11, మార్చి 2010, గురువారం

మన జేబులో ఉన్న నోటు అసలుదా?

మీరు మార్కెట్‌లో ఏదైనా కొనటానికి వెళ్తున్నారా?
ఏదైనా వస్తువు కొని ౫౦౦నోటు ఇచ్చారు.. కానీ ఆ షాపు యజమాని తన ముందున్న జాబితాలో మీ నోటు సిరీస్‌ చెక్‌ చేసి మరీ తీసుకుంటాడు.. అందులో ఉన్న సిరీస్‌ నెంబర్‌ మీ నోటుపై ఉంటే అంతే సంగతులు... మీ నోటు దొంగనోటంటూ వాపస్‌ చేసేస్తాడు..
హైదరాబాద్‌... ఇప్పుడు దొంగనోట్ల చెలామణికి హబ్‌గా మారిందా? ఎక్కడ చూసినా దొంగనోటే.. మన జేబులో ఉన్న నోటు అసలుదా? నకిలీదా తెలుసుకోలేని పరిస్థితి...
జేబులోంచి నోటు తీస్తే.. దానిపై అనుమానాలు వ్యక్తమవుతుంటే.. జనం గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.. తమ దగ్గర ఉన్నది దొంగనోటని తేలితే ఆ గుండె గభాలున ఆగిపోయే పరిస్థితి ఇవాళ ఉత్పన్నమైంది..

మీరు మార్కెట్‌లో ఏదైనా కొనటానికి వెళ్తున్నారా?
ఏదైనా వస్తువు కొని ౫౦౦నోటు ఇచ్చారు.. కానీ ఆ షాపు యజమాని తన ముందున్న జాబితాలో మీ నోటు సిరీస్‌ చెక్‌ చేసి మరీ తీసుకుంటాడు.. అందులో ఉన్న సిరీస్‌ నెంబర్‌ మీ నోటుపై ఉంటే అంతే సంగతులు... మీ నోటు దొంగనోటంటూ వాపస్‌ చేసేస్తాడు..

వెయ్యి రూపాయలో, అయిదు వందల రూపాయలో ఒక్కసారిగా చెల్లదని తెలిస్తే... అప్పటికప్పుడు ఏం చేయాలి? సదరు దుకాణంలో అవమానం.. అనుమానపు చూపులు.. అన్నింటికీ మించి ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము.. నిష్కారణంగా చెల్లుబాటు కాకపోవటం... ప్రజల్ని తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి చేస్తోంది....
దాదాపు పదహారు సిరీస్‌లలో ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి.
వీటిని తీసుకోరాదంటూ రిజర్వు బ్యాంకే స్పష్టంగా ఆదేశాలిచ్చింది.

మార్కెట్‌లోకి ఎన్ని వేల కోట్ల విలువైన దొంగనోట్లు డంప్‌ అయ్యాయో ఆర్‌బిఐకే తెలియటం లేదంటే... ఇక సామాన్యుడి గతి ఏమిటి?


ఎక్కడ చూసినా దొంగనోట్లే... బ్యాంకుకు వెళ్లి విత్‌డ్రా చేస్తే అందులో ఓ నకిలీ నోటు.. పోస్ట్‌ఆఫీస్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటే అందులోనూ నకిలీ సిరీస్‌... చివరకు ఎటిఎంలకు వెళ్లి క్యాష్‌ తీసుకున్నా అందులోనూ నకిలీయే... మరి మామూలు ప్రజలు అసలు నోట్ల కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని నమ్మాలి?

మామూలు ప్రజానీకానికి నగదుకు సంబంధించి అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థ బ్యాంకు.. ఆ బ్యాంకుల్లోనే.... నగదు కౌంటర్ల నుంచి వచ్చే నోట్లలోనే నకిలీ నోట్లు ఉంటే...

ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషిన్‌... ఏటిఎం.. అత్యవసరానికి బ్యాంకుకు వెళ్లకుండానే నగదు తీసుకునే సౌకర్యం ఉన్న వ్యవస్థ.. ఈ ఏటిఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకుంటే.. అందులోంచి వచ్చే నోట్లలోనే నకిలీ నోట్లు ఉంటే...

ఏటిఎంలో విత్‌డ్రా చేసుకున్న నోట్లు పట్టుకుని బ్యాంకుకు వెళ్తే వాళ్లు ప్రదర్శించే చికాకు.. వెకిలిప్రశ్నలు ఎందుకొచ్చాంరా భగవంతుడా అనిపించేలా చేస్తాయి. మనం ఏటిఎంలో విత్‌డ్రా చేసుకున్నా.. దానికి ఎలాంటి రుజువులు ఉండవు. ఎవరి జవాబుదారీ ఉండదు.. మనం తీసుకున్న నోట్ల సిరీస్‌కు సంబంధించి ఎలాంటి ఆధారమూ ఎటిఎం నుంచి మనకు లభించదు.. దీని ఫలితం విత్‌డ్రా చేసుకున్న వ్యక్తి నష్టపోవటం తప్ప మరోమార్గం లేదు..నెలంతా కష్టపడి ఉద్యోగం చేసి బ్యాంకులో పడ్డ జీతం రాళ్లను డ్రా చేసుకున్నప్పుడు అందులో దొంగనోట్లు వస్తే ఎక్కడికి వెళ్లాలి? ఎలా గడపాలి?
ఈ సమస్యలకు పరిష్కారం సామాన్యుడికి కనిపించటం లేదు.. తమ దగ్గరున్నది నకిలీయో, అసలుదో తెలుసుకోలేక నానా అవస్థలు పడుతున్నాడు.. దీనికి పరిష్కారం ఏముంది?

నగరంలో విచ్చలవిడిగా ప్రవేశించి భయం పుట్టిస్తున్న ఈ దొంగనోట్ల వ్యవహారానికి పరిష్కారం ఏమిటి? సామాన్యులు ఇలా నష్టపోవలసిందేనా? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?
పాకిస్తాన్‌ వంటి పలు ప్రాంతాల నుంచి దేశంలోకి ఏటా ప్రవేశిస్తున్న దొంగనోట్లలో ఎక్కువ శాతం హైదరాబాద్‌లోకే డంప్‌ అవుతున్నాయి.. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో ౬౬ శాతం దొంగనోట్ల కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయంటేనే జనం ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే నకిలీ నోట్ల చెలామణికి హైదరాబాద్‌ మాంచి అనువైన ప్రదేశంగా మారిపోయింది..

నగరంలో పట్టుబడుతున్న చాలామందికి నకిలీ కరెన్సీ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు ఎంతోమందిని పట్టుకుంటున్నారు.. జైళ్లకు పంపిస్తున్నారు.. అయినా దొంగనోట్ల చెలామణి మాత్రం ఆగడం లేదు..

ఏమైతేనేం.. మొత్తం మీద ఆర్‌బిఐ దీనిపై దృష్టి సారించింది.. నకిలీ కరెన్సీ వచ్చినప్పుడు సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఆర్‌బిఐ ఆదేశాలిచ్చింది.. అసలు నకిలీ నోట్లు ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తే.. సామాన్యుడికి ఇబ్బంది ఎలా ఉంటుంది?
నకిలీనోట్లకు సంబంధించి ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి ఆర్‌బిఐ ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. వీటిని రకరకాల ప్రసారమాధ్యమాల్లో ప్రసారం కూడా చేస్తున్నారు...మీ దగ్గర ఉన్న నోటు నకిలీదైతే వెంటనే పోలీసులకు కంపెユ్లంట్‌ చేయాలని ఆర్‌బిఐ సూచిస్తోంది.. కానీ ఇక్కడే తిరకాసు ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? కేసు నమోదు చేస్తారు.. మీ దగ్గర ఉన్న నోటును వాళ్లు తీసేసుకుంటారు.. మీకైతే అసలు నోటు వాళ్లయితే ఇవ్వరు.. కేసు విచారించి.. సమగ్రంగా దర్యాప్తు చేసి.. ఆతరువాత మీ ఫిర్యాదు సహేతుకమైందని తేలితే.. ఆర్‌బిఐ వారికి చెప్తే...వారు మీకు అసలు నోటు ఇస్తారన్నమాట...మన దేశంలో.. మన వ్యవస్థలో... మన సమాజంలో ఇవన్నీ జరిగేసరికి ఏళ్లూపూళ్లూ పడతాయి.. కాబట్టి... నకిలీ నోటు ఉందంటే.. తూరుపు తిరిగి దండం పెట్టుకోవలసిందే...


2 కామెంట్‌లు:

విజయ క్రాంతి చెప్పారు...

అందుకే ఇలాంటివి ఉంటాయనే ... చిప్-నిప్ అనే కార్డులు వచ్చాయి .
దీనితో వున్నా సౌలభ్యం ఏమిటంటే , మన కార్డు లో ఒక చిప్ అమర్చి ఇవ్వడం తో మన డేటా ( లావాదేవీలు ) అందులో ఉంటాయి .

ఈ చిప్ నిప్ లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత డబ్బును వేసుకోవచ్చు . ఇది కూడా (ATM) లాంటి వాటిలోనే చేయవచ్చు . దాదాపు అన్ని దుకాణాలలో , ఆఫీసులలో ఆ చిప్ నిప్ ని గుర్తించటానికి ప్రత్యెక పరికరం ద్వారా గుర్తించవచ్చు .
అంటే దాదాపు చాల కొన్ని సమయాలలోనే డబ్బులు భౌతిక రూపం లో వాడుతాము .
ఈ పద్దతులు యూరోప్ లాంటి చోట్ల వాడుతున్నారు

కెక్యూబ్ వర్మ చెప్పారు...

బాగా చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ముందు మనల్ని లోపలేస్తానంటాడు. లేకపోతే 100 కు బదులు ఒక 1000-2000లు సమర్పించుకోవాలి.