26, ఏప్రిల్ 2012, గురువారం

కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు?

దేశానికి కొత్త రాష్ట్రపతిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారు? ఇప్పుడిదొక బ్రహ్మపదార్థం.. ఎవరిని సెలెక్ట్‌ చేయాలి..? వివాదాలకు దూరంగా.. మరో  రెండేళ్ల పాటు అధికారంలో ఉండేవారికి.. ఆ తరువాత మూడేళ్ల పాటు అధికారంలోకి రాబోయే వారికి ఇబ్బంది లేకుండా.. ఇబ్బందులు కలిగించకుండా ఉండే వ్యక్తి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ కావాలి. ఎవరి ఈక్వేషన్స్‌ వారివి.. ఎవరి ప్రయోజనాలు వారివి.. ఎవరి లాబీయింగ్‌ వారిది.. ఒక్క మాటలో  చెప్పాలంటే.. అయిదేళ్లకోసారి ఓ కొత్త రబ్బర్‌ స్టాంప్‌ను తయారు చేసే ప్రక్రియ మరోసారి మొదలైంది..
ఒక సామాజిక వర్గం ఓట్లు రావాలంటే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలి..
ఒక మతం విశ్వాసాన్ని సంపాదించాలంటే.. ఆ మతానికి చెందిన వ్యక్తిని ప్రథమ పౌరుని చేయాలి..
అధికారంలో ఉన్నపార్టీకి విధేయుడు కావాలి..
అధికారంలోకి వచ్చే పార్టీకీ లాయలిస్ట్‌ కావాలి..
ఇక ఇండిపెండెంట్లకేమో లాబీయింగ్‌ చేసే సత్తా కావాలి..

ఇప్పుడు రాష్ట్ర పతి పదవికి దేశంలో అమలు అవుతున్న అర్హతలు. ఇలాంటి వారి కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఒక్కో పార్టీ ఒక్కో వ్యక్తి పేరును తెరమీదకు తెస్తోంది.. ఒక్కో నాయకుడు ఒక్కొక్కరి పేరు చెప్తున్నాడు. ఒకరి ప్రతిపాదన ఇంకొకరికి నచ్చటం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఏ ఒక్కరిని కాదన్నా.. కోపం వస్తుందేమోనన్న తంటా..
ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ రాజకీయేతర వ్యక్తి రాష్ట్రపతి కావాలంటున్నారు. లేకుంటే తమ పార్టీకే చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ పిఎ సంగ్మా పేరును బరిలో వదిలి వచ్చారు. లాలూప్రసాద్‌కైతే ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ అయితే ఓకే.. ఎందుకంటే ఆయన ఇస్లాం కమ్యూనిటీ ఓట్‌బ్యాంక్‌ అవసరం చాలా ఉంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ తానే ఆ పదవిని అధిష్ఠించాలని కోరుకుంటున్నారు. మాయావతికి ఈ ప్రతిపాదన ససేమిరా.. ఇక జయలలితకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అయితే సరే.. ఇటు భారతీయ జనతాపార్టీకీ ఆయనంటే ఇష్టమే. కానీ కాంగ్రెస్‌కు మాత్రం కలాం కంట్లో నలుసే. తమ పార్టీ అధినేత్రి సోనియాను ప్రధానమంత్రి పదవిలోకి రాకుండా సున్నితంగా అడ్డుకోవటం ఆ పార్టీ ఇంకా మర్చిపోలేదు.
కాంగ్రెస్‌లోని కొందరు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ జెఎం లింగ్డో పేరునూ రంగం మీదకు తీసుకువస్తున్నారు. మరికొందరికి పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ పేరు సీన్‌లోకి తీసుకొచ్చేశారు. బిజెపిలోని ఒక వర్గానికి జస్వంత్‌సింగ్‌ కావాలి. మమతా దీదీకైతే సుభాష్‌చంద్రబోస్‌ కుటుంబ వారసులను రాష్ట్రపతి చేయాలని బలంగా ఉంది. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది.. ఏ ఒక్కరూ ఏ ఒక్క పేరుపైనా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదు.
అన్ని పార్టీల కంటే కాంగ్రెస్‌కే పెద్ద తంటా.. ఇంకా అధికారంలో ఉండాల్సిన .అన్నింటికంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద తంటా.. ఆ పార్టీ అధికారం ఇంకా రెండేళ్లు ఉంది. ఈ లోపు రాష్ట్రపతితో ఏ సమస్యా రాకూడదు.. అదే సమస్య మిత్రపక్షాలతోనూ తలెత్తకూడదు. మాయావతిని ఒప్పుకుంటే ములాయంకు కోపం.. వామపక్షాల మాట విందామంటే మమతకు మంట.. డిఎంకెను ఔనంటే అన్నాడిఎంకేకు కాదు.. అధిష్ఠానంలో మల్లగుల్లాలు మొదలయ్యాయి.
సందట్లో సడేమియా లాగా ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి లాంటి వారు వ్యక్తిగతంగా కూడా లాబీయింగ్‌ మొదలు పెట్టారు. వీళ్లలో ఎవరు చివరి వరకు మిగులుతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గత ఎన్నికల సమయంలో నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అకస్మాత్తుగా ప్రతిభాపాటిల్‌  సీన్‌లోకి వచ్చారు. అప్పటిదాకా ఆమె ఎవరన్నది దేశంలో చాలా మందికి తెలియదు.. ఈసారీ అలాగే జరుగుతుందా? ఏమోమరి..

కామెంట్‌లు లేవు: