24, ఏప్రిల్ 2012, మంగళవారం

మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌

కాంగ్రెస్‌ పార్టీలో వణుకు మొదలైంది. రాబోయే రెండేళ్లలో ఏం జరగబోతోంది? అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం పార్టీ ఉనికి ఏం కానుంది? పార్టీ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోతోందా? పెద్ద రాష్ట్రాలన్నీ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.  ఏ ప్లానూ వర్కవుట్‌ కావటం లేదు.. ఏ ఎత్తుగడా పనిచేయటం లేదు. ఏం చేసినా రివర్స్‌ అవుతోంది.. ౧౩౦ సంవత్సరాల చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని తీవ్రమైన సంక్షోభాన్ని కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మరోసారి కామ్‌రాజ్‌ ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.. ఈ ప్రాతిపదికనే భారీ మార్పులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది... ఇదైనా పార్టీని గట్టెక్కిస్తుందా?

రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత  పెద్ద రాష్ట్రాలన్నీ కాంగెస్‌ చేజారిపోయాయి. యుపిలో ఘోరమైన పరాజయాన్నే మూటగట్టుకోవలసి వచ్చింది. అధినేత్రి సొంత నియోజక వర్గంలోనే ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థితి.. బెంగాల్‌లో  మిత్రపక్షమే అయినా మమతాదీదీ గొడవ గొడవగానే ఉంది.. రాజస్థాన్‌లో గెలిచే పరిస్థితి లేదు. ఢిల్లీలో మొన్నటి లోకల్‌ బాడీ ఎన్నికల్లోనే ఢామ్మంది.. బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ ఇలా ఏ ఒక్క రాష్ట్రంలోనూ పరిస్థితి బాగా లేదు. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. ఇక దక్షిణాదిలో ఒకే ఒక్క ఆశ ఉన్న  ఆంధ్రప్రదేశ్‌పై పూర్తిగా నమ్మకం వదులుకోవలసిన దుస్థితి.. ఇప్పుడేం చేయాలి?.. కుంభకోణాలు... ఆర్థిక అస్తవ్యస్తం.. అవినీతి.. అసమర్థత...  కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా కాంగ్రెస్‌ను ముప్పిరిగొంటున్న సమస్యలు ౧౩౦ ఏళ్ల కాంగ్రెస్‌ను కనీవినీ ఎరుగని అయోమయంలోకి నెట్టేసాయి.. ఏ ఒక్క విషయంపైనైనా  స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేసింది..
ఇందుకు ఉదాహరణ తెలంగాణాయే.. ఒక అంశంపై దూకుడుగా నిర్ణయం తీసుకోలేక నాన్చుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ౨౦౧౪ మాత్రమే కాదు.. సమీప భవిష్యత్తు కూడా లేకుండా చేస్తోంది. వ్యూహకర్తలు ఏ ఒక్క అంశంలోనూ సక్సెస్‌ రేట్‌ సాధించలేకపోతున్నారు.. ట్రబుల్‌షూటర్స్‌ అనుకున్న మహామహులే హ్యాండ్స్‌ అప్‌ చేసేశారు.
అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే కాంగ్రెస్‌ కూడా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి గురించి నిర్వహించిన సర్వేలు కూడా ఊహించని స్థాయిలో ప్రతికూలంగా రావటంతో ఇక అట్టడుగునుంచి ప్రక్షాళన చేయాల్సిన తప్పనిసరి అవసరం అధినేత్రికి ఏర్పడింది. ఇప్పుడు ఆమె ముందున్నది ఒకే ఒక్క ప్రత్యామ్నాయం కామ్‌రాజ్‌ప్లాన్‌.. ౧౯౬౩లో కాంగ్రెస్‌ ప్రజాదరణను కాపాడుకోవటానికి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కామ్‌రాజ్‌ నాడార్‌ అమలుచేసిన ప్లాన్‌ ఇది. కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులంతా రాజీనామా చేసి.. పార్టీ పదవులు తీసుకుని, పార్టీ పటిష్ఠత కోసం పూర్తికాలం పనిచేయటం ఈ ప్లాన్‌ ఉద్దేశం.. ఈ ప్లాన్‌తో కామ్‌రాజ్‌  ది గ్రేట్‌ ట్రబుల్‌షూటర్‌గా కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు అదే ప్లాన్‌ను సోనియా అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే సీనియర్‌ మంత్రులు జైరాం రమేశ్‌, వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌లు నలుగురూ తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలంటూ సోనియాకు లేఖ రాశారు. వీరిలో జైరామ్‌ రమేశ్‌, గులాంనబీ ఆజాద్‌లు ఇద్దరూ మన రాష్ట్ర పార్టీ వ్యవహారాలతో సంబంధం ఉన్నవారే. గత మూడేళ్లలో తెలంగాణ అంశాన్ని సమర్థంగా డీల్‌ చేయటంలో ఆజాద్‌ పూర్తిగా ఫెయిలయ్యారనే అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఆయనకు ప్రత్యామ్నాయంగా వాయలార్‌ రవిని పంపించారు. ఈ అంశానికి పరిష్కారం చూపకపోవటం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అగమ్యగోచరంలోకి నెట్టేసింది. ఇక సల్మాన్‌ఖుర్షీద్‌ కీలకమైన యుపి నేత. యుపిలో వైఫల్యానికి రాహుల్‌గాంధీని వెనక్కి నెట్టేసి బాధ్యతంతా తనమీద వేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు వీరి బాటలో మరికొందరు సీనియర్‌ మంత్రులు కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు సమాచారం. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కూడా భారీస్థాయిలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. ౧౯౬౩లో ఈ కామ్‌రాజ్‌  ప్లాన్‌ బాగా సక్సెస్‌ అయింది. కానీ, ఇప్పుడు సాధ్యమేనా?  ఆజాద్‌ లాంటి వారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలుగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడు ఫుల్‌టైమ్‌ వర్కర్లుగా  పార్టీని బతికించగలరా?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి