30, మార్చి 2010, మంగళవారం

టార్గెట్‌ పాతబస్తీ

ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో కల్లోలం రేపిందెవరు?
అల్లరి మూకల చేష్టలకు రాజకీయ రంగు పులుముతున్నారా?
శాంతిని మరచి రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయా?
అల్లరిమూకల చేష్టలను అరికట్టే సత్తా పోలీసులకు లేదా?
భాగ్యనగరం బాధలకు బాధ్యులెవరు?
తమ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేస్తున్నారా?
పాతబస్తీ అల్లర్లు... రాజకీయమేనా? ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం దాగి ఉందన్న సందేహానికి పార్టీలు ప్రాణం పోస్తున్నాయి. శాంతియుతంగా ఉన్న ఓల్డ్‌సిటీ ఉన్నట్టుండి భగ్గుమనటానికి కారణం ఏమిటి? ఓ పక్క అల్లరి మూకలు రెచ్చిపోతున్నా వాళ్లను అడ్డుకోవటంలో సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారు. రాజకీయ ప్రయోజనాలే ఇందుకు ప్రధాన కారణాలన్న వాదనలకు ఆధారం లేకపోయినా, అల్లరిమూకల చేష్టలకు మాత్రం రాజకీయ రంగు పులుముతున్నారు.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపటం కోసమే కొందరు అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలూ షికార్లు ల్లో వాస్తవం ఎంత?

పదమూడేళ్ల విరామం తరువాత పాతబస్తీ ప్రశాంతత చెదిరిపోయింది. జెండాల కోసం చిన్నగా ప్రారంభమైన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది.. ఉన్నట్టుండి ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు ఎందుకు రేగాయో ఎవరికీ అర్థం కాలేదు..చిన్న గొడవను చిన్నగా ఉన్నప్పుడే అణచివేయగలిగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉపేక్షించారో అర్థం కాదు.. ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్రకోణం... అదే నిజమైతే.. దీనికి భారీమూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది..
మతమైనా, రాజకీయమైనా... భాగ్యనగరంలో పాతబస్తీ ఫస్ట్‌ టార్గెట్‌... ఏ చిన్న సున్నితమైన సమస్య వచ్చినా.. పాతబస్తీ టెన్షన్‌ పడుతుంది. అయితే ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగే దశను పాతబస్తీ దాటిపోయిందనే ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాం.. ఎందుకంటే.. పాతబస్తీలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుని పదమూడేళ్లు దాటింది...ఇప్పుడు మళ్లీ అవే సన్నివేశాలు.. అవే ఘర్షణలు.. అవే అల్లరిమూకలు.. ఎందుకీ అల్లరి.. కేవలం జెండాల కోసం ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయన్న వాదన ఎంతవరకు వాస్తవం? దీని వెనుక మరే కారణమేదైనా ఉందా? ఇలాంటి అనుమానం రావటానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే జెండాల పేరుతో అల్లర్లు జరుగనున్నాయని కొంతకాలంలో పాతబస్తీలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మామూలు ప్రజలు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం.. అయినా పోలీసులు మాత్రం ఈ అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో అర్థం కాదు.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరించలేదా? లేక తెలిసినా నిర్లిప్తంగా వ్యవహరించారా?
పోలీసుల నిర్లిప్తవైఖరి అనుకోండి.. లేక మరే కారణమైనా కావచ్చు.. అల్లరి మూకల కార్యకలాపాలు రాజకీయం రంగు పులుముకున్నాయి.. పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం ఈ అల్లర్లకు శ్రీకారం చుట్టాయని ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న టాక్‌... అందులో మొదటి ఆరోపణ.. ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపేందుకు ఆయన ప్రత్యర్థులు ఈ చర్యకు పూనుకున్నారని... గతంలో జరిగిన ఘటనలు ఈ పుకార్లకు బలమిస్తున్నాయి. గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి నేదురుమల్లి జనార్థనరెడ్డిని సిఎం చేసిన సందర్భంలో ఇదే విధంగా అల్లర్లు జరిగాయి.. నెంబర్‌ ప్లేట్లు లేని కార్లు పాతబస్తీలో జబర్దస్తీగా తిరిగి గొడవలు సృష్టించాయి. ఆనాడు ప్రతి కాలనీలో యువకులు కర్రలు, ఆయుధాలు పట్టుకుని కాపలా కాసుకోవలసిన పరిస్థితి నెలకొంది.. ఇప్పుడూ మళ్లీ అదే పరిస్థితి తలెత్తనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
అల్లర్ల వెనుక రాజకీయానికి మరోకారణం తెలంగాణ ఉద్యమం కావచ్చన్నదీ మరో సందేహం... ఇటీవల రాష్ట్రంలో తలెత్తిన తెలంగాణ ఉద్యమ సందర్భంలో హైదరాబాద్‌లో ముస్లింలలోని ఒక వర్గం తెలంగాణాకు అనుకూలంగా గళమెత్తింది.. జెఏసిగా కూడా ఏర్పడింది.. హైదరాబాద్‌ ప్రధాన రాజకీయ పార్టీ అయిన ఎంఐఎం మాత్రం తన వైఖరి వెల్లడించలేదు.. ఈ నేపథ్యంలో ఒకటిగా ఉన్న ముస్లింలలో చీలిక రాకుండా ఉండేందుకు ఇలాంటివి జరుగుతున్నాయా అన్న వార్తలు నగరంలో జోరుగా ప్రచారం అవుతున్నాయి.. ఇంకోవైపు బిజెపి అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి రావటం, ఆ పార్టీని తిరిగి బలోపేతం చేయటం లక్ష్యంగా ముందుకు వెళ్తానన్న కొద్ది రోజుల్లోనే అల్లర్లు జరగటం సున్నితమైన ప్రాంతాల్లో తప్పుడు సంకేతాలను ఇస్తోందని కొందరు బాహాటంగానే అంటున్నారు..
శాంతియుతంగా ఉన్న పాతబస్తీని తమ రాజకీయ ప్రయోజనం కోసం కల్లోలం పాలు చేయటం ఎంతవరకు సమంజసం? రాజకీయ ప్రయోజనాలు ప్రధానమైనప్పుడల్లా పాతబస్తీలో రక్తమోడటం మామూలైపోయింది.. అల్లరి మూకలను నియంత్రించలేకపోవటంలో పోలీసుల వైఫల్యం కంటే వాళ్ల చేతులకు సంకెళ్లు వేయటమే ప్రధానంగా కనిపిస్తున్నది... పార్టీలు రాజకీయాలతో చెలగాటమాడుతున్నాయి.. అది ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. అల్లర్లకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్య తీసుకోగలిగిన నాడు.. పాతబస్తీ ప్రశాంతంగా ఉంటుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి