24, మార్చి 2010, బుధవారం

నైతిక విలువలకూ చట్టాలు చేయాలా?


పెళ్లికి ముందు సెక్స్‌ నేరం కాదు.. సహజీవనం వ్యక్తిగత ఇష్టానికి సంబంధించింది.. దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.. వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనటం కానీ, సహజీవనం సాగించటం కానీ, నేరంగా పేర్కొనే చట్టాలు ఏవీ లేవు. అలాంటి చర్యలను ఏ చట్టాలూ నిషేధించలేదు.. కాబట్టి వాటిని తప్పుపట్టలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. వివాహానికి ముందు శృంగారం, సహజీవనం అనేవి నైతికతకు సంబంధించిన అంశాలు.. వాటికి కూడా చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందా? నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా శాసనాలు చేయక తప్పదా? సమాజం కంటే వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమా? సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యానాలు ఒక కొత్త చర్చకు దారి తీశాయి.


అయిదేళ్ల క్రితం ౨౦౦౫లో సినీనటి ఖుష్బూ పెళ్లికి ముందు సెక్స్‌ తప్పేమీ కాదంటూ చేసిన వ్యాఖ్య దేశాన్నంతటినీ ఒక్క కుదుపు కుదిపింది. ఆమెను క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ చేయాలంటూ ఏకంగా ౨౨ కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కొట్టివేయాలని ఖుష్బూ మద్రాస్‌ హైకోర్టు ను ఆశ్రయించారు..కానీ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వేశారు.. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం చాలా తీవ్రమైన వ్యాఖ్యానాలనే చేసింది. పురాణాల్లో చెప్పినట్లు రాధా కృష్ణులే సహజీవనం చేసినప్పుడు, అది తప్పెలా అవుతుందని పేర్కొంది... సుప్రీం కోర్టు ధర్మాసనం ఈకేసును పూర్తిగా చట్టాల చట్రం నుంచి పరిశీలించింది. ఖుష్బూ వ్యాఖ్యల్ని నేరంగా పరిగణించటానికి చట్టంలోని ఏ సెక్షనూ లేకపోవటాన్ని ధర్మాసనం ప్రముఖంగా ప్రస్తావించింది..
రాజ్యాంగంలోని ౨౧వ అధికరణం ప్రకారం సహజీవనం కూడా జీవించే హక్కులో ఒక భాగంగా వస్తుంది కానీ, నేరంగా మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.. అందువల్లే సుప్రీం కోర్టు ఖుష్బూ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా పేర్కొంది.. ఇవి సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని కూడా స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలో ఇంతకాలంగా అనుసరిస్తున్న నైతిక విలువలకు, కట్టుబాట్లకు కూడా చట్టాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది... గ్లోబలైజేషన్‌ ప్రభావంతో పెళ్లికి ముందు సెక్స్‌ను, సహజీవనాన్ని అంగీకరిస్తే దాని పరిణామాలు సమాజంపై ఏ విధంగా చూపిస్తాయన్న ప్రశ్నా వ్యక్తమవుతోంది..


సుప్రీం కోర్టు తన వ్యాఖ్యానంలో రాధాకృష్ణుల పేర్లను ప్రస్తావించింది.. నిజానికి రాధాకృష్ణుల చరిత్ర... ప్రధానేతిహాసాలైన భారత, భాగవతాల్లో ఎక్కడా కనిపించదు.. ఈ రెంటిలోనూ రాధ పాత్ర లేదు.. అయితే దేవీ భాగవతంలో కొంత, బ్రహ్మ వైవస్త పురాణంలో కొంత రాధ పాత్ర కనిపిస్తుంది.. ఆ తరువాత రాధ పాత్ర ప్రధానంగా జయదేవుని గీతగోవిందం ద్వారా, రాసలీల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
భాగవతంలో రాధ గురించిన చర్చ లేకపోయినా, రాసలీల మాత్రం స్పష్టంగా ఉంది. బయట ప్రచారంలో ఉన్నట్లు ౧౬వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీల జరిపిట్లు భాగవతంలో లేదు.. భాగవత దశమ స్కంధంలో రాసపంచాధ్యాయి పేరుతో అయిదు అధ్యాయాల్లో గోపికలతో కృష్ణుడు బృందావనంలో రాసలీలలాడినట్లు ఉంది... ఆ గోపికలు ఎందరు? అన్న మాట మాత్రం ప్రసావించలేదు..అదీ గాక మొదట్లో బెంగాల్‌ దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే రాధాదేవి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత క్రమంగా దేశమంతటికీ ఆమె గురించి తెలిసింది. రాధ పాత్రే ఓ మిధ్య అయినప్పుడు... ఆమెతో సహజీవనం అన్నది కూడా అదే కోవలోకి వస్తుంది కదా..? దేవీభాగవతం, బ్రహ్మవైవస్త పురాణంలో పేర్కొన్న రాధ అయినా, జయదేవుని రాధ అయినా మధుర భక్తి మార్గాన్ని అనుసరించినట్లు పేర్కొన్నారు. రాసలీల కూడా మధుర భక్తిలో ఒక భాగమే...మధుర భక్తి సంప్రదాయంలో శరీర సంపర్కం అనేది ప్రతీకాత్మకమేనని ఆ సంప్రదాయ వాదులు చెప్తారు..
జయదేవుని గీతగోవిందంలో పేర్కొన్న వర్ణనలు శరీర సంపర్కం గురించి చెప్పినా, గీతగోవిందాన్ని అనుసరిస్తూ వచ్చిన భక్తి చైతన్య మార్గం మొత్తం మధుర భక్తిని సహజీవనంగా భావించలేదు..ప్రస్తుత హేతువాదులు, కొందరు సంప్రదాయ వాదులు కూడా గీతగోవిందం ఆధారంగా రాధాకృష్ణులు సహజీవనం గడిపారని అంటారు..
౨.
అనైతిక కార్యకలాపాలన్నింటినీ నేరాలుగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది..న్యాయస్థానం రాజ్యాంగంలో చట్టాల పరిధిని అతిక్రమించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోజాలదు.. చట్టాలను అనుసరించే సుప్రీం కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంటుంది.. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు స్వతంత్ర వ్యవస్థలే అయినా, పరస్పర ఆధారితాలన్నది వాస్తవం.. ఒక్కోసారి న్యాయస్థానం ఏదైనా ఒక అంశానికి చట్టం చేయాల్సిన అవసరం ఏర్పడితే, దాన్ని సర్కారుకు సూచించే అవకాశం ఉంది. అంతే కానీ, చట్టం చేయకుండా, ఏ రకమైన తీర్పునూ ఇవ్వటానికి అవకాశం లేదు.. సహజీవనం విషయంలోనూ, పెళ్లికి ముందు సెక్స్‌ విషయంలోనూ సుప్రీం కోర్టు ప్రధానంగా పేర్కొంది ఈ అంశాలనే.. పెళ్లికి ముందు సెక్స్‌ను కానీ, సహజీవనాన్ని కానీ నిషేధిస్తూ భారత ప్రభుత్వం చట్టం చేయలేదు. అందువల్లే సినీనటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవిగానే సుప్రీం కోర్టు కొట్టి పారేసింది. రాజ్యాంగంలోని ౨౧వ అధికరణంలోని ప్రాథమిక హక్కు అయిన వాక్‌స్వాతంత్య్రం ప్రకారం ఖుష్బూ వ్యాఖ్యలు నేరమేం కాదని, వాటిని సవాలు చేయటం ఆమె హక్కును కాలరాయటమే అన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది..
౩.
ఈ దేశానికి ఒక సంస్కృతి ఉందనీ, దానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని పాటిస్తూ వస్తుండటం వల్లనే ఇంతకాలంగా మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుందని భావిస్తున్నాం.. కొన్ని కట్టుబాట్ల మధ్యనే ఇవాళ్టికీ భారత సమాజం నడుస్తోంది... ఇవాళ గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని అమెరికా, యూరప్‌ల సంస్కృతిని కుప్పలుతెప్పలుగా దిగుబడి చేసుకుంటున్నాం.. ప్రపంచం ఓ కుగ్రామమైంది కాబట్టి సంస్కృతి, చట్టుబండలంటూ చాదస్తంగా ఉండటం సరి కాదని వాదించేవాళ్లు చాలామందే ఉన్నారు.. వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాలని, సుప్రీం కోర్టు కూడా వాస్తవిక దృక్పథంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసిందని వాదిస్తున్నారు కూడా.. వారి కోణంలో వారి వాదన సమంజసమైందే కావచ్చు. కానీ, అదే సమయంలో మరి కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది..
సహజీవనం వల్ల మన దేశానికి సంబంధించినంత వరకు సమాజం కంటే వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం లభిస్తుంది. సంకెళ్లు లేని ఈ స్వేచ్ఛ యువతను ఏ దారిన తీసుకువెళ్తుంది? విశృంఖల శృంగారాన్ని అనుమతించటం వల్ల ఎలాంటి విపరిణామాలు సంభవిస్తాయనేది కొన్నాళ్ల క్రితమే పాశ్చాత్య దేశాలు తెలుసుకున్నాయి.. భారత దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థను అడాప్ట్‌ చేసుకోవటానికి ఒక క్రమ పద్ధతిలో ముందుకు పోతున్నాయి. కానీ, భారత దేశం ఇందుకు రివర్స్‌లో వెళ్తోందా? ఔను.. పెడధోరణుల పట్ల పాశ్చాత్య దేశాలు విసుగు చెంది విసర్జిస్తున్న తరుణంలో వాటిని మనం అందిపుచ్చుకుంటున్నామన్నది నిష్ఠుర సత్యం. ఇందులో ఒకటి, అదీ అతి తీవ్రమైన పెడధోరణి సహజీవనం, ప్రీ మ్యారీడ్‌ సెక్స్‌..
ఇదేమంటే మీరు చాందసవాదులంటూ నిందిస్తారు.. మార్పును కోరుకోకుండా కూపస్థ మండూకాల్లా ఉంటారంటారు.. కానీ, సహజీవనాన్ని అంగీకరించే పరిస్థితిలో భారత సమాజం ఉందా?
౧. వాస్తవిక ధోరణి ప్రకారమే అన్నీ మారాలని, విలువలను పాటించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని భావించినట్లయితే, ప్రస్తుతం అత్యంత వేగంగా రూపాంతరం చెందిన సమాజ జీవనం దృష్ట్యా సహజీవనం తప్పు కాదు...
౨. అలాంటి సహజీవనాన్నే భారత సమాజం అనుమతించినట్లయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి?
౩. ప్రపంచంలో అనేక దేశాల్లో సహజీవనం అన్నదీ, స్వలింగ సంపర్కం అన్నది చట్టబద్ధమైంది..
౪. భారత సమాజం కొన్ని మార్గదర్శకాల బాటలో పయనిస్తోంది.
౫. మన సమాజం అనేక వైరుధ్యాలను కలిగి ఉంది. కులాల వైరుధ్యం, మతాల వైరుధ్యం, భాషా వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఇలా అనేక రకాలుగా భారతదేశంలో భిన్నత్వం కనిపిస్తుంది.
౬. ఈ భిన్నత్వం లోపలి నుంచే ఏకత్వం అనేది అంతఃసూత్రంగా వెలువడింది. దీన్నే భారతీయత అన్నారు..ఇదే సంస్కృతి.. ఈ జాతి ఒక ఉన్నత నాగరికతతో సమస్త ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచేలా ఎదిగిందే భారతీయ సంస్కృతి..
౭. ఈ సంస్కృతిని ఇవాళ్టివారు చాదస్తం అనవచ్చు.. ఛాందసం అనవచ్చు... మరేదైనా వ్యాఖ్యానించవచ్చు. కానీ, ఈ విలువల వల్లనే, ఈ కట్టుబాట్ల వల్లనే మిగతా ప్రపంచం కంటే భారత్‌ ఆర్థికంగా వెనుకబడి ఉండవచ్చేమో కానీ, హార్థికంగా ఉన్నత స్థానంలో ఉందన్నది మాత్రం వాస్తవం..
౮. ఇవాళ మన దేశంలో సహజీవనాన్ని అంగీకరించామే అనుకుందాం.. దాని వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం?
౯. ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం లేదు.. సంపన్నత లేదు.. ఇప్పటికీ మన దేశంలో తక్కువ శాతం మంది మాత్రమే ఎగువ మధ్యతరగతి స్థాయికి ఎదిగిన వాళ్లు ఉన్నారు..
౧౦. సహజీవనాన్ని అంగీకరిస్తే.. మన దేశంలో స్త్రీ పురుషులు కొంతకాలం సహజీవనం చేస్తే.. వారి సంబంధాన్ని ఈ సమాజం ఏమని పిలవాలి? ఇప్పటికైతే దీనికి నిర్వచనం లేదు..
౧౧. సహజీవనం అనేది మహిళలకు హక్కుగా భావించవచ్చా?
౧౧. స్త్రీ పురుషులు ఇద్దరు కొంతకాలం సహజీవనం చేసి, తరువాత ఇద్దరి మధ్య అయిష్టం ఏర్పడి విడిపోతే.. ఆ స్త్రీ పరిస్థితి ఏమవుతుంది?
౧౨. మహిళలు ఎంతో ఎదిగిపోయారని పత్రికల్లో, మీడియాలో ఎంతగా బాకాలూదినా.. అలా ఎదిగిన వాళ్ల శాతం చాలా తక్కువ.. అలాంటప్పుడు సహజీవనం చేసి విడిపోయిన తరువాత మహిళ పరిస్థితి ఏమవుతుంది. భార్యగా విడాకులు పొందితే భరణం లభిస్తుంది.. కానీ, సహజీవనం వల్ల విడిపోయిన మహిళకు సామాజిక భద్రత ఎలా ఉంటుంది? ఎవరు ఇవ్వాలి? దీనికీ చట్టం చేయాలా?
౧౩. సహజీవనం చేస్తున్న కాలంలో పిల్లలు పుడితే.. ఆ తరువాత కొంతకాలానికి విడిపోవలసి వస్తే ఆ పిల్లలకు తండ్రి హోదాలో ఎవరుంటారు? ఇందుకూ చట్టం చేయాల్సిందేనా?
౧౪. సహజీవనాన్ని అంగీకరించాల్సి వస్తే.. సామాజిక భద్రత అన్నది చాలా కీలకాంశం అవుతుందన్నది కఠిన వాస్తవం.. దీనికి ప్రభుత్వం జవాబుదారీ వహిస్తుందా? సమాజమా?
౧౫. ఓ పక్క సేఫ్‌ సెక్స్‌ గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నాం..విశృంఖల శృంగారం కారణంగా ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభిస్తాయని ఆందోళన చెందుతున్నాం... సెక్స్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ వ్యవస్థను దాటి వెళ్లడం మంచిది కాదనీ సలహాలిస్తున్నాం.. సహజీవనం, పెళ్లికి ముందు సెక్స్‌ అన్న వాటిని ఒప్పుకోవటం సేఫ్‌ సెక్స్‌ అన్న ప్రచారానికి ఏ విధంగా దన్నుగా నిలుస్తుంది?

స్వలింగ సంసర్కం గురించి సుప్రీం కోర్టు గతంలోనే తప్పు కాదంటూ తీర్పు చెప్పింది.. ఇప్పుడు సహజీవనం గురించి, పెళ్లికి ముందు సెక్స్‌ గురించి సానుకూలంగా స్పందించింది.. వీటికి సంబంధించి రాజ్యాంగంలో, శాసనాల్లో ఎలాంటి విధి నిషేధాలు లేవు కాబట్టే న్యాయస్థానాలు వాటికి అనుకూలంగా స్పందించి ఉండవచ్చు.. ఈ రకమైన ధోరణి చూస్తే మన దేశంలో వేశ్యావృత్తిని క్రమంగా చట్టబద్ధం చేయనున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి