9, మార్చి 2010, మంగళవారం

స్కూలు అంటే ఓ దుకాణం..

స్కూలు అంటే ఓ దుకాణం.. ఓ చిట్‌ఫండ్‌ కంపెనీ.. ఓ ఫైనాన్స్‌ సంస్థ... ఇదేమని ఆశ్చర్యపోకండి... మన దేశంలో చదువు అనేది అచ్చొచ్చే బిజినెస్‌గా ఎప్పుడో మారిపోయింది. స్కూళ్లు చదువును అమ్ముకునే అంగళ్లుగా రూపాంతరం చెంది చాలా కాలమే అయింది... విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు దండుకోవటం.. స్కూలును చూపించి బయట వడ్డీలకు అప్పులు చేయటం.. రొటేషన్లు.. సెటిల్మెంట్లు.. అన్నీ కలిస్తే దాని పేరు విద్యాలయం... అలియాస్‌ కెపిఎస్‌ స్కూల్‌...

పేరుకు మాత్రం అది పెద్ద స్కూలు.. కానీ అక్కడ యాజమాన్యం నడిపేది ఓ దుకాణం.. అదే చదువుల కొట్టు.. ఇక్కడ చదువు చెప్పరు.. అమ్ముతారు.. నాలుగు వందల మంది విద్యార్థుల దగ్గర నుంచి అందినకాడికి దండుకోవటంలో వీళ్ల ఎక్స్పీరియన్స్‌ అబ్బో బోలెడంత... పిల్లల దగ్గర నుంచే కాదు... ఈ బడిని చూపించి బయట కూడా చేతికి తోచినంత అప్పులు చేసి చక్కా ఉడాయించారు సదరు స్కూలు యజమాని...

దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని మారుతీనగర్‌లో ఉన్న స్కూలు వైభవానికి ఆ స్కూలు బోర్డు ఉదాహరణ. నీతి సూత్రాలు.. వివేకానందుడు, మదర్‌ థెరెస్సాల ఆదర్శాలు తెగ వల్లెవేశారు... పాపం వాటన్నింటినీ నిజమేనని నమ్మిన పిల్లలు పొలోమని వచ్చి చేరిపోయారు...అక్షరాలా నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయం.. ఈ నెలాఖరు నుంచి యాన్యువల్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళో, రేపో హాల్‌టికెట్లు ఇస్తారని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.. ఇవాళ ఉదయం హటాత్తుగా పాఠశాలను మూసేస్తున్నట్లు ప్రకటించేసి బోర్డు తిప్పేశారు..
ఉన్నట్టుండి స్కూలు ఎందుకు మూసేశారో అర్థం కాక విద్యార్థులు, తల్లిదండ్రులు అవాక్కయ్యారు..
జవాబు ఇచ్చేవారు లేరు.. అయోమయం...పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో ఇలా జరగటం మింగుడు పడని పరిస్థితి...
గమ్మత్తేమిటంటే గత నాలుగు రోజులుగా వరుసగా సెలవులు వచ్చాయి. ఈ సెలవులను పాఠశాల యాజమాన్యం చక్కగా వినియోగించుకుంది. అన్నీ చక్కబెట్టుకుని ఎంచక్కా చెక్కేసింది.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటంలో ఈ స్కూలుకు సాటిరాగలది మరోటి లేనే లేదు.. సిబ్బందికి మాత్రం నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. పరిస్థితి చేయి దాటినా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. అధికారులు పట్టించుకోలేదు.. పదో తరగతి దాకా అనుమతి లేకుండా స్కూలు నడుపుతుంటే... ఫీజులు దండుకుంటుంటే.. విద్యార్థులను ప్రెユవేటుగా పరీక్షలను రాయిస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారో... లేక కావాలనే తేలిగ్గా తీసుకున్నారో... అర్థం కాని స్థితి....
వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తామంటూ అధికారులైతే చెప్తున్నారు కానీ, పరీక్షలు ముంచుకొచ్చిన ఈ తరుణంలో ఇది ఎంత వరకు సాధ్యమన్నది అర్థం కాదు.. పరీక్షల ముందు సహజంగానే మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు.. ఈ పరిణామంతో మరింత దిగాలు పడిపోయారు.. ఇలాంటి యాజమాన్యాలను ఏం చేయాలి? ప్రభుత్వమూ పట్టించుకోక, పార్టీలూ పట్టించుకోక..నడివీధిలో విద్యార్థులను నిలబెట్టారు..


1 కామెంట్‌:

vasantham చెప్పారు...

avunu, ippudu pathasala lu konni oka finance vyaapaaram gaa naduputhunnaru, prabhutvam chethulu ethi vesi, gaaliki vadilesindi, mana dourbhagyam.