29, నవంబర్ 2010, సోమవారం

జగన్‌ రాజీనామా చేశారు

జగన్‌ రాజీనామా చేశారు.. పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో  సంచలనానికి తెరతీశారు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కెసిఆర్‌ ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర రాజకీయం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి మొదలైంది. జగన్‌  రాజీనామా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు..  అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌కు జగన్‌ రాజీనామా శరాఘాతమే. కాంగ్రెస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న స్థానాలు157 మాత్రమే. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్ర  శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 147. అంటే పది మంది సభ్యులు రాజీనామా చేస్తే సర్కారు మైనారిటీలో పడిపోతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దీనికి తోడుగా ఎంఐఎం నుంచి 7 సీట్ల మద్దతు ఎలాగూ లభిస్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈ రెండు పార్టీల నుంచి లభిస్తుందన్నమాట. అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమో, జగన్‌ వర్గం వైపు వెళ్లటమో జరిగితే సర్కారు ఖచ్చితంగా మైనార్టీలో పడిపోతుంది. అంటే జగన్‌ కనీసం 40 మంది ఎమ్మెల్యేలను చీల్చగలిగితే స్పష్టంగా సర్కారు మైనార్టీలో పడిపోతుంది. జగన్‌ వర్గానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మరునాడు జగన్‌ ఇంట్లో 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వీరిలో చివరి వరకు ఆయన వెంట ఎంతమంది కొనసాగుతారు.. కాంగ్రెస్‌లో మరెంత మంది ఆయన వెంట వస్తారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.. మొత్తానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రమాణం చేసిన మరునాటి నుంచే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దీన్ని ఎలా అధిగమిస్తారో, ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి