17, సెప్టెంబర్ 2009, గురువారం

అట బొమ్మ తెలంగాణ

నాలుగు వేల మంది అమరవీరుల బలిదానం.. వేలాది ప్రజల త్యాగ ఫలితంగా తెలంగాణకు పదమూడు మాసాలు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది. దురాగతాలు చేసిన నిజాం రాజు భారత యూనియన్‌కు లొంగిపోయాడు.. కాశిం రజ్వీ జైలుపాలయ్యాడు.. తెలంగాణ భారతదేశంలో కలిసిపోయింది కానీ, ప్రజలకు మాత్రం సమస్యలు తీరలేదు... అరాచకం పోయి, రాజకీయం పేరుతో వారికి మరో ముప్పు వచ్చి పడింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అండగా నిలవాల్సిన రాజకీయ ప్రక్రియ.. తెలంగాణా ప్రజలకు మాత్రం పెద్దగా మేలు చేసింది లేదు... వెరసి నాలుగు శతాబ్దాల బానిసత్వం... ఆరు దశాబ్దాల రాజకీయం... తెలంగాణను ఆటబొమ్మగా మార్చాయి...

తెలంగాణ 1
సంవత్సరాల తరబడి నిర్వహించిన పోరాటం... రక్కసిమూక రజాకార్లపై గ్రామగ్రామాన చేసిన తిరుగుబాటు.. వేలాది ప్రజల ఊచకోత... విప్లవవీరుల బలిదానం... తురుపుముక్కగా చివరలో పనిచేసిన పోలీస్‌ యాక్షన్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని నిజాం నుంచి విముక్తం చేసింది. భారత స్వాతంత్య్ర సమరానికి ఏమాత్రం తీసిపోని యుద్ధం తెలంగాణ ప్రజలది... దేశంలోనే వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగ ఫలాలు ఇవాళ ఏమయ్యాయి? రాజకీయం మాటున కనుమరుగయ్యాయి...
నియంత నిజాంపై జరిగిన రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకమైంది. మూడు వేల గ్రామాల్లో వందలాది యువకులు ఆయుధాలు పట్టి, నవాబు తొత్తుల్ని తరిమి తరిమి కొట్టారు... వాస్తవానికి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రాథమికంగా నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైంది కాదు... గ్రామాల్లో నిజాం తొత్తులుగా మారిన భూస్వాములను తరిమికొట్టి, భూసంస్కరణల దిశగా ప్రారంభమైన ఉద్యమం అది...వామపక్ష ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత కీలకమైంది. రష్యా విప్లవ స్ఫూర్తితో, భూస్వాములను, రజాకార్లను ఎదుర్కోవటానికి మొదటిసారి దేశంలో విప్లవ భావాలతో గెరిల్లా యుద్ధానికి నాంది పలికింది కూడా ఈ పోరాటమే... ఎర్ర జెండా రెపరెపల మధ్య కామ్రేడ్‌ల నేతృత్వంలో దేశంలోనే పలు సంస్కరణలకు దారి తీసిన ఉద్యమమూ ఇదే... కమూ్యనిస్టు పార్టీలను జాతీయ స్థాయిలో పతాక స్థాయికి చేర్చింది కూడా రైతాంగ సాయుధ పోరాటమే... ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయంటే.... అందుకు కారణమూ తెలంగాణ పోరాటమే... సాయుధ పోరాట జ్ఖాపకాలు ఇవాళ్టికీ వామపక్షాలు వీధి వీధినా ఆడుతాయి.. పాడుతాయంటే... వామపక్ష భావజాలాన్ని తెలంగాణ సాయుధ పోరాటం ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు....

భూస్వామ్య వ్యవస్థ నిజాంకు అనుకూలంగా ఉండటం వల్ల తెలంగాణ సాయుధ పోరాటం సహజంగానే నిజాం వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం పోలీసుల చేతిలో నాలుగున్నర వేల మంది వీరులు అమరులయ్యారు.. ఉధృతంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం వల్లనే నాడు భారత యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌కు కదిలింది... నిజాంను పారద్రోలింది... కానీ, ఇక్కడే వామపక్షాల ధోరణి మారిపోయింది. హైదరాబాద్‌ స్టేట్‌ను నిజాం స్వతంత్రంగా ఉంచాలనుకున్నట్లే... వామపక్షాలూ భావించాయి... స్వతంత్ర భారతావనిలో తెలంగాణాను భాగంగా కలపకుండా.. ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించటం వల్ల వామపక్ష ఉద్యమం విజయవంతమవుతుందని భావించాయి. అందుకే అప్పటిదాకా నిజాం సైన్యాలపై పోరాడిన వామపక్ష వీరులు.. తమ తుపాకులను భారత సైన్యంపైనే ఎక్కుపెట్టారు...ఇది నాడే అంత వివాదాస్పదమైంది.
నిజాం సంస్థానంలో వామపక్ష ఉద్యమం సక్సెస్‌ కావటం వల్లనే వామపక్షాలు నాడు రష్యా, చైనా మాదిరిగా మరో వామపక్ష స్టేట్‌ను సాధించాలని నాటి నేతలు భావించి ఉండవచ్చు... నాడు తెలంగాణ విషయంలో స్వతంత్ర రాజ్యం కావాలంటూ పట్టుబట్టి పోరాటం చేసిన వామపక్షాలు.. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.. సాయుధ పోరాటాన్ని భారత వ్యతిరేక పోరాటంగా చేయాలన్న విషయంపై చీలిక దాకా సాగిన వామపక్ష ప్రస్థానం... ఇప్పుడు కూడా అదే తీరులో కొనసాగుతోంది. తెలంగాణను ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేసిన నాటి సిపిఎం ఇవాళ ప్రత్యేక రాష్టమ్రే అక్కర్లేదని, సమైక్యాంద్ర ముద్దని వాదిస్తోంది. ఇక సిపిఎంతో రాజకీయ పొత్తు కొనసాగిస్తూనే తెలంగాణ ప్రత్యేక రాషా్టన్రికి మొగ్గు చూపిన పార్టీ సిపిఐ... ఉద్యమ బాలో ఇద్దరి దారీ ఒకటే... నిర్ణయాల్లో మాత్రం ఎవరి దారి వారిదే... విచిత్రమేమంటే... ఇదే లెఫ్‌‌ట తాను నుంచి విడిగా సాయుధ పోరాటం ఇవాళ్టికీ చేస్తున్న మావోయిస్టులు తెలంగాణ ప్రత్యేక రాష్టాన్ని పరోక్షంగా సమర్థిస్తారు... అదే నక్సలైట్ల గ్రూపుల్లో ఒక గ్రూపు జనశక్తికి నేతృత్వం వహించి వెలుపలికి వచ్చిన కూర రాజన్న ప్రత్యేక దేశం అంటారు.. భారత సర్కారు తెలంగాణను దురాక్రమించింది అంటారు... ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు...తెలంగాణను తమ ఆత్మగా వామపక్ష వాదులు భావిస్తారు.. అలాంటి లెఫ్‌‌టఫ్రంట్‌లో ఈ విషయంలో ఇన్ని వైరుధ్యాలు.. ఇన్ని వైఖరులు.... ఎప్పుడు ఎవరి వైఖరి ఎలా ఉంటుందో తెలియని అయోమయాన్ని నేతలే సృష్టిస్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?
తెలంగాణ 2
ఇక తెలంగాణకు సోల్‌ గుత్తేదార్లమనుకునే నాయకుల సంగతి.... ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఈ నాయకులు ఎటు వైపు తీసుకెళు్తన్నారో తెలియని అయోమయం, సందిగ్ధం ప్రజలను మొదట్నుంచీ వెంటాడుతోంది. నాడు తెలంగాణ ప్రజాసమితి.. నేడు తెలంగాణ రాష్ర్ట సమితి, మధ్యలో వచ్చిన చిన్నా చితకా పార్టీలు మధ్యలోనే వెళ్లిపోయాయి. లేక మరో దాంట్లో విలీనమైపోయాయి... ఉద్యమాన్ని స్థిరంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్లటంలో విఫలం కావటం వల్ల ప్రతిసారీ తెలంగాణ అపహాస్యం పాలవుతోంది...
.....................................................................................
రైతాంగ సాయుధ పోరాటం తరువాత రాషా్టల్ర ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనమైంది కానీ, ఆ అంశం మాత్రం తెరమరుగు కాలేదు.. నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. 1969 నాటికి మర్రి చెన్నారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఆందోళనను రాజకీయంగా హైజాక్‌ చేశారు. హింసాత్మకంగా మారిన ఆ ఆందోళనలో దాదాపు 360 మంది విద్యార్థులు మరణించారు.... ఆనాడు తెలంగాణ ప్రజలు మర్రిచెన్నారెడ్డిని విశ్వసించారు.. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాసమితికి బ్రహ్మరథం పట్టారు.. భారీ మెజార్టీతో గెలిపించారు... తెలంగాణను ఎన్నికల అంశంగా వినియోగించుకుని గెలిచిన చెన్నారెడ్డి చల్లగా ఢిల్లీ వెళ్లి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు... అక్కడితో తెలంగాణ ఉద్యమం సశేషంగా మిగిలిపోయింది. 2001 సంవత్సరం చివరి వరకూ కూడా తెలంగాణ గురించి అంత తీవ్రంగా మాట్లాడిన వాళ్లే లేరు...2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్టస్రమితితో కె.చంద్రశేఖర్‌ రావు ఒక్కసారిగా తెరముందుకు వచ్చారు.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి రాజకీయ రంగస్థలం మీదకు తీసుకువచ్చారు.. ఈ విషయంలో చెన్నారెడ్డి కంటే ఆయన విజయం సాధించారనే చెప్పాలి.. శాంతియుతంగానే అయినా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర రాజకీయ వ్యవస్థను పునాదుల నుంచి కదిలించిందనే చెప్పాలి... ఆంధ్ర పాలకులను వలసవాదులుగా పేర్కొంటూ భావోద్వేగాల్ని రగిలించటంలో కెసిఆర్‌ సక్సెస్‌ అయ్యారు..
అయితే విచిత్రమేమంటే ఆయన వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు.. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో టిఆర్‌ఎస్‌ సీనియర్‌లకే అంతుపట్టదు... తెలంగాణ నిజాం నుంచి విముక్తి పొందినందుకు స్వాతంత్య్ర దినం నిర్వహించాలంటారు... అదే సమయంలో నిజాం గొప్ప రాజని పొగడుతారు... మీరు బ్రిటిష్‌ వాళ్లను పొగిడితే తప్పులేనప్పుడు మేం నిజాంను కీర్తిస్తే తప్పేంటంటారు...
నిజమే... బ్రిటిష్‌వాడు వాడి ప్రయోజనం కోసం చేసుకున్న కొన్ని పనులు ప్రజలకు మేలు చేసాయి... కాటన్‌ కావచ్చు... బ్రౌన్‌ కావచ్చు... మరే బ్రిటిష్‌ దొర కావచ్చు...అంతమాత్రాన తెల్లవాణ్ణి ఏనాటికీ మనం సమర్థించలేం... అలాగే నిజాం కూడా... ఆయన నిజాం సాగర్‌ ప్రాజెక్టు కట్టినంత మాత్రాన రాచరికపు దురాగతాలను ఇక్కడి ప్రజానీకం అంత తేలిగ్గా మర్చిపోగలుగుతుందా? గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నిజాంను పొగుడుతున్నారు. నిజాం గోరీ దగ్గరకు వెళ్లి ఆయన్ను పొగడటం వెనుక రాజకీయ ప్రయోజనం తప్ప మరేముంది.. అంతేకాదు... సెప్టెంబర్‌ 17 వచ్చిన వెంటనే టిఆర్‌ఎస్‌ మొదట చేసే డిమాండ్‌ అధికారిక ఉత్సవాలు నిర్వహించాలని...
నిజమే... స్వాతంత్య్ర దినంగా చేసుకోవాలన్న డిమాండ్‌పై ఎవరికీ ఆక్షేపణలు ఉండాల్సిన అవసరం లేదు..కానీ, కెసిఆర్‌ కాంగ్రెస్‌తో అదికారాన్ని కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పంచుకున్నప్పుడు ఏం చేశారు..? యుపిఎ ప్రభుత్వానికి మద్దతునిచ్చేముందు డిఎంకె షరతులు విధించినట్లు తాను విధించి ఉంటే సర్కారు ఒప్పుకుని ఉండేది కాదా? అధికారంలో ఉండి కనీసం తెలంగాణ సమర యోధులకు గుర్తింపును సాధించలేకపోయారు... తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేస్తూనే... కనీసం ప్రాథమిక డిమాండ్లనైనా సాధించలేదు.. అందుకోసం ప్రయత్నించలేదు.. ఇవాళ మీరు ఉత్సవాలు చేయటం లేదంటూ నిందిస్తారు...? ఈ ద్వంద్వనీతి ప్రజల్లో టిఆర్‌ఎస్‌ పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేయటానికి కారణమవుతోంది....
తెలంగాణ 3
తెలంగాణ విషయంలో మిగతా రాజకీయ పార్టీల సంగతి సరేసరి... కాంగ్రెస్‌ కర్ర విరక్కూడదు.. పాము చావకూడదన్నట్లు గా వ్యవహరిస్తుంది... తెలుగుదేశం సమైక్యం సమైక్యం అంటూనే ప్రత్యేకం వైపు మళ్లింది... ఇక పిఆర్‌పి.. మీరంతా ఎటు వెళ్తే.. మేమూ అటే వెళ్తామంటుంది... ఇక భారతీయ జనతాపార్టీ రాజకీయం అన్నింటికంటే విభిన్నం....విచిత్రం,,, కాకినాడలో తెలంగాణ అనుకూలంగా తీర్మానం చేసింది... ఆరేళ్ల పాటు అధికారం అనుభవించినప్పుడు తెలంగాణా గుర్తుకైనా రాలేదు.. అదేమంటే తెలుగుదేశం అడ్డంటారు... తరువాత ఎన్నికలు ముంచుకొచ్చేసరికి అద్వానీ చేత వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చేస్తామనిపించింది. పాపం ఆ మాటలు నమ్మే.. అద్వానీ ప్రధాని అవుతారనే కెసిఆర్‌ నాడు భ్రమపడ్డారు.. ఆ తరువాత వారం రోజులకే నరేంద్రమోడీ హైదరాబాద్‌ సభ పెడితే...తెలంగాణ పేరు నామమాత్రంగానైనా ఎత్తలేదు..తాజాగా జరిగిన విమోచన దినోత్సవంలో ఆ మాటే ప్రస్తావించకుండా విమోచన దినోత్సవంలో పాల్గొన్నది... రాజకీయ లబ్ధి కోసం తెలంగాణాను ఎంత చక్కగా వినియోగించుకోవచ్చో బిజెపికి బాగా తెలుసు....
ఒక ఓటు రెండు రాషా్టల్రన్న పేరుతో కాకినాడలో తీర్మానం చేసింది మొదలు భారతీయ జనతాపార్టీ తెలంగాణ స్టాండ్‌ ఓ బ్రహ్మపదార్థంలా మారింది. తాను అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పొత్తు కోసం తెలంగాణ అంశాన్ని అటకెక్కించిన కమలనాథులు మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చేస్తామన్నారు... హామీ మీద హామీ ఇచ్చారు.. అద్వానీ సహా బిజెపి సీనియర్‌ నాయకులంతా తెలంగాణకు సై అన్నారు.... తెలంగాణ విషయంలో ఎన్నిసార్లు బిజెపి తన వైఖరి మార్చుకుందో లెక్కలేదు... ఇప్పుడు మరోసారి తెలంగాణను అటకెక్కించింది. ఇందుకూ కారణం లేకపోలేదు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు సమీపిస్తుండటం, జంటనగరాల్లో తెలంగాణేతర ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే బిజెపి వైఖరిలో మార్పునకు కారణం. తాజాగా హైదరాబాద్‌ విమోచన సభలో నలుగురు రాష్ట్ర స్థాయి నాయకులు ప్రసంగించారు... నలుగురు కూడా తమ ప్రసంగాల్లో ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన చేయలేదు... కనీసం నినాదాల్లో కూడా పార్టీ సంప్రదాయ నినాదాలనే వాడుకున్నారు...
తెలంగాణ జిల్లాల్లో మాత్రం బిజెపి నేతలు తెలంగాణ వైఖరికి కొంతవరకైనా కట్టుబడి ఉన్నారు.. ఎందుకంటే వారి రాజకీయ అస్తిత్వం ఈ అంశంతోనే ముడిపడి ఉంది కాబట్టి....
.......................................................................
ఏడాది క్రితం వరకు తెలుగుదేశం వైఖరి సమైక్య నినాదమే... 2009 ఎన్నికలకు ముందే సడన్‌గా పార్టీ తీరు మారిపోయింది. కాంగ్రెస్‌ను ఓడించటమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌తో జత కట్టింది. ఎన్నికల్లో ఫలితం రాకపోవటంతో మళ్లీ తెలంగాణ ఊసెత్తలేదు.. ఇప్పుడు హైదరాబాద్‌ విమోచనం రోజునే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ గుర్తుకు వచ్చినట్లయింది. అధికారికంగా ఉత్సవాలు జరపాలంటూ డిమాండ్‌ చేసింది.
......................................................................
ఇక కాంగ్రెస్‌ది విచిత్ర వైఖరి.. తెలంగాణ ఇస్తానంటుందో.. ఇవ్వనంటుందో తెలియదు.. తెలంగాణకు అనుకూలమో కాదో తెలియదు.. సమైక్యమంటారు.. తెలంగాణ అంటారు... రెండో ఎస్సార్సీ అంటారు.. రోశయ్య కమిటీ అంటారు..ఏకాభిప్రాయం అంటారు... ఏదీ తేల్చరు... మళ్లీ అభివృద్ధి మంత్రం పఠిస్తారు... కాంగ్రెస్‌ ధోరణి చూస్తే ఎవరైనా సరే తల పట్టుకోవలసిందే....
......................................................................
ఇక ఇప్పుడే పుట్టిన పార్టీ ప్రజారాజ్యం ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి అది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చూపే ప్రభావం తక్కువే.. పార్టీ ప్రారంభం అయినప్పటి నుంచీ అంతా ఓకే అంటే తాను కూడా సై అనే చిరంజీవి అంటున్నారు... ఇప్పుడూ అదే అంటున్నారు... అంతా స్వార్థ రాజకీయాల కోసమే తెలంగాణను వాడుకుంటున్నారనీ వ్యాఖ్యానిస్తున్నారు... పార్టీ బలం మరి కాస్త పెరిగాక ఈ వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుందనేది ఇప్పటికి మాత్రం ఊహా జనితమే...
..................................................................
తెలంగాణను అన్ని పార్టీలు తలో రకంగా విశ్లేషిస్తున్నాయి... తలో రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. ఎవరికి ఎలాంటి అవసరం వస్తే దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఒక అంశాన్ని ఎవరికీ అంతుపట్టని, అర్థం కాని బ్రహ్మపదార్థంగా మార్చేస్తే... అది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా శాశ్వతంగా మిగిలిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎవరు పడితే వారు.. ఎలా కావలిస్తే అలా వాడుకునే ఆటబొమ్మలా మారుతుంది. దాశరథి మహాకవి తెలంగాణను కోటి రతనాల వీణగా అభివర్ణించారు.. కానీ, ఇవాళ్టి తెలంగాణ ఓ రాజకీయ తోలుబొమ్మలాట మాత్రమే...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి