27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఒక శిశువు వయసు ఎంత?

ఒక పువ్వు వయస్సు కనీసం ఆరు గంటలు.. ఒక ఆకు వయస్సు రెండు మూడు రోజులు.. ఒక కాయ వయస్సు అది పండేంత వరకే.. ఆ పండు వయసు.. రాలి పడిపోయేంత వరకు..... మరి ఓ శిశువు వయసు ఎంత? అదేంటని ఆశ్చర్యపోవద్దు.. మన రాష్ట్రంలో ఇప్పుడు అన్ని చోట్లా వినిపిస్తున్న ప్రశ్న ఇది.. ఒక శిశువు వయసు ఎంత? రోజులా? వారాలా? నెలలా? అవును మన రాష్ట్రంలో  పుట్టిన శిశువుల్లో చాలా వరకు వ్యక్తులుగా ఎదగటం లేదు.. పరిపూర్ణంగా జీవితాన్ని పొందటం లేదు.. పొత్తిళ్లలోనే జీవితాలు అంతమవుతున్నాయి.. పుట్టినందుకు సంతోషించేంతలోగానే మట్టితో మమేకమైపోతున్నారు.. తామెందుకు పుట్టారో.. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని జీవితాలు.. ఏటా ౮౦వేలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి..    .
ఎందుకు ఇలా అమ్మతనం చిన్నబోతోంది.. నవ మాసాలు మోసి.. ప్రేమగా కన్న కడుపు క్షోభిస్తోంది. తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు బయటి నుంచి అప్పుడప్పుడూ వినిపించే ధ్వనులు వినే శిశువు ఎన్నో కలలు కంటుంది.. ఆ కలలన్నీ సాకారం చేసుకునేందుకు ఎప్పుడెప్పుడు తల్లి గర్భం నుంచి బయటపడదామా అని ఆలోచిస్తుందిట.. కానీ, తొమ్మిది నెలల తరువాత.. భూమి స్పర్శ తొలిసారి తగిలినంతనే ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.. ఆ శిశువు కన్న కలలు ఊహకు కూడా తెలియకుండానే ఆవిరైపోతున్నాయి.
メメメ

వింటే ఆశ్చర్యం వేస్తుంది.. అస్సలు నమ్మబుద్ది కాదు.. కానీ, ఇది నిప్పులాంటి నిజం.. కాకపోతే ఇంతకాలం దీనిపై నివురు కప్పేశారు.. మనకు తెలిసినంత వరకు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో  వేలకు వేలు పోసి పురుడు పోసుకుంటున్న పిల్లలే పిల్లలు.. కానీ, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో .. పుడుతున్న శిశువుల గురించి మనకు పెద్దగా అవగాహన లేదు. ఉండదు కూడా.. ఎప్పుడో టీవీల్లో వార్తలు వచ్చినప్పుడో.. ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రమే కాసేపు ప్రభుత్వ ఆసుపత్రుల్ని తిట్టుకుని ఆ మరుక్షణం మరచిపోతాం.. కానీ చాలా మందికి తెలియంది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుతున్న డెలివరీలు ప్రెユవేటు ఆసుపత్రుల కంటే రెట్టింపు ఎక్కువన్న సంగతి..

రాష్ట్రంలో ఏడాదికి 13లక్షల మంది జన్మిస్తున్నారు.. వారిలో 60 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పుడుతున్నారు.. అదీ పేదల ఇళ్లల్లో.. పౌష్టికాహారం అంటే ఏమిటో కూడా తెలియని కుటుంబాల్లోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది.
మీకు తెలుసా? ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుడుతున్న వారిలో ప్రతి వెయ్యి మందిలో 49 మంది తొలి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు.. అంటే దాదాపు ౮౦ వేల మంది శిశువుల వయస్సు సరిగ్గా ఏడాది కూడా దాటటం లేదన్నమాట. 

ఎందుకిలా జరుగుతోంది..?
పేదరికం..
చదువులేమితనం..
పేదరికంలో పుట్టడమే వాళ్లు చేసుకున్న పాపం.. గర్భం తాల్చిన యువతులకు బెడ్‌రెస్ట్‌లు తీసుకోవటం తెలియదు.. రెగ్యులర్‌గా బీపీలు.. షుగర్‌లు.. చెకప్పులు చేసుకోవటం.. రోజూ మల్టీ విటమిన్లు తీసుకోవటం అంతకంటే తెలియదు. తొమ్మిది మాసాలు వచ్చే వరకూ శ్రమించటమే వారికి తెలిసింది.. ప్రత్యేక ఆహార నియమాలు పాటించరు. నొప్పులు వచ్చిన తరువాత కానీ, ఆసుపత్రి ముఖం చూడరు. అప్పటి వరకూ పెరటి వైద్యం తప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంపై ఎలాంటి అవగాహన లేదు. 
అందుకే వాళ్ల సంతానానికి బతికే అవకాశాలు లేకుండా పోతున్నాయి. పుట్టిన నెలల్లోనే  వేలమంది శిశువులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్తున్నారు.

メメメ

రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల విషయంలో జరుగుతున్న పెను విషాదం మాత్రమే ఇది. కానీ ఈ పరిస్థితి మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశం మొత్తం మీద పేదరికంలో మగ్గుతున్న సమాజం తరచూ కడుపుకోతకు గురవుతోంది. దీన్ని నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం ఓ సూపర్‌ పరిష్కారాన్ని కనుక్కొంది.. కనుక్కొన్నదే తడవుగా సొమ్ములూ ధారాళంగా రాష్ట్రాలకు పంచేసింది. కానీ, వాటిని ఖర్చు చేసే నాధుడే లేకుండా పోయాడు.. పేదవారికి మేలు చేసే దిక్కే లేకుండా పోయింది. ఇందుకు చాలా చాలా కారణాలు ఉన్నాయి. మన సొసైటీలోనే ఉన్న పెద్ద లోపాలివి..ఈ కారణాలేంటో ఒకసారి చూడండి..
   
చిన్న వయసులో  పెళ్లి కావటం
కనీస జ్ఞానం రాకుండానే తల్లి కావటం
సరైన ఆహారం తీసుకోకపోవటం
సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం
వైద్య సదుపాయాల గురించి తెలియకపోవటం
ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం లేకపోవటం
నిపుణుల పర్యవేక్షణ లేని కాన్పులు కావటం
తల్లి పాలు ఇవ్వటంలో విపరీతమైన జాప్యం చేయటం
శిశువుల హెల్త్‌కేర్‌ విషయంలో తీరని అశ్రద్ధ చేయటం

ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష కారణాలు చెప్పుకుంటూ పోవచ్చు. పేద సమాజంలో ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా చైతన్యం లేని తనాన్ని ఈ శిశుమరణాలు చెప్పకనే చెప్తున్నాయి.
メメメ
వీటన్నింటినీ నియంత్రించేందుకే కేంద్రం ఓ బృహత్తరమైన పథకాన్ని ఆడంబరంగా ప్రారంభించింది.. గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో  భారీగా మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది, నిపుణుల నియామకం చేసి, మందులను, ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువచ్చి గర్భిణీస్త్రీలకు, శిశువులను కాపాడేందుకు డిసైడ్‌ అయింది. ఇందుకోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అన్న పేరుతో వేల కోట్ల రూపాయలను విడుదల చేసేసింది. మన రాష్ట్రానికీ ఓ 1556కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 80 శాతం కేంద్రం భరించేట్లు.. 20శాతం రాష్ట్రం భరించేట్లు ఫిక్స్‌ చేసింది. శిశుమరణాల రేటును తగ్గించేందుకు సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
అంతా బాగున్నా మహిళల నోట్లో శని ఉన్నట్లు అయిపోయింది.. కేంద్రం కేటాయించిన  నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. స్కీములు ప్రకటించటం వరకు కాగితాలపై బాగానే ఉంటుంది. కానీ, వాటిని అమలు చేయటం దగ్గరే అసలు కథంతా ముడిపడి ఉంటుంది. కార్పోరేట్‌ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులను మంజూరు చేయటంలో తెగ తాపత్రయ పడే అధికారులు.. పేదలకు ఉపయోగపడాల్సిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవటంలో ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇది మొదట్నుంచీ ప్రతి పేదవాడికీ అనుభవమవుతున్నదే. ఇక శిశుమరణాలను నియంత్రించటం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా జరిగే పనేనా?

కామెంట్‌లు లేవు: