26, ఏప్రిల్ 2012, గురువారం

భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమం


మన రాష్ట్రపతి భవన్‌.. భారత దేశంలో అతి పెద్ద వృద్ధాశ్రమంగా మారిపోయింది. మొఘలుల కాలంలో నిర్మించిన అతి గొప్ప భవనం.. 320 గదుల విశాలమైన ప్రాంగణం.. పౌరాణిక సినిమాల్లో చూసినట్లు వనాలు.. కుడ్యాలు.. తోరణాలతో అద్భుతంగా అలరారే రాష్ట్రపతి  భవన్‌.. వృద్ధులకు పునరావాసకేంద్రంగా మారింది.. పేరుకు మాత్రం వయోపరిమితి 35.. రాష్ట్రపతి భవన్‌లోకి ఎంటర్‌ అవుతున్న ఒరిజినల్‌ ఏజ్‌ మాత్రం మినిమమ్‌ 68. దిసీజ్‌ అవర్‌ ఇండియా...  
యంగిస్థాన్‌.. యువతే దేశానికి వెన్నెముక.. లాంటి పోచికోలు కబుర్లు చెప్పటంలో మన దేశంలో ఏ ఒక్క రాజకీయ నేతా తక్కువ కాదు.. కానీ, ఏ ఒక్కరికీ చింత చచ్చినా.. పులుపు మాత్రం చావదు.. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ గురించి ఉపన్యాసం చెప్పే వాళ్లెవరూ తాము మాత్రం రిటైర్‌ కారు.. ఒక వేళ ఖర్మకాలి.. రోగమో.. రొచ్చో వచ్చి రిటైర్‌ కావలసి వచ్చినా.. తమ వారసులను రెడీ చేసి మరీ తప్పుకుంటారు.. సర్పంచ్‌ గిరీ నుంచి రాష్ట్రపతి పదవి దాకా కూడా ఇదే సీన్‌.. ఇదే కల్చర్‌.. ఇదే ఒరవడి.. ఇదీ మన ఇండియా... మేరా భారత్‌ మహాన్‌..
మరో రెండు నెలల్లో రాష్ట్ర పతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పోటీ పడుతున్నవాళ్లు కానీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేర్లు కానీ, ఎంత వయసున్నవారివో తెలుసా? మినిమమ్‌ 68.. మాగ్జిమమ్‌.. 81. వీళ్లలో అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్‌ కలాం. ఒకవేళ ఈయన మళ్లీ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెడితే.. ఆనాటికి ఆయన వయసు ఎంతుంటుందో తెలుసా? 80 సంవత్సరాల 9 నెలల 9రోజులు.

ఇక బాగా పేర్లు వినవస్తున్న మిగతా వాళ్ల విషయాన్ని చూద్దాం..

ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి 75 ఏళ్లు..
ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి 76సంవత్సరాలు.
జమ్ముకాశ్మీర్‌ మాజీముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు 74ఏళ్లు
బిజెపి నేత జస్వంతసింగ్‌కూ 74 సంవత్సరాలు
ఇక సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయంకు 72 సంవత్సరాలు
టెలీకాం సంస్కర్త సాం పిట్రోడా వయసు 70
లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ వయసు 67ఏళ్లు కాగా
ఈ పదవికి తీవ్రంగా లాబీయింగ్‌ చేసుకుంటున్న ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి 65 సంవత్సరాలు..
వీళ్లు కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో లాంటి వారి వయసూ 70కి పైమాటే ఉంది.. అభ్యర్థిత్వం దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా పైకి వచ్చే పేర్లు కొన్నుంటాయి. వాళ్ల వయసూ తక్కువ ఉంటుందనుకుంటే పొరపాటే..
ఇప్పటి వరకు దేశానికి 15మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీళ్లలో యూత్‌ ఎవరో తెలుసా? మవ తెలుగువాడే. వరాహగిరి వెంకటగిరి.. అలియాస్‌ వివిగిరి.. రాష్ట్రపతి అయ్యేనాటికి ఆయన వయసు జస్ట్‌ 56 సంవత్సరాల 14 రోజులు. అంతే.. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి సగటు వయసు 68.73 ఉంటే ఇక రాజ్యాంగంలో35 ఏళ్ల వయోపరిమితి విధించటం వల్ల ప్రయోజనం ఏమిటి? సిల్లీ కాకపోతే..

కామెంట్‌లు లేవు: