29, డిసెంబర్ 2008, సోమవారం

చిరంజీవి విజేత అవుతారా?

మెగాస్టార్‌ చిరంజీవి సుదీర్ఘకాలం ఆలోచించి ఆలోచించి ముహూర్తం పెట్టుకుని రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావటం ఒక మహా సంచలనం అంటూ మీడియాలో హోరెత్తింది. తిరుపతి సభ మీడియా మాటల్ని నాటికి నిజం చేసింది. చిరంజీవి పార్టీని ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నది. కానీ, ఆయన పార్టీ దశ ఏమిటి? దిశ ఏమిటి? అది ప్రజలకు ఇస్తున్న మార్గ నిర్దేశన ఏమిటన్నవి.. ఇప్పటికీ ఒక స్పష్టత రాని ప్రశ్నలు. చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన అవసరానవసరాల గురించి ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. ఆయన ఎలాగూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయనున్నారన్నదే సందేహం. చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చటం ఒక విధంగా సమంజసమే కావచ్చు. కానీ, ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేవలం ఆయన చరిష్మా ఒక్కటే పని చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన చరిష్మా కంటే కూడా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత్వమే ఎక్కువగా ప్రభావితం చేసింది. కేవలం సినిమాల్లో వేషాల వల్లనే ఎన్టీయార్‌ తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాలేదు. దాదాపుగా అప్పుడే భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందిన జనసంఘం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఉండకపోతే అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత అలాంటిది. దీనికి తోడు ఎన్టీయార్‌కు నాడు పూర్తిగా సహకరించిన వాళు్ల కమూ్యనిస్టులు. ఆయన సభలకు పెద్ద ఎత్తున జనాల్ని తరలించిన వాళు్ల కమూ్యనిస్టులు అన్నది నిర్వివాదం. వీటన్నింటికీ మించి నాడు మీడియా రారాజుగా నిలిచిన ఈనాడు పత్రిక పూర్తిగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించింది. ఈనాడు పత్రిక ఏది రాస్తే అది వేదంగా చెలామణి అయిన కాలం అది. తెలుగుదేశం పార్టీ జెండా ఈనాడు హైదరాబాద్‌ కార్యాలయంలో రూపొందిన మాట వాస్తవం. ఎన్టీయార్‌ ప్రసంగాలతో పాటు, తెలుగుదేశం పార్టీలోని చిన్న నాయకులకు, సినిమా తారలకు ప్రసంగ పాఠాలు రాసివ్వటమే కాకుండా, వారు ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చింది కూడా ఈనాడు కార్యాలయంలోనే. ఇన్ని రకాలుగా ఎన్టీయార్‌కు కాలం కలిసి వచ్చింది కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చారు. అదే ఎన్టీయార్‌ను అయిదేళ్ల తరువాత ఓడించి మరీ గద్దె దింపింది ఈ ప్రజలేనన్నదీ మరవద్దు...చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చుకున్నా.. చరిష్మా విషయంలో  చిరంజీవికి ఉన్న అభిమానులు అధికంగా మాస్‌.. యూత్‌ అన్నది నిర్వివాదం. యువతలో ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య పరిమితం. వీళ్లలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యే ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అర్బన్‌ ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. వీళ్లలో చాలామందికి ఓటు పైన ఆసక్తి కూడా ఉండటం లేదని చాలా సందర్భాల్లో తేలింది. మరి సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న గ్రామీణ ఓటర్ల మాటేమిటి? వీళ్లలో ఎంతమందిని చిరంజీవి తనవైపు తిప్పుకోగలరు? పార్టీ స్థాపించి ఇప్పటికి నాలుగు నెలలు అయింది. మూడు ప్రాంతాలలో 13 రోజుల పాటు రోడ్డు షోలు నిర్వహించారు. ఇప్పుడు ప్రజా అంకిత సభలు పెడుతున్నారు. మొట్ట మొదట సిరిసిల్ల వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తన ప్రసంగాల్లో రాజకీయాల్లో మార్పు గురించో... అవినీతి నిర్మూలన గురించో.. వివిధ అంశాలపైన సాధారణీకరణ(జనరలైజ్‌) వ్యాఖ్యానాలు చేస్తున్నారే తప్ప .. నిర్మాణాత్మకంగా తన అజెండాను స్పష్టంగా చెప్పింది లేదు. లక్షల మంది ప్రజలు తనను చూసేందుకు వస్తున్నప్పుడు వారిలో భావోద్వేగాన్ని (ఎమోషన్‌) సృష్టిస్తే తప్ప ఆయన మాటలు వారి మనసుల్లో ఎక్కువ కాలం నిలవవు. ఈ వాస్తవాన్ని ఆయన గ్రహించినట్లు లేదు.  అప్పుడే వారు తనకు ఓటర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఆయనకు ప్రసంగాలు రాసిస్తున్న వారు కూడా కేవలం ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పడికట్టు పదాలు రాసివ్వటం తప్ప తనకు అవకాశం ఇస్తే ప్రజలకు ఇప్పుడున్న నాయకుల కంటే మెరుగ్గా తానే పని చేయగలనన్న ధీమా కలిగించే ప్రసంగ పాఠాలు మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే  ఆ రాయసగాండ్రు కూడా ఈనాడు సంస్థలో నలిగి నలిగి వచ్చిన వారే కాబట్టి. 
ఆయన పార్టీ స్థాపించిన తరువాత అందులో చేరిన వారంతా రాజకీయ కురువృద్ధులూ.. రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిన వారే కావటం గమనార్హం.. చేగొండి హరిరామ జోగయ్య, శివశంకర్‌, పర్వతనేని ఉపేంద్ర లాంటి ముసలివాళు్ల.. భూమా దంపతులు.. తమ్మినేని సీతారాం లాంటి వాళు్ల 2004లో వాళ్ల నియోజక వర్గాల్లోనే ఓడిపోయిన నేతలు.. ఒకరిద్దరు ఛోటామోటా నాయకులు తప్ప ప్రజారాజ్యం పార్టీలో ప్రజలపై ఖచ్చితమైన ప్రభావం చూపగల నాయకులంటూ ఎవరూ లేరన్నది నిష్ఠుర సత్యం. కత్తిపద్మారావు లాంటి నేతలు రాజకీయంగా చిరంజీవికి ఎంతమాత్రం ఉపయోగపడతారన్నది అనుమానమే.
ఇక పార్టీ ప్రతినిధులూ అలాగే ఉన్నారు. ఒకరు బిజెపిలో ఇమడలేక ఈటీవీలో ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకరింగ్‌ చేస్తూ.. రామోజీరావు గారి సిఫార్సుమేరకు పిఆర్‌పి ప్రతినిధిత్వం స్వీకరించిన పరకాల ప్రభాకర్‌.. మరొకరు చిరంజీవికి తొలి నుంచి రాజకీయ సలహాదారుగా ఉన్న పుచ్చలపల్లి వారి మనవడు మిత్రా. ఈ ఇద్దరూ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు కారు..వారికి ఉన్న బలం అల్లా ఒక్కటే.. భాషాదోషం లేకుండా, తడబడకుండా మాట్లాడగలగటం. పార్టీలో అభిమానులకు లభించిన ప్రాధాన్యమూ అంతంతమాత్రమేనని పలు జిల్లాల్లో తరచూ జరుగుతున్న గొడవలే స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి అభిమాన గణానికి,  అభిమానేతర వర్గానికి మధ్య అంతరం అన్ని నియోజక వర్గాల్లో కనిపిస్తూనే ఉన్నది. ఒక్కో నియోజక వర్గంలో పది నుంచి పదిహేను మంది టిక్కెట్ల కోసం ఆశిస్తున్నట్లు అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్లందరి మధ్య సమన్వయం కుదర్చటం చిరంజీవికి తల బొప్పి కట్టించే విషయం.
దీనికి తోడు మార్చి ఏప్రిల్‌లలో ఎన్నికలు జరగ వచ్చని ఎన్నికల సంఘం అప్పుడే సూచన ప్రాయంగా ప్రకటించింది. అంటే ఎన్నికలకు ఇంకా మూడు మాసాల గడువే ఉంది. ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు ఏమిటన్నది ఇంకా ఖరారు కానే లేదు. అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించాలని చిరంజీవి ఇసికి విజ్ఞప్తి చేసి వచ్చారు కూడా. ఎన్నికల సంఘం గుర్తు కేటాయించిన తరువాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటం పెద్ద సవాలు.. ప్రజారాజ్యం పార్టీ జెండా ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఓట్ల సమయంలో వేరే గుర్తు ఉంటే గ్రామీణ ఓటర్లు దాన్ని గుర్తించటం ఓ సమస్య. పార్టీ గుర్తు ఎంత తొందరగా ఖరారైతే అంత మంచిది. చివరి నిమిషంలో ఖరారైతే.. ఓటర్లలో అయోమయం నెలకొనవచ్చు. 
119 సీట్లు ఉన్న తెలంగాణాలో తెలంగాణ అనుకూల పార్టీలు మూడు వర్గాలుగా పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఇప్పటికైతే వినవస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ అనుకూల ఓట్లు ఈ మూడింటి మధ్య చీలిపోవచ్చు. దాని వల్ల అంతిమంగా సత్ఫలితాన్ని పొందేది కాంగ్రెసే.. ఈ అడ్డంకిని చిరంజీవి ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి. మరోవైపు ఎన్నికల పొత్తుల విషయంలోనూ చిరంజీవికి ఎదురుదెబ్బే తగిలింది. పార్టీ ప్రారంభానికి ముందు చిరంజీవితో ఆయన తము్మళ్లతో, బావమరిదితో మాట్లాడటానికి ఉత్సాహం చూపిన వారంతా ఒక్కరొక్కరుగా వెనక్కిపోయారు. మొదట్లో అత్యుత్సాహం ప్రదర్శించిన ఉభయ కమూ్యనిస్టులు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. కొంతకాలం ఊగిసలాడిన కెసిఆర్‌ సైతం మొహం చాటేశారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్న వ్యక్తి నవతెలంగాణ పార్టీ అధినేత దేవేందర్‌ గౌడ్‌ మాత్రమే. దేవేందర్‌ గౌడ్‌ పార్టీ తెలంగాణ ప్రజలపై చూపిస్తున్న ప్రభావం అంతంతమాత్రమే. అలాంటప్పుడు గౌడ్‌ చిరంజీవికి ఎంతవరకు లాభం చేస్తారో చూడాల్సిందే. 
తెలుగు సినీపరిశ్రమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కుటుంబం చిరంజీవిది. అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే.. ఆయన వెంట ఆయనకు వెన్నుదన్నుగా సినీపరిశ్రమ కదలిరాకపోవటం విచిత్రం. పైగా సినీపరిశ్రమ మూడు ముక్కలుగా రాజకీయాల్లో చీలిపోయింది. సూపర్‌స్టార్‌ కుటుంబం కాంగ్రెస్‌ వైపు వెళ్తే.. నందమూరి కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. నాగార్జున సైతం కాంగ్రెస్‌ పథకాలకు ప్రచారం మొదలు పెట్టారు. ఈ దామాషా పద్ధతిలోనే అభిమానుల ఓట్లు పార్టీల మధ్య చీలుతాయన్నది నిర్వివాదం. అలాంటప్పుడు చిరంజీవి 225 సీట్లు సాధిస్తానని ఏ ధీమాతో చెప్తున్నారో ఆలోచించాలి.
చిరంజీవి ఇప్పటివరకు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అన్నీ తానే అయి.. అంతటా తానే నిలిచి పని చేస్తున్నారు. ఈ పోరాటంలో చివరికి విజేతగా నిలుస్తారా? విజితులవుతారా? వేచిచూద్దాం....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి