుగు మంది లామాలు వచ్చారు. ప్రస్తుతం ఉన్న దలైలామా 15వ మత గురువు. ఈ దలైలామా ఎన్నికకు మూడు సంవత్సరాలు పట్టింది. లామా ఫలానా దేశంలోనే పుట్టాలన్న నియమం ఏమీ లేదు. కానీ, ఒక్క మూడో మతగురువైన తుల్కు మంగోలియాలో పుట్టినప్పటికీ, మిగతా వారంతా టిబెటన్లే కావటం విశేషం. పైగా చైనా ఆధిపత్యంలో నడిచే ఏ దేశంలోనూ లామాలు పునర్జన్మించరన్న నమ్మకమూ టిబెటన్లకు ఉంది. టిబెటన్లను చైనా మోసం చేసి దురాక్రమించటం ఈ నమ్మకానికి ప్రధానకారణం..
ఇంత తతంగం ఒక లామాను ఎన్నుకునేందుకు జరుగుతుంటే... దాన్నంతటినీ కాదని శాంభవిని ఎంపిక చేస్తారని ఎవరైనా ఎలా ఊహిస్తారు.? నమ్మటానికి ఎంతమాత్రం హేతువు లేని పరిస్థితి ఇది. ఆమె బౌద్ధ మతస్థురాలు కాదు.. బౌద్ధమతం స్వీకరించలేదు. కానీ, టిబెటన్లంటే ఇష్టపడుతోంది. టిబెట్‌కు రానున్న రెండేళ్లలో స్వతంత్రం వస్తున్నదని చెప్తోంది. భారత్‌లోనే ఉంటానంటోంది. బౌద్ధిజాన్ని అనుసరిస్తానంటోంది. లామాకు వారసురాలవుతుందని ఆమె సంబంధీకులు చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్కదానికీ మరోదానితో పొంతన లేదు. అలాంటప్పుడు ఈ రకమైన ప్రచారానికి అర్థం లేదు.
ఇందులో మరేదైనా మతలబు ఉందేమోనని అనుమానించేవాళూ్ల లేకపోలేదు. ఎందుకంటే సూర్యనంది క్షేత్రం పూర్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ దేవాలయ భూములు అనేకం ఉన్నాయి. డిసెంబర్‌ 21న దలైలామా సూర్యనందికి వచ్చినప్పుడు బౌద్ధారామానికి శంఖుస్థాపన చేస్తారని చెప్తున్నారు. ఆ భూమి దేవాఆలయ భూమిగా చెప్పుకుంటన్నారు. శాంభవి గురించిన పూర్తి సమాచారం తెలిస్తే తప్ప వాస్తవాలు వెలుగుచూడవు.

కామెంట్‌లు లేవు: