7, ఆగస్టు 2011, ఆదివారం

వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం

ఏ దేవతలూ రక్షించటం లేదు
ఏ మహాత్ములూ కాపాడటం లేదు
నమ్మకం కోల్పోయి కాళ్ల కింద భూమి తొలగిపోయి
ఎక్కడా నిలువ లేక తల్లీ తెలంగాణమా.. ఒక్కరొక్కరుగా నీ దరికి చేరిపోతున్నారు
తెలంగాణమొక ఆకాశసముద్రంగా మారిపోయింది
ఈ సముద్రంలో ఎంతసేపు ఈదినా శరీరం అలసిపోదు...
ఎప్పటికీ చేతికి ఏదీ అందదు.
క్షణక్షణం మారే రంగులతో సమైక్యవాది వలె
ఈ ఆకాశం అంచనాలకు అందటం లేదు
దూరం తెలియనంత గమ్యంలో 
తెలంగాణం కనిపిస్తోంది.. ఆ
ఆ దూరం తరగటం లేదు.. గమ్యం చేరటం లేదు
మన ప్రయాణంలో ఆయుధాలను వారు దొంగలిస్తున్నారు
గమ్యం చేరకముందే రైలుపట్టాలను తొలగిస్తున్నారు
సంకల్పాలను విషపూరితం చేస్తున్నారు
సామరస్య ద్వారాలను మూయిస్తున్నారు
మృత్యు శార్దూలాలై మీదపడి దొంగదెబ్బ తీస్తున్నారు
డిసెంబర్ 9  బర్త్‌డే గిఫ్ట్‌ప్యాక్‌ను దారిదోపిడీగాళ్లు దోచుకుపోయారు
వైఫల్యమే ఫలించబోతోందా అన్న అనుమానం
తెలంగాణమా నీ బిడ్డలు ఒక్కొక్కరే నీలో సంలీనమవుతున్నారు
అయినా ఇక్కడ ఎవరూ బలహీనులు లేరు
వర్చస్సు కోసం.. బలం కోసం.. శక్తి కోసం
ఈ మృత వీరులు శ్రీకాంత్.. యాదిరెడ్డిల హస్తాల నుంచి ధనస్సులు అందుకుంటున్నాం
మీరూ.. మేమూ.. మనం అంతా కలిసి 
తెలంగాణమంతటా ఆవరించిన వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం
ఈ వీరులను తెలంగాణ మాతృభూమి ఒడిలోకి 
అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకే చేరుస్తున్నాం
తల్లీ నీ బిడ్డను బలంగా నొక్కకు.. 
ఆవేదనతో నీ దరికి చేరుతున్నారు
శిరీషకోమల శరీరాల్ని సుకుమారంగా నీలో పొదువుకో
తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగించుకున్నట్లుగా ఒదిగించుకో
మేము తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చుతాము
వేయి అమర నక్షత్రాల సాక్షిగా తెలంగాణ మహోదయాన్ని స్వాగతిస్తాం 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి