5, సెప్టెంబర్ 2009, శనివారం

రూటు ఎందుకు మారింది?

విఐపిలు ప్రయాణించే హెలికాప్టర్లు తరచూ ఎందుకు ప్రమాదానికి కారణమవుతున్నాయి. రోడ్డుపై ప్రయాణించేప్పుడు జామర్లనీ, పైలట్‌ కార్లనీ... రకరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారే.. మరి ఎయిర్‌ క్రాఫ్‌‌ట విషయంలో ఎందుకు ఇంత అలసత్వం... లోపం ఎక్కడుంది... ? కొంచెం ముందు జాగ్రత్త తీసుకుని ఉంటే ప్రమాదాల్ని నివారించటం సాధ్యం కాదా? మరి తప్పిదం ఎక్కడ జరుగుతోంది... ? జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగాక... తీరా ఇప్పుడు విచారణలనీ, నివేదికలనీ.. ఎన్ని చేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించటం మిస్టరీగా మారింది. అనుభవజ్ఞులైన పైలెట్లు... అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉన్న హెలికాప్టర్‌ ఉన్నప్పటికీ, ప్రమాదం ఎందుకు జరిగింది? మామూలుగా వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా ఎందుకు దారి మళ్లింది?

వైఎస్‌ రచ్చబండ కార్యక్రమానికి ఉపయోగించిన హెలికాప్టర్‌ భెల్‌ కంపెనీకి చెందింది. ఇది సాధారణ హెలికాప్టర్‌ కాదు.. పదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు కొన్నదే అయినప్పటికీ, ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న హెలికాప్టర్‌... నైట్‌ విజన్‌ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉన్న చాపర్‌ అది.. ఒకవేళ ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నా... సునాయాసంగా వెనక్కి మరలే అవకాశం ఉంది. ఇంత సౌకర్యంగా ఉన్నప్పుడు హెలికాప్టర్‌ ఎందుకు వెనక్కి తిరగలేదు.. తాను వెళ్లాల్సిన రూటులో కాకుండా దారి మళ్లటానికి కారణం ఏమిటి? ఇప్పటి వరకు అధికారులకు అంతుచిక్కని ప్రశ్న ఇది... ముందుగా నిర్ధారించిన ప్రకారం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ నంద్యాల, బద్వేలు, రేణిగుంట మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. కానీ, ఇది కర్నూలు, నందికొట్కూరు, పాములపాడు, వెలుగోడు మీదుగా ప్రయాణించింది. సాఫీగా సాగే దారిని వదిలి కర్నూలు
మీదుగా నల్లమలలోకి ఎందుకు ప్రవేశించిందనేది అంతుపట్టడం లేదు. దారి తప్పటం వల్లనే ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తుపట్టడం లేటయింది.
హెలికాప్టర్‌ కాక్‌పిట్‌లో ప్రయాణించాల్సిన దారి విస్పష్టంగా కనిపిస్తుంది. అయినా రూటు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్యంత క్లిష్టపరిస్థితిలోనూ విమానాన్ని నడపగల సామర్థ్యం ఉన్న పైలట్‌ భాటియా... పొరపాటు పడే చాన్‌‌స చాలా తక్కువ...
హెలికాప్టర్‌ కూలిపోక ముందు ఆ ప్రాంతంలో ఆరు చక్కర్లు కొట్టినట్లు స్థానికులంటున్నారు... అంటే పైలెట్లు ముందుగానే ప్రమాదాన్ని ఊహించారా? ఒకవేళ ఊహించి ఉంటే ముఖ్యమంత్రికి ప్రమాదం గురించి చెప్పి ఉండేవారే కదా.. అంతా కలిసి చర్చించి ఏదో ఒక అవకాశాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.. అందులో భాగంగానే దారి మళ్లించారా? ఎక్కడైనా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించి సాధ్యం కాక పైకి లేవటం వల్ల కొండను ఢీకొన్నారా? అన్నీ సవ్యంగా ఉండి కూడా ప్రమాదం ఎందుకైందో అర్థం కాక అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.. కారణాలను తెలుసుకోవటానికి వారి దగ్గరున్న ఆధారం ఒక్కటే.. అది బ్లాక్‌ బాక్‌‌స.. ప్రమాదం జరగటానికి 25 గంటల ముందు నుంచీ ఇందులో హెలికాప్టర్‌ సంభాషణలు రికార్డు అవుతాయి. దీన్ని డీకోడ్‌ చేస్తే తప్ప ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తేలవు...
ఇప్పుడు ప్రమాదానికి కారణాలు తెలిసేదెలా? విచారణాధికారుల ముందున్న ఒకే ఒక ఆప్షన్‌ బ్లాక్‌ బాక్‌‌స... హెలికాప్టర్‌ కూలి ముక్కలైనా సరే... సురక్షితంగా ఉండే ఏకైక వస్తువు బ్లాక్‌ బాక్‌‌స... ఇందులో రికార్డు అయిన వాయిస్‌ ద్వారానే ప్రమాదానికి కారణాలు.. చివరి నిమిషంలో చాసర్‌ ఉన్న పరిస్థితిపై సవివరంగా తెలుసుకునే అవకాశం ఉంది.
బ్లాక్‌ బాక్‌‌స... విమానానికైనా, హెలికాప్టర్‌కైనా అత్యంత కీలకమైన పరికరం బ్లాక్‌ బాక్‌‌స... వైఎస్‌ మరణానికి కారణాలు కూడా ఈ బ్లాక్‌ బాక్సే గుట్టు విప్పాల్సి ఉంది. బ్లాక్‌ బాక్‌‌స రెండు భాగాలుగా ఉంటుంది. ఒక మాక్‌‌స ఫై్లట్‌లో డేటాను రికార్‌‌డ చేస్తుంది. మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌. ప్రమాదం సంభవించినప్పుడు, పేలిపోయినప్పుడు దీనికి మాత్రం ఏం జరగదు.. నిప్పలో ఇది కాలదు. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో సేవ్‌ అయిన సమాచారాన్ని బయటకు తీసేందుకు ప్రత్యేక ఏర్పాటు వేరే ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు అది ఎక్కడ పడిపోయినా, నీటిలో మునిగిపోయినా దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సిగ్నల్‌‌స వస్తాయి.
ప్రమాదానికి ముందు పైలట్లు, వైఎస్‌ మాట్లాడుకుని ఉంటే, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్లో ఖచ్చితంగా నమోదయి ఉంటుంది. ప్రమాదం జరగటానికి ముందు వాతావరణ పరిస్థితిపై ఎటిసికి చివరిగా ఎలాంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారో కూడా రికార్డు అవుతుంది. దీన్ని డీకోడ్‌ చేస్తే ప్రమాదానికి సంబంధించిన వివరాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు.
బాక్‌‌సలో సమాచారాన్ని మార్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు.. దీన్ని విశ్లేషించటానికి కనీసం అయిదు నుంచి ఆరు గంటల సమయం పట్టవచ్చు.
విచారణలో ఫై్లట్‌ డేటా రికార్డర్‌లో సేవ్‌ అయిన సమాచారం కూడా ముఖ్యమే కానీ, సివిఆర్‌లోని మెసేజే కీలకం. బేగంపేటలో వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రయాణించడం మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రమాదం జరిగే సమయం వరకూ కూడా హెలికాప్టర్‌ ప్రయాణిస్తున్న తీరుతెన్నులను ఎఫ్‌డిఆర్‌ రికార్డు చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్‌ సామర్థ్యం, ఇంధనం సరఫరా.. అందుబాటులో ఉన్న ఇంధనం, పేలిపోవటానికి ముందు ఎంత ఇంధనం వెలుపలికి వచ్చిందీ... ఈ సమచారం అంతా ఎఫ్‌డిఆర్‌లో నమోదవుతుంది. ప్రమాద సమయంలోనే కాదు.. సాధారణ సమయంలో కూడా హెలికాప్టర్‌ కాబిన్‌లో, బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నదీ ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమాచారాన్ని డీకోడ్‌ చేయాల్సిన బాధ్యత బెల్‌ అధికారులది... ఇది డీకోడ్‌ అయితే కానీ, ప్రమాదం ఎందుకు జరిగిందీ అర్థం కాదు...
ఎందుకిలా జరుగుతోంది..? ప్రమాదం జరిగిన తరువాత కారణాలను అన్వేషించటం కంటే... ప్రమాదం జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో మన అధికారులు, పైలట్లు ఎందుకు విఫలమవుతున్నారు?
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దుర్మరణం మరోసారి విఐపి ఎయిర్‌క్రాఫ్‌‌ట నిబంధనలను ప్రశ్నార్ణకం చేశాయి. పావురాల గుట్ట ప్రమాదం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విఐపి ఎయిర్‌క్రాఫ్‌‌టల రూల్‌‌సను వెంటనే సవరించాలనీ నిర్ణయించారు.. ఇంతకు ముందు నిబంధనలంటూ లేకపోలేదు.. కానీ.. వాటిని పాటించటంలో డొల్లతనం తాజా ప్రమాదంతో బయటపడింది. హెలికాప్టర్‌లో ఎమర్జెన్సీ లొకేషన్‌ ట్రాన్‌‌సపాండర్‌ అసలు పనే చేయలేదు. ప్రయాణం ప్రారంభించటానికి ముందే ఏ యంత్రం ఎలా పనిచేస్తున్నది ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి. కానీ, పైలట్లు ఆ పని చేయలేదు. దీనికి తోడు శాటిలైట్‌ ఫోన్‌ ఒకటి ఉంచుకోవాలన్న ఆలోచనా అధికారులకు రాలేదు.. అదేమంటే మర్చిపోయామంటారు... ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమైన నాయకుడు చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్లినా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అధికారులు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు.. శాటిలైట్‌ ఫోన్‌ అనేది ఏ విధంగా చూసినా ముఖ్యమంత్రి పర్యటన విషయంలో అధికారులు కొంత అలసత్వంగా ఉన్నారన్నది వాస్తవం...
శాటిలైట్‌ ఫోన్‌ ప్రపంచ వ్యాప్తంగా వైర్‌లెస్‌ సమాచారాన్ని సక్సెస్‌ఫుల్‌గా అందిస్తున్న ఫోన్‌... మోడల్‌ను బట్టి, ప్రాంతాలను బట్టి శాటిలైట్‌ ఫోన్లు పని చేస్తాయి. ఈ ఫోన్లలో రిటాక్ట్రబుల్‌ యాంటెన్నా ఉంటుంది. దీని వల్ల దీన్ని సెన్సార్‌ చేయటం కానీ, ట్యాపింగ్‌ చేయటం కానీ సాధ్యం కాదు.. భూకక్ష్యలో స్థిరంగా ఉండే ఉపగ్రహాలు ఆకాశంలో స్థిరంగా ఉంటాయి... అలాంటి ఉపగ్రహాల మీద ఆధారపడే ఫోన్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. భూ దిగువ కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా వినియోగించే వాటిని లియో శాటిలైట్‌ ఫోన్లంటారు.. వీటి నుంచి నిరాటంకంగా వైర్‌లెస్‌ సేవలను పొందవచ్చు. పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో కూడా ఈ శాటిలైట్‌ ఫోన్ల సంకేతాలు తెగిపోవు... ఒకవేళ పోయినా నిమిషాల్లో సంకేతాలు అందుతాయి... శాటిలైట్‌ ఫోన్‌ ఖరీదు చాలా ఎక్కువ. గ్లోబల్‌ స్టార్‌ అనే కంపెనీ వీటిని ఎక్కువగా తయారు చేస్తుంది. ప్రపంచంలో ఒక్క బర్మాలో మాత్రం వీటిని నిషేధించారు.
ఇంత ఆధునిక పరిజ్ఞానం ఉన్న ఈ శాటిలైట్‌ ఫోన్లను ఇప్పటి వరకు మన విఐపి ఎయిర్‌క్రాఫ్‌‌టలలో తప్పనిసరి చేయకపోవటం వల్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొనలేదు.. ఇప్పుడు కేంద్రప్రభుత్వం కళు్ల తెరిచి అన్ని విఐపి ఎయిర్‌క్రాఫ్‌‌టలలో శాటిలైట్‌ ఫోన్‌ ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తున్నది... ముందు ముందైనా ఇలాంటి ప్రమాదాలను వీలైనంతగా నివారించే ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యంగా జనం కోసం జనంమనిషిగా జీవించే నాయకుల ప్రాణాలు అత్యంత విలువైనవి. వీటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.. ఏ చిన్నపాటి నిర్లక్ష్యమూ క్షంతవ్యం కాదు..