19, జూన్ 2010, శనివారం

డెత్‌ డేట్‌

మరణం ఓ కామా అన్నాడు ఓ తెలుగు కవి.. మరణానికి కొద్దిసేపటికి ముందు.. మరణానికి తరువాత ఏం జరుగుతుంది? చనిపోయిన వాడు ఆత్మ అవుతాడా? స్వర్గానికి పోతాడా? నరకానికి పోతాడా? ఆత్మ అనేది ఉన్నదా? లేదా అన్న దానిపై అబ్బో బోలెడు డిస్కషన్సే జరిగాయి. చావు ఎలా వస్తుందన్న దానిపైనా ఎక్స్పరిమెంట్లు చేయని వాడు ప్రపంచంలో లేడు.. ఇక జ్యోతిష్యులు, కాలజ్ఞాన కర్తల గురించి చెప్పనే అక్కర్లేదు.. చావు గురించి కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడే వారు ఒకరైతే.. శాస్త్ర వాదాన్ని వినిపించేవారు మరొకరు.. వీళ్లలో చాలా మంది చనిపోయారు.. కానీ వీళ్లలో ఎంతమంది తాము ఏరోజు, ఏ క్షణానికి చచ్చిపోతామో ఆక్యురేట్‌గా కనుక్కోగలిగారా?
వాళ్లకా అవకాశం ఉందో లేదో కానీ, ఇప్పుడా అవకాశం అందరికీ లభించింది.. మీరెప్పుడు చచ్చిపోతారు? తెలుసుకోవాలని ఉందా.. అదెలా సాధ్యం? డేట్‌తో సహా ఎలా చెప్పగలరు?

మనిషిగానో, జంతువుగానో పుట్టిన తరువాత చావు రాకుండా పోదు.. ఒకరు ముందు.. మరొకరు వెనుక.. కానీ, సరిగ్గా ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎలా తెలుస్తుంది? కంగారేమీ వద్దు.. సెకన్లతో సహా డెత్‌ డేట్‌లను ప్రొవైడ్‌ చేసే వాళ్లున్నారు.. పైసా ఖర్చు లేకుండా మీరెప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు.. జ్యోతిష్యులకు కొన్ని వివరాలు అందించినట్లే... వీళ్లకూ మీ పర్సనల్‌ వివరాలు కొన్ని మాత్రం చెప్తే చాలు.. డెత్‌ డేట్‌ క్షణాల్లో మీ కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది. ఎలాగంటారా? ఈ వెబ్‌సైట్‌ మీరే చూడండి..
ఇంటర్నెట్‌ ప్రపంచంలో చెప్పలేనన్ని హిట్లను అందుకుంటున్న ఒకానొక వెబ్‌సైట్‌ అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌ ఇది... మతం, జ్యోతిష్యం పరంగానే కాక, అత్యంత శాస్త్రీయంగా కాలిక్యులేట్‌ చేసి మరీ డెత్‌ డేట్‌లను చెప్పేస్తున్నామంటోందీ వెబ్‌సైట్‌....
ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌...

మనుషుల భవిష్యత్తుకు లెక్కలు కడుతున్న వెబ్‌సైట్‌... మీరెన్నాళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేస్తుంది.. కాకపోతే అంతకు ముందు మిమ్మల్ని చక్కగా ఇంటర్వ్యూ చేస్తుంది.. మీ వ్యక్తిగత విషయాలు, అలవాట్లు అందులో మంచివీ, చెడ్డవీ, ఆరోగ్యాన్ని చెడగొట్టేవీ అన్నింటి గురించీ సవివరంగా కనుక్కుంటుంది.. చివరకు మీ వ్యక్తిత్వాన్నీ ప్రశ్నిస్తుంది..
ఓ ఉద్యోగానికి వెళ్తే అప్లికేషన్‌ ఫాం నింపినట్లే మీ డెత్‌ డేట్‌ తెలుసుకోవటానికీ అప్లికేషన్‌ ఫాం నింపాల్సిందే... అప్పుడే అది చెకచెకా లెక్కలు కట్టేసి.. బాల్చీ ఎప్పుడు తన్నేస్తారో చెప్పేస్తుంది....
జీవిత కాలానికి కొలమానం అంటూ ఏదీ లేదన్నది ఇంతవరకూ మనకు తెలిసిన నిజం.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ మాత్రం మనిషి ఆయుష్షును నిర్ణయించేస్తోంది. పోయేకాలం దగ్గర పడుతోందంటూ సెకన్లతో సహా డెత్‌క్లాక్‌ను కంప్యూటర్‌ స్క్రీన్‌పై చూపిస్తోంది..
మనిషికి తన జీవితంలో ఏం కానుంది.. అని తెలుసుకోవటంపై ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. దాన్ని విశ్వసించటం విశ్వసించకపోవటం వేరే విషయం.. విశ్వసించకపోయినా.. తనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం ఉంటుంది. అదిగో అలాంటి వారికోసమే ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ డాట్‌ కామ్‌ లాంటి సైట్లు వచ్చాయి...
చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.. చూస్తారు.. సరదాగా నవ్వుకుంటారు.. రెండు రోజుల తరువాత మరిచే పోతారు.. కొందరికి మాత్రం మనసులో ఎక్కడో గుబులు పుడుతుంది. అది ఆందోళనగా మారితే.. అది స్లోపాయిజన్‌గా మారుతుంది.. ఈ రకమైన ట్రెండ్‌ భవిష్యత్తులో ఆ వ్యక్తి జీవితంపైనే ప్రభావం చూపుతుంది..
మానసికంగా ఆందోళన చెందేవారి పరిస్థితి ఏమిటి? వీళ్లు చెప్తున్న లెక్కలు ఏ ప్రాతిపదికన చేశారన్నది వెబ్‌ నిర్వాహకులు ఎక్కడా వివరించటం లేదు.. ఏవేవో లెక్కల ప్రకారం డెత్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారా? లేక నిజంగా శాస్త్రీయత అన్నది ఏమైనా ఉన్నదా?

ఇన్ని రకాల వివరాలను తెలుసుకుని ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ వెబ్‌సైట్‌ చేసిన లెక్కలన్నీ తప్పులయ్యాయి... వీళ్లు చెప్తున్న డెత్‌ డేట్‌ అంతా ఒఠ్ఠిదేనని తేలిపోయింది.. ఎందుకంటే మనకందరికీ మనందరికీ బాగా, బహుబాగా తెలిసిన వాళ్ల వివరాలు ఇస్తే వారు చనిపోయిన తరువాత కూడా ఇంకా ఆయుష్షు ఉందని చూపిసున్నది. మైకెల్‌ జాక్సన్‌ ఇంకా ఇరవై ఏళ్లకు పైగా బతుకుతాడంది.. వైఎస్‌ఆర్‌ మరో పాతికేళ్లు ఉంటారని చెప్పింది.. రాజీవ్‌ గాంధీ ఇంకో పదహారేళ్లు జీవిస్తారని చెప్పింది... ఈ అంచనాలు.. గణాంకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు..
భవిష్యత్తు గురించి, అదృష్టం గురించి, జాతకాల గురించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ప్రపంచంలో జాతకాల పిచ్చి కాస్త ఎక్కువే.. జ్యోతిష్యాన్ని శాస్త్రమనే వాళ్లు కొందరు.. కాదనే వారు కొందరు.. జ్యోతిష్యం చెప్పేవాళ్లు ఇన్నేళ్లు బతుకుతారంటూ లెక్కలు చెప్పేవారు కొల్లలు.. కానీ, ఫైండ్‌ యువర్‌ ఫేట్‌ మాదిరిగా క్షణాలతో సహా లెక్కలు కట్టి చెప్పిన వారు మాత్రం అరుదు.. లేరు..
మానసికంగా బలహీనుడికి నువ్వు ఫలానా అప్పుడు చనిపోతావని చెప్తే.. ఆ బాధతో అతను ఆ చెప్పిన రోజు దాకా కూడా బతకడు.. అదే ఆలోచనతో కుంగి కృశించిపోతాడు.. ఇలాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అనర్థాలకే దారి తీస్తాయి.
సిగరెట్లు తాగితే ఇన్ని రోజులు ఆయుష్షు తగ్గిపోతుందనీ, మద్యం సేవిస్తే మరి కొన్ని రోజులు వయసు తగ్గుతుందని లెక్కలు కట్టిన వాళ్లూ ఉన్నారు.. వాటికీ మంచి ప్రచారమే వచ్చింది. కానీ, తక్కువ సిగరెట్లు, మద్యం తాగిన వాళ్లు చిన్నవయసులో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.. డబ్బాలకు డబ్బాలు చైన్‌ స్మోకింగ్‌ చేసిన వాళ్లు..ఎనభై ఏళ్లూ బతికిన సందర్భాలూ చూశాం.. అసలు ఎలాంటి అలవాట్లు లేని వాళ్లు సైతం చిన్నవయసులో హఠాత్తుగా కన్నుమూసిన సన్నివేశాలూ ఉన్నాయి.. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్లు, జ్యోతిష శాస్త్రాలు కట్టే లెక్కలకు హేతుబద్ధత ఎలా కట్టబెట్టగలం..
మనిషి శరీర తత్త్వాన్ని బట్టి.. అతని ఆరోగ్య స్థితిని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి అతడి జీవిత కాలం ఆధారపడి ఉంటుంది.. అంతే కానీ, ఏవేవే లెక్కలు గట్టి.. పిచ్చి పిచ్చి సూత్రాలను చూపించి దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపోతావంటే అంతకంటే పెద్ద జోక్‌ ఇంకోటి ఉండదు.. ఇలాంటి వెబ్‌సైట్‌లను చూస్తే సరదాగా చూసి నవ్వుకోవాలి.. అంతే కానీ, సీరియస్‌గా తీసుకుంటే దాని వల్ల మానసిక ఆందోళన తప్ప ఒరిగేదేమీ ఉండదు... సో.. బీ హ్యాపీ.. అండ్‌ ఎంజాయ్‌ యువర్‌ లైఫ్‌... బి కాజ్‌ వుయ్‌ హావ్‌ ఓన్లీ వన్‌ లైఫ్‌... జస్ట్‌ ఎంజాయ్‌.. నథింగ్‌ ఎల్స్‌..

కామెంట్‌లు లేవు: