(గతంలోనే రాసిన నోట్.. ఇప్పుడు రిలవెంట్గా ఉంటుందని.. మళ్లీ మీకోసం..)
వెనకట ఎప్పుడో పార్వతీ దేవి నలుగుపిండితో ఓ పిల్లవాణ్ణి పుట్టిస్తే.. వాడి
తలను శివుడు నరికేశాడట.. తరువాత అంతా గోల చేస్తే ఏనుగు తల తీసుకువచ్చి
అతుకుపెట్టాడట.. ఆ తల మొండేనికి అతుక్కుని ఉండేందుకు ఆయన ఆనాడు అన్ని
జాగ్రత్తలు తీసుకున్నాడు. కింద పొట్టకు, పైన తలకు బ్యాలెన్స చేశాడు
కాబట్టి సరిపోయింది. కానీ, ఇప్పుడు భూలోకంలో తలకూ మొండేనికీ పేచీ
వచ్చిపడింది. దీన్ని ఎలా అతికి ఉంచాలో, విడగొడితే మొండేనికి మరో తలను
ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలో తెలియక ఢిల్లీలో ఇవాళ్టి ఆధునిక పార్వతి నానా
తంటాలు పడుతోంది..
అప్పుడెప్పుడో అరవై ఏళ్ల క్రితం పొట్టి
శ్రీరాములు గారు తమిళుల నుంచి ఆంధ్రులను వేరు చేయాలంటూ చనిపోయేంతవరకు ఆమరణ
నిరాహార దీక్ష చేశారు.. మద్రాసు లేకుండా ఆంధ్ర ప్రాంతాన్ని ఇస్తామంటే
మద్రాసు లేని ఆంధ్ర తలకాయ లేని మొండెంగా ఉంటుందని పాపం తెగ బాధపడిపోయారు.
అలాగే, ఆ అసంతృప్తితోనే ఆయన కన్నుమూశారు.. అమరుడయ్యారు.. చివరకు అప్పటి
ఢిల్లీ శివుడు జవహర్ లాల్ నెహ్రూ తల లాంటి మద్రాసును నరికేసి
మొండేన్ని వేరు చేశారు.. తలకాయ లేని మొండెంగానే ఆంధ్ర రాష్ట్రం మూడేళు్ల
విలవిల్లాడుతూనే గడిపింది. 1956లో ఏదో తల లేకపోతే బాగుండదేమనుకున్నారేమో..
అదే శివుడు అంటే నెహ్రూ ఇవాళ ది గ్రేట్ లగడపాటి రాజగోపాల్
నిర్ధారించినట్లు హైదరాబాద్ అనే తలకాయను తీసుకువచ్చి సదరు ఆంధ్ర మొండేనికి
అతికించారు.. అయితే అది అప్పుడే సరిగ్గా అతుక్కోలేదు.. ఎప్పుడైనా
ఊడిపోయేదేనని అతికించేప్పుడే నెహ్రూ చెప్పకనే చెప్పారు.. ఏదో గొడవ
పడుతున్నారు కదా అని అతికించామన్నారు.. మొత్తానికి మొండెంపై అటూఇటూ ఊగుతూ
తల ఇంతకాలం ఆయాసపడుతూనే ఉంది. తలలోని మెదడును వాడుకుని మొండెం బాగానే
బాగుపడింది. కొత్త బట్టలు వేసుకుంది. ఫ్యాషన్‌గా తయారైంది. చేతులకు బంగారు
మురుగులు, కాళ్లకు గండపెండేరాలు తొడుక్కుంది. తలకు, మొండేనికి జాయింట్
ఉండే చోట అంటే మెడలో బంగారు నగలూ వేసుకుంది.. అక్కడ కూడా మెడ కేవలం
ఆధారమే.. ఇక్కడ తల జుట్టు నెరిసింది. ముఖంపై మచ్చలు వచ్చాయి. మొండేనికి
ఇవేమీ పట్టింది లేదు. దానికి కావలసింది ఆహారం.... తలలోని నోరు ఇందుకు వాహిక
అయింది. నోట్లోంచి ఆహారం చేరేది మొండెంలో భాగమైన పొట్టలోకే కదా... ఇక్కడి
తిండి అక్కడికి వెళ్లినట్లు.. ఇక్కడి ఆదాయం అక్కడికి వెళ్లినట్లు.. ఇప్పుడు
ఈ మొండెంపై తల ఇమడలేకపోయింది. ఊడిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడెప్పుడు
ఊడిపోవాలా అని అల్లాడిపోతోంది. డిల్లీలో ఉన్న శక్తి అమ్మన్ కూడా భరించలేక
ఇక ఊడిపొమ్మంటూ పర్మిషన్ ఇచ్చేసింది.. కానీ, కింద ఉన్న మొండేనికి మాత్రం
తలను విడిచిపెట్టడం ఇష్టం లేకుండా పోయింది. అతుకులు సరిగ్గా లేకపోయినా,
లీకేజీలు ఉన్నా, ఇదే తలను పట్టుకు వేలాడటమే మొండేనికి కావలసింది. ఎందుకంటే ఈ
తలలో తలపులే దాని బతుక్కు ఆధారభూతమైంది. మరో తలను తెచ్చిపెట్టుకుంటే ఆ
తలకు తానే ఆధారం కావాల్సి ఉంటుంది. ఆల్రడీ తనకు ఆధారంగా ఉన్న తలను
విడిచిపెట్టుకుని మరో తలతో తంటాలెందుకని పేచీ పడుతోంది... ఇప్పుడు ఈ పేచీని
ఎవరు తీర్చాలి... ఏం చేసినా అతుకుపడని తలను, మొండేన్ని ఎంతకాలం కలిపి
ఉంచగలరు?