29, మార్చి 2011, మంగళవారం

మెకాలే మళ్లీ పుట్టాడు

ఆశ్చర్యం... భారత దేశంలో ఒక్కసారిగా నాలుగు కోట్ల జనాభా తగ్గిపోయింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏకంగా ఒక ప్రాంతంలోని యావత్‌ ప్రజానీకానికి ఫండమెంటల్‌ రైట్స్‌... ప్రాథమిక హక్కులు రద్దు చేయబడినాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇప్పుడు భారతీయులుగా గుర్తింపు పొందరు.. వాళ్లకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఇకపై లేదు.. ఒకే ఒక్క తీర్పుతో దాన్ని నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు. భారత పౌరసత్వం ఉన్న ప్రతివారికీ ప్రాథమిక హక్కులు ఉండాలన్నది రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన ప్రధాన సూత్రం. ఆ హక్కులు లేని పౌరులు భారతీయులుగా ఎట్టి పరిస్థితిలోనూ మనటానికి వీల్లేదు. ఇప్పుడదే జరిగింది. ఇకనుంచి ఎవరైనా సరే ఆ ప్రాంతం ఊసెత్తటానికి వీల్లేదు. భారత ప్రభుత్వానికి కానీ, ఆ ప్రాంతాన్ని ఏలుతున్న మారాజులకు కానీ, అక్కడి ప్రజానీకానికి ఏమీ చేయాల్సిన బాధ్యత లేదు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం లేదు. విద్యా ఉద్యోగాలు కల్పించాల్సిన ఆగత్యం లేదు. నీళ్లు ఇవ్వాల్సిన పని లేదు.. తిండి పెట్టక్కర్లేదు.. ఎందుకంటే వాళ్లకు ప్రాథమిక హక్కులు లేవు.. వాళ్లకు ఈ దేశ పౌరులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ల ప్రాథమిక హక్కులను కాలరాసేయమని ఓ బలమైన సిఫారసు అత్యంత రహస్యంగా  హస్తినలో ధృతరాష్ట్రుల వారికి చేరింది. ఏ విషయమూ ఆయనకు కనిపించదు. ఎందుకంటే ఆయన గుడ్డివాడు. వందిమాగధబృందం చెప్పిన సమాచారమే అతనికి వేదవాక్కు.  అరవై సంవత్సరాలుగా అతనికి చెప్పకుండానే, వీటిని అమలు చేస్తూ వచ్చారు.. అతను వినికిడి ద్వారా తెలుసుకున్నా.. గుడ్డివాడు కాబట్టి,  చేసేదేం లేదనుకుని మౌనంగా ఉండిపోయాడు. అరవై సంవత్సరాలుగా అనధికారికంగా జరుగుతున్న వ్యవహారానికి ఇప్పుడు రాజముద్ర పడింది. వీళ్లను పౌరులుగా పరిగణించటానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానంలో నీతిమంతుడిగా కీర్తి పొందిన పెద్దమనిషి... దేశ వ్యవహారాల శాఖలో ఉన్నత పదవిని నిర్వహించిన మహా సచివుడు పది నెలల పాటు తెగ కష్టపడి... ౨౦ కోట్ల రూపాయల ఖజానా డబ్బును ఆపసోపాలు పడి ఖర్చు చేసి అలసి.. సొలసి తీసుకున్న నిర్ణయం. దాని సారాంశం ఆ ప్రాంత ప్రజలు.. ప్రజలు కాజాలరు.. పౌరులు కాజాలరు.. వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండటానికి వీల్లేదు.
మా పాలన మేం చేసుకుంటా అంటే ఊరుకోవద్దు. వారికి సొంతంగా పరిపాలన చేసుకునే హక్కా... పాడా..... అసలు వారికి సొంతంగా అభిప్రాయమే ఉండటానికి వీల్లేదు.. వాళ్లు ఉన్నది ఊడిగం చేయటానికి..  అసలు వాళ్ల కల్చరే బాంచన్‌ కాల్మొక్తా సంస్కృతి.. అప్పుడు భూస్వాములు.. ఇప్పుడు మీరు... మీ మాటే వాళ్లకు శిరోధార్యం కావాలి. వాళ్లకు సొంతంగా మాట్లాడే హక్కు ఉండకూడదు. వాళ్ల అభిప్రాయాలతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు. అసలు పట్టించుకోవలసిన అవసరమే లేదు. వాళ్లకంటూ ఓ అభిప్రాయం ఏర్పడిందా? మీకు పుట్టగతులుండవు.. ఇందుకోసం మీ అభిప్రాయాన్ని వాళ్ల అభిప్రాయంగా మలచండి. మీరు ఏది చెప్తే అదే నిజమని నమ్మేలా చేయాలి.. అసలు మీరున్నాక.. వారు ఆలోచించాల్సిన అవసరం లేదు.. అభిప్రాయం ఏర్పరుచుకోనక్కరలేదు. మీరు చెప్పినట్లు వాళ్ల బుర్రలు పని చేయాలి.  అంతకు మించి నోరెక్కువై వాగుతున్న వాళ్లను అడ్డంగా అణచేయండి... ఎలాగూ బలం ఉంది.. బలగాలున్నాయి.. బందూకులున్నాయి.. పెల్లెట్లు.. బుల్లెట్లు రబ్బరువో.. నిజమైనవో.. కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎగేసేందుకు, తరిమి కొట్టేందుకు గాలీ, ధూళీ ఉన్నాయి. అణచేయండి.. నిర్దాక్షిణ్యంగా దునిమేయండి. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపిలు.. మినిష్టర్లనే పెద్దమనుషులకు ఎర వేసేందుకు పదవులు, సూట్‌కేసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. వాటిని వాడుకోండి..కుక్కలకు బొక్కలు విసిరేస్తే విశ్వాసంగా పడిఉంటాయి... ? వీళ్లకు అంత సీను కూడా లేదు..ఇక నాలుగో ఎస్టేటా? బొందా? అదంతా సర్కారు సొమ్ముపై ఆధారపడి బతికేది..రోజుకో నాలుగు పేజీల ప్రకటనలిచ్చేయండి.. మీరెట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది. అంతే కానీ... ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు కోట్ల ప్రజానీకం గొంతెత్తకూడదు.. పరస్పరం గొంతులు కలపకూడదు.. అవి ఒక్కసారి కలిశాయా? మీ బతుకులు శాశ్వతంగా తెల్లారుతాయి. తస్మాత్‌ జాగ్రత్త.
తనకు అప్పజెప్పిన పనిని జస్టిస్‌ దొరవారు.. ఐపిఎస్‌ ఆపీసర్‌ వారు చాలా చక్కగా, సమర్థంగా నిర్వహించారు. తెలంగాణ పౌరులను భారతీయులు కారని ఒకే ఒక్క మాటతో తేల్చి పారేశారు.. ఆహా ఏమి దేశంలో ఉన్నాం.. ఏమి రాజ్యంలో ఉన్నాం.. హిట్లరుకు గోబెల్స్‌ కూడా ఇలాంటి నీచమైన సలహాలు ఇచ్చి ఉండడు. తన దేశంలో.. తన ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న ఒక జాతిని, సమూలంగా నిర్వీర్యం చేసే దిశగా సాగిన మహా కుట్ర ఇది. రెండు వేల సంవత్సరాల సంస్కృతిని మూలాల నుంచి నిర్మూలనం చేసేందుకు జరిగిన ద్రోహ చింతన ఇది. ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండర్‌ దగ్గర నుంచి.. ఇవాళ ప్రపంచ పోలీసుగా ఒక్కో దేశాన్ని తన పదఘట్టనల కింద నలిపేస్తున్న అమెరికాకు కూడా అర్థం కాని కూటనీతి ఇది. రాజకీయానికి, రాజ ధర్మానికి అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుని మేధస్సు కూడా ఊహించి ఉండదు ఈరకమైన రాజనీతిని.
వెనకట మెకాలే అనే వాడు ఒకడు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు బానిసగా ఉండేందుకు తెల్లదొరలు ఎలాంటి వ్యూహం అనుసరించాలో చెప్పుకుంటూ వచ్చాడు..

Lord Macaulay said the following about India in 1835 in British Parliament.
Â
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
అతను సూత్రీకరించిన అంశాలలో ‘‘మొదటిది భారతీయుల దగ్గర ముష్టెత్తుకునే పరిస్థితి లేదు.. విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు.. వాళ్ల సంస్కృతి, చరిత్ర చాలా గొప్పది.. ఈ దశలో వాళ్లపై ఆధిపత్యం చెలాయించటం సాధ్యమయ్యే పని కాదు.. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ల అభిప్రాయాలలో మార్పు తీసుకురావటం.. వాళ్ల విద్యావిధానాన్ని పూర్తిగా మార్చటం..  వాళ్లకంటే మన భాషను, మన సంస్కృతిని, మన వ్యవహారాన్ని గొప్పదిగా భావించేలా చేయటం.. మమ్మల్ని ఉద్ధరించేందుకు వీళ్లు వచ్చారని అనుకునేలా చేయటం.. ’’ఇలా వాళ్లలో బాగా నాటుకునేలా చేయటం.. అడపా దడపా ఏదైనా చీడపురుగు లేస్తే దాన్ని నలిపేయటం.. ఇదీ మెకాలే సిద్ధాంతం.. సూత్రీకరణ.. ఇందులో తెల్లవాళ్లు  గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యారు కాబట్టే రెండు శతాబ్దాల పాటు భారత్‌ను ఏలుకోగలిగారు..
ఇప్పుడు ఆ మెకాలే మళ్లీ పుట్టాడు.. ఈసారి ఈ దేశంలోనే పుట్టాడు.. తెలంగాణా గురించి మళ్లీ.. మళ్లీ అదే సూత్రీకరణలు చేశారు.. అద్భుతమైన సూత్రీకరణలు.. విశ్వంలో మనిషి పుట్టిన తరువాత ఒక జాతి అస్తిత్వాన్ని కాలరాసేందుకు జరిగిన కూటనీతులన్నింటినీ మించిన  అతి గొప్ప నీతిని ప్రపంచానికి అందించారు.. ఇది రాజనీతి శాస్త్రాల ద్వారా  భావి దౌత్యవేత్తలకు పాఠాలుగా చెప్పదగినది. దీనికి పేరు ఎనిమిదో చాప్టర్‌..  ఇది అత్యంత రహస్యం.. ఏ పేజీకి ఆ పేజీయే  రహస్యం.. దీన్ని బయటపెడితే భారత అంతర్గత భద్రత, జాతీయ సమగ్రతే ప్రమాదంలో పడిపోతుంది. అవును నిజమే.... ఈ చాప్టర్‌ బయటపెడితే భారతదేశ సమగ్రత నిశ్చయంగా మంట గలుస్తుంది. ప్రజల మధ్య సామరస్యం నిర్మూలనమవుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కంకణబద్ధులై ముప్ఫై సంవత్సరాల పాటు ఈ దేశానికి సర్వీసును వెలగబెట్టిన ఇద్దరు మెకాలే మేధావులు చేసిన పనికి మన దేశ సమగ్రత  ఖచ్చితంగా నాశనమవుతుంది.

ఎందుకంటే ఎదుటివాళ్లను ఎరలు వేసి లోబరుచుకోవటం ఎలాగో చెప్పారు కాబట్టి.. మనుషుల్ని ఏమార్చటం ఎలాగో వివరించారు కాబట్టి.. అవినీతిని అమలు చేయమని సుద్దులు చెప్పారు కాబట్టి.. అవినీతిని చట్టబద్ధం చేసినా తప్పులేదన్నట్లుగా పరోక్షంగా వ్యాఖ్యానించారు కాబట్టి..  అది కూడా రాతపూర్వకంగా సిఫార్సు చేశారు కాబట్టి. వావ్‌.. ఎంత గొప్పనీతి..
***
తెలంగాణా ఉద్యమానికి మూలమైన తెలంగాణా రాష్ట్రసమితిని దువ్వాలి.. తాయిలాలను అందివ్వాలి..
తెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధులకు కీలక పదవులు అప్పజెప్పాలి..
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపిలు, ఎమ్మెల్యేలను తెలంగాణ ఉద్యమం వైపు వెళ్లకుండా ఆపాలి. ప్రజాప్రతినిధులను అవసరమైన మేర అవసరమైన రీతిలో, అనుకూలంగా మలచుకోవాలి..
రాజకీయ మేనేజిమెంట్‌ అనేది పార్టీలు ఎప్పుడూ చేసేదే.. చేస్తున్నదే.. ఇక ముందు కూడా చేయబోయేదే..  కానీ, ఇప్పుడు ప్రజల సొమ్ము ౨౦ కోట్లను ఖర్చు చేసి ఓ గొప్ప వ్యూహాన్ని సర్కారు వారికి అందించారు న్యాయమూర్తిగారు.. ఓ పార్టీని చాలా సాఫ్ట్‌గా సాఫ్టెన్‌ చేసుకొమ్మని చెప్పేస్తారు..  దీన్ని అవినీతిగా పరిగణించటానికి వీల్లేదని ఆయన ఎంత చెప్పుకోవచ్చు.. కానీ, మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా ఆయన ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు..
ఇక మీడియా మేనేజిమెంట్‌.. ఇదే చాలా చాలా ముఖ్యమైన విషయం..
సామాన్యుల అభిప్రాయాలను ఉద్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మలచేందుకు మీడియాను సమన్వయంతో కలిసి పనిచేసేలా కృషి చేయాలి. ఇందుకోసం మీడియాను అనుకూలంగా మార్చుకోవాలి.. ఎందుకంటే మీడియా ప్రభుత్వ ప్రకటనల నుంచి వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది కాబట్టి గోల్‌ను అచీవ్‌ చేసేందుకు మీడియాను ఎఫెక్టివ్‌ టూల్‌గా వాడుకోవాలి.

పైగా మీడియా అంతా ఒకే ప్రాంతానికి చెందిన యాజమాన్యాలతో నడుస్తోందనీ న్యాయమూర్తుల వారు సెలవిచ్చారు. పేపర్లలో ప్రకటనలను ఇవ్వటం ద్వారా మీడియాను  లొంగదీసుకోమని శుభ్రంగా చెప్పేశారు.. దీనిద్వారా ప్రజల్లో తమకు అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగించేయవచ్చంట.. వండర్‌ఫుల్‌.. ప్రజల్లో  వాళ్లకున్న అభిప్రాయాన్ని  పూర్తిగా చెరిపేసి కొత్త అభిప్రాయాన్ని కలిగించాలి.. వీళ్ల అభిప్రాయాన్ని వాళ్లు చెప్పాలి.. రాజ్యాంగంలో 19(1) అధికరణం ఎవరి భావాలను వాళ్లు స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కును కల్పించిందే తప్ప.. ఎదుటివాడి అభిప్రాయాన్ని ఇంకొకడిపై రుద్ది.. వాణ్ణి అణచేయమని చెప్పలేదు.. మరి సదరు న్యాయమూర్తికి ప్రాథమిక హక్కుకు ఉన్న నిర్వచనం తెలియదా? తెలిసే అలా చేశారంటే.. నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి రాజ్యాంగంలోని 19(1) ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కును రద్దు చేయమని సిఫార్సు చేసినట్లే కదా.. లేకపోతే ప్రిపేర్డ్‌నెస్‌ ఎలాగో ఉందికదా అని కూడా ఉచిత సలహా ఇచ్చేశారు.
బహుశా న్యాయమూర్తి ఉద్దేశంలో రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్‌ వారి ఏలుబడిలో ఉన్న వారికి మాత్రమే ప్రాథమిక హక్కులు వర్తిస్తాయే తప్ప.. నిజాం ఏలుబడిలో ఉండి కాస్త లేటుగా దేశంలో కలిశారు కాబట్టి వాళ్లకు ఆ హక్కులు వర్తించవేమో..  తెలంగాణాకు స్వాతంత్య్రం రావటమే పదమూడు మాసాలు ఆలస్యమైంది.. ఆ స్వాతంత్య్రం కూడా ఎనిమిదేళ్లే అనుభవించారు.. ఆ తరువాత మళ్లీ దాన్ని లాగేసుకున్నారు. బలవంతంగా గుంజుకున్నారు. మెకాలే సూత్రాన్ని పూర్తిగా వంటబట్టించుకున్న జాతి... తనతో కలుపుకున్న తొలినాటి నుంచే దాడి చేయటం మొదలు పెట్టింది.

ఇప్పుడు మెకాలే సూత్రాల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోండి.. అక్షరాలా తెలంగాణాలో జరిగింది అదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.. తెలంగాణా జాతి, తెలంగాణా ప్రాంతం ఆంధ్ర జాతితో, ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోయే సమయంలో ఇక్కడ బిచ్చమెత్తే పరిస్థితి లేదు.. మిగులు బడ్జెట్‌తో ఉన్న ఒక రాష్ట్రాన్ని టెంట్ల కింద దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మరో రాష్ట్రం దిక్కులేక, గతిలేక, డబ్బులు చాలక, వనరులు సరిపోక ఇక్కడి వనరులన్నింటినీ కొల్లగొట్టేందుకు తమతో బలవంతంగా, నాయకత్వం మధ్య విభేదాల్ని సృష్టించి కలిపేసుకున్నారు..అచ్చంగా మెకాలే భారతదేశాన్ని ఎలా చూశాడో.. అతనికి ఏం కనిపించిందో.. ఆంధ్రాకు తెలంగాణాలో కనిపించిందీ అదే.  ఆ తరువాత క్రమంగా ఒక పథకం ప్రకారం.. చాలా కూల్‌గా.. చాలా శ్రేయోభిలాషులుగా.. తెలంగాణా ప్రజానీకాన్ని న్యూనతాభావనలో కి  పూర్తిగా నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఏడో నిజాం కాలంలో అనుభవించిన దుర్భర జీవితమే తరతరాలుగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. పాలు పెరుగు అమ్ముకునే పేరుతో అన్ని తెలంగాణా జిల్లాల్లో గుంటూరు పల్లెలు వెలిశాయి. పాల దగ్గరి నుంచి కాఫీ దాకా ఎలా ఉంటాయో వాళ్లు నేర్పితేనే తెలంగాణా వాళ్లకు తెలిసిందన్నట్లుగా ప్రచారం చేశారు. ఇక్కడున్న సాహిత్యాన్ని, సారస్వతాన్ని హైజాక్‌ చేసే ప్రయత్నం చేశారు.. రాజులను రాజ్యాలను, వంశాలను కూడా మాయం చేసి మసిపూసే యత్నం చేశారు. కులాల్ని ఆపాదించేందుకు ప్రయత్నించారు. తమనుంచి చరిత్ర వచ్చింది.. తమ నుంచి సంస్కృతి వచ్చింది. తమ నుంచి నాగరికత వచ్చింది. మీరంతా మా నుంచే నేర్చుకున్నారు. మా దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నారు. అనే స్థాయిలో  తెలంగాణాను మౌల్డ్‌ చేసే యత్నం చేశారు. డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీ  ముందునుంచీ అమలు చేస్తున్నదే తెలంగాణ మెర్జ్‌ సమయంలో బూర్గులకు, కెవి రంగారెడ్డిల మధ్య విభేదాలు కల్పించి.. విడగొట్టి విడివిడిగా బుజ్జగించి, హెచ్చరించి మరీ లొంగదీసుకుని విలీనం చేసుకున్నారు.. ఇప్పటి వరకూ కూడా తెలంగాణా నాయకత్వం ఒక్కతాటిన రాకపోవటానికి వెనుక ఉన్నది ఈ డివైడ్‌ అండ్‌ రూల్‌ విధానమే.
ఆంధ్ర సినిమా- సర్దార్‌ పాపారాయుడు మీలో ఎవరికైనా గుర్తుందా? అందులో తెల్లవాడు పాపారాయుడితో కొన్ని డైలాగులు చెప్తాడు.. ‘‘ మీ భారతీయులంతా మాకు సోదరులు..  మా వంట వాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు, మా పని వాడు భారతీయుడు.. మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు..’’
ఇప్పుడు తెలంగాణా ప్రజల పరిస్థితి అచ్చం అలాగే ఉందంటే ఈ గొంతును వినిపించుకునేవాడెవ్వడు?.. విద్య, వైద్యం, సినిమా, రాజకీయం, అధికారం, న్యాయస్థానం, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ.. అన్ని చోట్లా అధికారంలో వారు.. పాదాక్రాంతంలో వీరు.. వీరి తోలు మందం కాబట్టి ఆ తోలు వాళ్ల చెప్పులకు అవసరమైంది.. అందుకే వాళ్లకు ఆ స్థానాన్ని కల్పించారు.
ఆ పేరుతో ఇక్కడి మినరల్స్‌ ఖతమయ్యాయి. ఇక్కడి ఇరిగేషన్‌ వ్యవస్థ నాశనమైంది. ఇక్కడి వ్యవసాయం మట్టిగొట్టుకుపోయింది. ఇక్కడ దరిద్రం తాండవించింది. ఆ దరిద్రం లోంచి తిరుగుబాట్లు పుట్టుకొచ్చాయి. 
కానీ ఆ తిరుగుబాట్లు తిండి కోసం జరిగినవే.. అంతే కానీ, మావోయిజానికి మూలమైన నక్సలిజం ఉత్తరాంధ్రలో పుట్టిందన్న వాస్తవాన్ని విస్మరించవద్దు.. చారు మజుందార్‌ హాజరై తొలిసారి నక్సల్స్‌ నిర్వహించిన సభ గుత్తికొండబిలంలో జరిగింది. ఇది తెలంగాణాలో లేదు. బలిమెల ఘటన తెలంగాణాలో జరిగింది కాదు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిపై జరిగిన హత్యాయత్నం తెలంగాణాలో జరిగింది కాదు.. మాజీ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై జరిగిన దాడి తెలంగాణాలో జరిగింది కాదు.. మావోయిజాన్ని,  దాన్ని అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు అతీతమైన నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చివేసినంతనే రాజ్యం అంతా మావోయిస్టుల చేతుల్లోకి వెళ్లిపోతుందని  న్యాయమూర్తులు చెప్పటం అంటే ఇక్కడ ఇప్పటికే  నేపాల్‌ మాదిరిగా సమాంతర ప్రభుత్వాన్ని మావోయిస్టులు నడిపిస్తూ ఉండాలి.. ఎప్పుడంటే అప్పుడు.. ఎంతటి ఘాతుకానికైనా ఒడిగట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

రాష్ట్రంలో మావోయిస్టులు ఉనికి కోల్పోయారని వేళ్లపైన లెక్కించేంత మందే ఉన్నారంటూ కేంద్రానికి ఇదే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బాసు గతంలో లిఖిత పూర్వకంగా జవాబిచ్చిన నేపథ్యంలో, ఏకంగా అధికారాన్నే హస్తగతం చేసుకునే స్థాయిలో ఒక్కసారిగా ఎలా ఎదుగుతారో..ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో, ఈ మాటలు చెప్పిన అధికారులు కానీ, దాన్ని గుడ్డిగానో.. లేక కావాలనో తన రహస్య నివేదికలో రాసేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిన కమిటీ సచివుడికే తెలియాలి.
బిజెపి ప్రాబల్యం అధికంగా ఉండటం వల్ల మత కల్లోలాలు పెరుగుతాయని హిందూముస్లింల మధ్య అల్లర్లు పెచ్చుమీరుతాయని మరో వితండ వాదన చేశారు. భారతీయ జనతాపార్టీ, మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌లు భారత రాజ్యాంగం అనుమతించిన విధి విధానాల్లో చట్టబద్ధంగా పనిచేస్తున్న పార్టీలు.. దేశంలో మతపరమైన కల్లోలాన్ని సృష్టించే పార్టీలే అయితే ఇంతకాలం నిషేదించకుండా ఉండటమే కేంద్రం చేసిన తప్పు. మత అల్లర్ల వల్ల ఒక్క ప్రాణం పోయినా తప్పే.. అలాంటప్పుడు రెండు పార్టీలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు. దేశంలో ద్రోహానికి పాల్పడినట్లు భావిస్తే, ఆ రెండు పార్టీలు ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఎలా పాల్గొనగలుగుతున్నాయి?  ఈ రెండు పార్టీల వల్ల ఎప్పుడు ఎన్ని సార్లు తెలంగాణాలో కానీ, హైదరాబాద్‌లో కానీ,  అల్లర్లు జరిగాయి? అదీ మత పరమైన అల్లర్లు  జరిగాయో కమిటీకి తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పరు. హైదరాబాద్‌లో ౧౯౯౦ దశకంలో జరిగిన మత అల్లర్లు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపటానికి రాయలసీమ నాయకుడు సృష్టించినవేనన్నది బహిరంగ రహస్యం.
ఇక జిహాదీ శక్తులు.. టెర్రరిజం అనేది ఇవాళ దేశమంతటా విస్తరించిన సమస్య.. తెలంగాణ ఇస్తేనో.. ఇవ్వకుంటేనో జిహాదీ శక్తులు పెట్రేగటం.. పోకపోవటం అంటూ ఉండదు.. హైదరాబాద్‌ ఇప్పటికే టెర్రరిజానికి సేఫ్‌ జోన్‌గా మారిందన్నది జగద్విదితం. దీన్ని నిరోధించటంలో ఇప్పుడు అన్ని బలాలతో, బలగాల సపోర్ట్‌ ఉన్న సోకాల్డ్‌ ప్రభుత్వాలు నిరోధించలేకపోయాయి.. హైదరాబాద్‌ అభివృద్ధికైతే ఆంధ్రా చెమటను.. కరిగించి సాధించామని జబ్బలు చరుచుకుని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు..  మరి ప్రపంచ టెర్రరిస్టు పనులన్నిటికీ లింకులు హైదరాబాద్‌లో  తేలటానికి జవాబు చెప్పరేం..  ఇక్కడ జిహాదీ శక్తులను నియంత్రించటంలో వైఫల్యానికి ఎవరు కారకులు.. పదిహేను వేల మంది ఇతర దేశస్థులు వీసా గడువు తీరిపోయినా ఇంకా ఈ నగరంలో తిరుగుతున్నారన్న వార్తలు ప్రభుత్వ వర్గాల నుంచే ధృవీకరణలు వస్తుంటే ఎవరు బాధ్యులు..తెలంగాణానా? ఇప్పుడు తెలంగాణా ఇవ్వగానే ఇక్కడ మొజాహిదీన్లంతా వచ్చేసి దీన్ని పాకిస్తాన్‌గా మార్చేస్తారా?  న్యాయమూర్తి ఏం జవాబు చెప్తారు..? హైదరాబాద్‌లో ముస్లింలు అంతా పాకిస్తాన్‌ను సమర్థిస్తారని న్యాయమూర్తి ఉద్దేశమా?  లేక వాళ్లందరూ జిహాదీ శక్తులుగా మారతారన్న అభిప్రాయమా? అసలు హైదరాబాద్‌లో కానీ, తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లోని ముస్లింల గురించి న్యాయమూర్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? సామ, దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి మరీ తెలంగాణ నినాదాన్ని శాశ్వతంగా వినిపించకుండా చేయమని అతి కర్కశంగా  చేసిన కూటనీతి న్యాయమూర్తిది.

బిజినెస్‌ కోసం వచ్చిన వాళ్లంతా తమ దుకాణాలు మూసేసుకుని తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతారట.. ఈ రకమైన విశ్లేషణ  ఈ కమిటీకి మాత్రమే సాధ్యమైంది. ప్రపంచంలో  కొంచెం బుర్ర ఉన్నవారెవ్వరికి కూడా ఇలాంటి విశ్లేషణ చేయాలన్న ఆలోచన కూడా రాదు..
తెలంగాణ అన్నది వాళ్ల మొండానికి తల లాంటిది. దీన్ని  వదులుకోవటానికి ఎట్టి పరిస్థితిలోనూ సీమాంధ్రులు వదులుకోరు.. తెలంగాణ లేకుండా మనగలగటం వారికి సాధ్యమయ్యే పని కాదు. హోంమంత్రి కాదు..కదా.. కేంద్ర ప్రభుత్వం ఆర్మీని పెట్టి తెలంగాణాను ఇస్తామని ఒప్పించినా వాళ్లు ఇవ్వనివ్వరు.. ఈజిప్టులు.. లిబియాల తరహాలో తిరుగుబాట్లు వచ్చినా అతి దారుణంగా అణచివేస్తారు.. దమ్ముంటే ౫౦౦ రాష్ట్రాలు ఇచ్చుకోమనండి చూద్దాం... తెలంగాణా ఇస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అక్కడి నాయకులు బాహాటంగా చేస్తున్న ప్రకటనల వెనుక ధీమాను చూసైనా అర్థం చేసుకోండి. తెలంగాణా రాదు.. ఎవరు ఎంతగా మొత్తుకున్నా.. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా.. ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని ర్యాలీలు నిర్వహించినా.. తెలంగాణా తెచ్చుకోవటం సాధ్యమేనా? బలవంతులు మరింత బలంగా బలహీనుల్ని అణచివేస్తున్నారు.. అణచివేస్తునే ఉంటారు.. పరిస్థితి పూర్తిగా వారి చేయి దాటి.. వారి వల్ల ఏ పనీ కాని పరిస్థితి తలెత్తితే కానీ, విడిచిపెట్టి వెళ్లరు.. నాడు నౌకాదళంలో తిరుగుబాటు వల్లనే తెల్లవారు భారత దేశాన్ని విడిచిపెట్టారు.. మరి తెలంగాణాకు స్వాతంత్య్రం రావటానికి ఏ రకమైన తిరుగుబాటు జరగాలో....


5 కామెంట్‌లు:

ghousuddin shaik చెప్పారు...

superb....

Jai చెప్పారు...

Santhosh, this is nothing new. Even in 1969, "కరుణశ్రీ" Jandhyala Papayya called Telangana "దక్షిణ పాకిస్తానము".

నాకు భాష రాదన్నోడు నా యాసను ఎక్కిరించినోడు
సిగ్గు లేకుండా ఈరోజు కలిసి ఉండామంటున్నాడు

mahesh mutyala చెప్పారు...

అన్న ఈ రాజకీయ నాయకులను జనాలు నమ్మినంత కాలం తెలంగాణా రాదు

రాజేష్ జి చెప్పారు...

Excellent Santosh ji! I do second all your thoughts shared.

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

:)