29, మార్చి 2010, సోమవారం

వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది


తిరుమలకు వెళ్తున్నారా?
ఆపద మొక్కుల వాడికి నిలువు దోపిడీ సమర్పించుకుందామనుకుంటున్నారా?
పాపం శ్రీవారే నిలువు దోపిడీకి గురవుతుందే మీరు సమర్పించుకున్నది ఏమవుతుంది?
హుండీలో వేసిన సొమ్ము వేసినట్లుగా మాయమైపోతున్నది..
వెంకన్న ఖజానా నిలువు దోపిడీకి గురవుతోంది.. తిన్నంత వారికి తిన్నంత.. చిక్కినంత వారికి చిక్కినంత అన్నట్లుగా తయారైంది టిటిడిలో వెంకన్న ఆదాయం.. ఇటు నుంచి హుండీలో భక్తులు వేస్తున్న ఆదాయం.. అటు నుంచి టిటిడి అధికారుల ఇళ్లల్లోకి దొడ్డిదారిన.. చక్కగా చేరుతోంది.. దేవుడి సొమ్ము దొంగల పాలు అన్నట్లుగా మారిపోయింది టిటిడి పరిస్థితి.. ఆపద మొక్కుల వాడికి ఎంతో భక్తితో కోట్లాది భక్తులు సమర్పించే విలువైన కానుకలు అడ్డదారిలో అనర్హుల ఇళ్లను బంగారంతో నింపుతున్నాయి...

