7, ఏప్రిల్ 2009, మంగళవారం

వీళ్లేనా యువనేతలు?

మన ప్రజాస్వామ్యం రాజరికానికి భిన్నం కాదు... కాళు్ల, కళు్ల సహకరించకపోయినా సరే మంత్రి పదవులను అనుభవించాలనే దుగ్ధ లేని నేతలు భారత దేశంలో కనిపించరు. దేశానికి యువతదే ప్రధాన శక్తి అంటూ వివేకానందుడు చెప్పాడని.. యువకులు రాజకీయాల్లో ముందుండాలని వేదికలపై ఉపన్యాసాలు దంచే లీడర్లకు మన దగ్గర కొదవే లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో పాత నీరు పోయి కొత్త నీరు ప్రవేశిస్తోందని భుజాలు చరుచుకుంటున్నాయి.. తొలి లోక్‌సభలో అభ్యర్థుల కనీస వయస్సు 42 సంవత్సరాలైతే.. 14వ లోక్‌సభలో సభ్యుల కనీస వయస్సు 26 సంవత్సరాలంటూ లెక్కలు గొప్పగా చెప్తారు.. కానీ వాస్తవం ఏమిటి? లోక్‌సభలో కొద్దో గొప్పో ప్రవేశిస్తున్న యువత అంతా వారసత్వంగా రాజకీయాన్ని వృత్తిగా స్వీకరించిన వారే.. గాడ్‌ ఫాదర్‌లు లేకుండా స్వతహాగా రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల గుమ్మం తొక్కిన యువత శాతం ఎంత అని ప్రశ్నిస్తే... జవాబు సున్నాయే.... ``భారత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. అన్ని రాజకీయ పార్టీల్లో పాత నీరు పోయి కొత్త నీరు ప్రవేశిస్తోంది. వేగంగా, చురుకుగా, సమర్థంగా వ్యవహరించే నాయకుల తరం అన్ని పార్టీల్లో ఎదుగుతోంది.'' ఇదంతా ఓ ట్రాష్‌...స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దశాబ్దాల అనారోగ్యంతో, వృద్ధాప్యంతో, అంపశయ్యపై నుంచి కూడా రాజకీయాలు చేసే నాయకత్వం చేష్టలుడిగే దాకా యువతరానికి రాజకీయ అవకాశాలు రానే రానప్పుడు రాజకీయాలపట్ల ఆకర్షితులయ్యేదెప్పుడు? దేశ పునర్నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాల్సిన యువతరం రాజకీయం అంటేనే అసహ్యం వేసే పరిస్థితి కలిగింది. ఎన్నికల వ్యవస్థ పైనే విశ్వాసం కోల్పోయిన వాతావరణంలో నేటి యువత ఉంది. డిగ్రీలు పూర్తయిన తరువాత కేవలం ప్రభుత్వోద్యోగాల కోసమో, విదేశాలకు వెళ్లడమో, లేక ఇతర రంగాలనే వృత్తిగా స్వీకరించే యువత, రాజకీయాలనూ ప్రొఫెషనల్‌గా తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? ఆసక్తి చూపుతున్నా కొద్దిమందికైనా పార్టీలు పూర్తిగా తలుపులు తెరవడం లేదు. యువతపై నమ్మకముందంటూనే వారికి టికెట్లు కేటాయించడంలో వెనకాడుతున్నాయి. యువ నాయకులు తమ వయస్సున్న ఓటర్లను విశేషంగా ఆకర్శిస్తారనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీల్లో ప్రవేశించే సినిమా తారల కంటే కూడా అప్పుడే డిగ్రీలు పుచ్చుకుని కళాశాలల నుంచి బయటకు వచ్చిన యువతీ యువకుల ప్రవేశం వల్ల రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందన్నది నిర్వివాదం. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విస్తృతంగా విస్తరించిన ఈ సైబర్‌ ఏజ్‌లో యువరక్తం లేకుండా రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు వామపక్ష పార్టీలు సైతం మినహాయింపు కాదు. అయినా యువత ఎంతమాత్రం రాజకీయం వైపు తొంగి చూసే సాహసం చేయటం లేదు. పధ్నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా దేశంలోని పదిహేను శాతం యువత ఓటు హక్కును వినియోగించుకుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఇదే అత్యధికం అంటే ముక్కున వేలేసుకోవలసిందే. రాజకీయాల్లోకి యువతరం రావాలని ఎవరు ఎంతగా కోరకుంటున్నా వారికి పూర్తిగా దీనిపై విముఖత తొలగిపోలేదు. అదొక ఊబి అనే చాలామంది భావిస్తున్నారు. అనవసర వివాదాలు, విమర్శలు మినహా మరే ప్రయోజనం ఉండదనే వారి అభిప్రాయం... 1950 నాటికీ, ఇప్పటికీ లోక్‌సభల్లో ప్రవేశించిన యువ నేతల సంఖ్య రెట్టింపు కావచ్చు. అయితే ఇది ఎలా సాధ్యపడింది. కొత్తగా వచ్చిన యువకులంతా ఎవరు? వీళ్లంతా వారసులే కావటం నిప్పులాంటి నిజం. తమ సంతానమో, ఇతర బంధువర్గమో రాజకీయాల్లోకి వచ్చేసినంత మాత్రాన్నే... యువశక్తి అంతా రాజకీయాల్లోకి వచ్సేసినట్లు రంగు పులుముతున్నారు. షాన్‌వాజ్‌ హుస్సేన్‌, ఒమర్‌ అబ్దుల్లా, రాహుల్‌ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌, దుష్యంత్‌సింగ్‌, మానవేంద్ర సింగ్‌ అంతా 20 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సున్న నాయకులే అయినా అంతా రాజకీయ కుటుంబాల వారసత్వాన్ని ఆస్తి పంచుకున్నట్లుగా పంచుకున్నవారే. సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం అయిన తరువాత దేశ రాజకీయాలు ఓ క్రమంలో మారుతూ వస్తున్నాయి. అన్ని పార్టీలూ వూ్యహ ప్రతివూ్యహాలు చేయడంలో అన్ని పార్టీలూ కొత్త కొత్త నాయకులను రంగం మీదకు తీసుకువచ్చాయి. సీనియర్‌ నాయకులు తమ వారసులను రంగం మీదకు తీసుకువచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌గాంధీ, వరుణ్‌ గాంధీ, రాజస్థాన్‌లో మానవేంద్ర సింగ్‌, సచిన్‌ పైలట్‌, దుష్యంత్‌ సింగ్‌, తమిళనాడులో ఎంకెస్టాలిన్‌, దయానిధి మారన్‌, కేరళలో మురళీధరన్‌... ఇలా అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో వంశ పారంపర్య వ్యవస్థ ప్రారంభమైంది. వయసుపైబడ్డ నాయకులు ప్రత్యక్షరాజకీయాల నుంచి తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని యంగ్‌ జనరేషన్‌ కోరుకుంటోంది. తమకు అవకాశమిస్తే దేశ భవిష్యత్‌ను మారుస్తామని వారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. పధ్నాలుగో లోక్‌సభలో ప్రజాప్రాతినిథ్యం వహించిన నాయకుల్లో 1960 తరువాత జన్మించిన వారు 75 మంది ఉన్నారు. లోక్‌సభ సభ్యుల్లో 28 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వారే. వీరిలో అతి పిన్న వయస్కుడుగా సచిన్‌పైలెట్‌ రికార్డు సృష్టించారు. 26ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభలో అడుగుపెట్టారు. సెప్టెంబర్‌ 7, 1977న జన్మించారు. 1987లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీపై బోఫోర్సు శతఘ్నల ముడుపుల ఆరోపణలు రావడం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైన సంధిదశలో దేశ రాజకీయాల్లో అనేక కొత్త ముఖాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పదేళ్లలో జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. ఇలా కొత్తగా వచ్చిన వారిలో చాలా మంది ఎమర్జెన్సీ నాటి యంగ్‌టర్‌‌క్స కావటం గమనార్హం. వీరు రాజకీయంగా ఎదగడానికి దశాబ్దం పట్టింది. ఒక మారుమూల నియోజక వరా్గనికి ఎమ్మెల్యేగా ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ సమాజ్‌వాది పార్టీని స్థాపించి ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పాత్రధారిగా మారిపోయారు. ఒక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న మాయావతి హఠాత్తుగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రాంతీయ రాజకీయాలు తప్ప ఢిల్లీ ముఖం చూడని దేవెగౌడ రాత్రికి రాత్రి ప్రధానమంత్రి అయిపోయారు. రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో రాజకీయాలు చేస్తున్న నాయకులు కాస్తా ఒక్కసారిగా కేంద్ర మంత్రి పదవులు అలంకరించారు. ఇలాంటి వారిలో యంగ్‌టర్‌‌క్సను భూతద్దం పెట్టి వెతికినా దొరకరు. ఈ పరిస్థితి కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం అయింది. కనీసం ఈ వారసులైనా సరే దేశ రాజకీయాల్లో కొత్త రక్తాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించటం తప్పనిసరి. వీళూ్ల స్వతంత్రంగా వృద్ధతరంపైనే ఆధారపడితే ఇక ఈ వ్యవస్థ బాగుపడటాన్ని ఊహించలేం... దేశంలోని సగం జనాభా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు మధ్యే ఉంటుందని స్పష్టం. వీరిని విస్మరించి ఏ పార్టీ కూడా ముందుకు పోలేదు. ఏళ్ల తరబడి ఒకే నాయకత్వాన్ని భరించే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ ప్రస్తుతం లేదు. మార్పుకు ఒప్పుకోకుంటే పార్టీ కార్యకర్తల్లో స్పష్టంగా తిరుగుబాటు వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే సమీప భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలకూ యువతే మార్గదర్శకత్వం వహిస్తుందనడంలో సందేహం లేదు. 14వ లోక్‌సభలో మన ఎంపిల వయస్సు వయస్సు సభ్యులు 25-30 2 31-40 33 41-50 101 51-60 157 61-70 150 71-80 54 81-90 9

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ముందుగా యువత అంతా ఓటు వెయ్యగలిగేలా చూడాలి. చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో స్వంత ఊళ్ళు వదిలి వేరే చోట ఉంటున్నారు. ఓటుని ఒక చోటునుంచి ఇంకోచోటుకి బదిలీ చేసుకోవడం సులభమయితేనే యువత అంతా ఓటు వేస్తారు. ఆ తరువాతే వాళ్ళని రాజకీయాలలోకి రప్పించవచ్చు.
సామాన్యుడు ఎన్నికలలో నిలబడగలిగే పరిస్థితి రానంతవరకు, వారసులే వస్తారు.

అజ్ఞాత చెప్పారు...

watch
24gantalu.blogspot.com

అజ్ఞాత చెప్పారు...

http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/26/detailed-account-of-the-jai-telangana-movement-of-1969-researched-and-arranged-event-wise/