5, జనవరి 2009, సోమవారం

రక్తమోడుతున్న ఈశాన్యభారతం



ముంబయిలో టెరర్రిస్టుల దాడి జరిగితే అది దేశంపై ముష్కరులు ప్రకటించిన యుద్ధంగా పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహం పెల్లుబికింది. అంతర్జాతీయ స్థాయిలో  పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా దౌత్యపరమైన చర్యలు మొదలయ్యాయి. సాక్ష్యాలు పాక్‌ చేతిలో పెట్టి మరీ అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది మన సర్కారు.. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టాల్సింది ఏమీలేదు. ఇవన్నీ ఆహ్వానించదగిన పరిణామాలే...అయితే అదే ఉగ్రవాదం ఈశాన్యభారతంలో సాగిస్తున్న మారణహోమానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యం శూన్యం.. వాస్తవానికి ఇక్కడ సాయుధ వేర్పాటువాద పోరాటం కాశ్మీరం కంటే హింసాత్మకమైంది. మన ప్రభుత్వానికి ఈశాన్య రాషా్టల్ర అస్తిత్వమే గుర్తుకు రావటం లేదు.. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది?
ప్రతి సంవత్సరం జనవరి ఒకటి వస్తోందంటే చాలు.. అసోం గడగడలాడుతుంది. ఎందుకంటే దేశమంతా కొత్తసంవత్సర వేడుకల కోసం ఉత్సాహపడుతుంటే.. అసోం మాత్రం ఈసారి ఎక్కడ బాంబు పేలుతుందోనన్న భయం ప్రజ  వెన్నుల్లోంచి వణుకు పుట్టిస్తుంది. గత రెండు మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా జనవరి ఒకటిన గౌహతిలో వరుస పేలుళు్ల పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని అనంతవాయువుల్లో కలిపాయి.వేర్పాటు వాదుల మృత్యుయజ్ఞానికి అమాయకులు సమిధలవుతున్నారు.  నిజానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రవాద హింసాకాండ కంటే బ్రహ్మపుత్ర లోయలో, దాని చుట్టుపక్కల కొండ కనుమల్లో కొనసాగుతున్న మారణకాండ అధికంగా ఉందని దక్షిణాసియా టెరర్రిజం పోర్టల్‌ వెల్లడించింది. నిన్న మొన్న కాలగర్భంలో కలిసిపోయిన సంవత్సరంలో  అస్సాం, మణిపూర్‌లలోనే వెయ్యిమంది వేర్పాటువాదానికి బలైపోయారంటేనే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.2006లో 640మంది చనిపోతే.. 2008లో మృతుల సంఖ్య 1057కు పెరిగింది. ఇదే సంవత్సరంలో కాశ్మీర్‌లో టెరర్రిజానికి 539 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలే కావటం దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌లో టెరర్రిజాన్ని ఎదుర్కోవటంపై చూపించిన శ్రద్ధ ఈశాన్యభారతంలో వేర్పాటువాదాన్ని అణచివేయటంపై చూపించలేదనటానికి అక్కడ పెచ్చరిల్లుతున్న హింసే తార్కాణం. సైనిక చర్యలకు మరణిస్తున్న వేర్పాటువాదుల సంఖ్య పెరుగుతున్నా...వారి మనోధైర్యాన్ని మాత్రం మన బలగాలు దెబ్బతీయలేకపోతున్నాయి. 2006లో 317మంది టెరర్రిస్టులు చనిపోతే 2008లో వీరి సంఖ్య 612కు చేరింది. ఇదే సమయంలో ఈ పోరాటంలో చనిపోతున్న సైనికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.  ఈశాన్యభారతంలోని ఏడు రాషా్టల్ల్రో చొరబాట్లు చాలా తేలిగ్గా జరుగుతుంటాయి. ఆరు దశాబ్దాలుగా ఇక్కడ వేర్పాటు వాదం ప్రజలకు ప్రశాంతత లేకుండా చేసింది. 1994నుంచి ఇప్పటివరకు పదిహేనేళ్లలో బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో 16వేల 271మంది చనిపోయారంటేనే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అస్తిత్వం కోసం వివిధ జాతులు ఇక్కడ చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలను ప్రభుత్వాలు పట్టించుకోని దుస్థితే ఈ అస్థిరతకు కారణం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 50 మిలియన్ల ప్రజల్లో 20శాతం మంది ఈశాన్య రాషా్టల్ల్రోనే ఉన్నారు. దేశంలో ఆంత్రొపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  గుర్తించిన 632 గిరిజన జాతుల్లో 213 ఈశాన్య రాషా్టల్ల్రోనే ఉన్నాయి. ఈ జాతులు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవటం వల్ల ఇక్కడ వేర్పాటు వాదం పెచ్చరిల్లింది. స్థానిక, స్థానికేతర వాదం ప్రజ్వరిల్లింది. దాదాపు  32 సంస్థలు సాయుధపోరాటాన్ని చేపట్టాయి. వీటిలో 15 సంస్థలను మేజర్‌ మిలిటెంట్‌ గ్రూపులుగా గుర్తించారు. ఇందులో ఇప్పుడు 12 సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. అసోంలో ప్రధాన సంస్థ ఉల్ఫా, నాగా మిలిటెంట్లతో పొత్తు కుదుర్చుకోవటం ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారింది. అటు బంగ్లా చొరబాట్లను అడ్డుకోవటంలో వైఫల్యం కూడా అస్సాంలో మరింత హింసాకాండకు కారణమవుతోంది. లాల్‌డెంగా నేతృత్వంలో 1986లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడిన తరువాత మిజోరాంలో క్రమంగా వేర్పాటువాదం సన్నగిల్లింది. అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ రాషా్టల్రు కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నాయి. త్రిపురలో  రాజకీయ చొరవ సత్ఫలితాలను ఇచ్చింది. ఇక్కడ టెరర్రిస్టు కార్యకలాపాలు నిలిచిపోయి దాదాపు దశాబ్దం పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ప్రధానంగా టెరర్రిస్టు కార్యకలాపాలు జరుగుతున్నవి అసోం, మణిపూర్‌, నాగాలాండ్‌లలో మాత్రమేనని చెప్పవచ్చు. కాశ్మీర్‌ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న టెరర్రిస్టు సంస్థల్లో  పదివేల మంది కేడర్‌ ఉన్నట్లు అంచనా. జనాభా నిష్పత్తిలో పోలీసుల సంఖ్య ఉన్నప్పటికీ ఈ రాషా్టల్ల్రో  హింసను నిరోధించటం సాధ్యం కావటం లేదు. యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం (ఉల్ఫా)ను అణచివేసేందుకు అసోం ప్రభుత్వం కేంద్ర సర్కారు సాయంతో ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. 2005లో భూటాన్‌ ప్రభుత్వం సైనిక చర్యతో తన సరిహద్దుల్లోని ఉల్ఫా శిబిరాలను ఏరివేసిన సందర్భాన్నీ మన బలగాలు అందిపుచ్చుకొని ముందుకు సాగలేకపోయాయి. దీని పర్యవసానం నిరంతరంగా కొనసాగుతున్న హింస. ఈ ప్రాంతంలో  సైనిక చర్య ద్వారా వేర్పాటు వాదాన్ని అణచివేస్తామని ప్రభుత్వం భావిస్తే అది భ్రమే అవుతుంది. సైనిక చర్యకు తోడ్పాటుగా, గిరిజన సముద్ధరణకు కృషి చేయనంతకాలం ఈశాన్యభారతం రక్తమోడుతూనే ఉంటుంది.

3 కామెంట్‌లు:

pseudosecular చెప్పారు...

Kovela santosh kumar గారు,

Very well written post.

Christian Terrorists are creating mayhem in North-East of India.

Non of the Indian media outlets inform this fact to people.

Keep up the good work.

jeevani చెప్పారు...

మన దేశంలో సాధారణంగా మనిషి ప్రాణానికే విలువ లేదు. వందలాది మంది చనిపోతే తప్ప అటు వైపు చూడరు. ఇక ఈశాన్య భారతం విషయంలో ప్రభుత్వాల వైఖరులు చాల క్రూరంగా ఉన్నాయి. అక్కడి పెట్రోలును, సహజ వనరులను యధేచ్చగా వాడుతున్నాం. వేరే ప్రాంతాల పెట్టుబడిదారుల పరిశ్రమల్లో స్థానికులు వెట్టిచాకిరి చేస్తున్నారు. అవన్నీ ప్రభుత్వాలకు పట్టవు. వోట్లు మాత్రమే....

Kathi Mahesh Kumar చెప్పారు...

మణిరత్నం తీసిన "దిల్ సే" సినిమా ఫ్లాప్ అవడానికి కారణం తెలిసిందా?