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ అవినీతికి ఓ ట్రేడ్‌ మార్క్‌.. అదినకాడికి అందినంత దోచుకోవటమే దేవస్థానంలో పనిచేస్తున్న చాలామంది అధికారులు, బోర్డు సభ్యుల ఉద్యోగంగా, వృత్తిగా మారిపోయింది. వీరి దృష్టిలో దోచుకోవటానికి కాదేదీ అనర్హం.. అమ్ముకోవటానికి ఏది దొరికినా సిద్ధమే... అర్హత లేదు.. అనర్హత లేదు.. డబ్బులు కుమ్మరిస్తే ఎవరైనా విఐపియే.. సామాన్యుడు అన్న పదానికి టిటిడి అధికారుల నిఘంటువులో అర్థమే లేదు.. వెరసి ఇవాళ వెంకన్న డబ్బున్నోళ్ల దేవుడిగా మారుతున్నాడు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరుగుతున్న ఆరోపణలు ఇవాళ కొత్తగా వస్తున్నవేం కాదు..కానీ, ప్రస్తుత చైర్మన్‌ ఆదికేశవులు నాయుడి హయాంలో టిటిడి పై వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదు.. రాజకీయ ప్రయోజనం కోసం ఆదికేశవులు నాయుడిని తీసుకువచ్చి టిటిడికి చైర్మన్‌ చేయటం దగ్గర నుంచే వివాదం మొదలైంది.. కరడుగట్టిన సారా కాంట్రాక్టర్‌ను స్వామి వారి సేవలో వినియోగించటమే తప్పు.. ఆయన అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అక్కడ అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టిటిడి చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే శ్రీవారి పవిత్ర ఆనంద విమాన గోపురానికి అనంత స్వర్ణమయం చేస్తామంటూ ఓ భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు.. ఈ పథకం వల్ల తిరుమల సహజత్వం కొల్పోతుందనీ, అనేకానేక శాసనాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని, ప్రముఖులు, ఆగమ పండితులు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ఆయన చెవికెక్కలేదు.. ఆది కేశవులునాయుడికి దన్నుగా మరో లిక్కర్‌ మాస్టర్‌ కింగ్‌ఫిషర్‌ విజయ్‌ మాల్యా ఆరోకోట్ల రూపాయలు సదరు స్వర్ణమయ పథకానికి విరాళమిచ్చారు..
ఇటీవల ఆలయ నిర్వహణలో భాగంగా బోర్డు ఓ ప్లాస్మా టివిని కొన్నది.. దానికి విలువ ౩౩ లక్షల రూపాయలుగా లెక్క చూపించారు.. మార్కెట్‌లో అంత ఖరీదైన టెలివిజన్‌ ఏముందో, ౩౩లక్షల రూపాయల విలువ చేసే అంత గొప్ప టెలివిజన్‌ను మరి టిటిడి వాళ్లు ఎక్కడ కొన్నారో.. దాని గొప్పతనం ఏమిటో వారే చెప్పాలి..
టిటిడి అవినీతి ఆరోపణలకు అంతే లేదు..ప్రత్యేక ఒఎస్‌డి హోదాలో డాలర్‌ శేషాద్రిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వస్తే పట్టించుకున్న నాథుడు లేడు..అధికారికంగా రిటైర్‌ అయి ఆరేళ్లు దాటినా.. దాండిగతనం ద్వారా, విఐపిల దగ్గర తనకున్న పలుకుబడితో బొక్కసం తాళం చెవులు బొడ్లో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నా దిక్కు లేదు.. ఆయనగారి అవినీతి ఎన్ని సార్లు వెలుగులోకి వచ్చినా ఎవరూ ఏమీ చేయలేకపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు...
కొన్నాళ్ల క్రితం గోవిందరాజస్వామి దేవస్థానం పూజారి రమణదీక్షితులు స్వామి వారి నగలను ఏకంగా తాకట్టుపెట్టుకుంటే, ఆ బడుగుజీవిని జైలు పాలు చేసి చేతులు దులుపుకున్నారు కానీ, ఇలాంటి చర్యల వెనుక ఉన్న తిమింగళాలను ఎవరూ ఏమీ చేయలేకపోయారు.. అసలు ఆ కేసు అతీగతీ ఏమిటన్నది ఎవరికీ తెలియదు.. బోర్డు ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తెలియదు..
స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఒకానొక సందర్భంలో శ్రీవారికి అలంకరించిన కోట్ల రూపాయల విలువైన కెంపు పోయింది.. ఎలా పోయిందంటే అధికారులు చెప్పిన కారణం వింటే విస్మయం కలుగుతుంది.. శ్రీవారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు భక్తులు శ్రీవారి వైపు నగదు బిళ్లలు విసురుతారు.. అలా విసిరిన సందర్భంలో ఓ నగదు బిళ్ల తగిలి కెంపు కిందపడి ముక్కలు ముక్కలైపోయిందని, దాని ముక్కలు కూడా దొరకలేదని రికార్డు రాసి కేసు మూసేశారు.. ఇలాంటి వాళ్లను ఏమనాలి? ఏం చేయాలి? నగదు బిళ్ల విసిరితే స్వామి వారి ఆభరణాల్లో భాగమైన కెంపు ఎలా ఊడిపోతుందో పెరుమాళ్లకే తెలియాలి..
ఇక చైర్మన్‌కు, సభ్యుల మధ్య ఉన్న విభేదాల గురించి చెప్పనే అక్కర్లేదు.. బహిరంగంగానే ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకుంటారు.. ఎవరి వాటాలు వారికి దక్కలేదన్నంత స్థాయిలో విరుచుకుపడతారు.. ఒక్కమాటలో చెప్పాలంటే దాయాదుల్లా కొట్టుకుంటారు..
ఇప్పుడు ఈ టిటిడి అవినీతిపై దీనిపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది..సభ్యులు తీవ్రంగా ఆందోళనా వ్యక్తం చేశారు... మంత్రిగారూ జవాబిచ్చారు..అక్కడితో కథ తిరుపతికి చేరిపోయింది. ఇదే చర్చ మరో సందర్భంలో మళ్లీ జరుగుతుంది.. మళ్లీ మళ్లీ జరుగుతుంది.. కానీ, దేవుని సొమ్మును దిగమింగుతున్న తిమింగళాలను నిరోధించటం రాజకీయమే ప్రాణంగా బతికే శాసన వ్యవస్థకు సాధ్యమా?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి