31, మార్చి 2009, మంగళవారం

రాముడు మళ్లీ రథమెక్కాడు


అయోధ్య రాముడు తన గుడి కోసం మరోసారి రథం ఎక్కాడు.. 1998 ఎన్నికల తరువాత  ఢిల్లీ  అశోక రోడ్‌లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో  భద్రంగా అటకెక్కిన  మూడు సిద్ధాంతాలను అంతే భద్రంగా బిజెపి నేతలు అటక మీది నుంచి కిందకు దింపారు.. చక్కగా బూజు దులిపి మళ్లీ ఓటర్ల దగ్గరకు మోసుకొస్తున్నారు.. పాపం గూడు కోసం గుడి కోసం రాముడు కమలనాథులను మళ్లీ నమ్మక తప్పడం లేదు. ఈసారైనా రాముడికి గుడి దక్కుతుందా? మళ్లీ అటకెక్కుతాడా?
దేశ రాజకీయాల్లో బిజెపి ఓ విభిన్న పార్టీ.. తమది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకుంటారు. సిద్ధాంతం ఏమిటో ఎవరికీ అర్థం కాదు.. వ్యక్తి పూజ లేని పార్టీ అని చెప్తారు.. ఒకే ఒక్కడుగా అద్వానీ కనిపిస్తారు.... తాము  సెక్యులరిస్టులమంటారు.. ప్రత్యర్థులు కమూ్యనలిస్టులంటారు.. ఏ మూడు డిమాండ్లను నెత్తికెత్తుకొని 1998లో అధికార పీఠానికి చేరువయ్యారో.. అధికారం వాసన చూడగానే మూలాలను అటకెక్కించారు.. అయోధ్యలో  రామమందిర నిర్మాణం, 370 అధికరణం రద్దు , ఉమ్మడి పౌరస్మృతి.. మూడూ బిజెపి ప్రధాన డిమాండ్లు.. 1996నాటికే బిజెపి అధికారంలోకి వచ్చినా కొద్ది రోజులకే ఆ ప్రభుత్వం పతనం కావటంతో  సానుభూతి  కమలనాథులకు మరో అవకాశాన్ని కల్పించింది.  ఆ అవకాశం ఆరేళ్ల పాటు వారిని అధికారంలో ఉంచింది. ఈ ఆరేళు్ల కూడా అధికారాన్ని కాపాడుకోవటం పైనే తప్ప తన ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశలో చిన్న ప్రయత్నమైనా చేయలేదు. అదేమని అడిగినప్పుడల్లా, సంకీర్ణ ధర్మం అంటూ వచ్చారు. సొంతంగా మెజారిటీ వస్తే తప్ప మేం ఏమీ చేయలేమన్నారు... ఇప్పుడు మళ్లీ రామనామం జపిస్తున్నారు. అయోధ్యలో గుడి కట్టి తీరుతామంటున్నారు. ఇక్కడే చిన్న మెలిక కూడా పెడుతున్నారు. అదేమంటే హిందూముస్లింలు అందరినీ ఒప్పించి వారందరి  ఏకాభిప్రాయంతోనే  భవ్యమందిరాన్ని నిర్మిస్తామంటున్నారు......సెక్యులరిస్టులమని చెప్పుకోవటానికి బిజెపి ఈ రకమైన పాట్లు పడుతుండవచ్చు కానీ,  రాముడు మాత్రం ఎంత నవ్వులపాలవుతున్నాడో కదా!
ఈ దేశంలో ఏకాభిప్రాయ సాధన అంటే ఏమిటో ఎవరికైనా తెలియందేముంది? మహిళా రిజర్వేషన్ల బిల్లు కానీ, తెలంగాణ ఏర్పాటు కానీ ఏకాభిప్రాయం పేరుతో ఏమయ్యాయో తెలియంది కాదు.. ఇప్పుడు రాముడి గుడికీ ఏకాభిప్రాయమనే ట్యాగ్‌లైన్‌ తగిలించారు... ఇక గుడి సంగతి ఏమవుతుందో వేరే చెప్పాలా? 
2004లో అధికారం కోల్పోయాక పార్టీని తిరిగి బలోపేతం చేయటంలో  బిజెపి కేంద్ర నాయకత్వం ఘోరంగా విఫలమైంది. పార్టీ నాయకుల మధ్య కుము్మలాటలు, అంతర్గత సమస్యలు పార్టీని కుంగదీశాయి. ప్రమోద్‌మహాజన్‌, సాహిబ్‌సింగ్‌ వర్మ లాంటి కీలక నేతలు ఆకస్మికంగా మరణిస్తే, ఉమాభారతి, మదన్‌లాల్‌ ఖురానా వంటి వారు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. అద్వానీ పోకడలతో అటు సంఘ్‌ పరివారమూ బిజెపితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అటు యుపిఎ సర్కారు పనితీరును విమర్శించి ప్రజల్లోకి చొచ్చుకుపోవటంలోనూ పెద్దగా సక్సెస్‌ అయింది లేదు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి పెద్ద రాషా్టల్రు మూడే బిజెపి చేతుల్లో ఉన్నాయి. మిగతా ఎక్కడా పార్టీ బలం అంతంత మాత్రమే. బిజెపితో చెలిమికి సుముఖత చూపుతున్న ప్రాంతీయ పార్టీలు కూడా తక్కువ కావటం మరో సమస్య. ఈ నేపథ్యంలో ఎన్‌డిఏ ఎంతవరకు సఖ్యంగా ఉంటుందన్నది అనుమానమే. ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్న అద్వానీకి ఉన్న సమస్యలకు తోడు పార్టీలోని అగ్రనాయకుల మధ్య విభేదాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. దీనికి తోడు వరుణ్‌గాంధీ ఎపిసోడ్‌ పులిమీద పుట్రలా మారింది. 
అణు ఒప్పందం విషయంలో, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారని, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారని యుపిఎ సర్కారును విమర్శిస్తూ అద్వానీ దూసుకుపోతున్నారు కానీ, పార్టీ కేడర్‌ను ప్రేరేపించి, ఉత్సాహపరచాల్సిన రెండో శ్రేణి నాయకత్వాన్ని ఏకతాటిపై నడిపించలేకపోతున్నారన్నది పచ్చి నిజం. జిన్నాను సెక్యులర్‌ అని పరివారానికి దూరమైన అద్వానీ, ఇప్పుడు ఎన్నికల్లో సహకరించమని ఏ విధంగానూ అడిగే పరిస్థితిలో లేరు.  విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ కూడా మునుపటి ఉత్సాహాన్ని ప్రదర్శించటం లేదు.  దేశం ఇన్ని రకాలుగా మారినా, ముతకగా మారిన పాత పాటను పాడితే ఎవరికి వినసొంపుగా ఉంటుంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారంలో విరివిగా వాడుకుంటున్నా, నెహ్రూగాంధీ కుటుంబంపై విమర్శలు, సోనియా విదేశీయత వంటి అంశాలు ఇప్పుడు కూడా ఎన్నికల అంశాలుగా చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? తాను గిరిగీసుకున్న గీత నుంచి బిజెపి థింక్‌ట్యాంక్‌ ఇంకా బయటకు రావటం లేదు. అన్ని హద్దుల్ని చెరిపేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోతే, కమలనాథుల అస్తిత్వం ప్రమాదంలో పడే పరిస్థితి పొంచి ఉంది.

2 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

Rama sells. BJP want to en cash him for political gains.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఒకసారి పూర్తి మెజారిటీ ఇచ్చి చూస్తే కదా తెలిసేది వాళ్ళుఏమిచేస్తారనేది అరాకొరా మెజారిటీతో, పొత్తులతో ఏమి చేయగలరు వారు .గుజరాత్ లో వారి పరిపాలన ఎలాగుందో చూస్తున్నారుకదా! ఇది చూడండి ఒకసారి
http://www.financialexpress.com/news/why-india-needs-narendra-modi/375103/0